అంతర్థానం

“సుజా! ఎలా జరిగిందే…” ఏడుపు వినిపిస్తోంది ఫోన్లో అవతల నుండి. నీ దగ్గర సమాధానం లేదు.

“అయ్యో పొద్దునే మాట్లాడుకున్నాం ఇద్దరం, ఇంతలోనే ఎంత ఘోరం…” ఇంకో కాల్, ఇంకో ఏడుపు.

ఇంటి కాలింగ్ బెల్ అదేపనిగా మోగుతున్నా నువ్వు కదలట్లేదు. తుఫాన్‌లా మొబైల్‌లో కురుస్తున్న మెసేజ్‌లు నీకు పట్టట్లేదు. నిశ్శబ్దంగా నీ ఇంట్లోకి చొరబడుతున్న చుట్టుపక్కల జనాలూ నీకు కనబడట్లేదు.

చుట్టూ ఓ దట్టమైన గూడుని అల్లుకున్న గొంగళి పురుగులా ఏకాంతంగా కూర్చున్నావు నువ్వు. పట్టించుకోకపోతే కాసేపటికి ఈ ప్రపంచమే మామూలుగా మారిపోతుందన్న ఆశ నీకు. ఈ పీడకల నుంచి బయటపడటానికి కళ్ళని పదే పదే మూసి తెరుస్తున్నావు. కానీ చుట్టూ ఏ మార్పూ రావడం లేదు. కళ్ళ మసకలో, నువ్వొద్దంటున్నా బలవంతంగా నిన్ను వేరే ప్రపంచంలోకి తొయ్యాలని చూస్తున్న వాళ్ళందరి వైపూ నిస్సహాయంగా చూస్తున్నావు.

‘ఈయన తప్పేం లేదండీ, సిగ్నల్ చూడకుండా అవతలి వాడే…’ ఓ మూల నుండి ఎవరో. మొట్టమొదటిసారి నీ ముఖంలో కదలిక అది‌ విని. ఓ అజ్ఞాత శక్తి నీలోంచి మెల్లగా ఏదో పెకలించి తీసికెళుతున్నట్టు చూస్తున్నావు శూన్యంలోకి. నీ పెదవులకి తగులుతున్నది చిక్కటి ఉప్పదనమని ఇప్పుడిప్పుడే నీకు తెలుస్తోంది.

‘డాక్టర్లు సరిగ్గా ప్రయత్నించారా అసలు?’

‘లేదు, యాక్సిడెంట్ స్పాట్‌లోనే…’ గుసగుస వెనకాల.

ఓ బండరాయి‌ ఎదురుగా వచ్చి గుద్దినట్లు అదిరిపడ్డావు నువ్వు. చుట్టూ ఉన్న నీ పొర తెగిపోతోంది. నువ్వనుకుంటున్న నీ కల, నిజం‌లోకి పొర్లి, దాన్ని పూర్తిగా కమ్మేస్తోంది.

అప్పుడు మొదలుపెట్టావు నువ్వు గొంతు తెరిచి ఏడవడం.


ఆ తర్వాత నీ ఏడుపుకి‌ అంతు లేకుండాపోయింది. ఎనిమిదేళ్ళ కొడుకు‌ దగ్గరకొస్తే వాణ్ణి పట్టుకుని ఏడ్చావు. నీ ఫ్రెండ్స్‌ని చూస్తూ బిగ్గరగా ఏడ్చావు. అత్తమామలు నిన్ను నిస్సహాయంగా చూస్తుంటే ఏడ్చావు. నీకు తెలియని వాళ్ళెవరో వచ్చి ఓదారిస్తే, ఆశ్చర్యపడుతూ ఏడ్చావు.

“ఎలా‌ జరిగింది?” అనడిగారు చాలామంది ఏమనాలో తెలియక. అందరికీ నీ ఏడుపే సమాధానంగా ఇచ్చావు. ప్రతి ఫోన్ కాల్‌కీ, ప్రతి కౌగిలింతకీ ఏడ్చావు. ఈ రోజు ఏడుపునే నీ భాషలా మార్చుకున్నావు నువ్వు. ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోగలిగిందీ, నీకు సమాధానం ఇవ్వగలిగిందీ ఇంకో ఏడుపు మాత్రమే.

“నీకు మేమున్నాం సుజా!” అన్నారు చాలామంది. నీ‌కర్థం కాలేదది.

‘ఎవరుంటారు నాకు? ఎందుకుంటారు నాకు?’ అనుకున్నావు.

‘నాకే ఇలా ఎందుకు జరగాలి?’ మధ్య మధ్యలో నీ హృదయాన్ని మెలిపెడుతున్న ప్రశ్న. అలా కాకపోతే మరోలా‌ జరగచ్చన్న‌ నిజాన్ని అప్పటికి కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్న మెదడు.

చుట్టూ చూశావు. పెరుగుతున్న చీకటిని తట్టుకోవడానికి లైట్లు కూడా పెరిగి వెలుగుతున్నాయి. ఓ పదిమంది దాకా కనపడ్డారు నీకు హాల్లో. ఓ మూల నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు రఘు. పొద్దుటి నుంచీ‌ నిన్ను ఇబ్బంది పెట్టకుండా అన్నీ చూసుకుంటున్నాడు. నువ్వు చూస్తున్నావని దగ్గరికొచ్చాడు. “వదినా, ఫార్మాలిటీస్ ఇంకా అవ్వలేదట, రేపు ఇస్తామన్నారు పోలీసులు.” ఇబ్బందిగా చెప్పాడు. నువ్వు చేతిని నోటికడ్డం పెట్టుకున్నావు అప్రయత్నంగా.

అతని భార్య నీ భుజం మీద‌ చెయ్యి వేసి “ఏం తినలేదక్కయ్యగారూ మీరు పొద్దుటినుండీ, కొంచెం ఏదైనా…” అంది. తల అడ్డంగా ఊపావు నువ్వు.

‘దరిద్రపు మొహాన్ని, ఆయన్ని పొద్దున్నే బైటికెళ్ళమని ఎందుకడిగానో…’ ఇంకోసారి తిట్టుకున్నావు మనసులో.

ఆకలి శిక్ష వేసుకుంటున్నావు నువ్వు. బాధలోంచి తన్నుకొస్తున్న కోపం నీది.


తర్వాతి పొద్దునే లేచావు అలికిడికి. అసలు నిద్రే పట్టదనుకున్నావు కానీ నీ శరీరం నిన్ను మోసం చేసింది. ఒళ్ళంతా లాగేస్తోంది. పొట్ట కాలిపోతోంది. ఎవరో కాఫీ తెచ్చిచ్చారు. మొదటిసారి తీసుకోలేదు కానీ ఇంకోసారి బలవంతపెడితే వద్దనలేదు నువ్వు.

మెల్లగా కిందకొచ్చి సైలెంట్‌గా కుర్చున్నావు. కొంతమంది వంటింట్లో ఉన్నారు. మగవాళ్ళు బైటికీ లోపలికీ తిరుగుతున్నారు. ఎవరూ నీతో కళ్ళు కలపడంలేదు. వచ్చినవాళ్ళకి టిఫిన్‌లూ, టీలూ అందిస్తోంది ఒకామె. పిల్లాడిని పక్కన కూర్చోపెట్టుకున్నారెవరో. జనాలు పెరిగారు. ప్రతి మూలా ఎవరో ఒకరు తలలూపుతూ మాట్లాడుకుంటున్నారు. నిన్న పొద్దున నిశ్శబ్దంగా మొదలైన ఇల్లు… ఇంత మార్పుని తట్టుకోవడానికి సిద్ధంగా లేవు నువ్వు.

ఉన్నట్టుండి బైట గొడవగా మారింది. నీలో భయం మొదలైంది. ఇప్పటివరకూ పట్టుకుని నడుస్తున్న ఆ కొద్ది ఆశా నీకు ద్రోహం చేస్తుందేమోనన్న‌ సందేహం పీడిస్తోంది.

“అన్నయ్యొచ్చాడొదినా!” అన్నాడు రఘు ఏడుస్తూ నీ దగ్గరికొచ్చి. అతడి భార్య నిన్ను పైకి లేపబోయింది. నువ్వు బలంగా మారిపోయావు రాయిలా.

‘వదిలెయ్, వస్తుందిలే’ అన్నాడు తను‌ భార్యతో.

అందరూ ముందు గదిలోకి వెళ్ళి దణ్ణం పెడుతున్నట్టు తెలుస్తోంది. అత్తగారి ఏడుపు వినిపిస్తోంది పెద్దగా ఆ గదిలో నుండి.

నీ ప్రమేయం‌ లేకుండా ఓ పెద్ద ఈదురుగాలొచ్చి ఈడ్చుకుపోయినట్టనిపించింది ఆ రోజంతా నీకు. శవం ముందు పడి ఎంతసేపు ఏడ్చావో, ఎన్నిసార్లు కళ్ళు తిరిగి కుర్చుండిపోయావో, దాన్ని తీసుకెళుతుంటే ఎంత పెనుగులాడావో… ఒక్క రోజులో జీవితానికి సరిపడే బాధ! తుఫాను తర్వాతి ప్రశాంతత నీ ముఖంలో ఇప్పుడు.

సాయంత్రం ఇంకొంతమంది వచ్చారు ఇంటికి. ఆఫీసువాళ్ళు, ఊళ్ళోవాళ్ళు, దూరపు‌ చుట్టాలు, అందరూ వచ్చారు. వాళ్ళు పలకరిస్తే ఇప్పుడు నువ్వు సన్నగా నవ్వుతున్నావు. నీ నవ్వు చూసి వాళ్ళకి ఏమనాలో తెలియలేదు. ఆశ్చర్యపోయి చూశారు. నీ భర్తతో వాళ్ళకున్న అనుభవాలు చెప్పారు నీతో. నువ్వు మధ్యమధ్యలో ఒకటీ రెండు పదాలు మాట్లాడుతున్నావిప్పుడు. తలూపుతున్నావు దూరం నుండి ఎవరైనా నీ వైపు చూస్తే‌. పిల్లాడి గురించి మాట్లాడితే మాత్రం నీకు బాధగా ఉంది. కానీ నీ ఒంట్లో కన్నీళ్ళేవీ మిగల్లేదు ఇక బైటికి ఒంపడానికి.

అందరూ నీ భర్త గురించి గొప్పగా మాట్లాడారు. తప్పకుండా స్వర్గానికే వెళతాడన్నారు. నీకు ఆనందంగా ఉంది. కానీ అది పంచుకోవడానికి నీ భర్త లేకపోవడం మళ్ళీ నిన్ను బాధలోకి నెట్టేస్తోంది.

ఆ రాత్రి కళ్ళు మూతలు పడుతున్నప్పుడు అనుకున్నావు,

‘చనిపోయాక ఏం జరుగుతుంది?’

‘స్వర్గానికో, నరకానికో…’

జీవితంలో కొన్ని లక్షల విధాలుగా నడుచుకునే‌ మనిషికి, మంచి‌ చెడులని విడదీయలేని మిశ్రమంగా చేసుకుని బతికే మనిషికి‌, తనెప్పుడూ ‘ఒప్పే‌’ అని నమ్మే, నమ్మించే అదే మనిషికి, చివరికి మిగిలేవి రెండే రెండు దారులు. ఎవరు నిర్ణయిస్తారో? ఎలా‌ నిర్ణయిస్తారో?


తర్వాతి రోజు పిల్లాడు ఏడుస్తూ నీ దగ్గరికొచ్చాడు. రెండ్రోజులుగా పట్టించుకోని వాణ్ణి చూసి నీకు జాలేసింది. “టిఫిన్ తిన్నావా?” అనడిగావు. లేదన్నాడు వాడు‌. వాడికి నాన్న లేడని బాధగా ఉంది‌ కానీ అందులోని లోతు ఇంకా తెలియడం లేదు. నువ్వూ వాడిలా ఉండుంటే బావుండేదనుకున్నావు. అసలు పెరగకపోతే, పెళ్ళే చేసుకోకపోతే ఈ బాధ ఉండేది కాదనుకున్నావు. “కనీసం ఆయనతో ఆ రోజు పొద్దున్నే గొడవపడకుండా అన్నా ఉండవలసింది” అని మళ్ళీ తిట్టుకున్నావు.

ఉన్నట్టుండి నీ కళ్ళు పెద్దవయ్యాయి. తల తిరిగిపోతోంది. అలా శూన్యంలోకి చూస్తూ కుర్చుండిపోయావు.

‘కారు నడిపేటప్పుడు, మా గొడవ గురించే ఆలోచిస్తున్నారా…’

‘ఆ ధ్యాసలో ఎదుటి వెహికిల్‌ని చూసుకోకుండా…’

‘నా వల్లేనా ఆయన…’

నోరు తెరిచావు. నీ మీద నీకున్న కోపానికో కారణం దొరికింది. లేదు, వెతికావు నువ్వే. హఠాత్తుగా లేచావు. బాత్రూమ్‌ లోకి నడిచావు ఆవేశంగా. అద్దంలో నీ మొహం చూస్తూ నిలబడ్డావు. నీకు అసహ్యంగా ఉంది దాన్ని చూస్తే ఇప్పుడు. నీకిష్టమైన మనిషిని దూరం చేసిన మృత్యుదేవత మొహమది.

‘లేదు… నేనూ వెళ్ళాలి, వెళ్ళి ఆయన్ని క్షమించమని అడగాలి!’

సొరుగులో ఉన్న కత్తెర తీసుకున్నావు. ఎలా మొదలుపెట్టాలో ఆలోచిస్తున్నావు.

ఉన్నట్టుండి మళ్ళీ పిల్లాడి ఏడుపు వినపడింది బైటనుండి‌. తలుపు తీసుకుని బైటికి పరిగెత్తావు. వాడిని అమాంతం దగ్గరకి లాక్కుని, గట్టిగా తలని హత్తుకుని పెద్దగా ఏడ్చావు.


తర్వాతి రోజు వాతావరణం మారింది ఇంట్లో. ఇద్దరు ముగ్గురు తప్ప ఇంట్లో ఎవరూ తిరుగుతున్నట్టు అనిపించలేదు నీకు. చుట్టాలెవరూ లేరు. ఫ్రెండ్స్ వంతులు వేసుకుని ఉండి ఉంటారనుకున్నావు. ‘నీకు మేమున్నాం’ అన్నవాళ్ళెవరూ కనపడలేదు. నువ్వు వాళ్ళనేమీ అనుకోలేదు. అసలు నువ్వా మాటే నమ్మలేదు.

‘ఏమో సార్, వంద మెసేజ్‌లొస్తున్నాయి. పంతులుగారు, పోలీసులు, సర్టిఫికెట్ ఫార్మాలిటీస్ అన్నీ చూడాలి. నేనొక్కణ్ణే…’ అంటున్నాడు రఘు ఓ మూల ఎవరితోనో.

‘ఇప్పటికి మూడోసారి టీలూ, టిఫిన్లూ… ఏ క్షణం ఎవరొస్తారో…’ అంటోంది అతడి భార్య కిచెన్లో ఎవరితోనో.

వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారో, లేక ఆ చిన్న చిన్న నిట్టూర్పులు పసిగట్టే శక్తి కొత్తగా నీకే వచ్చిందో తెలియలేదు నీకు.

వాళ్ళ స్థానంలో నువ్వున్నా అలానే అనేదానివేమో. అయినా నీకెందుకో నచ్చలేదు వాళ్ళ మాటలు. ‘ఆయన ఎంత చేశాడు వాళ్ళకి!’ అనుకున్నావు. పని చేయించుకుంటూ వాళ్ళని తిట్టుకుంటున్నందుకు గిల్టీగా ఉంది నీకు. దీనికంతటికీ కారణం నువ్వూ, నీ బాధ. అవును, ఎల్లకాలం బాధపడుతూ కుర్చోలేవు. దానికీ ఓ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.

పోనీ బాధని దిగమింగి బతికేద్దాం అనుకున్నావు.

‘ఇంకెంతకాలం, మహా అయితే ఓ ఇరవై, ముప్ఫై ఏళ్ళు.’

‘లేదు, ఇరవైయ్యే.’ అని స్థిరపరుచుకున్నావు.

ఇట్టే అయిపోతాయి.

నీకెందుకో నమ్మకం కుదరట్లేదు.

‘ఒకవేళ అరవై దాటాక కూడా నేను బతికే ఉంటే? మరో ఇరవై ఏళ్ళు ఎక్కువ బతికితే!’

ఎవరూ నీ పక్కన లేకుండా, నీతో కలిసి నవ్వకుండా, నువ్వు చేసిన ప్రతి పనినీ మెచ్చుకోకుండా, దిగులుపడినప్పుడు దగ్గరకి తీసుకోకుండా మరో నలభై ఏళ్ళు!

నీకు భయమేసింది. జీవితం గడిపిన దానికన్నా, దాని జ్ఞాపకాలతోనే ఎక్కువకాలం బతకాలేమోనని భయమేసింది. ఆ జ్ఞాపకాలు కూడా గుర్తుండని రోజు వరకూ బతికుంటావేమోనని భయమేసింది. బిగ్గరగా ఏడ్చావు ఉన్నట్టుండి. అసలు ఏడుస్తున్నట్టు కూడా అనిపించలేదు‌ నీకు. ఎవరికో ఏదో చెప్పబోయి, ఏం చెప్పాలో తెలియక వస్తున్న అరుపు అది. అగాధంలో పడిపోతున్నప్పుడు దాని లోతు తెలిసి పెడుతున్న గావుకేక అది.

పరిగెత్తుకుంటూ వచ్చారు జనాలు నీ చుట్టూ. అయోమయంగా చూశావు అందరి వైపూ. చేతుల్తో మొహం తుడుచుకున్నావు హడావిడిగా ఏడుపుని మింగేస్తూ. ‘సీన్‌’ క్రియేట్ చెయ్యకూడదనుకున్నావు. ఏడుపు నాగరికత కాదని నీ అభిప్రాయం. నీ బలహీనతల్ని బయటపెట్టే ఏ పనీ ఇకనుంచి చెయ్యకూడదని నిశ్చయించుకున్నావు.

ఇప్పుడు, ఇప్పుడు ఇదంతా కల కాదని పూర్తిగా నమ్మావు నువ్వు.


ఆ సాయంత్రం లెక్కలు చూడటానికి నీ ల్యాప్‌టాప్ తీశావు. ఎప్పుడో సంవత్సరం కిందట తను నీకు చెప్పింది గుర్తు‌ తెచ్చుకున్నావు‌. అతను నీకన్నీ చెప్పాడు వివరంగా, ఓపిగ్గా. నీకెందుకో అవన్నీ పట్టలేదు. పరధ్యానంగా విన్నావు. ‘ఎందుకిప్పుడివన్నీ చెబుతున్నారు?’ అని కోప్పడ్డావు కూడా.

ఆ ఫోల్డర్లో అన్ని వివరాలూ రాసిపెట్టాడతను. వచ్చే జీతం, చేసిన సేవింగ్స్, తీసుకున్న ఇంటి లోన్, పిల్లాడి చదువుకి ఎంత దాచాలో, రిటైర్మెంట్‌కి ఎంత పోగెయ్యాలో, ఎంత సంపాదిస్తే ఈ ఇంట్లో ఉండగలరో… నీకు తల తిరిగిపోయింది. ల్యాప్‌టాప్ గట్టిగా మూసేశావు. ఇవన్నీ చూడటానికి ఇది సరైన సమయం కాదనుకున్నావు. కానీ ఆ సమయం ఎప్పుడో కూడా తెలియలేదు.

రఘు వచ్చాడు. “అన్నీ సెట్ చేసేశానొదినా” అన్నాడు. వచ్చే ఇన్స్యూరెన్స్ అమౌంట్ నీకు, బాబుకు, ఇంటికీ ఇంకో మూడు నాలుగేళ్ళు సరిపోతుందన్నాడు. చుట్టాలూ, ఫ్రెండ్స్‌ కలిపి ఇంకొంత ఇస్తారు బాబు చదువు కోసం అన్నాడు. నీ మనసు చివుక్కుమంది. ‘ఆయనకివన్నీ నచ్చవు రఘూ’ అని అరిచి చెప్పాలనుకున్నావు. నోరు పెగల్లేదు. ఇంతమందికి ఋణపడబోతున్నావన్న బాధ నీకు ఊపిరాడనివ్వట్లేదు.

“కొంత నెమ్మదించాక నువ్వేదైనా జాబ్ చూసుకోవచ్చు. దేని గురించీ ఇబ్బంది పడక్కర్లేదొదినా!” అన్నాడు తిరిగి వెళుతూ.

‘నాకే ఇబ్బందీ లేనట్టేనా అయితే?’ అనుకున్నావు‌.

నవ్వొచ్చింది నీకప్పుడు. నువ్వెప్పుడూ ఇంతే. ఏదో అర్థమైతే నవ్వుతావు. హఠాత్తుగా ఏదో కొత్త మడతని విప్పితే, అనుకోకుండా ఓ కొత్త పార్శ్వాన్ని తడిమితే, నవ్వుతావు. ఎవరికీ తెలియని నిగూఢ సత్యం ఒకటి నీకే తెలిసినట్టు!


నాలుగో రోజు పొద్దున ఆరింటికే దిగావు కిందకి నువ్వు. హడావిడిగా మెట్లు దిగి సరాసరి కిచెన్‌ లోకెళ్ళావు. డబ్బాలేవీ నువ్వు పెట్టుకున్న చోట లేవు. పదే పదే క్లాక్ వైపు చూస్తున్నావు అసహనంగా. టీ, షుగర్ డబ్బాలు దొరికాయి ఓ మూల. పాలు పొయ్యి మీద పెట్టి, రెండు కప్పులు కడిగావు సింక్‌లో. నీ యాలకుల పొడి డబ్బా మాత్రం ఎవరూ ముట్టుకోలేదు. అదేంటో వాళ్ళకి తెలిసుండదు. రవ్వంత ఆ సీక్రెట్ పౌడర్ కలిపి రెండు కప్పుల్లో పోశావు టీని. వాటిని అందుకొని ఆతృతతో కిచెన్ బైటికొస్తూ, ఏదో గుర్తొచ్చి హఠాత్తుగా ఆగిపోయావు నువ్వు. వణుకుతున్న చేతుల్లో ఉన్న ఆ రెండు కప్పులనే చూస్తూ నించున్నావు అయోమయంగా.

ఓసారి చుట్టూ చూశావు. అక్కడే తిరిగిన ఓ శరీరం కోసం, ఓ గుండె కోసం చూశావు. అప్పుడే ఎవరో పిలిచినట్టు ఉలిక్కిపడి నా వైపు చూశావు. మనిద్దరి కళ్ళూ కలిశాయి. నవ్వాను నేను. నువ్వూ నవ్వావు, టీ తెచ్చి నా ఫొటో ముందు పెడుతూ…