ప్రపంచం పరితపించే పలురకాల బాధల్ని పరులకొదిలి
దానధర్మం చెయ్యని దాసులని దైవానికొదిలి
కాలధర్మాన పడ్డ నీతుల్ని తుంపులు తుంపులుగా కాకులకి చల్లి
విరామసమయాల విషాదాల్ని వల్లమాలిన ఓర్పుతో ఓదార్చుకుంటాం
ప్రేమించుకుంటాం,
కున్నట్టు నటించుకుంటాం సరే
బండి ఖాళీగా పోతుందనీ
ఇద్దరు మనుషులకి ఇరవై రూపాయిలే అనీ
కేకవిని చెంగుమని
లోపలికెక్కి కూలబడతాం
నెట్టుకుంటాం, సర్దుకుంటాం
లేదా చోటు దొరక్క నిలబడతాం
ఊపందుకున్నాక విసిరెయ్యాల్సిన కాగితపు ఉండని వేళ్ళలో నలుపుతూ
పక్కమనిషిమీదగా వంగి ఇక్కడేనా కాదా అని కిటికీలోంచి వెతుకుతూ
ప్రయాణం చేస్తామో చేరతామో చేరబోతున్నట్టు భ్రమపడతామో
గులాబీలకి అంటుకట్టడం కుక్కపిల్లలకి పేర్లు పెట్టడం
ఎదుర్రాళ్ళని ఏరి దారిపక్క గోతిలోకి విసరడం
అనుకున్న పన్లేవీ అంత తేలిగ్గా అయిపోవు
అన్నిటికన్నా ముఖ్యంగా
అందమంటే ఏమిటో అసలు మాట్లాడుకున్నదే లేదు
పోన్లే ఫరవాలేదు
పోస్ట్ చెయ్యని పాత ఉత్తరాల్లో పేర్లు మార్చి ఇంకెవరికైనా పంపెయ్యొచ్చు
ఆత్రంగా గిరగిరా తిరుగుతూ జరుగుతూ అవతలకిపోయే జీవితాల ఉపరితలమ్మీద
కదలని ఒకే ఒక్క గదిమూలన
ఎన్ని పుస్తకాలు కుక్కినా
ఒక మనిషికి సరిపడా స్థలం మిగిలిపోవడాన్ని
ఎవరికీ తెలీనీకుండా తెరలుకట్టి దాచేయొచ్చు.