అస్తిత్వవాద సాహిత్యం: 2అ. దొస్తోయెవ్‍స్కీ

[భారతీయ పరిచయక్రమం అన్న శీర్షిక కింద సూరపరాజు రాధాకృష్ణమూర్తి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. అందులో మొదటిది – అస్తిత్వవాద సాహిత్యం. ఈ పుస్తకంలో కీర్కెగాడ్, దొస్తోయెవ్‌స్కీ, నీచ, పిరాన్దెల్లో, కాఫ్కా, హైడెగర్, సార్త్ర, కామూ పరిచయం చేయబడ్డారు. అదే వరుసలో తిరిగి ఈమాటలో వ్యాసాలుగా పరిష్కరించి ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకపు ముందుమాట ఇక్కడ చదవండి.]


ఘోరాలు దుర్మార్గాలు చిత్రించడం శక్తి, మహత్వము కల ఒక కళాకారుడి సహజప్రవృత్తి. అవంటే అతడికి భయం లేదు. కళ నైరాశ్యం కలిగించదు. కళ ధైర్యాన్నిస్తుంది. జాబ్ (Book of Job) ధైర్యాన్నిస్తుంది. దొస్తోయెవ్‌స్కీ ఎంత స్వేచ్ఛ కలిగిస్తాడు!

– Nietzsche: The Birth of Tragedy.

దొస్తోయెవ్‌స్కీ వచనాలు:

Notes from Underground నుండి:

– “పెద్దలారా! ప్రమాణంచేసి చెబుతాను, అతితెలివి ఒక జబ్బు, నిజమైన జబ్బు, బాగా ముదిరిన జబ్బు… హాస్యం కాదు, నేను చాలాసార్లు ప్రయత్నించాను ఒక పురుగును అవ్వాలని. కాని అది కూడా నాకు చేతకాలేదు.”
– “బాధలోనే, బాధవలననే ప్రేమించడం సాధ్యం. మరో విధంగా ప్రేమించడం మనకు తెలీదు. మరో ప్రేమ తెలీదు.”
– “సుఖజీవనం మాత్రమే కోరడం నిస్సందేహంగా కుసంస్కారం. మంచో చెడో, ఒక్కోసారి వస్తువులు బద్దలు కొట్టడం ఆనందంగా ఉంటుంది.”
– “నాకనిపిస్తుంది, మనిషి చేయవలసినదల్లా, తానొక పియానో మెట్టును కానని నిరూపించుకోడమే.”
– “రెండు రెళ్ళు నాలుగు అనడం కంటే దురహంకారం ఉండదు! రెండు రెళ్ళు నాలుగే. గొప్ప సత్యం. కాదనను. కాని రెండు రెళ్ళు అయిదు అనుకోడంలో ఎంత అందముంది!”
– “ఏది మేలు, చౌకబారు సుఖమా, ఉదాత్తమైన బాధా? ఏది?”

The Karamazov Brothers నుండి:

– “నేను మానవజాతిని ప్రేమిస్తాను. కాని ఆశ్చర్యం ఏమిటంటే, మానవజాతిని నేను ఎంత ఎక్కువ ప్రేమిస్తే, వ్యక్తులంటే ప్రేమ అంత తక్కువ అవుతోంది.”
– “విచిత్రమేమంటే దేవుడుండడం కాదు; దేవుడున్నాడని, ఉండడం అవసరమని, మనిషి అనబడే రాక్షసుడికి ఆలోచనరావడం అద్భుతం.”
– “మనిషికి, సమాజానికి స్వేచ్ఛను భరించడమంత కష్టం మరొకటి లేదు.” (స్వేచ్ఛ మనిషికి విధించబడిన శిక్ష – సార్త్.]
– “ఎవడి దారిలో వాడు నడుస్తూ పొరపడినా మేలే, మరొకడి దారిలో నడుస్తూ పొరపడకున్నా.” (స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః – గీత.]

Crime and Punishment నుండి:

– “దేవుడు లేడా? అయితే నేనే దేవుణ్ణి.” (కిరిలోప్)

జీవితం

1821: ఫియొదోర్‍ మిహాయిలొవిచ్ దొస్తోవ్‍యెస్కీ (Fyodor Mikhailovich Dostoevsky) జననం, మాస్కో, రష్యా.

1837: తన 15వ ఏట తల్లి, 18వ ఏట తండ్రి చనిపోయారు. తల్లిపోయిన ఏటనే, తండ్రి బలవంతంచేత అతడికి ఏమాత్రమూ ఇష్టంలేని మిలిటరీ ఇంజనీరింగ్ కోర్స్‌లో చేరాడు. అక్కడి 120 మంది విద్యార్థులలో మిలిటరీకి పనికిరానివాడు, ఇంజనీరింగులో ఆసక్తిలేనివాడు యితడొక్కడే. సాహిత్యం పట్ల తప్ప బడి, కాలేజీ చదువులమీద ఏమాత్రము ఆసక్తి లేదు. కొంతకాలం ఇంజనీర్‌గా పనిచేశాడు. సుఖజీవనం. జూదానికి అలవాటుపడ్డాడు.

1840: మొదటి నవల పూర్ ఫోక్ (Poor Folk) ప్రచురించాడు.

1849: ప్రభుత్వ వ్యతిరేక సాహిత్యం చదివినందుకు అరెస్ట్ అయ్యాడు. చివరి క్షణంలో మరణశిక్ష రద్దయి, సైబీరియాలో నాలుగేళ్ళ కారాగారం, అది ముగిసిన తరువాత ఆరేళ్ళు నిర్బంధ సైనికసేవ. ఆ తరువాత పీటర్స్‌బర్గ్ తిరిగిరావడానికి ప్రభుత్వం అనుమతించింది. సైబీరియాలో ఉండగా మరియాతో వివాహం జరిగింది. ఆమె ఆరోగ్యం అంతంత మాత్రం. ఆమెతో జీవితం అతడికి సంతోషంగా సాగలేదు. రోజులు గడవడం కష్టంగా ఉండింది. కొంతకాలం స్వంత పత్రికలు నడిపాడు. ఆదాయం లేక, కొంతకాలం అక్కడా ఇక్కడా డబ్బు అడుక్కున్నాడు. కాని క్రమంగా అతని కథలు నవలలు అతనికి పేరు తెచ్చాయి. ఆదాయం పెరిగింది.

1864: మొదటి భార్య మరియా చనిపోయింది. ఆమె పోయిన ఏడాదికి దొస్తోయెవ్‌స్కీ ఆనా గ్రిగొర్యెవ్నాను (Anna Grigoryevna) పెళ్ళి చేసుకున్నాడు. ఈమె వ్యవహారకౌశలం ఉన్న మనిషి. దొస్తోయెవ్‌స్కీ నిర్వహించలేని చాలా పనులు ఆమె నిర్వహించి సంసారాన్ని నేర్పుగా నడిపింది. అతని రచనల ప్రచురణ విషయాలు కూడా ఆమె చూచేది.

1881: మరణం. కరమజోవ్ సోదరులు (The Karamazov Brothers) ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమనవల అని చాలామంది అభిప్రాయం. ఆ నవల చివరిభాగం ప్రచురణకు పంపిన కొద్దికాలానికే చనిపోయాడు.

ముఖ్య రచనలు

– Notes from Underground (1884)
– Crime and Punishment (1866)
– The Dream of a Ridiculous Man (1877)
– The Brothers Karamazov (1880)

(ఈ నవల The Karamazov Brothers పేరుతోనే ఎక్కువ ప్రసిద్ధం. కాని, Oxford World’s Classic అనువాదం The Karamazov Brothers. ఈ పేరు సహజం కూడా.)

దొస్తోయెవ్‌స్కీ సాహిత్యంపై అతడి జీవితప్రభావం

దొస్తోయెవ్‌స్కీ రాజద్రోహ అభియోగం, అతడు అనుభవించిన శిక్ష, అతడి రచనలపై వాటి ప్రభావము పరిశీలిద్దాం. ఏమిటి ఇతని రాజద్రోహం? యూరప్‍ లోని మేధావివర్గాల ఉదారభావాలు రష్యాలోకి పాకి అక్కడి యువతను ప్రభావితం చేస్తున్నకాలం అది. ఏమిటా భావాలు? జర్మన్ కాల్పనిక ఆదర్శవాదం (Romantic Idealism), ఫ్రెంచి సమసమాజపు ఊహాలోకం (Socialist Utopia), బ్రిటన్ నుండి పాకిన యుటిలిటేరియనిజం (Jeremy Bentham, J.S. Mill వంటి వారి ‘సమాజంలో అత్యధికులకు అత్యధిక సుఖసంతోషాలు’ అనే వాదాలు). దొస్తోయెవ్‌స్కీ కూడా ఆ వాదాల ప్రభావంలో ఉండినాడు. ఆ వయసులో, ఏ కాలంలోనైనా, అటువంటి అభ్యుదయభావాల ప్రభావంలో పడడం సహజమే. పడకపోవడం అసహజం. ఈ వాదాలే దొస్తోయెవ్‌స్కీని ఉరికంబం ఎక్కించాయి. అతడు రాసి, తన స్వంత పత్రికలో ప్రచురించిన వ్యాసం వ్యక్తివాదము అహంభావము (Individualism and Egoism) అతని శిక్షకు ప్రధానకారణం. ఉరిశిక్ష తప్పి సైబీరియాలో జైలుశిక్ష అనుభవిస్తున్నప్పుడు, దొస్తోయెవ్‌స్కీ తోటి ఖైదీలతో కలిసి మాట్లాడేవాడు. మేధావులు తోటివారితో కలవలేరు. భరించనూలేరు. ఈ సమస్య కూడా నోట్స్ నవలలో వస్తుంది. ఆ మాటలలో అతడికి అర్థమయిందేమంటే, ఈ మేధావుల ఊహాలోకాలు రాచరికప్రభుత్వాలకే కాదు. సామాన్యులకు కూడా నచ్చడంలేదని. అక్కడే అతడి ఆలోచనలు మారడం మొదలయ్యాయి. ఆ తరువాత అతడు యూరప్ పర్యటించినప్పుడు ఈ ఊహాలోకాల వాస్తవస్వరూపం చూచాడు. అక్కడ అతని ఆలోచనారూపమే మారిపోయింది. సైబీరియాలో అతడి శిక్ష దొస్తోయెవ్‌స్కీకి మేలు చేసిందనే చెప్పాలేమో? సైబీరియాలో సామాన్యులతో పరిచయం తన ఆలోచనావిధానాన్నే మార్చేసింది. అనేక కాల్పనికలోకాలు మనిషిని కనిపించని విడిపించలేని ఉచ్చులో బిగించివేస్తాయి, మానవ చరిత్రలోను వ్యక్తి జీవితంలోను ఉచ్చులోనుండి తల బయటకు తీసుకోగలిగినవారు అదృష్టవంతులు.

కలుగులో కన్న కలలు (Notes from the Underground)

కలుగులో కన్న కలలు అని ఈ నవలకు నేను పెట్టిన పేరు. ఈ వ్యాసంలోని నవలాభాగాలు, ఆంగ్లానువాదాలకు తెలుగులో నా భావానువాదం. దీన్ని నవల అని, నవలిక (novella) అని కూడా వ్యవహరిస్తారు (కేవలం 167పుటలు). ఈ నవల అస్తిత్వవాదానికి మేనిఫెస్టో అనవచ్చు. నిజానికి అస్తిత్వవాదులు దీన్ని మేనిఫెస్టోగానే మార్చివేశారు. దీని రెండవభాగమైన కథను కత్తిరించి తొలగించి, మొదటిభాగాన్ని వాడుకున్నారు ఎక్కువగా. కాని అలా చేయడంలో దాని సాహిత్యగుణం గౌణమై, సిద్ధాంతం ముఖ్యమవుతుంది. ఇది అస్తిత్వవాదంలో ఆదికావ్యం. ఈ నవలలోని మొదటి భాగం మొత్తం కథానాయకుడి స్వీయపరిచయం. రెండవది కథాభాగం, అతడు చెప్పుకున్న ఒక స్వీయానుభవం. రెండు భాగాలను కలుపుతూ ఒక ప్రేమకవిత. కథ మొత్తం ఉత్తమపురుషలో చెప్పబడింది.

కథానాయకుడి స్వీయపరిచయం

నలభై ఏళ్ళ తరువాత బతకడం కుసంస్కారం, అసభ్యం, అధర్మం. నలభై ఏళ్ళ తరువాత బతికేవారెటువంటివారై ఉంటారు? చెప్పండి! గుండెమీద చెయ్యి వేసుకొని, నిజంగా నిజాయితీగా చెప్పండి! నే చెబుతాను: మూర్ఖులు, దుర్మార్గులు. నాకేం మొహమాటం లేదు. ఈ ముసలాళ్ళందరితో, గౌరవనీయులైన తలపండిన పెద్దమనుషులందరితో అంటాను! వాళ్ళ మొహాలమీదే అంటాను! మొత్తం ప్రపంచానికి చాటి చెబుతాను! చెప్పే హక్కుంది నాకు. చెబుతూనే ఉంటాను, నా అరవైయో ఏట కూడా, డెబ్బై, ఎనభై…!

వీడెవడో తిక్కలోడు. మనం అనడం కాదు, అతడే చెప్పుకొంటున్నాడు, సగర్వంగా, నవల ప్రారంభవాక్యాలలో:

నాకు జబ్బు… నాకు ద్వేషం. నన్నెవరూ ఇష్టపడరు. నా లివర్ పాడయిందనుకుంటా. పాడయిందో లేదో, నా జబ్బు గురించి నాకు ఏమీ తెలీదు. అసలది ఏ జబ్బో కూడా నాకు నిర్ధారణగా తెలీదు. నేను డాక్టరును సంప్రదించను. నేనసలు ఎప్పుడూ ఏ డాక్టరును చూడను. డాక్టర్లను వైద్యశాస్త్రాన్ని గౌరవిస్తాను. అంతే కాదు, నేను దేన్నైనా చాలా గుడ్డిగా నమ్మేస్తాను, వైద్యశాస్త్రాన్ని కూడా. (అలా అని నేను చదువుకోనివాణ్ణి అనుకుంటారేమో? మూఢనమ్మకాలు పెట్టుకోరాదు అని తెలుసుకోగలిగినంత చదువు ఉంది. అయినా, నేను గుడ్డిగా నమ్ముతాను.) ఊహూ, నేను డాక్టరు దగ్గరకు వెళ్ళను. డాక్టర్లంటే నాకు ద్వేషం. అది మీకర్థం కాదనుకుంటా. పరవాలేదు, నేనర్థం చేసుకోగలను. నిజమే, ఈ ద్వేషం వలన, ఎవరికి నష్టం అని మీరు అడగవచ్చు. నేను ఫీజు ఇవ్వనందున డాక్టర్లు నష్టపోరు. నాకు బాగా తెలుసు, నష్టపోయేది నేనే అని. అయినా, నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళను. నాకు వాళ్ళంటే ద్వేషం. నా లివర్ పాడయింది. అయితే అవనీ. ఇంకా పాడవనీ.

ఇంతటితో ఆగదు ఇతని తిక్క.

నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. అతి తెలివి ఒక జబ్బు. బాగా స్థిరపడిపోయిన జబ్బు. మనిషి రోజువారి అవసరాలకు అంత తెలివి అక్కరలేదు. సంస్కారి అయినవాడికి అందులో సగం తెలివితేటలు చాలు. సగం కూడా అవసరం లేదు. పాతికవంతు చాలు.

ఇంతేనా అంటారా? అయితే ఇదిగో:

రెండు రెళ్ళు నాలుగు అనడం కంటే దురహంకారం ఉండదు! రెండు రెళ్ళు నాలుగే. గొప్ప సత్యం. కాదనను. కాని రెండు రెళ్ళు అయిదు అనుకోడంలో ఎంత అందముంది!

ఇంకా ఉంది:

నేను ఒక కీటకంగా మారి పోవడానికి తీవ్రప్రయత్నం చేశాను. కాని కాలేక పోయాను.

ఇతడు కాఫ్కా కథలోని (Metamorphosis) పురుగుకు పూర్వపురుషుడా? లేక ఇది ఒక అసమర్థుని ఆత్మకథా?

ఈ కథానాయకుడు కొంతకాలం ప్రభుత్వోద్యోగిగా పనిచేశాడట. ఏదో గుమస్తా ఉద్యోగం. తన దగ్గరకు వచ్చేవాళ్ళు సాధారణంగా ప్రభుత్వానికి ఏవో అర్జీలు పెట్టుకున్నవాళ్ళు. ‘వాళ్ళతో నేను చాలా అమర్యాదగా ఉండే వాణ్ణి. వాళ్ళను బాగా అవమానించేవాణ్ణి. నేను లంచాలు తీసుకునేవాణ్ణి కాదు. మరి దానికి పరిహారంగా ఏదో ఒకటి తీసుకోవాలి కదా!’ అంటాడు. (ఇది మన దేశంలో సర్వసామాన్యమైన అనుభవం. ప్రభుత్వ ఆఫీసులో అడుగుపెట్టి అవమానం పొందనివాడు ఎవడు? ఇక్కడ లంచం తీసుకోడానికి కూడా అవమానిస్తాడు, తీసుకొని కూడా అమర్యాదగానే ప్రవర్తిస్తాడు.) ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు అని అడిగి చూడండి. (నవలలో ఎవరూ అడగలేదు. అడిగితే, ఏమంటాడో తెలుసా?) ‘రెండు రెళ్ళు నాలుగే ఎందుకు, అయిదెందుకు కాదు? ఆపిల్ పండు చెట్టునుండి రాలి నేలమీదే పడుతుంది, పైకి ఎగరదు, ఎందుకు? నీకు చిగురువాచి పన్ను పోటు పుడితే మూలుగుతావెందుకు?’ ఇదేం సమాధానం? అతడంతే. (ఇంకా నయం. ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ద్వేషించు నిన్ను? అనలేదు.) కొంతకాలం తరువాత అతడికి, ఎవరో చనిపోతూ కొద్దిపాటి ఆస్తి రాసేసి పోయారు. ఇదే చాలని, ఉద్యోగం వదిలేసి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో, ఇదిగో ఈ ఎలకల కలుగులాంటి గదిలో ఉంటున్నాడు. అక్కడ కూర్చుని రాస్తున్నాను ఈ నోట్స్ అంటాడు, ఎవరూ చదవడానికి కాదట!

కీర్కెగాడ్‍ చెప్పుకున్నాడు, వ్యంగ్యం తనలో గుచ్చుకున్న బాణమని, అది తన ప్రాణమనీ. ఈ దొస్తోయెవ్‍స్కీ నవలకు ప్రాణం వ్యంగ్యమని చెప్పనక్కరలేదు. బాణాన్ని పీకేస్తే, ప్రాణమే పోతుంది. ఇంతకూ ఈ నవలలో నాయకుడు ఒకడా? ఒకడే, కాని అతడిలో నాయకుడు, ప్రతినాయకుడు (anti-hero) కూడా ఉన్నారు. ఇద్దరు పాత్రలు, ఇద్దరి గొంతులు గుర్తించగలం. నాయకుడు – ప్రతినాయకుడు, ఈ ఇద్దరిని గుర్తించడమెలా? నవలలోని ప్రారంభవాక్యాలు మళ్ళీ చూద్దాం.

‘నాకు జబ్బు.’ ఈ జబ్బు ఎవరిది ? ఒకసారి చదివినపుడు కథానాయకుడిది. మరొక కోణంలో చదివినపుడు ప్రతినాయకుడిది. మరొక కోణంలో, జబ్బు సమాజానిది కూడా. పిచ్చివాడు సమాజానికి పిచ్చి అనుకుంటాడు. సమాజం మంచితనాన్ని మానసికవ్యాధి అంటుంది. దొస్తోయెవ్‍స్కీ నవల తిక్కలోడులో (The Idiot) నవలలో అందరూ కథానాయకుణ్ణి, హోలీ ఫూల్ అంటారు.

కథానాయకుడు: ‘నాకు జబ్బు అని ఈ సమాజం అంటుంది’ అంటాడు. ఏమిటి జబ్బు? లివర్ పాడయింది అంటాడు. లివర్ పాడవడం అంటే ‘పైత్య’రసోత్పత్తికి (bile) సంబంధించింది. అంటే, పైత్యప్రకోపం. రెండూ రెండూ అయిదు అనేవాడికి ‘పైత్యం’ అనక మరేమంటుంది లోకం? ‘ఈ సమాజంలో నలుగురూ ఏది వివేకమనుకుంటారో, అది నా దృష్టిలో అవివేకం.’ (ఇందుకు తరువాత అనేక నిదర్శనాలు చెబుతాడు.) జబ్బు సమాజానిది. దానికి అనాధ్యాత్మికత అనే జబ్బు పట్టుకున్నది. అటువంటి ఆధిగ్రస్తసమాజం (Spiritually sick society) నాలాంటి వాడిని రోగి అనే అంటుంది.

ప్రతినాయకుడు: నేను ఇదిగో ఈ ఎలుకల కలుగులో బతుకుతున్నాను. (Underground, under the floorboards. పుస్తకం పేరుపై చర్చ తరువాత చూద్దాం.) ప్రస్తుతానికి కథానాయకుడు, బయటప్రపంచంలో ధైర్యంగా తిరుగుతూ కనిపించలేడు. పురుగులా ఎలుకలా ఫ్లోరింగ్ కింద బతుకుతుంటాడు. మనసు అంతరాంతరాలలో (the subconscious, under the floorboards) తనకే తెలియని చెప్పుకోలేని ఆలోచనలతో, ఫ్రాయిడ్ కంటే ముప్పై సంవత్సరాలముందే దొస్తోయెవ్‍స్కీ ఈ సబ్‍కాన్షస్‍ లోకి తొంగిచూచాడు. ఫ్రాయిడ్ స్వయంగా ఒప్పుకున్నాడు ఈ విషయం. కరమజోవ్ సోదరులు ప్రపంచసాహిత్యంలో అత్యుత్తమనవల అని ఫ్రాయిడ్ అభిప్రాయం.

అంతేకాదు. కీటకం దొస్తోయెవ్‍స్కీ భావంలో కీలకమైన ప్రతీక. కీటకంలా మారాలన్న కోరికకు ఇక్కడ ప్రధానమైన అర్థం, సహజంగా (instinctively) బతకడమని. అంటే, ఏ క్షణానికి ఏది తోస్తే అది చేసేసే పశుప్రవృత్తిని పొగడుతున్నాడా దొస్తోయెవ్‍స్కీ? కాదు. మనిషి ‘బుద్ధి’గా బతకాలంటారు వేదాంతులు. అంటే, కరణేంద్రియజ్ఞానం ప్రమాదకరమని, శరీరాన్ని నడిపించే బుద్ధిజ్ఞానమే జ్ఞానమని, మనలో బలమైన భావం. కాని, శరీరానికి కూడా తెలివి ఉంటుంది అన్న తెలివి (intelligence of the body) మనకు సాధారణంగా ఉండడం లేదు. బుద్ధి ఈ శారీరకజ్ఞానాన్ని అణగదొక్కడం ప్రస్తుత మనిషి దుస్థితి, అని దొస్తోయెవ్‍స్కీ అభిప్రాయం. అస్తిత్వవాదంలో ఉన్నది, కనిపిస్తున్నది ముఖ్యం. అనాదిగా తత్త్వశాస్త్రానికి కనిపిస్తున్న వాస్తవం అప్రధానం. కనిపించే వాస్తవానికి వెనుక లోపల ఏదో వస్తువు, పరవస్తువు, ఉన్నది అని దాని గురించే ఆలోచించింది. ఈ లోకం కంటే పరలోకం, దేహంకంటే ఆత్మ, ప్రధానమైనాయి. ఈ ప్రాధమ్యాలను తలకిందులు చేసింది అస్తిత్వవాదం. దొస్తోయెవ్‍స్కీ తాను కీటకంగా మారడానికి చాలా ప్రయత్నం చేసి కాలేకపోయానని చెప్పడంలో అర్థం ఇదే. మనిషి పూర్తిగా బుద్దిజీవిగా బతికేస్తున్నాడు. అది నిజమైన బతుకుకాదు. కీర్కెగాడ్‍ అన్నాడు, ఈ యుగంలో మనిషికి చింతన (reflection) తప్ప ఆర్తి (passion) లేదు, అది ఈ యుగపు జబ్బు, అని. (Sickness unto Death: Kierkegaard).

నీచ యింకా స్పష్టంగా చెప్పాడు – ‘సరి అయిన సర్సి (Circe): పశువు మనిషిగా మారడం సరికాదు. మనిషి పశువుగా మారడం సరి’ (Human all too Human); ‘పశువునో శిశువునో చూచినప్పుడు, తాను పోగొట్టుకున్న స్వర్గం స్మరణకొస్తుంది మనిషికి’ (Untimely Meditations).

కీటకం బుద్ధిజీవి కాదు. దాని జ్ఞానమంతా శారీరకమే. దాని పరిధిలో అది స్వేచ్ఛగా బతుకుతుంది, ఆలోచనలతో మునిగిపోదు. విధినిషేధాలు లేవు. బుద్ధికి లొంగిపోదు. ‘మనిషి రోజువారీ అవసరాలకు అంత తెలివి అక్కరలేదు. సంస్కారి అయినవాడికి అందులో సగం తెలివితేటలు చాలు. సగం కూడా అవసరం లేదు. పాతికవంతు చాలు’ అంటే అర్థం ఇదే.

కీర్కెగాడ్ అంటాడు: ‘అందరూ అంటారు కాలం దుర్మార్గమైపోయిందని. నా అభియోగం అది కాదు. ఈ కాలపు జనం అల్పపు బతుకులు బతుకుతున్నారు. వారి కోర్కెలు అల్పం. వారి పాపాలు అల్పం. భావతీవ్రత లేదు. దేనికొరకూ ఆర్తి లేదు. పురుగుకు అటువంటి ఆలోచనలు కలగడం పాపం కావచ్చు, కాని దేవుని ప్రతిరూపమైన మనిషిలో కాదు. ఈ నాటి మనుషుల కామంలో కూడా మాంద్యం. వారి ఉద్వేగాలు నిద్రాణం. ఎవరిపనులు వారు చేసుకుపోతారు, చిల్లరదుకాణదారుల ఆత్మలు. వీళ్ళంటే అసహ్యం! అందుకే నా ఆత్మ వెనక్కు వెళుతుంది, పాతనిబంధనం (Old Testament) వైపుకు, షేక్స్‌పియర్ వైపుకు. వాటిలోని పాత్రలు కనీసం మనుషులు. దేవతలు కాకపోవచ్చు కానీ వారు ద్వేషిస్తారు. ప్రేమిస్తారు, పగవారిని హత్యచేస్తారు, పగవారి సంతతిని తరతరాలకు శపిస్తారు. వారు పాపాలు చేస్తారు.’ (Either/Or: Kierkegaard, 1843.)

దొస్తోయెవ్‍స్కీ నవలలలో పాత్రలు కీర్కెగాడ్ చెప్పిన ఇవన్నీ చేస్తారు. దొస్తోయెవ్‍స్కీ కాని కీర్కెగాడ్‍ కాని పాపాలు చేయమనడం లేదు. బండలా యంత్రంలా జీవచ్ఛవంలా బతకడంకంటే, ఏదో ఒక లక్ష్యంకొరకు ఆర్తితో ఏదైనా, హత్య అయినా, చేయడం మేలే అంటారు. శ్రద్ధ పరమపురుషార్థం (Faith is the highest passion in a person: Fear and Trembling). పరమపురుషార్థమైన మోక్షం కొరకే కానక్కరలేదు. పురుషార్థాలలో దేనికొరకైనా, కామమైనా సరే, దాని కొరకు ఉత్కంఠత ఉండాలి. కోరినదానికోసం ఏదైనా చేయగలను అన్న తెగింపు ఉండాలి. దొస్తోయెవ్‍స్కీ పాత్రలు అందరూ ఉన్మత్తులు పిశాచులు. అటువంటి పైశాచికపాత్రలతో అతని నవలలు ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమమైనవి ఎట్లా అయినాయి? ఈ జీవలక్షణం వలననే, ఈ కామోత్కంఠత వలననే, పురుషార్థసాధనలో ఈ ఆర్తి వలననే. (పురుషార్థంలో పురుషుడు అంటే మగవాడని కాదు అర్థం. పురుషుడంటే స్త్రీకూడా. అది మనిషికి పర్యాయపదం.) ఈ జీవలక్షణం వలననే మనిషి ఆత్మ (self) ఆవిష్కృతమవుతుంది. ‘ఈ కాలంలో ఎవరికీ అక్కరేనిది ఆత్మ. అది ఉన్నట్టు పక్కవాడు అనుమానిస్తే ప్రమాదం! ఆత్మను పోగొట్టుకోడం ఎవరూ గమనించడం లేదు. పదిరూపాయలున్న పర్స్ పోనీ! పదిమందికి తెలిసిపోతుంది. చేయి, కాలు, అయిదు డాలర్లు, పెళ్ళాం – ఏది పోయినా వెంటనే లోకానికంతకూ తెలిసిపోతుంది. ఆత్మపోతే ఎవరూ గుర్తించరు’ (కీర్క్ గార్డ్: The Sickness Unto Death).

నలభై ఏళ్ళ తరువాత బతకడం కుసంస్కారం, అసభ్యం, అధర్మం. నలభై ఏళ్ళ తరువాత బతికేవాడెటువంటి వాడై ఉంటాడు? చెప్పండి! గుండెమీద చెయ్యి వేసుకొని, నిజంగా నిజాయితీగా చెప్పండి! నే చెబుతాను: మూర్ఖులు, దుర్మార్గులు. నాకేం మొహమాటం లేదు. ఈ ముసలాళ్ళందరితో, గౌరవనీయులైన తలపండిన పెద్దమనుషులందరితో అంటాను! వాళ్ళ మొహాలమీదే అంటాను! మొత్తం ప్రపంచానికి చాటి చెబుతాను! చెప్పే హక్కుంది నాకు. చెబుతూనే ఉంటాను, నా అరవైయో ఏట కూడా, డెబ్బై, ఎనభై…!”

ఏమంటున్నాడు? వైద్యవిజ్ఞానం పెరిగింది, మనిషి ఆయుర్దాయమూ పెరిగింది. మనిషి బతుకుకు కాలం కొలమానం కాదు. ఎన్నాళ్ళు బతికావని కాదు? ఎలా బతికావు? దేనికోసం బతికావు? బైబిల్ కథలో అబ్రహాం ఎన్నాళ్ళు బతికాడు? అతని భార్య సారా వయసెంత? వాళ్ళకు ఆ వయసులో ఐజక్ పుట్టలేదా? నూరో ఏట కూడా పిల్లలను కనమని సందేశమా? కాదు. వారు ఆ వయసులో ఉత్సాహంగా ఉండగలగడానికి కారణం వారి శ్రద్ధ (Faith). ఆ వయసులో ‘రెండూ రెండూ అయిదు ఎందుకు కాదు’ అన్న గుడ్డినమ్మకం. అసంబద్ధమందు ఆస్తిక్యబుద్ధి (faith in the absurd). దాని కొరకు ఆర్తి. ప్రపంచమంత హేతువాదం కూడా అడ్డగించలేని ఆర్తి. అటువంటి ఆర్తితో బతుకు. ఎన్నేళ్ళు బతికినా, ఎందుకు బతుకుతున్నావని, ఎవరూ వేలెత్తలేరు. అస్తిత్వవాదంలో ప్రధానాంశం అస్తిత్వమంటే బతకడం కాదు, బండరాయిలా. (Only man exists. A horse is, but it does not exist. An angel is, but it does not exist. God is, but he doesn’t exist: Heidegger.)

‘రెండూ రెండూ అయిదు’ (లేక రెండు రెళ్ళు అయిదు) అన్న గణిత సూత్రానికి సంస్కృతానువాదం ‘గజం మిథ్య’. గజం నిజం అనుకున్నవాడు పలాయనమంత్రం పఠిస్తాడు. మిథ్య అని తెలిసినవాడు పారిపోడు. ఏనుగు అతణ్ణి తొక్కేయవచ్చు, అది మిథ్య. లేదా వాడు గజారోహణం చేయనూవచ్చు, అదీ మిథ్యే. సాధ్యం అన్న విశ్వాసమే అస్తిత్వవాదం. సాధ్యం (possibility) అస్తిత్వవాదంలో ప్రధానాంశం. రెండు రెళ్ళు అయిదు అనుకోకపోతే, మూడు వంతుల భూమిని శాసిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యం పిడికెడు ఉప్పు చూసి తలవంచుకొని తప్పుకుపోదు. మూడులోకాలు పదపీఠమై ఉన్న బలి, స్కూల్‍ బ్యాగ్ అంతలేని పసివాడిముందు బలహీనుడై తలవంచడు. అదీ రెండు రెళ్ళు అయిదుగుకు అర్థం. హేతువాదవాస్తవానికి అన్ని వేళలా తలవంచుకొని పోనవసరంలేదు. విధిరాత అని తప్పుకోనవసరం లేదు. ‘దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా’ – స్వధర్మం కొరకు ఎదురుతిరగగలను, అన్న తెగింపునిస్తుంది అస్తిత్వవాదం.

దేవుడికి అసంభవమనేది లేదు అన్న బైబిల్ వాక్యం కీర్కెగాడ్ తరచు స్మరిస్తాడు.

But with God everything is possible – Matthew 19:26. ఇప్పుడు ప్రపంచమంతా ఘోషిస్తున్న వాక్యం దొస్తోయెవ్‍స్కీ అన్నాడంటున్న వాక్యం1: దేవుడు లేకుంటే, ఏదైనా చేయవచ్చు (Without God all things are permitted).

1[నిజానికి మాట దొస్తోయెవ్‍స్కీది కాదు. అతడి నవలలో ఒక పాత్రది. ‘As flies to wanton boys are we to the gods. They kill us for their sport’ అన్నది షేక్స్‌పియర్ కాదు కదా! అతని నాటకంలో ఒక పాత్ర. అలాగే ఈ వాక్యమూ దొస్తోయెవ్‍స్కీ అన్నది కాదు. అలా అని అతడు అనలేదు అనికూడా అనలేము. పలికించింది తనే కదా? అది అతని నవల కరమజోవ్ సోదరులులో ఇవాన్ అన్నమాట. అతడన్న మాటలో అతడికే నమ్మకం లేదని నవలలో తెలుస్తుంది. ఆ వాక్యం సత్యం కాదని నవలలో ఇతర పాత్రల, సంఘటనల ద్వారా దొస్తోయెవ్‌స్కీ సూచిస్తాడు. అయినా అది అతని వాక్యంగా స్థిరపడిపోయింది. ఈ నవల రష్యన్ మూలానికి ఇంగ్లీషులో వచ్చిన అనేక అనువాదాలు, ఫ్రెంచి అనువాదాల ఆధారంగా చేసినవి. రష్యన్> ఫ్రెంచ్> ఆంగ్లం> తెలుగులో ఈ నవల అనువాదమయిందో లేదో తెలియదు.]

Without God all things are permitted – ఇంతకూ ఈ వాక్యం ఎలా అర్థం చేసుకొంటున్నాం? ‘బాస్ ఇంటికెళ్ళిపోయాడు, ఆఫీసులో మనం ఏమైనా చేసుకోవచ్చు’ అన్నట్టా? A good manager is a dead manager అన్నాడట ఓ మేనేజ్‍మెంట్ గురువు (Peter Drucker?) దొస్తోయెవ్‍స్కీ విశృంఖలస్వేచ్ఛను ప్రతిపాదిస్తున్నాడా?

దీనికి సార్త్ర సమాధానం:

‘దేవుడు లేకుంటే ఏదైనా చేయొచ్చు’ అన్న మాట నీతికి స్వస్తివాచకం కాదు. అది నాంది. లేదా, కనీసం అది ఒక కొత్త నైతికతను అన్వేషించడానికి ఆరంభం. మనిషి తన తప్పులకు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. తన తప్పులు మాత్రమే కాదు. ఇతరుల కష్టాలకు కూడా తాను బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. (Existentialism is a Humanism – Sartre.)

తనకుగాని లోకంలో మరెవరికిగాని జరగకూడనిది జరిగితే తప్పు పట్టడానికి దేవుడు లేడు కదా, ‘విధి రాత, వాడి ఖర్మ’ అనడానికి? మనిషే దేవుడై సర్వానికి బాధ్యత వహించవలె. కరమజోవ్ సోదరులు నవలలో ఇవాస్ హేతువాది, దేవుడు లేని సృష్టిని అర్థంచేసుకోడానికి ప్రయత్నిస్తాడు. నాస్తికసిద్ధాంతచర్చలు చేస్తుంటాడు, ఆచరించలేడు. స్వయంగా అతని సిద్ధాంతాలపై అతనికే గట్టి నమ్మకం లేదు. నమ్మేవాడుంటే, స్మెర్ద్య‌కోవ్ (Smerdyakov) లాగా వాణ్ణి ప్రయోగపశువుగా వాడుకుంటాడు. కాని, అల్యోషాకు అలా అందరి బాధ్యత తీసుకోవడం, పుస్తకాలద్వారా సంక్రమించిన సైద్ధాంతికభావం కాదు, అది అతని స్వభావం.

దేవుడున్నా లేకున్నా, మనిషి మనిషిగా బతకడంలో ఎటువంటి భేదము ఉండనక్కరలేదు. రెండుకు రెండు కలిపితే అయిదు ఎందుకు కాదు, అనడం మతిలేనితనం కాదు. అది మనిషికి సహజమైన స్వేచ్ఛాస్వభావం. ఈ స్వేచ్ఛకోసం మనిషి ఎంత కష్టమైనా సహిస్తాడు, ఎంత నష్టమైనా భరిస్తాడు. ఆలోచించగలిగిన మనిషి ఎప్పుడూ తనకు కష్టము నష్టము కలిగించుకోడు అన్నది హేతువాదం, వికాసవాదం (Enlightenment). ఈ వాదం నిజంకాదు అంటాడు దొస్తోయెవ్‍స్కీ. ‘తెలిసి’ తమకు తాము కష్టము నష్టము కలిగించుకున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి, అంటాడు. ఈ స్వేచ్ఛాస్వభావాన్ని రాజకీయసామాజిక సాంస్కృతికశక్తులు మంచులా కురిసి కప్పేస్తుంటాయి. (ఈ నవలలో మంచు తరచు కురుస్తూ ఉంటుంది.)

నవలలోని పూర్వభాగమంతా ఇలా ఇన్ని స్థాయిలలో సాగుతుంది. ఏ పాత్ర గొంతు వినిపిస్తున్నదో స్పష్టంగా తెలియడం కష్టం. ఒకప్పుడు లోకానికి తన ముఖం చూపించలేక కలుగులో దాగి బతికే కీటకం. మరొకప్పుడు ‘రెండూ రెండూ కలిపితే నాలుగు అనడం దురహంకారం’ అని ప్రకృతినియతిని సృష్టిధర్మాన్ని ధిక్కరించే ధీరోదాత్తుడు. ఇతడు ఎవడనాలి? ఇతడు ఇవన్నీ. అంటే, ఇతడి కథ మనిషి కథ. మన కథ. వాస్తవాలకు ఎదురుపడనంతకాలం, బల్లలకింద కలుగుల్లో బతికేవాడు ఎన్ని వేషాలైనా వేయవచ్చు. ఏ ఉపన్యాసాలైనా ఇవ్వవచ్చు, ఏ డైలాగులైనా చెప్పవచ్చు. కనుక మనోవాక్కాయాల మూడు వేషాలు మూడు విధాల డైలాగులు ఇందులో ఉన్నాయి. నాయకుడు, ప్రతినాయకుడు కూడా మూడు గొంతులతో మాట్లాడుతారు. మనిషిలోని సహజవైరుద్ధ్యాలను, నవలలలోలాగా కాక, యథాతథంగా చిత్రిస్తుంది ఈ నవల. ఈ కథానాయకుడితో లీసా (Lisa) అంటుంది ‘పుస్తకంలా మాట్లాడుతావు’ (You speak like a book) అని. ఇలా తెలిసి చదువుతూ పోతే, శైలిలోని అస్పష్టత సంక్లిష్టతగా స్పష్టమవుతుంది. వైరుద్ధ్యాలు పాత్రలలో కాక మనిషిలో కనిపిస్తాయి. ఆ లోతులు లొసుగులు వైరుధ్యాలు వికారాలు మనవే అని తెలిసినప్పుడు చాలా ఇబ్బంది పడతాం. మన వికారాన్ని అద్దంలో చూసుకోగలిగిన ధైర్యం ఉంటేనే చదవగలం ఈ నవల. అద్దంపై కోపం వస్తుంది.

ఈ నవల దొస్తోయెవ్‍స్కీ ప్రారంభదశలో రాసినదే. దీనికి ముందు అతడు రాసిన నవలలను నీడలోకి తోసేసింది ఈ రచన. కాని ఈ నవల నేరము-శిక్ష (Crime and Punishment) లాగా ఒక ఊపులో చదివించే నవల కాదు. పరిమాణంలో చిన్నదైనా ప్రయత్నం ఎక్కువ అవసరం. మళ్ళీ మళ్ళీ చదవవలసినది. చదివే కొద్దీ పొరలు పొరలుగా విప్పుకునే రచన. వ్యంగ్యశైలి నడిపిస్తుంటే, భావపులోతులు మనలను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. మనిషి అంతరాంతరాలలోని (subconscious) సంకులస్థితి కథలోని సంక్లిష్టతకు ఒక పార్శ్వమైతే, దొస్తోయెవ్‍స్కీ కాలంనాటి సైద్ధాంతిక వాతావరణం మరో పార్శ్వం. ఈ పార్శ్వప్రాధాన్యం తెలియాలంటే, కథారచయిత గురించి తెలుసుకోవడం అవసరం.

దొస్తోయెవ్‍స్కీ తప్పించుకున్న ఆ ఉరి స్వరూపం ఏమిటి? లోకంలో ఎప్పుడూ రెండు ప్రధానవాదాలుంటాయి. ఒకటి అభ్యుదయం, రెండవది నిశ్శేయసం. అభ్యుదయవాదాలకు అనేక నామాలు, రూపాలు. హేతువాదం భౌతికవాదం గతితార్కికవాదం ఇంకా అనేకానేకం. అన్ని వాదాలలో సామాన్యాంశం, ప్రధానాంశం రొట్టెముక్క. మనిషి బతికేది రొట్టెముక్క కోసం అనేది ఈ వాదం. సామాజికశాస్త్రదర్శనాలు అనేకం. కాని వాటిలో విభేదాలు, విధానాలలో మాత్రమే. ఆశయం అన్నిటికి సామాన్యం. ఏమిటి ఆ ఆశయం? సమాజంలో ఎంత ఎక్కువమందికి ఎంత పెద్ద రొట్టెముక్క2 అందించగలం, అన్నది అన్ని సామాజికదర్శనాల పరమాశయం. మనిషి కోరేది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర, అనే ఈ వాదాలు దొస్తోయెవ్‍స్కీ ఒకప్పుడు నమ్మినవాడే. కాని, క్రమంగా, మనిషి కోరుకునేది ఈ విధమైన అభ్యుదయం కాదు అన్న ఎరుక కలుగుతూ వచ్చింది అతనికి. ప్రస్తుత కథ దొస్తోయెవ్‍స్కీ లోని ఈ పరిణామము, ఆ దశలోని అంతస్సంఘర్షణల ప్రతిఫలం. అతడు తరువాత రాసిన నవలల బీజాలు ప్రస్తుత కథలో కనిపిస్తాయి. ఆ కాలంలో మేధావులను శాసిస్తున్న, మేధావులు శాసిస్తున్న ఆలోచనాసరళితో అతడు పడిన ఘర్షణ, సాధించుకున్న సమన్వయం ఈ కథలో ప్రధానవిషయం. ఆనాటి అనేకానేక క్లిష్టదర్శనాలతో తలపడడం సంక్లిష్టతకు మరో పార్శ్వం. ఇది వస్తువిషయంలో సంక్లిష్టత.

2[ఈ రొట్టెముక్క కథ దొస్తోయెవ్‍స్కీ ప్రసిద్ధ నవల కరమజోవ్ సోదరులులో ఒక ప్రత్యేక అధ్యాయవిషయం (The Grand Inquisitor). ఈ వస్తుసామ్యం గుర్తించి, ఈ రెంటినీ (Notes from the Underground, The Grand Inquisitor) కలిపి ఒక పుస్తకంగా అచ్చువేశారు కొందరు.]

ఇక రచయిత ఎంచుకున్న కథనవిధానంలో కొంత సంక్లిష్టత ఉంది. ఈ కథలోని పూర్వభాగం వెనుక జరిగినదానిని, ఉత్తరభాగం ముందు జరిగినదానిని చెబుతాయి. దొస్తోయెవ్‍స్కీలో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు, ఉదాత్తసౌందర్యాలతో (sublime and beautiful) నిండిన కాల్పనిక లోకాన్ని సృష్టించుకొని అందులో యథేచ్ఛగా విహరించే రొమాంటిక్ యువకుడు. రెండవవాడు, ఆ ఊహాలోకాలను వదిలి జీవిత వాస్తవాన్ని పట్టుకున్న మనిషి. పూర్వభాగంలో కథానాయకుడు రచయిత రెండవదశను, ఉత్తరభాగంలో రచయిత మొదటిదశను ప్రతిఫలిస్తాడు. ఇటువంటి సంక్లిష్టవిషయాన్ని సవ్యాపసవ్యకథనంతో కథగా మలచడం దొస్తోయెవ్‍స్కీ రచనాప్రతిభకు నిదర్శనం. ఇంత గంభీరమైన తత్త్వచింతనతో వాదప్రతివాదనలతో ఖండనమండనాలతో నిండిన ఈ రచన కరపత్రంగానో మేనిఫెస్టోగానో మిగిలిపోవలసినది. అటువంటి దానిని గొప్ప కథగా మలచడం, ఆగకుండా చదివించడం, సామాన్యమైన కథనప్రతిభ కాదు. సంక్లిష్టత అంతా వివరణలో, కథలో కాదు. మొదటిసారి అర్ధం కాదు. అయినా నవ్వుకుంటూ చదివేస్తాం. రెండవసారి సంక్లిష్టత క్రమంగా కరిగిపోతుంది. లోతును తెలిసి ఆనందంతో చదువుతాం. మానవజీవితవిషాదసత్యాన్ని వ్యంగ్యంతో రంగరించిన రచనావిధానం ఈ నవలలో కనిపిస్తుంది. ‘వ్యంగ్యము విషాదము అక్కచెల్లెళ్ళలాగా చేతులు కలిపి నడిస్తే అది సత్యావిష్కారం’ అంటాడు దొస్తోయెవ్‍స్కీ, వేరొకచోట. (Tragedy and satire are two sisters who go hand in hand, and the name of both of them, taken together is ‘truth’ – The Double.)

అనంతరకాల సాహితీస్రవంతుల మూలాలు

నవల పూర్వభాగంలోని తాత్వికసాంద్రత కారణంగా, యూరప్‍లోని ఒక తాత్వికవర్గంవారు, నవలలోని కథాభాగాన్ని చించి పడేసి, కథలోని ఈ పూర్వభాగాన్ని వారి కరపత్రంగా మార్చివేసుకున్నారు. ఎందుకంటే, ఈ నవలలో తరువాతికాలంలో యూరప్‍లో వచ్చిన అనేక తాత్విక సాహితీస్రవంతుల మూలాలున్నాయి. కాఫ్కా, సార్త్ర, కామూ, బెకెట్ – వీరందరి తాత్వికమూలాలు, వీరి సాహిత్యసృష్టికి స్ఫూర్తి ఈ పూర్వభాగంలో ఉన్నాయి. (కీర్కెగాడ్, దొస్తోయెవ్‍స్కీ కవలలని చెప్పవచ్చు, తత్వంలో మాత్రమే.)

ఈ నవలను మొదటి అస్తిత్వవాద (existentialist) నవల అంటారు. అంటే అస్తిత్వవాద సిద్ధాంతాలకు అర్థవాదప్రాయమైన రచన కాదు. అస్తిత్వవాదంలోనుండి ఈ నవల రాలేదు. ఈ నవలలోనుండి అస్తిత్వవాదం ఆవిర్భవించింది. పందొమ్మిదవ శతాబ్దపు ప్రవక్త దొస్తోయెవ్‍స్కీ3, కార్ల్ మార్క్స్ కాదు, అన్నాడు కామూ. దొస్తోయెవ్‍స్కీ కాలానికి ఉండిన తాత్విక చింతనలతో పాటు తన తరువాత రాగల చింతనలను కూడా ఈ నవలలో కదనరంగంలో దించాడు దొస్తోయెవ్‍స్కీ. ఈ తత్త్వాలు ఒకదానితో ఒకటి పోట్లాడడమే ఈ నవలలోని వస్తువు. అయితే ఆ ఫైటింగ్ సీనులో అంతా వ్యంగ్యమే! పాత తెలుగు సినిమాలలో, పోలీసులు ఈల వేసుకుంటూ వచ్చే చివరి సీనుముందు, ఫైటింగ్ సీన్ వంటిది. అటువంటిదే ఈ నవలలో గంభీరతాత్మికవాదాల భీకరవ్యంగ్యపోరాటం.

3[Alienation, commodification of man వంటి భావాలు మొదట వ్యక్తమయింది దొస్తోయెవ్‍స్కీ నవలల్లో, కామూ నవల అపరిచితుడు (L’etranger) దొస్తోయెవ్‍స్కీ నోట్స్ ఫ్రమ్ ది అండర్‍గ్రౌండ్‍లో పుట్టి ఉండవచ్చు. కామూ నవలలోని కథానాయకుడికి స్విద్రిగయ్‍లాఫ్ (Svidrigailov: Crime and Punishment) స్ఫూర్తి అనవచ్చు. కామ్య నవలకు (The Stranger, The Outsider) రెండు పేర్లతో ఆంగ్లానువాదాలున్నాయి.]

దొస్తోయెవ్‍స్కీ జీవితదృక్పథం: విధి, స్వేచ్ఛ (Fate and Free will)

కథానాయకుడు వెనుక ఇచ్చిన సమాధానాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎందుకు అమర్యాదగా ప్రవర్తిస్తావు, అని అడిగితే, (నవలలో అతడిని ఎవరూ అడగలేదు. అతడి మాటలలో మనం గుర్తించిన ప్రశ్నలు సమాధానాలే యివి) ఏమంటాడు? నీకు పన్నుపోటైతే ఎందుకు మూలుగుతావు, అంటాడు. మూలిగినందువలన పోటు తగ్గదు. పైగా, నీ పక్కవాళ్ళకు చిరాకు. అవును, ఎలాగు నా పన్నుపోటు మీద నాకు నియంత్రణ లేదు. అందుకే పక్కవాళ్ళపై నా కసి తీర్చుకుంటా. అంటే లోకంలోని వ్యతిరేకతకంతా (negativity) కారణం, విధిని వ్యతిరేకించలేని, స్వేచ్ఛకు అవకాశం లేని ఈ నిస్సహాయత, అంటాడు.

ఏది ఎట్లా జరగవలెనో, సృష్టిలో అంతా ముందే నిర్ణయం జరిగిపోయింది, అంటారు (Determinism). ముందే ఎవరు నిర్ణయించారు? విధి లేక ప్రకృతి. ఈ ‘విధిరాత’ అనడం ఇష్టం లేకపోతే, ప్రకృతినియతి (laws of nature) అందాం. ప్రకృతినియతిని తెలియడమే విజ్ఞానశాస్త్రం. ఆ నియతిని తెలిసి ఉండడమే, శాస్త్రీయదృక్పథం, హేతువాదం. ఈ వాదంనుండి రెండు జీవితదృక్పథాలు ఏర్పడతాయి.

ఒకటి: అంతా ముందే నిర్ణయించబడినపుడు, ఏది జరుగవలసి ఉంటే అది జరుగుతుంది. నా బాధ్యత ఏమీ లేదు. నేనేమీ చేయను. లోకంలో ఎవరికి కష్టమైనా నష్టం జరిగినా నాకు ఎటువంటి బాధ్యత లేదు. చూస్తూ ఊరుకుంటాను. తన స్వేచ్ఛను హరించిన విధిపై, లోకంపై, కసి ఏర్పడుతుంది. ఈ కసి, అనేకవిధాలైన వ్యతిరేకతగా వ్యక్తమవుతుంది. లోకం పట్ల వ్యతిరేకత, ఇతరులను అవమానించడం, వారికి కష్టము నష్టము కలిగించడం. మరొక విధమైన వ్యతిరేకత, తనను తాను తక్కువ చేసుకోవడం, తనను తాను అవమానించుకోవడం, కష్టము నష్టము కలిగించుకోవడం. ఈ వ్యతిరేకతలన్నీ ఈ నవలలోని కథానాయకుడిలో కనిపిస్తాయి (నాకు జబ్బు… నాకు ద్వేషం…).

రెండు: ఈ శాస్త్రీయదృక్పథం ఏం చెబుతుందంటే, శాస్త్రీయంగా (scientific) ఆలోచించి ప్రవర్తించవలె. మనిషికి కలిగే కష్టనష్టాలు విజ్ఞానశాస్త్రానుగుణంగా, హేతుబద్ధంగా (rational) ఆలోచించి ప్రవర్తించనందువలననే. ప్రతి ఒక్కడు సైంటిఫిక్‍గా ఆలోచించి ఆచరించగలిగితే అదే స్వర్గం. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి అయే కొద్దీ, మనిషి ఇంతకంటే శాస్త్రజ్ఞానంతో వ్యవహరిస్తాడు. అతని సుఖసంతోషాలు పెరుగుతాయి. శాస్త్రజ్ఞానం పెరిగే కొద్దీ, హేతుబద్ధంగా ఆలోచిస్తాడు, తనకు మేలు కలిగే విధంగానే ఆలోచిస్తాడు ప్రవర్తిస్తాడు. అప్పుడు లోకంలో సుఖసంతోషాలే ఉంటాయి, లోకమే స్వర్గం. ఇటువంటి స్వర్గాన్నే ఈ నవల ముఖ్యంగా నిరాకరిస్తున్నది. ఈ నోట్స్, ఆనాటి మరో రష్యన్ నవలకు ప్రత్యాఖ్యానంగా రాసినది. అది, నికొలాయ్ చెర్నిషెవ్‍స్కీ (Nikolay Chernyshevsky) రాసిన ఏం చేయవలసివుంది (What is to Be Done?) అన్న నవల. ఇందులో రచయిత ఒక స్ఫటికహర్మ్యం (Crystal Palace) కల్పిస్తాడు. ఇది హేతువాదపుపునాదులపై (Rationalism) నిర్మించిన హర్మ్యం.

దొస్తోయెవ్‍స్కీ ప్రధానజీవితదర్శనం ఈ రకాల వ్యతిరేకతను, బాధ్యతారహితనిశ్చేష్టతను, హేతువాదస్వర్గాన్ని, వ్యతిరేకిస్తుంది. రెండు రెళ్ళు నాలుగే. నిజమే. కాని రెండు రెళ్ళు అయిదు అనే స్వేచ్ఛ నీకు లేదని ఎందుకు అనుకుంటావు? విధినిర్ణయం జరిగిపోయింది. నిజమే, కాని దాని అర్థం నీ బాధ్యత లేదని కాదు. మనిషి తన స్వేచ్ఛను వదులుకోకూడదు, తన బాధ్యతను మరచిపోకూడదు. ఇది దొస్తోయెవ్‍స్కీ నవలలోని ప్రధాన జీవితతత్వం: ‘భగవంతుడా! ప్రకృతినియమాలు గణితశాస్త్రము ఏమైనా చెప్పనీ, నాకేమిటి? అవి నాకు యిష్టం లేదు. రెండు రెళ్ళు నాలుగు అనడం నాకిష్టం లేదు. నాకు తెలుసు, ఈ రాతిగోడను నా బుర్రతో బద్దలుకొట్టలేను. అలా అని, దానితో రాజీపడలేను కూడా.

ప్రకృతి నియతికి (laws of nature) లొంగిపోయి మనిషి మరబొమ్మ కారాదు. ప్రాణాలిచ్చైనా సరే తన స్వేచ్ఛను గుంజుకుంటాడు. మనిషి జీవితమంతా చేసేది ఇదే, ఈ స్వేచ్ఛాపోరాటం. ఈ పోరాటమే తనని మనిషిని చేసేది. ఈ పోరాటం ఎవరినీ విరోధించి కాదు. తనను మనిషిగా నిలబెట్టుకోడానికి. తనలోని మనిషిని నిలబెట్టడానికి.

హేతువాదమేధావులంటారు – మనిషి తనకు మేలుచేసే పనులు మాత్రమే చేయవలె అనుకుంటాడు, చేస్తాడు అని. ఎవడైనా ఎప్పుడైనా తప్పుచేస్తే అది తన మేలు తనకు తెలియక చేసినదే, తెలిసి ఎవడూ తనకు తాను నష్టం కలిగే పని చేయడు, అని అంటారు వీరు. కాని దొస్తోయెవ్‍స్కీ ఈ వాదంతో ఏకీభవించడు. ‘అవును? ఈ మేధావులకు ఎట్లా తెలుసునట, మనిషి ఎప్పుడు తనకు మేలుచేసే నిర్ణయాలే తీసుకోవాలి అనుకుంటాడని?…. మనిషి తనకు కష్టము నష్టము కలిగించే నిర్ణయాలు ఎన్నో తీసుకున్నాడని మానవచరిత్ర చెబుతుంది.’ మనిషి కోరుకునేది నిర్ణయంలో స్వేచ్ఛ. ఆ నిర్ణయం మేలుకైనా కావచ్చు కీడుకైనా కావచ్చు. కాని నిర్ణయం తనది కావాలి. ఆ నిర్ణయస్వేచ్ఛ కొరకు ఎంత మూల్యమైనా చెల్లించడానికి అతడు సిద్ధమే. నరకమైనా సరే! అది అతడు కోరుకున్న నిర్ణయం! అది తన నిర్ణయం! స్వేచ్ఛగా ఎన్నుకున్న నరకం! ఎవడో తన దోసిట్లో పడేసే స్వర్గం తనకు వద్దు! ‘నేను గంటకొట్టి మరీ చెబుతాను. మనిషి జీవితమంతా ప్రతి నిమిషము చేసేదిదే, తనకు తాను నేను మనిషిని, పియానో మెట్టు (piano key) కాను, ఎవడు ఏ మెట్టు నొక్కితే ఆ స్వరం పలకడానికి. నాకు నా స్వంతస్వరం ఉంది, అని నిరూపించుకోవలె అని.’

ఏమైనా సరే మనిషి స్వేచ్ఛను వదులుకోడు. తనను తాను శిలువపై ఎక్కించుకోవడానికైనా సరే, తనకు నిర్ణయస్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛే జీవితపరమార్థం, జీవితసాఫల్యం. హేతువాదులు కాల్పనికులు, (రొమాంటిక్స్), ఇంకా అనేక కేవలాభ్యుదయవాదులు సమాజంకోసం నిర్మించే స్ఫటికహర్మ్యం (crystal palace), తినడానికి నిద్రపోవడానికి మాత్రమే పనికి వస్తుంది. సమస్తమానవాళికి సుఖసంతోషాలు వాగ్దానం చేసే ఆ స్ఫటికహర్మ్యం సాధ్యం కాదు, సాధించదగినది కాదు. అది పనికిమాలినదే. యూరప్ నుండి వచ్చి రష్యన్ సంస్కృతిని ఆక్రమిస్తున్న భావాలకు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించాడు దొస్తోయెవ్‍స్కీ. స్వదేశీయసంస్కృతిని కాపాడుకోవలె అన్న తపన అతని రచనలలో కనిపిస్తుంది. బ్రిటిష్ పాలనలో యూరోపియన్ సంస్కృతి భారతీయసంస్కృతిని ఆక్రమిస్తున్నది అని ఇక్కడ కొందరు అనుకొన్నట్లే, ఆనాడు రష్యాలోను అనుకున్నారు. దొస్తోయెవ్‍స్కీ వంటివాళ్ళు. ఆక్రమితసంస్కృతులు వేరు కావచ్చు, కాని ఆక్రమించిన సంస్కృతి అక్కడా ఇక్కడా ఒకటే, మనిషిని మరబొమ్మను చేసే భౌతిక యాంత్రిక అభ్యుదయవాదం. అందులో, ధర్మము త్యాగము ప్రధానం కావు. దొస్తోయెవ్‍స్కీకి ఆ రెండు జీవితపరమార్థం. అయితే, ఒకప్పుడు తాను నమ్మిన అభ్యుదయం నుండి నిశ్చేయసంలోకి నడవడంలో ఘర్షణ క్లేశము తక్కువ కాదు. ఆ ఘర్షణ అంతా ఈ కథలో ఉంది. కథానాయకుడిలో మానవసహజమైన వైరుద్ధ్యాలు పాఠకుణ్ణి తికమక పెడతాయి. మనిషి తత్త్వాన్ని (essence) బతకడు, అతడి బతుకు (existence) అతడి తత్త్వం అన్న అస్తిత్వవాదసిద్ధాంతం ఈ కథానాయకుడి పాత్రలో బతికింది. మనిషి ఆలోచనలు అన్నీ శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసినట్టుండవు. మరకలు మడతలు దాచకుండా చెప్పిన కథ, పాత్ర ఈ నవలలో.

ఆనాడు ప్రబలంగా ఉండిన అనేకవాదాలను ఈ కథలో మొదటి వాక్యంనుండి వ్యంగ్యశైలిలో తిరస్కరిస్తాడు కథానాయకుడు. తిక్కవాగుడు అనిపించే వాక్యాలన్నీ కొత్త అర్థంతో గంభీరధ్వనితో కనిపిస్తాయి. ఈ ధ్వన్యర్థంలో, అతడి జబ్బు జబ్బు కాదు. లివర్ లివర్ కాదు. అతడి ద్వేషం ద్వేషం కాదు. అతడి ద్వేషం సమస్తమానవాళిపట్ల సహృదయస్వభావం. మానవత్వం కోసం తనను తాను ఆహుతి చేసుకొనే ఆర్తి. తరువాతకాలంలో దొస్తోయెవ్‍స్కీ రాయబోయే అయిదు పెద్దనవలలలో ఆవిష్కరించిన సామాజిక ధార్మిక దృక్పథానికి బీజాలు ఈ కథలో ఉన్నాయి. చెర్నిషెవ్‍స్కీ నవలలోని స్ఫటికసౌధాన్ని తిరస్కరించడం, ఈ నోట్స్‌లో ప్రధానకథావస్తువు. మనిషి బతికేది రొట్టెముక్క కోసం కాదు, మనిషి జీవితపరమార్థం స్వేచ్ఛ లేని సుఖసంతోషాలు కావు, అన్నది దొస్తోయెవ్‍స్కీ రచనల ఆశయం. కేవలాభ్యుదయవాదం నుండి కదిలి నిశ్చేయసాన్ని గుర్తించడం ఒక ద్విజన్మ. కీటకం నుండి బయటపడడానికి భ్రమరం పడే ద్విజన్మవేదన వంటిదే ఈ కథనంలోని క్లిష్టత.

<సశేషం)