అయోద్ది మోజు

“తాతా, ఎన్ని దినాలుగా ఈ మిసిన్ తొక్కి గుడ్డలు కుడతావుంటావు? వూరోళ్ళు గుడ్డలు కుట్టుకోని పోతారే గానీ దుడ్డిచ్చేదే లేదే, నువ్వూ పోనీలే అంటావు. తెల్లార్లేసి, ఆకిలిగా వుండాది తాతా, నాష్టా తీసియ్యి తాతా…”


అన్వర్ తాత వైసు ఎనపై దాటుంటాది. సత్తేట్లో పెన్నిమోళ్ళ ఇంటికి నాలుగీదులు దాటి, కొనాలో గుడిసేసుకోని ఒక పాత సింగర్ మిసిన్‌తో గుడ్డలు కుట్టి, దాంట్లో వొచ్చే వొరుమానంతో గెంజి కాసుకోని కాలం తోసుకొస్తా వుండాడు. వొక దినం మద్దేన్నం పొన్నేరి కూట్రోడ్డు బస్సులోనించి కంట్రక్టరు వొక పన్నెండేళ్ళ పిన్నోడిని గొంతుపట్టి కిందికి తోసేశినాడు. పిన్నోడు నెత్తికి గాయం తగిలి నెత్తురొస్తా, ఏడస్తా వుండాడు. వాడ్ని సూస్తే అయ్యో అని వుండాది. తాత వాడ్ని లేపి, నెత్తుర్ని తుడిసి, “నాతో రారా, నాయిర్ అంగిట్లో టీ తీసిస్తా” అని చెప్పి, టీ తాగిచ్చి వాడ్ని గుడిసెకి తీసుకొచ్చినాడు. పిన్నోడి పేరు విగ్నేసు. విక్కీ, విక్కీ అని పేమగా పిలస్తా, వాడికి వణ్ణం పెట్టి నాలుగు దినాలు అయినాంక, తాత వాడ్ని అడిగినాడు.. “అబ్బాయ్ ఎవుర్రా నువ్వు” అని.

“నేను అనాదని తాతా, నా పిన్ని నన్ను తన్ని తరిమేసింది. మా నాయినికి కాళ్ళు చేతులు పడిపోయి, మన్సం మీదనే పడుండి, సచ్చిపోయినాడు. మా పిన్ని మా నాయినికి రెండో పెళ్ళాం. బజేరి ముండ. అన్నిటికి నన్ను బండ బండగా తిడతా వుంటాది. ఎక్కడికైనా పోయి, సావురా ముట్టుపాతా అని, పొయ్యిలో గెంటి తీసి వాత పెట్టేదానికొచ్చింది. నేను బైపడి పరిగెత్తతా బస్సెక్కేశినా తాతా. సేతిలో టికిట్ లేదని నన్ను తోశేసినారు తాతా…”

అని దీనంగ ఏడస్తా సెప్తా వుంటే, అన్వర్ తాత కూడా కలంగి పోయినాడు. “వొరేయ్ విక్కీ, నువ్వు నాతోనే వుండు. నేను సాక్కుంటాను. నువ్వు నా మనమడే అనుకోయమ్మే…” అని దైర్నం చెప్పి, విక్కీని వొళ్ళోకి లాక్కున్నాడు. అప్టాల్నించి తాత గుడిసెలోనే వుంటా వుండాడు. విక్కి మెల్లిగా పోను పోనూ తాత పని కూడా నేర్సుకుంటా వుండాడు.


“తాతా… పండక్కి కొత్త సొక్కాయి, నిజారూ కుట్టిస్తావా.”

“కొత్తది మాల్దు, నాయినా. పాత గుడ్డ పీసులుండాయి, దాంతో నిజారూ, సొక్కాయి కుట్టిస్తాలే.”

“అట్లనే తాతా. నిన్నొకటి అడగాల, ఇక్కడ కొత్త సొక్కాయిలు, కుట్టించుకునేటోళ్ళు ఎవురూ రారేమి?”

“అంతా కూలీ వోళ్ళు, పాత సొక్కాయిలు, చెడ్డీలు తెచ్చి, ఆల్ట్రేసన్ సెయ్యమంటారంతే.”

“దానికిదా నాకు, కుట్లిప్పే పని చెప్పిస్తావుండావా…”

“ముందు అది నేర్సుకో… అనేక, మిసిన్ తొక్కేది నేర్పిస్తా.”

“నాకు వేరే ఇంకో పని నేర్పియ్ తాతా. రెండ్రూపాయలు ఎగస్ట్రా సంపారిస్తుం కదా.”

“వేరే ఇంకో పనా… దానికి నువ్వు కొంచెం ఎదగాల. అదో, ఆ మూల సైకిల్ సక్రం, సానా సక్రం వుండాయి. ఆ రెండు సక్రాలని బెల్ట్ కట్టి, కింద పలకని తొక్కినామనుకో, సానా సక్రం తిరగతాది. దానికి కత్తి అదిమి పట్టి సానా పట్టొచ్చు. మొక్కబోయిన కత్తి, కత్తిరి, కత్తిపీటల్ని సానా పట్టొచ్చు. మొదుల్ మొదుల్లో, నేను ఆ పని దా శేసినా. అనేక ఈ సింగర్ మిసిన్ పాతది, ఆ మూల ఇంటి శెట్టి, నాకు దానంగా ఇచ్చినాడు. సానా పట్టే పని యేరగట్టేసి ఈ మిసిన్ తొక్కి, దినాలు తోస్తావుండా.”

“ఆ పని నాకు నేర్పియ్ తాతా. ఆ సానా పట్టేది మా వూర్లో సూసుండా తాతా, సై సై అని సక్రం తిరగతా వుంటే, బుస్బానం నిప్పులు ఎగరతా వుణ్ణు. దీపావలికి సురసుర వత్తి కాలిస్తే, నిప్పులు పడును సూడు, అదే మాదిరి నిప్పులు.. దాన్ని సూశే దానికి పిలకాయిలు, సానా సాయిబు తాత, యెనకాల్నే ఈదీ ఈదీ సుట్టేశి వొస్తుము.”

“సానా పట్టేది లేసయిన పని కాదురా అబ్బాయ్. నువ్వు చట్ అని ఎదుగు. అప్పుడు నేర్పిస్తా. ఇందా… ఈ నిజారుకి కాజాలు కుట్టు.”

“కాజాలు కుట్టితే, యేలికి సూది గుచ్చుకుంటాంది తాతా.”

“అది అట్టదా నాయినా, మెల్లి మెల్లిగా పని అలవాటు శేసుకోవాల్రా, అబ్బీ… గెంట అవతావుంది, నమాసుకి పోవాలా. పొయ్యేశొస్తునా…”

“నన్ను కూడా మసూదికి తొడుకోని పో తాతా. నేనూ వొస్తా…”

“ఇప్పుడొద్దు, దినాలు పోనీ, కట్టాయంగా నిన్ను తొడుకోని పోతా… ఇందా దుడ్డు, నాయిర్ అంగిడికి పోయి టీ తాగేశిరా పో.”


దినాలు పోతా వుండినాయి. మిడి మిడి ఎండ. అన్వర్ తాత, పప్పు వణ్ణం మూడు ముద్దలు విక్కీకి పెట్టి, రొండు తన్నోట్లో ఏసుకోని, లోటా నీళ్ళు గటగటా తాగి, గుడిసెలో మిసిన్ పక్క వాలినాడు. విక్కీని లాగి వాడి తలని పొట్ట మీదికి ఆనించినాడు. కడుపు నిండినట్లైంది. అయితే మనుసులో ఏదో దిగులు, పాపం. ఎవురో ఈ పిన్నోడు. వాడ్ని సాకే బారం అల్లా ఇచ్చేశినాడు. “అట్లనే సేస్తానయ్యా” అనేశి, కునుకు తీశినాడు అన్వర్ తాత.

“యోవ్ ముశిలాయనా, లెయ్, లెయ్. ఎవుడు నీకీ జాగా ఇచ్చినోడు. ఈ గుడిశెని పీకేసి ఇక్కడ బోర్ పంప్ దించాల. నీకు మూడ్దినాలు టైం. గాలీ చేసి, పోవాల.”

ఎవురో సూశేదానికి పార్టీ వోళ్ళు మాదిరుండారు. కారుల్లో వొచ్చి దిగి, దాట్ బూట్ అని అరిశేసి, అన్వర్ తాతకి, ఆర్డర్ ఏశేసి సక్కా పోయినారు. అన్వర్ తాతకి దిగులు సుట్టుకునింది. ఈ జాగా వొదిలి యాడికి పొయ్యేది. పది, పదైదు ఏళ్ళుగా ఇక్కడ పడుండి గంజి నీళ్ళు తాగతా కాలం తోస్తా వుంటే, వీళ్ళెవురో గబాల్నొచ్చి గాలీ చేసి పోరా అంటే ఎట్టా చేసేది. ఈ పిన్నోడు వేరే, యీపు మీద. ఎట్రా, బగమంతుడా… అని, సేతులెత్తి దణ్ణం పెట్టి, పైకి సూశినాడు తాత. విక్కీ తాత చెయ్యి గెట్టిగా పట్టుకునేశినాడు.

“తాతా, మనం ఈ జాగా వొదిలేసి వేరే ఇంకో వూరికి పోడస్తాము.”

“హఁ హఁ! వేరే వూరికా… ఏ వూరికి?”

“అయోద్దికి.”

“అయోద్దికా? ఆ వూరు నీకెట్లా తెల్సును? అదెక్కడో ఉత్తరాన గదా వుండేది. ఆడికి పోవాలంటే, రైల్లో పోవాల. చేతులో పైసా వుండాల్రా.”

“నాయిరు అంగిట్లో, టీ తాగతా వుంటే, అక్కడొచ్చినోళ్ళు మాట్లాడతా వుంటే, యిన్నాను తాతా. అయోద్ది రాముడు గుడికి జనాలుగా పోతారంట. అక్కడ దరమ సత్రాలుండాయంట. అందురికి దుడ్డు అడక్కండా కూడేస్తారంట.”

“ఆ కూడు తినేదానికి అందూరం పోవాల్నా? ఇక్కడ్నే వేరే ఇంకో జాగాలో గుడిశేసుకోని మిసిన్ కుట్టుకోని బతుక్కుంటామురా.”

“మల్లీ, గుడిశె పీకేయాలని మనల్ని తరిమేస్తురు తాతా. మనం అయోద్దికి పోయినామంటే, అక్కడ నిమ్మతిగా వుండొచ్చును తాతా.”

“సరే, పోతామనుకో… అక్కడ మనకి పని దొరకాల కదా నాయినా?”

“అక్కడ అందురికీ పనులుండాయంట తాతా. నేను అక్కడ ఓటల్లో క్లీనర్ పని చేస్తా. నువ్వేమీ పని చెయ్యకుండా కూకో. నేను నిన్ను కాపాడ్తా తాతా.”

విక్కీ, అన్వర్ తాత లుంగీ పట్టి బెతిమాల్తా వుంటే, వాడి మాటలకి తాత గుండె కరిగి పోయింది. కాలు మీద పడిన విక్కీని పైకి లేపి, రొమ్ముకి అముక్కున్నాడు.

“ఏడవమాక రా… అయోద్దికి పోతాము గాని, రైలు టికెట్టుకి దుడ్డు కావాల కదా? ఎవురు మనకి సగాయం చేస్తారు? చెప్పు.”

“నాకు తెల్లేదు తాతా… మనం ఎట్టన్నా అయోద్దికి పోడస్తాము తాతా.”

“నిండా పిడివాదంగా వుండావేరా… అల్లా… నాకు మార్గం సూపియ్.”

అన్వర్ తాత, కష్టంగా, సింగర్ మిసిన్ని సూశినాడు. దాన్ని తూక్కోని మార్వాడంగిడికి నడిశినాడు. కుదవ పెడ్తామనుకున్నాడు. మార్వాడి సేటు ఆ మిసిన్ సూశి, ఇన్నూరు రూపాయలకంటే దమ్మిడీ జాస్తి ఇయ్యనని మూతి తిప్పుకున్నాడు. తాత మార్వాడిని అడిగినాడు, ఇద్దురు, అయోద్దికి పోవాలంటే రైలు చార్జి ఎంతవతాది అనేశి. సేటు, ఇద్దురికీ రెండు వేలు దెగ్గిర అవును అన్నాడు. మిసిను అమ్మేస్తే, అంత పైసా ఇస్తావా అని తాత అడిగితే, సేటు, మిసిన్ సక్రాలు తిప్పి సూశి, పెట్టిలోంచి వెయ్యిన్ని ఎనిమిది నూర్లు పాత నోట్లు, వేల్ని ఎంగిలితో సరిమి సరిమి, మూడు సార్లు లెక్కపెట్టి తాత శేతిలో పెట్టినాడు. ఆ డబ్బుని రొమ్ముకి అదిమి, మిసిన్ని కడుగోటి సారి సూశి, తాత పిన్నోడితో పట్నానికి బస్సెక్కినాడు.

పట్నం నించి, రైలు ప్రెయానం రొండు దినాలు పట్టింది. అయోద్ది టేసను కొత్తగా వుండాది. జోబిలో తడిమి సూస్తే, నూర్రూపాయలకి మించి లేదు. విక్కీ మాత్రం, నిండా సంతోసంగా వుండాడు. ఆకిల్ని మరిసిపోయినాడేమో, టీ కాపీ తీసియ్యమని కూడా అడగలేదు. గుడ్డల మూట సంకలో పెట్టుకోని, పిన్నోడి శేతిని పట్టుకోని, వూర్లోకి నడిసినాడు తాత. వూరు మామూలు గానే వుంది. గుడి దూరం గామాల. కనిపించలే. ఇంకొంచెం నడిశినారిద్దురూ. ఎదురుగా వొచ్చిన ఒకాయనతో, అన్వర్ తాత అడిగితే, ఇది గుడి ఎనకాల ఈదులు, అట్టపక్క పడమరకి నడిస్తే, గుడి కనపడ్తాది పోండి అన్నాడు. సందులూ, గొందులూ నడస్తా పోతే, అక్కడ పాతబడి కూలిపోయిన ఇళ్ళు రెండుపక్కలా. కొన్ని ఇళ్ళు సూస్తే, ఒకటి రెండు గదుల మందాన ఉండి, గోడలు పాత ఇటిక రాళ్ళు పేర్చిపెట్టి వుండాయి. దాంట్లో కాపరాలుండారు జనం. ఇదేం వూర్రాయబ్బా అనుకున్నాడు తాత. ఇంకొంచెం దూరం నడిస్తే, పెద్ద రోడ్డు కనిపించింది. దానెంపట నడిస్తే, వూరు పట్నం మాదిరుండాది. బస్సులూ, కార్లూ, ఆటోలూ తిరగతా సందడిగా వుండాది.

పదడుగులేశి తలెత్తి సూస్తే, గుడి బెమ్మాండంగ కనిపించింది. విక్కీ అరిశినాడు, “తాతోవ్! అదో గుడి!” వాడి సంతోసాన్ని సూసి అన్వర్ తాతకి కొంచెం నిమ్మతైంది. “పదా. మనకి వణ్ణాలేశేవాళ్ళు వుండారా సూస్తాం.” అని గబగబా నడిశినారిద్దురూ. నిజ్జింగా శానామంది బక్తులుకి వణ్ణాలొండి వడ్డిస్తా వుండారక్కడ. కడుపు నిండా మెతుకు తిని ఎన్ని దినాలైందో, విక్కీ, తాతా లచ్చెనంగా బోంచేశినారు. వొస్తా పోతా వుండే జనాన్ని ఒక జాగాలో కూకోని సూస్తా వుంటే, టైమెట్లనో పూడేడ్శింది. సీకటి పడతా వుంది, లైట్లేశేశినారు. విక్కీకి నిద్దర సొక్కతా వుంది. “ఒరేయ్ లెయ్. అట్టపక్క సందుల్లోకి పోడస్తాము. పోలీసోళ్ళు తిరగతా వుండారు. మనల్ని తరిమేయ బోతారు” అని విక్కీ రెక్కని పట్టి, ఈడ్సుకోని, సందుల్లోకి దూరినాడు తాత. అక్కడ ఒక తిన్నిమీద ఇద్దురూ కూకున్నారు. ఆ సందులో, ఈ మూలా, ఆ మూల ఎవ్వురూ లే. అంతా నిస్సిబ్దంగా వుండాది. విక్కీ, తాత వొళ్ళో తలపెట్టి పడుకునేశి కొంచేపట్లో, నిమ్మళంగా నిదర పోతా వుండాడు. తాతకి మాత్రం అంతా అయోమయంగా వుండాది. “ఏరా… ఈ వూరు గాని వూరుకి వొచ్చేశినామే, ఇక్కడ బతికేది ఎట్రా” అని తలపైకెత్తి సూశినాడు. అంతా శీకటి.

వీళ్ళ బతుకు తెల్లార్లేదేమో గాని, ఆ రేతిరి గడిశి పోయి సూర్యుడు మాత్రం ఆకాసంలోకి డూటీ శేశేదానికి ఆజర్ అయినాడు. విక్కీ నిద్దర లేశి, “తాతా… బైటికొస్తా వుండాది. ఆర్జింటు. ఎక్కడ ఉచ్చ పోశేది…” అనేశి నిజారు సర్దుకుంటా వుండాడు. “రేయ్ ఉండ్రా యబ్బా” అని తాత ఆ యెనక సందులో కూలిపోయిన మెద్దిల్లు గుంటలో వాడ్ని కూకో బెట్టి, ఆ సందు మొనలో, ఒక అమ్మిని బెతిమాలి ఇరిగిపోయిన పళాస్టిక్ బిందిలో నీళ్ళు తెచ్చిచ్చినాడు.

ఆకాసంలో సూర్యుడు డూటీలు ముగిస్తా వుంటే, ఇంకో పక్క సెందమామ వొస్తా పోతా వుంటే, సందు మొన అమ్మి దయాన, నీళ్ళూ, గుడిముందు దెరమ ప్రెబువులు పెట్టే తిండితో, దినాలు జరగతా వుండినా అయోద్దిలో పని చిక్కలేదు తాతకీ, విక్కీకీ ఇప్పుటిదాకా.

ఒక తెల్లారి ఆ వీదిలో సానా పట్టే సాయిబు పలక సక్రంతో పోతా వుంటే, విక్కీ పరిగెత్తిపోయి ఆయన్ని పట్టి నిలిపినాడు. అన్వర్ తాత ఆయిన్తో తమ కత యిమర్సగ చెప్పుకుంటే, ఆయిన పిన్నోడికి పని యిప్పిస్తా అని మాటిచ్చి ఇద్దుర్నీ తొడుకోని పోయి ఒక జుట్టు కత్తిరించే అంగిట్లో శేర్పించినాడు. ‘ముశిలోడ్ని పనికెత్తుకోను, పిన్నోడ్ని తీసుకుంటా’ అని, విక్కీ చేతిలో ఒక శీంకిలికట్ట ఇచ్చి వూడవమని చెప్పినాడు, అంగిటి యజమాని. ‘దినానికి పదైదు రూపాయలిస్తాను. ముశిలాయనకి పనేమీ లేదు’ అని కండితంగా చెప్పినాడు. ఆ యెమ్మట, అన్వర్ తాత సానా సాయిబుతో ‘నాకు సానా పట్టే పని తెలుసును, నీతో పాటే వొస్తా, దినం కూలీ నువ్వెంతిస్తే అంత తీసుకుంటా అని దీనంగా అడిగితే, సానా సాయిబు దయతో ‘సరే’ అన్నాడు. మొత్తాన, విక్కీకి అన్వర్ తాతకి పనులు దొరికినాయి అయోద్దిలో.

ఏది గడవకపోయినా, దినాలు గడిశిపోతాయి గఁదా. ఒక దినం సాయింత్రం అన్వర్ తాతకి రొమ్ము నొప్పొచ్చి ఒక తిన్ని మీద వాలినాడు. విక్కీకి బయమైపోయింది. తాత గొంతులో మాటలు సన్నగా వినిపించినాయి. ‘ఏరా ఈ కూలీ పనులు శేశేదానికా, ఇందూరం వొచ్చింది. దినమ్మూ, గుడి పెసాదం దొరకతా వుండాది, సరే. ఎన్ని దినాలు ఇట్టా బతికేది శెప్పూ’ అని తాత, తలకాయి వాల్చేశినాడు. విక్కీ, సానా సాయిబు ఇంటికి పరిగెత్తిపోయినాడు.

అన్వర్ తాత కత, అయోద్ది నేల మట్టిలో కల్శిపోయింది.

ఇంతిడ్తో కత అయిపోలే. ఇంకొంచెం వుండాది.


జుట్టు కత్తిరించే అంగిటి యజమానికి, లోనిస్తామని ఎవురో చెప్పినారంట. అంగిట్లో ఇంకో కుర్చీ పెట్టేదానికి దుడ్డిస్తారంట. ఆదార్ కార్డు కావాలన్నారంట. యజమానికి ఆదార్ లేదు. ఎందుకు లేదు అని అడగమాకండి. అట్టాంటోళ్ళు వూర్లో వుండారు. అదీ సమాచారం. విక్కీ, యజమానితో చెప్పినాడు. తనకి ఆదార్ కార్డుండాది. అయితే దాన్ని తెచ్చేదానికి వూరుకి పోయి రావాలన్నాడు. యజమాని కళ్ళు యెలిగి పోయినాయి. ‘దుడ్డిస్తాను, వూరికి పోయి నీ ఆదార్ కార్డు తెచ్చేయ్. లోను నీ పేరుమీద ఇప్పిస్తానంటావుండాడు మా ఠాకూరు’ అన్నాడు. విక్కీ కొత్త సొక్కాయి నిజారేసుకోని, శెన్నై రైలెక్కినాడు.


“ఎక్కడ సచ్చినావురా ముట్టుపాతా. పొయ్యిలో గెంటి ఎత్తినా. నిన్ను బెదిరించే దానికిదా. కాలుస్తునా చెప్పూ. మీ నాయిన పోయినంక, రోడ్లూడిశే పనిలో శేరి, నన్ను కేవలంగా శూశే ముండాకొడుకుల్నించి తప్పించుకునే దానికి ఈ వొంటి ఆడది పడే నరకం నీకేం తెలుసునురా. నిన్ను నమ్మిదానేరా నేను బతకతా వుండాను. నువ్వు బాగా సదవాలని కదరా నా ఆశ. ఇస్కూలుకి పోకండా, పోకిరిపిలకాయలతో చేరి ఈదులు తిరగతావుంటే నాకు కోపం రాదా. ఇదే మీ అమ్మ తిట్టుంటే ఇల్లొదిలి పరిగెత్తిపోయుంటువా… ఈ పిన్ని కూడా మీ అమ్మ దానేరా విగ్నేసూ!”

విక్కీ వాళ్ళ పిన్ని కాళ్ళ మీద పడినాడు. “నిన్నొదిలి ఇంకెక్కడికి పోను పిన్నీ. స్కూలుకి పోతా. సదువుతా’ అంటావుంటే, పిన్ని వాడిని కావిలించుకునింది. ఆ స్పెర్శలో ప్రేమ వుండాది. విక్కీ అన్వర్ తాతని తల్సుకున్నాడు. అన్వర్ తాత రొమ్ము కూడా అదే వెచ్చ. విక్కీ, కళ్ళు కారతావుంటే, పిన్ని కొంగుతో తుడిశింది.

మర్సటి దినం విక్కీ ఇస్కూలుకి బైల్దేరినాడు. మెడలో ఇస్కూల్ కార్డు తగిలించుకున్నాడు.

మేజా డ్రాయర్లో, వాడి ఆదార్ కార్డు, అయోద్దిలో రాముడెంత బద్రంగా వుండాడో అంత బద్రంగా వుండాది.