ఆ రోజు ఆదివారం. పనిమనిషి పది నిమిషాల నుండి కాలింగ్ బెల్ నొక్కుతోంది. తలుపు తెరుచుకోవటంలేదు. ఆమెలో కంగారు మొదలైంది. మామూలుగా అయితే, తాను రావడానికి అరగంట ముందే, ఉదయం ఏడు గంటల కల్లా, గుమ్మంలో ఉండే దినపత్రిక, పాల ప్యాకెట్ లోపలికి వెళ్ళిపోతాయి. కానీ ఈ రోజు ఆ రెండూ బయటే ఉన్నాయి. ఇరుగుపొరుగువారిని పిలిచింది. వారంతా కలిసి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. డైనింగ్ టేబుల్ పక్కన, నేల మీద పడిపోయి ఉన్నారు దాసుగారు. సగం తిన్న అన్నం అలాగే బల్ల మీద ఉంది. ఆయన చేతిలోని కూర ముద్ద గట్టిపడిపోయింది. చెప్పాలనుకున్న మాటేదో బయటకి రానట్టు ఆయన నోరు తెరుచుకుని ఉంది.
చుట్టుపక్కలవాళ్ళంతా అక్కడే గుమిగూడారు. పనిమనిషిలో విచారం కన్నా విభ్రాంతే ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడున్నవాళ్ళల్లో ఎక్కువ కాలంగా ఆయననెరిగున్నది ఆమే. ఆయనంటే ఆమెకి పెద్దగా ఇష్టం లేకపోయినా ఒక్కోసారి ఆయనంటే జాలి వేసేది… ఆ జాలి ఈ రోజు మరీ ఎక్కువగా ఉంది. ఆయనకి పట్టింపులు ఎక్కువ. ఆమె ఇల్లు ఊడుస్తుంటే వెనకాలే ఉండి – ప్రతి మూలా – సరిగ్గా ఊడుస్తోందా లేదా అని పట్టిపట్టి చూసేవారు. ఆమె పనికి ఎప్పుడెప్పుడు రాలేదో గుర్తుంచుకునేందుకు ఆయన ఆ తేదీలని ఓ నోట్‌బుక్‌లో రాసుకునేవారు, మరోసారి సెలవడిగితే, ఈ మధ్యేగా తీసుకున్నావ్ అంటూ ఆ తేదీలను చెప్పేవారు. ఆయనదంతా చాదస్తం అనుకునేదామె. అయితే, ‘ఒంటరిగా చనిపోయినప్పుడు, కబురుపెట్టడానికి ఎవరూ లేనప్పుడు, ఇలాంటి వాళ్ళ మీద జాలేస్తుంది, పాపం అనిపిస్తుంది’ అనుకుందామె.
అక్కడ గుమిగూడిన వారేమీ ఆయన మీద ప్రేమతో రాలేదు, తప్పదు కదా అనే భావనతో వచ్చారు. లోలోపల – ఆదివారం – సెలవు రోజు వృథా అయిపోతోందనే బాధ వారందరిలోనూ ఉంది. దాసుగారు వాళ్ళెవరితోనూ కలిసేవారు కాదు, బిల్డింగ్ ఫండ్‌కి తన వంతు వాటా ఎప్పుడూ ఇచ్చేవారు కాదు. తన పోర్షన్‍కి ఉండే మెట్ల మీద పిల్లలు పరుగులు తీస్తే ఆయనకెంతో చిరాకు. మేడ మీద తన వంతు వాటాలో చిన్న పూలతోటనే తయారుచేశారు. పొరుగువాళ్ళు గొడవ చేస్తే, అది తన హక్కు అని వాదించారు. రోజూ ఉదయం ఆరు గంటలకే నిద్ర లేచి, ఓ అరగంట సేపు ఆ తోటలో పూల మొక్కల మధ్య తిరిగేవారు. వడలిపోయిన ఆకులని, కొమ్మలని తీసేసి, మొక్కలకు నీళ్ళు పోసి, కుదుళ్ళలో గుంతలు తీసేవారు.
దగ్గరలో ఉన్న వైద్యుడికి కబురుపెట్టారు. హార్ట్ ఎటాక్ అని స్పష్టంగా తెలిసిపోతోంది. దాసుగారు రెండు పక్షులను పెంచుతున్నారు, బహుశా జీవితంలోని నిశ్శబ్దానికి కాస్తంత సందడి జోడించాలనేమో! మరిప్పుడు వాటి పరిస్థితి ఏంటి?
అక్కడున్న ఓ పిల్లాడు “వాటిని మనం తీసుకెళ్దామా అమ్మా?” అని అన్నాడో లేదో వాళ్ళమ్మ వాడిని గదమాయించింది. కొందరేమో పనిమనిషిని తీసుకువెళ్ళమన్నారు. “నాకే పూట గడవటం కష్టంగా ఉంటే, వాటినెలా పోషించాలి?” అందామె. కఠినాత్ములే పక్షులను బంధించి ఉంచుతారని, వాటిని స్వేచ్ఛగా వదిలేద్దామని ఓ యువకుడు అన్నాడు. “ఈ పక్షులు ఇంటిలోపల, ఎవరో పెడితే తినడానికి అలవాటు పడ్డాయి. మరి స్వేచ్ఛగా వదిలేస్తే బతకగలవా?” అని అడిగిందో అమ్మాయి. కాని వాటిని పంజరం నుండి విడుదల చేయాలన్న ఆ యువకుడి మాటలకు వత్తాసు పలికిన జనాల మాటల హోరులో ఆ పాప అడిగిన ప్రశ్న ఎవరికీ వినబడలేదు. వాటి సంగతి తర్వాత అనుకున్నారు.
దాసుగారి పార్థివదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్ళడం తక్షణ కర్తవ్యం. అక్కడున్న వాళ్ళల్లో కొందరు ఆంబులెన్స్‌ని పిలిపించారు. మొక్కుబడిగా కాసేపు మౌనం పాటించారు, శవాన్ని తీసుకెళ్ళిపోయారు. అక్కడ మిగిలినవాళ్ళు – ‘జీవితం ఎంత అశాశ్వతమో కదా’ అని అనుకున్నారు, ఆపైన తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు.
ఇక ప్రతి ఒక్కరూ దాసుగారి జీవితాన్ని విశ్లేషించడం మొదలుపెట్టారు.
కాలనీలోని ఈ అపార్టుమెంటు బ్లాకులోనే ఓ ప్లాటులో ఆయన చాలా కాలంగా అద్దెకి ఉన్నారు. ఆయన గురించి పనిమనిషి – తాను పని చేసే అందరి ఇళ్ళల్లో చెబుతూ ఉండేది. ఈ పనిమనిషిని పనిలో పెట్టుకోవడానికి ముందు ఆయన పదిమందిని మార్చారట. ఈమెకి ఆయన గురించి చెప్పినతను – ఆయన చాదస్తం గురించి కూడా చెప్పాడట. కానీ ఆమెకు పని అవసరం, పైగా దాసుగారు కూడా తరచూ పనిమనుషులను మార్చి విసిగిపోయారు. అందుకని వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సర్దుకుపోవాలనే ఒప్పందానికి వచ్చి, ఆ వృత్తి సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అలా ఇప్పటికి ఇరవై ఏళ్ళు గడిచాయి.
ప్రస్తుతం ఉంటున్న ఫ్లాటును కొనుగోలు చేసినప్పుడు – గృహప్రవేశం పూజకి పురోహితులు, ఆయన, ఆమె తప్ప మరెవరూ లేరు. అప్పుడు కూడా ఆమెకి ఆయన మీద జాలేసింది. పూజ అయ్యాక, నైవేద్యాల కోసం చేసిన పదార్థాలని ఆమెని తీసుకెళ్ళమని చెప్పారాయన. ఆయన చాలా తక్కువగా వండుకుంటారు. మరి ఈ రోజు అన్ని పదార్థాలు ఎందుకు వండించారో? ఆయన వస్తారని ఆశించిన వాళ్ళెవరో వచ్చినట్టు లేరు.
ఆ అపార్టుమెంటు కాంప్లెక్సులో ఉండే ఓ యువకుడు అన్నాడు – “నేను ఉదయాన్నే వ్యాయామం చేయడానికి టెర్రస్ పైకి వెళ్ళిన ప్రతి రోజూ అక్కడ నాకన్నా ముందే వచ్చిన దాసుగారు కనపడేవారు. మొక్కలకి నీళ్ళు పోసి, టెర్రస్ అంచున పిట్టగోడని ఆనుకుని నిలబడి రోడ్డు వైపు చూస్తూండేవారు. బహుశా ఎవరైనా వస్తారనేమో!”
కొందరు మహిళలు కొన్నేళ్ళ క్రితం తాము చూసిన ఓ సంఘటనని గుర్తు చేసుకున్నారు. “మీకు గుర్తుందా. ఓ రోజు మనం పిల్లల్ని స్కూలుకి దింపడానికి వెళ్తున్నాం. ఒకావిడ ఆయన ఇంటికి వచ్చింది. ఆయన కోప్పడి ఆమెను పంపేశారు. ఆమె ఏడుస్తూ వెళ్ళి కారులో కూర్చుంది, కొన్ని క్షణాల తరువాత కారు అక్కడ్నించి వెళ్ళిపోయింది” అందొకామె. ఆ వచ్చినామె ఎవరో? ఆయన కూతురా? లేక ఏదైనా ముది వయసు ప్రేమ వ్యవహారమా? ఎవరో ఎప్పుడో ఎక్కడో విన్నారట – ఆయన భార్య ఆయనని వదిలేసి వెళ్ళిపోయిందని, కూతురు కూడా తల్లితోనే ఉంటోందని!
ఆ కాలనీలోనే ఉంటున్న ఓ కవి మదిలో ఓ ఆలోచన మెదిలింది – అసలు దాసుగారికి ఏవైనా కలలుండేవా? వాటిని సాకారం చేసుకున్నారా? ఆయన ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? ఆ ప్రేమ విఫలమై, మనసు ముక్కలై, కోలుకోలేక ఇలా ఒంటరి జీవితం గడిపారా?
ఈ రకంగా, చనిపోయిన తర్వాత – అందరికి సంభాషణల్లోను, ఆలోచనల్లోనూ కేంద్రమయ్యారు దాసుగారు. బ్రతికి ఉండగా ఆయనని అందరూ ఓ తలనొప్పిగా భావించేవారు. అంతకు మించి ఆయన గురించి ఎవరూ ఏమీ ఆలోచించలేదు. ఒకసారి బాగా జబ్బుపడినప్పుడు, తనంతట తానే ఆసుపత్రిలో చేరారాయన. స్పీడ్ డయల్‍లో సేవ్ చేసుకున్న ఆంబులెన్స్‌కి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. సాయం కోసం ఎవర్నీ పిలవలేదు, సాయం చేస్తామని ఎవరూ ముందుకు రాలేదు.
పదకొండవ రోజున ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి స్థానిక క్లబ్‌ని బుక్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయనని కఠినాత్ముడని అన్న యువకుడికి ఈ కార్యక్రమం బాధ్యతలు అప్పగించారు, కాలనీలోని మిగతావారంతా ఆ యువకుడికి సాయంగా ఉంటామని అన్నారు. ఆ కార్యక్రమం తరువాత నిరాడంబరంగా సాధారణ భోజన ఏర్పాట్లు చేద్దామనుకున్నారు. అయితే పదకొండవ రోజు – పనిదినం అయింది. దాసుగారి కోసం, ఎవరికీ సెలవు పెట్టేందుకు లేదు. అందుకని ఈ కార్యక్రమాన్ని 15వ రోజు, ఆదివారానికి మార్చారు. అనుకున్న రోజున కార్యక్రమం నిర్వహించారు. తరువాత జనాలంతా సంతృప్తిగా ఇళ్ళకు బయల్దేరారు. ఆయన ఇంట్లోని పక్షులేమయ్యాయో అని ఓ కుర్రాడు అడిగాడు.
పెద్దవాళ్ళంతా ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. వాళ్ళంతా ఆ పక్షుల గురించి పూర్తిగా మర్చిపోయారు. ఒకరినొకరు నిందించుకోసాగారు. వాటిని స్వేచ్ఛగా వదిలేసి ఉండాలన్న యువకుడిని అందరూ తిట్టసాగారు. ఆ యువకుడు తిరగబడ్డాడు. వాదించుకుంటూ, వాళ్ళంతా అపార్టుమెంట్ ప్రెసిడెంటు దగ్గరకు వెళ్ళారు. ఆయన వద్ద దాసుగారి ఫ్లాటు తాళం చెవులున్నాయి. తాళం చెవులు తీసుకుని దాసుగారి అపార్టుమెంటు తలుపులు తెరిచి చూశారు. ఆహారం, నీరు లేకపోవడంతో, ఆ రెండు పక్షులు పంజరంలో చచ్చి పడున్నాయి.
“పక్షులని పంజరంలో బంధించి ఉంచితే, ఇదే జరుగుతుంది” అన్నాడా యువకుడు. మళ్ళీ అంత్యక్రియలకి బయల్దేరారు. ఈసారి దగ్గర్లోని ఓ తోటకి. అక్కడ గొయ్యి తవ్వి చనిపోయిన పక్షులని పాతిపెట్టారు. వాళ్ళ మనసుల్లో బాధ – మరో ఆదివారం వృథా అయిందని!
(మూలం: Death of a Neighbour)