శక్తిర్నిపుణాలోక శాస్త్ర కావ్యాద్య వేక్షణాత్
కావ్యాజ్ఞ శిక్షయాభ్యాస ఇతి హేతుస్తదుద్భవే
మమ్మటుడనే ఆలంకారికుడు కావ్యం పుట్టడానికి అవసరమైన లక్షణాలుగా ఇవి కవికి ఉండాలని చెప్పేడు. చిన్నప్పుడు (మరీ చిన్నప్పుడు కాదు) చదువుకున్న ఈ శ్లోకం ఏ సాహిత్య రచన చదువుతూ ఉన్నా నా మనసులో మెదులుతూ ఉంటుంది. లోక, శాస్త్ర, కావ్యాల పరిశీలన రచయితకు ఎంతగా ఉంటే ఆ రచనలు అంతగా రాణిస్తాయి. వాటికి కావ్యత్వ గౌరవం వస్తుంది. అది కాలమ్ కథలయినా సరే, కథయినా, నవలయినా ఏదయినా సరే. ఇటువంటి అవేక్షణ శ్రీ కాశీభట్ల వేణుగోపాల్‌కి ఉన్నట్టు ఆయన రచనలు చదువుతూంటే తెలుస్తూ ఉంటుంది.
‘మనిషి పరిపూర్ణుడిగా ఎప్పుడు అనుభూతి చెందుతాడంటే తనను తాను అనంత విశ్వంగానూ, ఓ తీరం లేని మహాసముద్రంగానూ ఎప్పుడు భావిస్తాడో అప్పుడు.‘
పై వాక్యాలు కాలం కథలు పుస్తకంలోని పరిపూర్ణత అనే శీర్షికలోని వాక్యాలు. పరిపూర్ణత గురించి ఖలీల్ జిబ్రాన్ అన్న మాటలు ఉదాహరిస్తూ వేణుగోపాల్ ఇలా రాశారు. సృష్టిలో మామూలు మనుషుల దగ్గర్నుంచి గొప్ప కళాకారులు, మహానుభావులయిన వ్యక్తుల వరకూ ఎవరిలోనూ పరిపూర్ణత ఉండదని కాకపోతే శాతాలు తేడాగా ఉంటాయని చెప్తూ, నిజమయిన పరిపూర్ణత అంటే ఏమిటో చెప్పడానికి ఖలీల్ జిబ్రాన్‌ను కోట్ చేశారు.
అయితే ఎంతో కొంత ఈ ఎఱుక ఉన్న ప్రతి వ్యక్తీ ప్రతి కళాకారుడూ కూడా పరిపూర్ణత కోసం తపిస్తారు. సాధన చేస్తారు. తగినంత సాధన చెయ్యలేకపోయినా పరిపూర్ణత కోసం అశాంతిచెందుతూ ఉంటారు.
అదిగో! అటువంటి తపనా, సాధనా మనకు ఈ కాలం కథల్లో ఎన్నోచోట్ల కనిపిస్తూ ఉన్నాయి.
కథలూ, నవలలూ రాయడం ఒక ఎత్తు. కాలమ్ రచన మరొక ఎత్తూ. కాలమ్ రాస్తున్నవాళ్ళు మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మరింత చైతన్యంతో ఉన్నారనిపిస్తుంది.
అలా ఉండడంలో మామూలుగా చూడని ఎన్నో రంగులూ, రేఖలూ మరింత స్పష్టంగా కనిపించి అక్షరాల్లోకి ఒదిగిపోతూ ఉంటాయి.
అలా ఒదిగిన పెద్ద ప్రపంచం ఈ పుస్తకంలోని అక్షరాలలో ఉంది. ఇవి చదువుతున్నప్పుడు కొండని అద్దంలో చూపించేలాంటి పని జరిగినట్టనిపిస్తుంది.
ఇంకా ఈ కథలలోంచి వినిపించే వేణుగోపాల్ స్వరం మరింత ప్రత్యేకంగా ఉంది. అన్ని హద్దుల మధ్య ఉంటూ, వాస్తవ జీవనంలోని సంగీతాన్ని వింటూ, ఒడిదుడుకుల జీవన ప్రయాణాన్ని ఉన్నదున్నట్టుగా అంగీకరించుకుంటూ, భారంగానే అయినా ఇష్టంగా చెప్తున్న స్వరం ఇది. అదే దీని ప్రత్యేకత.
2
కాశీభట్ల వేణుగోపాల్ అన్న పేరు చుట్టూ చిత్రమయిన ఇమేజ్ ఉంది. ఉన్నతమైన సాహిత్య జ్ఞానం, సంపన్నమయిన అభిరుచులతోపాటు, లౌకికమయిన మర్యాదలను – మర్యాదలు కాదు, కుహనా మర్యాదలు – లెక్యచెయ్యని నిర్లక్ష్యపు ధోరణి కూడా కలగలిసిన ఇమేజ్ అది.
కానీ ఈ పుస్తకంలో ఆయన రాసుకున్న తన జీవిత కథల శకలాలు చదివినప్పుడు కాశీభట్ల వేణుగోపాల్ అన్న అసలు వ్యక్తి యొక్క పరిచయం కూడా దొరుకుతుంది.
కథలుగా, నవలలుగా వచ్చిన సాహిత్యం వెనుక నుంచి రచయిత అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు. పాఠకుడు తన సహజమయిన కుతూహలంతో, ఎంతో కొంత ఆ రచయిత గురించి ఊహించి తన ఊహలో ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు కూడా. కానీ లోకపు దుమ్ముకి దూరంగా ఉండి, లోకపు రీతి-రివాజులకు భిన్నంగా జీవించగలుగుతూ, మరీ ముఖ్యంగా దాపరికం లేకుండా తెరిచిన పేజీలా ఉండే రచయిత పాఠకుడికి ఓ పజిల్‌లా ఉంటాడు. వేణుగోపాల్ అనే రచయిత అలా ఓ పజిల్.
కానీ కాలం కథల్లో వేణుగోపాల్ తన పజిల్‌ను తానే విప్పేశారు. భాషలో, భావంలో, భావ ప్రకటనలో అంతటా ఎంతో సరళంగా, స్పష్టంగా ఉన్నారు. తన రాతలూ, తన జీవన విధానమూ, తన మాటలూ, ప్రతి ఒక్కదాని పట్ల స్పష్టమయిన అవగాహనతో ఉన్నారనే విషయం తెలిసేలా ఉన్నారు. తను చూస్తున్న లోకం పట్ల ఎంతో దయతో, మరెంతో కరుణతో కరుగుతూ, ఆ లోకానికి దగ్గరవుతూ ఉన్నారు.
3
వేణుగోపాల్ తన మిత్రుడితో కలిసి సైకిళ్ళ మీద కొంతకాలం క్రితం దక్షిణదేశ యాత్ర చేశారట. ఆ ముచ్చట్లన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. మరే వాహనం మీదయినా వెళ్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరికించడంలో శారీరకమయిన కష్టం ఉండదు. కానీ నడకా, సైకిలూ అయితే తాను శ్రమిస్తూ, చుట్టూ ఉన్న లోకావృతాన్ని చూడడం ఉంటుంది. వేణుగోపాల్ జీవితానికి ఈ సైకిలు యాత్ర ఒక ప్రతీక అనిపించింది. ఆయనే కాదు, తమ లోపలా, బయటా ప్రయాణిస్తూ, రెండు ప్రయాణాలూ ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ, మంచి చెడులు గమనించుకుంటూ, పరిణతి చెందుతూ ప్రయాణించే వారికెవరికయినా ఈ పోలిక వర్తిస్తుందనుకుంటాను.
సంగీత సాహిత్యాలే జీవితంగా చేసుకున్నా, మిగిలిన ప్రపంచం తాలూకు స్పృహతో రచనలు చెయ్యడానికి కారణం ఆయన చుట్టూ ఉన్న ఇంత పెద్ద ప్రపంచం. అదే ఈ కథల నిండా ఉంది.
ఇందులో ఎందరో మంచి మంచి స్నేహితులు, బంధువులు ఆత్మీయులుగా మారిన పరిచయస్తులు ఉన్నారు. చిన్న చిన్న సహాయాలు కూడా మర్చిపోని గొప్ప వ్యక్తులున్నారు. ప్రతిచోటా ఆదరించి అన్నం పెట్టిన తల్లులున్నారు, బీదరికంలో ఉంటూ కూడా. దేశం కాని దేశంలో రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉంటే ఇంటికి తీసికెళ్ళి సేదదీర్చిన ‘లఖ్నవీ అమ్మ’లున్నారు.
ఇంత ఆత్మీయ సంపద, మిత్ర సంపదా పొందగలిగిన ఆయన భాగ్యానికి అసూయ కలుగుతుంది. కానీ ఆయన తన భాగ్యం గురించి తరచుగా పరాకు పడుతుంటారేమో! అందుకే ఆ కంఠం తరచుగా గద్గదమౌతూ ఉంటుంది.
తన బాల్యం గురించి, అందులోని కులమతాల స్పృహ లేని మిత్రుల గురించిన జ్ఞాపకాలు ఈ కథల్లో పుష్కలంగా ఉన్నాయి. తనకు సంభవించిన ప్రతీ సంఘటనలోని మానవీయ కోణాన్నీ పట్టుకుని మనముందు పెట్టిన కథలున్నాయి. తన చుట్టూ ఉన్న ఆర్తుల పట్ల ఎరుకతో, దయతో, జాలితో కరుగుతూన్న కథలున్నాయి.
పేదా, ధనికా తారతమ్యాలు లేని స్నేహాలు, బంధుత్వాలూ ఉండాలని, ఉంటాయని చెప్పే మాటల వెనక ఉన్న అసాధ్యాలను స్పష్టంగా చూపెట్టడాలూ ఉన్నాయి. మనం సునాయాసంగా చేసే మంచి-చెడుల బేరీజుల పాక్షికతలలోని బోలుతనాన్ని కూడా విప్పిచెప్పిన పరమ వాస్తవిక కోణం కూడా ఈ కథలలో ఉంది.
అందువల్లనే ఏ భ్రమలూ లేకుండా, దొరికిన ప్రతి ఆప్యాయతనూ కథగా రాసుకుని మనముందు ఉంచగలిగారు శ్రీ వేణుగోపాల్.
4
నాకు వేణుగోపాల్ గురించి ఎక్కువ తెలియదు. ఆయన రాసిన కథలు, నవలలూ కూడా అన్నీ చదివినదాన్ని కాదు. దానికి నా అలసత్వం కొంత కారణం. ఈ కాలం కథలు చదివినప్పుడు ఇందులో ఆయన ఆనవాళ్ళు దొరికాయి.
ఇవాల్టి సమాజంలోని పరిచయాల ధోరణి గురించి చెప్తూ ‘నువు ఏమిటి?’ అనేది పోయి ‘నువు ఎంత?’ వచ్చేసింది అని రాశారు ఒక చోట. ప్రతివాళ్ళూ అడిగే ‘మీరేం చేస్తుంటారు?’ అన్న ప్రశ్న వెనక ఉన్న ‘నువ్వెంత’ అన్న నిజం పట్టుకున్నారు.
‘నీకెంత వస్తుంది – దాన్ని బట్టి సమాజంలో నీ స్థానాన్ని అంచనా వేస్తాం’ అన్న మనుషుల ధోరణిని గురించి చెప్తూ, అటువంటి ప్రశ్నలు అడగకుండా ఉండేలాగ మనల్ని మనం పాలిష్ పెట్టుకోవద్దా? అని అడుగుతారు.
మానసిక ఆరోగ్యానికి సంగీత సాహిత్యాలూ, శారీరక బౌద్ధిక క్రమశిక్షణకు వ్యాయామమూ ఎంతో అవసరమని మరీ మరీ చెప్పగలగడానికి కారణం ప్రతీసారీ ఆ విషయం తన అనుభవంలో ఉండడమే.
ఇంకా…
‘షరాబ్ ఛీజ్ హి ఏసీ హై, న ఛోడ్ జాయే – అని పంకజ్ గొంతులో విన్నా, మజా లేనా హై పీనేకా తో, కమ్ కమ్ ధీరే ధీరే పీ – అని వందనా వాజ్‌పేయి మధుర స్వరంతో విన్నా, తాగడం అన్నది వ్యసనంగా మారిన తర్వాత అంత సౌందర్యవంతం కానే కాదు, కానే కాదు‘ అని నొక్కి చెప్పే వేణుగోపాల్ ఇందులో ఉన్నారు.
‘గడిచిపోయిన కొన్ని విషాద సంఘటనలు కాలక్రమేణా వాటిలోని విషాదాన్ని వదుల్చుకుని కళాత్మకంగా వినిపించడం జీవితంలోని అసలు విషాదం‘ అంటూ ఆ విషాదాన్ని కంఠంలోనే దాచి ఉంచడానికి జీవితాన్ని హారతి కర్పూరంలా వెలిగించుకోవడమో, కరిగించుకోవడమో చెయ్యాలని భావిస్తుంటారేమో కవులయిన శాపగ్రస్త మానవులు.
అందుకే ‘ఫిర్ వొహీ శామ్, వొహీ గమ్, వొహీ తన్హాయీ హై’ అని పాడుకునే కవి రాసిన ఈ కథలు మానవతా పరిమళంతో శుభ్రపడిన జీవితాలను చూపిస్తున్నాయి. వీటన్నిటా అరుదయిన మట్టి పరిమళం.
సరస్వతీదేవి ఆమెను ఆరాధించేవాళ్ళు ఎక్కడెక్కడున్నా, వాళ్ళలో వాళ్ళకి బంధుత్వం కలిపి ఆత్మీయులను చేస్తుంది. అది ఆమె అందించే వరం. అలా అందివచ్చిన ఆత్మీయ సోదరుడు వేణుగోపాల్‌కు అభినందనలు తెలిపే భాగ్యాన్ని పొందుతున్నాను.
మంచి కృతులకు, కర్తలకు జయం కలుగుగాక.
[కాలం కథలు పుస్తకానికి ముందుమాట – సం.]