“పద్యాన్ని రాగంతో చేర్చిపాడడం విని మేము ఆనందించినాము. మీరు చేసే శాస్త్రపరీక్షలో ఏది ఎలాగ మడతపడితే మాకేమి? అనుభవము ముందు, శాస్త్రం తర్వాత.” అని నా మిత్రులు చాలామంది అన్నారు. వారి అనుభవాన్ని నేను కాదనలేదు. “ఉదాత్తానుదాత్తాలు చెక్కుకుపోయిన సాహిత్యానికీ గమక సంపదా, స్వరముల స్ఫుటత్వమూ నష్టపోయిన రాగానికీ పద్యపాటకుడు చేసే సమ్మేళనము మీకు రుచిస్తే దానిని మీ యింట్లో చేయించుకోక సాహిత్య సభలలో ఈ పాకాన్ని రుద్దిస్తారేం?” అని అడుగుతున్నాను. ఆ సమ్మేళనాన్ని మీరు ఆమోదిస్తున్నారంటే ఏం చేస్తున్నారన్నమాట? ప్రతీ అక్షరమూ నాదంలో ములిగిన ఆ మాటల్ని దేవి తీసుకుని ఉదాత్తానుదాత్తాలు లేకపోయినా, మీ సాహిత్యసంస్కార బలంవల్ల వాటిని సప్లయి చేసుకుని ఆనందిస్తున్నారన్నమాట. సభలలో ఇంతపాటి సంస్కారమున్నవాళ్ళు తక్కువ. వారు వినేది సులభంగా ఆస్వాదించగలిగే సంగీతాన్నే.
ఇది సహజం. సంగీతం ఆపాతతోరమ్యం; సాహిత్య సమాలోచనామృతం. విన్నంతమాత్రాన్నే రంజించగలదు సంగీతం. ఆలోచిస్తేనేగాని కవిత్వానికి రంజించే శక్తి పుట్టదు. సంగీతసాహిత్యాలు చేరి వినపడినప్పుడు సులభంగా రంజించగల సంగీతం వేపే మొగ్గుతాముగాని సాహిత్యం వేపు అంత సుళువుగా చూడలేము. ఇది సహజము. సౌలభ్యం వేపే మానవుడి యత్నం సాగుతుంది. పద్యగానము జరిగినప్పుడు సాహిత్యసౌందర్యం అనుభవించాలన్నా, సాహిత్యానికి విలువకట్టాలన్నా, సభ్యులకు ఆపాతతోరమ్యమైన సంగీతము తెరలాగ అడ్డుపడుతుంది. ఈ జిలుగు తెర వెనుక హీనస్పష్టతతో సాగిపోయే సాహిత్యం చక్కగా గోచరించదు. కీర్తనలలోని సాహిత్యంలో తప్పులు దొర్లినా సంగీతముగ్ధమైన సంస్కారం ఈ తప్పుల్ని గమనించకపోవడము మనకి అనుభవసిద్ధమే. ‘నతజనపరిపాలయ’ కీర్తన పూర్తిగా పాడైపోయింది. ముసిరి సుబ్రహ్మణ్యయ్యరు ‘నగుమోము’లో ‘మొరలిడదు’నీ, చెంబైమంగళంలోని పవమాన ‘సుతడు’నీ గుర్తించగలిగినవారు ఎంత మంది?
చెవికి ఇంపుగొలిపే యమక, లాట, ఛేక, వృత్యనుప్రాసాల బంగారు గజ్జెల సవ్వడిలో తెలుగు సరస్వతి పలుకులు చాలాకాలం మరుగుపడ్డాయి. ఏలాలతా జాలడోలలూ, మధురసాధిక సుధామధుర సొరోల్లన్మధురసావల్లరీ మహిమలూ మువ్వలు మోగించి సాహిత్యాన్ని అడుక్కి తొక్కేశాయి. నేడు వాటిమీద వ్యామోహం తగ్గింది కాని సంగీతం సవారిచేస్తోంది సాహిత్యమ్మీద ఇంకా. సాహిత్యానికి ఈ బానిసత్వం తప్పించండి.
“చేరిక సంగీత సాహిత్యాలకు లేనేలేదంటారా? క్షేత్రయ్యపదాల్ని పాడుతూ అభినయం చేస్తే బాగుంటాయని మీరు ఒప్పుకోరా?” అని ఒక మిత్రులు ప్రశ్నించారు. పదాల అభినయానికి కళాసిద్ధి లేదంటున్నాను. అది విద్యగానే నిలిచిపోయింది గాని కళగా తయారుకాలేదు. ఏమంటారా? కళలో, కర్త తన భావాల్ని ఇతరులకందించడానికి యత్నిస్తాడు. పదాల అభినయంలో నర్తకి తన విద్యా నైపుణి ప్రకటిస్తోందిగాని కళాసృష్టి చెయ్యడము లేదేమో? అనగా తన భావాల్ని చూపరులకందించే యత్నము చెయ్యడమే లేదేమో, కేవలం తన నేర్పునే ప్రకటిస్తోందేమో గుర్తించండి అంటున్నాను. పదాల సాహిత్యం — అంటే పదాలలోని భావాలు — నర్తకి స్వంతభావాలు కాదు. పదాల సంగీతం కూడా అస్థిపంజరమాత్రంగా నిర్ణయం అయే ఉంది. ఇక సంగీతంలోనూ, సాహిత్యంలోనూ నర్తకికి మిగిలిందేమిటీ? శ్రోతలు ఆ భావాలు తనవే అనుకునేటట్లున్నూ, అందులోని సంగీతముకూడా తన స్వంతమే అనుకునేటట్లున్నూ నటించడము.
సంగీతమూ సాహిత్యమూ చేరేసరికి, ఆ మిశ్రమం సంగీతమూ కాకుండా సాహిత్యమూ కాకుండా పోతుంది. ‘శివదీక్షాపరురాలనురా’ అన్న మాటని ఉదాత్తానుదాత్తాల మార్పువల్ల నాలుగైదు సూక్ష్మఛాయలు స్ఫురించేటట్లు వాచికాభినయం చెయ్యవచ్చును. ‘శివదీక్షాపరురాలనురా’ అనే పల్లవిని నాలుగైదు సంగతులు చేర్చి పాడవచ్చును. ‘శివదీక్షాపరురాలనురా’ అనే సాహిత్యాన్ని శివముద్రలు – నాలుగైదు వేరే ముద్రలు – చేర్చి అభినయం చెయ్యవచ్చును. నర్తకి చేసే పదాభినయంలో సంగీతముండడము చేత (సాహిత్య) వాచికాభినయం వెనక్కి పోతుంది. ముద్రాభినయంవల్ల సంగతులు చప్పబడతాయి! మొత్తానికి పైకి తేలేది ఏమిటీ? ముద్రల అభినయం. ముద్రలు చూపిస్తూనే సంగతులు చూపించడము నర్తకికి అసాధ్యం కనక (నటరాజు భంగిమ చూపిస్తూ ఒంటికాలిమీద నిలిచి, రెండో కాలు కుంచించి చేతులతో ముద్ర చూపించే నర్తకి గొంతును పూరించి ఎలాగు పాడగలుగుతుందీ?) పక్క పాట పాడే స్త్రీ చూపించాలి సంగతుల మాధుర్యాన్ని. ఇక సాహిత్యాభినయం ఎక్కడిదీ?
పదాభినయం పాకము కాదు, కలగూరగంప అంటున్నాను. ఉదాత్తానుదాత్తాల మార్పులవల్ల సాధించడానికి వీలయిన సంచారభావాలకి, సంగీతపు సంగతులకీ, అభినయముద్రలకీ సామరస్యము కుదరదు. అందువల్ల భాషకీ సంగీతానికీ గౌణస్థానమిచ్చి, అభినయము ప్రధాన స్థానమాక్రమిస్తుంది. ఈ అభినయమైనా వ్యాఖ్యానరూపంగానే వుంటుంది.
శివదీక్షా… అని శివముద్రలూ, స్నానసంధ్యాద్యనుస్ఠానాలూ, పూజాపునస్కారాలూ అభినయిస్తుంది నర్తకి, ఈ అభినయం యొక్క గురి మనస్సుమీదికేగాని హృదయంమీదికి కాదు. అందుకే పదాభినయం కళ కాదేమో అన్నాను.
శిల్పమూ, వాస్తుశిల్పమూ, చిత్రకళా చక్కగా అతుక్కుంటున్నాయనీ, అజంతాలోనూ, ఎల్లోరాలోనూ, లేపాక్షిలోనూ, మధురలోనూ, శ్రీకూర్మములోనూ, సింహాచలంలోనూ ఈ మూడుకళల చేరికనీ చూడవచ్చుననీ ఒక మిత్రుడన్నాడు. ఈ క్షేత్రాలన్నిటినీ కాకపోయినా చివరి మూడింటినీ అసలు రూపంలోనూ, మొదటి మూడింటినీ బొమ్మల రూపంలోనూ చూశాను నేను. ఒక్క మధురలో తప్ప, శిల్పవిగ్రహాలకి రంగు పూయడము తక్కినచోట్ల లేదు. అన్ని చోట్లలోనూ చిత్రకళ గోడలమీదా, లోకప్పుమీదా ప్రత్యేకంగానే వుంది. దేవాలయాలు చూడవచ్చినవారికి ఈ చిత్రాలు ప్రత్యేకం యోగము కలిగిస్తాయిగాని వాస్తు శిల్పానికి, వీటికీ సంబంధము లేదు. ఇక శిల్పమూ వాస్తుశిల్పమూ చేరికతో వున్నాయంటే అర్థమేమిటో మనవిచేస్తాను.
ద్వారసముద్రము రాజధానిగా, పదీ పదకొండూ పన్నెండో శతాబ్దాలలో విజృంభించిన హోయసలలు మూడువందల దేవాలయాలు కట్టించారు. ఆ దేవాలయాల పీఠం చుట్టూ పన్నెండుదాకా శిల్పవలయాలు వడ్డాణాలుగా అమర్చారు. దేవాలయం కప్పు వరకూ చేతికందుకొచ్చినంతవరకూ శిల్పాన్ని విరజిమ్మేశారు. కాని, ఈ దేవాలయాల్లో శిల్పవలయాలే కాక, మనిషి ఎత్తున విగ్రహశిల్పం కూడా కనబడుతుంది. ఈ విగ్రహాల్లో వేణుగోపాలుడు వంటి ప్రత్యేక శిల్పాలు కూడా వున్నాయి. దేవాలయానికి వచ్చే భక్తులు ఈ శిల్పాల్ని చూచి భక్త్యుత్సాహులు అవడానికి కావలసినంత అవకాశముంది. వాస్తుశిల్పంతో చేరే వున్నప్పటికీ హోయసలుల విగ్రహశిల్పం తన ప్రత్యేకతని పూర్తిగా కోల్పోలేదు. కాని, శిల్పాన్ని వాస్తుశిల్పానికి బంటుగా చేసి దాని ప్రత్యేకతని కొంత దిగదీసినవారు మాత్రం హోయసలులే. స్తంభాలకి పైన వున్న దూలాలకి మోపుగా నర్తకి విగ్రహాల్ని వాడేరు వీరు. ఈ అలవాటే కాకతీయులు పాలంపేట, ఘనపూరు, దాక్షారామాల్లో దిగుమతి చేసుకున్నారు. శిల్పానికి ప్రత్యేక సౌందర్యం పోగొట్టే రోగం హోయసలుల అశ్రద్ధాతిశ్రద్ధలవల్ల దాపురించింది. విజయనగర రాజులు శిల్పాన్ని స్తంభాలరూపంలో ఇమిడ్చీ, గోపుర వలయాలలోనికెక్కించీ పూర్తిగా పాడుచేశారు. శిల్పము వాస్తుశిల్పంతో కలిసి… కాదుకాదు, వాస్తుశిల్పంలో పూర్తిగా జీర్ణమైపోయింది విజయనగర శిల్పంలో. దీన్ని శిల్పవాస్తుశిల్పాల మేళనమని ఎలాగంటామూ? విజయనగర స్తంభశిల్పంలో చేతివాటమేకాని, చూచేవారికి యోగము కలిగించేటంత కళాసిద్ధి లేదు. కాబట్టి ఈ పులగాన్ని శిల్పవాస్తుశిల్పాల సమ్మేళనమని అనకూడదేమో అంటాను.
ఇంక గోపురాలనధిష్టించిన శిల్పంలో సౌందర్యం అన్నది లేనే లేదు. ఆ విగ్రహాలు భూమిమీద ఉన్నవారికి ఏర్పాటుగా కనపడవు. గోపురపుటంచులు దూరానికి బారులేఖల్లాగా, గోపురముఖం సమతలంలాగా కనబడకుండా విరవడానికి ఈ విగ్రహాల అట్టహాసము ఎందుకూ? పల్లవులవలె చిన్న చిన్న శిఖరాలూ, మందిరాలూ వాడితే వీటికన్న సుందరంగా విరుగుతాయి అంచులూ, ముఖతలమూను. గోపురమ్మీది శిల్పంయొక్క సౌందర్యం చూచేవారికి అంది, వాస్తు శిల్పం యొక్క బారురేఖల్నీ సమతలాల్నీ ఈ శిల్పం చక్కగా విరిచినప్పుడే శిల్పవాస్తుశిల్పాలు మేళవించాయి అనడము న్యాయము. దక్షిణ దేశ దేవాలయ గోపురాల్లో దేనిమీదనూ ఈ సమ్మేళనము జరగలేదు. గోపురాలమీది శిల్పంలో మహా ఉంటే కథనము మాత్రమే ఉంది. సుందరకథనము లేదు. అలాంటప్పుడు దాన్ని శిల్పమని ఎలాగ అనగలమూ? ఈ నీరసపు బొమ్మలకీ, గోపురరూపానికీ చేరికే గాని సమ్మేళనం కానటువంటి గోపురశిల్పాన్ని శిల్పవాస్తుకళల సమ్మేళనమని ఎలాగనగలమూ?
నాటక ప్రదర్శనము సంగతీ ఇంతే. నాటక సూత్రధారుడు పాత్రల భావాల్నీ, వారు తిరిగిన ప్రకృతి రంగాల్నీ, వారి పాటల్నీ ఏవుద్దేశంతో ప్రదర్శిస్తున్నాడు? వారి కథ మన కళ్ళ ముందర జరిగిపోతోందనే భ్రాంతి కల్పించడానికి. అంతేగాని, పాత్రల భావ సౌందర్యాన్నీ, వారు విహరించిన దృశ్యాల సౌందర్యాన్నీ, వారి విన్యాస సౌందర్యాన్నీ మనకి అందించడానికి కాదు. తెరల మీద ఉండవలసినవి యుక్తదృశ్యాలే కాని సుందరదృశ్యాలు కావు. పాత్రల నోట రావలసినవి యుక్తవచనాలే గాని సుందర వచనాలు కావు. పాత్రల సంగీతము వారి యుక్తభావాల్నీ, ఆవేశాన్నీ తెలిపేదేకాని, రచయిత సొంత ఆనందాన్ని గాని, సూత్రధారుడి వీరావేశాన్ని గాని తెలిపేది కాదు. నాటకంలోని పాత్రల భావాలు రచయిత యొక్క స్వంత కవిత్వం కాదు. ఆ పాత్రలకి యుక్తమైనవని అతడూహించి అమర్చిన భావాలు. ఇలా అమరుస్తూన్నప్పుడు లోకవృత్తానుకరణమే అతని ఉద్దేశం కాని, సౌందర్యసాధన కానేకాదు.
కాబట్టి నాటక ప్రదర్శనం మొత్తానికేగానీ మాటలకీ, తెరలమీద చిత్రాలకీ ప్రత్యేకంగా కళాసిద్ధి లేదు. సూత్రధారుడు మొత్తపు ప్రదర్శనం ద్వారా మనతో మాట్లాడతాడు గాని, తెరలమీది చిత్రాల ద్వారానూ, పాత్రల సంగీతం ద్వారానూ మనల్ని పలకరించడు. ఏ తెలివితక్కువ దర్శకుడైనా సీనరీలతో మనల్ని పలకరించడము ప్రారంభించాడంటే అతని ప్రదర్శనం గంగలో కలుస్తుంది. అందమైన పద్యాల ద్వారాగాని, సుందరమైన సంగీతం ద్వారాగాని పలకరించే రచయిత నాటకం కూడా చివరికి మన మనస్సుకెక్కదు. తోట వెంకటేశ్వరరావుగారి అజంతా స్త్రీల విన్యాసాలూ, బలిజేపల్లివారి కవిత్వ ప్రత్యేక మాధుర్యమూ, గుబ్బి కంపెనీవారి రంగప్రసాధనమూ, మొత్తపు ప్రదర్శనం యొక్క భుజాలమీద చేతులాని మన మనస్సుల్లోకి తొంగిచూస్తున్నాయంటే నాటక ప్రదర్శనం ఏమయినట్టూ? నాటకంలోని విన్యాసాలు శిల్పమనీ, పద్యాలు కవిత్వమనీ, రంగప్రసాధనం వాస్తువనీ భ్రమించినవారి చర్యలే పైన చెప్పిన ఉదాహరణాలు. నాటకం కళల కూడలీ, సమ్మేళనమూ కాదు. అది లోకవృత్తానుకరణము. లోకవృత్తంలోని భావాలు ప్రకృతే; కళ కావు. తెరలమీది చిత్రాలూ, పాత్రల విన్యాసాలూ, ప్రకృతిలోని తునకలే, కళల తునకలు కావు.
రెండు కళలు కలుస్తాయన్నది భ్రమ. అందపుటూహ. స్వప్నము. రెండు కళల్ని కలిపేము అనగానే, దేన్నోదాన్ని తొక్కేశాము అన్నమాటే. త్యాగరాజస్వామి కీర్తనలలో సాహిత్యానికీ, సంగీతానికీ మేళము కుదిరిందని ఘట్టిగా చెప్తున్నారే భక్తులూ… అది వట్టి అపోహ. కోప్పడకండి, మనవి చేస్తున్నా, చిత్తగించండి. జయదేవుడూ, రామదాసూ, తాళ్ళపాకమువారూ రచించిన కీర్తనలలో అక్షరం అక్షరానికీ స్వరాలుంటాయి. సంగీత ప్రాబల్యం వాటిలో తక్కువే అనాలి. ఆ సంగీతాన్ని విని మహదానందం పడడానికి అవకాశమూ తక్కువే. త్యాగరాజస్వామి కీర్తనలలో అక్షరాలా, మాటలా ప్రాబల్యం కంటే సంగీతపు ప్రాబల్యం ఎక్కువ. సంగీతాన్ని అనుభవించడానికి అవకాశం ఎక్కువ.
త్యాగరాజస్వామి పరమ భాగవతుడు. సాహిత్యపు అట్టహాసము లేకుండా అందరికీ తెలిసేటట్టు తన ఆవేదనని కీర్తనలలో ఇమిడ్చాడు. సాహిత్యార్థమూ, సంగీత మాధుర్యమూ రెండూ సులభాలే అయినాయి. వీటికేదో మేళము కుదిరిందనుకోడము సుఖమైన, సుందరమైన ఊహ. కనక దాన్ని దొరకపుచ్చుకున్నారు ఎందరో మహానుభావులు! గమనించి చూస్తే ఈ సత్యం బోధ అవుతుంది. త్యాగరాజు స్వామి కీర్తనలలో రమ్యమైన భావాలు గుప్పెడే, సంగీతరమ్యత అపారమంటున్నాను. ఆయన సంగీతరచన సాహిత్యభావాలకి అనుగుణంగా నడిచిందనుకోడము ఆయన సంగీత సృష్టిని కొంచెపరచడమే. ‘ఇదుగో ఇక్కడ సంగీతం మంద్రంలో నడిచిందీ, అక్కడ భావానికి అనుగుణంగా తారస్థాయిలో నడిచిందీ’ అని కనిపెట్టుకోడం, స్కేలు పట్టుకుని కొలిచి, ‘నీ మూతి ఎత్తు నీ ముక్కు కొలకి ఇన్నో భాగం, అందుకే నువ్విలాగున్నావు’ అని నిర్ణయించడం లాంటిదే. క్షేత్రయ్య పరమరసికుడు; తనకున్న అనుభవ సంస్కారాన్ని తన పదాల్లో ఇమిడ్చాడు. త్యాగరాజస్వామి సాధకుడు. తన భక్తిని కీర్తనలలో వెలిబుచ్చాడు. మరొకరు వేశ్యాభుజంగులు, జావళీలు రాశారు. చిత్రకళని పటములాగే, వాగ్గేయకారులకు సాహిత్యం ఉపయోగపడింది. అంతమట్టుకే. అంతేగాని వీరి కీర్తనలలో సంగీత సాహిత్యాలకి మైత్రి కుదిరిందీ, వారికి కుదరలేదనుకోడం శుద్ధవెర్రి.
త్యాగరాజస్వామి కీర్తనలు ఆరు వందలదాకా వున్నాయి. వీటిలో తోడి, ఖరహరప్రియ రాగాలమీది కీర్తనలు చాలా వున్నాయంటారు సంగీతజ్ఞులు. ఈ కీర్తనలలోని సాహిత్యభావాలు (రాగము ఒకటైనంత మాత్రాన) సమరసంగా లేవు. ఒక రాగంలో వున్న కీర్తనల్ని అన్నిటినీ చూసి, వాటిలోని ధాతుమాతు సామరస్యాన్ని దేవితీసి, సంఖ్య మొత్తమ్మీద కుదిరే సామరస్యం కనబడితే అప్పుడనాలి ‘ఇదుగో సామరస్యం’ అని. అంతేగాని త్యాగరాజు కీర్తనలనే నదిలో గాలం వేసి, రొయ్య ఒకటి పట్టుబడితే, ఈ నదిలో రొయ్యలు కూడా ఉన్నాయనడము హాస్యాస్పదము. ‘ఎందు దాగినాడో’ అన్నది సందేహాస్పదమైన తోడిలో వున్నది చూడండి అంటే, కోటి నదులు, మును రావణ బాధలు మాట ఏమిటని వెంటనే ప్రశ్న పుడుతుంది.
ఒక్కొక్క కీర్తనలో చరణాలు ఉంటాయి. వాటికి స్వరము ఒకటే. భావము మట్టుకు వేరుగా వుంటుంది. మరి సంగీత సాహిత్యాలకి చేరిక కుదిరిందంటే ఏమిటి? కీర్తనలో పల్లవి, అనుపల్లవి, చరణము అని మూడు భాగాలుంటాయి. పల్లవిలో రాగము యొక్క రేఖాచిత్రముంటుంది. అనుపల్లవి తారస్థాయి పంచమందాకా పోతుంది. చరణములో రాగములోని ఇతర సంచారము మొదటిభాగంలోనూ, అనుపల్లవి మాదిరి రచనే రెండో భాగంలోనూ ఉంటుంది. పల్లవికీ, అనుపల్లవికీ చరణం ప్రథమభాగానికి, చరమభాగానికీ కూడా మూడింటికి తక్కువగాని సంగతులుంటాయి. ఈ నాలుగు భాగాలలోనూ, ఒకదాన్ని విడిచి మరోదాన్ని అందుకున్నప్పుడు మూడు సంగతుల్ని పాడటము పరిపాటి. త్యాగరాజ స్వామి శిష్యప్రశిష్యులు ఈ రీతిగానే పాడుతున్నారు కనక ఇది ఆయన పద్ధతే అనడానికి సందేహము లేదు. కీర్తనల్ని పరిశీలిస్తే, ‘ఎంతని వర్ణింతును శబరీభాగ్యం’లోనూ, ‘వినతాసుత’లోనూ, ‘బాగాయెనయ్య’లోనూ చరణపు పూర్వభాగానికీ చరమభాగానికీ నడుమ సాహిత్యం అడ్డదిడ్డంగా విరుగుతుంది. సాహిత్యం కోసం చూస్తే సంగీతం గట్టెక్కి అక్షరాలతో దొర్లుకుంటూ పోతుంది. సంగతులకోసం చూస్తే సాహిత్యం విరుగుతుంది.
త్యాగరాజస్వామి సంగీతానికే ప్రాముఖ్యత ఇచ్చినట్లు చక్కగా సాక్ష్యం ఇస్తాయి ఇలాంటి కీర్తనలు. నేటి తెలుగు సంగీతవిద్వాంసులకు కొందరికి త్యాగరాజుకున్న కీర్తనాసాహిత్యమ్మీద ఆయనకంటే ఎక్కువ ప్రేమ! అది అరవవిద్వాంసుల నోటిలో నలిగిపోతూంటే వీరు పద్యాలు పాడినట్టు కీర్తనలు అనేసి సాహిత్యాన్ని చక్కగా రక్షిస్తున్నారు.
కలవవు రెండు కళలు! సంగీతమూ, సాహిత్యమూ కూడా కలవవు. వింత యేమిటి? ఇవి ఆదిలో వేరుగా పుట్టేయి, భరతముని చేర్చికట్టినా, కాలక్రమ వికాసంలో వేరైపోతున్నాయి. అస్తు.
ఇంతకూ, రాగం చేర్చకపోతే పద్యానికి వచ్చే నష్టం ఏమిటి? పద్యగతి రాగవాహినిలో జారిపోక, తన విశిష్ట, విలక్షణగతితో ప్రత్యక్షమౌతుంది. పద్యగతి సౌందర్యం మనకీ చక్కగా స్ఫురిస్తుంది. పద్యం పదహారణాల సాహిత్యమే గాని సంగీతాన్ని ఆశ్రయించే గేయంవంటిది కాదని అందరికీ అవగాహన అవుతుంది. పద్యసాహిత్యము సహజ సౌందర్యంతో ప్రత్యక్షమౌతుంది. ‘పాడగలవారి’ కవిత్వము సంగీతపు బొంతలు పోయి నిజస్వరూపం చూపిస్తుంది. సభాస్తారులకు పద్య సాహిత్యం దగ్గిరౌతుంది. ప్రజల కావ్యరసాస్వాదనా శక్తి ఎక్కువౌతుంది. సంగీతము రాని కవులు సభాముఖాన్న తమ కవిత్వము వినిపించడానికి నిలదొక్కుకోవచ్చును. మరొకరి చేతిలో పెట్టి ‘అమ్మా, నీ యెంగిలి ప్రసాదం’ అననక్కరలేదు.