గాజు దేహం

తన తనువెల్ల నిరీక్షణలో
నువ్వొక నిలువెత్తు మధుపాత్రవై
నడిచొచ్చినపుడు
తన ఏకాంతం గాయపడుతుంది
రేయి శోకసముద్రమవుతుంది

నీ గాఢ నిద్రలో
తన శ్వాస అక్వేరియం నుండి బయట పడిన
చేప పిల్లవుతుంది.

ఇంక నువ్వు తెల్లవార్లూ
సణుగుతావు చూడూ…
తను నిద్రకు మెలకువకు
నేటికి రేపటికి మధ్య

కాలం శూలానికి
దృశ్యరహిత రక్తమోడుతుంది
తన దేహంలో ఒక్కోబొట్టు గడ్డకడుతూ
గాజు దేహం
ప్రతి రేయీ ఛిద్రమవుతుంది.