మరో గురుదక్షిణ

“ఒక్కరం, ఒక్కరంటే ఒక్కరం కూడా ఆపలేకపోయాం‌ అర్జునుడిని ఇవాళ. సిగ్గుచేటు!” అన్నాడు ద్రోణుడు తలదించుకుంటూ.

ఎదురుగా ఆసనాలపై‌ ఉన్న దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ ఒకరిమొఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళకీ ఏం‌ పాలుపోవట్లేదు.

“అతనో రుద్రుడిలా కనపడ్డాడివాళ!” అన్నాడు పక్కనే ఉన్న కృపాచార్యుడు‌ గంభీరంగా.

“మనల్నందర్నీ ఓడించి మరీ ఆ సైంధవుడి తల ఖండించాడంటే, ఇక ఏ‌ శక్తీ అర్జునుడిని ఆపలేదు” అన్నాడు ద్రోణుడు లేచి అటూ ఇటూ నడుస్తూ.

ఆ అత్యవసర సమావేశంలో అర్జునుడి విజృంభణ‌ గురించిన చర్చ తప్ప మరుసటి రోజు వ్యూహమేవిటో ఎవరూ మాట్లాడలేక పోతున్నారు.

“ఆ కృష్ణుడే లేకపోతే అర్జునుడేమీ చేయలేక పోయేవాడు. అంతా మాయ. ఆ సుదర్శనాన్ని అడ్డుపెట్టి…”

“చాలించు కర్ణా! ఆ మాయ తర్వాత అర్జునుడితో నువ్వూ తలపడ్డావు కదా? ఏం చేయగలిగావ్?” విసురుగా అన్నాడు ద్రోణుడు.

“అంగరాజునెందుకు ఆక్షేపిస్తారు ఆచార్యా, మీరూ ఎదుర్కొన్నారు కదా అర్జునుడిని ఆ తర్వాత? అవున్లే, మీ ప్రియశిష్యుడనే కదా…”

“దుర్యోధనా! కురుసేనాపతి, సకల యుద్ధవిద్యా విశారదుడికీ‌ ఇదేనా నువ్విచ్చే గౌరవం?” అన్నాడు కృపుడు గొంతు పెంచి.

“ఈయన దగ్గర అన్ని శక్తులుండీ‌ ఏం‌ లాభం?” అన్నాడు దుర్యోధనుడు వెటకారంగా.

“నీ మిత్రుడు, ఈ రాధేయుడి దగ్గరా ఉంది కదా వాసవీ శక్తి? అర్జునుడిని హతమార్చడానికే ఉపయోగిస్తానని గొప్పలు చెప్పడమే కానీ ఇప్పటివరకూ దాన్ని బైటికి తీసిన‌ పాపాన పోలేదు.”

“అదీ… ఆచార్యా…” కర్ణుడేదో చెప్పబోయాడు.

“నువ్వాగు కర్ణా, ఆ మాయారాక్షసుడు, ఘటోత్కచుడిని హతమార్చడానికి నేనే ఆ అస్త్రాన్ని వాడమని కర్ణుడిని బలవంతపెట్టాను. లేకపోతే ఈ‌ రోజు మనమెవ్వరమూ మిగిలుండే వాళ్ళం కాదు.”

“నాశనం! ఆ అస్త్రం కూడా పోయిందంటే ఇక ఈ కురుసామ్రాజ్యాన్ని అర్జునుడి నుండి కాపాడడం అసంభవం.” తలపట్టుకున్నాడు కృపుడు.

“అశ్వత్థామ దగ్గరున్న నారాయణాస్త్రాన్ని ప్రయోగించగలిగితే?” అడిగాడు కర్ణుడు తన మీద వాదనని తిప్పడానికి.

“భక్తితో దాని ముందు మోకరిల్లితే నారాయణాస్త్రం ఎవరికీ కీడూ చెయ్యదు. ఆ సంగతి కృష్ణుడికి తెలియకపోదు” అన్నాడు అశ్వత్థామ ఇబ్బందిగా.

“మీరెవ్వరూ అవసరం లేదు. ఈ కర్ణుడొక్కడే వంద అర్జునులతో సమానం. రేపు చూద్దురు గాని ఇతడి ప్రతాపం.” అన్నాడు దుర్యోధనుడు మిత్రుడి భుజం తడుతూ.

“నీ మిత్రుడు శక్తివంతుడే. కాదనలేదు. కానీ ఇతడికెన్ని శక్తులున్నాయో వాటికి మించిన శాపాలు కూడా ఉన్నాయి. పైగా పెద్ద దాత! ఎప్పుడు ఏం దానం చేస్తాడో తెలియదు. యుద్ధంలో ఇతడిని నమ్ముకోలేం” అన్నాడు కృపుడు.

దుర్యోధనుడు విసురుగా లేచి, అందరినీ కోపంగా చూస్తూ బైటికి వెళ్ళిపోయాడు. వెనకే కర్ణుడూ, అశ్వత్థామా బైటికి నడిచారు. కృపుడూ పైకి లేచాడు.

“నా ప్రియశిష్యుడంటే యుద్ధంలో నాకు సహాయంగా కదా నిలబడాలి ఆచార్యా?” అడిగాడు ద్రోణుడు.

“మనం‌ పీకలలోతు అధర్మంలో కూరుకుపోయున్నాం మిత్రమా! సహాయానికి కాదు కదా, యుద్ధభూమిలో మరణిస్తే మనల్ని చూడడానికి కూడా ఎవరూ ఇటు వైపుకి రారు” అన్నాడు కృపుడు బైటికెళుతూ.

ఆ గుడారం బయట కాపలా కాస్తూ, ఆ సంభాషణంతా వింటున్న ఓ భటుడు, ద్రోణుడు నిద్రకి ఉపక్రమించాడని నిర్ధారించుకున్నాక, మెల్లగా గుడారం వెనకున్న అడవిలోకి నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఓ చోట ఆగి, చెయ్యి పైకెత్తి మెల్లగా ఈల వేయడం మొదలుపెట్టాడు. కొంత సేపటికి ఓ గద్ద రివ్వున ఎగురుకుంటూ వచ్చి అతడి చెయ్యి మీద వాలింది. దాన్ని సంతోషంగా నిమురుతూ, తన భుజానికున్న ఎర్ర తాయత్తుని తీసి దాని కాలికి కట్టాడు. తిరిగి అది ఎగిరిపోతున్న దిశ వైపు అలాగే చూస్తూ నిలబడి పోయాడతడు.


తరువాతి రోజు ద్రోణుడొక ప్రచండశక్తిగా పాండవుల మీద విరుచుకుపడ్డాడు. పాండవుల కథ ఒక్కరోజులో తారుమారైంది. నిన్న ఎదురులేని శక్తనుకున్న అర్జునుడు ఇవాళ ద్రోణుడి ఎదుట నిమిషమైనా నిలబడలేకపోతున్నాడు. ముందు రాత్రి దుర్యోధనుడి మాటల వల్ల పాండవుల మీద ఏమాత్రం కనికరం చూపించదలుచుకోలేదు ద్రోణుడు. భీముడూ, ధర్మరాజూ అతడికి అడ్డుపడ్డారు కానీ నిలవలేకపోయారు. నకులుడూ సహదేవుడూ దగ్గరికొచ్చే సాహసమే చెయ్యలేదు. చూస్తుండగానే పాండవసైన్యం ద్రోణుడి అస్త్రాల బారిన పడి మాయమైపోతోంది. ఇంకొద్ది గంటలు అలానే గడిస్తే ఆ రోజే యుద్ధం ముగిసిపోయే పరిస్థితి!

అప్పుడే, కృష్ణుడిచ్చిన ఉపాయంతో, అశ్వత్థామ అనే పేరున్న ఏనుగుని హతమార్చాడు భీముడు. తర్వాత ద్రోణుడి రథం చుట్టూ తిరుగుతూ అశ్వత్థామ తన చేతిలో మరణించాడని నినాదాలు చెయ్యడం మొదలుపెట్టాడు. పుత్రుడు మరణించాడన్న వార్త విన్న ద్రోణుడు నెమ్మదించాడు కానీ పూర్తిగా భీముడిని నమ్మలేదు. వెళ్ళి ధర్మరాజుని అడిగితే “అశ్వత్థామ మరణించాడు ఆచార్యా!” అని పెద్దగా అరిచి “ఏనుగు” అని చిన్నగా వినపడకుండా అన్నాడు. ద్రోణుడికి పుత్రుడే జీవితం. అంతటి పరాక్రమవంతుడైన తన కొడుకు యుద్ధభూమిలో ఎక్కడో అనామకుడిలా పడున్నాడనే వార్త అతడిని కలచివేసింది. విరక్తితో తన ధనుర్బాణాలని వదిలేసి, అక్కడే రథం ముందు పద్మాసనంలో కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు.

పాండవులూ కౌరవులూ యుద్ధం ఆపేసి, తెల్లటి యోగిలా యుద్ధభూమి మధ్యలో కుర్చున్న ద్రోణుడినే చూస్తున్నారు. అంతలో ఎక్కడి నుండి వచ్చాడో, హఠాత్తుగా ద్రోణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు దృష్టద్యుమ్నుడు. తన ఖడ్గాన్ని ద్రోణుడి మెడకు దగ్గరగా తెచ్చి సరి చూసుకుని, పైకెత్తి బలంగా వేటు వెయ్యబోయాడు… హఠాత్తుగా ఓ బాణం రివ్వున వచ్చి అతడి చేతిలోకి దూసుకుపోయింది. అప్రయత్నంగా ఆ కత్తి జారిపోయింది. మరో బాణమొచ్చి రెండో చేతిని భూమికి గుచ్చేసింది. ఆ బాధకి అతడు చేసిన ఆర్తనాదం యుద్ధభూమిలో మార్మోగింది. అందరూ ఊపిరి తీసుకోకుండా అతడి వైపే చూస్తున్నారు. బాణాలు తీయలేక విలవిలలాడుతున్న పాండవ సేనాపతిని కాపాడటానికి రథాన్ని ముందుకు నడిపాడు అర్జునుడు. అప్పుడే అకస్మాత్తుగా ఆకాశంలో బాణాల వర్షం మొదలైంది. వేల బాణాలు పాండవుల్ని తరుముకుంటూ వస్తున్నాయి. ముందుకి కాదు కదా, వాటి ధాటి నుండి తప్పించుకోవడానికి అందరూ వందడుగులు వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. క్షణాల్లో కౌరవులకీ, పాండవులకీ మధ్య ఉన్న నేలంతా ఆ బాణాల ధాటికి ఎర్రగా మారిపోయింది.

జరుగుతోందేమిటో ఇరువైపులా ఎవరికీ అర్థం కావట్లేదు. ఇదేదో దైవమాయే అయ్యుంటుందని ఆశ్చర్యంగా పైకి చూస్తున్నారు అందరూ. ఆ క్షణంలో, కౌరవుల సమూహం వెనక నుండి‌ పెద్ద కలకలం మొదలైంది. దూరంగా ఎర్రటి దుమ్ము మేఘంలా తరుముకొస్తోంది. దుర్యోధనుడు, కర్ణుడూ వెనకకి వెళ్ళి చూశారు. కొన్ని వేల గుర్రాలు, రథాలు, ఏనుగులూ తమ వైపు వస్తూ కనపడ్డాయి. కౌరవ సేన ఆయుధాల్ని ఎక్కుపెట్టేలోపే ఆ కొత్త సేన కౌరవసేన మీదకొచ్చేసింది, కౌరవులలో ఆప్యాయంగా కలిసిపోయింది!

వారిలో ఓ పెద్ద రథం మాత్రం అదే వేగంతో ద్రోణుడి వైపుకు దూసుకుపోయి సరిగ్గా ఆయన ముందు ఆగింది. అందులోంచి‌ ఠీవిగా ఉన్న ఓ‌ వీరుడు‌ దిగొచ్చి సరాసరి ద్రోణుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు. పక్కనే ఉన్న దృష్టద్యుమ్నుడికి మతి చలించినట్లయింది అది చూసి. ఆ వీరుడు, ద్రోణుడి పాదాలు తాకుతూ “ఆచార్యా, మన్నించండి. ఆలస్యమైంది నా రాక” అన్నాడు. మెల్లగా కళ్ళు తెరిచి, ఆ వీరుడిని దీక్షగా గమనించాడు ద్రోణుడు. ఒక్కసారిగా విప్పారిన ముఖంతో అడిగాడు –

“ఇక్కడికెందుకొచ్చావు ఏకలవ్యా?!”


“గురువర్యా! అతడి ధనుర్విద్య సామాన్యమైనది కాదు. మా శునకంపై అతడు ప్రయోగించిన శబ్దభేది మేమింతవరకూ ఎన్నడూ చూడలేదు” అన్నాడు అర్జునుడు ద్రోణుడితో.

“అవునాచార్యా, అతడెవరో గుప్తవిద్యలు తెలిసిన ఆచార్యుడని మేము భ్రమపడ్డాం. వెళ్ళి చూస్తే, ఓ బోయ యువకుడు!” అన్నాడు భీముడు.

“ఇంకొక విచిత్రం కూడా జరిగిందాచార్యా, ‘ఇంత విద్య నేర్పించిన మీ గురుపూజ్యులెవరు?’ అని మేమడిగితే, అతడు తడుముకోకుండా ‘ద్రోణాచార్యులే నా గురువు’ అని అబద్ధాలు కూడా చెప్పాడు” అన్నాడు ధర్మరాజు.

అప్పటి వరకూ వినోదంగా వింటున్న ద్రోణుడు అది విని ఖంగుతిన్నాడు.

“అబద్ధమని మనమెలా చెప్పగలం అగ్రజా! ఏమో గురువర్యులు నిజంగానే అతడికి…”

“అర్జునా! నా విద్య, ఆచార్య వృత్తీ కేవలం కురుసామ్రాజ్యపు వారసులకే‌ అని భీష్ముడికి మేము మాట ఇచ్చాం. ఆ మాట దాటే అవకాశమే లేదు. కానీ మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి, పదండి చూస్తాను ఆ యువకుడి వ్యవహారం” అన్నాడు ద్రోణుడు పైకి లేస్తూ.

పాండవులు అడవిలో ఆ యువకుడిని చూపెట్టగానే, అతడు ద్రోణుడి కాళ్ళపై పడి తనని ఏకలవ్యునిగా, బోయరాజు హిరణ్యధనువు కుమారుడిగా పరిచయం చేసుకున్నాడు. అతడి భక్తి చూసి ద్రోణుడు కొంచెం నెమ్మదించి ధనుర్విద్య గురించి అడిగితే, ఏకలవ్యుడు వారందరినీ తను విద్యాభ్యాసం చేసే ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ నిలువెత్తు ద్రోణుడి విగ్రహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

“ఈ రాతి విగ్రహం నీ గురువా?” అన్నాడు అర్జునుడు.

“అవును, ద్రోణాచార్యులే ఈ విగ్రహం ద్వారా నాకు విద్యని ప్రసాదిస్తున్నారు” అన్నాడు ఏకలవ్యుడు.

అర్జునుడు ద్రోణుడిని ఓ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి “మీరు నన్ను ప్రపంచంలోనే గొప్ప విలుకాడిగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. ఏకలవ్యుడుండగా అది సాధ్యమేనా?” అని నిలదీశాడు.

ద్రోణుడికేం పాలుపోలేదు. ఓ పక్క పాండవ వంశాంకురం, తన మేటి శిష్యుడు అర్జునుడు. ఇంకో పక్క తనేమీ నేర్పకపోయినా, తననే గురువుగా భావించి అపార ధనుర్విద్యని సంపాదించిన ఏకలవ్యుడు. తనకి ఆశ్రయం ఇచ్చింది కురు సామ్రాజ్యమే కాబట్టి, అర్జునుడి పక్షమే నిలబడాలని నిశ్చయించుకున్నాడు ద్రోణుడు. గురుదక్షిణగా ఏకలవ్యుని కుడిచేతి బొటనవేలిని అడుగుదామని అతని కుటీరంలోకి వెళ్ళాడు. కొంతసేపు ఏకలవ్యుడి ధనుర్విద్యా ప్రదర్శనని చూసి నోరు తెరిచి బొటనవేలిని అడగబోయి కూడా, ఏదో మంత్రం వేసినట్టు ఏమీ అడగకుండానే అతడిని ఆశీర్వదించి బైటకొచ్చేశాడు ద్రోణుడు.

అర్జునుడు ఆశ్చర్యంతో “అదేమిటి ఆచార్యా?” అనడిగాడు.

“అర్జునా, నిన్ను గొప్ప విలుకాడిని చేస్తానన్నమాట నేను నిలబెట్టుకుంటాను. కానీ దానికి మరొకరిని బలివ్వవలసిన అవసరం లేదు.”

“కానీ అతడు మీరే గురువంటున్నప్పుడు, గురుదక్షిణ తీసుకోవడం మీ హక్కు కదా…”

“అతడు నన్ను గురువనుకుంటున్నాడు కానీ నేనతడిని నా శిష్యుడనుకోవడం లేదు. కనీసం ధనుస్సు ఎలా ఎక్కుపెట్టాలో కూడా నేర్పని నాకు అతడి మీద ఏ హక్కూ లేదు. అతడి నమ్మకం అతనిది, నా కర్తవ్యం నాది” అన్నాడు.

ఆ తరువాత వారెప్పుడూ ఏకలవ్యుడి గురించి ఆలోచించలేదు.


ఏకలవ్యుడు ద్రోణుడిని చూసి “ఇన్నాళ్టికి గుర్తుచేసుకున్నారు ఆచార్యా మీరు నన్ను. మీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాం ఇన్నేళ్ళగా” అన్నాడు.

చిన్నప్పుడు చూసిన యువకుడు కాదతను. పెద్ద ఈకల కిరీటంతో, అమోఘమైన విల్లుతో, ప్రశాంత వదనంతో ఠీవిగా నిలబడున్న నిషాద రాజు!

ఏకలవ్యుడు కౌరవుల పక్షంలో నిలబడుతున్నాడనే మాట అప్పటికే దావానలంలా సైన్యం అంతా వ్యాపించింది. దూరాన ఉన్న అశ్వత్థామ కూడా అతడిని చూడటానికి యుద్ధరంగం మధ్యకి వచ్చాడు. పుత్రుడిని చూసి ద్రోణుడి ఆనందం రెట్టింపయ్యింది.

“గురువర్యా, ఆ రోజు మిమ్మల్ని గురుదక్షిణ గురించి ప్రార్థించినా మీరేమీ అడగకుండానే వెళ్ళిపోయారు. ఈ రోజు మీ శత్రువులని మీ చరణాల వద్దకి చేర్చి నా దక్షిణ చెల్లించుకుంటాను. మీరు కాదనవద్దు.”

ద్రోణుడు నవ్వి “నేనీ రోజు అధర్మం వైపు నిలబడున్నాను ఏకలవ్యా. నా వైపు పోరాడటం నీకూ, నీ రాజ్యానికీ మంచిది కాదు” అన్నాడు.

“గురువుని మించిన ధర్మమేదీ లేదు ఆచార్యా నాకు” అని దృఢంగా చెబుతూ కింద పడున్న ద్రోణుడి విల్లుని తెచ్చి అందించబోయాడు ఏకలవ్యుడు.

“లేదు కుమారా, ఒకసారి త్యజించిన ఆయుధాలని ఆ యుద్ధంలో నేను మళ్ళీ ముట్టుకోను.”

“మీరిలా‌ యుద్ధాన్ని మధ్యలో వదిలేయడం సబబు కాదు” అన్నాడు వెనకగా వచ్చిన దుర్యోధనుడు.

“నాకు మించిన వీరుడిని నీ సేనకు సైన్యాధిపతిగా నియమిస్తున్నాను దుర్యోధనా!” అని ఏకలవ్యుడిని చూపిస్తూ రథాన్ని ముందుకి నడిపాడు ద్రోణుడు.

బైటికి వెళ్ళబోతూ కృష్ణుడి ముందు రథం నిలిపి నమస్కరిస్తూ “వాసుదేవా, ఇక నాకు సెలవిప్పించండి. ఆ రోజు ఏకలవ్యుడి కుటీరంలో మీరు సాక్షాత్కరించకపోయి ఉంటే, కురుక్షేత్రంలో ఈ పదిహేనవ రోజు మరోలా ఉండుండేది. ఈ యుద్ధం మీద, విజయం మీదా ఇక నాకు ఆసక్తి లేదు. సెలవు” అని యుద్ధభూమిని విడిచాడు ద్రోణుడు.

ఇదంతా ఆశ్చర్యపోయి చూస్తున్న పాండవులలో, అందరికన్నా ముందు తేరుకున్న వాడు ధర్మరాజు. హడావిడిగా తన రథం దిగొచ్చి కృష్ణుడికి దణ్ణం‌ పెడుతూ “బావా, నువ్వేం చేశావో నాకు తెలియదు కానీ ‘ధర్మరాజొక అసత్యవాది, అవకాశవాది’ అని భావితరాలు నన్ను తీసిపారేయకుండా చేశావు. ధన్యోస్మి” అన్నాడు.

“చెప్పు బావా! ఏం చేశావా రోజు?” అన్నాడు అర్జునుడు ఆవేశంగా వెనకనుండి.

“ఏకలవ్యుడి బొటనవేలుని దక్షిణగా అడగవద్దని ద్రోణుడికి ఉపదేశించాను” అన్నాడు పరమాత్మ.

“అదే ఎందుకు? నీకు నా అపజయం చూడాలనుందని నేను కలలో కూడా అనుకోలేదు.”

“అంతా నీకోసమే అర్జునా! పాశుపతాస్త్రం లభించిన తరువాత నువ్వు నాతో ఏమన్నావో గుర్తుందా? ‘ఇది నేనెప్పుడు యుద్ధంలో ప్రయోగించను బావా, భావితరాలు నన్నో ధనుర్విద్యా విశారదుడిగా గుర్తుంచుకోవాలి కానీ దివ్యాస్త్రాలు వాడి సునాయాసంగా గెలిచినవాడిగా కాదు’ అని? అలాంటి ఆదర్శాలున్న నీ మీద ఏకలవ్యుడిని మోసంతో ముందే తొలగించుకున్నాడనే అపవాదు రానిస్తానా?” అన్నాడు కృష్ణుడు.

అర్జునుడికి కృష్ణతత్త్వం ఎంత గంభీరమైందో మెల్లగా అవగతమౌతోంది. కానీ ఏకలవ్యుడిని ఎదుర్కోవాలన్న తక్షణ బాధ దాన్ని అతిక్రమిస్తోంది.

అర్జునుడి నిశ్శబ్దాన్ని గమనించిన కృష్ణుడు, “ఇప్పటికీ ఈ జగత్తులో, ధనుర్విద్యలో నువ్వే అగ్రగణ్యుడివి కిరీటీ, అది నిరూపించుకోవడమే నువ్వు ద్రోణుడికివ్వగలిగే అసలైన గురుదక్షిణ” అన్నాడు.


ద్రోణుడు వెళ్ళాక కౌరవులు అర్ధచంద్రవ్యూహం పన్నారు. వారిని ఎదుర్కొనడానికి పాండవులు గరుడ వ్యూహానికి మారారు. రెండు రెక్కల దగ్గరా ధర్మరాజు, భీముడు, తోక భాగంలో నకుల సహదేవులు, కంటి దగ్గర అర్జునుడు. ఏకలవ్యుడి వ్యూహం వల్ల పాండవ వీరులందరూ దూరంగా విడిపోవలసి వచ్చింది.

అర్జునుడూ ఏకలవ్యుల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎవరూ వెనక్కి తగ్గట్లేదు, అలసిపోవట్లేదు. అర్జునుడి గాండీవానికి, ఏకలవ్యుని దశాక్షం గట్టిగా సమాధానం చెబుతోంది. పది వింటినారులతో, పది దిక్కులకి ఒకేసారి బాణాలని వదలగల సామర్థ్యం ఉందా విల్లులో. ఒక పది ప్రయోగించాక, క్షణంలో మరో పది బాణాల్ని అందించగలిగే యంత్రం కూడా ఉంది ఏకలవ్యుడి రథంలో. వాటి నుండి అర్జునుడి వైపు ఎడతెరిపి లేని వర్షంలా కురుస్తోందా బాణ పరంపర. సాధారణ బాణాలు పనిచేయకపోవడంతో, కొంతసేపటికి తన దగ్గరున్న అస్త్రాలని ప్రయోగించడం మొదలుపెట్టాడు అర్జునుడు. ఆగ్నేయాస్త్రానికి వారుణాస్త్రం, నాగాస్త్రానికి గరుడాస్త్రం, బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం వేసి ఉపసంహరించాడు ఏకలవ్యుడు.

“నీకు సరిసాటి వీరుడు ఇన్నాళ్టికి దొరికాడు అర్జునా. నేనతడిని ప్రాణాలతో విడిచిపెట్టడం మంచిదే అయ్యింది” అన్నాడు కృష్ణుడు.

“ఏంటీ, ఈ ఏకలవ్యుడిని విడిచిపెట్టావా!”

“జరాసంధుడితో కలిసి ద్వారకపై యుద్ధానికొస్తే, మందలించి పంపేశాను. ఇద్దరిలో నువ్వే మేటి‌ అని నిరూపించడానికేలే…”

“బావా!”

“అది సరే, ఇంతకీ ద్రోణుడు నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేదంటావా అయితే!” అన్నాడు పరమాత్మ వెనక్కి తిరిగి నవ్వుతూ. ఆ మాటల్లోని ఆంతర్యం అర్థం అయిన అర్జునుడికి చప్పున చిన్ననాటి విద్యాభ్యాసం గుర్తుకొచ్చింది. అప్పట్లో ధనుర్విద్య నేర్చుకునేటప్పుడు తనేవైనా తప్పులు చేస్తే, వాటిని దిద్దుకునేందుకు ద్రోణాచార్యుడు తనని కృపాచార్యుని వద్దకి పంపేవాడు. అందరి శిష్యుల్లో తనకి మాత్రమే ఈ దండన విధింపబడేది. తనకది అవమానంగా తోచినా, ద్రోణుడి మీద భక్తి వల్లా, కృపుడు చెప్పే కొత్త కొత్త విధానాలపై ఆసక్తి వల్లా తనెప్పుడూ ఆక్షేపించలేదు.

అంటే ఈ పరిస్థితిని ద్రోణుడు ముందే ఊహించి కృపుని ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించారా?

“ఇంకా ఏమాలోచిస్తున్నావు సవ్యసాచీ?” అన్నాడు కృష్ణుడు అసహనంగా.

అంతే, వెంటనే కృపుడు నేర్పిన వాయువిద్యలోకి మారాడు అర్జునుడు. కొన్ని వందల బాణాలని నాలుగు దిక్కులకీ ప్రయోగించడం మొదలుపెట్టాడు. వాటిలో కొన్ని మాత్రమే ఏకలవ్యుడి వైపు మరలేట్టు వాటి వెనకాలే వాయవ్యాస్త్రాల్ని సంధిస్తున్నాడు. ఏ బాణాలు, ఎటునుండి, ఎప్పుడు తన వైపు వస్తున్నాయో అర్థంకాక ఏకలవ్యుడు అయోమయంలో ఉండగానే, కృష్ణుడిని ‘మండల’ ప్రయోగానికి ప్రేరేపించాడు అర్జునుడు. ఏకలవ్యుడి రథం చుట్టూ వేగంగా తిరుగుతూ, రెండు ధనుస్సులనుండీ బాణాలని రకరకాల దిశలనుండీ ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఈ కొత్త ప్రయోగాన్ని ఏకలవ్యుడు విస్మయంగా చూస్తుండగానే అర్జునుడి ధాటికి అతడి బాణాలు అందించే యంత్రం కూలిపోయింది, రథచక్రాలు ఎటూ కదలలేకుండా ఇరుక్కుపోయాయి.

మాధవుడు రథాన్ని నడిపే వేగానికి చుట్టూ ఉవ్వెత్తున దుమ్ము లేచి కొంత సేపు ఏకలవ్యుడికేమీ కనపడకుండాపోయింది. అయినా‌ అధైర్యపడకుండా‌ అర్జునుడి విల్లునుండి వస్తున్న శబ్దాన్ని గుర్తించి తన శబ్దభేది‌ విద్యతో అటువైపుగా బాణాలు వేయడం మొదలుపెట్టాడు. వాటిలో ఒకటి‌ శరవేగంతో వచ్చి అర్జునుడి రెండో విల్లుని తుంచింది. వెంటనే ఉధృతంగా బాణాలు వేసి ఏకలవ్యుని ధనస్సుని పడగొట్టాడు అర్జునుడు.

దుమ్ము కొంత తగ్గగానే, ఎదురుగా తన రథంలో మరో‌ రెండు పెద్ద విల్లులు సిద్ధం చేసుకుంటూ కనపడ్డాడు ఏకలవ్యుడు. అతడు తిరిగి కోలుకుంటే తను చేసినదంతా వృథా అవుతుందని గుర్తించిన అర్జునుడు తన అంజలికాస్త్రాన్ని బైటికి తీశాడు. ఇంద్రుడు దేవతగా ఉన్న ఆ అస్త్రానికి‌ ఉపసంహారం లేదు. అస్త్రాన్ని తీయడమైతే తీశాడు కానీ దానిని ప్రయోగించడానికి సందేహిస్తున్నాడు. అంతలో ఎదురుగా ఏకలవ్యుడు మళ్ళీ బాణాలని‌ ఎక్కుపెట్టబోతున్నాడు.

“అతడు ఊపందుకోకముందే అంజలికను ప్రయోగించు కౌంతేయా, ఎందుకాలస్యం?” అన్నాడు జనార్ధనుడు వస్తున్న బాణాల నుండి రథాన్ని కాపాడుతూ.

“దీనిని… దీనిని…”

“ఏమిటి‌?”

“దీనిని కర్ణుడి కోసం దాచాను బావా!” అన్నాడు అర్జునుడు బాధగా.

“బావా, నీ కోసం దాచిన వాసవీ శక్తిని కర్ణుడు ప్రయోగించవలసి రాలేదూ నిన్న? నువ్వూ అలానే…”

“కానీ బావా, కర్ణుడిపై నా ఆధిక్యత…?”

“ఉండదు బావా, నీకవసరం లేదా ఆధిక్యత. చెప్పానుగా, భావితరాలలో నువ్వు…”

ఆ‌ మాట పూర్తి కాకుండానే అర్జునుడు తన అంజలికాస్త్రాన్ని ఎక్కుపెట్టి వదిలాడు. ఏ ఎదురూ లేకుండా ఏకలవ్యుని ఛాతివైపు దూసుకుపోతోందది…


పాణిని జన్నాభట్ల

రచయిత పాణిని జన్నాభట్ల గురించి: 'తనలో నన్ను' , 'చెయ్యాల్సిన పని' కథా సంపుటులు, 'మనుషులు చేసిన దేవుళ్ళు' నవల. ...