తెలుగు దారి సరే! తెలుగు వారిక్కాదు

సుప్రసిద్ధ సాహిత్యవేత్త వెల్చేరు నారాయణరావు తెలుగుదారి అని ఒక తెలుగు వ్యాకరణం రాశారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘కొత్త వ్యాకరణం ఎందుకు రాశాను‘ అన్న శీర్షికతో ఆయన ఒక వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో కొన్ని విషయాలు ప్రస్తావించారు. ‘గిడుగు రామమూర్తిగారు గట్టి గొంతుకతో గ్రాంథికం ఎవరూ రాయలేరు అని పుంఖానుపుంఖమైన ఉదాహరణలతో ఉపన్యాసాలు చెప్పి వినేవాళ్ళను భయపెట్టేవాడు. కాని, తనే వ్యావహారికం అంటే ఏమిటి, ఎలా రాయాలి అని చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు’ అంటారాయన. అయితే అప్పటికే వ్యావహారికం రాయడానికి గురజాడలాంటి వాళ్ళు బాటలు వేయనే వేశారు. ప్రత్యేకంగా వ్యాకరణం రాలేదన్నది నారాయణరావు అభియోగమే కాని, ఆయన తెలుగుదారి వంటి వ్యాకరణాలు క్రీ.శ. 1728 నుండి చాలానే వచ్చాయి. ఉదాహరణలే ఒక పేజీ స్థలం ఆక్రమిస్తాయి. అయినా భాషకు వ్యవహారం ముందా, వ్యాకరణం ముందా? వ్యావహారిక భాషలో తగినన్ని రచనలు వచ్చిన తర్వాత కదా ఎవరైనా దానికొక లిఖిత వ్యాకరణం రాయాలనుకునేది. దీనికి గిడుగును తప్పు పట్టవలసిన అవసరం ఏముంది?

ఆయన ‘ఇది ఆధునిక తెలుగుకి పరిపూర్ణమైన వ్యాకరణం. ఇలాంటి వ్యాకరణం తెలుగుకి ఎవరూ రాయలేదు’ అని చెప్పుకున్నారు. ఇది చదివిన తర్వాత అదేదో తెలుసుకుందామన్న కుతూహలం కలగడం సహజం. కాని దాన్ని చదివిన తర్వాత విశేషమేమీ కనిపించలేదు. అయితే 24.09.2023న ది హిందూ దినపత్రికలో డేవిడ్ షూల్మన్ సమీక్ష, 09.01.2023న ఆంధ్రజ్యోతి ‘వివిధ’లో తెలుగు వ్యావహారికానికి తొలి వ్యాకరణం అన్న కె. వి. ఎస్. రామారావు సమీక్ష చూసిన తర్వాత తెలుగు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర పాఠకులు ఇటువంటి భ్రాంతికి లోనవుతారేమోనన్న అనుమానంతో కొంత వివరణ ఇవ్వడం అవసరమని భావించి ఈ వ్యాసం రాస్తున్నాను. ముందు కొంత నేపథ్యం అవసరం.

తెలుగు వ్యవహర్తకు, తెలుగు తెలియని వ్యక్తి తెలుగు తెలుసుకోవడానికి/ నేర్చుకోవడానికి అవసరమయ్యే వ్యాకరణాలు భిన్నభిన్నంగా ఉంటాయి. భాష ఒక్కటే, దాని నిర్మాణం కూడా ఒక్కటే కాని నేర్చుకునేవాడి పూర్వజ్ఞానం/ తద్రాహిత్యం నేర్పే పద్ధతిని నిర్ణయిస్తాయి.

అట్లాగే తెలుగు వ్యవహర్తలు తెలుగు నేర్చుకోవడంలో వినడం, మాట్లాడడం అనే నైపుణ్యాలు కొత్తగా నేర్చుకోవలసిన అవసరం లేదు. నిత్యవ్యవహారంలో అది సహజంగానే వ్యక్తికి పట్టుబడిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి నేర్చుకోవలసిన నైపుణ్యాలు చదవడము, రాయడమూ. తెలుగు భాషా వ్యవహర్తలు కానివాళ్ళు తెలుగు నేర్చుకోవడంలో వాళ్ళ లక్ష్యాలేమిటన్నదానిపై వాళ్ళు నేర్చుకొనే విషయం ఆధారపడి ఉంటుంది. మౌఖిక వ్యవహారం వరకే పరిమితమైతే వినడం, మాట్లాడడం చాలు. రాయడం, చదవడం నేర్చుకొనే అవసరం ఉన్నప్పుడే దాని జోలికి వెళతారు.

తెలుగు అనగానే రచనా భాష, సంభాషణా భాష రెండూ వేరువేరుగా దర్శనమిస్తాయి. రచనా భాషలో గ్రాంథిక (ప్రాచీన), వ్యావహారిక (ఆధునిక) రూపాలుంటాయి. రచన ఉద్దేశాలు, లక్ష్యాలను బట్టి ఉపయోగించే భాషా స్వరూపం మారుతుంది.

సంభాషణలో కూడా మనం నేర్పుతున్నది ఆధునిక ప్రామాణికం అంటున్న తెలుగు మాండలికం మాత్రమే. తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలలోని మాండలిక భేదాలకు ఇంకా ఆ అవకాశం రాలేదు.

ప్రాచీన కాలంలో తెలుగువాళ్ళు కానివారికి ప్రయత్నపూర్వకంగా, లేదా తరగతి గదిలో తెలుగు ఎలా బోధించేవారో! బహుశః మాట్లాడడం వ్యవహారం నుంచి; చదవడం రాయడం అప్పటికి ఉన్న వ్యాకరణాలు, నిఘంటువుల ద్వారా నేర్చుకొనే/ నేర్పేవారేమో!

తెలుగువారు కానివారు తెలుగు నేర్చుకోవలసిన అవసరం కలిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. తెలుగు ప్రాంతానికి వలసవచ్చిన జనం జనసామాన్య వ్యవహారం ద్వారానే తెలుగు నేర్చుకొనేవాళ్ళు. ఇక్కడ స్థిరపడిన తర్వాతే భాషా సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారు, కొందరు పండితులై కవిత్వ రచనకు కూడా పూనుకున్నారు. బహుభాషా పాండిత్యం, కవనశక్తి గౌరవాస్పదమయిన సందర్భమది.

రెండవది తెలుగు ప్రాంతాన్ని ఇతరులు ఆక్రమించుకున్న సందర్భం. పాలకులు ప్రజలభాష నేర్చుకోవలసిన స్థితి. అలాగే అన్య ప్రాంతీయులైన ప్రభుత్వాధికారులు, సైన్యాధికారులు తెలుగు నేర్చుకోవలసిన స్థితి. ఈ సందర్భంలో తెలుగువారు కూడా పాలకుల భాషను నేర్చుకోవడం, పాలకుల భాషా పదజాలం ప్రాంతీయ భాషలోకి చొరబడడం సర్వసాధారణమైపోతుంది.

గత రెండు వేల సంవత్సరాల పైబడిన చరిత్రలో తెలుగు ప్రాంతాన్ని ఇతరులు ఆక్రమించుకొని పరిపాలించిన సందర్భాలనేకం. కన్నడ, తమిళ, మరాఠి ప్రాంత పాలకులు తెలుగు ప్రాంతంపై ఆధిపత్యం నెరపారు. పద్నాలుగో శతాబ్దం నుండి ముస్లిమ్ పాలన ప్రారంభమైంది. తెలుగు ప్రాంతంలో అధికభాగం ముస్లిముల పాలనలోకి వెళ్ళినా కొంత భాగం వారి ఆధిపత్యంలో లేని కాలమే ఎక్కువ. ముస్లిములు తప్ప అంతకుముందు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి పాలించిన ఆంధ్రేతరులు తెలుగువారితో కలిసిపోయారు. తెలుగు ప్రభావం వారిమీద ఉన్నంతగా వారి భాషల ప్రభావం తెలుగు మీద లేదు. ముస్లిమ్ పాలన వల్ల, ముఖ్యంగా మతకారణాల వల్లే కావచ్చు – పాలకులు, ప్రజల మధ్య పరస్పర ప్రభావం ఉన్నప్పటికీ ఇరువర్గాలూ పూర్తిగా కలిసిపోవడం జరగలేదు.

యూరోపియన్ల రాకతో పరిస్థితులు మరికొంత మారాయి. ముందు వ్యాపారం, తర్వాత మతం, ఆ తర్వాత రాజ్య ఆక్రమణ, పరిపాలనలు ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి. భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన యూరోపియన్ కంపెనీలతో పాటు మత ప్రచారకులు కూడా దిగారు. వాళ్ళు ప్రజల్లో మత ప్రచారం చేయడానికి ప్రాంతీయ భాషలను నేర్చుకోవలసి వచ్చింది. ఈ ప్రయత్నంలో భాగంగానే తెలుగు కూడా నేర్చుకున్నారు. మత సాహిత్యం తెలుగులోకి అనువాదమయింది. బ్రిటిష్ కంపెనీ, ప్రభుత్వాధికారులు ఇక్కడి వ్యవహారాలు నిర్వహించుకోవడానికి, పాలనకు మొదట్లో దుబాసీల మీద ఆధారపడ్డారు. తర్వాతే వాళ్ళకు భారతీయ భాషల్లో శిక్షణ కోసం వ్యాకరణాలు, నిఘంటువులు అవసరమయ్యాయి. ఇంగ్లీషులో తెలుగు వ్యాకరణాలు వెలిశాయి.

1947లో మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంగ్లండు నుండి ఇక్కడికి వచ్చిన అధికారులకు తెలుగులో శిక్షణ ఇవ్వవలసిన అవసరం పోయింది. అయితే ఇంకా తెలుగు నేర్చుకోవలసిన అన్యభాషీయులు మాత్రం ఉన్నారు. అప్పటివరకు హైదరాబాదు రాజ్యంలో పాలనా రంగంలో ఉన్న ఉర్దూ, కన్నడ, మరాఠీ అధికారులకు ఈ అవసరం ఉంది. తర్వాత అఖిల భారత సర్వీసుల్లో ఇతర భాషా ప్రాంతాల నుండి వచ్చిన అధికారులు. రెండు మూడు సంస్థల ద్వారా ఈ పని జరుగుతూ ఉంది. దీని కోసం కొన్ని వాచకాల రూపకల్పన కూడా జరిగింది.

తెలుగుదారి పుస్తకం వీటన్నిటికంటే భిన్నమైన పరిస్థితుల్లో వచ్చింది. తెలుగువారు కానివారు అమెరికాలో (విశ్వవిద్యాలయాల్లో) పాఠ్యాంశాల్లో భాగంగా తెలుగు నేర్చుకోవడం కోసం, వాళ్ళు భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు ప్రాంతానికి రావలసి ఉంటే తెలుగుతో పరిచయం కల్గించుకోవడం కోసం.

వెల్చేరు నారాయణరావు అర్ధ శతాబ్దానికి పైగా అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో తెలుగు బోధించారు. అక్కడి విదేశీయ విద్యార్థులకు తెలుగు బోధించే క్రమంలోనే ఆయన ఈ పుస్తకం రూపొందించారు. ఇది ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణం మాత్రమే కాదు, వాచకం కూడా. అందుకే 474 పేజీలు ఆక్రమించింది. అభ్యాసాలు కూడా ఉండడం, విద్యార్థుల సౌకర్యం కోసం పెద్దచ్చులో ముద్రించడం కూడా గ్రంథవైశాల్యానికి కారణమే.

విదేశీ విద్యార్థులకు ముఖ్యంగా విశ్వవిద్యాలయ స్థాయిలో వివిధ కోర్సులు చదువుకుంటున్నవారి అవసరం కోసం, అదీ తెలుగులో మాట్లాడడం, రాయడం, చదవడం ప్రాథమిక స్థాయిలో నేర్చుకొనేవారి కోసం ఈ తెలుగుదారి అన్న వ్యాకరణం బాగానే ఉపయోగపడవచ్చు. పైగా ఆచరణలో దాన్ని ఉపయోగించిన అనుభవంతో నారాయణరావు చెప్పినప్పుడు సందేహించనవసరం లేదు.

ఇక తెలుగు భాషా వ్యవహార ప్రాంతాల విషయానికి వస్తే ఈ వ్యాకరణం ఎంత ఉపయోగపడుతుందన్నది ప్రశ్న. ప్రస్తుతం నర్సరీ నుంచి ఇంగ్లీషు మీడియంలో చదువుకునే పిల్లలకు ఇంగ్లీషు ద్వారా తెలుగు నేర్పవలసిన పరిస్థితులు ఏర్పడితే దీని ఉపయోగం తగినంతగా ఉండవచ్చు. అయితే ఇప్పటికింకా అంత అవసరం రాలేదు.

తెలుగులో ఆధునిక వ్యవహార భాషకు లేదా ఆధునిక ప్రామాణిక/ రచనాభాషకు చెప్పుకోదగినన్ని వ్యాకరణాలు లేవన్న విషయంలో మరో అభిప్రాయం లేదు. అయితే ఆంగ్లంలో గ్విన్‌‌తో కలిసి భద్రిరాజు కృష్ణమూర్తి రచించిన Telugu Grammar భాషాశాస్త్ర విద్యార్థులకే కాక తెలుగు నేర్చుకోవాలనుకొన్న వాళ్ళకు కూడా ప్రామాణికమైన పుస్తకం. రెండేళ్ళ కిందట నేటి తెలుగు పేరుతో కె.కె. రంగనాథాచార్యులు కూడా మంచి వ్యాకరణం ప్రచురించారు.

ముందుగా ఈ తెలుగుదారి పరిపూర్ణత గురించి పరిశీలిద్దాం.

  1. ఇ, ఈ-లు చేరిన చ, జ-లు తాలవ్యాలని చెప్పారు కాని ఎ, ఏ, ఐ చేరిన చ, జ-ల సంగతేమిటి? (పు. 12). అట్లాగే క, చ, ట, త, ప-లకు ముందున్న బిందువు వర్గానునాసికమని, వ, శ, స, హ-ల ముందున్నది దంత్యోష్ఠ్యమనీ చెప్పారు, మరి య, ర, ల-ల ముందున్న అనుస్వారోచ్చారణ విషయం చెప్పనే లేదు (పు.13).
  2. లిపిలో సాధారణ లేఖన సంప్రదాయానికి భిన్నంగా ఉన్న వాటిని గుర్తించే సమయంలో మొ, యొ-లను గుర్తించలేదు. పు.33లో ఋ, ౠ, ఌ, రా, ఙ, ఞ, ఱ, ఁ -లను వాటి ఒత్తు గుర్తులను పేర్కొని అవి సాంప్రదాయికంగా వర్ణమాలలో చేరినవే తప్ప ఉపయోగం లేనివని చెప్పారు. పు.34లో సంపూర్ణ వర్ణమాలనిస్తూ దాంట్లో ఙ, ఞ-లను చేర్చారు. తక్కిన వాటిని చేర్చలేదెందుకో?
  3. థ, ధ-లు కలిసి పోయాయని చెప్పారు కాని ఈ పుస్తకంలో ఆయన భేదం పాటించారు.
  4. ఈ వ్యాకరణం ప్రకారం ‘అది నాకు ఆనందం ఇస్తుంది’ అన్న వాక్యం వ్యాకరణ విరుద్ధం (పు. 128).
  5. మనుష్యవాచకాలు కాని కర్మ శబ్దాలకు ‘ని’ ప్రత్యయం తప్పనిసరి అంటారు. ఉదాహరణగా ‘నేను ఆటోని పిలుస్తాను’ అనాలి. ‘ఆటో పిలుస్తాను’, ‘టాక్సీ పిలుస్తాను’ వ్యాకరణ విరుద్దాలా?
  6. ప్రేరణార్థకాలు చెప్పినప్పుడు అకర్మక, సకర్మకాలు వాటిపై ఇంచు చేరిన రూపాలు పేర్కొనలేదు. సంధి, సమాస ప్రక్రియల జోలికి వెళ్ళలేదు. అసలు పదనిర్మాణ వ్యవస్థ గురించి మాట్లాడనే లేదు. కృత్తద్ధితాలు లేవు.
  7. సర్వనామాలలో స్త్రీ వాచకంగా ‘ఆవిడ’కు ఇచ్చిన ప్రాధాన్యం ఆమె, ఈమెకు లేదు. బహుశా వారి మాండలికం ప్రభావమేమో!

దొంగ పట్టివేత, దుష్టశక్తుల ఏరివేత వంటి శీర్షికలు కృత్రిమమంటారు నారాయణరావు. ఇవి వ్యాకరణ విరుద్ధాలు కావు. పట్టివేత, ఏరివేత, కొట్టివేత, చుట్టివేత లాంటి కృదంత నామవాచకాలన్నీ వ్యాకరణబద్ధాలే. పద సంపదను పెంచే ఇటువంటి ప్రక్రియల్ని నిరుత్సాహపరచవలసిన అవసరం లేదు. పైగా ఇవన్నీ పత్రికా శీర్షికలు. వాక్యరూపంలో ఉండే శీర్షికలకు బదులుగా నామబంధాలను వాడే సంప్రదాయం కొన్ని దశాబ్దాల నుండి సాగుతూ వస్తున్నది.

ఇప్పుడు మాట్లాడుతున్న భాష విషయంలో చాలా మందికి చాలా అభ్యంతరాలుండవచ్చు. ముఖ్యంగా టివి యాంకర్లు మాట్లాడే తెలుగు, సినిమాలలో అక్కడక్కడ కొన్ని డైలాగులు. కాని ప్రతి సంవత్సరమూ వందలాదిగా వస్తున్న తెలుగు పుస్తకాల రచయితలకు తెలుగు రాయడం రాదని కానీ, వారి తెలుగు మంచి తెలుగు కాదని కానీ అనగలమా! వ్యాకరణాలు మనం వాడుతున్న భాషను వ్యాకరించేవే తప్ప, వ్యాకరణాలు చదువుకొని మనం మాట్లాడతామా? రాస్తామా?

ఇద్దరు సమీక్షకులూ ఈ వ్యాకరణం కొత్తగా చెప్పిన విషయాలుగా పేర్కొన్నవి రెండు అంశాలు. ఒకటి తెలుగు క్రియా ప్రాధాన్య భాష అని, ఈ పుస్తకంలో దానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారని. మీరు ఏ తెలుగు వ్యాకరణ గ్రంథం చూసినా క్రియా ప్రకరణమే అన్నిటికంటే పెద్ద ప్రకరణంగా గమనిస్తారు. గత తెలుగు వ్యాకరణాలు చెప్పని క్రియా విశేషాలేమీ ఈ వ్యాకరణంలో లేవు. రెండోది కాలం గురించి. ఇంగ్లీషు టెన్స్, టైమ్-లతో పోల్చి నారాయణ రావు చేసిన విశ్లేషణ కాని, ఉదాహరణలు కాని ఎలా ఉపయోగపడతాయో!

‘మీరు నిన్న బయటికి వెళ్తున్నారు. అప్పుడు నేను మీకు కనిపించాను’ అన్న వాక్యం ఉదాహరించి, ‘ఈ వెళ్తున్నారు అన్న మాట గడిచిన కాలానికి సంబంధించిన ప్రోగ్రెసివ్ మోడ్, అంచేత ప్రోగ్రెసివ్ ఇప్పటి కాలానికి సంబంధించినది కావచ్చు, గడచిన కాలానికి సంబంధించినదీ కావచ్చు. ఈ తేడా నేను నా వ్యాకరణంలో స్పష్టంగా చూపించాను’ అంటారు. పై వాక్యంలో ‘నిన్న’ అనే పదాన్ని తీసివేస్తే ఏమవుతుంది? కాబట్టి ఈ క్రియాపదానికి ఆ అర్ధం రావడానికి ‘నిన్న’ అన్న పదం కారణం తప్ప ‘వెళ్తున్నారు’ అన్న క్రియాపదంలో ఏమీ లేదు.

నారాయణరావు ‘ఇక నా వ్యాకరణంలో రెండవ విషయం క్రియకి ఉన్న Infinitive రూపాన్ని విడదీసి చూపించడం’ అంటారు. ‘చెప్పు’ అనే క్రియాధాతువును తీసికొని ‘చెప్ప’ అనే Infinitive రూపం చెప్పి దీనికి ప్రత్యయాలు చేరి చెప్పగలను, చెప్పకూడదు, చెప్పొచ్చు వంటి రూపాలు తయారు చేయవచ్చునంటాడు. వ్యాకరణంలో ఈ రూపాల సాధన మార్గాలున్నాయి.

చెప్పు అన్నదానికి కూడదు చేరినప్పుడు దాని చివరి ఉ, అ-గా మారుతుందని సూత్రీకరించడం ఒక పద్ధతి. చెప్పు + అక్కర్లేదు = చెప్పక్కర్లేదు. చెప్ప + క్కర్లేదు అని విడదీస్తామా?

ఇలా ఈ వ్యాకరణం నుండి ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. తక్కిన విషయాలు అన్ని వ్యాకరణాలూ చెప్పినవే. కొత్త ఏమీ లేదు. సమగ్రత అంతకంటే లేదు.

ఐదు మాదిరి ఉత్తరాలు ఇచ్చారు. రెండిటికి తప్ప తక్కిన వాటికి తేదీ, స్థలం ఇవ్వలేదు. అది ఐచ్ఛికమా?

‘కథలు’ అధ్యాయంలో చీమకథ ఒక్కటే ఉంది. ‘కథలు’ అన్న పేరెందుకు?

పుస్తకం చివర జనరల్ వొకాబులరీ (సాధారణ పదజాలం) ఇచ్చారు. అందులో బంధువాచకాలలో అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు మాత్రమే ఉన్నాయి. తెలుగులో బంధువాచక పదజాలం ఎక్కువ. కనీసం అత్త, మామ, బావ, మరిది, వదిన, మరదలు, అమ్మమ్మ, నాయనమ్మ, తాత వరకైనా ఇచ్చి ఉండాల్సింది.

పరిమిత ప్రయోజనం కోసం ఉద్దేశించిన ఈ వ్యాకరణాన్ని సమగ్రమైన తెలుగు వ్యాకరణం అనడానికి వీల్లేదు. అన్యభాషీయులు తెలుగు నేర్చుకోవడానికి ఉపయోగపడే ప్రాథమిక వాచకంతో పాటు భాషానిర్మాణ సూత్రాలు కూడా కొంతవరకు రచయిత ఇచ్చారు. వ్యాకరణ పరిభాష అంతా ఇంగ్లీషులో ఉన్నందువల్ల తెలుగు అధ్యాపకులకుకాని, విద్యార్థులకు కాని ఇది అంతగా ఉపయోగపడదు. ఇంగ్లీషు వచ్చిన అన్యభాషీయులైన వాళ్ళకే కొంత ప్రయోజనం. తెలుగు క్రియారూపాల మీద ఊనిక ఎక్కువగా ఉండడానికి కూడా కారణం ఇదే. విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంగ్లీషు ద్వారా తెలుగు నేర్చుకొనే తెలుగువారు కానివారికి ఒక వాచకంగా ఈ తెలుగుదారి ఉపయోగపడవచ్చు కాని, దీన్ని సమగ్రమైన ఆధునిక తెలుగు వ్యాకరణం అనడం అతిశయోక్తే.