వార్ధక్యం

1.

వార్ధక్యం మోటబావిలో నీరు తోడడం లాంటిది. వార్ధక్యం జారుడుబండ లాంటిది కూడా. ఒకసారి జారడం మొదలయితే క్రిందకి దిగజారిపోవడానికి ఎంతోసేపు పట్టదు.

న్యూటన్‌గారికి నమోనమః!

చిన్నప్పుడు, మోటబావిలోనించి నీళ్ళు తోడడం సరదా. ఒక పక్క పగ్గాలతో పెద్ద మేదరిచేద కట్టి రెండోపక్క ఎడ్లకి కాడికట్టి మోటబావుల్లో నీళ్ళు దించేవాళ్ళం. ఇప్పటికీ తెలంగాణా మారుమూల పల్లెల్లో మోటబావులు ఉండేవుంటాయి. చిన్నప్పుడు, కాడిమీద దర్జాగా కూచొని, ఎడ్లని క్రిందకి నచ్చిన స్పీడులో నడిపేవాళ్ళం. అది సరదా! అయితే, ఎడ్లని వెనక్కి నడిపిస్తూ బావి వోరకి తీసుకెళ్ళటానికి జబ్బసత్తువ కావాలి. మోటలాగే ఎడ్లకన్నా ముందు మోటతోలే మనిషి అలిసిపోతాడు. అందుకే అన్నాను, వార్ధక్యం మోటబావిలో నీళ్ళు తోడటం లాంటిదేనని. మూడు మెట్లెక్కి ఆయాసపడ్డట్టు.

ముసలితనంలో తరచుగా మూత్ర విసర్జన చేయటం, ఉచ్చతిత్తిని అదేపనిగా ఖాళీ చెయ్యటం మామూలే. కానీ డబ్బులతిత్తి – వాలెట్ మాత్రం ఎప్పుడూ ఉబ్బే వుంటుంది; డబ్బుతో కాదు. క్రెడిట్‌ కార్డులతోటి, ఇన్సూరన్స్ కార్డులతోటి, మందుల చీటీలతోటి, సేల్‌ కూపాన్‌లతోటి, లూజు పంట్లాం జేబులోంచి పైకి ఉబ్బి కనిపిస్తూ! అనుకోకండా అరిచెయ్యి ప్రతిక్షణం ఆ ఉబ్బు మీదకే పోతుంది.

భయం కావచ్చు. దీనినే అసంకల్ప చర్య అంటారు. అసంకల్ప ప్రతీకార చర్య అనటం సబబేమో!

2.

నేను సంవత్సరంలో తొమ్మిది నెలలు పొడుగాటి చొక్కా పొడుగాటి పంట్లామూ వేసుకుంటాను. ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు చలి వేస్తుంది. ‘I shall wear my bottoms unrolled’ అన్నాడు ఎవరో కవి.

కంటిచూపు తగ్గడం రకరకాల పరిణామాలకి కారణం. చిన్నచిన్న అక్షరాలలో రాసింది సరిగా కనిపించదు; కంటి అద్దాలున్నప్పటికీ. ఏ పేకేజీ అయినా తీసుకోండి; ముఖ్యంగా పప్పులూ ఉప్పులు, కూరగాయలూ అమ్మే గ్రోసరీ కొట్లల్లో వస్తువుల పేకేజీలు, ఎంత పాతవో కనుక్కోవటం బ్రహ్మతరం కూడా కాదు. పోతే డిస్‌క్లెయిమరు అసలు అర్థమయ్యే భాషలో రాయటం ఈ తరం జనానికి చేతకాదనుకుంటాను.

ఇక డ్రైవింగ్ గురించి చెప్పనే చెప్పక్కర్లేదు. దాదాపు అరవై సంవత్సరాలు డ్రైవ్ చేసిన మనిషికి చూపు తగ్గడం గురించి చింతించాల్సిన అవసరం ఏమిటి? అసలు డ్రైవింగ్‌ చెయ్యటమే తక్కువ. ఎప్పుడన్నా చేస్తే, నీ వెనకనున్న ప్రతి కారూ రివ్వున నిన్ను దాటి పక్క లేన్‌‌లోకి పోతుంది; రెడ్ లైట్‌ దగ్గిర ఆగటానికా అన్నట్టు! నీ కారు లైసెన్స్‌ ప్లేట్‌ వెనక ‘వికలాంగుడు’ బొమ్మ చూసి కాబోలు. అక్కరలేని రోజుల్లో వికలాంగుల కోసం రిజర్వు చేసిన పార్కింగ్‌ స్థలాలు కోకొల్లలు కనిపించేవి. అప్పట్లో తెగ తిట్టుకునేవాళ్ళం, ఇక్కడ ఇంతమంది వికలాంగులెక్కడున్నారూ, అని. ఇప్పుడు కావాలన్నా ఆ పార్కింగ్‌ స్థలాలు ఎంత వెతికినా దొరకవు. డాక్టర్ల ఆఫీసుల ముందు అసలే దొరకవు. డాక్టర్ల ఆఫీసుల ముందు, ఒకటో రెండో ఉన్నా అక్కడే కారు ఆపి, కారు లోపల డాష్‌బోర్డ్ మీద వికలాంగుల కార్డు తగిలిస్తారు, యువతీ యువకులు కూడా!

‘జారిపడకండి, ఆయాస పడకండి, జాగ్రత్తగా వ్యాయామం చేయండి’ అంటాడు ప్రతి డాక్టరూ! చెప్పేవాడికి వినేవాడు లోకువ! జారిపడడం అంటే, పొరపాటున అరటిపండు తొక్క మీద కాలేసి గుమ్మం ముందు పడ్డరోజులు గుర్తుకొచ్చాయి. నాకు తెలిసిన డాక్టర్లందరూ, నాకన్నా వేగంగా ‘గూగులీకరించగలర’ని నా అభిప్రాయం. కొత్త కొత్త మందులు ముసలివాళ్ళ మీదే ప్రయోగిస్తారు. ఆ మందులు చచ్చేఖరీదు. ఈ మధ్య ఒక మందుల షాపులో పనిచేసే పెద్దమనిషిని కలిస్తే ఆయన అన్నాడు – సీనియర్లు మందులు కొనుక్కోవటానికి వస్తే, ఆరోజు షాపు వాళ్ళకి పండగేనని! Cash cows are coming అని నవ్వుకుంటారట!

ఈ స్వేచ్ఛాయుత దేశంలో ప్రతి ఒక్కడూ వాడి స్వంత స్క్రిప్ట్‌ రాసుకున్నాడు. తు.చ. తప్పకండా దాన్ని అనుసరిస్తాడు. అయితే సహనం అనేది ఒక గొప్పకళ. అది మాత్రం సాధించలేకపోయాం.

3.

వృద్ధాప్యంలో కొన్ని పాత జ్ఞాపకాలు వెంటాడుతాయి; కొన్ని చక్కటివి; అమ్మాయిల పేర్లు గుర్తుకొస్తాయి. ఎవరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో, ఆ దేవుడికెరుక. బ్లెస్ దెమ్. 1970 నుండి అమ్మాయిల్లో చాలా మార్పులొచ్చాయి. కుర్రకారు మాత్రం మారలేదు. మరీ దిగజారిపోయారు!

మరికొన్ని పాత జ్ఞాపకాలు ఏనాటికీ మరుపురానివి! ఆరోసారో పదహారోసారో చూస్తున్న ‘రోమన్‌ హాలిడే’ లాంటివి. మహాకవిని వోక్స్‌వేగన్‌ బగ్‌లో మేడిసన్‌ తీసుకొని వెళ్ళటం, జీడిమామిడి చెట్లకింద కూచొని మరోకవితో డైలన్‌ థామస్‌‌ని చదవటం, టెన్సింగ్‌ నార్కేకి షేక్‌ హాండ్ ఇవ్వడం, ఇండియా నించి కొత్తగా అమెరికా వచ్చిన ప్రొఫెసర్‌‌గారిని మంగలి షాపుకి తీసికెళ్ళి, తెల్ల అమ్మాయి చేత క్షవరం చేయించటం, ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడితో మస్తుగా స్కాచ్‌ పట్టించడం, వగైరా!

తెల్ల వెంట్రుకలు అగ్లీగా ఉండవు. దువ్వెనకి వంగవు, కొబ్బరినూనె రాస్తే తప్ప.

నేను అందరినీ కొంచెం నమ్ముతాను. కొందరిని కొంచెం ఎక్కువగా నమ్ముతాను; ఆ కొందరు నిజం చెప్పటల్లేదని తెలిసి కూడ, వాళ్ళు చెప్పింది నమ్మాను. ‘నీ మంచితనాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు’ అని నా శ్రేయోభిలాషులు వందలసార్లు చెప్పిన తర్వాత కూడా! I am gullible.

అలాస్కా క్రూజ్‌కి వెళ్ళినప్పుడు, కనీసం మూడుసార్లయినా ఆవు మాంసం (steak) తిన్నాను. బాగానే వుంది. నా శ్రేయోభిలాషులు, ఈ వార్త మా చుట్టాలందరికీ డప్పుకొట్టి, దండోరా వేసి మరీ చెప్పారు! (So what?)

వృద్ధాప్యం ఒక జారే గోడ. నున్నటి గోడ. పిల్లగాళ్ళు తాడు పట్టుకొని, చకచకా ఆ గోడమీద పాకుతారు; జర్రున జారుతారు. నేను చిన్నప్పుడు చెయ్యలేకపోయానే అని అప్పుడప్పుడనిపిస్తుంది; రోడ్డు మీద గడ్డకట్టిన మంచు మీద పాతిక సంవత్సరాల పైచిలుకు రకరకాల కార్లు నడిపాం గద! అది చాలదూ?

4.

ఎన్ని వందల పాటలు టేపుల్లోకి, సి.డి.ల్లోకీ ఎక్కించానో! ఇప్పుడు అవి ఎవరికీ అక్కర్లేదు; వాటిని పారెయ్య బుద్ధి కాదు. సుమారు రెండువందల యెల్.పి. రికార్డులు కొన్నాను. సి.డి.లయితే లెక్కేలేదు. అప్పుడప్పుడు, ఒంటరిగా కూచున్నప్పుడు, బీటిల్స్ వింటాను. డాన్‌ మెక్‌లీన్‌ పాడిన అమెరికన్‌ పై (American Pie) ఎన్ని వందలసార్లు విన్నానో! ఇప్పటి యువజనానికి, ఆ పాటే తెలియక పోవచ్చు. అందుకు తప్పు పట్టటల్లేదు. ఏమీ తోచనప్పుడు, వంటరిగా వున్నప్పుడూ రొదాఁ (Auguste Rodin) వేసిన ఎరాటిక్ వాటర్ కలర్స్ పుస్తకం చూస్తాను. ఆ బొమ్మల పుస్తకం, కాఫీ టేబుల్‌ మీదే పెట్టి ఉంచుతాను.

పిచ్చి కాకపోతే, చదివిన పుస్తకాలు కొనడవేంటి? మతిమరుపు కాబోలు. నా పాత పుస్తకాలలో కుక్క చెవుల్లా మడతపెట్టిన పేజీలు; అక్కడక్కడ పేజీల్లోంచి వెక్కిరిస్తూ చూస్తున్న పసుపురంగు మార్కర్లు. ఎందుకు మడత పెట్టానో ఇప్పుడు గుర్తుండదు – అలాగని చెప్పటానికి మొహమాటం. Really, it is pride, I think! రిటైర్‌ అయింతర్వాత చదువుదామని దాచుకున్న కొత్త పుస్తకాలు – ఇవన్నీ ఆఫీసు గదిలో నాకేసి చూస్తూన్నట్లుంటాయి. ఇక్కడ, ఈ దేశంలో, వానప్రస్థాన్ని గోల్డెన్‌ యియర్స్‌ అంటారు. Golden years! It’s a nice euphemism. అయితే గియితే, అది చిలకలపూడి బంగారం, రోల్డ్ గోల్డ్‌ కావచ్చు.

పాత పుస్తకాల గురించి చెపుతున్నా కదూ! మరిచేపోయా! పాతకాలపు తెలుగు పుస్తకాలయితే మరీ యాతన. వాటికి స్పైను (spine) మీద పుస్తకం పేరు కూడా వుండదు; రచయిత సంగతి సరేసరి! కొన్ని పుస్తకాలకి స్పైను కూడా వుండదు (No pun intended).

‘ఈ వయసులో ఆఫీసు గది, దానికితోడు కొత్త కంప్యూటరూ ఎందుకు?’ అని నేనంటే, మా అబ్బాయి చెప్పాడు, ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్‌ లోనే ఏడవాలిట! నిన్న టైప్‌ చేస్తుంటే తెల్లగా మెరిసిపోతున్న కీబోర్డ్‌లో ప్రశ్నార్థకం ఎక్కడుందో వెతుక్కోవలసి వచ్చింది.

5.

కుటుంబ చరిత్ర గురించి అడిగే కొందరు యువతీ యువకుల ఉత్సుకతకి నవ్వొస్తుంది. ఈ మధ్య కొత్తగా వచ్చిన దంపతులు ఇల్లు కొనుక్కున్నారు. అదేదో వ్రతం అని మమ్మల్ని కూడా పిలిచారు. నా పక్కన కూచున్న అబ్బాయి, ‘మీరు మనవలని చూసుకోడానికి వచ్చారా, సార్‌?’ అని అడిగాడు. నాకు అతని ప్రశ్న సరిగా అర్థం కాలేదు. నేను అవునన్నట్టు తలకాయ వూపాను. పక్కనే కూచున్న మా శ్రీమతి ‘అదేవిటి? అల్లా చెపుతారు?’ అని గదవాయించి మా జాతకం అంతా ఆ అబ్బాయికి చెప్పింది. ఈ వ్రతమేవిటో కాని, ఇవాళ పూర్తయ్యేట్టు లేదు; అందరు దేవుళ్ళకీ పేరుపేరునా సహస్రనామాలు చదువుతున్నారు; అక్కడ వున్న మాలాంటి ముసలివాళ్ళకి ఆకలి. పొట్టలో చిట్టెలకలు పరిగెడుతున్నాయి. పక్కగదిలో బుట్టలో పెట్టిన ఉల్లిపాయ పకోడీలు కనిపించాయి. ఒక అరడజను పకోడీలు తినేసి వచ్చా.

నాకు ఎప్పుడు పడితే అప్పుడు కునుకు వస్తుంది; అది నిద్ర కాదు. వార్ధక్యంలో నిద్రపోవడం క్షమార్హం. అలా కునుకు తీస్తే హాయిగా వుంటుంది. సీనియర్లకి సినిమాలకి, బస్సులకీ తగ్గింపు ఛార్జీలుంటాయి. తెలిసీ, నేను ఇంతవరకూ ఆ పెర్క్‌ వాడుకోలేదు. కారణం: బస్సులో వెళ్ళే అలవాటు లేదు, సినిమా హాలులో తెలుగు సినిమా చూసి రెండు దశాబ్దాలన్నా అయివుంటుంది. ఇప్పటి సినిమాలలో భాష నాకు సరిగా బోధపడదు. పైగా కథానాయికలందరూ హిందీ వాళ్ళట! తెలుగు డబ్బింగు! సున్నకి సున్న; హళ్ళికి హళ్ళి, అన్నట్టు.

గీతలు గీసుకున్న గడ్డం పరవాలేదు. అయినా రోజూ నున్నగా గడ్డం చేసుకోవలసిన అవసరం ఏముంది? ఆ రకంగా ఇప్పటి ఐ.టి. కుర్రాళ్ళే నయం. రకరకాల సైజుల్లో గడ్డాలు పెంచుకుంటున్నారు; బహుశా కోవిడ్-19 మహిమ!

6.

డబ్బులుంటే చాలదు, సమదృష్టి వుండాలి. ఈ రోజుల్లో, ఈ రెండూ వున్న జనం కరువైపోతున్నారు.

పాత రోజులు వృద్ధులకు ఎల్లప్పుడూ మంచి రోజులుగా అనిపిస్తాయని మీరంటారు; నాకు ఎఱికే.

వైరాగ్యంతో విసిగిపోయి, ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ వుంటాం. ప్రస్తుత ప్రపంచపు సాంస్కృతిక రంగంలో మనకు సముచిత స్థానం దొరకదు. నాలుగేళ్ళకోసారి, రాజకీయనాయకులకి మనం గుర్తుకొస్తాం. సాంకేతిక వేగం శాస్త్రీయ దృక్పథాలు ప్రజల మనస్తత్వాన్ని, మంచికో చెడుకో మార్చేస్తున్నాయి. అది తిరోగమనంగా కనిపించవచ్చు.

ప్రజాస్వామ్యం సహనాన్ని కోరుతుంది. వృద్ధులు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెపుతారు. They repeat. మతాలు చీలికలతో చెదిరిపోతున్నాయి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? తమకు తెలుసని భావించే ప్రజలు గుడులు, చర్చులు, వగైరా కట్టారు; కొత్తగా కడుతున్నారు!

స్వర్గం భూమిపైనే ఉంది — ఆ స్వర్గాన్ని ధ్వంసం చెయ్యకండి, అనే జనం నా గురించి ప్రార్థిస్తే సంతోషిస్తాను.