నిశ్చేతనం

ఉదయాన్ని నెట్టుకొచ్చిన సెకన్ల ముల్లు
కుంటుకుంటూ సూర్యుణ్ణి తోసుకుంటూ వెళ్ళి
చీకట్లోకి నెట్టేసి
సాయంత్రాన్ని తెస్తుంది.

ఈ లోగా నేనూ అనేక అవతారాలెత్తి
పని భూగోళాన్నంతా అట్లాసై మోసేసి
పై వాడిని మెప్పించో వప్పించో
కావలిసినంత అలసటనో ఆవేగాన్నో నింపుకుని
మనిషితనానికి తావీయకుండా
ఈసురోమని ఇల్లు చేరతాను.

కానీ ఇంటినిండా మనుషులు
స్వచ్ఛమైన మనుషులు
క్షణకాలంలోనే ప్రాణాన్ని పోసే మాటలతో మనుషులు
ఇంత మంచి ప్రపంచం నాదేనా
అనుకుంటూ సందేహించే నేను
నా వారికి ఏం కావాలో కాను
కొన్ని మాటలనో అనురాగాన్నో ఆనందాన్నో
నేనెలా ఇవ్వాలో నాలా ఇవ్వలేను

నానిండా నిన్నటి పని వాసన
రేపటి పని పరుగుల ఆరాటం
ఎల్లుండి చేరాల్సిన నిచ్చెనల ఊహల ఊడలు
తప్పించుకోవాల్సిన తెరిచిన పాముల నోళ్ళు

ఇప్పటిదేమీలేని తనం
ఎవరికీ ఏమీ కాలేనితనం!

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...