కర్ణాటక సంగీతగాయకుడు టి. ఎం. కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ సంగీతకళానిధి అవార్డ్ ప్రకటించటంతో దుమారం చెలరేగింది. సంగీతసాహిత్యాది కళలలో సాధారణంగా విమర్శలు గ్రహీతల అర్హతను ప్రశ్నించేవిగా ఉంటాయి. ఐతే, కృష్ణ విషయంలో వివాదం అతని ప్రతిభను ప్రశ్నించేది కాక అతనిని వ్యక్తిగా నిందించేది. సంప్రదాయం ఆశించే యథాతథస్థితిని అతను ప్రశ్నించడం, దాని పునాదులు కదిల్చే ప్రయత్నాలు చెయ్యడం సంప్రదాయవాదులకు నచ్చలేదు. ఇది ఒక అభద్రతాభావం నుండి పుట్టిన అసహనమే తప్ప, శతాబ్దాలుగా పరిఢవిల్లిన శాస్త్రీయ సంగీతానికి ఇప్పుడు కొత్తగా రాగల ముప్పేమీ లేదు. ఛందోబంధనాలు తెంపిన కవుల వల్ల తెలుగు కవిత్వం మరింత పరిపుష్ఠమయిందే కాని, కావ్యసంపదకు అవమానమేమీ జరగలేదు. కర్ణాటక సంగీతాన్ని భక్తి అనే ఏకభావప్రాధాన్యతా శృంఖలాల నుండి తప్పించడానికి కృష్ణ చేస్తున్న ప్రయత్నాల వల్ల ఆ సంగీతం మరింత ప్రౌఢము, విస్తారమూ అవుతుంది తప్ప అది ఏ రకంగానూ బలహీనపడదు. కాని, ఆవేశం, అసహనం మాత్రమే హెచ్చరిల్లి తార్కిక విశ్లేషణ, వివేచన కొరవడిన సమాజానికి, తామే నియంత్రించి లోబడి ఉండే సంప్రదాయాన్ని ఏ రకంగా ప్రశ్నించినా ధిక్కరించినా ఓర్వలేనివారికి, మార్పు సహించలేనివారికీ ఇలాంటి సందర్భాల్లో చేయ చేతనైనది వ్యక్తి దూషణ, వ్యక్తిత్వ హననం మాత్రమే. ఇది పక్కన పెట్టినా, మిగతా ప్రతిస్పందనలూ ఆశ్చర్యం గొలిపేవే. కాకతాళీయమే అనుకుందాం, కాని సరిగ్గా ఈ వివాదం నడుస్తున్నప్పుడే – త్యాగరాజు సంగీతం కోసం సాహిత్యాన్ని విస్మరించాడన్న కృష్ణ అభిప్రాయం ఒకటి సందర్భశుద్ధి లేకుండా వెలికి తెచ్చి, మసి పూసి మారేడు చేసి అతనిపై తెలుగు భాషాభిమానులందరూ శాయశక్తులా తమ అక్కసును వెలిగక్కారు. కానీ నిజానికి కృష్ణ చెప్పింది కొత్తదీ కాదు, ఆయన మాటలు త్యాగరాజు పట్ల అవమానమూ కాదు. దశాబ్దాల క్రితమే శ్రీపాద, రాళ్ళపల్లి తదితరులు ఈ సంగతిని తార్కికంగా సోదాహరణంగా చర్చించారు. ఇక, భక్తుడు కానివాడు భక్తిసంగీతంలో తాదాత్మ్యం చెందలేడు కాబట్టి కృష్ణ ఈ కీర్తనలు పాడకూడదన్నది మరొక వాదన. ఇది, ఎవరి కథలు వారే చెప్పుకోగలరు, ఇతరులు చెప్పలేరు, చెప్పకూడదు అని సాహిత్యంలో అస్తిత్వవాదులు చాలాకాలంగా చేస్తున్న ఒక అర్థం లేని వాదనకు భిన్నమేమీ కాదు. కులమతప్రాంతీయ జీవనసరళులను బట్టి వారికే ప్రత్యేకమైన కొన్ని అనుభవాలు, పద్ధతులు ఉంటాయి నిజమే కాని, ఆవేశం, ఆనందం, ఆక్రోశం, అవమానం, అభిమానం, అనురాగం, అణచివేత, ధిక్కరణ వంటి సార్వజనీనమైన అనుభవాల సారాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నవాళ్ళు, కళలో ఆ లోతులు పట్టుకోగలిగిన కళాకారులు ఎవరైనా, ఎవరి కథయినా వ్రాయగలరు, ఎవరి పాటయినా పాడగలరు, ఎవరి బొమ్మయినా గీయగలరు. భక్తిభావం ఇందుకు భిన్నమైనదేదీ కాదు. కృతులలో ఎంత భక్తి ఉన్నా, కర్ణాటక సంగీతం కూడా ఇతర కళలలాగానే ఒక కళ. భక్తిసంగీతమైనా, గాయకుడి భక్తి కేవలం సంగీతం మీద. సాహిత్యశిల్పచిత్రలేఖనాది కళలన్నిటికీ ఇదే వర్తిస్తుంది. ఇది కళాసృజనలో చాలా సూక్ష్మమైన గమనింపు. వివేచనతో తప్ప అవగతం కానిది. ఇలా, సంప్రదాయవాదులు ఈ రకమైన దాడికి దిగితే, అభ్యుదయవాదులు మొత్తంగా వారి మార్కు మౌనాన్ని వారు ఆశ్రయించుకున్నారు. కృష్ణ చేస్తున్న ప్రయత్నం ఎంత విప్లవాత్మకమైనా అతని పోరాటం అగ్రవర్ణ సంప్రదాయం లోలోపలి కుమ్ములాటే కదా అన్న నిరసన వాళ్ళది. ఆ ఆలోచనాధోరణి ప్రమాదకరమైనది. రాజ్యాన్ని ముప్పొద్దులా విమర్శించే వాళ్ళకు కూడా ఇది కేవలం సంగీత వివాదం అనిపించడం; ఇది సాక్షాత్తూ భగవంతుడికే జరిగిన అవమానమన్నట్లు నానా యాగీ చేస్తున్న సంప్రదాయవాదులకు ఇందులోని సామాజిక కోణం పట్టకపోవడం – ఈ రెంటినీ కలిపి చూస్తే, మన సమాజం సమస్యలను ఎంత ఏకపక్షంగా చూస్తుందో అర్థమవుతుంది. ఇప్పటి ఈ వివాదం ఒక గాయకుడిది మాత్రమే కాదు. నిన్నైనా మొన్నైనా ఒక రచయితది, ఒక చిత్రకారుడిది మాత్రమే కాదు. ఇవి కేవలం ఉదాహరణలు. ఈ సమస్య ఒక సమాజంగా మనందరిదీ. భిన్నత్వాన్ని కనీసం మాటమాత్రంగా కూడా సహించలేని మన కురచతనం, సామాజిక వివేచన కోల్పోయిన మన సంకుచితత్వం, తమ బాగే అభ్యుదయం అనుకొనే స్వార్థం. అదనంగా కళ, కళాసృజనల పట్ల అవగాహనాలేమి, అగౌరవం. మరీ ముఖ్యంగా కళలు మత, రాజ్య, సంప్రదాయాల పరిమితులకు, నియమాలకు లోబడి ఉండవని, నిరంతర వినూత్నత, విభిన్నత వాటి ధర్మం, కర్తవ్యం అని కనీసం ఊహకు కూడా రాకపోవడం. సమస్యకు మూలం ఇక్కడే ఉంది. మన చర్చ మొదలవాల్సింది కూడా ఇక్కడే.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
ఏప్రిల్ 2024 సంచికలో ...
- ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ
- ఏప్రిల్ 2024
- కాలనాళిక
- క్రోధి
- గడినుడి – 90
- గాజు దేహం
- గ్రహణాలు: అజ్ఞానం నుండి విజ్ఞానం దాకా
- త్యాగయ్యగారి నాదసుధారసం
- త్యాగరాజు – సాహిత్యము
- దక్షిణ అమెరికా దృశ్యమాలిక-2
- నిశ్చేతనం
- నెచ్చెలి-2024 కథా కవితా పురస్కారాల పోటీలు
- పరకాల కాళికాంబ స్వీయచరిత్ర
- పొంతన
- మధ్యధరా దుఃఖం
- మరపుకు ముందే
- యురీకా
- యూట్యూబ్లో ఈమాట: మార్చి 2024
- రెండు ప్రయాణాలు
- విశ్వమహిళానవల 26: కృపాబాయి
- సీతాకోకచిలుకలమ్మేవాడు