‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి కలంపేరు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. గుంటూరు ఎ.సి. కాలేజిలో పనిచేసేవాడు. ‘ఉదయశ్రీ’ ఖండకావ్యం 1940ల చివర్లో రాసినది. అప్పటికింకా భావకవిత్వ మందమారుతాలు తెలుగునేల నిండా వీస్తూనే వున్నాయి. అదే ఒరవడిలోది కరుణశ్రీ కవిత్వం.
భావకవిత్వానికి పునాదులు ప్రేమ, అమలినశృంగారం, సున్నితమైన భావచిత్రాలు. అంతకుముందున్న ప్రబంధకవిత్వాన్ని చించిచెండాడే ఉద్యమంగా మొదలైంది గనుక దీన్లో ముఖ్యంగా ‘స్త్రీ’కి ఉన్నతస్థానాన్ని కల్పించే ప్రయత్నం జరిగింది. ప్రబంధాల్లో కుప్పతిప్పలుగా వున్న స్త్రీ శారీరక వర్ణనల్ని వర్జించి వారి మానసికభావాలకి ప్రాధాన్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది భావకవిత్వం. అందుకే ‘కుంతీకుమారి’లో కుంతి పాత్ర పాఠకుల హృదయాల్ని పట్టిలాగుతుంది. అలాగే ‘ఉదయశ్రీ’ తొలి నాలుగైదు ఖండికలు శాక్యగౌతముడు బుద్ధుడిగా అవతరించే ప్రయాణాన్ని వివరించినా అతని భార్య మనోవేదననీ అంతగానూ ఆవిష్కరిస్తాడు కవి.
ఐతే భావకవిత్వంలో కొత్తబాటలు వేసినవారిగా దేవులపల్లి, పింగళి – కాటూరి, వేదుల, రాయప్రోలు మొదలైనవారిని చెప్పుకుంటారు కాని కరుణశ్రీని అలాటివారితో లెక్కవెయ్యరు – వారిబాటలో నడవటమే కాని తను కొత్తపుంతలు తొక్కలేదని చాలామంది అభిప్రాయం.
కాని కరుణశ్రీకి దక్కిన అరుదైన అదృష్టం ఘంటసాల తొలినాళ్ళలో ఉదయశ్రీ లోని కొన్ని ఖండికలని పాడి రికార్డులుగా విడుదల చెయ్యటం. అలా ఘంటసాల మధురగంభీర గళంలో ఆయన ఉదయశ్రీ పద్యాలు తెలుగునాట మారుమోగాయి. ముఖ్యంగా పుష్పవిలాపం, కుంతీకుమారి వినని తెలుగువారు అప్పట్లో లేరు. ఉదయశ్రీ పద్యాలు ఘంటసాలకి పేరు తెచ్చాయా, లేక ఘంటసాల గానం ఉదయశ్రీకి గుర్తింపు తెచ్చిందా అనేది సహేతుకమైన ప్రశ్న – ఇది ఘంటసాల చలనచిత్రాల్లో ప్రఖ్యాతుడు కాకముందు విషయం అని మనం గుర్తుపెట్టుకోవాలిక్కడ. అంచేత కొందరి దృష్టిలో కరుణశ్రీకి రావలసిన దానికన్న ఎక్కువ కీర్తి దొరికింది.
ఆయన పద్యాల్లో, ముఖ్యంగా ‘ఉదయశ్రీ’లో కనిపించే లాలిత్యం చాలామంది పాఠకుల్ని ఆకట్టుకుంది. వాళ్ళలో 70ల్లో ఎ.సి. కాలేజిలో చదువుకున్న నేనూ ఒకణ్ణి. ఆ రోజుల్లో ఎ.సి. కాలేజ్ ఎదురుగా వున్న ముఖ్యగ్రంథాలయంలో, కలెక్టరాఫీసు దగ్గర్లో వున్న విశ్వహిందూపరిషత్ భవనంలో, ఇంకా ఎ.సి. కాలేజ్ చుట్టుపక్కలా, కనీసం నెలకొకసారైనా సాహిత్యసమావేశాలు జరుగుతుండేవి. అప్పుడు గుంటూరులో మంచి పండితులు, కవులు చాలామంది ఉండేవారు, వచ్చేవారు. సాహిత్యసమావేశాలు ఆసక్తికరంగా సాగేవి. ఈ మధ్య ఎందుకో అక్కడ విశ్వహిందూపరిషత్‌లో ఒకరోజు జరిగిన సమావేశం గుర్తుకొచ్చింది; అందులో బీనాదేవి ప్రసంగం జరిగింది. విషయం గుర్తులేదు, బహుశ ఆవిడ నవల హేంగ్ మి క్విక్ అయుండొచ్చు. దాన్ని గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు చెప్పబోయే విషయం గుర్తొచ్చింది. అదేమిటంటే – అప్పట్లో నన్ను ఉదయశ్రీలో బాగా ఆకర్షించిన ఒక ఖండిక ‘తపోభంగము’. చాలామందికి బహుశ దానిగురించి తెలియదు. ఎందుకంటే ఇది మిగిలిన వాటికి వస్తురీత్యా చాలా భిన్నమైంది. ఘంటసాల ఆ పద్యాలు పాడక పోవటం ఒక కారణం కావొచ్చు. కరుణశ్రీ దాన్ని ఎందుకు ఎంచుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు; ఆయనకీ ఆ అనుమానం వున్నట్టు దాన్ని ఆయన ముగించిన విధానం చెప్తుంది, నా దృష్టిలో. ఐతే దీని గురించి మరింత ముచ్చటించే ముందు ఇవిగో ఆ పద్యాలు.
తపోభంగము
- మానస సరోవరాంతర మధుకణాలు
మోసికొనివచ్చి సేవలు చేసిపోవు
మంచుమల మీది యాదిమ మౌనిమణికి
మందమంద మందాకినీ మారుతములు - స్వామి యర్ధనిమీలి తేక్షణములందు
ఏమి యాకాంక్షితమొ చెప్పలేము గాని
సర్వమంగళ పర్వతసార్వభౌము
పట్టి ముప్ప్రొద్దు భక్తిమై పరిచరించు - అమ్మునిరాజు గెల్చి విజయధ్వజ మెత్తిడి పూన్కి చెంగటన్
ద్రిమ్మరుచుండె మారుడు సతీయుతుడై సమయప్రతీక్షమై
తుమ్మదనారితో చివురుతూణముతో విరజాజిపూల వి
ల్లమ్ములతో శుకీపిక బలమ్ములతో అతిలోకశూరుడై - ఉచిత పూజోపహారము లూని గౌరి
మూడుకన్నుల మునిమౌళి ముందు నిలిచె
వినయము భయమ్ము సిగ్గు ముప్పిరిగొనంగ
పలికె కలకంఠి చిగురుచేతులు మొగిడ్చి - “వాచవులూరు పండ్లు గొనివచ్చితి స్వాములకోస మిచ్చటన్
దాచుదునా ప్రభూ మిసిమి తామరపాకుల లోన? క్రొత్తగా
మా చదలేటి ప్రక్క మధుమాస మనోజ్ఞ మహోదయమ్ములో
పూచెను మొన్ననే పొగడపూలివి మాలలు గ్రుచ్చి యిత్తునా? - వచ్చుచునున్న సూర్యభగవానుని చక్కిలిగింత కప్పుడే
విచ్చుచు విచ్చుచున్న అరవిందము లందున పొంగి వెల్లువౌ
వెచ్చని తియ్యదేనియలు భృంగకుమారిక లంటకుండగా
తెచ్చితి దొన్నెలందు నిడి దేవరవారికి ఆరగింపుకై” - అందము చిందిపోవు చెవియందలి చెందొవ జారుచుండ “పూ
లందుకొనుం” డటంచు సుమనోంజలి ముందుకు జాచి శైలరా
ణ్ణందన వంగె చెంగున అనంగుని చాపము వంగె వంగె బా
లేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వ కాయుడై - ఇచట శాంతమ్ము నిండార ఈమెచేతి
పైడి క్రొందమ్ము లందుకొన్నాడు హరుడు
అచట పంతమ్ము నిండార ఆమెచేతి
వాడి కెందమ్ము లందుకొన్నాడు మరుడు - తియ్యవిల్కాడు వింటసంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము
గౌరి కడగంటి చూపుతో కలిసిపోయి
గ్రుచ్చుకొనెనది ముక్కంటి గుండెలోన - స్వర్ణదీ స్వర్ణ కంజ కింజల్కములకు
పసిమి దిద్దెడి గిరికన్య పాణితలము
పట్టుకొని వీడగాలేడు భవుడు మేను
పులకరింపగ వలపులు తొలకరింప - ముద్దు లొలికెడి పగడాల మోవి మీద
తళుకు చిరునవ్వు ముత్యాలు తద్గుణింప
“స్వామి యేమిది” యనుచు లజ్జా వినమ్ర
ముఖి యయి యొకింత వారించె ముగుద మునిని - అంత మహేశ్వరుండు హృదయమ్మును మెల్లగ నిగ్రహించి అ
త్యంత తపోవిభంగమున కాగ్రహముంగొని విఘ్నకారణ
మ్మింతకు నెద్దియంచు గనియెన్ నలుదిక్కులు కానిపించె నా
పొంతనె పువ్వుటీరమున పూవిలుకాడు సతీసమేతుడై - తత్క్షణము శూలి రూక్ష ఫాలేక్షణమున
ఉదయమందెను ప్రళయ మహోగ్ర శిఖలు
పాహి పాహి ప్రభో పాహి పాహి యనెడి
సురల యార్తధ్వనుల్ మింట సుళ్ళు తిరిగె - అగ్గిరిశు ఫాలనేత్రంపు టగ్గిలోన
భగ్గుమన్నాడు క్షణములో ప్రసవశరుడు
మంచుగుబ్బలి గుహలలో మారుమ్రోగె
తేటి జవరాలి జాలి కన్నీటి పాట - ఆ కరుణగానమే ఆ యనంత విరహ
విశ్వసంగీతమే పంచమస్వరాన
గానమొనరించినది మన కాళిదాస
కోకిలమ్ము వియోగినీ కూజితముల
‘గౌరీకళ్యాణం’ చిరపరిచితమైన కథ. కాళిదాస కుమారసంభవం నుంచి తెలుగులో నన్నెచోడుడు, శ్రీనాథుడు మొదలైన వారి రచనల్లోను ఈ కథ పరిపుష్టమైంది. శ్రీనాథుడి హరవిలాసంలో తృతీయాశ్వాసం అంతా ఈ కథే. కనుక అక్కడ చాలా విశాలంగా వుంటుంది. ఆ కథలో కొద్దిభాగాన్ని పద్నాలుగు పద్యాల్లో ఈ ఖండికలో అందించాడు కరుణశ్రీ. బహుశ హరవిలాస కథనం ఆయనకి బాగా నచ్చిందేమో, దాన్ని భావకవిత్వ పంథాలో మలిచి అలతి లలిత పదాల్లో మనకందించాడు. ముఖ్యంగా పాత్రల స్వభావాల్లో ఆయన చేసిన మార్పులు మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయిక్కడ.
హరవిలాసంలో కథకు కేంద్రబిందువు శివుడు. పార్వతి, మన్మథుడు, మిగిలినవారు ఆ కేంద్రం చుట్టూ పరిభ్రమించేవారే. అందరికీ ఆయనంటే భక్తి, భయం. అక్కడ శంకరుడు తపోమగ్నుడై వుంటే పార్వతి ఎలా కాచుకుని వుందో చూపుతాడు శ్రీనాథుడు మన్మథుడి దృష్టికోణం నుంచి – అమ్మహాదేవుని పార్శ్వంబునం పుష్పాంజలి వట్టి ధ్యానావసానావసరముం బ్రతీక్షించుచు కించిద్విలంబమాన కేసరఛదాభిరామ కాంచీకలాపయు కర్ణికారకుసుమ తాటంకయు పల్లవావతంసయు నగు పార్వతిం గనుంగొని… అని. కరుణశ్రీ కథనంలో ఈ హడావుడేం వుండదు – ఉచితపూజోపహారములూని గౌరి/ మూడుకన్నుల మునిమౌళి ముందు నిలిచె/ వినయము భయమ్ము సిగ్గు ముప్పిరిగొనంగ – అంతే. ఆమె కాంచీకలాపాలు, తాటంకాలు ఏవో ఎలా వున్నాయో ఇక్కడ అక్కర్లేదు. వినయము, భయము, సిగ్గు – ఇవే కావాలి.
ఇక్కడ పార్వతి ఎంత నునుమెత్తని మాటల్తో తను తెచ్చిన పూజావసరాల గురించి శివుడికి వివరిస్తుందో చూడండి: “వాచవులూరు పండ్లు గొనివచ్చితి స్వాముల కోసమిచ్చటన్/ దాచుదునా ప్రభూ మిసిమి తామరపాకులలోన?” నిజంగానే లేతతమలపాకుల్లాటి మాటలు. అదే హరవిలాసంలో ఐతే పార్వతి చాలా గడుసుది; ఆ రోజు శివుడి సేవకు ఇలా వచ్చిందట: ‘పద్మరాగ విభూషణ ప్రతతి మారు/ లలి నశోకలతా ప్రవాళములు దాల్చి/ సింధువార ప్రసూన రాజీవరాజి/ కమ్రమౌక్తిక రత్న శృంగార యగుచు; చనుగవ వ్రేగునన్ మిగుల సన్నపు గౌనసియాడ గెంపు మీ/ రిన నునుబట్టుచేల గటి రింగులు వారగ గట్టి భూమిభృ/ త్తనయ ప్రసూనగుచ్ఛములు దాలిచి లేజిగురుల్ ధరించి వ/ చ్చిన నడదీవవోలె నిలిచెం తరుణేందుకిరీటు సన్నిధిన్; తరుణి యందంద కేసరదామకాంచి/ జఘనపులినంబు నందుండి జారిపడగ/ మాటిమాటికి హస్తపద్మముల నెత్తు/ చపలభావంబుతో నుండె నభవు మ్రోల.’ ఇంకా వుంది కాని ఇక్కడితో ఆపుదాం. మొత్తానికి ఇక్కడ శ్రీనాథుడి దృష్టంతా శివుడి మీదే. మిగతా వాళ్ళంతా ఆయన తపస్సుని భంగం చెయ్యటానికి వచ్చిన విరోధివర్గంవారే!
కరుణశ్రీ దృష్టి పార్వతి మీద, తర్వాత రతీదేవి మీద. ఇంకొక ముఖ్యవిషయంలో కూడ ఇది స్పష్టమౌతుంది – కరుణశ్రీ కథనంలో మన్మథుడి పుష్పబాణంతో చలించిన శివుడు పార్వతి చెయ్యిపట్టుకుని వదలడు, ఆమే సున్నితంగా అతన్ని మదలించే వరకు – “స్వామి యేమిది” యనుచు లజ్జా వినమ్ర/ ముఖి యయి యొకింత వారించె ముగుద మునిని. హరవిలాసంలో అలా కాదు. మన్మథుడు సమ్మోహనాస్త్రం వేయటంతో – శమనారాతి నివృత్తధైర్యు డగుచుం చంద్రోదయారంభ కా/ లమునం బొంగిన దుగ్ధ సాగరము లీలం పక్వబింబాధరో/ ష్టము కర్ణాంతవిలాసనేత్రము నతి స్వచ్ఛంబునై యొప్పు గౌ/ రి ముఖాంభోజము నందు నిల్పె సరసప్రేమంబునం జూడ్కులన్. ఐతే ఆ వెంటనే ‘అంతకమథనుం డతర్కితంబైన యింద్రియక్షోభంబు బలాత్కారంబుగా గుదియించి చేతోవికారంబునకు కారణంబు తెలియం దలంచి దిశాంచలంబులకుం జూపు వరపునప్పుడు…’ అంటాడు. అది కేవలం మనోవికారం మాత్రమే; దాన్ని వెంటనే గ్రహించి శివుడు ప్రతిచర్యకు ఉపక్రమిస్తాడు.
అప్పుడేం జరిగిందీ కరుణశ్రీకి అంత ముఖ్యం కాదు. టూకీగా ‘తత్క్షణము శూలి రూక్ష ఫాలేక్షణమున/ ఉదయమందెను ప్రళయ మహోగ్రశిఖలు’ అని ముగిస్తాడు. అదే శ్రీనాథుడైతే ఒక వచనంలో ‘…మన్మథునిం గనుంగొని తపఃపరామర్శ వివృద్ధక్రోధుండయ్యె నవ్వేళ భ్రూభంగదుష్ప్రేక్షంబగు విరూపాక్షుని లలాటేక్షణంబునం జనియించిన సముజ్జ్వలజ్జ్వాలాజాలంబైన కృపీటయోని భువనంబు లెల్ల భయభ్రాంతంబులై హాహాకారంబులు సేయ నమ్మీనకేతను శరశరాసనతూణీరంబులతోడం గూడ భస్మంబు చేసిన…’ అంటూ ఆ భీభత్సాన్ని ప్రదర్శిస్తాడు. కరుణశ్రీ ఒక చిన్న తేటగీతిని ఎంచుకుంటే శ్రీనాథుడు పాఠకుల్ని లాక్కుని పరిగెత్తే వచనంలో తను చెప్పదల్చుకున్నది చెప్తాడు. పైగా అంత చిన్న ఛందస్సుని ఎంచుకోవటం వల్ల కరుణశ్రీకి పెద్ద పదాల్ని వాడే అవకాశం దొరకలేదు – ఒకవేళ వాడాలనుకున్నా. అందుకే శ్రీనాథుడు శివుణ్ణి సాభిప్రాయమైన విరూపాక్షుడు అనే పదంతో సంబోధిస్తే కరుణశ్రీ కేవలం శూలి అనగలిగాడు, ఈ సందర్భంలో శివుడు శూలంతో ఏమీ చెయ్యకపోయినా.
ఐతే ‘ఇచట శాంతమ్ము నిండార ఈమెచేతి/ పైడి క్రొందమ్ము లందుకొన్నాడు హరుడు/ అచట పంతమ్ము నిండార ఆమెచేతి/ వాడి కెందమ్ము లందుకొన్నాడు మరుడు’ అని చాలా అందంగా చెప్పగలిగాడు కరుణశ్రీ. అదే విషయాన్ని శ్రీనాథుడు ‘అంబుజాక్షి సమర్పింప నాదరమున/ నక్షమాల్యంబు నిటలాక్షు డందుకొనియె/ పంచబాణుండు సంధించె నించువింట/ నస్త్రరాజంబు సమ్మోహనాశుగంబు’ అని అంత ప్రాధాన్యం లేని విధంగా చెప్పేశాడు. ఆయనకు ముఖ్యం ఆ విషయం కాదు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది.
మరొక ముఖ్యమైన విషయం ఏమంటే – హరవిలాసంలో రతీదేవి మన్మథుడితో పాటు హరతపోభంగానికి వెళ్ళదు; ఆ తర్వాత మన్మథుడు భస్మమయాక మాత్రమే వస్తుంది. కరుణశ్రీ కథనంలో ఆమె అతనితో పాటే వెళ్తుంది; అతనికి అమ్ములందిస్తుంది కూడ. భావకవిత్వంలో స్త్రీ భర్తని యుద్ధానికి పంపి ఇంట్లో కూర్చోదు; తనూ అతన్తో వెళ్ళి యుద్ధంలో సాయం చేస్తుంది.
మరొక పద్యంలో కరుణశ్రీ మార్కు మళ్ళీ కనిపిస్తుంది – అందము చిందిపోవు చెవియందలి చెందొవ జారుచుండ “పూ/ లందుకొనుం” డటంచు సుమనోంజలి ముందుకుజాచి శైలరా/ ణ్ణందన వంగె చెంగున అనంగుని చాపము వంగె వంగె బా/ లేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్థ్వకాయుడై’ అన్న పద్యం ‘ధనుర్భంగము’ లోని “ఫెళ్ళుమనె విల్లు…” అనే ప్రసిద్ధమైన పద్యం ఛాయల్లోనే నడుస్తుంది; మనసుకు గిలిగింతలు పెడుతుంది. అలాగే, ‘స్వర్ణదీ స్వర్ణ కంజ కింజల్కములకు/ పసిమి దిద్దెడి గిరికన్య పాణితలము’ అన్న ప్రయోగం కూడ చక్కగానే వచ్చింది.
మరొక విషయం గమనించండి – 5వ పద్యంలో ‘మా చదలేటి ప్రక్క మధుమాస మనోజ్ఞ మహోదయమ్ములో’ అన్న ప్రయోగం చూశారా? ఏమనిపిస్తుంది? భావకవులకు ఉన్న ఒక చాపల్యం ఇది – ‘మధుమాసం’ అంటే చాలు వాళ్ళకు పూనకం వచ్చేస్తుంది – దానికి ఇంకొన్ని ‘మ’తో మొదలయ్యే విశేషణాలు తగిలించకుండా ఉండలేరు, అవసరం లేకపోయినా! అందులోనూ ‘మనోజ్ఞ’ పదం మీద మరీ మోజు.
ఇక చివరగా – 14వ పద్యం చివరి పాదం, 15వ పద్యం చూడండి – ఎక్కణ్ణుంచో తెచ్చి అతికించినట్టున్నాయి కదూ? ఖండికని ఎలా ముగించాలో తెలీక రతీదేవి విరహాన్ని కాళిదాసు మేఘదూతానికి ముడిపెట్టి మమ అనిపించినట్టుంది. ఐతే మనకు ఒక ఖండిక నచ్చిందంటే దాన్లోని ప్రతి పద్యమూ ప్రతి భావమూ ప్రతి పదమూ నచ్చక్కర్లేదు కదా. మొత్తం మీద అంతా చదివాక మనసుకి హాయి అనిపిస్తే అదే చాలు.
ఉపసంహారం
భావకవిత్వ పరంపరలో ఒరవడిలో వచ్చిన అనేకానేక ఖండికల్లో కావ్యాల్లో కరుణశ్రీ ఉదయశ్రీ ఎన్నదగింది. లలితపదప్రయోగంలో, మెత్తని కథనంలో, మానసికభావచిత్రణలో, హాయిగా పాడుకోవటానికి, హృదయోల్లాసానికి రసికులందరికీ ఆస్వాదయోగ్యం. ఇందులో నాకు విలక్షణంగా కనిపించిన, నచ్చిన ‘తపోభంగము’లో కూడ ఈ గుణాలన్నీ కనిపిస్తాయి. మీకూ ఈ పద్యాలు ఎప్పుడన్నా రిలాక్స్ కావటానికి ఉపయోగపడవచ్చు. ప్రయత్నించి చూడండి.