విశాఖదత్తుని ముద్రారాక్షసం

ముద్రారాక్షసం సంస్కృతకావ్యాల్లో అత్యంత విలక్షణమైంది, అద్వితీయమైంది. ఇది కేవలం ఒక రాజకీయ కథనం. ఎత్తులు, పై ఎత్తులు, గూఢచర్యలు, కుటిలతంత్రాలు, కర్కశ కఠోర కృత్యాలు, మోసాలు, చావులు – ఇవే దీన్లో సర్వసాధారణాలు. ఇందులో ప్రేమలు, శృంగారాలకు తావేలేదు. నిజానికి ఇందులో ఒక్క స్త్రీ పాత్ర కూడ లేదు.

ఈ కథకి చాణక్యుడిగా, కౌటిల్యుడిగా పేరుపడ్డ విష్ణుగుప్తుడు నాయకుడు. రాక్షసమంత్రి ప్రతినాయకుడు. మౌర్య చంద్రగుప్తుడు చాణక్య శిష్యుడు, కథలో చాలావరకు నిమిత్తమాత్రుడు. ఈ కథకి చిలవలు పలవలల్లి చాణక్య చంద్రగుప్త అనే తెలుగు సినిమా కూడ తీశారు చాలాకాలం క్రితం.

ఇక్కడ నేనిస్తున్నది మక్కికిమక్కి అనువాదం కాదు. ముఖ్యమైన భాగాలను సరళీకరించి మూలం నాటకరూపంలో వున్నా ఇక్కడ కథారూపంగా ఇచ్చాను. దీనివల్ల కథకి అవసరం లేకున్నా నాటకం కోసం వుండే కొన్ని అంశాల్ని పరిహరించగలిగాను – ఉదాహరణకి పాత్రలు తమలో తాము మాట్లాడుకోవటం, తమ అంతరంగంలో ఉన్న ఆలోచనల్ని ప్రేక్షకుల్తో పంచుకోవటం, అక్కడలేని వారిని ఉద్దేశించి మాట్లాడటం, ప్రకృతిని, పరిసరాల్ని వర్ణించటం లాటివన్నమాట. ఇక్కడ ప్రాధాన్యత కథకి. కథనానికి కాదు. ఇది చదివాక ఇంకా వివరాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగినవారు మూలాన్ని గాని లేక తమకు నచ్చిన అనువాదాన్ని గాని చదువుకోవచ్చు.