ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ

అందరికీ వందనాలు!

ముందుగా నన్ను వెతికి, కనిపెట్టి, తీసుకొచ్చిన సుబ్రహ్మణ్యంగారికీ, బిర్లాగారికీ ధన్యవాదాలు. బహుశా నా పేరు చంద్రగారు సూచించారేమో, అందుచేత ఆయనకి కూడా థాంక్స్. ఇవాళ నేను మాట్లాడాల్సిన అంశం ‘ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ’. ఆ టాపిక్ చూడగానే అంత ఇంప్రెస్ అయిపోయి మాట్లాడిన కమలాదేవిగారు, అంతకు ముందు చాలా చక్కగా పద్యాలు, పాటలు పాడినటువంటి లెనిన్‌గారూ వంటివాళ్ళని చూసిన తర్వాత, అన్ని రసాలూ వీళ్ళే పోషించేశారు, ఇక నాకు మిగిలింది ‘నీరసం’ మాత్రమేనని అనుకుంటున్నాను. పైగా ఒక గంట, లేకపోతే గంటన్నర అని పెద్ద టైమ్ చెప్పేశారు నాకు. అంతసేపు నేను మాట్లాడగలనని నాకు తెలీదు. నేను మాట్లాడినా, పొరపాటున ఉత్సాహపడిపోయి మీరందరూ అంతసేపు ఉగ్గబట్టుకుని ఉండగలరా అన్నది నాకు కొంచెం అనుమానం. అందుకని బిర్లాగారికి నేను చెప్పేదేమిటంటే, మీకు ఎప్పుడు, ఎక్కడ, కష్టంగా అనిపిస్తే, కొంచెం ఒక నిమిషం (గడువు) నాకిస్తే నేను అక్కడ ముగించేస్తాను. ఎవరికీ ఏ కష్టమూ లేకుండా, ఎవర్నీ ఏమీ కష్టపెట్టకుండా బండి ముందుకి సాగేలా చూడాలని నేననుకుంటున్నాను. కనుక, ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్న విషయానికి వస్తాను.

మానవ జీవితం వన్ వే ట్రాఫిక్. ఒకవైపుకే మన ప్రయాణం. మనం అందరం చివరగా వెళ్ళేది ఒక చోటుకే. దార్లో ఎంతోమంది స్నేహితులూ మిత్రులూ కలుస్తారు, వస్తారు, మధ్యమార్గంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ‘జీవితం అంటే ఏమిటి?’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే వదిలిపోయే స్నేహాలు, సహచరులు, మారిపోయే ప్రాధాన్యాలు, అనుబంధాలు… ఇదే జీవితమేమో అనిపిస్తుంది. ఇలాంటి జీవితంలో ఒంటరిగా మనం. ‘అబ్ న గభరావో మంజిల్ కి దూరీ సే; తుమ్ అకేలే నహీఁ, మై భీ హూఁ సాత్ మే’ అనేటటువంటి వాళ్ళు, అనేటటువంటి మనుషులు కావాలి. కాని, అలాంటి వాళ్ళు మనకి దొరకరు. దొరికినవాళ్ళు కూడా సగంలో వదిలేసి వెళిపోతుంటారు. మనం సరియైన హోదాలో లేకపోతే, సరియైన స్థితిలో లేకపోతే, మన దగ్గర డబ్బు లేకపోతే, మనం ఎందుకూ పనికిరాకపోతే, మనకు ఎవరూ లేరేమో అనిపిస్తుంది. డబ్బున్న వాళ్ళకు కూడా, ఆ డబ్బులు, ఆ స్నేహాలు, ఆ పరిచయాలూ ఎందుకూ పనికిరాకుండా ఉండిపోతాయేమో అనిపిస్తుంది. జీవితం సగం దాటిన తర్వాత చాలామంది బతుకులు ఇంతే అనిపిస్తుంది. అలాంటప్పుడు, మనకి కావలసినవి, మనతో చివరిదాకా ఉండేవి ఎక్కడ దొరుకుతాయి? మన అనుభవాలు, మన జ్ఞాపకాలు, మన ఆలోచనలూ మాత్రమే మనతో చివరిదాకా ఉంటాయి. అలాంటివే మనం చదివిన పుస్తకాలు, సినిమాలలోని పాత్రలు, మనకి తరచు గుర్తొచ్చే వాక్యాలూ. కొన్ని విషయాలు మనకి పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. పదే పదే మనం ఆలోచిస్తుంటాం. అలాంటివి ఇవి. అంచేత, నాకు తరచుగా గుర్తొచ్చే పాత్రల గురించిగాని, లేకపోతే ఇప్పుడు గుర్తొచ్చే పాత్రల గురించిగాని, వాక్యాల గురించిగాని నేను మాట్లాడతాను. వాటి ద్వారా, ఆయా రచయితలని, ఆయా రచనలని గుర్తు చేసుకుంటాను. అన్నీ ఆలోచనల నుంచే, జ్ఞాపకాల నుంచే మాట్లాడుతున్నాను కాబట్టి కొన్ని అసంగతంగా, కొన్ని అసందర్భంగా, కొన్ని తప్పులతో ఉంటేవుండొచ్చు. తప్పులు అందరూ చేస్తారు. త్యాగాలు కొందరే చేస్తారు. సో, నేను కూడా తప్పులు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. కొన్ని తప్పులు చేస్తాను. వాటిని క్షమించండి. లేకపోతే ఉపేక్షించండి. నేను చెబుతున్న విషయాలకి ఏ విధమైనటువంటి వరుసా లేదు. అంటే ఈ రచయితల్లో ముందు చెబుతున్న వాళ్ళంటే నా కెక్కువ ఇష్టం, తరవాత చెబుతున్న వాళ్ళంటే తక్కువ ఇష్టం అని కాదు. అసలు నా కిష్టమైన రచయితలు అందరి గురించి మాట్లాడాలంటే ఈ రోజు సరిపోదు. అందువల్ల నేను ఏదో ఒక వరస పాటించాలని చెబుతున్నాను.

మొట్ట మొదటిసారిగా నే చెప్పదలుచుకున్నది, People as Patients అనే పుస్తకాన్ని గురించి. దాన్ని నేను చాలా సంవత్సరాల క్రితం చదివేను. ఆ పుస్తకంలో ఒక చిన్న ఊరు, ఆ ఊర్లో ఒక డాక్టరుగారు ఉంటారు. ఆ డాక్టరుగారు తనకు తెలిసిన రోగుల ద్వారా, చాలా రోగాల గురించి చెబుతారు. ఆ పుస్తకం ఉద్దేశ్యం ఏమిటంటే మనకి ఒక పేరు, ఉదాహరణకి పీటర్ అని, వినగానే మనకి ఒక రోగం గుర్తుకు రావాలి; ఆ రోగం పరిణామం, అది ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, ఇవన్నీ మనకి అర్థం అయిపోవాలి. లేకపోతే, ఫ్రిల్ అన్నామంటే, మరొక మనిషి గురించి తెలియాలి. ఉదాహరణకి అతను ఎపిలెప్సీ, అంటే మూర్ఛరోగం, గురించి చెబుతాడు. మొట్టమొదటిసారి డాక్టరుగారు తన భార్యా బిడ్డలని ఒక రెస్టరెంటుకు తీసుకు వెళతాడు. ఆ రెస్టరెంటులో ఇలా కూర్చోగానే ఎవరో ‘Is there a doctor here?’ అని అడుగుతారు. అక్కడొకమూల ఒకతను పడిపోయి మూర్ఛతో కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ ఉంటాడు. ఈయన అతనికి ప్రథమచికిత్స చేసి మర్నాడు తన క్లినిక్‌కి రమ్మనమని చెప్తాడు. అది ఒక అధ్యాయం. రెండవ అధ్యాయంలో మరికొన్ని విషయాలు చెప్తాడు. ఈ దేశంలో కూడా ఎవరికైనా మూర్ఛవ్యాధి ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్ పోతుంది. అది లేకపోతే, ఇక్కడ జీవితం చాల కష్టమయిపోతుంది. ఇంట్లో వాళ్ళకి భారమౌతాడు. తనకీ భారమౌతాడు. ఇలాంటి అన్ని విషయాలూ వివరిస్తూ, ఒక్క మూర్ఛ గురించే రెండు మూడు అధ్యాయాలు రాస్తాడు. కానీ కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటాడు. అట్లా వుంటుంది ఆ పుస్తకం. మరొక అధ్యాయంలో MS అంటారు. Multiple Sclerosis. అది ముందు ఎలా ప్రారంభమౌతుంది, మధ్యలో ఎలా పెరుగుతుంది, చివర్లో దాని పర్యవసానం ఏమిటి అనే విషయాలని మూడు అధ్యాయాల్లో వివరిస్తాడు. ఆ పుస్తకం నాకు ఎందుకు నచ్చిందంటే, ఏది చదివినా అది కథలా ఉంటూనే, మనకు మెడికల్ ఫీల్డుకి సంబంధించిన విషయాలు తెలుస్తూ వుంటాయి. ఆ పుస్తకం 1980లో చండీఘర్ లైబ్రరీలో చదివాను. ఎంత వెతికినా అది నాకు మళ్ళీ రెండోసారి దొరకలేదు. నాకేమనిపిస్తుందంటే, మనం కూడా అలాగే పాత్రల ద్వారా కొన్ని విషయాలు గనక చెప్పగలిగితే బాగుణ్ణని. ఎన్నో విషయాలు మనకి పుస్తకాల ద్వారా, మనుషుల ద్వారా తెలుస్తూ ఉంటాయి. అవి ఎంత నేర్చుకుంటాము ఎంత నేర్చుకోము అనేది వేరే విషయం. కానీ తెలుసుకోవచ్చుననిపిస్తుంది. ఆ విధంగా కొన్ని పాత్రల ద్వారా నేను కొన్ని విషయాలు చెప్తాను. కేవలం పాత్రల గురించి చెప్తే మీరు ఆ రచయితని గుర్తుపట్టలేకపోవచ్చు. అందుకని రచయితల పేరు ముందు చెప్పి, తర్వాత ఆ పాత్రల గురించి మాట్లాడతాను.

మొట్టమొదట నేను కొడవటిగంటి కుటుంబరావుగారి ఒక పాత్ర గురించి చెప్దామనుకుంటున్నాను. ఆ పాత్ర పేరు విఠల్. ఈ విఠల్ మన తెలుగుదేశం నుండి వెళ్ళి పూనాలో ఒక కార్మికుడిగా పనిచెయ్యటం మొదలుపెడతాడు. కార్మికుడిగా పనిచేయడానికి వెళ్ళే ముందర వాళ్ళ ఊళ్ళో అతని కుటుంబానికి చాలా అప్పులూ గట్రా ఉంటాయి. ఎన్నో కష్టాలు ఉంటాయి. అవన్నీ తీర్చేద్దాం, కష్టపడి డబ్బులు సంపాదించేద్దాం. ఇంట్లో వారిని ఉద్ధరించేద్దాం అని అనుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళి చాలా కష్టపడతాడు. తిండికూడా సరిగ్గా తినడు. డబ్బులు కూడపెడతాడు. ఆ కూడపెట్టిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తుంటాడు. అప్పులు తీర్చేయమని వాళ్ళ అమ్మకు చెబుతుంటాడు. కొంత కాలానికి, తను వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంతమేరకి అప్పులు తీరేయోనని చూస్తే ఏ అప్పూ తీరదు. ఆ డబ్బులన్నీ ఏదో విధంగా ఇంటివాళ్ళు ఖర్చుపెట్టేస్తారు. అప్పులు అలాగే ఉంటాయి. రెండోసారి అతను మళ్ళీ పూనా వచ్చేస్తాడు. పూనాకి వచ్చేసిన తర్వాత అతను వేరే మనిషి. అదొక కొత్త జీవితం. ఈ కొత్త జీవితంలో పాత సంబంధాలన్నీ తెగిపోతాయి. మరింక వాళ్ళకి డబ్బు పంపడం కూడా మానేస్తాడు బహుశా. ఇది, కొత్త జీవితం అన్న కథ. ఈ విఠల్ నాకు చాలాసార్లు గుర్తొస్తుంటాడు. ఎందుకంటే, ఇక్కడ (అమెరికాలో) మనవాళ్ళు కూడా ఐ.టి. కూలీలని, ఐ.టి. మేస్త్రీలనీ రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. కానీ, వీళ్ళు కూడా అలాంటివాళ్ళే. అతను పూనా వెళ్తే, ఇక్కడ ప్రవాసానికి వీళ్ళొచ్చారు. వీళ్ళకుండే సంబంధాలు కూడా సమయాన్ని బట్టి మారిపోతుంటాయి. అయితే వీళ్ళని చూసి అది నాకు గుర్తు రాలేదు. నేను చదివినప్పటినుంచీ మధ్యకాలంలో చాలాసార్లు ఆ పాత్ర గుర్తుకొచ్చింది. అందుగురించని దాని గురించి చెప్పేను.

కుటుంబరావుగారు రాసిందే మరొక కథ ఉంది. దాని పేరు ఫాలౌట్. ఈ ఫాలౌట్ ఆయన 60ల మొదట్లో రాసేరనుకుంటాను. దాంట్లో ఏమవుతుందంటే, ఒకతను పట్నం నుండి పల్లెటూరుకి వెళతాడు. అక్కడ వాళ్ళ బావతో వంగతోటకో, మరో తోటకో వెళతాడు. అక్కడ దూరంగా ఒక చోట ఏదో మెరుస్తూ చిన్న వస్తువు పడి వుంటుంది. అది చూడగానే ఇతనికి ఏదో సైంటిఫిక్ జర్నల్‌లో చదివిన ఫాలౌట్‌ గుర్తు వస్తుంది. ఆరోజుల్లో బహుశా రేడియో ఆక్టివిటీ మీద పరిశోధన జరుగుతూ వుండి వుంటుంది. అలాంటివి చదివి ఉంటాడు. ఇంటి కొచ్చి భోజనం చేసిన తర్వాత ఆ బావకు ఫాలౌట్ గురించి చెప్తాడు. అతను ‘బావా నువ్వు తిన్నది ఆ తోటలోని కూరే’ అని చెప్తాడు. తర్వాత నగరానికి తిరిగి వచ్చేసేక కూడా అతగాడికి చాలా రోజులపాటు దానివల్ల ఏదైనా అణుప్రభావం ఉంటుందా, దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా అనేటటువంటి సందేహం వెంటాడుతూ వుంటుంది. ఇదీ నాకు గుర్తొస్తూవుంటుంది. మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టేము అంటే ఈ సమస్య వస్తుంది, ఫిల్టర్ కాఫీ తాగేమంటే ఆ సమస్య వస్తుంది, అమెరికన్ సైజు ఫిల్టర్ కాఫీ తాగితే ఇంకో సమస్య పోతుంది అని అనేవాళ్ళని/నమ్మేవాళ్ళని నేను చాలామందిని చూసేను. ఇలా రోజురోజుకీ వ్యాధుల గురించి పరిశోధనలు చేస్తూ వుంటే, అవి చదివేవాళ్ళు చదువుతుంటారు. అవి కొందరు మామూలు పత్రికల్లో రాసేస్తుంటారు. చదివినవారికి తర్వాత కొత్త కొత్త సందేహాలు వస్తుంటాయి. సో, ఇలాంటి పరిస్థితి కొత్తదీ కాదు, పాతదీ కాదు. ఎప్పుడూ ఉన్నదే. దీని గురించి మనం అంతగా పట్టించుకోనక్కరలేదు అని తెలుసుకుంటే సరిపోతుందేమో అని నాకనిపిస్తుంది. కాని నాకు మాత్రం ఈ పాత్ర గుర్తుకొస్తుంటుంది.

అలాగే బుచ్చిబాబుగారి గురించి ఆలోచిస్తే, ఇది ఆయన శతజయంతి సంవత్సరం. అందుకని బుచ్చిబాబుగారి గురించి. ఆయన కథలు చూస్తుంటే ఎన్నో రొమాంటిక్‌గా రాసినట్లుగా అన్పిస్తుంది. ఆయన కథలు, పాత్రలు గురించి ఆలోచిస్తే ఎంతో రొమాన్స్ కనిపిస్తుంది. ఆ కథల్లో ఆయన ‘నేను’ అని ఉత్తమ పురుషలో చెప్తూంటాడు. దానివల్ల, అవన్నీ ఆయన స్వంత వ్యవహారాలే అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే దృష్టితో ఆలోచించేవాళ్ళున్నారు. కానీ కావేమోనని నా ఉద్దేశం. ఇప్పుడు, నన్నుగురించి కథ వ్రాయవూ అన్న కథ గురించి చెప్తాను. ఇది బహుశా 1946లో ఆయన రాసినట్టున్నాడు. అందులో కుముదం అన్న పాత్ర ఉంటుంది. చాలా సామాన్యంగా కనిపించే ఆడపిల్లల్లో, మనం రోజూ చూస్తూ పట్టించుకోని వాళ్ళలో, చాలా గొప్పవాళ్ళు, మనకంటే చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నటువంటివాళ్ళు, మంచి అనుభూతులు, అనుభవాలు, మనుషుల స్వభావాల్ని అర్థం చేసుకునే శక్తి వున్నవాళ్ళు ఎంతోమంది వుంటారు. కానీ మనం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ, వాళ్ళకి ఏమీ తెలీదనుకుంటాం. వాళ్ళెందుకూ పనికిరారనుకుంటాం. అలాగే ఈ కథలోని ఒక పాత్ర కూడా అనుకున్నట్లుగా బుచ్చిబాబుగారు రాస్తారు (కథానాయకుడు ఒక రచయిత). ఎన్నోసార్లు అమ్మాయిని (కుముదాన్ని) కలుస్తాడు. (ఆ అమ్మాయి) ‘నాగురించి కథ రాయవా?’ అంటే, నీగురించి ఏమి రాయాలి? నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అని అంటాడు. ప్రత్యేకత అంటే ఇదా, అదా అని అడుగుతుంది ఆ అమ్మాయి. చివరి స్థితిలో ఆమెకు న్యుమోనియా అని రాసేడు ఆయన. న్యుమోనియా వచ్చి ఆ అమ్మాయి బహుశా పోయి ఉంటుంది. ఆ సమయంలో కథలోని రచయిత పాత్ర కలిసినప్పుడు ఆ అమ్మాయిలో ఒక అసాధారణతత్వం ఉన్నదన్న విషయం గమనిస్తాడు. నేను చెప్దామనుకున్నది మన చుట్టుపక్కల మనకంటే తక్కువ చదువుకున్నారని, తక్కువ స్థాయిలో ఉన్నారని మనం అనుకునే మనుషుల్లో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు ఉన్నారని. వాళ్ళని మనం గమనించకుండా ముందుకి వెళిపోతున్నామేమో అని అనిపిస్తుంది. ఏది ఏమైనా, నాకు కుముదం మాత్రం చాలాసార్లు గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడల్లా నా వైపునుంచి నేనాలోచించుకుంటూ వుంటాను.

అలాగే, ఆయన రాసిన ‘మేడమెట్లు’ కూడా నాకు గుర్తు వస్తూంటుంది. దాంట్లో కూడ సింబాలిజం ఉంది. అధికారి అనే వ్యక్తి ఉంటాడు. అరుణ అనే ఒక అమ్మాయి ఉంటుంది. దౌర్భాగ్యుడు అనే వాడుంటాడు. అరుణకి తప్ప తక్కిన ఇద్దరికీ పేర్లుండవు. అరుణని ఇద్దరూ ప్రేమిస్తారు. చిన్నప్పుడు దౌర్భాగ్యుడు, పెద్దయిన తర్వాత ఆమెను పెళ్ళి చేసుకున్న అధికారి. వీళ్ళ ముగ్గురిలో ఉన్న బలహీనతలు లేదా బలాలు, వాళ్ళ మానసికస్థితీ అదే నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారి. బహుశా ఇప్పుడు నేను ఉన్న వయసులో అధికారి ఉంటాడు ఆ కథలో. అందువల్ల నాకు గుర్తు వస్తున్నాదో, లేక దౌర్భాగ్యుడు లాగా మనందరమూ ఏదో ఒక సమయంలో దౌర్భాగ్యులం అయి ఉండడం వల్ల గుర్తొస్తున్నాదో! ఎందుకంటే, మనం ఎవర్ని ఇష్టపడ్డామో వాళ్ళు మనకు దొరకని వాళ్ళమో, దొరికినా, కుదరక కష్టాలు పడుతున్న వాళ్ళమో అయి ఉంటాము. అందువల్ల దౌర్భాగ్యుడు గుర్తొచ్చేవాడేమో నాకు తెలియదు. అసలు మేడమెట్లు అంటే ఫ్రాయిడియన్ సైకాలజీలో ఏదో ఒక అర్థం ఉంది. అది ఎక్కడం, దిగడం మీద ఒక భావన ఉంది అనేది కూడా నేను పట్టించుకోవడం లేదు. నేను చెప్పేది ఆ అధికారి, దౌర్భాగ్యుడు, ఈ అరుణలలో అరుణ తక్కువగానూ, మిగతా ఇద్దరూ ఎక్కువగానూ గుర్తొస్తుంటారు అని మాత్రమే. అదీ బుచ్చిబాబుగారి గురించి.

చాసో అనే చాగంటి సోమయాజులుగారు. ఈయన మా ఊరి వారు. నాకు చిన్నప్పటినుంచీ తెలిసిన మనిషి. మా ఇంటికి తరచు వస్తుండే మనిషి. ఆయన గురించి కాదు ఇక్కడ నేను చెప్తున్నది. ఆయన రాసిన, ఎందుకు పారేస్తాను నాన్నా? కథ గురించి. దాంట్లో ముఖ్యంగా కృష్ణుడి పాత్ర గురించి. అది కృష్ణుడి పాత్రపరంగా రాసిన కథగా నాకు గుర్తొస్తుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది, చదువుకోవడం కోసం చిన్నప్పుడు చాలా కష్టపడి ఉంటారు. చదవడానికి డబ్బుకోసం కష్టపడి ఉంటారు. ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించి స్థిరపడినా కూడా, ఆ పాత జ్ఞాపకాలు వాళ్ళని వదిలి పెట్టకపోవచ్చును. ఈరోజు కూడా చదువుకీ డబ్బుకీ ఒక రకమైన లంకె అన్ని చోట్లా వున్నాది. అది మన దేశంలో కూడా వున్నాది. నేను అనుకుంటుంటాను: నేనివాళ చదువుకోవలసి వస్తే, అందులో మళ్ళీ భారతదేశంలో చదువుకోవలసి వస్తే, బహుశా మెడికల్ కాలేజీలో చదవగలిగి ఉండలేకపోయే వాడిని. అడ్మిషన్ వచ్చినా, పూర్తి చెయ్యలేకపోయేవాడిని. అలాంటి పరిస్థితే ఇక్కడ (అమెరికాలో) కూడా ఉన్నట్లు నాకన్పిస్తుంది. ఎందుకంటే మొన్న రీసెంట్ ఎలక్షన్స్ కాంపెయిన్‌లో కూడా డెమోక్రాట్స్ ఎడ్యుకేషన్ పూర్తిగా ఫ్రీ చేసేస్తామని కబుర్లు మాత్రం చెబుతున్నారు. ఇక్కడ కూడా డబ్బుకీ చదువుకీ ఉన్న లంకె వల్ల, డబ్బులేక చాలామంది చదువుకోలేని పరిస్థితి ఒకటి ఉంది. అందువల్ల బహుశా గుర్తొస్తుందేమో అనుకుంటున్నాను.

ఈ కథలో ఏమవుతుందంటే కృష్ణుడు స్కూల్లో డబ్బులు కట్టలేకపోతాడు. ఎనిమిది రూపాయలు కట్టలేకపోవడం వల్ల వాడి పేరు తీసేస్తారనే భయంతో ఇంట్లో కూర్చుంటాడు. స్కూలుకి వెళ్ళాలని ఉంది. కానీ వెళ్ళలేడు. అలాంటి పరిస్థితిలో వాడి తండ్రి ఏవో డబ్బులిచ్చి ‘పోయి చుట్టలు తీసుకురా’ అంటాడు. చుట్టలు తీసుకురావడానికి వీడు ఆ స్కూలుని దాటుకుని వెళ్ళాలి. అక్కడ మిత్రులు కనిపిస్తారు. ఆ విధంగా కుర్రవాడివైపు నుండి కథంతా రాసుకుంటూ పోతాడు. చాలా తక్కువ స్పేస్‌లో ఎక్కువ విషయాలు చెప్పుకుంటూ పోతాడు. చాసోగార్ని ‘చుట్టల చాసో’ అని కూడా అంటారు. మరందువల్ల ఆయన రాసేడేమో నాకు తెలీదు. కానీ (కృష్ణుడి తండ్రి) చుట్టలు మానేస్తే కుర్రవాడి చదువుకి ఫీజు కట్టడం సులభమైపోతుందని అనుకుంటాడు. ఆ విధంగా అనుకోవడం ఆయన మిత్రులు నారాయణబాబుకి (ఈయన్ని బీడీల నారాయణబాబు అంటారు) ఏమీ నచ్చలేదు.’చుట్టలు మానేయడం గురించి రాస్తావేంటి? అది అర్థం లేదు’ అని ఆయన అన్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒక సాంఘిక సమస్యకి సమాధానం వ్యక్తిగత అలవాట్లను మార్చుకోవడంలో ఉంటుందా? లేక సంఘపరంగా, మనం ఏమైనా మార్పులు తీసుకొచ్చి దేశాన్ని ఉద్ధరించేలా రిఫార్మ్‌స్ చెయ్యాలా? ఇప్పుడు మన మోదీగారు తలపెడుతున్నారు అంటున్నారు మూడు ఏళ్ళబట్టి. ఆయన తలపెడ్తున్నాడో లేదో తెలీనటువంటి రిఫార్మ్‌స్ చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలనేటటువంటిది వేరే ఇష్యూ. అది నేను చెప్పలేదు. కానీ వ్యక్తిగతంగా ఒక తండ్రి తనకి చాలా ఇష్టమైనటువంటి చుట్టల్ని మానేద్దామనుకోవడం కూడా, ఇందాక నేను చెప్పినట్టు, ‘తప్పులైతే అందరూ చేస్తారు గాని, త్యాగాలు కొందరే చెయ్యగలరు’ వంటిది. నాకు గుర్తొస్తుంటుంది.

ఐతే కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు, అక్కరలేకపోయినా, నాకు ‘సుందరం’ గుర్తొస్తాడు. సుందరం ఎవరు? ఎవరు అంటే, కుటుంబరావుగారి చదువు అనే నవలలోని పాత్ర. అతను కూడ చదువు గురించి ఎన్ని కష్టాలు పడ్డాడో, చదువుయొక్క ఉపయోగాన్ని ఎంతగా అర్థం చేసుకున్నాడో దాంట్లో ఉంటుంది. ఈ రెండూ గుర్తొచ్చిన వెంటనే ‘తంగిరాల శంకరప్ప’ కూడా గుర్తొస్తాడు. తంగిరాల శంకరప్ప శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ‘వడ్లగింజలు’లో ఒక ముఖ్యపాత్ర. అతనికున్న నేర్పరితనం, కౌశలం తలుచుకుంటే, అవకాశం గొప్పదా, కౌశలం గొప్పదా అనే మీమాంస నాకెప్పుడూ కలుగుతుంటుంది. ఇవాళ కూడా, ‘వడ్లగింజలు’ చదివితే, ‘చదువు’ చదివితే, లేకపోతే కృష్ణుడి గురించి చదివితే, నాకు కళ్ళెంబడి నీళ్ళొస్తాయి. అదే విషయాన్ని మా మిత్రుడు ఏల్చూరి మురళీధరరావుని ఒకసారి అడిగేను. ఇవి చదివినపుడు నా మీద ఇలాంటి ప్రభావం వస్తోంది కదా, సహజంగా కలుగుతున్నటువంటి ఈ ప్రభావం, నేను వాళ్ళతో ఐడెంటిఫై అవడం వలన కలుగుతోందా లేకపోతే ఈ రచయితలు ఇంత గొప్పగా రాసేరా? అని. ఆయన ‘బహుశా రెండూ’ అని అన్నారు. ఇవాళ కూడా, వాళ్ళంత గొప్పగా రాసేరా లేక నా మానసిక బలహీనత దానికి కారణమా అనే విషయం తేల్చుకోలేకపోతున్నాను. తంగిరాల శంకరప్ప విషయంలో నాకు ఆశ్చర్యం కలిగించేదేమిటంటే, ఒంటిమీద తుండుగుడ్డ మాత్రమే కలిగి ఉన్నా, చదరంగంలో ఒకే ఒక్క ఎత్తుతో, అంటే ఒక్క ఎత్తుతో, అవతలి వాడి ఆటకట్టించగల సామర్థ్యం ఉన్న మనిషి. రాజుగారి దర్శనానికి ఎన్ని కష్టాలు పడ్డాడో! ఆలోచిస్తుంటే, అందులో కూడా ఒక రకమయిన కుల-శాఖ-ప్రాధాన్యం కనిపిస్తే, నాకు ఈ రోజుకీ ఆ పద్ధతి ఏమీ నచ్చట్లేదు. ఇవాళ పరిస్థితి మారిపోయిందేమో అనుకుందామంటే, ఎంత మారినా పరిస్థితులు అలాగే వున్నాయనీ, ఏమీ మారలేదనీ నాకన్పిస్తుంది. అది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి కథ గురించి.

ఇప్పటికి మూడుసార్లు చెప్పేను: తప్పులయితే అందరూ చేస్తారు గాని, త్యాగాలు కొందరే చేస్తారని. అది రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి వాక్యం. అది నాకు తరచూ గుర్తొస్తుంది. నేను ఏ తప్పు చేసినా, లేక ఎవరే తప్పు చేసినా, ఎవరే త్యాగం చేసినా, చెయ్యకపోయినా నాకు గుర్తొచ్చే వాక్యమది. రాచకొండ విశ్బనాథ శాస్త్రిగారి గురించి చెప్పేటప్పుడు అంతమందీ ఆయన వాడే మాండలీకం గురించి, ఆయన విశాఖ యాస గురించి, ఆయన పేదవాళ్ళ గురించీ లేకపోతే వ్యభిచారగృహాల గురించి రాసేడనేటటువంటివి చెప్తారు గానీ ఆయన చక్కటి, చిక్కటి మధ్యతరగతి కుటుంబాల గురించి రాసిన కథలు గురించి చెప్పరు. అలాగే చక్కటి రొమాంటిక్ సెన్స్‌ వున్న కథలు రాసేడు అన్న విషయాన్ని ఎందుకో విస్మరిస్తారు. నాకు తరచు గుర్తొచ్చే కథ, ఆడది-మగమనిషి. దాంట్లో ఒక కుర్రవాడు పట్నం, బహుశా చెన్నపట్నం అయి వుండొచ్చు, అక్కడకొచ్చి వాళ్ళ మేనమామ ఇంట్లో వుంటాడు. అక్కడ చక్కని మరదలు వున్నా కూడా ఆ మరదలిని చూసే దృష్టి వుండదతనికి. ఎందుకంటే, తనకి ఉద్యోగం లేకపోవడం, తను జీవితంలో సెటిల్ కాకపోవడం, ఇలాంటి వాటితోనే గాభరాపడుతుంటాడు. కానీ ఒక రోజు బస్సు కోసం క్యూలో నిలబడితే ఒక అందమైన పట్నపు అమ్మాయి అతన్ని పిలిచి, ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పి, ఒక ఉత్తరాన్ని పోస్టు చెయ్యమని సహాయం అడుగుతుంది. ఆ అమ్మాయికి ఆ సహాయం చేసిన తర్వాత, ఆ షివల్రీలో, ఆ వీరావేశంలో, ఇంటికి రాగానే మరదలు చాలా అందంగా కనిపిస్తుంది. అంటే కొన్ని కొన్నిసార్లు, చిన్న చిన్న విషయాలు కూడ మనకు గొప్ప గొప్ప ఉత్తేజాన్నీ ఒక ఊపునీ ఇస్తాయి. మనం ముందుకు వెళ్ళవచ్చు అనేటటువంటి చిన్న విషయాన్ని, సూక్ష్మంగా, చాలా అందంగా రాసేడాయన. అది నాకు గుర్తొస్తూ ఉంటుంది.

ఆయనదే కలకంఠి అనే ఇంకొక కథ కూడ నాకు గుర్తొస్తుంటుంది. ఇదెందుకు గుర్తొస్తుందంటే, ఒకసారి, విశాఖ రచయితల సంఘంలో, అక్కడ ఉన్న సభ్యులు అందరికీ కూడా ఒక టాపిక్ ఇచ్చి మీకు తోచినది రాయండి అన్నారు. అందరూ రాస్తే అవి ఏవో కథలయ్యాయి. చదివేరు వాళ్ళు. కానీ శాస్త్రిగారు రాస్తే, అది మాత్రం కలకంఠి అయ్యింది. అందులో ఒక మధ్య తరగతి అమ్మాయిని ఒక పెళ్ళిలో ఒక లాయరు చూస్తాడు. చూసి, ఆ అమ్మాయి బాగుంది, పాటలు బాగా, చక్కగా పాడుతోంది అనుకుని ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. కథ ఎంత బాగుంటుందో. ఒక స్త్రీని, పురుషుడు ఎన్ని రకాలుగా ఎక్స్‌ప్లాయిట్‌ చెయ్యగలడో అన్ని రకాలుగానూ ఆ అమ్మాయి ఎక్స్‌ప్లాయిట్‌ అవుతుంది అనే విషయాన్ని కలకంఠి కథలో శాస్త్రిగారు తనదైన పద్ధతిలో రాసేరు. తర్వాత చెబుదామనుకున్న ఒక వాక్యం ఇప్పుడే చెప్పాల్సి వస్తోంది. ఒక రచయిత ప్రతిభావంతుడైనప్పుడు, అతడు ఏది రాసినా ప్రతిభావంతంగా రాయగలడు. ‘రచన గొప్పతనం, రచయిత శక్తిపై ఆధారపడినంతగా, రాస్తున్న విషయంపై ఆధారపడదు’ అని నేననుకుంటాను. అదే విషయం నేను కొద్దిసేపు పోయిన తర్వాత చెప్దామనుకున్నాను. కాని ఇప్పుడు ముందుగా శాస్త్రిగారి కోసమని చెప్తున్నాను.

తర్వాత పాలగుమ్మి పద్మరాజుగారు. రాజుగారి గాలివాన కథ చాలామందికి తెలుస్తుంది. కథలో రావుగారు ఉదయమెలా వున్నారు, గాలివాన కురిసిన తర్వాత రాత్రివేళ ఎలా వున్నారు అనేది మీలో ఎవరైనా చదివి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఒక వేళ చదవకపోతే, ప్రకృతి వైపరీత్యాల్లో, పరిస్థితుల ఒత్తిడికి ఒక ఉత్తముడైన మనిషి, ఒక సభ్యత గల పెద్దమనిషి ప్రవర్తన ఎలా మారిపోతుంది, వాడు ఎంత నీచస్థాయికి (base level) దిగజారుతాడు అనే విషయం, గాలివాన కథలో పద్మరాజుగారు చూపిస్తారు. అదే పద్మరాజుగారు, ‘బతికిన కాలేజీ’లో చింత అనే పాత్రని పూర్తిగా హాస్యంతో, హాస్యరసంతో, ప్రతిలైనూ చదువుతూ వుంటే మనకి నవ్వొచ్చేలాగ కూడా రాసేరు. పద్మరాజుగారి గురించి ఇక్కడ మరొక విషయం చెప్పాల్సి ఉంది. త్రిపురగారి పుస్తకానికి ఆయన రాసినటువంటి ముందుమాటని ప్రతివాళ్ళూ చదవాలని నాకనిపిస్తుంది. ఒక రచయిత, ఒక కథకుడు, మరొక కథకుని గొప్పదనాన్ని గుర్తిస్తూ, ఆ కథల గురించి ఏమీ రాయకుండా, ఆ కథల విషయాల్ని స్పృశిస్తూ, తనలో లేనటువంటి, తను చేయలేనటువంటి పనిని మరొక రచయిత చేసేడని అంగీకరిస్తూ, ఎంత గొప్పగా ఒక ముందుమాట రాయొచ్చో పద్మరాజుగారు రాసి చూపించారు. అందుగురించి ఆ ముందుమాట, ఈ పాత్రలు నాకు గుర్తొస్తుంటాయి. పద్మరాజుగారి గురించే మరొక విషయం. ఒకసారి ఆరుద్రగారిని ఎవరో అడిగేరట: ‘మరి అంత గొప్ప రచయిత సినిమాలలో ఎందుకు రాణించలేదు?’ అంటే ఆరుద్రగారన్నారట: ‘ఆయన రాజు కదా! ఆయన ఎలా ‘రాణి’స్తాడు?’ అని. ఇది ఒక జోకయితే అయివుండొచ్చును.

తరువాత నాకు చాలా ఇష్టమైనటువంటి రచయిత్రి కాని రచయిత. కానీ తెలీదు. మీరే చెప్పాలి ఇప్పుడు. సీత. సీత అంటే పురాణం సీత. ఈ పురాణం సీతని నేను మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసేనూ అంటే, నా నిద్దట్లో. కలలో నేను మేడ మెట్లెక్కి వెళ్ళి ఆవిడని కలిసేను. అప్పుడు ఆవిడ చీరలో కనిపించింది నాకు. ఆవిడ మంచం మీద ఉన్నాది. నేను దగ్గర నిలబడి మాట్లాడుతున్నాను. అట్లా ఆవిడతో నా మొదటి పరిచయం. ఆ పరిచయంతోనే ఆవిడ ఎన్నో విషయాలు చెప్పింది నాకు. ఏంటంటే గుండెమీద ఎర్రగులాబీ కట్టుకు తిరిగే నాయకులకి ఎన్ని గుండెలుండాలి? అని. అంటే పండిట్ నెహ్రూ గురించి అన్నాది అని మనం అనుకోవచ్చు ఇప్పుడు. కానీ అలా అన్నాదావిడ. ఒక వాక్యం తర్వాత ‘భారత ప్రజల హృదయాధినేత, నా హృదయాధినేత ఒకే రోడ్డు మీద ఒకేసారి నడుస్తారు’ అని చెప్పిందావిడ. కానీ ఒకరు కాలినడకన, ఒకరు కారులోనూ అని చెప్పింది. అలాగే ‘పెద్ద పెద్ద త్యాగాలు చేసినటువంటి మా ఆయన చిన్న చిన్న విషయాలకి తగూలాడి, శత్రుత్వం తెచ్చుకుని, సంబంధాలు పాడుచేసుకుంటారు’ అని చెప్పింది. ఇంకా చాలా విషయాలు చెప్పింది ఆవిడ సీతగా.

కానీ అవన్నీ కాకుండా ఒకసారి నేను విజయవాడ వెళ్ళినపుడు, మా ఫ్రెండు కె.ఎన్.వై. పతంజలి నన్ను ఆంధ్రజ్యోతి ఆఫీసుకు తీసుకుని వెళ్ళి, ఆశ్చర్యకరంగా ఈవిడే/ఈయనే ‘సీత’ అని పరిచయం చేస్తే, అక్కడ నేను చూసిందేమిటంటే పాంటూ, షర్టూ వేసుకుని ఒకాయన ఉన్నాడు. ఆయన సీత అని చెప్పేరు నాకు. ఆయన మాత్రం నన్ను ‘మీరెలా వున్నారు? పరీక్షలవీ బాగా పాసవుతున్నారా? మెడికల్ కాలేజీలో చదువుకోడంలో ప్రాబ్లెమ్స్ ఏవీ లేవు కదా?’ అని రొటీన్ ప్రశ్నలు మాత్రమే వేశారు. సీతగా ఈ సీతగార్ని నేనడుగుదామనుకున్న నా తహతహలు, నా సందేహాలు అడగడానికి అవకాశం రాలేదు. అప్పుడు ఆ శర్మగారూ ఈ సీతగారూ ఒక్కరేనని తెలిసింది.

ఈ సీతగారితో పాటు మరో సీత కూడ నాకు గుర్తొస్తుంది. ఆ సీత సీతజడ కథలో సీత. ఆ సీతజడలో సీత కథ ‘తణుకు ప్లాట్‌ఫారం మీదకి బంతిలా గెంతింది సీత’ అన్న వాక్యంతో మొదలవుతుంది. చివరకి ఎలా ఎండ్ అవుతుందంటే ‘సీత జడ సీత మెడచుట్టూనే రాలేదు’ అని. ఈ కథలోని సీత, సంసారం అనే మరోకథలో అలిమేలు, సీతగారూ వీళ్ళందరూ తక్కువ చదువుకున్న స్త్రీలు. కానీ, వాళ్ళ విషయ పరిజ్ఞానం, లోకజ్ఞానం, కుటుంబాలకోసం వాళ్ళు పడే తాపత్రయం, ఎదుర్కొన్న కష్టాలూ…వల్ల బహుశా నేను వాళ్ళని మరిచిపోలేకపోయి వుంటాను. ఇవి చెప్పిన తర్వాత మరొక విషయం కూడా చెప్పాలి. కొత్త పెళ్ళాం అనే కథ ఆయనది నాకు గుర్తొస్తూ వుంటుంది. ఆ కొత్త పెళ్ళాం కథలో, కొత్తగా వచ్చిన పెళ్ళాంతో భర్త ఎలాంటి విషయాలు మాట్లాడొచ్చు, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు మొదలైనవన్నీ ఉంటాయి. ఈయన మాట్లాడే మాటలు కూడా ఎలావుంటాయంటే మొదలు పెట్టినప్పుడు లాస్యం చేసే హాస్యంలా మొదలయేటువంటి కథ, చివరకి కొరడా దెబ్బలతో చళుక్‌మని చురుక్‌మనిపించేలా ముగుస్తుంది. అలాంటి కష్టాలన్నీ ఉన్నటువంటి కథని హాస్యంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. దాని గురించి చెప్దామనే కొత్తపెళ్ళాం కథ గురించి ప్రస్తావించేను.


ఇంతసేపూ చాలామంది గురించి చెప్పేనుగానీ డాక్టర్లు రచయితలుగా ఉన్న వాళ్ళని నేను చెప్పలేదు. అందుకని కొమ్మూరి వేణుగోపాలరావుగారి గురించి చెప్దామని అనుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం ఒక మిత్రుడువాళ్ళ మేనకోడలు మెడికల్ కాలేజీలో చేరిందిట. ఆవిడకి కొమ్మూరి వేణుగోపాలరావుగారి హౌస్ సర్జన్ నవల చదవమని చెప్దామని అనుకుంటున్నాను. ఎక్కడ దొరుకుతుందో మీరు చెప్పగలరా? అని అడిగేడు. ‘నేను చెప్పలేను, నాకు తెలీదు’ అన్నాను. కానీ ఆయన చెప్పిన తర్వాత, నాకు మళ్ళీ హౌస్ సర్జన్ నవల, అందులో మధుకర రావు అనే ఆదర్శవంతమైన పాత్ర గుర్తొచ్చాయి. ఆ నవలలో మధుకర రావు గురించి, ఒక రకమైన హౌస్ సర్జన్ గురించే కాకుండా ఎన్నో రకాల మెడికల్ స్టూడెంట్స్ గురించి, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ ఉద్దేశాల గురించి ఆయన చెప్పేడు. దాంట్లో ఆయన ఎమ్.డి. డిగ్రీలు వుండి, చిల్లరపనులు చేసే డాక్టర్ల గురించి చెప్పేడు. అన్యాయంగా ఇచ్చే ఫిర్యాదుల వల్ల మెడికల్ సూపరింటెండెంట్‌ వంటి చాలా ఆదర్శవంతమైన అధికారులు సస్పెండ్ అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? చూడ్డానికి మనకెంత బాధగా వుంటుందీ అనే విషయాల్ని చెప్పేడు.

కథల గురించి చెప్తున్నపుడు, ‘శిల్పం అనేది అస్పష్టంగా ఉంటే చాలా బావుంటుంది, కథలో ఏం జరిగిందో పూర్తిగా అర్థం కాకూడదు’ అనే కథకులు కొంతమంది ఉన్నారు. అలాంటి అర్థమొచ్చే కొన్ని సంఘటనలు చెప్పేడు. ఒక అమ్మాయి ఉంటుంది. హాస్పిటల్‌కి వస్తుంది. ఆ అమ్మాయికి సుమారు వందశాతం వొళ్ళు కాలిపోతుంది… ఒక్క ముఖం తప్పిస్తే. ఒళ్ళంతా బాండేజీలు. ముఖం మాత్రం చంద్రుడిలా, ఒక మచ్చకూడా లేని చంద్రుడిలా చక్కగా అందంగా వుంటుంది. మిగతా వొళ్ళంతా బాండేజీతో ఉంటుంది. ఘడియ ఘడియకీ వాళ్ళాయన ఎమర్జెన్సీ రూములోకి వచ్చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి అతనితో మాట్లాడదు. డాక్టరుగారితో మాత్రం, ‘మీతో ఒకసారి మాట్లాడతానండీ, మీతో అన్నీ నిజం చెప్పేస్తానండీ, ఇలా ఎందుకు జరిగిందో నేను మీకు చెప్తానండీ’ అని అంటుంది. అప్పుడతనికి ఆ అమ్మాయిని ఒక లిఫ్ట్ ముందర ఒకసారి చూసినట్టూ, వార్డ్ బోయ్‌తో తగూలాడుతుంటే చూసినట్టు గుర్తొస్తుంది. ఆ అమ్మాయి అలా మాటాడ్డం మంచిది కాదని చెప్పి, పెథిడిన్ ఇంజెక్షన్ ఇమ్మని నర్సుకి చెప్పి, నిద్రపుచ్చేస్తాడు. తనూ నిద్ర పోతాడు. నిద్ర లేచేసరికి ఆమె చనిపోతుంది. ఏం జరిగిందన్నది తెలీదు. ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో అందులో ఉన్నాయి.

ఇంకోటి కూడ వున్నాది. ఈ ఆదర్శవంతమైన డాక్టరు (ఒక స్నేహితుడి ఆహ్వానం మేరకు అతనిని కలవడానికి వెళుతూ) ఒక లొకాలిటీలో దారి తప్పి వ్యభిచారులు ఉండే ఒక ఇంట్లోకి వెళ్తాడు. అక్కడున్న ఒక స్త్రీ (అంతకు ముందు తన పిల్లల్ని తీసుకువచ్చి ఈ డాక్టరు దగ్గరే చికిత్స తీసుకుంటుంది) అంటుంది: ‘మీకయితే, నేను ఒక్క పైసా కూడా తీసుకోకుండా పూర్తి రాత్రంతా మీతో గడుపుతాను’ అని. నేను అందుకోసం రాలేదు. నేను దారి తప్పిపోయాను, అంటే నమ్మదామె. కొంచెంసేపు పోయిన తర్వాత నమ్ముతుంది. అప్పుడొక సంఘటన చెపుతాడు. ఆ సంఘటన ఏమిటంటే, ఒక భావుకుడు ఇలాగే ఒక వ్యభిచార గృహానికి వెళ్ళినపుడు ఒక చిన్నపాపని చూస్తాడు. పాతికేళ్ళు పోయిన తరువాత, ఆ పిల్ల ఎలా వుంటుంది అని ఆలోచించినపుడు ఆ జ్ఞాపకం అతని మనసు కలచివేస్తుంది. సో, ఇలాంటి విషయాలన్నీ గుర్తొచ్చాయి నాకు. అయితే ఒక్క నవలలోనే ఇన్ని విషయాలు రాసేడాయన.

ఆ వేణుగోపాలరావు… అలాంటి వేణుగోపాలరావే, రెండో నవల రాసేడు. అది కూడా డాక్టరుకి సంబంధించిన కథే. ఆ విషయం చాలామందికి తెలియదు. అసలు దాని గురించి చెప్దామనే ఇది చెప్పేను. ఆ నవల పేరు ఆకర్షణ. ప్రైవేటు ప్రాక్టీస్‌లో ‘చిల్లర శ్రీ మహాలక్ష్మి’ అని అర్ధరూపాయి, రూపాయి, రెండు రూపాయలు తీసుకుని, చిన్న పల్లెటూరులో ప్రాక్టీసు చేసుకునే ఒక డాక్టరు కథ ‘ఆకర్షణ’. ఆ డాక్టరు బలహీనతలు, ఆ డాక్టరుకి వృత్తిపట్ల ఉండే నిష్ఠ ఇవన్నీ ఆ కథలో చెప్తాడు. ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్, డాక్టర్ల బలహీనతల గురించి రాయడం సులభమైన విషయం కాదు. వేణుగోపాలరావుగారు అలాంటి పుస్తకం రాసేరనే ఎంతోమందికి తెలియదు. కనీసం అది గుర్తు చేద్దామని నేనాయన్ని తలుచుకున్నాను. ఇది కాకుండా, మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన కథ మరొకటి ఆయన రాసేడు. అది చాలా చిన్న వయసులో రాసేడు. ఆ కథ పేరు మరమనిషి. దాంట్లో ఒక పెథాలజిస్టు ఉంటాడు. అతగాడికి మొదటిసారి పుట్టిన బిడ్డ అబ్నార్మల్‌గా ఉంటాడు. ఏదో అవకరంతో పుట్టి చనిపోతాడు. అదొక congenital abnormality. అందుగురించి ఆ బిడ్డని తీసుకుపోయి తన పెథాలజీ లాబ్‌లో ఒక జాడీలో భద్రపరుస్తాడు. అంత్యక్రియలు చెయ్యడు. తను చాలా శాస్త్రీయ దృక్పథం కలవాడిననుకుని అలా పెట్టేస్తాడు. కానీ, అలా పెట్టిన తర్వాత, ప్రతి రోజూ, ప్రతి క్షణం బాధపడుతూ ఉంటాడు. ఒక సంవత్సరం పోయిన తర్వాత ఒక రోజు ఇక తట్టుకోలేక, తిన్నగా లాబ్‌లోకి లోకి వెళ్ళి, ఆ జాడీని పగలేసి, ఆ బిడ్డని శ్మశానానికి తీసుకుపోయి చెయ్యవలసిన పని చేస్తేకాని అతనికి మనశ్శాంతి లభించదు. మనందరం చాలా సంప్రదాయాలని నమ్మం. మనం చాలా scientific temperamentతో ముందుకి పోయేం అనుకుంటాం. అందరూ కాకపోయినా కనీసం కొందరు అట్లా అనుకుంటారు. కాని మనం ఎంత సైంటిఫిక్ టెంపర్‌తో వున్నాము? ఎంత ప్రోగ్రెస్ అయ్యేము? అన్న విషయం తెలీదు కాని, ఇలాంటి సందర్భాల్లో మనం చెయ్యవలసినది చెయ్యకపోతే, తరవాత కాలంలో మనం కష్టపడతామో, కష్టపడమో మనకి తెలియదు. ఆ విషయాన్ని ఆ కథ నాకు గుర్తు చేస్తుంది. అది చెప్దామని నేను ఈ మరమనిషి కథ చెప్పేను.

తరవాత ‘వంటొచ్చిన మగాడు’ భరాగో (భమిడిపాటి రామగోపాలంగారు). ఈయన విశాఖపట్నంలో ఉన్నప్పుడు నాకు చాలా దగ్గరగా ఉండేవాడు. నేననకపోయినా చాలామంది నాకు గురువుగారని అంటుండేవారు ఆయన్ని. ఎందుకంటే ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినపుడు ఢిల్లీకి వస్తే, ఆకాశవాణిలో నేనాయన్ని పరిచయం చేశాను. సో, నేను మా గురువుగార్ని పరిచయం చేసేనన్నారు అంతమందీ. నేను కాదనలేను. ఎందుకంటే అంత చనువు ఆయనతో ఉంది. ఆయన గురించని చెప్పాలి. చెప్పకపోతే ఆయన ఎక్కడున్నా సరే, నా వైపు చూస్తాడేమోనని నాకే అనుమానంగా ఉంది. అందుకని ఆయన గురించి చెప్తున్నాను. వంటొచ్చిన మగాడు ఆయన కథ. ఆయన నిజంగా వంటొచ్చిన మగాడు. చాలా బాగా వంట చెయ్యగలడు. కానీ నేనిప్పుడు చెప్పబోయేది వంటొచ్చిన మగాడు కథ గురించి కాదు. ఆయన రాసిన గమనశ్రమ అనే కథ గురించి. దీంట్లో భాస్కరం అనే పాత్ర గురించి చెబుతున్నాను. ఈ భాస్కరం పాత్రని మీ అందరికీ చాలా బాగా తెలిసిన డాక్టర్ వివేకానంద మూర్తిని దృష్టిలో పెట్టుకుని ఆయన రాసేడని, ఆయనో లేక వాళ్ళ మేనల్లుడో నాకు చెప్పేరు. కానీ ఈ కథలో పాత్రధారి మాత్రం డాక్టరు కాదు. మెడికో కాదు. ఈ భాస్కరం అనే కుర్రాడు చాలా చురుకైన వాడు. కథ ఉత్తమపురుషలో కథ చెప్పే ‘నేను’. ఈ నేను స్నేహితుడి తమ్ముడు భాస్కరం. అతను తన స్నేహితుడి తమ్ముడిని కలుసుకుందుకు వస్తుంటాడు. ఎలా చదువుతున్నాడో కనుక్కోమని వాళ్ళ అన్న పురమాయిస్తే వస్తుంటాడు. ఆ కుర్రవాడు చక్కని కబుర్లు చెప్తాడు. మంచి పాటలు పాడతాడు. చాలా సరదాగా ఉంటాడు. చదువు విషయంలో చాలా తెలివైనవాడు గాని చదవడానికే అతని దగ్గర టైము లేదు. టైము ఉంటే బాగా చదివేవాడు. కానీ చదువుతుండేవాడు కాదు. పరీక్షలెలా పాసవుతాడని ఇంట్లో వాళ్ళ భయం. అందుకోసమని ఈ ఫ్రెండు వచ్చినప్పుడల్లా గుర్తు చేస్తుంటారు. ఇతను మాత్రం అతన్నవేవీ అడగడు. అడిగితే మరిక పాటలు పాడడు, కబుర్లు చెప్పడు. తనని అవాయిడ్‌ చేస్తాడని అడగడు. అందుకోసం ఏమి చేస్తాడంటే ‘నీకు చాలా అందమైన అమ్మాయిని, ఒక చక్కటి మెడికోని పరిచయం చేస్తాను ఈసారి బాగా పరీక్షలు రాస్తే’ అని చెప్తాడు. ‘చెప్తే ఇప్పుడే చెప్పండి నేను బాగా చదువుకుంటాను, ఆ అమ్మాయిని నాకు పరిచయం చేసేయండి’ అని అంటాడు. అంటే, ‘లేదు, లేదు పరీక్షలు బాగా రాయాలి. పరీక్షలు రాసేక చేస్తా’నంటాడు. అని రెణ్ణెల్లు పోయిన తర్వాత మళ్ళీ ఆ కుర్రాడి దగ్గరికి వెళ్తే పరీక్షలు, చదువు సంగతి తెలియదు కాని, ఆ అమ్మాయి ఇప్పుడెలా ఉందో, ఎక్కడ ఉందో కనిపెట్టేసి, ఇప్పుడా అమ్మాయితో రోజూ స్నేహం చేస్తుంటాడు. ఇలాంటి హుషారయిన కథలు తనదైన శైలిలో రామగోపాలంగారు మాత్రమే రాయగలరు.

ఆయన రాసిందే మరో కథ ‘పనికిరాని కథ’. తనెప్పుడూ ఉన్న వయసుకంటే ఎక్కువ కనిపించేవాడినని, తనజుత్తు అవసరమయిన దానికంటే ముందే తెల్లబడిపోయిందనీ (తననందరూ వాళ్ళ నాన్నగారి పేరు పెట్టి పిలిచేవారట) అతని అభిప్రాయం. ఇవన్నీ తలుచుకుంటూ అతను రాస్తాడు. ఇటువంటి అభిప్రాయాలే ఆ పనికిరాని కథలో ఒక పాత్రకి ఉంటాయి. ఆ వ్యక్తి చివరకి టినోపాల్ వారి సమయం ఉదయం 8 గంటలకి విశాఖపట్నం చేరుకున్నప్పుడు ఆయన నిర్ణయించుకుంటాడు: ‘ఇవాళనుంచీ నేను బుర్రకి రంగు రాసుకోవాలి. లేకపోతే అందరూ మా నాన్నగారు అనుకుంటున్నారు నన్ను’ అని. దానికాయన పనికిరాని కథ అని ఎందుకు పేరుపెట్టేడంటే, ‘నిజంగా జరిగిందేదీ కథగా పనికిరాదు’ అని ఆస్కార్ వైల్డు అన్నాడు. అందుకోసం ఆయన దాన్ని పనికిరాని కథ అన్నాడు. కానీ నా దృష్టిలో చాలామంది కథకులు రాసే కథలన్నీ పనికిరాని కథలే. ఎందుకంటే ఈ కథలన్నీ వీళ్ళు ఊరికినే కల్పితం అని రాసినప్పటికీ కూడా ఎంతో కొంత నిజం దాంట్లో ఉంటుందని నా ఉద్దేశ్యం. ‘నిజం కవితకి ఖనిజం కాకపోవచ్చు కానీ కథకి మాత్రం నిజం ఖనిజం.’ దానికి కొంత కల్పన తోడు చేస్తేనే అది కథ అవుతుంది. అందుగురంచని ఎవరు రాసిన కథలైనా, అది నేను రాసినా, మీరు రాసినా, పనికిరాని కథలే. అందులో నిజం లేకుండా ఉండదని నా ఉద్దేశ్యం. ఈ విషయం చెప్పడం కోసమే నేను ఈ పనికిరాని కథ గురించి చెప్పేను.

ఇది అయిన తర్వాత ఇందాక మీకు చెప్పిన పతంజలి గురించి చెప్పాలి. కె.ఎన్.వై. పతంజలి ఇప్పుడు అంతమందికీ చాలా తెల్సిన వాడేమో. ఉత్తరాంధ్రలో చాలా పేరున్న రచయిత. శ్రీశ్రీగారు ‘మనదేశంలో నిన్నందరూ గుర్తించాలి, నీకు పేరు రావాలంటే వెంటనే చచ్చిపో’ అన్నాడాయన. చచ్చిపోయిన తర్వాత అంతమందికీ అంతమందీ తెలుస్తారు. వాళ్ళెంత గొప్పవాళ్ళో, వాళ్ళెంత మహానుభావులో బ్రతికున్నపుడు మాత్రం చాలామందికి తెలియదు. కనీసం, ముఖ్యంగా తెలుగువాళ్ళకి. మనకి బ్రతికున్న వాళ్ళపట్ల శ్రద్ధ లేదు. మీ వాళ్ళే, మీ ‘వెన్నెల’ వాళ్ళే, కొంచెం బ్రతికున్నవాళ్ళని పిలుస్తున్నారు. కానీ, మిగతావాళ్ళు చనిపోయినవారినే తలుచుకుంటారు. ఈ పతంజలిగారు ఒక సమయంలో నాకు చాలా దగ్గరి మిత్రుడు. ఆయన అప్పట్లో రాసిన ‘దిక్కుమాలిన కాలేజీ’, దాంట్లో ఒక విద్యార్థి నాకు గుర్తొస్తుంటారు. ఆ దిక్కుమాలిన కాలేజీ మా కాలేజీ ఏమో అని, అందులో విద్యార్థులం మేమేనేమో అని, అతను వర్ణించిన ప్రిన్సిపాల్ మా ప్రిన్సిపాలేనేమోననీ నా కనిపిస్తుండడం వల్ల బహుశా గుర్తొస్తుంటుందేమో నాకు తెలియదు. కానీ దాంట్లో ఆయన చాలా చక్కగా రాసేరు. ఒక రకమైనటువంటి వ్యంగ్యం, హాస్యం, అప్పట్లోనే ఆయన కథలలో కనిపిస్తుంది. ఆ తర్వాత కాలంలో ఆయన రాసిన ఖాకీవనం పోలీసుల మీద, పోలీసుల దౌర్జన్యాల మీద రాసిన నవల. దాంట్లో కూడా కొంచెం కొంచెం గుర్తొస్తుంటాయి. కానీ అంతకంటే ముందర రాసినటువంటి ‘మోటు మనిషి’ అనే కథ… ఒక బస్సులో వెళుతూంటే, మోటుమనిషని అసహ్యించుకునే వ్యక్తికి, ఆ మోటు మనిషే సహాయపడ్డం మీద ఆయన రాసిన కథ కూడా నాకు గుర్తొస్తుంది. కె.ఎన్.వై. పతంజలిని గుర్తు చేసుకోవడం కోసమే నేను ఈ కథలగురించీ చెప్పేను.


ఇప్పుడు, అందరికీ ఇష్టమైనటువంటి, ముఖ్యంగా మీ టెక్సస్ లోని రెండు మూడు ఊర్లలో ఆయన పేరు తలుచుకోకుండా ఏ సభా జరగనటువంటి రచయిత. ఆయన గురించని నేను చెప్తున్న కథలు మాత్రం వాళ్ళు చెప్పే కథలు కావు. అతను రమణ అనే ముళ్ళపూడి వెంకటరమణగారు. ఆయన రాసిన జనతా ఎక్స్‌ప్రెస్ కథని తరవాత అందాలరాముడు సినిమాగా తీసేరు. అందాలరాముడు సినిమా తీసినపుడు సినిమా బావుందేమో నేనేమీ దానిగురించని అనలేను కానీ జనతా ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న ఆ గొప్పతనం, దాంట్లో వున్న ఓ అద్భుతం ఈ సినిమాలోకి రాలేదని నా కనిపిస్తుంది. దాంట్లో చక్రవర్తి అంటాడన్నమాట, ‘నాకు కారు నీకు మామగారు’. ‘నీకు మామగారు నాకు కారు’ అని రెండోపాత్ర అంటుందన్నమాట. ఆ వాక్యం నాకు గుర్తొస్తుంటుంది. ఒక చిన్న చిన్న హౌసింగ్ కాలనీలో వున్న ఓ నాలుగైదు పాత్రల గురించి ఆయన జనతా ఎక్స్‌ప్రెస్ అని రాసిన కథ చాలా బాగుంటుంది. అలాగే ‘రాజకుమారి మీ ఇళ్ళవుందా? రత్నకుమారి మీ ఇళ్ళవుందా? పేరు పేరుల తల్లి మీ ఇళ్ళవుందా? పెద్దప్ప దొరసాని మీ ఇళ్ళవుందా?’ అంటూ మొదలు పెట్టే ఒక కథ పేరు మహరాజు-యువరాజు. ఇద్దరివీ ఆర్థిక సమస్యలే. అతను మహరాజు, ఇతను యువరాజు. ఏ రాజ్యానికీ రాజులు కారు. ఏ రాజ్యానికీ యువరాజులూ కారు. వారిద్దరి గురించి అద్భుతమైన హాస్యంతోను, నిరుద్యోగం గురించి, ఇంట్లో తిండానికి డబ్బుల్లేని పరిస్థితి గురించీ చాలా చక్కగా రాసిన ఆ కథ నాకు గుర్తొస్తుంటుంది. ముఖ్యంగా ఈ ‘పేరు పేరుల తల్లి మీ ఇళ్ళ వుందా? పెద్దప్ప దొరసాని మీ ఇళ్ళవుందా?’ ‘ఇల్లిల్లు తిరిగేటి పిల్లలకోడి’ అనే పదం నాకు గుర్తొస్తాయి.

అట్లాగే ఆయన రాసిన రాధా-గోపాలం కథలు, కుమారసంభవమూనూ. తిమింగిలగిలం అనే కథలో మొదటిసారి అప్పారావు గురించి రాసేడేమో. తర్వాత ఋణానందలహరిలో కామన్ అయిపోయాడు కానీ మొట్టమొదట తిమింగిలగిలం అనే కథలో రాసేడని నేననుకుంటున్నాను. ఈ కథలు నాకు చాలా గుర్తొస్తుంటాయి. ముఖ్యంగా గృహస్థ జీవితంలో, కొత్తగా పెళ్ళయిన వాళ్ళ జీవితంలోని చక్కటి అనుభవాల్ని ఆయన పెళ్ళి కాకముందే ఎలా రాసేడో నాకు అర్థం కాదు. రాసేడు. ఆంధ్రపత్రికలో రాసేడాయన. నాకీ కథలు చదివేటప్పుడు కాని, తలుచుకునేటప్పుడు కాని, ఆయన పెళ్ళికి ఆరేడేళ్ళు, లేదా పదేళ్ళు ముందరే ఎట్లా రాసి పడేసేడా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆయనకు 1964లో పెళ్ళయిందనుకుంటాను. ఇవన్నీ 50లలో రాసేడని నా ఉద్దేశం. అందువల్ల అలా అనుకుంటూ వుంటాను.

తర్వాత కె.వి.ఎన్. శర్మగారి గురించి చెప్పాలి. కవన శర్మగారు ఒక సివిల్ ఇంజనీరు. ఇక్కడ చాలామంది ఇంజనీర్లు ఉన్నారు. ఆయన మిగతా అన్ని కథల గురించి చెప్పినా చెప్పకపోయినా, రాజు-పౌడరు డబ్బా అనే కథ గురించి చెప్పాలి. అది రాధాగోపాలంలోంచి కొంచెం అలా తీసుకెళ్ళి పెట్టిన కథ అన్పిస్తుంది. కానీ దానికదే నిలబడుతుంది. ఆ విశాఖపట్నం డైమండ్ పార్క్, పదమూడో నంబరు బస్సు, నల్ల కుర్రవాడు, పౌడర్ డబ్బా, ఇంతే ఉంటాయి కథలో. కానీ ఆ కథ రాసిన పద్ధతి వలన చదవాలనే కోరిక మనకి కలుగుతుంది. మీరు చదివి ఉంటే ఆలోచించుకోండి. చదవకపోతే, వీలు దొరికితే చదవండి.

తరవాత తిలక్ అని చెప్తేనే అర్థమవుతుంది. సీతాపతి కథ అంటే చాలామందికి తెలియక పోవచ్చు. ‘సీతాపతి కథ’లో వుండే సీతాపతి నాకు తరచు గుర్తుకువచ్చే ఒక పాత్ర. బాలగంగాధర తిలక్ రాసిన కథలలో ఒక పాత్ర. ఆ కథ ఎలా మొదలవుతుందంటే, ‘పెళ్ళాన్ని చంపేయాలి, బొచ్చుకుక్కని చంపేయాలి, పక్కింటి కుర్రవాడ్ని చంపేయాలి, పోస్ట్‌మాన్‌ని చంపేయాలి’ అని కాగితం మీద రాసుకుంటాడు సీతాపతి. రాసుకుంటే, ‘ఏమండీ, ఇవాళ పెరుగు పచ్చడి, టమాటా పెరుగు పచ్చడి చేయించేదా?’ అని అంటుంది వాళ్ళ ఆవిడ వెనకనుంచి. అంటే ఇంకా భార్య చనిపోలేదు, కర్టెన్ వెనకాలే ఉంది. పైగా మధ్యాహ్నం (భోజనం) గురించి మాట్లాడుతున్నాది అని గుర్తొచ్చి ఒక్కసారిగా గాభరా పడతాడు. తన నోట్స్‌లో ‘పద్మ రాక్షసి’ అని రాసుకుంటాడు. అదే సీతాపతి చివరికొచ్చేసరికి ‘పద్మ దేవత’ అని రాసుకుంటాడు. ఈ కథలో వుండే ప్రత్యేకత ఏమిటంటే ఒకరకమయిన సుకుమారివంటి భర్తగారు, ఎంతో ప్రేమ చూపించే భార్య ప్రేమని భరించలేడు. మనం కూడా చూస్తాం. ఎంతో ఇష్టపడే భార్యలు వున్నా సరే, కొంత మంది భర్తలకి కష్టంగా వుంటుంది. భర్తలెంత మంచిగా ఉన్నా కూడా సరే, కొందరు భార్యలు సరిగా ఉండట్లేదు. కానీ ఇక్కడ రాసిన కథలో ఆయన పాత్రలు, డబ్బున్న కుటుంబంలో పుట్టినవాళ్ళు, సౌకుమార్యంతో పెరిగినవాళ్ళు. అలాంటి భార్యాభర్తల మధ్య సంబంధాన్ని, వారి మధ్యనున్న విషయాన్ని ఆయన రాసేడు. అందులోని సంభాషణలు నాకు నచ్చుతుండేవి. అందుకు నాకు గుర్తు వస్తుండేది.

తిలక్‌గారి గురించి చెప్పి నేను మరొక వాక్యం చెప్పకపోతే నేను వదిలేసినట్టవుతుంది. అది ఏ కథో నాకు గుర్తు లేదు, బహుశా ‘దొంగ’ అయి ఉండొచ్చు. దాంట్లో వెంకట్రామయ్యో, వెంకట రమణయ్యో అనే పేరున్న ఒక పాత్ర ఉంటుంది. అతని గురించి రాస్తాడు: ‘అతను జీవితంలో అంత హీనమైన పని ఎన్నడూ చెయ్యలేదు. తన స్థాయికి తగని పని కూడా చేసేడు. అయినా జీవితం అతనికి కుదరలేదు’ అనే అర్థం వచ్చే వాక్యాలు. నాకు నేను, మనసు బాగు లేని క్షణాల్లో, నేను దీనంగా వుండే క్షణాల్లో, చాలా డిప్రెస్డ్‌గా వుండే క్షణాల్లో, నాకు గుర్తొచ్చేదేమిటంటే, నేను నా స్థాయినుండి దిగజారిపోయి క్రిందకు వెళ్ళినా సరే, నా స్థాయి పెరగదు అనే విషయం. అప్పుడు ఈ వాక్యం గుర్తొస్తుంటుంది. అందుగురించని చెప్పేను. ఇందాక నేను చెప్పిన, ‘రచన గొప్పదనం రచయిత శక్తిపై ఆధారపడినంతగా రాస్తున్న విషయంపై ఆధారపడదు’ అనే విషయానికొస్తున్నాను నేను. దాని గురించని చెప్తున్నాను.

‘పార్కులోకెళ్ళాడు క్లార్కు సూర్యారావు, క్లార్కు సూర్యారావు, క్లార్కు సూర్యారావు, పార్కులోకెళ్ళాడు పనిలోంచి వచ్చి. పార్కులోకెళ్ళాడు క్లార్కు సూర్యారావు.’ ఈ క్లార్క్ సూర్యారావు పల్లెటూరు నుండి బయటకు వచ్చి నగరంలో యథాశక్తి తగరంలా మెరుస్తాడు. తరవాత అతను చేసేదేమిటంటే, ‘చేసేది పొద్దు పుచ్చడం, నేసేది కలల కచ్చడం’. చేసేది పొద్దు పుచ్చడం – అంటే నిరుద్యోగి. ఏ పనీ లేదు కాబట్టి పొద్దు పుచ్చుతూ ఉంటాడు. మరే పనీ లేదు కాబట్టి, కలల కచ్చడం – అంటే రేపు ఉద్యోగం వస్తుంది, ఇంకా పైకెళతాను, అని కలలు కంటూ వుంటాడు. ‘ఇప్పటి’ జీవితం ‘వెనకటి’ జీవితానికి పదహారవ కార్బన్ కాపీలా కనిపిస్తూ వుంటుంది క్లార్క్ సూర్యారావుకి.

ఇదే సూర్యారావు పేరో, సూర్యం అన్నపేరో ఉన్న ఒక కారెక్టరు గురించి మరో కథ రాసేడు ఒకాయన. ఎవరూ అన్నది మీకే వదుల్తాను. తెలియకపోతే తర్వాత చెప్తాను నేను. ముగ్గురి మధ్య కుడి ఎడమైతే అనే కథలో సూర్యం అనే పాత్ర వుంటుంది. అలాగే పిల్లికూన, ఊష్టం వచ్చింది, ఊరు ఊరుకుంది, ఇలాంటి కథలు రాసిన ప్రఖ్యాత రచయిత, కవి, చారిత్రక పరిశోధకుడు, రకరకాల పరిశోధనలను చేసినవాడు అయిన ఆరుద్రగారి గురించి నేను చెబుతున్నాను. ఆయన రాసిన మిగతా కథలూ మిగతా సాహిత్యం గురించి నేను చెప్పట్లేదు. ఆరుద్ర డిటెక్టివ్ కథలు కూడా రాసేడు. ఆయన రాసిన డిటెక్టివ్ కథల్లో కొన్నిటి గురించి చెప్పబోతున్నాను. ఆయన రాసిన డిటెక్టివ్ కథల్లోని పాత్రలు ఇన్‌స్పెక్టర్ వేణు, భార్య రుక్కు, ఆయన అసిస్టెంట్ చంద్రం, టూ టౌన్ పోలీస్ స్టేషన్, ఆయన తమ్ముడు రవి ఇలాంటి వాళ్ళు. ఒక గొప్ప రచయిత డిటెక్టివ్ కథ రాసినా సరే, ఆ డిటెక్టివ్ కథలో కూడా సాంఘిక జీవితం, చరిత్ర పరిశోధనలు ఇలాంటి విషయాల గురించని రాయగలడు. అవి ఎలా ఒప్పుతాయి, ఎంత బావుంటుంది అన్న విషయం ఇందులో తెలుస్తుంది. ఈయన గురించి పరిచయం చేస్తూ, 60ల లోనే ఎప్పుడో ‘సినిమారంగం’లోనో ఎక్కడో రాసేరన్నమాట: చిలిపి ఊహలకి ముందర సిగరెట్టు అని రాసేరు ఆయన బొమ్మవేసి. తరువాత కొంత పోయిన తర్వాత ఏమిటి రాసేరంటే, వర్జీనియా పొగాకుతో చేసింది కాబట్టి వర్జింపదగినది సిగరెట్టు అని రాసేరు. అంటే ఈయన ఒకప్పుడు సిగరెట్లు తాగేవాడు టిన్నులు. ఆ రోజుల్లో సిగరెట్టు టిన్నులు ఉండేవి. టిన్నులకొద్దీ టిన్నులు తాగేసేవాడని తెలుసు మనకి. అయితే అది ఇక్కడ ఎందుకు చెపుతున్నానంటే ఈయన రాసిన ఒక నవల ‘దెయ్యాలకొంప’లో ఇన్‌స్పెక్టర్ వేణు ఉదయాన్నే లేవగానే టూత్‌పేస్టుతో పళ్ళు తోముకోగానే, సిగరెట్టు తాగుదామనుకుంటే సిగరెట్టు కనిపించదు. పర్సు తీస్తే, పర్సులో డబ్బులుండవు. ఉండకపోతే వాళ్ళ తమ్ముడు రవిని అడుగుతాడు వేణు ‘చిల్లరడబ్బులున్నాయా రవీ?’ అని. అడిగితే, ‘ఉన్నాయి అన్నయ్యా, ఇస్తాను. కానీ, నాకు వడ్డీ ఇస్తావా?’ అని అడుగుతాడు. తనిచ్చిన డబ్బులకే వడ్డీ అడుగుతున్నాడని ఆశ్చర్యపోతాడు. సరే ఇస్తాను సిగరెట్టు ప్యాకెట్ పట్టుకురా అంటాడు. అంటే, అక్కర్లేదు అంటుంది భార్య రుక్కు. అని చెప్పి ఒక సిగరెట్టు ప్యాకెట్ ఇలా విసురుతుంది. విసిరితే ఇతని ఒళ్ళో పడుతుంది ఆ సిగరెట్ ప్యాకెట్. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది అనుకూలవతి, సుగుణవతి అయినటువంటి భార్య, భర్తకి ఏ సమయంలో ఏ అవసరాలు వస్తాయో ముందే తెలుసుకుని వుంచుతుంది అనే విషయాన్ని ఆయన రాసేడని. ‘మనింట్లో సిగరెట్టు వుందా? ఎలా వచ్చింది? ఈ సిగరెట్టు ప్యాకెట్ ఎలా వచ్చింది?’ అని అడుగుతాడతను. అడిగితే ‘ఉంది కదా?’ అని చెబుతుందావిడ.

అయితే ఈ ఒక్కదాని గురించని నేను చెప్పట్లేదు. ఆ కథలో, ఆ నవలలో, ఆయన ఎన్నో విషయాలు చెప్పేడు. ఎలాంటివి అంటే, జైలులో ఉండే కేడీలకు గాని, దొంగలకి గాని, జైలు బయట ఉండే పోలీసులకి గాని పేర్లుండవు. ఉత్త నంబర్లు మాత్రమే ఉంటాయి అని ఆయన చెప్పేడు దాంట్లో ఒకచోట. ఇవాళకూడా అంతే. మనం 421ని పిలువు, 220ని పిలువు అని కానిస్టేబుల్‌ని రిఫర్ చేస్తారు. వాళ్ళ గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పరు. ఒక కథలో (బహుశా ఏ కథలోనూ) ఇన్‌స్పెక్టర్ వేణు ఎప్పుడూ నేరస్థులని కొట్టడు. వాళ్ళని ఎన్నోరకాల ప్రశ్నలు వేసి వాళ్ళనుంచి విషయాన్ని రాబట్టుతాడు. ఒక రోజున ఫలానా వాడిని పిలువు, వాణ్ణి ప్రశ్నిద్దాం అని అనేసరికి వాడు తెలివితప్పి ఉన్నాడని చెపుతాడు అసిస్టెంటు చంద్రం. లాకప్ లోకి వెళ్ళి చూస్తే వాడు తెలివితప్పి పడి ఉంటాడు. ‘చంద్రం, నువ్వు కొట్టేవా?’ అని ఆశ్చర్యపోతాడు. ‘మా అందరికీ మీలాంటి శక్తి లేదు కదా, రకరకాల ప్రశ్నలు వేసి, వాడి మనసులోని విషయాల్ని రాబట్టడానికి! అందుగురించని వాడు వినకపోవడం వలన రెండు తగిలించాను’ అని చెప్తాడు. ‘తగిలించకూడదు అని చెప్పేను కదా నీకు చాలాసార్లు. మనం పోలీసులం. మన ధర్మం వాళ్ళకి న్యాయం చెయ్యాలి. కోపరేట్ చెయ్యాలి కానీ ఎప్పుడూ వాళ్ళని కొట్టకూడదు’ అని అంటాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుకీ కూడ మన దేశంలో కాని, ఈ దేశంలో కాని, పోలీస్ హింస ఎలా ఉంది అన్న విషయం మనకు తెలుసు. కానీ ‘డిటెక్టివ్ కథల్లో అలాంటి విషయాలు అక్కర్లేదు, వాటిని పట్టించుకోనక్కర్లేదు, అవి సాహిత్యపరంగా కొంచెం తక్కువ స్థాయివీ’ అనే దృష్టితో చాలామంది వుంటారు. డిటెక్టివ్ రచనలు చేసే కొంతమంది రచయితలు, ఉదాహరణకి కొమ్మూరి సాంబశివరావు లాంటి రచయితలు కూడా వాళ్ళకి గుర్తింపు దక్కట్లేదని బాధపడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆరుద్రవంటి వాళ్ళు, అలాంటి పుస్తకాల్లో కూడా గొప్ప విషయాలు వ్రాశారు. ఎందుకంటే, జీవితం నుంచి నేరం వేరుగా లేదు. జీవితం నుంచి ప్రేమ వేరుగా, ప్రణయం వేరుగా లేదు. తాగుడు వేరుగా లేదు. జీవితం నుండి సంఘాన్ని, సంఘం నుండి జీవితాన్ని మనం ఎంత కావాలనుకున్నా వేరు చేయలేము. అలా రాసి ఏ రచనలూ చేయలేము, అసలు బ్రతకలేము మనం. వాటిని స్పృశించని సాహిత్య క్షేత్రాలు వుండడం అసాధ్యం. ఎనీవే, ఆ విషయాల గురించి ఆయన దాంట్లో చెబుతూ చెప్తాడన్నమాట.

తరువాత, ‘ఈ రాణీ ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులూ, తారీఖులు దస్తావేజులు ఇది కాదోయ్ చరిత్రసారం’. లెనిన్‌గారు వెంటనే పాడటం మొదలుపెడతారు. అలాంటి విషయాల గురించి ఒక కథ మొదలౌతుంది. అపరాధ పరిశోధకులకి, చారిత్రక పరిశోధకులకి తారీఖులు, దస్తావేజులే ముఖ్యం అని మొదలవుతుంది. ఆ కథలో జరిగేదేమిటంటే, ఆంధ్రులమీద పరిశోధనలు, ఆంధ్రుల చరిత్రమీద పరిశోధనలు చేస్తున్న ఒక వ్యక్తిని ఒకడు చంపేస్తాడు. ఎవడో తెలీదు. వాణ్ణి పట్టుకోవాలి. దానికి ఆధారం ఏమవుతుందంటే ‘చెలియా, కనరావా’ అన్న పాట. తర్వాత అప్పటికి ఆంధ్రరాష్ట్రము మద్రాసునుండి వేరయిందా లేదా అన్న చారిత్రక సత్యం, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కానీ డిటెక్టివ్ కథగా తీసుకుంటే, మంచి సస్పెన్స్, మనకి తెలియక పోవడం, చక్కటి పదాలు, అన్నీ ఉంటాయి. అలాగే వారిజాక్షులందు అని ఒక కథ ఉంటుంది. పోతన గారు ‘వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణ, విత్త, మానభంగమందు’ అబద్ధాలు ఆడెయ్యవచ్చునని చెప్పేసి బోల్డు మినహాయింపులు చెప్పి వుండొచ్చు. కానీ, ఈ కథలో ఇన్‌స్పెక్టర్ వేణు, ఎప్పుడూ అబద్ధాలు చెప్పనివాడు, తన భార్య కోసం, తన భార్య తమ్ముడి కోసం కోర్టులో అబద్ధం చెప్తాను అని చెప్తాడు. అందుకే ఆ కథకు వారిజాక్షులందు అని పేరు పెట్టారు. గృహస్థ జీవితంలో ఉన్న రొమాన్స్‌ని, భార్యాభర్తల మధ్య సంబంధాలని, వ్యక్తిగత జీవితంలో చేసే చిన్న చిన్న నేరాలని, పోలీసుల దాకా తీసుకువెళ్ళకుండా, ప్రైవేటుగా పరిష్కరించే పద్ధతిలో రాసినటువంటి కథలు ఎన్నో వున్నాయి. వాటిలో మనం తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో వున్నాయి. ఇవి ఇలా మిస్ అయిపోతున్నాం. ఇవి పోతున్నాయి అన్న భయం వల్ల, వీటిని మళ్ళీ పబ్లిష్ చెయ్యాలని చాలామందిని అడిగేను. మన కౌముది వాళ్ళని కూడా అడిగేను. చాలామందిని అడిగేను. ఇందాక చెప్పిన ఏల్చూరి మురళీధరరావుగారితో కూడా చర్చించాను. చివరకి, స్వప్న అనే పత్రికవాళ్ళు, గత మూడేళ్ళలో, ఈ కథల్లో కొన్ని, అంటే పది పన్నెండు కథలని తిరిగి పబ్లిష్ చేశారు. ఈ కథలు, ఆ ‘స్వప్న’ సంచికలు దొరికితే, వీలయితే చదవండి. చాలా మంచివి.

తరవాత, ఇందాక బట్టి నేను చెప్తున్న పేరు కొమ్మూరి సాంబశివరావుగారు. సాంబశివరావుగారి గురించి నేను చెప్పేది ఎక్కువ లేదు. ఒకటో, రెండో లైన్లు చెప్తాను. ఆయన గురించి అందరికీ తెలుసును. యుగంధర్ పాత్ర అందరికీ పరిచయమే. యుగంధర్, రాజు, కాత్యా, ఇవి తరచు నాకు గుర్తొచ్చే పాత్రలు. ఆ యుగంధర్ పాత్రకి ఆ పేరు ఎలా వచ్చింది అన్నది కూడ చాలా కుతూహలమైనదే. మద్రాసులోని పానగల్ పార్కులో అందరూ కూర్చునేవాళ్ళు. మేధావులందరూ అక్కడ కూర్చునేవాళ్ళని మనం చాలా చోట్ల చదివేం. అలాంటి చోట ఈ సాంబశివరావుగారేమో ‘నేను పెట్టబోయే డిటెక్టివ్‌కి పేరు సజెస్ట్ చెయ్య’మని మల్లాది రామకృష్ణ శాస్త్రిగారిని అడిగితే, ఆయన మన యుగంధరుడు ఉన్నాడు కదా అని అంటే, 6 అడుగుల 3 అంగుళాల యుగంధర్ అలా పుట్టేరు. తరువాత కాత్యా అని రాస్తూ, చాలా మంచి వాసన వేస్తున్నావు అని అంటాడు. దానర్థం ఏమిటో నాకివాళ వరకూ అర్థం కాలేదు. కానీ, ఆ వాక్యం నాకు గుర్తొస్తూ వుంటుంది. ఇక్కడ మన దేశంలో, మనం చూస్తూ వుంటే చైనా అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. ఈ చైనా పిల్లలని చూసినప్పుడల్లా నాకు కాత్యా మాత్రం గుర్తొస్తుంటుంది. ఎక్కడ ఏ చైనా అమ్మాయి కనిపించినా నాకు కాత్యా గుర్తొస్తుంది. అందువల్ల నేను దాని గురించి చెప్పేను. ఇందాక చెప్పినట్టు, అతనిది అత్యద్భుతమైన శైలి. ఆ ప్రవాహం అత్యద్భుతంగా ఉంటుంది. కొన్ని మామూలు సాంఘిక నవలలు కూడ రాసేడు. అవన్నీ కూడ మీరు మొదలుపెడితే, ఆపలేకుండా చదివిస్తాయి. కానీ అలాంటివాళ్ళు తెలుగువాళ్ళవడం వల్ల, వాళ్ళ ఆధునిక గ్రంథమాల అర్ధాంతరంగా పోయింది. ఆ పుస్తకాలు మనకు చాల మట్టుకు దొరకకుండా పోయేయి. కొంతలో కొంత కౌముదిగారు వాటిని అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. ఆయన దగ్గర ఉన్నాయని చెప్పేడాయన. అంచేత ఒకనాటికి వస్తాయి కదా! సరే మంచిపని చేస్తున్నారు అన్నాను నేను.

తర్వాత, ఇంక మరి మూడు నాలుగే ఉన్నాయి. ఎక్కువమంది లేరు. గాభరా పడొద్దని చెబుతున్నాను నేను. వాటి గురించి నేను ఎక్కువ మాటాడను. తక్కువ తక్కువ విషయాలు చెప్పి పూర్తి చేసేస్తాను. టెంపోరావు – ఈ టెంపోరావు కూడ చాలా డిటెక్టివ్ నవలలు రాసేడు. ఏడడుగులు పొడవుండే డిటెక్టివ్ వాలిగారు, గిరి ఈయన ముఖ్య పాత్రలు. అవి షెర్లాక్ హోమ్స్ పద్ధతిలో ఆయన రాసేడు. కానీ ఆయన విశ్వరూపం మనకి పరశురామ్ అన్న పాత్రలో కనిపిస్తుంది. ఈ పరశురామ్ ఎక్కువ తిళ్ళు తింటాడు. Woodbine సిగరెట్లు కాలుస్తూ ఉంటాడు. అతనికి రకరకాల ఇష్టాలు ఉంటాయి. ఇతను టెంపోరావు గారి alter ego అని నేననుకుంటున్నాను. అతని ఇష్టాలేమిటంటే ఓ. పి. నయ్యర్ సంగీతం, రాక్ అండ్ రోల్, మహ్మద్ రఫీ పాటలు, రాళ్ళ మీద పడుతున్న నీటి చప్పుళ్ళు ఇవన్నీ. అలాగే అతను విజయం సాధించిన తర్వాత లతామంగేష్కర్ పాట వింటూ, తను సాధించిన విజయం మర్చిపోవడం లాంటి లక్షణాలుంటాయి ఈ పరశురామ్‌కి. కానీ అతనే మళ్ళీ పల్లెటూరి పిల్లతోని, పార్వతి అనే అమ్మాయితోనూ కలిసినపుడు ఆ పాత జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. ఈ విధంగా టెంపోరావుగారి స్పెక్ట్రమ్ అంతా తీసుకుంటే, ఆయనకు ఎన్నో రకాల అభిరుచులు ఉన్నాయి అని తెలుస్తుంది. కానీ, ఇందాక ఆవిడ చెప్పినట్టు బ్రహ్మచారిగా ఉండడం వలన, ఆయన గురించి, ఆయన పుస్తకాల గురించీ ఎక్కడా రాలేదు. ఆయన పుస్తకాలు బయటకు తెప్పించడం కోసం చాలామందితో మాట్లాడేం. కౌముదితో మాట్లాడినా కుదరలేదు. ఇప్పుడో, వచ్చే నెలలో ఎప్పుడో రచన శాయిగారు – బహుశా ఆయనతో నేను మాటాడేనో లేదో తెలియదు గాని, ఆయన గురించి ఒక వ్యాసం వేయబోతున్నారని తెలిసింది. కాబట్టి వీలయితే, ఆ వచ్చే నెల రచన మాసపత్రికలో ఆ వ్యాసం చదివితే, టెంపోరావుగారి గురించి తెలుస్తుంది. అది టెంపోరావుగారి గురించి చెప్దామనుకున్నది.


ఇక అందరికీ తెలిసిన రచయితలు వసుంధర. ఈ వసుంధర అనబడే రాజగోపాలరావుగారు, రామలక్ష్మిగారు జొన్నలగడ్డ వాళ్ళే. అందుకోసం కూడా వాళ్ళని చేర్చాను. మన జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యంగారి చుట్టాలేమో తెలీదు. ఇద్దరూ వసుంధర అనే పేరుతో రాస్తారు. వాళ్ళంత విస్తృతంగా ఎవరూ రాయలేదేమో ననిపిస్తుంది. కానీ వీళ్ళు మొట్టమొదటిసారి రాసిన పెసరపప్పు అన్న కథ జయశ్రీ మాసపత్రికలో వచ్చింది. ఉత్త పెసరపప్పులా మాటాడేనోయ్ అంటాడన్నమాట ఒక పాత్ర చివర్లో. అది నాకు గుర్తొస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు రాసిన ‘రెండో కథ’ కూడా గుర్తొస్తుంటుంది. అదేమిటంటే, నాలాంటి వాడే ఒకడు, బహుశా రచయిత, ఒక కథ రాస్తాడు. తరువాత మళ్ళీ ముప్ఫై ఏళ్ళ వరకూ వాడేమీ రాయడు. తర్వాత మరో ముప్ఫై ఐదేళ్ళు పోయిన తర్వాత మరో కథ రాస్తాడు. అప్పుడు మీలాంటి పాఠకులు, మీ వెన్నెల వేదిక లాంటి పాఠకులలో ఒకాయన వచ్చి ఈ కథ ముప్ఫై అయిదేళ్ళ క్రితం ఫలానా వాడు రాసేడు నువ్వు వాణ్ణి కాపీ కొట్టేవు అని వాణ్ణి బజార్లో పెడతాడు. తను అలాంటి కథ రాసేనని కూడా వీడికి గుర్తుండదు. తను రాసిన మొదటి కథే అనుకున్నాడు. కొత్తగా రాసేననుకుంటాడు. ఆ కథ గురించి రెండో కథ రాస్తాడన్నమాట.

ఇదెందుకు చెబుతున్నానంటే, సోమర్ సెట్ మామ్ ఒకసారి ఏమన్నాడంటే: Writer has essentially only one thing to say అని. వాడెన్ని కథలు రాయొచ్చు, ఎన్ని పుస్తకాలు రాయొచ్చు; కానీ వాడు చెప్పేది మాత్రం ఒకటే ఉంటుందన్నాడు. అదీ, ఇదీ నాకు గుర్తొస్తుంటాయి. నేను ఏది మాటాడినా ఒకేలా ఉందని నన్ననేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ‘నువ్వేమి మాటాడినా ఒకేలా వుంటుంది, నువ్వేమి చెప్పినా, నీ కథలూ పాత్రలూ ఒకేలా ఏడుస్తాయి’ అనేవాళ్ళూ ఉన్నారు. అలా ఎందుకు ఉంటుందంటే రచయిత ఎన్ని రూపాలు వేసుకున్నా, పాఠకులు గుర్తుపడతారు. ఒక సినిమాలో రామారావుగారు సడెన్‌గా సాక్సు మార్చుకుంటే ఎవ్వరూ గుర్తుపట్టరు కానీ ప్రేక్షకులు గుర్తుపట్టేస్తారు. రచయిత కూడా రామారావుగారి లాంటి వాడే. ఎన్ని రకాల వేషాలు వేసినా, అదే రచయిత, అదే ప్రవర్తనా కాబట్టి అవి గుర్తుపట్టేస్తారు. ఆ విషయం చెప్పడం కోసమే వారి గురించి చెప్పేను.

వారు రాసిన మరొక నవల ‘పెళ్ళయ్యాక చూడు’ అనేది కూడ బావుంటుంది. భువనేశ్వర్‌లో ఏదో ఓ కేంపస్‌లో కథ నడుపుతారు. కొత్తగా ఇద్దరికి పెళ్ళవుతుంది. పెళ్ళయిన తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. రాబోయే కుర్రాడో, కుర్రపిల్లో తెలీదు. వాళ్ళింటిదాకా వచ్చేస్తుంది. వచ్చి వాళ్ళ ఇంటి పిట్టగోడ మీద కూర్చుంటుంది. వీళ్ళెంత జాగ్రత్తగా ఉంటారంటే ఎప్పుడూ ఆ పిల్లకి ఇంట్లోకి రావడానికి అవకాశం దొరకదుట. అలా హాస్యస్ఫోరకంగా కథ నడిపిస్తారు. ఈ కథ బాగుంది, ఈ నవల చాలా బావుంది, నాకు నచ్చింది అని నేను వాళ్ళకి చెప్పినపుడు వాళ్ళేం చెప్పేరంటే, కొన్ని సంవత్సరాల క్రితం ముళ్ళపూడి వెంకటరమణగారు కూడా నచ్చి, ఆయన కూడా నాలాగే, దూరం నుండే ఫోను చేసి, ఇది మాత్రం చాలా బాగుందని చెప్పేరట. ఆ కథ ‘పెళ్ళయ్యాక చూడు’, పెళ్ళిచేసి చూడు కాదు, దొరికితే చదవండి. చాలా బావుంటుంది. చదవడానికి సరదాగా ఉంటుంది.

తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు. ఈయన చాలా విస్తృతంగా రాసేరు. కానీ ఒక్కలైను, ఒకటిన్నర లైన్లు మాత్రమే చెప్తాను. లేకపోతే రెండు లైన్లో మూడు లైన్లో చెబుతాను. అంతకన్నా ఎక్కువ కాదు. ఈయన రిక్షావాడి మీద ఒక కథ రాసేడు. ఆ కథ నాకు గుర్తు లేదు. పాత్ర పేరు కూడ నాకు గుర్తు లేదు. విషయం మాత్రం గుర్తుంది. ఒకడు పోయి ఒక రిక్షావాడ్ని అడుగుతాడు ఫలానా చోటుకి ఎంత తీసుకుంటావని. అంటే వాడు ఓ రూపాయి పడుతుంది బాబుగారు అంటాడు. అర్ధరూపాయికి వస్తావా? అని అడుగుతాడు. రానంటాడు. పొమ్మంటాడు వాణ్ణి. కొంత దూరం పోయిన తర్వాత మరో రిక్షావాడు దొరుకుతాడు. తీసుకెళ్తావా అంటే తీసుకెళ్తానంటాడు. వాడిని ఎంత కావాలని అడిగితే, అర్ధరూపాయి ఇవ్వండి అంటాడు. పావలాకి వస్తావా అని అడుగుతాడు వీడు. మనిషి స్వభావం ఏమిటంటే, అవతలి వాడు సరి అయిన రేటు చెప్పినా, మన బేరమాడే స్వభావం మారదు. మనం ఇంకా తక్కువకి అడుగుతాం. బేరం ఆడటంలో ఉన్న సమస్యే అది. మనం అర్ధరూపాయే ఇద్దాం అనుకున్నాం. వాడూ అర్ధరూపాయే అడిగాడు. అయినా సరే మనం పావలా కోసం అడుగుతాం. అలాంటి పనులు నేను చేస్తున్నట్టయితే నాకిది గుర్తొస్తుంది. నేనెందుకు ఒక రూపాయి కోసం, ఒక డాలరు కోసం, ఎందుకు వెనకాడుతున్నానని. అయితే నేను వెనకడుగు వేస్తున్నాననో, ముందడుగు వేస్తున్నాననో చెప్పటం లేదు. నాకు గుర్తొస్తుందని మాత్రమే చెబుతున్నాను. అలాగే అతను రాసిన ఒక నవల. పేరు నాకు గుర్తు లేదు. మధుబాల అనే పాత్ర ఒకటి ఉంటుంది. ఆ మధుబాల ఎంతో అందమైనది, ఆకర్షణీయమైనది, ఎంతలాగ మనల్ని కదిలించేస్తుందీ అనేది అతని వర్ణన చదివితే తెలుస్తుంది. ఇప్పుడు కూడ ఆ కథ గుర్తు లేదు, ఆ నవల గుర్తు లేదు, కానీ ఆ మధుబాల పాత్ర మాత్రం గుర్తుంది. చాలా ఆకర్షణీయంగా ఆయన ఆమెను వర్ణించాడు. బహుశా పురాతన నటి మధుబాలను దృష్టిలో పెట్టుకుని ఆ పేరు పెట్టాడేమో నాకు తెలీదు. కథేమయింది, నాకర్థం కాలేదు కానీ ఆ పాత్ర మాత్రం, ఆయన వర్ణించిన తీరు మాత్రం బుర్రలో వుండిపోయింది. అప్పుడూ, ఇప్పటికీ కూడ ఉన్నాది.

తర్వాత, ఆరుద్ర గారి గురించి చెప్పి ఆయన శ్రీమతి రామలక్ష్మిగారి గురించి చెప్పకపోవడం కొంచెం బాలన్సింగ్ కాదేమో అన్న దృష్టితో ఆవిడ గురించి చెపుతున్నాను. ఆవిడ ‘పార్వతీ కృష్ణమూర్తి కథలు’ అని కొన్ని కథలు రాసేరు. స్కెచెస్ లాంటివి రాసింది చిన్నప్పుడు ఆవిడ. తెలుగు స్వతంత్రలో పనిచేసే రోజుల్లో రాసిందావిడ. పార్వతీ కృష్ణమూర్తి కథలు కొత్తగా పెళ్ళయిన వాళ్ళ ఇంట్లో వచ్చే సమస్యలు, పిల్లలు పుట్టినపుడు వచ్చే ప్రాబ్లెమ్స్ ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఆవిడ రాసింది. కానీ మొదట్లో రాసిన కథలో ఉన్న అందం, తరవాత రాసిన కథల్లో లేదు. అవెక్కడయినా దొరక గలిస్తే, పుస్తకంగా వస్తే, పాత పుస్తకాల్లో దొరికితే, వీలయితే, చదివితే బావుంటుందని అనుకుంటున్నాను.

మరి ఆ స్వతంత్ర గురించి చెప్పి, 50లలో రాసిన రామలక్ష్మిగారి గురించి చెప్పి, అదే సమయంలో కథలు, స్కెచెస్ రాసినటువంటి, మన పక్కూరిలోనో లేక ఈ ఊర్లోనే ఉంటున్న నిడదవోలు మాలతిగారి గురించి చెప్పకపోవడం బావుండదని అనిపించి చెపుతున్నాను. ఈవిడ రాసిన ఆవారా బుష్ షర్ట్ కుర్రాడో, ఆవారా షర్ట్ కుర్రాడో ఒక కథ ఉంది. ఈవిడ టీనేజెస్‌లో ఉన్నపుడు రాసిన కథ అది. 1953లలో అయి ఉండొచ్చు. ఆవారా వచ్చిన రోజుల్లో. ఆ కథలోని ఆవారా కుర్రాడు నాకు తిరిగి తిరిగి గుర్తొస్తాడు. అది ఆవిడ ఎక్కడైనా తిరిగి వేస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ వేసినట్టు లేదు. కానీ ఆవిడ రాసిన విషయాలు చూస్తుంటే అప్పుడావిడ ఎంత చురుగ్గా ఉండేదీ, ఆవిడ ఉద్దేశాలు, రాయడాలు, ఇవాళ్టికి కూడ ఆవిడలో చురుకుదనం తగ్గలేదేమో అని నాకు అనిపిస్తుంది. నా కంటే మీకే బాగా తెలిసుండాలి. ఎందుకంటే ఆవిడ వెన్నెలలో ఒకసారి వచ్చి మాటాడిందని నా ఉద్దేశం. అందుగురించని మీకు తెలిసుండాలి.

తర్వాత ఇంతమంది గురించి చెప్పేను కాని, మరి విశాఖపట్నం వాడయిన త్రిపుర గురించి చెప్పలేదు. ఆఖరిగా చెపుతున్నాను. ఇందాక త్రిపుర కథలకి పద్మరాజుగారు ముందుమాట రాసేడని చెప్పేను కానీ త్రిపుర గురించి చెప్పలేదు. మొత్తం కథాప్రపంచంలోనే, నాకంటే తక్కువ రాసిన రచయిత త్రిపుర ఒక్కడేనేమో. ఎందుకంటే త్రిపురగారు 13 కథలే రాసేరు. నేను ఆయనకంటే కొద్దిగా ఎక్కువ రాసేను కాబట్టి నేనే కొంచెం బెటర్ అనుకుంటున్నాను నేను. ఆయన మరీ పదమూడే కథలు రాసేడు. కానీ గొప్ప విషయమేమిటంటే, ఆ పదమూడు కథలూ చాలా గొప్పవని అందరూ కీర్తించేరు. మళ్ళీ ఆయన ఎందుకు రాయలేదని ఆయన్ని ఎన్నిసార్లు అడిగినా రాయాలనిపించలేదని మాత్రమే ఆయన చెప్పేరు. ఆ విషయం నాకు నచ్చి, నేను కూడ అలానే రాయాలనిపించట్లేదు అని చెప్పేస్తున్నానీమధ్య. ఎవరైనా ఎందుకు రాయట్లేదంటే, త్రిపురగారు రాయలేదు కదా! నాకూ రాయాలనిపించట్లేదు అని చెప్పేస్తున్నాను ఆయన్ని చూసి. ఆయన కథల్లో రాసినటువంటి అలక్ నిరంజన్ అనే పాత్ర, అలక్ నిరంజన్ అనే శేషాచలపతిరావు అనే పాత్ర ‘పాము’ అనే కథలో రాసింది, అలాగే భగవంతం కోసమని నిరీక్షించే కథ అవి గుర్తొస్తుంటాయి నాకు. భగవంతం పాత్ర, అలక్ నిరంజన్ గుర్తొస్తుంటారు. కానీ, ఇక్కడ వాటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, జీవితంలో జరిగే విషయాలలో ఏ రేషనాలిటీ లేదు, ఒకదానికొకటి సంబంధం లేదు, అసలు ఈ జీవితమే అర్థం లేనిది, ఎలా వెళ్తుందో తెలీదు, పట్టించుకోనక్కరలేదు… ఇలాంటివి చెప్పినటువంటి మనిషాయన. నాక్కూడా అది మెల్లమెల్లగా ఆలోచిస్తుంటే నిజమనిపిస్తుంది. నేను మొదలు పెట్టినపుడు ఒక రకంగా మొదలు పెట్టేను కానీ చివరకి వచ్చేసరికి నాకు అనిపిస్తుందేమిటంటే, నిజమే, ఈ జీవితం చాలా అర్థరహితంగా వున్నాది. అసలెందుకిలాంటి సంఘటనలు జరుగుతాయి, మనకే తెలీటం లేదు అనిపిస్తున్నాది. అందువల్ల ఆయన్ని ఆఖర్న పెట్టేను. ఆఖరుగా మాటాడుతున్నాను.

ఒకటి రెండు లైన్లు చెప్పి ఇక ముగించేస్తాను. ఆ రెండు లైన్లూ ఏమిటంటే, ఇలా ఎంతసేపైనా మాట్లాడుతూ పోవచ్చు. నేను మాట్లాడగలను. మీరు వినగలరో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం మాటాడగలను. కానీ ఈ మనుషులనుంచి మనమేమైనా తెలుసుకోగలమా, నేర్చుకోగలమా, కొంచెమయినా మనని మనం మార్చుకోగలమా, దిద్దుకోగలమా? ఈ రచయితలూ మనతోనే వుంటారు, రచనలూ మన కూడానే వుంటాయి. కనుక కనీసం మన ప్రయాణం సుగమం చేసుకో గలమా అన్నవి ఆలోచించవలసిన విషయాలు.

నాకీ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

థాంక్యూ.

[డా. చిర్రావూరి శ్యామ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) ఆగస్ట్ 2016 సమావేశంలో చేసిన ప్రసంగం పాఠం సంక్షిప్తంగా.]

రచయిత మెడికో శ్యామ్ గురించి: డా. చిర్రావూరి శ్యామ్ ఎం.బి.బి.ఎస్. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలోను, ఎం.డి. (మెడిసిన్) ఢిల్లీ ఎ.ఐ.ఐ.ఎం.ఎలోనూ చేశారు. డాక్టర్‍గా పలు హోదాల్లో ఢిల్లీలో మూడు దశాబ్దాలు పనిచేశారు. యు.ఎస్.లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ (ఎపిడమియాలజీ) మరియు హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ చేశారు. కథా రచయిత. ‘శ్యామ్ యానా’, ‘సరాగమాల’ మెడికో శ్యామ్ కథలుగా వెలువడ్డాయి. కొన్ని కథలు ఇతర భాషల్లోకి (ఇంగ్లీషు, హిందీ) అనువదించబడ్డాయి. ప్రస్తుతం యు.ఎస్.లో వుంటున్నారు. ...