ఆవంత్స సోమసుందర్ – గేయాలు, లఘుకవితలు

ఇరవయ్యవ శతాబ్దంలో కళ కళకొరకే అనే వాదన స్థానంలో కళ సమాజాన్ని సంస్కరించటం అనే భావన ప్రవేశించింది. సమాజంలో ప్రగతి నిరోధకమైన వాటిని విమర్శించి, అభ్యుదయకరమైన వాటిని ప్రోత్సహించటం ఒక ఆదర్శంగా చెప్పబడింది. సామాజిక స్పృహ, ఆధునికత, హేతువాదం, నాస్తికవాదం, మానవవాదం, విశ్వశ్రేయస్సు, ప్రజాస్వామ్యం, కులమత వ్యతిరేకత, సంస్కరణవాదం, వసుధైకకుటుంబ నిర్మాణం లాంటి దృక్పథాలు అభ్యుదయ కవిత్వలక్షణాలుగా చెప్పబడ్డాయి. కథకునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న ప్రక్రియలలో శతాధిక గ్రంథాలను వెలువరించిన ఆవంత్స సోమసుందర్ అభ్యుదయ కవిగా తెలుగు సాహిత్యరంగంపై చెరగని ముద్ర వేశారు. ఈ వ్యాసం ద్వారా సోమసుందర్ రచించిన గేయసంపుటులు, మినీ కవితలను కొద్దిగా పరిచయం చేస్తాను.

గేయసంపుటులు

‘ఏ నియమము లేకుండా శుద్ధ వచనమును లయాత్మకముగా మార్చినచో అది వచన గేయమగును’ అని సినారె నిర్వచించారు. సోమసుందర్ అలా వ్రాసిన గేయసంపుటులు – కాహళి, పసిడి రథం, మనస్సంగీతం, వెన్నెలలో కోనసీమ.

కాహళి

మద్రాసునుండి విడిపోయి ఆంధ్రరాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమసమయంలో, ప్రజలను ఉత్తేజపరుస్తూ రాసిన గేయాలను 1953 ఆగస్టులో కాహళి పేరుతో సోమసుందర్ పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ గేయాలన్నీ ఆనాటి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర పోరాటాన్ని సాహిత్యంలో రికార్డు చేశాయి. ఈ గేయాలు ఆనాటి పత్రికలలో ప్రచురణ అయి, ప్రజల నాల్కలపై నర్తించిన ఉద్యమగీతాలు. కాహళి అంటే కొమ్ము బూరా అని అర్థం. ఈ గీతాల బూరాలు మారుమోగి ప్రజలను ఉద్యమంలోకి ఆహ్వానించాయి.

‘తెలుగు వెలుగులు’ అనే గేయం ఇలా సాగుతుంది. ‘మన తెలుగు వెలుగులకు శాపమింకెన్నాళ్ళు? నక్కలకు మనచేను అర్పించుటెన్నాళ్ళు? కుక్కలతో తగువాడి కూడు తినుటెన్నాళ్ళు? తెలుగువాకిటను పాములింకెన్నాళ్ళు? అనుమర్లపూడి, కస్తూరి, చింతందాసు, మృత్యుంజయుల ఆత్మసాక్షిగా తెలుపండి.’

ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర అవతరణను వ్యతిరేకించే రాజాజి 1952లో రెండోసారి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కటాన్ని — నామాలకొరవి మళ్ళీ గద్దెకెక్కింది… నల్ల కళ్ళద్దాల చీకటే వచ్చింది… తెలుగు బిడ్డల ఆశ నీటిమూటేనా… అంటూ నామాల కొరివి అనే గీతంలో అక్షేపించారు. ఆంధ్రరాష్ట్రావతరణ కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన పొట్టిశ్రీరాములు గురించి ‘జానపదం’ అనే గీతంలో — ‘సత్యాగ్రహమ్మే మార్గమనుకొని అన్నమూ నీరైనముట్టక/ ఆంధ్రరాష్ట్రమ్మివ్వకుంటే అసువులిచ్చే నిశ్చయంతో అంపశయ్యలనున్న శ్రీరాములను రక్షించుకోవలె నయ్యయో, తెలుగన్నలంతా ఐక్యమై వురకాలి ముందుకు:/ రాయబారాలేలనోయన్నా; ఈ రాచపుండుకు/శస్త్రమే దివ్యౌషధమురన్న’ అని నిలువెత్తు ధిక్కారస్వరమై గర్జిస్తారు.

ఆంధ్రదేశము మనది/ ఆంధ్రరాజ్యము మనది/ ఎవడడ్డు వచ్చినా- చెండి పారేద్దాము.
ముక్కోటిమందిమీ/ ఒక్కటై నిలచితే/ ఎవ్వడెదిరించినా/ డుల్లగా నేలపడు –

అంటూ, ప్రతిజ్ఞ అనే గీతంలో ఆంధ్రదేశనిర్మాణం కొరకు ఆంధ్రులను సమీకరిస్తూ ఉత్సాహపరుస్తారు.

మద్రాసులో చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు పొట్టిశ్రీరాములుగారి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా విజయవాడలో పెద్ద హర్తాల్ జరిగింది. దానిని పురస్కరించుకొని సోమసుందర్‌ ‘శ్రీరామ రక్ష’ అనే గేయాన్ని రచించారు.

హర్తాల్ హర్తాల్ హర్తాల్
గుండె గుండెకు తోరణమ్మిదే హర్తాల్
పేటపేట కదలిరాగా…
కొట్టుకొట్టూ బందుకాగా…
మిల్లుమిల్లూ మూతపడగా
ఇల్లిల్లూ లేచిరాగా
పొట్టివాడే నేడు పొడుగాటి బలగాన్ని గట్టిగా
కదిలించి త్రివిక్రముండైనాడు
హర్తాల్ హర్తాల్ హర్తాల్…. అంటూ పొట్టిశ్రీరాములుని కీర్తిస్తూ ఉద్వేగభరితంగా సాగుతుంది.

పసిడిరథం

బాలలకు సాహిత్యంపై ఆసక్తి కలిగించటం కొరకు వారి అవగాహన స్థాయికి తగినట్లు సరళమైన భాషలో కథలు గేయాలు, జీవితచరిత్రలు లాంటివి జవహర్ బాలభవన్ ప్రచురించేది. సోమసుందర్ రచించిన బాలల గేయాలను ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ పసిడిరథం పేరుతో 1992లో ప్రచురించింది. దీనిలో ప్రకృతి వర్ణనలు, పిచ్చుకలు, గద్దలు, బాతులు, శీతాకాలం, సంక్రాంతి, చందమామ, అమ్మనాన్నలు, లాంటి వివిధ అంశాలతో, సులభమైన తేలికపదాలతో మొత్తం 15 బాలల గేయాలున్నాయి.

వసంతాన్ని చూడు-అది అసత్యాలు చెప్పదు…
దానికెన్ని గొంతులో- కోటిపికము లేమో!
వసంతాన్ని చూడు-అది అసత్యాలు చెప్పదు!
దానికెన్ని కన్నులో? కోటి పూవులేమో!
వసంతాన్ని చూడు -అది అసత్యాలు చెప్పదు
దానికెన్ని చెవులో-ఒక కోటి చివురు లేమో!
వసంత ఋతువంటేనే వత్సరాది జగతికి!
వసంత ఋతువొస్తే, పసందవును చెట్లకి… ( వసంతం)

అమ్మానాన్న ఇద్దరె మాకూ, నేనూ చెల్లీ ఇద్దరమే!
లాలలు పోసీ, బువ్వలు పెట్టీ జోలలు పాడే అమ్మే మంచీ!
బొమ్మలు తెచ్చీ మిఠాయి పెట్టీ కతలను చెప్పే నాన్నే మంచీ!
అమ్మానాన్న ఇద్దరె మాకూ, నేనూ చెల్లీ ఇద్దరమే!
నేను నవ్వితే వడగళ్ళూ, మరి చెల్లి నవ్వితే హరివిల్లు…
నేనూ చెల్లీ ఎంతో మంచీ, స్కూలుకు పోతూ వస్తామూ…!
అమ్మానాన్న ఇద్దరె మాకూ, నేనూ చెల్లీ ఇద్దరమే!
ఆటాలు ఆడీ పాఠాల్ చదివితే అమ్మ ఎంతగా మెచ్చేనో…
పేచీ పెట్టీ, చెల్లిని కొడితే, నాన్న కోపమున ఉరిమేనో
అమ్మానాన్న ఇద్దరె మాకూ, నేనూ చెల్లీ ఇద్దరమే! (వడగళ్ళు హరివిల్లు)

మనస్సంగీతం

సోమసుందర్ తాను రచించిన లలితగీతాలను మనస్సంగీతం పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ సంగీత ప్రయోక్త, గేయకవి, గాయకుడు డా. బాలాంత్రపు రజనీకాంతరావు దంపతులకు అంకితం ఇచ్చారు. ఈ పుస్తకంలోని అనేక గీతాలను వింజమూరి లక్ష్మి, మంగళగిరి ఆదిత్యప్రసాద్ లాంటి గాయకులు పాడగా, ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్టణం కేంద్రాలవారు రికార్డు చేసి ప్రసారం చేశారు. ఎమ్. ఎల్. నరసింహం, అత్తపల్లి రామకృష్ణ ఈ గీతాలకు సోమసుందర్ సమక్షంలోనే బాణీకట్టి పాడివినిపించేవారట.

మనస్సంగీతంలో మొత్తం 58 గేయాలు ఉన్నాయి. రజనీకాంతరావుగారు మనస్సంగీతానికి రాసిన ముందుమాటలో ‘ఈ సంకలనంలోని గేయాలు నిర్దుష్టమైన మాత్రాచ్ఛందాలు-తిశ్రగతులు, చతురశ్రాలు, ఖండాలు, మిశ్రాలూను. ఎక్కడా లయభంగమూ, గణభంగమూ కనపడవు’ అంటారు. ఈ గేయాలలో చక్కని కవిత్వ ఛాయలున్న వాక్యాలు కొన్ని…

మంచిపూలు కనిపిస్తే/ మంచిమాట వినిపిస్తే/ మంచిచీరలంగడిలో వ్రేలాడుతు మురిపిస్తే/ నీవె జ్ఞాపకం ప్రియా, నీవె జ్ఞాపకం – (జ్ఞాపకాలు)

వేసవిలో తడిగాలి వీనినట్లు/ చీకటిలో తెలిరేక తోచినట్లు/ ప్రియురాలా చిరునవ్వరాదటే/ గుండెతోట చిగురించరాదటే – (తడిగాలి)

వందనమమ్మా నందనవనమా/ భారత మాతృ బృందావనమా/ సకల శేముషీ రత్నాకరమా/ యుగ యుగ సమైక్య వివేకమా – (మాతృవందనం)

ఈ నాటి చంద్రునికి ఇంత వెలుగేల?/ మా ప్రేమ కథ చూచి మత్తు కాబోలు – (ప్రేమ కథ)

సంధ్యాధరాలపై నీలివేణువు మెరసి/ విశ్వానికే కొత్తచరణమందించింది – (నీలివేణువు)

కన్నులేలనో తెలియదు నీరు కార్చును/ ఆ నీటికేమి పాటకలదో మనసు ఎరుగును – (కార్తీక జ్యోత్స్న)

ఆకాశమే మల్లెపూలు పరచిన కడలి/ భూలోకమే పాలుపొంగి పొరలిన కడవ – (చైత్రపూర్ణిమ)

విరిసిన తామరపూవుల పరిమళాలలో/ కురిసెను దరహాసములే/ ప్రియా… నాప్రియా — (నిన్నటి వెన్నెల)

మనస్సంగీతంలో ప్రణయం ప్రేయసి గీతాలు మాత్రమే కాదు, ప్రకృతి గీతాలు, దేశభక్తి గీతాలు కూడా ఉన్నాయి. వీటిపై రొమాంటిక్ యుగపు ప్రభావం సులభంగానే గుర్తుపట్టవచ్చు. కృష్ణశాస్త్రి, నండూరివారి కవిత్వంలో ఉన్నట్లు ఈ గీతాలలో నిర్దిష్టమైన ఊహాసుందరి కనిపించదు. అన్నీ సార్వజనీనమైన ప్రణయభావనను, ప్రకృతి ఆరాధనను వ్యక్తీకరిస్తాయి. ఈ సంపుటి చివరలో తొమ్మిది దేశభక్తిగీతాలు కూడా చోటు చేసుకొన్నాయి. ఇవి ఈ దేశ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ, దేశంపట్ల ప్రేమను, ఏకత్వం పట్ల విశ్వాసాన్ని, దేశసాంస్కృతిక విలువలను ప్రకటిస్తాయి.

వెన్నెలలో కోనసీమ

1964 నుంచి 1971 మధ్యలో రచించిన లఘుగేయాల్ని, కవితలని సోమసుందర్ వెన్నెలలో కోనసీమ పేరుతో సంపుటిగా 1977లో తీసుకొని వచ్చారు. ఈ సంపుటిలోని గేయాలలో ప్రకృతి ఆరాధన, ప్రణయభావనలు, సైనికుల త్యాగం, జీవితసత్యాలు, శాంతిగీతాలు లాంటి ఎన్నో వైవిద్యమైన అంశాలు ఇమిడిపోయాయి. వెన్నెలలో కోనసీమ పేరుతో రాసిన మకుట గీతంలో కోనసీమ అందాలను స్త్రీ సౌందర్యంతో పోలుస్తూ చక్కని అన్వయం చేశారు.

మనుషుల మధ్యనున్న తారతమ్యాలను స్నేహసేతువులను నిర్మించి సమతలం చేద్దామని ప్రబోధిస్తారు ‘స్నేహసేతువు’ గీతంలో. హిందూ ముస్లిమ్ మతకల్లోలాలపై రాసిన ‘సిందూరరేఖ’ కవితలో- ఈ నేలను పుట్టిన మనతమ్ముల ముస్లిముల చంప, స్వార్థపరుల మోసమిది… ఇది శుష్కం, ఇది శూన్యం, ఈ మతమౌఢ్యం దయ్యం- అని మతసామరస్యాన్ని ఆకాంక్షిస్తూ, మతంపేరిట అల్లర్లు సృష్టించేవారిని దునుమాడతారు.

దీపావళిపూట ఈ లోకంలో మత్సరమనే చీకట్లను పారద్రోలటానికి ఆకాశదీపాలు వెలిగిద్దాం అని పిలుపునిస్తారు – ఆకాశదీపాలు అనే గీతంలో; స్వార్థపరుల జూదంలో నడిపించిన పాచికలం/పాచికలం యాచకులం/కులం బలం కాళ్ళక్రింద/ పడినలిగిన ఏలికలం వికలాంగ పిపీలికలం – అని నైర్యాశ్యాన్ని పలికిస్తారు – మనం-మనం అనే గీతంలో; గురజాడకు, సకల కళల సిరివాడకు; ఇరులయింటి నెలవాడకు; తీపికలం విరిజాజులు దోయిలింతు… అంటూ గురజాడకు అంజలి ఘటిస్తారు – గురజాడకు విరిజాజులు అనే గీతంలో; కలలో సుమపరిమళాల నెలా మరువగలను సఖా అంటూ ఈ పుస్తకముద్రణకు సహాయం చేసిన డా.శ్యామలరావును గుర్తుచేసుకొంటారు – శ్యామలరావు అనే గీతంలో; కాలము జాలం కాదు మనిషి చేప కాడు అని నిర్ధారిస్తారు – అంతర్వేది అనే గీతంలో.

ఈ గీతాలలో భావకవిత్వపు ఛాయలు కనిపిస్తాయి. ఈ గీతాలు విశ్వమానవ సౌభ్రాతృత్వం కాంక్షిస్తాయి. మానవత్వమే వెల్లివిరియాలని ప్రబోధిస్తాయి.

వజ్రాయుధం గీతాలద్వారా తిరుగుబాటుని పలికించిన సోమసుందర్, వెన్నెలలో కోనసీమ లోని గీతాలలో భావకవిత్వాన్ని రాయటం ద్వారా ఇతనిలోని అభ్యుదయం అడుగంటింది అని విమర్శలు ఎదుర్కొన్నారు. జీవితంలో అభ్యుదయమే కాక జీవన సామస్త్యాన్ని ఇముడ్చుకొనే ప్రయత్నమే ఈ వెన్నెలలో కోనసీమ గీతసంపుటి అని భావించాలి.

మినీ కవిత్వం

మినీ కవిత్వం అంటే చిన్న చిన్న కవితా ఖండికలు. మినీ కవిత్వం ఒకప్పుడు యువతను ఉర్రూతలూగించింది. మినీ కవిత్వానికి క్లుప్తత, ధ్వని ప్రధాన లక్షణాలు అని అద్దేపల్లి రామమోహనరావు ప్రతిపాదించారు. సోమసుందర్ రాలినముత్యాలు, చంద్రభాగ పేర్లతో మినీకవిత్వ సంపుటిలను వెలువరించారు.

రాలిన ముత్యాలు

సోమసుందర్ రచించిన లఘుకవితలు ‘రాలిన ముత్యాలు’ పేరుతో ఆంధ్ర సచిత్రవారపత్రికలో 1975 – 1977ల మధ్య వరకూ ధారావాహికంగా ప్రచురింపబడినాయి. మినీ కవితలకు రాలిన ముత్యాలు అనే పేరు, ఎంతో ఔచిత్యవంతంగాను, భావస్ఫోరకంగాను అనిపిస్తుంది. వీటిని 1978లో రాలిన ముత్యాలు పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దీన్ని ఆంధ్రపత్రిక అధినేత శివలెంక రాధాకృష్ణకు అంకితం ఇచ్చారు. మరుపూరు కోదండరామిరెడ్డి ఈ పుస్తకానికి ముందుమాట రాశారు.

సోమసుందర్ అభ్యుదయ సాహిత్యంలో మధ్యేమార్గాన్ని అవలంబించాడు. పాత సాహిత్యాన్ని సంపూర్ణంగా తిరస్కరించలేదు. గతాన్ని గౌరవించలేనివాడు వర్తమానాన్ని కూడా గౌరవించలేడు అని బాహాటంగా ప్రకటించారు. ఇదే అభిప్రాయాన్ని పన్నెండవ ముత్యంలో ఇలా చూస్తాం.

ఇల్లుకట్టదలచినవాడు చేవగల కలపా
ఇటుక రాయీ సున్నమూ వగైరా
సమకూర్చుకోవడం వివేకం
పూర్వకావ్య మహారణ్యాలలో
చేవగల వృక్షాలు బోలెడు. 12

త్రోలేవాడు భటాచోరని తెలిసినా
కిమ్మనకుండా బరువులులాగే ఎద్దులాగ
చంద్రుడు వట్టి మట్టిదిబ్బని తెలిసినా
గ్రహణం నాడు విడుపుస్నానం చేస్తుంది,
సంప్రదాయం 37

నిజమే, గొప్పవాడుసుమండీ మనిషి
తన లక్షణాలన్నీ
అంటగట్టాడు ఎంచక్కా దేవుడికి….
అతగాణ్ణి కాకా బాకాలకు తలొగ్గే
ఆత్మగౌరవం లేని నీచుడిగా మార్చేశాడు. 30 — అంటూ మూఢాచారాలను బలంగా ఖండించారు.

ఎలా సంభవించిందని నన్నడగకు:
ఉరిశిక్షపొందిన ముద్దాయికి
భగవత్ సందేశమందిద్దామని
వచ్చిన మతగురువుని ఉరితీసి
ముద్దాయిని విడిచిపెట్టినట్లు
అస్తవ్యస్తంగా నడుస్తోంది లోకం! 44 — అంటూ అస్తవ్యస్తం, బాధ్యతా రాహిత్యం అనే లక్షణాలను చెప్పటానికి తీసుకొన్న ఇమేజ్ నిరుపమానమైనది.

పాల్ ఎలార్డు ఎల్లప్పుడూ
పాలకోసం ఏడ్చిన పిల్లాడు…
బోదలేర్ అల్లరి బోలెడు చేశాడు
రేంబో రాసింది కవిత్వమని
భావించారు దేవానాం ప్రియలు
ఆకాశమంతటి కేన్వాస్‌పై
రెయిన్‌బోలు శిల్పించాడు నైవేద్యంగా! 73 — అంటూ చిన్న చిన్న వాక్యాలలో అంతర్జాతీయ కవిత్వంపై తనకున్న అవగాహనను చెబుతారు.

నీ ఎదలో ఒక్క వసంతం నాటు,
ప్లీజ్ ఒక్క వసంతం నాటు
దానంతటదే వచ్చి గానం చేస్తుంది కోకిల…
పేరంటం చెప్పనక్కరలేకుండానే
వందలాదిగా వచ్చి దిగుతాయి
సీతాకోక చిలుకలూ, మధుపాలూ… 52 — అనే కవిత గొప్ప అందమైన ఆశావహ దృక్పథాన్ని పలికిస్తుంది.

అమ్మాయి ఉద్యోగం చేసి ఇల్లు గడుపుతున్నా
అణగి మణగి నమ్రతగా బ్రతకాలి…
అబ్బాయి ఉత్త పోరంబోకు వెధవల్లే తిరుగుతున్నా
ఠీవిగా తలెత్తుకుని హాయిగా ఆగడం చేయొచ్చు!
తల్లిదండ్రుల దృష్టిలో- అమ్మాయి బరువు!
అబ్బాయి ఎరువు! 31 — అనే మినీ కవిత స్త్రీ సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షను అక్షరీకరిస్తుంది.

ఎంతనూనె ఉన్నా ఒక వత్తిలేక దివ్వె కాదు 69 — చక్కని సూక్తిగా చెప్పుకోవచ్చు.

చంద్రభాగ

సోమసుందర్ రచించిన 206 లఘుకవితల సమాహారం చంద్రభాగ. ఈ పుస్తకాన్ని 2012లో ముద్రించారు. దీనిని మేకా మన్మథరావుకు అంకితమిచ్చారు. చంద్రభాగ అంటే ఏరు అని అర్థం. అంకితవాక్యాలలో ‘బుల్లిపాదాల బిడ్డలతో చంద్రభాగ మన్మథుడి కోసం నడిచివచ్చింది’ అంటారు. ఈ మినీకవితలను బుల్లిపాదాల బిడ్డలు అని, ఈ పుస్తకాన్ని ఒక ఏరులాగ మన్మథరావు కొరకు నడుచుకొంటూ వచ్చింది అనటం చక్కని సౌందర్యాత్మక చిత్తరువు వలె అమరింది.

ఈ మినీకవితలు ఏవీ నాలుగు లైన్లు మించి లేవు. రూపంలో హైకూల్లా అనిపిస్తాయి కానీ సారంలో కాని, వస్తువులో కానీ వీటిని హైకూలతో పోల్చలేం. ప్రాకృతిక సౌందర్య చిత్రణ, సమాజపోకడలపై విసుర్లు, జీవన సత్యాలు ఈ మినీకవితలకు వస్తువుగా ఉంది. చాలా వాటిలో అనుభూతికన్నా చమత్కారమే ఎక్కువగా పలికింది. కొన్ని మినీకవితలలో అద్భుతమైన ఊహాశాలీనత అబ్బురపరుస్తుంది.

ఇళ్ళ పైకప్పులకు
మనుష్యులంటే ఎంతప్రేమో!
ఇంతవానలో కూలిపోక కన్నీళ్ళు కారుస్తోంది! 45

అలాగే…

వాన కురిసింది
వాకిట్లో నిలచిన నీటిపై తేలుతూ నా కవిత
తీసుకుందామని వెడితే నేలపడిన జాబిల్లి బిళ్ళ 91

సమాజపు పోకడలపై విమర్శ సోమసుందర్ మౌలిక తత్వం. మినీకవితలలో కూడా ఆ లక్షణాన్ని పలికించకుండా ఉండలేదు ఆయన. ఈ క్రింది మినీకవితలు చాలా శక్తివంతంగా సామాజిక స్పృహను పలికిస్తాయి. రాజ్యం చేసే హింసను బలంగా వ్యక్తీకరిస్తాయి. ఇది సోమసుందర్ సహజరీతి.

“ప్రధాని ఏం చేస్తున్నారు?”
“సంకెళ్ళు తయారు చేస్తున్నారు!”
“ఎవరికోసం? ఎన్నుకొన్న ప్రజలకోసమే” 102

తోటలో విహరిస్తుంటే
సీతాకోక చిలుక పలకరించింది-
“నరుడా నీకిక్కడ తావు లేదు, నీ చేతులలో విధ్వంసం.”147

వేకువ వెలుగు బాణాలు
విసురుతుందన్న భయం లేకుండా
చీకటి దోపిడీ చేస్తూనే ఉంది. 36

జీవితాన్ని భిన్నకోణాల్లోంచి వ్యాఖ్యానించటం సోమసుందర్‌కి ఎంతో ఇష్టం. వీరు చేసే జీవన వ్యాఖ్యానాలు జీవితం పట్ల లోతైన అంతర్దృష్టిని కలిగిస్తాయి. జీవితం అనేది నిరంతర అన్వేషణ అని, అది ఎన్నటికీ పరిపూర్ణం కానేరదనే ఎరుకను ఇస్తాయి.

చీకటి అజ్ఞానం చిరంజీవులు
ఎంతనరికినా బ్రహ్మచెముళ్ళు!
చిగురిస్తూనే ఉంటాయి. 26

బాకుమొన కన్నీరు కార్చదు
లేడి అందానికి మురిసిపోదు పెద్దపులి 79

జీవితం అన్వేషణ
ఎవరిదైనా పరిపూర్ణం కాదు
పరిపక్వమూ కాదు పవిత్రమూ కాదు 133

సోమసుందర్ శతాధిక గ్రంథకర్త. వీరు స్పృశించని ప్రక్రియలేదు. అభ్యుదయం, సామ్యవాదం, విప్లవం, తిరుగుబాటు లాంటి భావాలు ఏమైనా ఏదైనా అచ్చమైన కవిత్వాన్ని పలికించారు. నిజానికి వజ్రాయుధం కూడా గేయాల సంపుటే. విజయవాడలో వేలమంది హాజరైన ఒక పెద్ద సభలో ఖబడ్దార్ గీతాన్ని గరికపాటి రాజారావుతో సహా 15మంది వీరావేశంతో బృందగీతంగా ఆలపించినట్లు సోమసుందర్ తన ఆత్మకథ రెండవభాగం పూలు-ముళ్ళులో చెప్పుకొన్నారు.

విప్లవకవిగా ఉంటూ సౌందర్యాన్ని చెప్పకూడదు అనే ఆంక్షలకు లొంగలేదు. మానవుడు, ప్రకృతి, కాలం, సమాజం సోమసుందర్ మౌలిక కవితా వస్తువులు. ధనము, మతము ఆధునిక యుగంలో అన్ని అనర్థాలకు కారణమని గుర్తించారు. ఆమేరకు వాటిని తన సాహిత్యంలో ఖంఢించారు. ప్రపంచయుద్ధం, తెలంగాణ ఉద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, సామ్రాజ్యవాదం శక్తుల ఆధిపత్యపోరు, ఎమెర్జెన్సీ లాంటి తనకాలపు అనేక రాజకీయ సందర్భాలకు సోమసుందర్ స్పందించారు. కవిగా తనదైన వ్యాఖ్యానాన్ని చేశారు.

మహాకార్యాలు సాధించిన
మహనీయుని మరణం
అనంత కాలాలవరకూ
పూరింపబడని శూన్యావరణం 68

అని రాలిన ముత్యాలలో అంటారు సోమసుందర్. ఇది ఆయన జీవితానికి కూడా వర్తించే సత్యం.

(శ్రీ సోమసుందర్ శతజయంతి సందర్భంగా కేంద్రసాహిత్య అకాడెమీ వారు 26-10-2024 న, కాకినాడలో ఏర్పాటు చేసిన సదస్సులో నేను చేసిన ప్రసంగపాఠం)


సంప్రదించిన గ్రంథాలు

  1. వెన్నెలలో కోనసీమ – ఆవంత్స సోమసుందర్ గేయ సంపుటి
  2. చంద్రభాగ – డా. సోమసుందర్
  3. మనస్సంగీతం – ఆవంత్స సోమసుందర్
  4. రాలిన ముత్యాలు వగైరా – ఆవంత్స సోమసుందర్
  5. వజ్రాయుధం – సోమసుందర్ ఆవంత్స
  6. కాహళి – సోమసుందర్
  7. పసిడి రథం, బాలలగేయాలు – ఆవంత్స సోమసుందర్
  8. సోమసుందర్ పరిణామ క్రమం-భావయిత్రి-కారయిత్రి, డా. మిరియాల రామకృష్ణ
  9. కవిత్వము పరిమితి, శ్రీ చేకూరి రామారావు, భారతి వాల్యూమ్ 62, ఫిబ్రవరి 1985
  10. ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయములు, ప్రయోగములు పుట 618.
  11. పూలు-ముళ్ళు, స్వీయచరిత్ర రెండవ భాగము, డా. ఆవంత్స సోమసుందర్
  12. అందినంత చందమామ – అవధానుల మణిబాబు
  13. సారస్వత మేరువు-శ్రీ ఆవంత్స సోమసుందర్ – బొల్లోజు బాబా