నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. – (యోహాసు 10:9)
ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను; దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు. దానిని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. – (యోహాసు 10:18)
[1]
“యూదా ఎడారిలోని ఒక ఆదివాసీ గొల్లతెగల లాలాజలాన్ని జన్యు పరిశోధన కోసం సేకరించాను. వెంటనే రా” అని జియాద్ మహమూద్ అబ్బాస్ నుండి నాకు టెలిగ్రామ్ వచ్చింది. మాలో మాకు ‘ఏంటి సంగతి?’ ‘ఎందుకు రావాలి?’ అని ప్రశ్నించుకోడాలు, పట్టింపులు, మొహమాటాలూ ఉండవు. పిలిస్తే వెళ్ళాల్సిందే. అది కాలేజీ రోజులనుండి వస్తున్న అలవాటు కావచ్చు, లేదూ మాలో మేము చెప్పుకోకుండానే చేసుకున్న ఒప్పందం అనీ అనుకోవచ్చు. అది పక్క వీధయినా, లేదా పొరుగు దేశమయినా అంతే! నేను ముందురోజు రాత్రే దిల్లీ నుండి టెల్ అవీవ్‌కు విమానమెక్కాను. ఇక్కడ దిగాక విమానాశ్రయం నుండి టాక్సీ తీసుకొని జెరూసలేమ్ డమాస్కస్ గేట్ దగ్గర కాచుకుని ఉన్నాను. జెరూసలేమ్ నుండి జెరికోకు యూదా ఎడారి గుండా వెళ్తే ఇరవై ఐదు కిలోమీటర్లే.
జియాద్గాడు జెరికో సమీపంలోనే ఎక్కడో డేరా వేసుకునున్నాడు. ఇది పాలస్తీనాలో ఉంది. డమాస్కస్ గేట్ నుండి నన్ను తీసుకుపోడానికి కారు పంపాడు. ఇజ్రాయిల్‌కు పాలస్తీనాకు మధ్య సరిహద్దు సమస్య ఉన్నందువల్ల, ఇజ్రాయిల్ ఆధీనంలో ఉన్న జెరూసలేమ్ నగరానికి సరిహద్దుగా ఉన్న ఈ డమాస్కస్ గేటుకు వచ్చి ఇక్కన్నుండి వెళ్ళాలి.
ఇజ్రాయిల్ పౌరులు ఇక్కడ్నుండి ప్రవేశించలేరు. అరబ్బులు దేశంనుండి బయటకు వెళ్ళలేరు. ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా రద్దు చేశారు. కానీ నాలాంటి విదేశీ ప్రయాణికులు పాస్‌పోర్ట్ చూపించి, సరిహద్దు ప్రాంతం దాటి మరో వాహనం ఎక్కి పాలస్తీనాలోకి ప్రవేశించవచ్చు. ఈ సరిహద్దును దాటేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ జియాద్ చేసిపెట్టేశాడు. నేను పెద్దగా చెయ్యాల్సిందేమీ లేదు. నిర్దేశిత స్థలంలో చూపెట్టాల్సిన కాగితాలు చూపించి వాడు పంపే కారు ఎక్కి కూర్చుంటే చాలు.
జియాద్ పంపిన కారు డ్రైవర్ నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.
“పాలస్తీనాకు స్వాగతం, మిస్టర్ ఫ్రాంకో ఇగ్నేసీ” అని ఆంగ్లంలో పరిచయం చేసుకున్నాడు. అచ్చమైన అరేబియన్. అతని ఉచ్చారణలో ఆంగ్లపదాలు అరబిక్ సంగీతకచేరీలో ఆలాపనల్లా లయబద్ధంగా, స్పష్టంగా వినిపించాయి. చెప్తున్నది అర్థమైంది. తొలిసారి జియాద్ పరిచయం చేసుకున్నప్పుడు కూడా ఇలానే అనిపించింది.
నేను కారు ఎక్కి కూర్చున్నాను. ముందురోజు రాత్రే బయలుదేరడంవల్ల విమానంలోను, ఎయిర్పోర్ట్ టాక్సీలోను బాగా నిద్రపోయాను. నిద్రమత్తు వదిలిపోవడంతో ఈ దేశాన్ని కనులారా తేటగా చూస్తున్నాను.
మిట్టమధ్యాహ్నం ఎండ. అంతా ఎడారి. కాగుతున్న నేల. ఆకాశం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, తన అంచులదాకా పరచుకుని ఉన్న ఇసుక నేలమీది గీతలను చూస్తోంది. పచ్చదనం చివరి కొసలదాకా చేరని ముళ్ళపొదలు. శూన్యాన్ని పొడుచుకుంటూ పైకి ఎగసినట్టు నిల్చున్న చిన్న చిన్న ముళ్ళ చెట్లు. కనుచూపు మేరలో – నేల మీద – అలల్లాగా పైకి ఎగసే నీటి తెరల్లాంటి ఎండమావులు ముందుకు వెళ్తున్న కొద్దీ అందకుండా సాగిపోతూ ఉన్నాయి. ఒక క్షణం ఆనందం, ఒక క్షణం భయం – ఒకటి మార్చి ఒకటి.
డ్రైవరు నా వైపుకు తిరిగి చూసి “ఎ రోడ్ డౌన్ టు జెరికో” అని కనురెప్పలు కిందకి వాల్చి అన్నాడు. ఆ లైన్ ఒక పదచిత్రం. బైబిల్లో ప్రస్తావించబడింది. నా బైబిలు పాఠాలు గుర్తుకు వచ్చాయి. యేసు అలాంటి ఒక కథ చెప్తున్నట్టు వస్తుంది. ఒక బాటసారి జెరూసలేమ్ నుండి, జెరికోకు భయానకమైన ఎడారి దారిలో ప్రయాణిస్తాడు. తీక్షణమైన ఆ ఎడారి దారిలో ఒక దొంగలముఠా తోడేళ్ళు చుట్టుముట్టినట్టు చుట్టుముట్టి బట్టలు లాక్కుని, తోలు తీసేసి రక్తమోడుతున్న అతన్ని నేలమీద పడేసి అతని దగ్గరున్న సరంజామాను, డబ్బును దోచుకెళ్ళిపోతారు. అప్పుడు ఒక యూదు గురువు అటుగా వెళ్ళాడు, అతనేమీ సాయం చెయ్యలేదు. ఒక సైనికుడు కూడా అటుగా వెళ్ళాడు, అతను కూడా సాయం చెయ్యలేదు. ఆ పైన గాడిద మీదెక్కి వచ్చిన తక్కువ కులస్థుడైన ఒక దయాళువు అతని స్థితి చూసి జాలిపడి తన గాడిదపై ఎక్కించుకుని సమీపంలోని సత్రానికి తీసుకెళ్ళి వదిలిపెట్టాడు.
ఆ కథలో వచ్చే భయానకమైన ఎడారి ఇదే కాబోలు అనిపించి ఒంటిలో గగుర్పాటు, భయమూ కలిగాయి. ఆ కథలో జెరూసలేమ్ నుండి జెరికోకు దిగి వెళ్ళారని చెబుతాడు యేసు ప్రభువు. ‘దిగి’ అన్న పదం నన్ను బాగా ఆకర్షించింది. ఇప్పుడు నేల మట్టాలను పరిశీలిస్తే, ఈ పదం అన్ని విధాలుగా సరిపోతుందని స్పష్టమవుతుంది. శారీరకంగా, మానసికంగా ఇక్కడ దిగితేగానీ వెళ్ళలేము. ఆ కథలో ఈ రకమైన నేలను గురించే చెప్పడంలో ఆంతర్యమేముందో మరి! ఎంతయినా యేసు గొప్ప కథకుడే.
జియాద్ తన చిన్నతనంలో పెరిగిన ఊరి గురించీ దాని స్థలాకృతి, భౌగోళిక అంశం గురించీ మా క్లాస్రూమ్ కబుర్లలో చెప్పినవన్నీ నేను గుర్తుకు తెచ్చుకున్నాను.
‘ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాలు జోర్డాన్ నదికి పశ్చిమ ఒడ్డున, మధ్యధరాసముద్రానికి తూర్పున ఉన్నాయి. జోర్డాన్ నది హెర్మోన్ అనే మంచుపర్వత శిఖరాన ఉద్భవిస్తుంది. నువ్వు వినే ఉంటావు. అక్కడ నుండే యేసు తన మానవ శరీరాన్ని విడిచిపెట్టి, మంచులాంటి స్వచ్ఛమైన తెల్లని కాంతిని పొందే ఆ రూపాంతరం అనే మహత్తరమైన అద్భుతాన్ని చేశాడు. జోర్డాన్ నది అక్కడ పుట్టి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది. కొంచం దక్షిణాన, వెడల్పుగా విస్తరించి గలిలీ సముద్రంగా విస్తరిస్తుంది. యేసు గలిలీ సమీపంలోని నజరేతులో పెరిగాడు. యేసు నడిచింది గలిలీ సముద్రం మీదే. తర్వాత ఆ నది మళ్ళీ దక్షిణం వైపుగా కుంచించుకుపోయి జోర్డాన్ లోయలోకి ప్రవహించి మృత సముద్రం, డెడ్ సీలో కలుస్తుంది. జెరికో డెడ్ సీకి వాయువ్యంగా ఉంది. యేసుక్రీస్తు అక్కడే గుడ్డివాడికి చూపును ప్రసాదించే అద్భుతాన్ని చేశాడు. ఈ జోర్డాన్ నదిలో యేసు తన ముప్పయ్యవ యేట బాప్తీస్మము తీసుకున్నాడు. లోయ అన్నాను కదా? దాన్ని ‘ది గ్రేట్ రిఫ్ట్వ్యాలీ ఆఫ్ ది ఎర్త్’ అంటారు. విశాలమైన గలిలీ సముద్రం, డెడ్ సీ రిఫ్ట్ వ్యాలీలో భాగమే. తూర్పున అరేబియా ఖండం, పశ్చిమాన ఆఫ్రికా ఖండం మధ్య జరిగిన ఘర్షణ ఫలితంగా ఈ చీలిక ఏర్పడిందని చెబుతారు. జోర్డాన్ నది ఆ చీలిక వల్ల కలిగిన అంతరాన్ని పూరిస్తూ ప్రవహిస్తుంది.‘
ఈ ప్రాంతం భూమి ఉపరితలాన ఏర్పడిన ఒక పెద్ద గాటులా, ఒక గాయపుమచ్చలా ఉంటుందని నేను ఒక క్షణం ఊహించుకున్నాను.
‘మృతసముద్రం ప్రపంచంలోనే అత్యంత లోతట్టు ప్రదేశాల్లో ఒకటి. డెడ్ సీ, జెరికో ఆ రిఫ్ట్ వ్యాలీలో సముద్ర మట్టానికి 1400 మీటర్ల దిగువున ఉంటాయి. జెరూసలేమ్ రిఫ్ట్ వ్యాలీకి పశ్చిమ ఒడ్డునున్న ఎత్తయిన ప్రాంతం. సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది.‘
[2]
నేను జియాద్ మహమూద్ అబ్బాస్ ఉన్న గుడారానికి చేరుకున్నాను. నేను ఊహించినట్లుగా షెడ్డో, టెంటో కాదు. వాడు పెద్ద బిల్డింగే కట్టుకుని ఉన్నాడు. ఇంకా నేమ్‌ప్లేట్ లాంటిదేమీ పెట్టలేదు. తన లేబొరేటరీ కూడా ఈ బిల్డింగ్‌లోనే ఉందని కారు డ్రైవర్ చెప్పాడు.
మొదట ఇక్కడ టెంట్లో ప్రారంభించాడట. తర్వాత ఇక్కడే స్థిరపడిపోదామని నిర్ణయించుకుని భవనంగా విస్తరించాడు. గత ఆరు నెలలుగా ఇక్కడే ఉంటున్నాడు. వాడి గది వైపుకు వెళ్ళగానే, తలుపు దగ్గరే ఒక గొంతు వినిపించింది.
“యూ బ్లడీ ఇండియన్ ఆస్హోల్, వెల్కమ్ టూ మై ప్లేస్. హౌ ఆర్ థింగ్స్ లైక్ ఢెల్లీ, ఇండియా అండ్ యూ?”
“యూ పాలస్తీనియన్ షిట్” అంటూ నేను అతనిని కౌగిలించుకున్నాను.
“నువ్వేదో ఇక్కడ ఎడారిలో ఆరుబయట డేరాగుడ్డలు కట్టుకుని నిద్రపోతుంటావనుకున్నాను. ఇక్కడ ఇలా ఒక పెద్ద భవనంలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని ఉంటావని నేను అనుకోలేదు. ఏం చేద్దామనుకుంటున్నావు, ఇంత ఖర్చు పెట్టి కట్టావు? ఏదేమైనప్పటికీ ప్రారంభోత్సవానికి నన్ను పిలవలేదు. అంతేలే, కట్టావన్న సంగతయినా చెప్పకుండా దాచావు. ఇంకేం పిలుస్తావు? ఫోన్లో ఒక మాటయినా చెప్పలేదెప్పుడూ. యూ సన్ ఆఫ్ ఎ బిచ్” అని కొంచెం తిట్టాను.
“ఐ బెగ్ యువర్ పాడన్, మై ఫ్రెండ్” అని నన్ను శాంతపరిచాడు. “ఇది నాకు మా అమ్మ తరఫునుండి వచ్చిన భూమి. ఇక్కడే స్థిరపడి పని చేసుకుందాం అనిపించింది. అది ఒకరకంగా నా చిరకాలపు కోరిక కూడా. అందుకే ఈ నిర్ణయం. ఇక్కడే ఇంకొంత స్థలం కొని దానిలో కట్టాను. మా తల్లిదండ్రులు అట్లాంటాలో ఉన్న మా అక్కతో ఉండిపోతామనేశారు. వాళ్ళు రారు. నేను మాత్రమే ఇక్కడ” అన్నాడు.
“సరే, చెప్పు. ఏంటి విషయం? ఎందుకు రమ్మన్నావ్? నువ్వు ఏదో ఆదివాసీ గొల్లవారి లాలాజలాన్ని సేకరించానని అన్నావే?”
“కొంచం ఆగు. నువ్వు అసలుసిసలైన మిడిల్ ఈస్టర్న్ టీ తాగివుండే అవకాశం లేదు. చేసి తెస్తానుండు. అప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు.”
కొంతసేపటికి జియాద్ తన అల్మారా తెరిచి ఒక ఫైలు తీసుకొచ్చాడు. అందులోంచి మొదటి ఫోటో తీసి నాకు చూపించాడు. ఎవరిదో మెడ భాగం మాత్రమే ఉన్న ఫోటో. ఆ మెడ భాగంలో ఒక మచ్చ ఉంది, అది మానిన గాయంవల్ల ఏర్పడిన మచ్చలా ఉంది.
“ఇది నిజంగా మచ్చలా ఉందా? లేదూ చర్మ సంబంధమైన జబ్బువల్ల వచ్చినట్టుందా?” అని అడిగాడు.
“లేదు, లేదు. మచ్చలే అయుండాలి. ఇవి కొన్ని రకాల కెలాయిడ్ మచ్చలు అని నాకు అనుమానంగా ఉంది. అవి లేత ఎరుపు నుండి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.”
“అవి ఎలా పుడతాయి?”
“తీవ్రమైన దెబ్బ, లేదా కత్తిగాటు అయితే, గాయం చుట్టూ ఈ రకమైన కణజాలం విస్తరించి ఆ గాయం చాలాకాలం పాటు మానుతూవస్తుంది. కొన్నిసార్లు గాయం మూసుకున్న తర్వాత కూడా లోలోపలనుండి పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ రకమైన కణజాలం ఎటువంటి హానీ కలిగించదు. కొంతమందికి ఇది చర్మంపై అసహ్యంగా కనిపిస్తుంటుంది.”
“అది నిజమే. ఎలాంటి దెబ్బ, గాయం లేకుండా ఇలాంటివి ఏర్పడే అవకాశాలున్నాయా?”
“అవకాశం లేదు. ఖచ్చితంగా ఇతనికి మెడమీద దెబ్బ తగిలుండాలి.”
వాడు ఆ ఫైల్‌ను తీసుకుని, వేర్వేరు వ్యక్తులవే అలాంటి మెడ భాగాల ఫోటోలు చూపించాడు.
“ఇవి ఏమిటి?” అని అడిగాను.
“వీరంతా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న గొల్ల ఆదివాసీ ప్రజలు. వారి జనాభా ఐదు నుండి ఆరు వందల మధ్య ఉంటుంది. నేను వారిని నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నేను ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాతే వీళ్ళందరిలో కామన్‌గా ఉన్న ఈ సమస్యను చూసి అనుమానం కలిగి అదేంటో తెలుసుకోవాలని పరిశోధించడం ప్రారంభించాను.”
ఇలా కొనసాగించాడు, “వారి మెడపై, ఖచ్చితంగా చెప్పాలంటే, ఈ మచ్చ చెవితమ్మెకు కింద నుంచి మొదలై మెడ, కుడి భుజమూ కలిసే చోటుదాకా సాగుతోంది.”
నేను మళ్ళీ ఆ ఫోటోలు చూశాను.
“ప్రతి ఒక్కరికి అదే చోట ఒకే రకమైన మచ్చలున్నాయి!” ఆశ్చర్యపోయాను.
“వందమందిలో యాభైమందికి ఇది ఉంది. మెడ మీద కోసినట్టుగా. వారి వంశచిహ్నం లాగా!”
“హ్మ్… వాళ్ళు సంచార జాతికి చెందిన గొల్లవారా?” అని అడిగాను.
“జుడాన్ ఎడారి మానవశాస్త్ర సిద్ధాంతకర్తల నిర్ధారణ ప్రకారం వారు ఆదివాసులు. ఈ నేలకు చెందిన ప్రజలే. వారిని వలసేతరులగానే పేర్కొంటారు.”
“సరే.”
“అలా అయితే మచ్చలు జన్యుపరంగా ఒకతరం నుండి మరో తరానికి కొనసాగుతాయా?”
“అవును, కెలాయిడ్ మచ్చలు ఆ స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాటికి బాధ్యత వహించే జన్యువులు ఆధిపత్య జన్యువులు. ఇవి కొనసాగింపును ఆగిపోయే అవకాశానికి అసలు చోటివ్వవు. తల్లిదండ్రుల నుండి పిల్లలకు పంపబడే రకాన్ని ఆటోసోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు. తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఏ ఒక్కరు ఈ జన్యువులను కలిగి ఉన్నా చాలు. అవి స్థిరంగా పాతుకుపోయి తప్పకుండా పిల్లలకి చేరుకుంటాయి. అందుకే ‘డామినెంట్’ అంటారు. వ్యతిరేక జన్యువులు తిరోగమనంలో ఉంటాయి. అవి బదిలీ కావడానికి తల్లితండ్రులిద్దరి జన్యువుల్లోనూ అవి ఉండాలి. అప్పుడుకూడా, పిల్లల్లో అవి కొనసాగే అవకాశం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంటుంది. తిరోగమన జన్యువయితే పిల్లలను పెద్దగా బాధించకుండా అక్కడితో ఆగిపోతాయి. కానీ ఆధిపత్య జన్యువులు చాలా బలమైనవి. ఒక పేరెంట్లో అవి ఉన్నా, అవి ఎన్నో తరాలకు కొనసాగే అవకాశం యాభై శాతం ఉంటుంది. నీకు ఒక విషయం చెప్తాను. తులనాత్మకంగా, ఇప్పటివరకు నివేదించబడిన కెలాయిడ్ కేసులు కుటుంబాలలో అక్కడొకటి, ఇక్కడొకటి మాత్రమే ఉన్నాయి. వాటన్నిట్లోను ఒక కామన్ లక్షణం ఇంకా కనుక్కోలేదు” అని వివరించాను.
“నాకు తెలిసినంతవరకు, ఈ మచ్చలకు కారణమైన జన్యువులు కొనసాగినప్పటికీ, అవి బయటపడటానికి ఏదైనా గాయం ఏర్పడాలి కదా? అవి సరిగ్గా మెడమీదే ఎలా వస్తాయి? అదీ ఎలాంటి గాయం లేకుండా ఒకే చోట?”
“నీ అనుమానం న్యాయమైనదే.”
“అందుకే నిన్ను పిలిచాను.”
“సరే, గాయం వంటి బాహ్యకారణం ఉండాలి. ఇంతకు ముందు ఈ ఆదివాసీ తెగల్లో ఎవరికైనా ఇలా జరిగి ఉండాలి. ఇది తదుపరి వారసులకు బదిలీ అవుతున్నప్పటికీ, అది బయటపడాలంటే వారికి ఎంతో కొంత గాయం కలగాలి. అందరికీ అదే చోట గాయం తగిలి ఉంటుందనుకోవడం మనలాంటి శాస్త్రవేత్తలకు సబబుగా లేదు.”
జియాద్ మెల్లగా నవ్వాడు.
[3]
మరుసటి రోజు జియాద్ నన్ను తన ల్యాబ్‌లోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఆదివాసీలనుండి సేకరించిన లాలాజలం, దవడ కణాల సేంపిల్స్ ఉన్నాయి. వాటి నుండి డిఎన్ఏను సంగ్రహించడం ద్వారా జీన్ పూల్ సమాచారాన్ని కనుగొనవచ్చు. ఆ సమాచారం ఆధారంగాను, వాడు రాసిన థీసిస్ ఆధారంగానూ నేను ఏదైనా కనుగొంటానని వాడి అంచనా. రోజంతా వాటిని క్షుణ్ణంగా చదివి పరిశీలించాను.
ఆ రాత్రి భోజనం చేస్తూ వాడితో చెప్పాను. “అంతా చదివి నేను కనుగొన్నది దాదాపుగా ఇదివరకు చెప్పినదే. వారి జన్యువులు భిన్నంగా ఉన్నాయి. అంటే జన్యు పరివర్తన జరిగినట్టుగా ఉంది. అవి కెలాయిడ్ మచ్చలను కలిగించే ప్రోటీన్ కణాలలో మార్పులు. నూటికి నూరు శాతం అదే అయుండాలి. అదేవిధంగా, ఈ కొత్త ప్రతులు ‘ఆటోసోమల్ డామినెన్స్’ ద్వారా తరువాతి తరాలకు కొనసాగించబడే లక్షణాలు కలిగినవిగానే కనిపిస్తున్నాయి. అయితే, ఈ జన్యువులు ప్రేరేపణ లేకుండా ఆకస్మికంగా బయటపడే ఈ లక్షణానికిగల కారణాన్ని నేను కనుగొనలేకపోతున్నాను. చూద్దాం…”
“సాధారణ జన్యువు కెలాయిడ్ జన్యువుగా మారడానికి కారణం ఏమిటి?” ప్రశ్నించాడు జియాద్.
“దానికి నేను నా ఆలోచనా పద్ధతిలోనే జవాబిస్తానేమో. మనిషికి గాయం తగిలి అది మానుతున్నప్పుడు, ఆ మచ్చలోని కణజాలం అసాధారణంగా పెరుగుతూ ఉంటుంది, అది పదే పదే జరిగితే, ఆ పెరుగుదల స్వభావం జన్యువులలోకి చొచ్చుకుపోతుంది. జన్యువులు అన్నిసార్లూ తమ ఆధిపత్య ధోరణిలో ఇచ్చుకుంటూ పోవడమే కాదు – తీసుకోవడం కూడా చేస్తుంటాయి కదా? అంతే! కానీ వాటి సహజ లక్షణానికి విరుద్ధంగా ఎందుకలా జరుగుతుందనే ప్రశ్నకు ప్రస్తుతం నా దగ్గర సమాధానం లేదు” అని అన్నాను.
“ఈ ఆదివాసీ గొల్లల తెగకు సంబంధించిన చరిత్ర ఏదైనా ఉందా? వారి పుట్టుకకు సంబంధించిన మానవ శాస్త్రానికి సంబంధించిన రెఫరెన్సులు? ఈ తెగకంటూ ఉండే చిహ్నాలకు సంబంధించినవి ఏవైనా చారిత్రక పత్రాలు లేదా ఆధారాలు ఉన్నాయా?” అడిగాను.
“క్రీస్తు మరణానంతరం ఈ దేశంలో అనేక ప్రత్యామ్నాయ చరిత్రలు పుట్టుకొచ్చాయి. హీబ్రూ భాషలోని జానపద గేయాల్లో ఇవి విభిన్న కథనాలుగా క్రోడీకరించబడి ఉన్నాయి. అయితే, అటువంటి ప్రత్యామ్నాయ చారిత్రక కథల్లో ఏవి నిజాలు, ఏవి కల్పితాలు అన్న తేడాలను గుర్తించడం అసాధ్యం. క్రీస్తు కల్పన మాత్రమే అయుండచ్చు! కాదా? అతని గురించి విస్తృతంగా నమ్ముతున్న కథనాలు, అతను చేసిన అద్భుతాలు ఎంత నిజమో మనం చెప్పలేము. కానీ వాటికి సంబంధించిన చారిత్రక లక్షణాలు, చారిత్రక ఆధారాలు ఈ భూమిలో అక్కడక్కడా విస్తృతంగా ఉన్నాయి. వాటి వల్లే క్రైస్తవ మతం అభివృద్ధి చెందింది, బాగా వ్యాపించింది.
“అలాగే ఈ ప్రత్యామ్నాయ చరిత్రలకు కూడా అవకాశాలున్నాయి. చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ నేలమీదుండే ప్రజలు వాటిని గుర్తించగలరు. అయితే వాళ్ళింకా కళ్ళు తెరుచుకోలేదు. చీకట్లోనే బతుకుతున్నారు. నా ఈ ప్రయత్నం ఆ ఆనవాళ్ళను పట్టుకోవడం కోసమే. ఈ పరిశోధనంతా ఎందుకంటే విజ్ఞాన శాస్త్రంలో దీన్ని నిరూపించగలమా అని తెలుసుకోవడానికొరకే! దీనికి శాస్త్రీయమైన ఋజువులివ్వగలమా లేదా అన్నదానికే తప్ప మరెందుకూ కాదు.
“ఇజ్రాయిల్‌కు చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు, మానవ శాస్త్రవేత్త ఎబ్రేయం యెహోవా ఇలాంటి ప్రత్యామ్నాయ చరిత్రలను సంకలనం చేసి, ‘ది సెకండ్ క్రిస్టియన్స్’ అనే పుస్తకాన్ని వ్రాశారు. ఆ పుస్తకంలో ఈ ఆదివాసి గొల్ల తెగవారి ప్రత్యామ్నాయ చరిత్రకు సంబంధించిన శాసనాలైతే ఉన్నాయి.
“వాళ్ళు యేసు క్రీస్తు తమ వంశంలోనే జన్మించాడు అని నమ్ముతారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. క్రీస్తు మళ్ళీ ప్రాణం పోసుకుని లేచి వచ్చినప్పుడు, వీళ్ళ తెగకు చెందిన ఒక వృద్ధ మహిళ, స్వర్గపు కాంతినిపొంది తిరిగివచ్చిన ఆతని చేతిలో ఒక గొర్రెపిల్లను, మెడపై ఈ మచ్చను చూసిందట. అటువంటి ఒక యేసు క్రీస్తుని వాళ్ళు తమ దేవుడుగా ప్రార్థించారని, దానికి సాక్ష్యం చెప్పే ఒక హీబ్రూ గీతం కూడా ఉందని అతను పేర్కొన్నాడు. ఎబ్రేయం అలా ఒక ప్రత్యామ్నాయ చరిత్రను వివరించాడు. అయితే అది అధికార క్రైస్తవానికి వ్యతిరేకం. కానీ నిజమైన మానవతావాదాన్ని నెలకొలిపే క్రైస్తవత్వానికి సన్నిహితమైనది. వారి శత్రువులు ఈ ప్రత్యామ్నాయ చరిత్రలో ఉన్న లొసుగులనే ఇక్కడి ప్రజల్లో బాగా ప్రచారం చేసి, వాటి ద్వారానే వీరి క్రైస్తవ శక్తి కేంద్రాలను, రాజ్యాన్ని నాశనం చేశారు, బలహీనపరిచారు అన్నది ఆయన పేర్కొన్న వాదన.” వివరించాడు జియాద్.
“మరి క్రీస్తు పెరిగి పెద్దయి జీవించి మరణించిన నేల ఇది. క్రైస్తవమతం అనే మహా గొప్ప మతం ఉద్భవించిన నేల. కానీ ఇక్కడ క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువే!” అన్నాను నేను కొనసాగిస్తూ, “భారతదేశంలో బౌద్ధమతం కూడా ఇలాగే అయింది. భారతదేశంలో పుట్టింది, విస్తరించింది. అది నేడు ఆచరణలో ఉంటూ వర్ధిల్లుతున్నది మరెక్కడో. భారతదేశంలో మాత్రం బౌద్ధాలయాలు అతి స్వల్పమే.”
“అవును. ఉన్న తెగలందరూ ఎవరికివారు తమ స్వంత క్రీస్తును సృష్టించుకుంటే ఏమి జరుగుతుంది? ‘ఒకే దేవుడు’ అనే క్రైస్తవ మత ప్రాథమిక సూత్రం విచ్ఛిన్నం అయిపోతుంది కదా? ఈ విధంగానే ఈ దేశంలో క్రైస్తవ మతం నాశనమైందనే వాదనను యెహోవా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.”
“ఇజ్రాయిల్ అంతా యూదులే. పాలస్తీనా అంతా మీలాంటి అరేబియను ముస్లిములే. క్రైస్తవమతానికి ముందు జుదాయిజం, దాని తర్వాత వచ్చిన ఇస్లాము ఉన్నాయి. మధ్యలో పుట్టిన క్రైస్తవమతం కనుమరుగైపోయింది. నేడు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న క్రైస్తవ మతం యేసువల్ల ప్రాచుర్యం పొందలేదు. అది కేవలం ప్రచారకులు, ప్రబోధకుల వల్లే దినదినాభివృద్ధి చెంది, ఇంత విస్తృతంగా వ్యాప్తిలోకి వస్తూ ఉంది కాబోలు.”
[4]
కల్వరి గుట్టపైనున్న చిన్న గొయ్యి పక్కన రోమన్ సైనికులు యేసుక్రీస్తు మోసుకొచ్చిన శిలువను పడుకోబెట్టారు. అదివరకే అక్కడ ఇద్దరు దొంగలను శిలువ ఎక్కించి కుడి, ఎడమలుగా వాటిని పాతిపెట్టి ఉన్నారు. వాళ్ళిద్దరూ అడవి జంతువుల్లా కేకలేస్తూ ఆర్తనాదాలు చేస్తున్నారు. వాళ్ళ మూలుగులు అరుపుల మధ్య, యేసు క్రీస్తు మోసుకొచ్చిన ఆ శిలువమీదే ఆయనను పడుకోబెట్టారు. ఆయన చేతులకు, కాళ్ళకు మేకులు కొట్టారు రోమన్ సైనికులు. వారిలో ఒకడు ఆ శిలువ పైభాగంలో ఇలా రాశాడు – ‘నజరేయుడైన యేసు. యూదుల రాజు’. అప్పుడు, ఈటెలాంటి గడకర్రతో, యేసును ఛాతీకింద పొడిచి శిలువను పైకి లేపి గోతిలోకి దించారు.
తనను శిలువ ఎక్కిస్తున్న తంతును చూసేందుకు వచ్చిన జనసమూహాన్నంతా యేసు క్రీస్తు ఒక మారు కనులారా చూశారు. వాళ్ళలోని యూదులు ఆయన్ని తిట్టుకుంటూ అక్కడనుండి కదిలి వెళ్ళారు. మిగిలినవాళ్ళ చూపు తనపైనే ఉందని గ్రహించారు. నొప్పితో కళ్ళు మూసుకుని తల వంచుకుని ఉండగా, ఆ గుంపులో ఉన్న ఒక పేద యువతి చూపులు తన ఎడమ వైపున శిలువ ఎక్కించబడిన వ్యక్తిపై నిలవడం యేసు క్రీస్తు గమనించారు. ఆమె గర్భవతి. యేసు ఆమె కోసం తల పైకెత్తి, “పరలోకంలో ఉన్న తండ్రీ” అని ప్రార్థించారు. తర్వాత తల దించుకున్నారు.
‘మీరు మెస్సయ్య అంటకదా? ఏదీ ఇప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకొని మమ్ములనూ కాపాడండీ!’ అని ఒక గొంతు యేసు క్రీస్తుకు ఎడమవైపు నుండి వచ్చింది.
‘నోరు మూసుకోరా మూర్ఖుడా! అతనిని ఇంత నీచంగా మాట్లాడుతున్న నువ్వు నరకానికే పోతావు! నీకు దేవునిమీద విశ్వాసం భయభక్తులు లేవా? ఆయన మనలాంటివాడు కాదు. ఏ తప్పు చేయకుండా శిలువ ఎక్కించబడ్డాడు. మనం చేసిన పాపాలకు శిలువపై వేలాడదీయబడ్డాము. అది మరిచి పోవద్దు’ అని అతని కుడివైపు నుండి వచ్చిన గొంతు సమాధానం ఇచ్చింది.
అవే వారి చివరి వాక్యాలు. మరికొద్ది సేపట్లో వారి ప్రాణాలు వాళ్ళ దేహాలను విడిచి వెళ్ళిపోతాయని యేసుకు తెలుసు.
అప్పుడు ఆయన తన చివరి క్షణాన్ని గ్రహించి, ‘తండ్రీ, ఇదిగో సమాప్తమైనది!’ అంటూ తన ఆత్మను విడిచిపెట్టారు.
[5]
ఆ అంధకారపు ప్రపంచ ప్రవాహంలో దిక్కు తెలియని స్థితిలో అతను ఓ మూలన మోకరిల్లి ఏడుస్తున్నాడు. అతని ఏడుపుతో ఆ చీకటి కొనసాగుతూనే ఉంది. ఈ కన్నీళ్ళను పోగుచేసి వెలిగించుకుని ఒక పగలును సృష్టించుకోలేను కదా? ఈ కన్నీళ్ళే నన్ను చుట్టుముట్టిన చీకటిగా కమ్ముకున్నాయా? అనుకుంటూ గుబులుపడ్డాడు. అప్పుడు అతను తన చెవులను రిక్కించాడు. తన చుట్టూ వేలాది రోదనలు వినిపిస్తున్నాయన్నది గ్రహించాడు. వృద్ధుల నుండి పసిపిల్లల వరకు. పురుషుల నుండి స్త్రీల వరకు. తన ఏడుపు శబ్దంకూడా ఆ గుంపు ఏడుపు శబ్దాల్లో కలిసి కరిగిపోతుంది అనుకున్నాడు. బహుశా కన్నీళ్ళు ఏడుపుయొక్క ద్రవరూపం అయుండాలి!
దూరంగా ఒక చిన్న మెరుపు కాంతి పైకి చిమ్ముతుండటం కనిపించింది. మొదట ఆ కాంతికి కళ్ళు మిరుమిట్లుగొని మూసుకుపోవడం గమనించాడు. అప్పుడు అతని వైపుకు ఆ కాంతి వ్యాపించడం, దగ్గరకు రావడం గమనించాడు. ప్రతి క్షణం అది విస్తరించింది. అప్పుడు తన చుట్టూ వినిపించిన రోదనలు, ఆక్రందనలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టుతుండటం అతను గ్రహించాడు.
ఒకానొక దశలో అతనికి వినిపిస్తున్నది అతని రోదన మాత్రమే. అది అతనికి మరింత భయాన్ని కలిగించింది. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. తనని ఏదీ దరిచేరకుండా తననితాను బంధించుకున్నాడు. అయినప్పటికీ, తన ముందు ఆ కాంతి వెలుగుతుండటాన్ని అతను గ్రహించాడు. మనస్సుకు గడియలేదన్న సంగతి అతను ఎరుగడు.
“ఎవరు? ఎవరది?” అన్నాడు.
ఒంటిమీద తెల్లటి వస్త్రం, భుజాలపైకి జారిన ఎర్రటి జుట్టు, చిన్న గడ్డంతో ఆయన నిలబడి ఉన్నారు. ఆయన కళ్ళలో ప్రవహిస్తున్నదేంటి? అతనికి అర్థం కాలేదు.
“నీ శోకమే నన్ను ఇక్కడికి పిలిచింది. ఏడవకు.”
“నా ఏడుపు మీకు ఎలా వినిపించింది?”
“ఆర్తనాదం వినిపించేంత దూరానే నా ఆకాశం ఉన్నది.”
“అయితే మీరు ఎవరు?” అన్నాడు.
“యేసు.”
“ఏ యేసు? పరలోకంలోనుండే యేసుప్రభువా? మానవరూపంలో భూలోకానికి దిగి వచ్చిన దేవుని కుమారులు, ఈరోజు నా మొర విని ఈ చీకటిలోకానికి దిగివచ్చారా? సరే, అలాగే కానివ్వండి. ఒక సందేహం. మీరు దేవుని కుమారులని సందేశాలిస్తుంటారు. మరి అలాంటప్పుడు మిమ్మల్ని మీరు మానవకుమారునిగా ప్రకటించుకుంటారెందుకని? ఏమిటీ ఈ టక్కరితనం?”
ఆయన దేనికీ సమాధానం చెప్పలేదు.
“జడరూపంలా నిల్చున్నారేం? నోరు తెరిచి చెప్పండి! వేడుక చూసిపోడానికి వచ్చారా? లేదా ఇక్కడ నుండి నన్ను రక్షించడానికి వచ్చారా?” అతను నిభాయించుకోలేకపోయాడు. “నా దుస్థితిని చూడండి! కల్వరి కొండ గుహలోని చీకటి కంటే, ఈ చీకటి ప్రపంచం కంటే ఘోరమైనది నా దుఃఖం!” అతను కొనసాగించాడు. “నేను నిన్ను ప్రపంచంలోని అత్యున్నత స్థానానికి ఎక్కిస్తానని మీ విశ్వాసులతో చెప్తుంటారు కదా? నేను అడుగుతున్నాను – ఏదయ్యా, ఉన్నత స్థానం? మీ ముందు మోకరిల్లడమా? వారు ఏమి పొందబోతున్నారు? మహా అయితే ‘మోకరిల్లడం’, కాదని ధిక్కరిస్తే శిలువకు వేలాడదీస్తారు. నేను ఇప్పుడు వాళ్ళకు చెప్తాను – మీ ముందు మోకరిల్లడం కంటే శిలువెక్కించడం మేలని!”
ఆయన అతనిని తీక్షణంగా చూస్తూ ఉండిపోయారు.
“నాలాంటి అవిశ్వాసులకు మీ మనసులో చోటు లేదని నేనెరుగుదును” అన్నాడు.
“మనిషి మనస్సులో తలెత్తే ఇటువంటి ఆలోచనలు, వాటినుండి పుట్టుకొచ్చే సామూహిక తర్కాల ఫలితమే నేను. ఇప్పుడు నన్ను అర్థం చేసుకోవడానికి నీకు ఇది సరిపోతుందనుకుంటాను” అన్న యేసు “నువ్వు ఎవరివి?” అని అడిగారు.
“ఇది దుర్మార్గం! నేనెవరినో ఎరుగని అజ్ఞానులా మీరు? నేనెవరో చెప్తాను. నా ఈ గొంతు గుర్తు లేదా? నిన్న విన్నారు కదా? మీ ఎడమ వైపు శిలువ ఎక్కించబడిన దొంగని నేనే. నా పేరు గెస్టాస్. నా జీవితంలో మిమ్ములను ఎప్పుడూ చూడకూడదని అనుకున్నాను. కానీ అది జరగలేదు. నేను మీతో పాటే నిన్న శిలువలో ఎక్కించబడ్డాను. నేడు ఈ చీకటి ప్రపంచంలో నేను మీ సామీప్యంలో రోదిస్తున్నాను. ఇదంతా ఎక్కడో రాసిపెట్టి ఉంది!”
ఎదురుగా ఉన్న యేసు కనుబొమ్మలు ఎగరేశారు.
“ఏం చూస్తున్నారు? చెప్తాను వినండి. చేసిన పాపం గురించి నేను పశ్చాత్తాప పడలేదని కదా మీ కుడివైపు శిలువ ఎక్కించబడిన నాలాంటి మరొక దొంగ డిస్మాస్, ‘నీవు నీచుడవు, నేరుగా కఠోర నరకానికి పోతావు’ అని అన్నాడు. నేను చెప్తున్నాను. అది నా తప్పు కాదు. మీరు చేసిన పాపం అది! మీ జన్మ నెపంతో జరిగిన పాపకార్యం. నా జీవితమంతా ఆ పాపంయొక్క ఫలితమే. దానికి నేను ఎందుకు బాధ్యత వహించాలి? అదొక్కటే నేను మీ ముందు ఉంచదలచిన ప్రశ్న! నాకు మీ రక్షణ వద్దు, మరేమీ కూడా వద్దు. కేవలం ఈ ప్రశ్నకు సమాధానం కావాలంతే.
“మీ అవతారం కొరకు ఏర్పడిన రక్తపు మరకను తుడిచేందుకే మీరు ఆ జన్మనంతా ఖర్చుపెట్టారు. ఇందులో నేనేం తప్పు చేశాను? ఆ చిన్నపిల్లలు ఏం తప్పు చేశారు? ‘లోకరక్షకుడు’ అని పిలవబడే మీరు జన్మించినప్పుడు, ‘పవిత్రత’ పుట్టిందని అంటున్నారు. నిజానికి పాపం మీతోనే పుట్టింది. హేరోదు రాజు, మీరు జన్మించిన సంగతి తెలుసుకొని, తన దేశంలోని రెండేళ్ళ లోపున్న మగ శిశువులందరినీ తన ఖడ్గానికి బలిచ్చాడు! మీ పేరుతో, మీ వల్ల ప్రాణాలు తీయబడిన ఆ వేలాదిమంది పిల్లల సంగతేంటి? వాళ్ళలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్న ఏకైక పిల్లవాడిని నేను!
“మీ పవిత్రత రూపురేఖలు దిద్దుకోక ముందే మీ పాపపు నిప్పుకణం జ్వాలలుగా ఎగసి కాల్చేయడం ప్రారంభించింది. ఒక పుణ్యాత్ముడి పుట్టుక ఎందుకు మరొకడిలో అంత ఆగ్రహాగ్నిని రగిలించాలి? ఇదేనా పవిత్రత అంటే? పవిత్రతను గుర్తించాలంటే దాన్ని ఒక పాతకచర్యతో పోల్చుకుని మాత్రమే గొప్పదని గుర్తించాలా ఏంటి? ‘యేసు’ అంత పవిత్రుడే అయితే, హేరోదు రాజు మనసులో కలిగిన ఆ ‘పాడు ఆలోచన’ ఒక మహాపాపం. ముమ్మాటికీ ఆ పాపానికి మీరే బాధ్యులు!” అన్నాడు.
“అదంతా మిమ్మల్ని మీరు ప్రకటించుకోడానికి మీరే సూత్రధారిగా ఉండి నడిపించిన నాటకం! పాపభరితమైన ఒక ఘోరహింసా నాటకాన్ని ప్రదర్శించి మీకు మీరే పునీతులన్న బిరుదును కల్పించుకున్నారు. ఒక మొగ్గ పువ్వుగా వికసించినంత సున్నితంగా, ఆర్భాటాలు లేకుండా మీ అవతారం సంభవించి ప్రపంచ పాపాలన్నిటినీ మీ భుజాల మీద వేసుకుని ఎందుకు ప్రక్షాళన చేసి ఉండకూడదు? మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? ‘మీ అవతారం వల్ల ఏర్పడిన ఆ పసిపిల్లల రక్తపు మరకలను కడగటానికే మీ శేషజీవితమంతా గడిపారు’ అని నేను నిరూపించగలను! అందుకే మీరు శిలువెక్కారు. మేకులు దిగిన మీ చేతులను ఒక మారు వాసన చూడండి, దేవా! ఆ పసిబిడ్డల రక్తపు వాసనే ఉంటుందందులో. ఆ పాపాలనుండి మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకోడానికే ఒక జన్మ సరిపోదు. అటువంటిది ప్రపంచ రక్షణ, పాప పరిహారాలు, మోక్షం ఎలా సాధ్యం?
“నేను ఆ ఘోర మారణకాండనుండి తప్పించుకుని బతికి బట్టకట్టిన విధానాన్ని ఎలా వర్ణించగలను? ఇదిగో నా మెడమీదున్న ఈ మచ్చను చూడండి. హేరోదు రాజు శాసించిన రోమన్ సైనికులలో ఒక సైనికుడి కత్తి చేసింది నా మెడ మీదున్న ఈ గాయాన్ని. నాకంటే ముందు ఆ సైనికుడి కత్తికి ఎంతమంది పిల్లలు బలయ్యి ఆ కత్తి పదును కోల్పోయి మొద్దుబారిందో!”
యేసు అతను చూపించిన గాయపు మచ్చను చూశారు. కుడివైపు మెడభాగంలో చెవితమ్మె క్రింద మొదలై భుజం వరకు విస్తరించి ఉన్న గాయపు మచ్చ. మచ్చ బాగా ఉబ్బి కాయగాసిపోయుంది.
అతను చెప్పడం కొనసాగించాడు. “నన్ను ఒక మంత్రగాడు పెంచాడు. నా పుట్టుక గురించి నాకు అతనే చెప్పాడు. అతనికి నేను నా ఆరవ ఏట దొరికానట. ఎక్కడో యూదా ఎడారిలో, మండుటెండలో, కాగుతున్న ఇసుకలో అతను అటుగా వెళ్తున్నప్పుడు తోడేళ్ళ అరుపు వినిపించిందట. సమీపంలోని నాగతాలి పొదల నీడలో తోడేళ్ళ గుంపు నిలబడి ఉన్నదట. అతని రాకను గమనించిన ఆ తోడేళ్ళు నాలుగువైపులకూ చెల్లాచెదురుగా పరుగులు తీశాయట. కానీ ఒక్క తోడేలు మాత్రం తడబడుతూ మెల్లగా పరిగెడుతోందట – దాని అరుపు కూడా వింతగా ఉండటం పసిగట్టి అతను ఆ తోడేలును వెంబడించాడట! పారిపోతూనే దానిమీదొక రాయి విసిరాడట. దగ్గరికెళ్ళి చూస్తే చేతులు కూడా కాళ్ళుగా భావించుకుని పరిగెట్టే ప్రయత్నం చేస్తున్న ఓ చిన్న పిల్లాడు! అది మరెవరో కాదు – నేనే.
“నన్ను తనతో తీసుకువెళ్ళి పెంచాడు. దోసిట్లో నది నీళ్ళను పట్టుకుంటే నది మూలాన్ని కనిపెట్టే ఉపాయం తెలిసినవాడట. ఆ విషయాన్ని అతనే నాకు చెప్పాడు. అతనే నా జన్మవృత్తాంతాన్ని గణించి చెప్పాడు. హేరోదు రాజు పవిత్ర శిశువు ‘యేసు’కి భయపడి, బెత్లెహేమ్ పరిసరాల్లో రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందర్నీ చంపేశాడట. వాళ్ళలో తప్పించుకుని బతికిన పిల్లాడిని నేను అని చెప్పాడు.
“ఒక రోమన్ సైనికుడు మీ ఇంట్లోకి చొరబడి, మీ తల్లిదండ్రుల నుండి నిన్ను లాక్కొని, ఏదో ఒక వీధిలో పైకి విసిరి, అతని కత్తికి నిన్ను బలి చేయాలని ప్రయత్నించి ఉంటాడు. కానీ, అదృష్టవశాత్తూ, అతని కత్తి నీ మెడపై సరిగ్గా దిగలేదు. నువ్వు ఆ వీధిలో కొనప్రాణాలతో పడి ఉన్నావు. బెత్లెహేమ్ నగరం పసిపిల్లల రక్తంలో తేలింది. ఆ రక్తపు వాసనను పసిగట్టి చుట్టుపక్కల ఎడారుల్లోని తోడేళ్ళంతా ఆ నగరంలోకి చొరబడ్డాయి.
“ఆ తోడేళ్ళు పసిపిల్లల శవాలను వాసన పీలుస్తూ, శరీరం నుండి కారుతున్న రక్తాన్ని నాకుతూ జుర్రుకుంటూ శవాలను ఎడారికి ఈడ్చుకెళ్ళాయి. ఆ శవాలను పీకి, కొరికి ఇతర తోడేళ్ళతో పంచుకుంటూ తిన్నాయి. అలా నిన్ను ఒక పిల్లలతల్లి తోడేలు లాక్కెళ్ళింది. నువ్వు చావలేదు బతికే ఉన్నావని దానికి తెలిసిందో ఏమో! నిన్ను దూరంగా లాక్కెళ్ళిపోయి తానూ తినకుండా, ఇతర తోడేళ్ళూ తినకుండా కాపాడింది. నీ మెడమీద గాయాన్ని తన నాలుకతో నాకినాకి గాయాన్ని మాన్పింది. తన పిల్లలతోబాటూ నీకు తన రొమ్మిచ్చి తన పాలతో నీ పొట్ట నింపింది.
“ఈ కథంతా అతను నా పదిహేనవ ఏట చెప్పాడు. అప్పటిదాకా నన్ను తన ఇంట్లో ఒక జంతువులానే కట్టివేసి పెంచాడు. ఆ ఊరివాళ్ళందరూ ‘మాయలు చేసి తోడేలును మనిషిగా మార్చి ఇంట్లో ఉంచుకున్నాడు’ అని అనుకునేవారట. ‘వాడు ఒక మాయల మాంత్రికుడు. దేనికైనా తెగిస్తాడు, ఏదైనా చేస్తాడు’ అంటూ ఊరిలో ప్రజలందరూ దూషించేవారట. దాంతో మరో మార్గం లేక ఊరు వదిలి జనావాసాలు లేని కఠోరమైన ఎడారిలో నివసించసాగాడు. అతనికి ఒక చిన్న కూతురు ఉండేది. అతని భార్య నేను అతనికి దొరక్క ముందే చనిపోయింది. తన కూతురుని తీసుకుని, నన్ను కూడా ఈడ్చుకువెళ్ళాడు. పాపతోబాటు నన్నూ పెంచాడు.
“మెల్లమెల్లగా నాకు రెండు కాళ్ళతో ఎలా నడవాలో, అమాంతం ఆహారంలోకి నోటిని ముంచేయకుండా చేతులతో తీసుకొని ఎలా తినాలో నేర్పాడు. బట్టలు వేసుకోవడం, మాట్లాడటం వంటివి అలవాటు చేశాడు. పదిహేనేళ్ళ వయసొచ్చాకగానీ నేను పూర్తిగా మనిషిలా మారలేకపోయాను.
“కానీ అతను మొదటి నుండి నాలో ఉన్న తోడేలు స్వభావాన్ని, ప్రవర్తనలనీ తనకు అనుకూలంగా వాడుకున్నాడు. నా చేత తోడేలులాగా అరిపించి ఎడారుల్లో వెళ్ళే బాటసారులను దారి మళ్ళించి ఒంటరులను చేసి వాళ్ళ దగ్గరున్న సొమ్మును దోచుకుంటూ ఉండేవాడు. నేను తోడేలులా కేకలు పెట్టలేదంటే చర్నాకోలతో కొట్టి హింసించేవాడు. దెబ్బలకు భయపడి నేను తోడేలులా అరిచేవాణ్ణి. ఒక్కోసారి నేనే ఎంతోమంది మనుషులను తోడేలులాగా వాళ్ళమీదకు ఉరికి భయాందోళనలకు గురిచేసి రక్కి, చీల్చేసేవాణ్ణి.
“అయితే అతనిక్కూడా మీ గురించిన విశేషాలెన్నో వార్తలుగా తెలుస్తుండేవి. మీరు భూలోకంలో అవతరించిన పుణ్యాత్ములని, లోకాన్ని రక్షించేందుకు పరలోకంలో నుండి ఆ తండ్రి పంపిన దేవదూత అని, ఎన్నో అద్భుతాలు చేస్తున్నారని చెబుతూ ఉండేవాడు. మిమ్మల్ని అడగటానికి అతని దగ్గర ఒక ప్రశ్న ఉండేది. ఎలాగైనా మిమ్మల్ని కలుసుకుని ఆ ప్రశ్న అడిగి తీరాలని చెప్తుండేవాడు.
“ఆ తర్వాత కొంతకాలమే జీవించాడు. అతను చనిపోయే ముందు తన కూతురికి ఎల్లప్పుడూ అండగా ఉండి కాపాడమని కోరాడు. అతను చనిపోయాక నాకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఎలా బ్రతకాలి? ఎలా పొట్ట నింపుకోవాలి? ఊరివాళ్ళను సాయం కోరితే ‘వీడు మంత్రగాడు పెంచిన మనిషి తోడేలు’ అని తరిమేవాళ్ళు. నా మీద ఉమ్మేవాళ్ళు, రాళ్ళతో కొట్టేవాళ్ళు. నా అవలక్షణమైన ఆకారం వాళ్ళకు అసహ్యం కలిగించింది. నేను కనిపిస్తే తరిమి కొట్టేవాళ్ళు. ఏ వీధిలో చూసినా, ప్రతి ఇంటి ముందూ నా మీద రువ్వడానికి ఒక రాళ్ళ కుప్ప ఉండేది.
“ఒకానొక దశలో నేను వాళ్ళనుండి ఎలాంటి దయా జాలీ ఆశించలేదు. నేను దిక్కులేనివాడిగా వీధిన పడ్డాను. నాకు దొరికేదంతా కేవలం రాళ్ళదెబ్బలు మాత్రమే. ఒళ్ళంతా నెత్తుటితో, చీము పట్టిన దేహంతో నేను ఇంటికి తిరిగి వచ్చి మంత్రగాడి కూతురిని మూర్ఖంగా బలాత్కారం చేసేవాణ్ణి. ఆ భోగసమయాల్లో మాత్రమే నా దేహం మీద తగిలిన రాళ్ళ దెబ్బల నొప్పిని అనుభవించేవాడిని. ఆ బాధ స్పృహకు వచ్చే క్షణాల్లో నాలో జంతు ప్రవృత్తి తీవ్రంగా ఉప్పొంగేది. నేను కోల్పోయిన లేదా నేను కోల్పోయినట్టు భావించిన నా పాత జంతు క్రూరత్వం తిరిగి పొందటానికి సహాయపడిన క్షణాలవి. అంతకు ముందు నాకు తెలియకనే నాలో ఉన్న మృగలక్షణం, క్రూరత్వం కంటే కూడా దాన్ని ఎలా వాడుకోవచ్చో అని తెలుసుకున్నాక అది నన్ను పిచ్చివాణ్ణి చేసింది. నేను మళ్ళీ తోడేలుగా మారిపోయాను. ఆ యూదా ఎడారిలో నేను తిరగని దారిలేదు, నాకు తెలియని చోటంటూ ఏదీ మిగల్లేదు. దయాదాక్షిణ్యం లేకుండా అటుగా వెళ్ళే బాటసారులపై దాడి చేశాను. పీడించుకుతిన్నాను. దోచుకున్నాను. అది నా దినచర్యగా మారింది” అని ముగించాడు.
యేసు ఓపికగా అతని కథను వింటున్నారు. ఆయన వేసుకుని ఉన్న తెల్లటి వస్త్రంలో ఛాతీకి దగ్గర ఒక చిన్న కదలిక కనిపించింది. ఒక్క క్షణం అది ఆయన హృదయస్పందన అని భ్రమ కలిగింది. మరుక్షణం ఆ మాయా కదలిక మెడను పైకి చాచింది. అది స్వచ్ఛమైన ఒక తెల్లటి గొర్రెపిల్ల. ఆయన ఆ గొర్రెపిల్ల తలను నిమురుతూనే ఉన్నాడు.
అప్పుడు ఆయన తల వెనక్కి వాల్చి ఆకాశానికేసి చూస్తూ కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. “ఇది తండ్రి ఆజ్ఞ” అని చెప్తూ ఉండగానే యేసు చేతుల్లో ఉన్న గొర్రె అతని చేతుల్లోకి దూకేసింది. అప్పుడు ఆయన, “నేనుగా గుర్తింపబడే నేను ఇకపై నేను కాను” అని పైకేసి చూపుతున్న ఆయన కుడిచేతి చూపుడు వేలు, అతని వైపుకు చూపిస్తుండటం చూశాడు.
ఆ వేలు అతనికేసి పూర్తిగా తిరగక ముందే ఆయన చుట్టూ ఉన్న కాంతి పుంజం మసకబారడం మొదలైంది. క్రీస్తు అతని కళ్ళముందే అదృశ్యమయ్యారు. అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు గెస్టాస్ చుట్టూ ఒక కాంతి కనిపించింది. అది విస్తరించింది. ఆ కాంతి అతన్ని స్వర్గానికి చేర్చింది. అతను తన ఒడిలో ఉన్న ఆ గొర్రెపిల్ల తలను నిమరసాగాడు. క్రీస్తు నిమిరిన ఆ వెచ్చదనపు ఛాయలు ఇంకా ఆ గొర్రెపిల్ల తలపై ఉండటాన్ని అనుభూతి చెందాడు. అతను చీకటి ప్రపంచాన్ని దాటాడు. ఆయన భూమిని చేరారు. భూలోకపు ప్రజలందరూ అప్పుడు, ‘యేసు ప్రాణాలతో లేచొచ్చారు. యేసు మళ్ళీ బతికారు’ అని ఆనందంగా అరుస్తూ ఉన్నారు. ఎంతో సంతోషంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. గెస్టాస్ స్వర్గానికి చేరుకున్నాడు.
[6]
జియాద్ నాకు కథ చెప్పడం పూర్తి చేశాడు. నా కళ్ళనుండి నీళ్ళు కారడం గమనించాడు. నేను ఆ ఆదివాసీ గొల్లవారిని ఇప్పుడే చూసితీరాలి అని తొందర పెట్టాను.
“కాస్త ఆగు. ఇప్పుడు సాయంత్రం కావస్తుంది. నేను నిన్ను రేపు తీసుకెళ్తాను” అన్నాడు.
“రేపు కాదు. ఈవాళే వెళ్ళాలి. ఇప్పుడే వెళ్దామని” ప్రాధేయపడ్డాను. ఆ ఆదివాసీల గ్రామానికి చేరుకోవాలంటే గంటకు పైగా సమయం పడుతుందన్నాడు. “పర్వాలేదు, వెళ్దాం” అన్నాను.
మేము జియాద్ కారులో బయలుదేరాము. ఎడారిలో ప్రయాణం. వెళ్ళిన కొద్దీ శూన్యం కనుచూపుమేరకు విస్తరించుకుంటూ ముందుకు సాగుతోంది. వాడు నా కలత కళ్ళను చూస్తూనే కారు నడుపుతున్నాడు. నా ముందు అంతులేని దూరాలకు విస్తరించి ఉన్న ఆ శూన్యాన్ని చూస్తున్నాను. నా కళ్ళలో వెలుగు లేదు.
ఉన్నట్టుండి కారు ఆపాడు. కారు ముందు ఒక గొర్రెల మంద వెళుతోంది. జియాద్ నా వైపు చూశాడు. కారు కిటికీని కిందికి దించి, దూరంగా ఇసుక తిన్నెమీద నిలబడి ఉన్న గొర్రెల కాపరికేసి చూశాడు. నేను కూడా అతనిని చూశాను. నేను వెంటనే కారు దిగి ఇసుక తిన్నె వైపుకు పరుగుతీశాను.
జియాద్ నా వెనక అరుస్తున్న ఆ మాటలేవీ నా తలలోకి చేరలేదు. నా పిక్కలదాకా దిగబడుతున్న ఇసుకలో నేను వేగంగా పరిగెత్తాను. చెమటలు కక్కుతూ ఊపిరి పీల్చుకుంటూ ఇసుక తిన్నెమీద నిలబడి ఉన్న ఆ కాపరిని సమీపించాను. నేను అతని చేతిలో ఒక గడకర్ర ఉండటం గమనించాను. అతని మెడ మీదున్న ఆ మచ్చ చూశాను. నేను అతని ముందు పూడుకుపోతున్న ఇసుకలో మోకరిల్లి, నా ఛాతీపై రెండు చేతులు జోడించి ప్రార్థించాను. మందలోని గొర్రెలు మా ఇద్దరినీ దాటుకుంటూ ఆ ఇసుక తిన్నెను దాటుకుంటున్నాయి.
జియాద్ కారు దగ్గరే నిలబడి ఉన్నాడు. ఇసుకలో కూరుకుపోతూ నేను మోకాళ్ళపై పడి ఏడుస్తుంటే గొర్రెల మంద మా చుట్టూ బిలబిలమని సాగిపోతున్నాయి. ఆ గొర్రెలకాపరి ఏమీ తోచనివాడిలా చూస్తూ నిల్చుని ఉన్నాడు, నా వెనుక మరో ఇసుకతిన్నె కవతల అస్తమిస్తున్న సూర్యుడిని గమనిస్తున్నాడు.
[7]
మరుసటి రోజు నేను ఎక్కువగా మాట్లాడలేదు.
“ఫ్రాంకో, ఏమైంది?” అని అడిగాడు జియాద్. నేను సమాధానం చెప్పలేదు.
నేను అతని ల్యాబ్‌లోకి వెళ్ళాను. రోజంతా అక్కడే ఒంటరిగా గడిపాను. పిచ్చివాడిలాగా! నా పిచ్చితనాన్ని నేనే పెంపొందించుకుంటూ ఉన్నాను. ఇదివరకు చూసిన అవే జన్యు కాపీలను మళ్ళీ మళ్ళీ తిరగేశాను.
ఆ రోజు రాత్రి వాడి దగ్గరకొచ్చి చెప్పాను. “నేను దాని సంగతేంటో కనిపెట్టేశాను.”
“ఏమంటున్నావు?”
“అవును. దానికి కారణం కనుక్కున్నాను. నాకు ఫట్టుమని వెలిగింది. నేను ఆ ఆదివాసీ తెగల జన్యు ఆకృతిని పదే పదే పరీక్షగా చూస్తూ ఉన్నాను. నేను వాటిలో ఒక కొత్త విషయాన్ని కనుగొన్నాను. వాళ్ళ జన్యువులు కేవలం బాహ్యజన్యు పరివర్తనకు (ఎపిజెనిటికి మ్యూటేషన్) మాత్రమే గురవ్వలేదు; బాహ్యజన్యు సవరణకు (ఎపిజెనిటిక్ మాడిఫికేషన్) కూడా గురయ్యాయి.”
జియాద్ మాట్లాడకుండా ఉండిపోయాడు.
“ఇది జన్యు పరివర్తనలాంటి బలమైన, స్థిరమైన పరివర్తన కాదు. ఒక చిన్న మార్పు. ఇది చిన్న మరకలా అంటుకునే అణువులవల్ల సంభవిస్తుంది. ఇటువంటి మార్పులు అంతర్గత కారణాల వల్ల సంభవిస్తాయి. ఆ అంతర్గత కారణం ఏమిటో తెలుసా? పర్సనల్ ట్రామా అనబడే బలమైన మానసిక వేదన. శరీరంలో బైటవి లోనివీ నొప్పులన్నీ కలగలిసి కలిగించే బాధాకరమైన ఆవేదన. నిరంతర బాధలు కూడా మన జన్యువుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి, అవి జన్యువుల్లోకి చేరిపోతాయి. కానీ అవి జన్యువు యొక్క ప్రతిని మార్చవు. ఒక అణువు దాన్ని తనలోకి ఇముడ్చుకుంటుందంతే. దీన్ని ‘ఎపిజెనెటిక్స్’ శాస్త్రం ఈ రకంగానే నిర్వచిస్తుంది. ఇలాంటి బాహ్యజన్యు మార్పు ఇంతకు ముందు కూడా జరిగింది. అది నమోదు చేశారు. దీనిపై నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి.
“రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకుకూడా అది జరిగింది. వారు అనుభవించిన చిత్రహింసలు, పడిన బాధలు వాళ్ళ జన్యువులపై మానని మచ్చలను మిగిల్చాయి. తీవ్రమైన మనోవేదనకు గురయిన ఆ గాయాల మచ్చలు వారి తరువాతి తరానికి కూడా వచ్చి చేరాయి. ఆ జన్యు నమూనాలను ఆధారంగా చేసుకునే నేను వీటిని విశ్లేషించాను.”
[8]
న్యూఢిల్లీలోని నా అపార్ట్‌మెంట్‌కు అర్ధరాత్రి దాటాక చేరుకున్నాను. నేను తలుపు తెరిచి లోపలికి వచ్చి చీకట్లో స్విచ్ కోసం తడబడుతూ యాదృచ్ఛికంగా చూశాను. నా ఇంటి గోడకు వేలాడుతున్న జీసస్ మీద బయటి నుండి వచ్చి పడుతున్న సన్నటి కాంతిలో, పైకి చూపాల్సిన ఆయన కుడి చేతి చూపుడు వేలు నా వైపు చూపుతున్నట్లు అనిపించింది.
(మూలం: అదు నీ, ఫిబ్రవరి, 2021.)
[లోకేశ్ రఘురామన్: ఆయన స్వస్థలం తిరువారూర్ జిల్లాలోని నాడాగుడి. బెంగుళూరులో ఐటీ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. సొల్వనం, తమిళిని, నడు, వఃం, అరూ, కనలి వంటి పత్రికల్లో ఈయన కథలు వెలువడ్డాయి. ఈ యువ రచయిత రాసిన పది కథలు ‘విష్ణు వందార్’ (2022, డిశెంబర్) అనే సంపుటంగా వెలువడి 2024వ సంవత్సరానికిగానూ సాహిత్య అకాడెమీ యువ పురస్కార బిరుదును తెచ్చిపెట్టింది.]