దుఃఖాన్ని ఎప్పుడైనా
కొలిచేవా?
ఘనీభవించిన దుఃఖం,
కల్లోల మధ్యధరా సముద్రం
అగాధపు లోతు
తరిచి చూసేవా?
ఇంతకీ దుఃఖానికి
దేవత ఎవరు?
దాహార్తి నివారణ కోసం
బలి కోరే,
రుధిరపాత్రల నాహ్వానించే
దేవీదేవతల వలె
కన్నీళ్ళు కుండలతో
స్వీకరించే అప్రాచ్య దేవత ఎవరు?
వికలిత మనస్సులను
ఆనందించే మహిమాత్ముడెవరు?
ఏ ప్రార్థనా గీతంతో
కొలవాలి?
అనంత దుఃఖాన్ని
ప్రసాదించినందుకు
ఏ టోపీ దించి
కృతజ్ఞత తెలపాలి?
ప్రీతి కోసం,
ఏ కీర్తన వినిపించాలి ఇప్పుడు,
సైగల్ గొంతులో పాలస్తీనా ఆర్తగీతం?
కృష్ణ గొంతులో
దార్విష్ స్వేచ్ఛాగీతమా?
గొంతులో
ఇరుక్కున్న దుఃఖాన్ని
ఓడిపోయే యుద్ధాన్ని
ఎవరికీ పట్టని
అస్తిత్వాన్ని
ఏ ఇంద్రియానుభవంతో
పాడమంటావు?
దుఃఖాన్ని తరించడమంటే
ఖననానికి చోటు లేకపోవడమా?
మననానికి చోటు ఉండడమా?