కథ చదివిన డాక్టర్‌కాంతా రావు మనసంతా వికలమై పోయింది.
హృదయ విదారకమైన కథ.
మనసును పిండి చేసే కథ.
వరాల అక్షింతలు వేస్తామని వచ్చిన దేవతలంతా ఒక్కసారిగా శాపాల పిడుగులు వర్షిస్తే
మనుషుల్ని రక్షించాల్సిన మానవసమాజం ఆకలితో ఉన్న అడవి మృగమై భక్షించటానికి
కోరలు సాచి మీద పడితే
చుట్టాలు, స్నేహితులు, ఆప్తులు అందరూ పిశాచాలై రక్తం తాగటానికి, పీక్కుతినటానికి
ఉరుకుతుంటే
ఆ పిడుగుల్లో రగిలి,
ఆ కోరల్లో నలిగి,
ఆ దారుణాలకి చితికి
బతికుండగానే చితుల్లో కాలుతున్న
శవాలై బతుకు శ్మశానంలో కదులుతున్న
నిర్భాగ్యపు దారిద్య్రపు నిస్త్రాణపు మనుషుల కథ.
మనుషులమని తెలియని మనుషుల కథ.
మనుషులెలా ఉంటారో ఎప్పుడూ చూడని మనుషుల కథ.
రాసిన వాడు రాక్షసుడు.
పాఠకుల మీద ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని వాడు.
సూటిమాటల తూటాలతో గుండెల్ని పేల్చేసే వాడు.
పదునెక్కిన భావాల బాణాల్తో రక్తాన్ని పీల్చేసేవాడు.
కథను మొదలుపెడితే ఆపనివ్వని వాడు.
కలల్లో కూడా వెంటబడి చీల్చుకు కాల్చుకు తినేవాడు.
కాంతారావుకి
గుండెంతా బరువెక్కిపోయింది.
ఊపిరి తిరగటం కష్టమై పోయింది.
నిద్రంతా నష్టమై పోయింది.
జీవితంలో అప్పటివరకు తను చూసిన, విన్న, అనుభవించిన కష్టాలన్నీ, కన్నీళ్ళన్నీ
ఒక్కసారిగా
వరదల ఏరుగా
దెయ్యాల బారుగా
వచ్చి గుండెల మీద కూర్చున్నాయి.
ఏమిటీ బాధ?
ఎందుకీ వ్యథ?
ఏం తక్కువైంది తనకు?
అన్నీ ఉన్నాయి.
అవసరానికి పదింతలు ఉన్నాయి.
రెండు మూడు తరాలకు సరిపడా ఉన్నాయి.
ఇక్కడ తనని సుఖంగా ఉంచటానికే కాకుండా ఇంకా ఇండియాలోనే ఉన్న చుట్టాల్లో కూడా
ఎందర్నో సుఖంగా ఉంచగలుగుతున్నంత, ఎంతో కాలం అలాగే ఉంచేంత, ఉన్నాయి.
ఐనా
బాధల్లో ఉన్న వాళ్ళను చూసినా, వాళ్ళ గురించి తలుచుకున్నా
ఎక్కడి నుంచొస్తుంది ఇంతటి ఆర్తి? ఖేదం? దుఃఖం?
చిన్ననాటి పేదరికపు అనుభవాల అనుభూతుల నిస్సహాయ ఆక్రోశం లోలోపలే ద్రవిస్తూ
స్రవిస్తూ పెరుగుతూ మరుగుతూ చిన్న చిన్న బాహ్యప్రేరణల స్ఫులింగాలకు హఠాత్తుగా
ఫెఠేల్మని ఎగిసి విరజిమ్మే, పొగలై కమ్మే ఆవిరా ఇది?
అంతకన్నా ఇంకా ముందు ఏవేవో జన్మ పరంపరల సంచితాల లోతు పొరల కదలికల్లోంచి
మహోద్ధృతితో చిమ్మే లావాగ్ని ప్రవాహమా?
కోటానుకోట్ల తరాల జీవుల పరిణామాల వారసత్వాల పుటంలోంచి పునీతమై లేచిన
మానవతా కాంతిపుంజమా?
ఏమైనా తన హృదయం సున్నితమైందని తెలిసి తెలిసి ఇలాటి తెలుగు కథను మొదలుపెట్టటం
ఎందుకు? ఒక వేళ మొదలుపెట్టినా, ఇదో ముష్టి బతుకుల కథని గ్రహించిన వెంటనే
మొదటి పేరాతోనే ఆపకుండా మొత్తం చదవటం ఎందుకు? చదివి
ఈ బాధలన్నీ కొని తెచ్చుకోవటం ఎందుకు? నీ బుర్ర బూజు పట్టిపోయిందోయ్‌కాంతారావ్!
ఇక ఈ రాత్రి ఈ తాపం ఈ శోకం తీరాలంటే
మనసుని ముక్కలు చేస్తున్న ఈ వేదనల రంపం ఆగాలంటే
గుండెను బీటలు కొడుతున్న ఈ పీడకలల సమ్మెటపోట్లు తగ్గాలంటే
కనురెప్పల మీదికి ఎక్కి కూచుని విషాద దృశ్యాల సూదుల్ని పొడుస్తున్న ఈ ఆలోచనల
దెయ్యాల్ని తోలాలంటే
ఒకటే మందు
మందొక్కటే.
లేచి వెళ్ళి స్కాచ్‌విస్కీ ఒక గ్లాసు నిండా పోసుకుని వచ్చాడు.
గడగడా తాగేశాడు.
కొంతసేపటికి
స్పష్టాస్పష్ట దృశ్యాల కలగాపులగపు స్వప్నాల తీరాల్ని దాటాక
ఏదో మత్తు
నిద్ర కాని నిద్ర
అసుప్తి సుషుప్తి.
………………………………………………….
గ్రోసరీ స్టోర్.
చెకవుట్‌లైన్లో నిలబడి ఉన్నాడు కాంతారావు.
సాయంకాలం వేళ కావటంతో లైన్లన్నీ పొడవుగా వున్నాయి, ఆఫీసుల నుంచి ఇళ్ళకు వెళ్తూ
దార్లో ఆగిన వాళ్ళతో నిండి పోయి.
పక్కన ఉన్న పత్రికల మీది సుందర మానినీ దరహాస ముఖచిత్రాల్ని కుతూహలంగా చూస్తూ
లైన్తో పాటు మెల్లగా కదుల్తున్నాడు.
తన ముందు ఇంకా ముగ్గురు.
వస్తువులు కన్వేయర్‌మీద ఉంచి ఒకసారి చుట్టూ చూశాడు.
ఎక్కడ చూసినా మనవాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళలో ఎక్కువభాగం తెలుగు వాళ్ళలాగా
ఉన్నారు కూడా.
ఇరవై ఏళ్ళ నాడు తను వచ్చినప్పటికి, ఇప్పటికి ఎంత తేడా! అప్పుడు మరో ఇండియన్‌కనిపించేది
ఎప్పుడో, ఎక్కడో. అందువల్ల పరిచితులైనా కాకపోయినా కనీసం ఒక చిరునవ్వు, కళ్ళలో
ఒక గుర్తింపు.
ఇప్పుడో తప్పుకుపోవటం, తెలిసినవాళ్ళనైనా గుర్తించకపోవటం.
“అయ్యయ్యో! దేశం నాశనం ఐపోతుంది కదా ఈ నానా జాతుల జనంతో, వీళ్ళ మిడిమేలపు
చెడుగుడులతో!” ఆక్రోశించింది అతని హృదయం.
హఠాత్తుగా ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు కాంతారావు ఏదో జరక్కూడంది జరిగిందనో జరుగుతుందనో జరగబోతోందనో అతని సిక్స్‌త్‌సెన్స్‌హఠాత్తుగా నిశితమైంది.
లైన్లో తన ముందున్న వ్యక్తి
తెల్లవాడే. ఐతే పేదరికంలో ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు. కాంతారావుకి ఇది కొత్త అనుభవం.
పక్కన ఒక ఐదారేళ్ళ పిల్లాడు.
పిల్లాడు చెకౌట్‌పక్కన ఉన్న కేండీ ఏదో కావాలని అడుగుతున్నాడు.
అతను కుదరదు కుదరదని మెల్లగా ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా చెప్పి సముదాయించాలని
చూస్తున్నాడు రెండు ప్రయత్నాల్లోనూ విఫలుడౌతూ.
కాంతారావు దృష్టి వాళ్ళిద్దరి మీదుగా వాళ్ళు కొంటున్న వస్తువుల మీద పడింది.
రెండు అరిటిపళ్ళు, ఒక యాపిల్, ఒక చిన్న ఆరంజ్‌జ్యూస్‌కార్టన్.
ఆ పిల్లవాడి కోసం అయుండాలి.
తండ్రి మరి?
పస్తుంటాడా?
వద్దు, వద్దు, పస్తు అన్న మాట దయచేసి అనొద్దు.
తల్లి లేదేమో!
అయ్యో, అది కూడానా?
బహుశః వీళ్ళని వదిలేసి తన దారి తను చూసుకుని వెళ్ళిపోయిందేమో!
కాదు, కాదు. చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండి ఉంటుంది. అయ్యయ్యో, ఇంకా పిల్లలా!
దేశంలో ఎక్కడ చూసినా ఐశ్వర్యం ఆనందనృత్యం చేస్తున్న ఈ కాలంలో కూడ పిల్లలకు కేండీ
కొనిపెట్టలేని వారు ఉన్నారా? అదీ తెల్లవాళ్ళు?
కాంతారావుకి ఆశ్చర్యం కలిగింది.
చెకర్$1.70 అంది ఆ వ్యక్తితో.
అతను ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకున్నట్లనిపించింది కాంతారావుకి. దైవప్రార్థనా?
ఒక దీర్ఘనిశ్వాసం.
చెమటని వర్షించటానికి సిద్ధంగా ఉన్న ముఖం.
వణుకుతున్న చేతుల్తో చెక్‌బుక్‌బయటికి తీసి చెక్‌రాసి ఇచ్చాడు.
ఆలోచన ఏమీ అవసరం లేకుండానే కాంతారావుకి విషయం అంతా అర్థమై పోయింది. గుండె
ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలయ్యింది.
ఇది తనకో పరీక్ష, సందేహం లేదు!
భగవంతుడా! ఎలాగైనా సరే అతని చెక్‌క్లియర్‌అయ్యేట్లు చెయ్యి. ఇంతకన్న ఎప్పుడూ ఏమీ
కోరను నిన్ను. కావాలంటే నీకు అభిషేకం చేయిస్తాను. ఇప్పుడింక ఆ పిల్లవాడి ఏడుపు, ఆ
తండ్రి దైన్యం నేను చూడలేను గాక చూడలేను! నేను కళ్ళు మూసుకుంటాను. నువ్వే ఏదో చేసెయ్యి.
నన్ను మాత్రం బాధించకు. వేధించకు.
భగవంతుడికి ఆతని ప్రార్థన వినపడిందో లేదో.
వినపడినా దాని మీద నమ్మకం కలిగిందో లేదో.
“ఈ చెక్‌క్లియర్‌కావటం లేదు. దయచేసి కేష్‌గాని, కార్డ్‌గాని ఇవ్వగలరా?” అంటోంది చెకర్.
ఐపోయింది, అంతా ఐపోయింది. అనుకున్నట్లే ఐపోయింది. ఇక నాకు విముక్తి లేదు.
ఆ వ్యక్తి ఏదో గొణిగి వస్తువుల్ని అక్కడే వదిలేసి పిల్లాడి చెయ్యి పట్టుకుని
అవమానంతో, దుఃఖంతో, బాధతో తల దించుకుని కదుల్తుంటే
“డాడీ, డాడీ! నాకు ఆకలిగా ఉంది. ముందు ఇక్కడే ఒక అరిటిపండు తింటాను. మిగిల్నవి
ఇంటికెళ్ళాక” అంటున్నాడా పిల్లాడు అవి తమతో రావటం లేదని ఇంకా గ్రహించక.
కాంతారావుకి హృదయం అంతా కదిలిపోయింది.
ఆ వ్యక్తి స్థానంలో తనున్నట్లు, ఆ పిల్లాడు తన కొడుకైనట్లు అనిపించి బాధ పొర్లుకు
వచ్చింది. బహుశః కళ్ళలోంచి ఒకటి రెండు చుక్కలు రాలాయేమో కూడ.
ఇంక ఆగలేడు తను. ఈ ఘోరాన్ని అరికట్టి తీరతాడు. దేవుడడ్డం వచ్చినా సరే!
“ఆ డబ్బు నేనిస్తాను. ఆ వస్తువులు అతనికే ఇచ్చెయ్యండి” అన్నాడతను చెకర్‌తో.
ఒక్కసారిగా చూస్తున్నవాళ్ళందరూ నిర్ఘాంతపోయి నిలబడ్డారు.
వాళ్ళ కళ్ళలో అతని పట్ల ఆరాధనా భావం!
అందరి ముందు తను హఠాత్తుగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోతున్నాడు ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా.
ఆహా! నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, అందునా అమాయకులైన చిన్న పిల్లలకు సాయం
చెయ్యటంలో తనకు తనే సాటి! వేల డాలర్లు ఖర్చు పెట్టి తన భార్యకు డైమండ్‌నెక్లెస్
కొనిపెట్టినా ఇంత తృప్తి రాలేదే!
కాంతారావ్! నిజంగా నీ జన్మ సఫలం ఐపోయిందోయ్!
శిబి, దధీచి, మాంధాత, కర్ణుల జాబితాలో కాంతారావు కూడా చేరబోతున్నాడోయ్!
దేవతలారా! ఇంకా పుష్పవృష్టి చల్లరేం?
మందమంద మలయానిలాల్తో వీచరేం?
దేవతాంగనా నృత్యగీతాలు కనిపించవేం, వినిపించవేం?
“సర్! $7.72” అన్న చెకర్‌పలకరింపుతో ఈ లోకంలో వచ్చి పడ్డాడు కాంతారావు.
కన్న చిన్న బిడ్డకి ఒక అరిటిపండు కొనిపెట్టి ఆకలి తీర్చలేని తండ్రీ,
ఎందుకు తండ్రి తనకు కావలసిన వస్తువుల్ని స్టోర్‌లోనే వదిలేస్తున్నాడో అర్థం చేసుకోలేని
పాపడు,
ఇద్దరూ అక్కడ లేరు.
వాళ్ళు వదిలేసిన వస్తువుల్ని చెకర్‌తీసి పక్కన పెట్టింది ఎదురుగా కనిపిస్తున్నాయి.
గబగబ తన వస్తువులకు డబ్బు ఇచ్చేసి పరుగున బయటికి వచ్చాడు కాంతారావు.
వాళ్ళింకా ఇక్కడే ఉండి ఉంటారు. ఏం చేస్తున్నారో?
ఇప్పుడైనా మించిపోయింది లేదు. వాళ్ళకి సహాయం చెయ్యాలి.
అరుగో! స్టోర్‌బయట ఒక మూల
తండ్రి దీనంగా కూర్చుని ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుని
ఏడుస్తున్నాడా?
ఇప్పుడు పిల్లాడు తండ్రిని ఓదారుస్తున్నాడు.
పిల్లలకు ఏదో ప్రత్యేకమైన అతీంద్రియానుభూతి శక్తి ఉంటుందేమో ఇలాటి విషయాలు
తెలుసుకోవటానికి!
“నాకేం ఆకలిగా లేదులే డాడీ. ఇంటికెళ్దాం పద” అంటున్నాడు.
కాంతారావ్! ఇప్పటికీ మించిపోయింది లేదు.
నీ జేబులో వంద డాలర్ల పైగా ఉన్నాయి.
బేంక్‌లో వేల కొద్దీ ఉన్నాయి.
స్టాక్‌ల్లో లక్షలున్నాయి. రోజురోజుకూ ఇంకా పెరుగుతున్నాయి.
ఒక్క ఇరవై ఇవ్వలేవా?
వాళ్ళ కోసం కాదు, నీ కోసం. నీ హృదయశాంతి కోసం.
ఔను, ఇస్తాను. ఇరవై ఏం ఖర్మ వందా ఇస్తాను.
కానీ
కానీ
ఏమిటిది?
కాళ్ళు కారు వైపుకు దారి తీస్తున్నాయే!
దేవుడా! నా కాళ్ళను అటు కాదు ఇటు వెళ్ళమను.
నా చేతుల్ని జేబులోకి వెళ్ళి వాలెట్‌తియ్యమను.
అయ్యయ్యో, ఏమిటిది, ఏమిటిది?
మనసు, బుద్ధి, శరీరం అన్నీ కలగా పులగంగా పరస్పర యుద్ధాలు చేసేసుకుంటున్నాయే!
నన్నెవరూ పట్టించుకోరా?
నా మాట వినేవాళ్ళే లేరా?
అయ్యో, ఇంకేం ఉంది? శరీరమే గెలిచింది.
కారెక్కి
తిన్నగా ఇంటికి దారి తీసింది!
ఇల్లు చేరిన కాంతారావుకి తల పగిలిపోతోంది.
హృదయం రగిలిపోతోంది.
తన చేతకాని తనం మీద అసహ్యం.
తన బలహీనత మీద జుగుప్స.
తన మానసిక దౌర్బల్యం మీద కోపం.
తలనొప్పి తగ్గటానికి టైలనాల్‌వేసుకుని
గుండె మంట చల్లారటానికి బీర్‌బాటిల్‌తీసుకుని
టీవీ పెట్టుకుని
తనకిష్టమైన సిట్‌కామ్‌ప్రోగ్రామ్‌రీరన్‌వస్తుంటే చూస్తూ
ఆ ప్రోగ్రాంలో లీనమై పోయాడు
సుకుమార హృదయుడు కాంతారావ్.
…………………………………………………………
అవధాన సభ
కళకళలాడిపోతోంది
కమనీయంగా ఉంది
రమణీయంగా ఉంది
ఐశ్వర్యదేవత ఆలయంలా ఉంది
ఆనందకోలాహలంలా ఉంది
సమయం రసమయంగా ఉంది
సరసమయంగా ఉంది
అవధాని గారు విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ అరమోడ్పు కన్నులతో అలవోకగా సాహితీ
సౌరభాల్ని వెదజల్లుతున్నారు.
రసికశ్రోతలు సంతోష పారవశ్యంలో తేలిపోతున్నారు, తూలిపోతున్నారు.
చిన్ననాటి జ్ఞాపకాల్ని, స్వప్నాల్ని, ఆశల్ని
తలుచుకుని తలుచుకుని మురిసిపోతున్నారు, మైమరచిపోతున్నారు.
అవధానం జయప్రదంగా ముగిసింది.
హృదయాలు తేలిపోతున్నాయి
మనస్సులు మురిసిపోతున్నాయి
చేతులు జేబుల్లోకి వెళుతున్నాయి
చెక్‌ల మీద పెద్దపెద్ద అంకెలు వేస్తున్నాయి
సంతకాలు చేస్తున్నాయి
కాంతారావు కూడా
ఒకసారి చుట్టూ చూశాడు. అందరి ముఖాల్లోను ఆనందం, అనిర్వచనీయమైన వెలుగు, ప్రపంచాన్ని
గెలిచిన తృప్తి.
చెక్‌బుక్‌తీశాడు.
100 అంకె వేశాడు.
ఊహుఁ, బాగా లేదు.
ఇంకో సున్న చేర్చాడు.
గ్రోసరీ స్టోర్‌లో అరిటిపండు కొనుక్కోలేని పిల్లాడు, కథలో కష్టాల కడలిలో చావురాక
ఈదుతున్న నిర్భాగ్య కుటుంబీకులు, తను విన్న, చూసిన బాధల, దుఃఖాల, దైన్యాల,
హైన్యాల, వేదనల జీవితాలు
అందరూ, అన్నీ, కళ్ళముందు కదులుతున్నాయి. రంగుల దృశ్యాలై గిరగిర తిరుగుతున్నాయి.
వాళ్ళందరికోసం తను ఇవ్వాలి.
తన మనశ్శాంతి కోసం ఆనందంగా ఇవ్వాలి.
ఇంకో సున్న చేర్చాడు.
సెహభాష్! బాగుంది.
ఇప్పుడు చాలా బాగుంది.
ఈ అంకె మహా ముచ్చటగా ఉంది.
సంతకం చేస్తుంటే
లోకం అంతా పచ్చగా, చల్లగా, ఆనందమయంగా, ఉల్లాసభరితంగా తోచింది.
ఆ పిల్లాడు, వాడి తండ్రి, ఆ కుటుంబం, ఈ ప్రపంచం
అందరూ హాయిగా నవ్వుతున్నారు; తనని ప్రోత్సహిస్తున్నారు.
సంతోషంగా కదిలిపోతున్నారు కలల్లోంచి, కనుల్లోంచి, మనసులోంచి
ఎగిరిపోతున్నారు, ఆవిరైపోతున్నారు, మాయమైపోతున్నారు.
ఇప్పుడిక పేదరికం లేదు. దుఃఖం లేదు. కష్టాలు లేవు. కన్నీళ్ళు రావు.
ఇంతకన్నా ఏం కావాలి ఎవరికైనా?
కాంతారావ్! కాంతారావ్! సాధించావోయ్! సాధించావ్!
మూడెకరాల స్థలంలో కట్టిస్తున్న దివ్యభవనానికి మూడో అంతస్తు వెయ్యటానికి సరిపడా
చెక్కులు వస్తున్నాయో లేదోనని అవధాని గారు ఆక్రోశిస్తూ ఉండొచ్చు గాక!
కేవలం ఆరు వారాల నగలతోనే ఎలాగో కష్టపడి ఇంక సరిపుచ్చుకోనక్కరలేదని, ఏడో వారం
నగలకు సరిపడా చెక్కులు వస్తున్నాయని ఆయన అర్థాంగి గారు ఆనందిస్తూ ఉండొచ్చు గాక!
ఇస్తున్న కాంతారావు మనస్సు నిర్మలం కాదా?
కాంతారావు హృదయం ప్రశాంతంగా లేదా?
కాంతారావు జీవితం నిశ్చలం, ఔనా?
అంతకన్నా ఏం కావాలి?
సాష్టాంగదండప్రణామాలు ఉద్ధృతంగా సాగిపోతున్నాయి
అవధాని గారి ఆశీర్వచనాలు ఉఛ్ఛస్వరంతో రేగిపోతున్నాయి
దాతల చేతుల్లోంచి చెక్కులు అవధాని గారి హుండీ లోకి మూగిపోతున్నాయి
ఈ రోజు రాత్రి కాంతారావు హాయిగా నిద్రపోతాడు.
తనకు ఈ అదృష్టాన్ని ప్రసాదించిన అవధాని గారికి సర్వదా కృతజ్ఞుడై ఉంటాడు.
కొంతకాలం పాటు కాంతారావు ప్రపంచంలో దుఃఖం, దైన్యం, కష్టం, బాధ అడుగుపెట్టవు.
అటుకేసి కన్న్తైతెనా చూడవు.
కేవలం తృప్తి
కేవలం శాంతి
ధన్యుడివోయ్‌కాంతారావ్!
అదృష్టవంతుడివోయ్!