వాయవ్య అమెరికా వసంతం

‘అడుగడుగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడడుగో అగ్గిపిడుగు అల్లూరి.’ ఈ శ్రీశ్రీ సినీగీతంలో ‘భళ్ళున’ ప్రయోగానికి చక్కగా నప్పేది వాయవ్య అమెరికా వసంతం. నిన్నటిదాకా గడగడలాడించిన చలి తెల్లారి తలుపులు తీస్తే మాయమై పూల జడలు వేసుకున్న పెళ్ళికుమార్తెల్లా వృక్షాలన్నీ విరబూసి వుంటాయి.


శీతాకాలమంతా చలికి గజగజా వణుకుతూ గడిపేస్తాం. అవసరమైతేగానీ బయటకు రాకుండా, అయితే నాలుగ్గోడల మధ్య, లేకపోతే నాలుగు చక్రాల సవారీపై – హీటర్లేసుకుని 60 – 70ల మధ్య మార్చుకుంటూ, ఆలస్యంగా వస్తూ తొందరగా మాయమయ్యే సూర్యుడి దాగుడుమూతలు పట్టించుకోకుండా, ఏదో కోల్పోతున్నట్టు, దేనికోసమో ఎదురుచూస్తున్నట్టు, పగళ్ళూ రాత్రుళ్ళూ నెట్టుకొస్తుంటే – ఒక రోజు!

రెండు గడ్డిపూలు, రాళ్ళ మధ్యలోంచి భూమిని చీల్చుకొస్తాయి. వసంతం వచ్చేసిందా, వసంతమేనా?! అంత అదృష్టం కూడానా… అని ఉస్సురుమని, పనుల్లో తలమున్కలై వారమంతా పరిసరస్పృహ కోల్పోయి- వారాంతంలో మేరీ మూర్ పార్క్‌కు వెళితే – అచ్చెరువొందేట్టు – పదారడుగుల చెట్లన్నీ సందులేకుండా పూలను రంగరించుకొని వసంతం వచ్చేసిందోచ్ అని నమ్మకంగా ప్రకటిస్తాయి.


భారతదేశంలో అయితే పూల చెట్లు రోజుకిన్నని పూస్తూ, భగవంతుని ఫోటో కోసమే పూస్తున్నాయేమో అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం చెట్ల నిండా పూలే! చెట్టుకో రూపం, రంగు. పూల వాసన మాత్రం బహు అరుదు. ముదురు ఎరుపు, ఎరుపు, ఇటుక పొడి ఎరుపు ఇలా పలు వన్నెలు. ఒక చోట చెట్లకి గులాబీ పూలలాంటి గుత్తులు. గుత్తులంటే గుత్తులే. వందలాది పూలు. ఎవరూ కోసి తోపుడు బండి మీద తిప్పుతూ అమ్మరు సుమీ. ఇంకో బహు ఆశ్చర్యకరమైన విషయం – పూలు ఒకటి రెండు రోజుల్లో వాడిపోవు. వారాల తరబడి చెట్టుపై అలాగే వుంటాయి. గోడమీద చిత్రపటంలా కనువిందు చేస్తూ ఉంటాయి.

‘దారంట పోతుంటే దారమల్లె సాగి వుండు.’ సినారె గడ్డిపూల కవిత తరచూ గుర్తు వస్తూంటుంది. ప్రతి మార్నింగ్, ఈవినింగ్ వాక్‌లలో బాట పక్కన పసుపు పూలు అలా మనతో పాటే సాగుతూ ఉంటాయి.

స్టేట్ హైవే 202 మీద 60 మైళ్ళ వేగంతో పోతుంటే – వర్షం వెలిశాక ఆరుబయట చీరలు ఆరేసినట్టు ఆకు పచ్చని గడ్డిపై పసుపు పూలు సినిమా రీళ్ళలా అలా వెనక్కి వెళ్తూంటాయి.

ఈ అమెరికా వాయవ్య మూల వాతావరణం భలే వింతైంది. మైలు మైలుకీ మారుతుంది. నిమిష నిమిషానికీ మారుతుంది. కొంచెం ఎండ, కొంచెం వాన, అంతే చలి, అప్పుడప్పుడూ వడగండ్లు, ఎప్పుడోగాని రాని గాలి. చెట్ల ఆకులు కూడా అంత తరచూ కదలవు. స్టిల్ ఫోటో కోసం నిల్చున్న కొత్త తెలుగు సినిమా వారసపుత్రునిలా అలాగే నిలబడిపోతాయి. అమావాస్యకో పౌర్ణానికో వచ్చే గాలికి కొంచెం కదులుతాయి.


ఇక్కడోసారి తుఫానొస్తుందని హెచ్చరించారు. టైమ్స్ వాడూ రేడియోల వాళ్ళూ అంతా ఒకటే గోల. అందరం పొలోమని ఆఫీసులకు బ్రేక్ తీసుకుని మరీ షాపులపై దండయాత్రలు చేసి షెల్ఫ్‌లన్నీ ఖాళీ చేసి ఇళ్ళకు చేర్చాం. కరెంటు పోతే ఎలా, గ్యాస్ పొయ్యిలు ఎవరి ఇళ్ళల్లో వున్నాయి, అసలు పొయ్యి లేకుండా తినేవి ఏమి ఉన్నాయి, నీళ్ళు రాకపోతే ఎలా, ఇలా రకరకాల డిజాస్టర్ సినారియోలు రన్ చేసుకున్నాము. బాత్ టబ్బుల్లో నీళ్ళు నింపుకోవడం నుండి, ప్రొపేన్ స్టవ్వుల వరకూ ఏర్పాటు చేసుకున్నాము. వెనకటికోసారి ఇలానే జరిగితే కరెంటు పోయి వారం రోజులు రాలేదట – పాత కాపులు హెచ్చరించారు. ఇంతా చేసి తుఫాను కాదు కదా, చెట్టు ఆకులు కూడా కదల్లేదు. తెచ్చుకున్నవన్నీ మూడు వారాలు దాచుకుని వండుకొని తినాల్సి వచ్చింది.


ఈ ఎండా వానా కలిసి రావటం కూడా ఒకందుకు మంచిదే. ట్రొసాక్స్‌లో అయితే కాస్కేడ్ కొండల చుట్టూ ప్రతిరోజూ ఇంద్రధనస్సు ప్రత్యక్షం. మనమెంత చికాగ్గా ఉన్నా ప్రకృతిలోని అణువణువూ మన దగ్గర నుంచి చిరునవ్వుల పరిహారం వసూలు చేయాలని కంకణం కట్టుకున్నట్టు తమ పాత్రను రక్తి కట్టిస్తాయి.

లైబ్రరీ ఎదురుగా అయితే మందార మొక్కలలాంటివి విరబూసి వుంటాయి. అన్నమయ్య సినిమాలో నాగార్జున ఇంతకంటే అందం ఉంటుందా అని వేంకటేశ్వరస్వామి వైపు అపనమ్మకంగా చూస్తాడు చూడండీ, నేను కూడా ఇక్కడేంటి ఇంతందం పోగు పడింది అని అపనమ్మకంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తుంటాను.

ఇంకో గమ్మత్తయిన విషయం, ఇక్కడ కార్లు వసంతం రాగానే పెళ్ళి కళ సంతరించుకుంటాయి. చెట్టుకింద పార్క్ చేస్తే వాన చినుకులకు తడిసి ముద్దయి, ఆపై రాలిపడిన పూల రెమ్మలు ఒంటి నిండా అతికించుకొని ముద్దుగా ఇండియాలో పెళ్ళి జంటలను తీసుకెళ్ళే గులాబీ పూల కార్లలా తయారవుతాయి.


ఇక్కడ వర్షం నిజంగానే రోజూ పడుతుంది. అప్పుడప్పుడూ ఉధృతంగా, తరచూ చిరుజల్లులుగా పడుతుంది. పచ్చదనం వాడిపోకూడదని తోటమాలి పైనుండి నీరు చల్లినట్టు పడుతుంది. ఎప్పుడన్నా రెండురోజులు వాన పడకపోతే పేపర్‌లో లెక్కలు వేస్తారు. మొన్నక రోజు రెండు రోజులు వాన పడకపోతే ఆ వింత జరిగి అప్పటికి నూరు రోజులైందని వ్రాశారు.

ఇక్కడి వర్షాలకి సరస్సులన్నీ ఎప్పుడో అప్పుడు తప్ప నిండుకుండల్లా ఉంటాయి. సమామిష్ లేక్, బీవర్ లేక్, పైన్ లేక్, ఇంకా వాషింగ్టన్ లేక్ – అడుగుకో లేక్, ఆ లేక్‌ల చుట్టూ పార్క్‌లు, ఆ పార్క్‌లను కలుపుతూ ట్రెయిల్స్ – డెవలప్‌డ్ కంట్రీ అనిపించుకుంటుంది. ఇంకా నదులు అనబడే వాగులు. బీవర్ స్ట్రీమ్, సమామిష్ రివర్ ఎప్పుడూ అలా మంద్రంగా ప్రవహిస్తూనే వుంటాయి. ఎప్పుడో కులూ మనాలీ వెళ్ళినప్పుడు చూసిన నదులు, లేదా పంటచేల నీరు వదిలాక మన సాగర్ కాలవలూ గుర్తొస్తుంటాయి. ఇంకా సందుసందునా క్రీక్‌లు, స్టార్మ్ వాటర్ స్టోరేజ్‌లు, వాటిల్లో డ్రైనేజ్ కలవకుండా, పొల్యుషన్ చేరకుండా వేయిన్నొక్క జాగ్రత్తలూ తీసుకుంటారు. చేపలు శుభ్రంగా తిరుగుతుంటాయి. అప్పుడప్పుడూ పట్టుకొని తినొచ్చు కూడా. ఈ జలాల్లో బాతులు ఈదుతుంటాయి, కయాక్‌లు తేలియాడుతుంటాయి.


ఇక్కడ ఋతువులు మారుతుంటే, చరాచర జీవరాశి మొత్తం దాంట్లో భాగమవుతుంది. సడన్‌గా చీర మార్చుకునే తెలుగు సినిమా హీరోయిన్‌లా ప్రకృతి రంగులు మార్చుకుంటుంది. పక్షుల కిలకిలారావాలు మారతాయి. సూర్యుడి వేళలు మారతాయి. ఇంతెందుకు సంవత్సరానికి రెండుసార్లు గడియారంలో సమయం కూడా మార్చుకోవాలి. కొత్త బట్టలు రోడ్డెక్కుతాయి. సెలవులకి పిల్లల కేరింతలు మార్మోగుతాయి. ఇండియాలో అయితే ఉష్ణోగ్రత మార్పు, రోగాల మార్పు, కరెంట్ బిల్లు మార్పు బాగా డామినేట్ చేస్తాయి. ఒకప్పుడు ఇండియా కూడా ఇలాగే ఉండేదేమో. మన కావ్యాల నిండా ఋతువర్ణనలేగా. ఇప్పుడు కిక్కిరిసిన మనుషులకు తప్ప మరి దేనికీ జాగా లేకుండా పోయింది.


చివరాఖరకు ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. ఇక్కడ మంచి మామిడికాయలు దొరకడం మాత్రం బహు దుర్లభం. ఇండియాలో అయితే ఎండలకు మాడిపోతూ, మామిడికాయలు తింటూ సేద తీరుతాం. ఇక్కడ మంచి చెర్రీలు, బెర్రీలు, పసందైన అరటి, బస్తాల కొద్దీ ఆపిల్, ఖర్జూరాలు (వీటిని తింటుంటే పెద్ద తాతయ్యతో కలిసి వెళ్ళి తిన్న పెద్ద ఈతకాయలే గుర్తు వస్తాయి), ఇంకా పేరు తెలియని, పేరు పలకలేని రకరకాల పండ్లు దొరుకుతాయి. ఒక్క మన మామిడికాయ తప్ప. అన్ని బగ్గులున్న సాఫ్ట్‌వేర్ దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఒకటీ అరా బగ్గులున్న మామిడిపళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చుగదా.

(కొన్నేళ్ళ క్రితం, ఒక సోమవారం.)