ముందుగా నేను బాహాటంగా ఒప్పుకోవాలి. లేకపోతే నిష్ణాతులకు కోపం రావచ్చు. నేను అనుష్ఠానం చెయ్యను. అసలు అదంటే ఏఁవిటో నిఘంటువు చూసేవరకూ తెలియదు. మత కుల ఆచారాలు విధిగా పాటించటం, అనుష్ఠానం. ఈ మూడు మాటలూ ఎందుకు చెపుతున్నానంటే, ఒకసారి మా స్నేహితుడొకడు ఏదో సంస్కృతకావ్యానికి ఇంగ్లీషు అనువాదం వస్తే, దానిపై సమీక్ష/వ్యాఖ్యానం రాశాడు. అతగాడు అనుష్ఠానం చెయ్యడు కాబట్టి, ఆ వ్యాఖ్యానం రాయటానికి అర్హత లేదన్నారు కొందరు పండితమ్మన్యులు! చదివిన మరికొందరు సంస్కృతపండితులు ‘అతను చాలా మంచి సమీక్ష/వ్యాఖ్యానం రాశాడు’ అన్నారు. ఈ సంస్కృత యుద్ధరంగంలో నేను తలదూర్చి నా చిన్న బుర్ర పగలగొట్టుకోను. అందుకని ఈ మూడు మాటలూనూ!
రామాయణం కథ తెలుసుకోవాలంటే, వాల్మీకి రామాయణం మొదటి సర్గ చాలు. ఆ సర్గలో, నారదుడు వాల్మీకికి రామాయణకథ మొత్తం చెప్పుతాడు. దానికి సంస్కృతం చదవక్కరలేదు; పుల్లెల శ్రీరామచంద్రుడి అర్థతాత్పర్యసహిత వ్యాఖ్యానం, ఇతర తెలుగు పండితుల వ్యాఖ్యానాలతో కలిపి, పది సంపుటాలుగా (సుమారు తొమ్మిది వేల పేజీలు!) ఆర్ష విజ్ఞాన ట్రస్టు (1987) ద్వారా ప్రచురించారు. సంస్కృతం కూడా తెలుగు లిపిలో ఉన్నది. అందుకనే నేను ఆ పదిసంపుటాలు, 1989లోనే కొనుక్కొని తెచ్చుకున్నాను, పదవీవిరమణ తరువాత, చదువుదామని!
పదవి విరమించిన రెండు దశాబ్దాల తరువాత ఇప్పటికి వెసులుబాటు చిక్కింది. రామాయణం, భారతం (తిరుమల తిరుపతి దేవస్థానం, 2006), మహాభాగవతం (తెలుగు విశ్వవిద్యాలయం, 1987) అచ్చొత్తించిన రెండు సంపుటాలూ ఇవన్నీ కట్టకట్టుకొని నన్ను వెక్కిరిస్తున్నాయా అన్నట్టు అలమారలో కూచున్నాయి. ఇలాంటి పుస్తకాలు కాస్త మంచి కాగితం మీద అచ్చొత్తించాలన్న సృహ అప్పట్లో మనవాళ్ళకి లేదనుకుంటాను.
ఇప్పుడు రామాయణానికి వద్దాం.
మొదటి సర్గ తేలిగ్గా వెళ్ళిపోయింది. రామాయణ కథ చిన్నప్పుడు, తెలుగులోనూ ఇంగ్లీషులోనూ చదివిందేగా!
రెండవ సర్గలో తొమ్మిదవ శ్లోకం నుండి పదిహేనవ శ్లోకం వరకూ తెలుగు ప్రతిపదార్థాల దగ్గిర నా చదువు కుంటుపడింది. రెండు క్రౌంచపక్షులు, రతిక్రీడలో పారవశ్యంతో ఆనందిస్తూ వుండగా ఒక బోయవాడు (నిషాదుడు) మొగ క్రౌంచపక్షిని నిర్దాక్షిణ్యంగా చంపుతాడు. అది చూసి వాల్మీకి శోకించి ‘మానిషాద’ అని మొదలుపెట్టి బోయవాడిని శపిస్తాడు. ఈ శ్లోకం సంస్కృతసాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంగా పరిగణిస్తారు.
నా చదువుకి ఇక్కడే పెద్ద నట్టు పడింది. మీ సంగతేమో కాని, ఏ పదానికైనా అర్థం తెలియకపోతే, అర్థం తెలిసేవరకూ నాకు నిద్ర పట్టదు. రాత్రి కలలో ఆమాటే గుర్తుకొచ్చి లేచి కూర్చుంటాను. నా దగ్గిర ఆప్టే, బ్రౌన్, శంకరనారాయణ, శబ్దరత్నాకరాది నిఘంటువులు ఉన్నాయి. ఆంధ్రభారతి సరేసరి! అన్ని నిఘంటువులూ వెతికాను; క్రౌంచపక్షి అంటే ఎటువంటి పిట్ట అని! ఒకడెవడో ‘వాటర్ బర్డ్’ అని రాస్తాడు. అది పిట్ట పేరు కాదుగా! ఈ వ్యాఖ్యానాలు రాసేవాళ్ళల్లో ఒక్కడికి కూడా, పిట్టల గురించి ఏఁవీ తెలియదు. పోనీ, ఆ పిట్ట తెలుగునాట, దక్షిణ భారతంలో ఉండకపోవచ్చు. నా ఉత్తరాది స్నేహితులని పేరుపేరునా పిలిచి అడిగాను, ఇది బహూశా ఉత్తరాది పక్షి అనే భ్రమలో. రామాయణం ఉత్తరాది కావ్యమే కదా. వాళ్ళందరూ నీళ్ళు నవిలారు. రెండు నెలలకింద మా మేనమామ కొడుకు అయోధ్యకు వెళ్ళాడు. వెళ్ళబోయే ముందు వాడితో చెప్పాను, క్రౌంచపక్షుల గురించి నా బాధ! వాడూ వెర్రిమొహం వేసుకొని తిరిగి వచ్చాడు ‘అక్కడ ఎవరికీ క్రౌంచపక్షుల గురించి తెలియదట!’ అంటూ.
1975లో బరోడా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వేసిన వాల్మీకి రామాయణం ఆధారంగా ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఏడు సంపుటాల రామాయణం ఇంగ్లీషులో ప్రచురించింది. రాబర్ట్ గోల్ద్మన్ (Robert Goldman) ఆధ్వర్యంలో ఈ సంపుటాలు వచ్చాయి. చాలా ఖరీదు కూడాను! ఏడవ సంపుటం ఒక్కటే $180.00. ఈ సంపుటాలు పాశ్చాత్యదేశాల్లో సంస్కృత పండితుల కోసం. వాటిలో అర్థం, తాత్పర్యం, వ్యాఖ్యానం, 1500+ పేజీల పెద్ద ఇండెక్స్ ఉన్నాయి. ఈ సంపుటాలు ఊసుపోక రామాయణం చదివే నాలాంటి వాళ్ళకోసం కాదు. జర్మనీ, అమెరికా, మొదలైన పాశ్చాత్య దేశాలలో సంస్కృతం చదువుకొని, సంస్కృత కావ్యాలపై పరిశోధనలు చేసే వాళ్ళకోసం. అలాంటివాళ్ళు ఇంకా ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపడే తెలుగువాళ్ళు ఉండచ్చు. కానీ, ఇది నిజం.
నా అదృష్టవశాత్తూ, రాబర్ట్, శాలీ గోల్ద్మన్లు ఆ ఏడు సంపుటాల రామాయణాన్ని, కుదించి 900+ పేజీల పుస్తకంగా 2022లో ప్రచురించారు. ఇది చాలా శ్రమతో కూడిన పని అని ఒప్పుకోవాలి. ఖరీదు $27.50. అమరికాలో చవకేనని ఒప్పుకోవాలి. ఈ కుదించి అచ్చొత్తించిన రామాయణంలో క్రౌంచపక్షులంటే ఏ పక్షులో ఆంగ్లంలో దొరకచ్చునని, అది తెప్పించి చూశాను. అందులోనూ ఇంగ్లీషులో ఆ పక్షి పేరు దొరకలేదు.
ఈ పక్షి ఒక నీటి పక్షిట. అంటే curlew, heron, crane, sandpiper అని అనువాదం చెయ్యచ్చని ఒక సమీక్షలో కనిపించింది. ఒక సముద్రపు పక్షి. దానికి తెలుగు పేరు లేదన్నమాట!
ఏలూరులో వుండేరోజుల్లో, మా రాజుగారు కొల్లేరు పిట్టలు తెప్పించి మాకు విందు భోజనం పెట్టించేవాడు. ఆ పిట్టలు కొల్లేటి ప్రాంతంలోనే దొరికేవి. ఇంకెక్కడా దొరకవుట! ఎక్కడో ఉత్తరాది నుంచి, ఇతర దేశాల నుంచీ ఆ పిట్టలు వలసకొస్తాయట! చాలాకాలం తరువాత తెలిసింది; వాటిని వేటాడటం, చట్టవిరుద్ధమని ఆంధ్రప్రభుత్వం ఏనాడో నిర్ణయించిందిట!
నాలుగేళ్ళ క్రితం ఏలూరు వెళ్ళటం కుదిరింది. కొల్లేటి కింద వ్యవసాయం చేసే అంతర్వేది మనవడు ఏలూరులో కనిపించాడు. వాళ్ళ తాత ఎలా ఉన్నాడని అడిగాను. తాతకి 95 దాటినాయి బాబూ! బాగానే ఉన్నాడు; నడవలేడు, అని అన్నాడు. వాడిని కారులో ఎక్కించుకొని అంతర్వేదిని చూడటానికి వెళ్ళా; కొల్లేటి పిట్టల పేరు కనుక్కుందామని. ఠక్కున చెప్పాడు, ‘అయి పరగ పిట్టలు బాబూ’ అని. ఎగిరి గంతేత్తామనిపించింది పరగ పిట్టలు అని వినంగానే! అయితే, ఇంతకీ పరగలే క్రౌంచ పక్షులా? కాదా? ఈ ప్రశ్నకి సమాధానం ఏ ఋషి, ఏ కవి చెప్పగలడు?
అయితే అలనాటి ప్రభుత్వనిర్ణయానికి, రామాయణంలో వాల్మీకి క్రౌంచపక్షులని చంపినందుకు నిషాదుడిని శపించటానికి, మధ్యన ఉన్నది బాదరాయణ సంబంధమేనని నా నమ్మకం.
నా రామాయణ పఠనం క్రౌంచపక్షులతోటే ఆగిందని ఒప్పుకోవాలి. ఇది ముమ్మాటికీ నిజం.