చిత్ర కవిత్వం ఒక చిరుపరిచయం

ఒక పద్యంలో ఉండే అక్షరాలు, పదాలు, వాటి అమరికల గురించి అసాధారణమైన షరతులకు లోబడి రాసే, లేదా చెప్పే, పద్యాన్ని చిత్రకవిత గా నిర్వచించొచ్చు. ఉదాహరణకి, అష్టావధాన ప్రక్రియలో దత్తపది, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం పద్యాలు చిత్రకవిత కిందికి వస్తయ్‌ (అవధానులు ఈ మాటకి ఒప్పుకోకపోయినా). ఎందుకంటే, దత్తపదిలో పృఛ్ఛకుడు ఇచ్చిన పదాలు ఆ పద్యంలో వచ్చి తీరాలి; న్యస్తాక్షరిలో అక్షరాలూ, వాటి స్థానాలూ నిర్దేశించిన విధంగా ఉండితీరాలి; నిషిద్ధాక్షరిలో పృఛ్ఛకుడు నిషేధించిన అక్షరాల్ని వాడటానికి లేదు; సమస్యాపూరణానికి పృఛ్ఛకుడిచ్చిన పాదాలో, పాదభాగమో ఎలా ఇచ్చారో అలా పూర్తి పద్యంలో వచ్చి తీరాలి (పృఛ్ఛకుడు ఎక్కడ రావాలని కోరితే అక్కడ, పద్యం చివర్లోనే కానక్కర్లేదు).

అచ్చతెలుగులో రాసే పద్యాలు, ఒకే అక్షరంతో, రెండక్షరాల్తో, మూడక్షరాల్తో రాసే పద్యాలు ఇవన్నీ కూడ చిత్రకవిత్వం కిందికే వస్తయ్‌. ఇవి కాక ఇంకెన్నో రకాలైన చిత్రకవితా ప్రక్రియలు ఉన్నయ్‌ మనకి. ఇంత విస్తృతంగా ఉన్న ఈ చిత్రకవితా ప్రక్రియని కొన్ని ఉదాహరణల్తో పరిచయం చెయ్యటం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

సంస్కృతంలో చిత్రకవిత్వం ఎప్పట్నుంచో ఉంది. అలాగే తమిళ, కన్నడ భాషల్లో కూడా తెలుగు కన్నా ముందుగానే చిత్రకవిత్వం వచ్చింది. ఐతే తెలుగు కవులు చిత్రకవిత్వంలో చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చెయ్యలేదు. అలా, సంస్కృతాన్ని తలదన్నిన తెలుగు కవితా మార్గాల్లో చిత్రకవిత్వం చెప్పుకోదగింది.

బహుశః మనకున్న తొలి చిత్రకవి శాపానుగ్రహ సమర్థుడై కవిరాక్షసుడిగా పేరు తెచ్చుకున్న వేములవాడ భీమకవి. ఇతను నన్నయ కాలానికి కొంచెం ముందు వాడై ఉండొచ్చు. ఇతని ఒక పద్యం

హయమది సీత; పోతవసుధాధిపు డారయ రావణుండు; ని
శ్చయముగ నేను రాఘవుడ; సహ్యజ వారిధి; మారు డంజనా
ప్రియతనయుండు; లచ్చన విభీషణు; డా గుడిమెట్ట లంక; నా
జయమును పోతరక్కసుని చావును ఏడవ నాడు చూడుడీ!

తనకు సన్మానం చెయ్యకపోగా తనెక్కి వెళ్ళిన గుర్రాన్ని కూడా లాగేసుకున్న ఈ పోతరాజెవరో మనకు తెలీదు గాని అంతటి కోపం లోనూ చాలా చక్కటి పద్యం చెప్పి మరీ తిట్టేడు కవిరాక్షసుడు. ఈ పద్యం “హ” తో మొదలు పెట్టి తిట్టటం వల్ల అతను “హతు”డయ్యాడని కొందరు ఛందోవిశేషజ్ఞులు వివరిస్తారు.

మనకు తెలిసినంత వరకు తెలుగు కావ్యాల్లో చిత్రకవిత్వం తొలిసారిగా కన్పించేది నన్నెచోడుని “కుమారసంభవం” లో. ఇతను కూడ నన్నయ కాలానికి చాలా దగ్గరి వాడు. ఇతను నాగభూషణుడైన శివుణ్ణి ఒక నాగబంధ పద్యంలో స్తుతిస్తాడు; అంటే, కొన్ని చుట్టలు చుట్టుకున్న ఒక పాము బొమ్మ గీసి ఆ పాము శరీరం మీద అడ్డగళ్ళు పెట్టి ఒక్కో గళ్ళో ఒకో అక్షరం రాస్తారు; ఆ పాము తల నుంచి తోక వరకు వరసగా చదువుకుంటూ వెళ్తే పద్యం వస్తుంది (సాంకేతిక కారణాల వల్ల ఆ బొమ్మల్ని ఇక్కడ చూపటం సాధ్యం కావటం లేదు). అలాగే చక్రధరుడైన విష్ణువుని ఒక చక్రబంధ పద్యంతో స్తుతిస్తాడు నన్నెచోడుడు. మరొక విశేషమైన పద్యంలో, “భక్తుడి శరీరంలో భగవంతుడు ఉంటాడు” అని చెప్తూ దానికి ఒక కందగర్భ చంపకమాల ని వాడాడు (అంటే చంపకమాల పద్యంలో ఓ కందం కూడా ఇమిడి ఉంటుందన్న మాట!). ఆ పద్యం ఇది

హరు మనమార గొల్చు; డరుదాతని గొల్చయు నాది బోడగా
బొరియునె భూరి భోగ పుర భూతి విభుత్వము పొంది పేర్మితోన్‌
పరజన దారుణోగ్ర శరపాత నియుక్త పదంబు నందు తా
బొరయడు వారకోర్చి పొరి భూతగణేశ్వరు పొందు నాత్మలోన్‌

ఇది చంపకమాల (మర్చిపోయినవాళ్ళ కోసం న జ భ జ జ జ ర; తొమ్మిదో అక్షరం యతి); దీన్లో ఉన్న కందం ఇది

మనమార గొల్చు డరుదా
తని గొల్చయు నాది బోడగా బొరియునె భూ
జన దారుణోగ్ర శర పా
తనియుక్త పదంబు నందు తా బొరయడు వా!

భారతంలో ఎక్కడా చిత్రకవిత్వం వాడలేదు(ట).
భాగవతంలో పోతన గారు కొన్ని సర్వలఘు కందాల్ని రాశారు. వాటిలో గజేంద్రమోక్షణ ఘట్టంలో విష్ణువు ఏనుగుని రక్షించటానికి వెళ్ళేప్పుడు అతని వెనకే వెళ్తున్న లక్ష్మీదేవి మానసిక స్థితిని వర్ణించే “అడిగెద నని కడువడి జను..” అనే పద్యం ఆ సందర్భానికి అద్భుతంగా అతికింది.

15వ శతాబ్దం వాడైన భైరవకవి “శ్రీరంగ మహాత్మ్యం” లో చిత్రసేనుడనే గంధర్వుడు శాపం వల్ల శక్తులన్నీ పోగొట్టుకుని అల్పుడై పోయి శివుణ్ణి ఒక సర్వలఘుకందంలో స్తుతిస్తాడు. శక్తులన్నీ పోయి ఎంతో లఘవు (చులకన) అయ్యాడు కనక అతని ఆ స్థితిని సూచించటానికి అతి చిన్న పద్యమైన కందాన్ని, అందులోనూ దాదాపు అన్నీ లఘువులున్న దాన్ని, ఎన్నుకోవటం చాలా సందర్భోచితం.

అన్నట్టు, చులకన కావటం విషయం వచ్చింది గనక తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి దానికి చిత్రకవిత్వంతో సంబంధం లేకపోయినా. ఉత్తరగోగ్రహణ సందర్భంలో అంతఃపుర కాంతల ముందు ప్రగల్భాలు పలికి కురుసైన్యం మీదికి యుద్ధానికి వెళ్ళిన ఉత్తరుడు సముద్రంలా ఎదట ఉన్న ఆ సైన్యాన్ని చూసి అనే మాటలివి

భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు; దుర్యోధన
గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు; శస్త్రాస్త్ర జా
లోష్మ స్ఫార చతుర్విధోజ్వ్జల బలాత్యుగ్రం; బుదగ్ర ధ్వజా
ర్చిష్మత్వాకలితంబు; సైన్య మిది; ఏ జేరంగ శక్తుండనే!

దీన్లో కురు సైన్యాన్ని నాలుగు భీకరమైన సమాసాల్తో మన కళ్ళ ఎదుట చూపించిన ఉత్తరుడు చివరికి తన గురించి చెప్పుకునే సరికి వాడిన పదం “ఏన్‌” అనేది అంటే, “నేను” అని అనుకోటానిక్కూడా అతనికి ధైర్యం చాల్లేదన్న మాట! అన్నిట్లోకి తేలికైన “ఏన్‌” ని మించలేకపోయాడు. పద్యశిల్పానికి పరాకాష్ట ఇలాటి ప్రయోగాలు.

మొత్తం మీద 16వ శతాబ్దం వరకు చిత్రకవిత్వాన్ని కావ్యాల్లో వాడినా, అది చెదురుమదురుగా, కేవలం ఒక సందర్భానికి అవసరం అనుకుంటే తప్ప, వాడలేదు. ఆ తర్వాత మాత్రం, “చిత్రకవిత్వం కోసమే చిత్రకవిత్వం” అన్నట్టుగా విజృంభించారు మన కవులు. అప్పుడే పింగళి సూరన “రాఘవపాండవీయం” అనే ద్వ్యర్థి కావ్యం రాశాడు. అంటే ప్రతి పద్యం లోనూ రామాయణానికి సంబంధించిన అర్థం ఒకటి, భారతానికి సంబంధించిన అర్థం మరోటి ఉంటాయన్న మాట. అతన్ని చూసి “నేనేం తక్కువ తిన్లే”దంటూ భట్టుమూర్తి “హరిశ్చంద్రనలోపాఖ్యానం” రాశాడు హరిశ్చంద్రుడి కథనీ నలచరిత్రనీ కలిపి ముడేస్తూ. ఇంక ఆ తర్వాత ఎన్నో వచ్చాయి ఇలాటి రెండర్థాలు, మూడర్థాలు, నాలుగర్థాల కావ్యాలు. వీటన్నిట్లో “రాఘవపాండవీయం” ఒక్కటే మామూలు మనుషులకి కొంతైనా కొరుకుడు పడేది.

ఐతే పింగళి సూరన ” కళాపూర్ణోదయం” లో చేసిన ప్రయోగాలు సందర్భానుకూలంగా ఉండి కొంతవరకు ఉల్లాసాన్ని కలిగించగలవ్‌. నలుగురు కవులు ఓ రాజుని చూట్టానికి వెళ్తే ఒక మంత్రి వాళ్ళకి అడ్డు తగుల్తుంటాడు. ఇలా కాదని వాళ్ళు పల్లెటూరి వాళ్ళ వేషాల్లో ఆ రాజు దగ్గరికెళ్ళి ఓ పద్యం చెప్తారు

మాయమ్మాన సు నీవే
రాయలవై కావ దేవరా జేజేజే
మాయాతుమ లానిన యది
పాయక సంతోసమున్న ఫల మిలసామీ

చదువేమీ రాని వాళ్ళ మాటల్లా అనిపించే ఈ పద్యం నిజానికి తెలుగు పద్యం గానూ, సంస్కృత శ్లోకం గానూ కూడా చదువుకోవచ్చు. ముందుగా, తెలుగు పద్యానికి అన్వయం ఇది దేవరా, జేజేజే, ఇలసామీ (భూమిని పాలించే వాడా), నీవే రాయలవై కావ, సంతోసము, పాయక (విడవకుండా), మాయాతుమలు (మా ఆత్మలు), ఆనినయది (తాకింది), ఉన్నఫలము, మాయమ్మ, ఆన, సు!

ఇదే పద్యం సంస్కృతంలో ఐతే హే, సునీవే (శుభప్రదమైన మూలధనము కలవాడా), ఆయమ్‌ (రాబడిని), మామాన (లెక్కపెట్టుకో వద్దు), అలవా (ముక్కలు కాని), రాః (ధనము), ఏకైవ (ఒక్కటే), అవత్‌ (కష్టాల్లో రక్షించేది);  అజేజే (యజ్ఞం చేసే), రాజే (రాజు కోసం), మా (లక్ష్మి), ఆయాతు (వస్తుంది), మలాని న (పాపాలు అంటవు); పాయక (ఓ రక్షకుడా), సః (మంచివాళ్ళు), యది (దర్శనానికొస్తే), అసముత్‌ (సంతోషం లేకుండా), నఫల (వాళ్ళని చూడకుండా ఉండొద్దు), మిల (వాళ్ళతో కలువు), అమీ (వచ్చిన మేము), సా (ఆ లక్ష్మీ దేవే అనుకో) ఇంత వ్యవహారం ఉంది ఆ చిన్ని కందంలో!

అదే సందర్భంలో మరో వింతైన పద్యం

తా వినువారికి సరవిగ
భావనతో నానునతి విభా వసుతేజా
దేవర గౌరవ మహిమన
మా వలసిన కవిత మరిగి మాకు నధీశా

దీన్ని తిరగేస్తే ఓ సంస్కృత శ్లోకం ఔతుంది!

శాధీనకు మా గిరి మత
వికనసి లవమాన మహిమ వర గౌరవ దే
జాతే సువ భావి తినను
నాతో నవభాగ విరస కిరివానువితా

వీటికిక్కడ అర్థాలు చెప్పటం లేదు. ఉత్సాహం ఉన్న వాళ్ళు కళాపూర్ణోదయం చూస్తే దాన్లో పింగళి సూరనే పై రెండు పద్యాల విచిత్రాల్నీ వివరిస్తాడు.

ఆ కాలంలోనే తెనాలి అన్నయ్య “సుదక్షిణా పరిణయం” లో ఒక నత్తి పాత్ర చేత ఇలా అనిపిస్తాడు

“తతత తామరసాక్షి తలపంతమాడకు
వివివి వీణాకంఠ వీణ తెమ్ము…”

పింగళి సూరన కూడ “ప్రభావతీప్రద్యుమ్నం” లో ప్రభావతి గురించి పరధ్యానంలో ఉన్న ప్రద్యుమ్నుడి చేత ఓ లేఖ రాయిస్తూ, అందులో, “ప్రప్రభాభావతి పలుతెరంగుల నీవు..” అంటాడు.

ఇలాటి “పాత్రోచిత సంభాషణ”ల్ని, మానసిక స్థితిని చూపించే భాషణాల్నీ కూడ చిత్రకవిత్వం కిందే లెక్కేశారు మనవాళ్ళు.

చిత్రకవిత్వానికి స్వర్ణయుగం 1718 శతాబ్దాలు. “ఉషాపరిణయం” లో దామెరల అంకన్న ఒక కందపద్యంలో 108 కందాల్ని బంధించాడు. అంటే, ఏ అక్షరం దగ్గర మొదలై ముందుకు వెళ్ళినా, వెనక్కి వెళ్ళినా ఓ కందం వస్తుందన్న మాట.
అలాగే, గణపవరపు వేంకటకవి “ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం” అనే కావ్యం రాశాడు. దీన్లో ఇతను చెయ్యని చిత్రకవితా ప్రదర్శనం లేదు. వెయ్యి పైగా పద్యాల్ని ఇముడ్చుకున్న ఓ సీసం కూడా ఉన్నదిందులో!
ఆ తర్వాత ఇంకా ఎన్నో చిత్రకవితా విశేషాల్తో కావ్యాలొచ్చాయి. ఉదాహరణకి రావిపాటి లక్ష్మీనారాయణ “భారతగర్భ రామాయణం” లో పద్యాలు రామాయణార్థంలో ఉంటే ప్రతి పద్యంలోను ఇమిడి ఉన్న మరో పద్యం భారతార్థాన్నిస్తుంది!

ఇలా ఎన్నో రకాల చిత్ర విచిత్ర పాండిత్య విన్యాసాలు సాగేయి మన చిత్రకవిత్వం లో. వందల కొద్ది చిత్రాలు గీసుకుని వాటిలో పట్టే పద్యాల్ని తయారు చేశారు అసలు నిజమైన చిత్రకవిత ఇదేనంటారు కొందరు. ఈ ప్రక్రియలో కవి కంట బడ్డ ఏ వస్తువైనా చిత్రకవితకి అర్హమే! గుళ్ళు, గోపురాలు, రథాలు, చక్రాలు, ఖడ్గాలు, ఛురికలు, చెట్లు, సర్పాలు, గోవులు (గోమూత్రం కూడా), కోతులు, ఇంకా ఎన్నెన్నో ఆకారాలు చిత్రకవిత్వానికి పనికొచ్చినయ్‌.

గర్భకవిత్వంలో సీసపద్యంలో రకరకాల యితర ఛందాల్ని బంధించటం, చంపకమాల, ఉత్పలమాలల్లో కందాల్నీ గీతాల్నీ ఇరికించటం, ఇలా ఎన్నెన్నో ప్రయోగాలు జరిగేయి.

గూఢకవిత్వం అని మరో శాఖ ఉంది. ప్రతిపాదం మొదటి అక్షరాల్ని కలిపితే ఏదో విశేషమైన పదం రావటం ఇలాటిది (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం లో ఓ సీస పద్యం మొదటి అక్షరాలు “వేంకటేశ్వర విలాసం” ఐతే, అదే పద్యంలో పాదాల చివరి అక్షరాలు “వేంకటకవి” ఇస్తయ్‌). ఇంకొందరి పద్యాల్లో మొదటి మూడు పాదాల్లో అక్కడక్కడ ఉన్న పదాల్ని కలిపితే నాలుగో పాదం వస్తుంది. సరి అక్షరాల్ని ఓ చోట పెడితే ఓ పాదం (లేదా పాదభాగం), బేసి అక్షరాల్తో మరో పాదం (లేక భాగం) రప్పించటం మరో పద్ధతి. ఇలా ఎన్నో రకాలైన గూఢకవితా చమత్కారాలున్నయ్‌.

పొడుపు కథలు, ప్రహేళికలు, దుష్కరమైన చాటుపద్యాలు ఇలా ఇంకెన్నో చిత్రకవితా ప్రక్రియలున్నయ్‌. తెనాలి రామలింగడి “మేక తోకకు మేక తోక మేకకు తోక..” పద్యం అందరికీ తెలిసిందే. ఐతే, ఇది మేకల గురించిన పద్యం కాదనీ, దీన్లో చాలా అర్థం ఉందనీ, దాన్ని సాధించటానికి జీవితకాలాలు గడిపిన వాళ్ళున్నారు (అలాటి అర్థం ఎవరో సాధించారట; కాని అదేమిటో ఎక్కడా ఎవరూ రాసినట్టు లేరు).

“రాజ నందన రాజ రాజస్పతులు సాటి
తలప నన్నయ వేమ ధరణిపతికి
భవభవ భోగ సత్కళాభావములను
భావభవభోగ సత్కళాభావములను”
అనే పద్యం తెనాలి రామకృష్ణ సినిమా చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. ఇది కూడా ఒక “అర్థం చెప్పుకోండి చూదాం!” పద్యమే.

ఇప్పుడు పజిల్స్‌ సాధించటానికి మనం ఉత్సాహం చూపిస్తున్నట్టు అప్పట్లో యిలాటి చిత్రపద్యాల్ని ఛేదించటానికి ఉరకలు వాళ్ళేమో, బహుశా!

వచనకవిత్వంలో చిత్రకవిత్వం?

తొలితరం తెలుగు వచన కవులు కొందరు చిత్రకవితా ప్రయోగాలు కూడ చేశారు. శ్రీశ్రీ “నేత్రయతి” చమత్కారాలు, నారాయణబాబు, మల్లారెడ్డి లాటి వాళ్ళు చేసిన గారడీలు కొత్తరకం వి ఐతే, పఠాభి, ఆరుద్ర ఛందోబద్ధ పద్య పాదాల్ని వచనకవిత్వంలో దాచి గర్భకవిత్వాలు, గూఢకవిత్వాలు రాశారు. ఉదాహరణకి పఠాభి “ఫిడేల్‌ రాగాల డజన్‌” లో ఒకచోట

“పయ్యంట తడిసి, కండ్లకు
పండుగ జేస్తున్నవి దాని
రసాల్మామిడి పండ్ల లాంటి పాలిండ్లు.
ఇలాతలమంతా మహా సంతోషంతో
పచ్చంగా నవ్వుచున్నది,
గగనం మట్టుకు ఏడుస్తున్నది.”

దీన్ని కొంచెం సవరించి ఇలా రాయొచ్చు

పయ్యంట తడిసి, కండ్లకు
పండుగ జేస్తున్న దాని పాలిండ్లు. ఇలా
తలమంత మహా సంతో
షంతో పచ్చంగ నవ్వుచున్నది, గగనం

ఇది యతిప్రాసలు లేని కందం!

ఈ వ్యాసం ముగించేలోగా ఈనాటి అసలైన చిత్రకవుల గురించి ప్రస్తావించి తీరాలి వీరు మన చలనచిత్రకవులు! వీళ్ళు చేసే “బాణీబద్ధంగా” మాటలు మూట కట్టే పని ఛందోబద్ధంగా పద్యం చెప్పటం కంటే ఎంతో కష్టం. ఛందస్సులో “బాణీలు” ఎప్పట్నుంచో ఉన్నవి, ముందుగా సాధన చేసి అలవాటు చేసుకోగలిగినవి. అదే చలనచిత్ర కవితా మార్గాలైతే ఎప్పటికప్పుడు కొత్తవి. వీటిలో కూడ ఎన్నో ప్రయోగాలు చేసిన వాడు వేటూరి సుందరరామమూర్తి. సంప్రదాయ సాహిత్యంతో ఎంతో పరిచయం ఉన్న వేటూరి చేసిన ఒక గూఢకవిత్వ ప్రయోగం “శంకరాభరణం” కోసం రాసిన “ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణము” అనే గీతంలో, “రసికుల కనురాగమై, రసగంగలో తానమై, పల్లవించు సామవేద మంత్రము” అనే భాగంలో “రాగం, తానం, పల్లవి” అనే పదాల్ని దాచటం. ఈ మూడు పదాలు మరో పాట పల్లవికి తొలి పాదంగా మారినయ్‌. సినిమా పాటల్లో కూడ వీలైనంత వరకు యతిప్రాసల్ని పాటించే ఈయన రచనల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంకా ఎన్నో చిత్రకవితా విశేషాలు దొరికే అవకాశం ఉంది.

ఉపసంహారం.

చిత్రకవిత్వం పొదుపుగా, సందర్భోచితంగా వాడితే ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఐతే మరీ విచ్చలవిడిగా దాన్నో “పాండిత్యపరీక్షా కవిత్వం” కింది మార్చటం వల్లనే ఆదరణ తగ్గటమే కాకుండా నిరాదరణ కూడ పెరిగి దాన్ని కవిత్వానికి వేసిన వెర్రితలగా భావించే పరిస్థితి కలిగింది. ప్రస్తుతానికి అవధాన ప్రక్రియ లోనే ఛందో బద్ధమైన చిత్రకవిత్వం మిగిలింది. అవధానుల చిత్రకవితా విన్యాసాల పిల్లకాలవల్ని చూసి విస్మితులయ్యే వారు కొంచెం ఓపిక చేసుకుని చదివితే చమత్కార సాగరాలు ఎన్నెన్నో మన సంప్రదాయ చిత్రకవిత్వంలో దొరుకుతయ్‌.

కవితా రూపాన్ని బట్టి చిత్రకవితా లక్షణం కూడ మారుతుంటుంది, మౌలికమైన కీలకాలు ఒకే రకంగా ఉన్నా. ఉదాహరణకి, ఛందోబద్ధ పద్యాల్లో రాసినా, వచనకవితల్లో రాసినా గూఢకవిత్వం గూఢకవిత్వమే! బంధ వచనకవిత్వం రాయటం బంధ పద్యకవిత్వానికన్న తేలిక. కాని కవిత్వం సమాజానికో కనీసం ఓ వర్గానికో ప్రాతినిథ్యం వహించాలనే గమ్యంతో వెళ్తున్న వచనకవిత్వ ప్రక్రియలో యిలాటి బంధాలకి స్థానం ఉంటుందనుకోను. గర్భకవిత్వం విషయంలో ఇలాటి అభ్యంతరం ఉండకూడదు మరి. ఐతే, ఆరుద్ర తర్వాత గర్భకవితా ప్రయోగాలు చేసినవాళ్ళు నాకు కనిపించలేదు. గూఢకవిత్వం మాత్రం చెదురుమదురుగా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది, ఆ కవులు కావాలని అలా రాసేరో లేదో చెప్పలేం కాని.

సందర్భానికి తగ్గట్టుగా మితంగా వాడే చిత్రకవితా ప్రయోగాలు ఆ కవిత్వానికి అలంకారాలని నా భావన. ఒక కవి దగ్గర ఉండే శిల్పీకరణ పరికరాల్లో చిత్రకవితాతత్వం ఉండదగిందే, అప్పుడప్పుడు వాడదగిందే. ఈ విషయాన్ని తొలి తరం వచనకవులు గుర్తించినంతగా తర్వాత తరాల వాళ్ళు గుర్తించినట్టు లేరు. బహుశా తొలితరం వాళ్ళకి సంప్రదాయ పద్యకవిత్వం తో ప్రగాఢమైన పరిచయం ఉండటం, తర్వాతి వాళ్ళకి అది లేకపోవటం దీనికి ముఖ్యకారణమేమో!

నా మట్టుకు నేను వచన కవిత్వంలో కూడ చిత్రకవిత్వం కావాలంటాను.
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
నవంబర్‌ 5, 2000.

ఈ వ్యాసం చదివిన శ్రీ వెల్చేరు నారాయణరావు గారు బెర్లిన్‌, జర్మనీ నించి ఫోన్‌ చేసి ఒక
విషయంలో అభ్యంతరం వెలిబుచ్చారు. ముఖ్యమైన విషయం కనుక దాన్నిప్పుడు
మీముందుంచుతున్నాను. ఇవి నేరుగా వారి మాటలు కావు. నాకు అర్థమైన విధంగా ఆయన అభిప్రాయాలు.

ఈ వ్యాసంలో “చిత్రకవిత్వం” కవిత్వానికి వేసిన ఒక వెర్రితలగా భావించబడిందన్నాను. శ్రీ వెల్చేరు గారి అభిప్రాయం ఆ భావన చాలా ఇటీవలిదని. ఉదాహరణకు, కందుకూరి వీరేశలింగం గారు “నిరోష్య్ఠ నిర్వచన” కావ్యాలు రాసారు. అంటే అప్పటి వరకు చిత్రకవిత్వం మీద తిరస్కారభావం లేదన్నమాట. బహుశ మొట్టమొదటిగా ప్రబంధాల్నీ పాండిత్యప్రదర్శకాలైన విద్యల్నీ బహిరంగంగా ఆక్షేపించింది కట్టమంచి రామలింగారెడ్డి గారేమో. అప్పట్నుంచి ఇలాటి భావాలు ప్రచారంలోకి వచ్చాయి. భావ, అభ్యుదయ కవిత్వ ఉద్యమాలు కూడ ఈ భావాల్ని బలపరిచాయి.

19 వ శతాబ్దం చివరివరకు చిత్రకవిత్వానికి ఆదరణ ఉంది. పింగళి సూరనతో మొదలై భాషకు ఒక గొప్ప శక్తి ఉన్నదని, భాషతోనే వేరే ప్రపంచాల్ని నిర్మించొచ్చని కవులు భావించటం కనిపిస్తుంది. అది సాహిత్యంలో ఒక పరిణామదశ. అందుకే కవినని ధైర్యంగా చెప్పుకోగలిగిన ప్రతివాడు తన భాషాపాండిత్యాన్ని, ప్రాగల్భ్యాన్ని ప్రదర్శిస్తూ చిత్రకవిత్వాలు రాసాడు. భట్టుమూర్తి వసుచరిత్రకి గొప్ప ప్రఖ్యాతి వచ్చింది భాష మూలానే కదా!

అప్పట్లో కవులకెలాగైతే గొప్ప పాండిత్యం ఉండటం అవసరమో, పాఠకులకు కూడా ఎన్నో అర్హతలు కావలసి వచ్చాయి. కవులు, వాళ్ళ కవిత్వాన్ని అర్థం చేసుకోగలిగిన పాఠకులు భాషతో కొత్తప్రపంచాల్ని సృష్టించుకున్నారు.

కనుక చిత్రకవిత్వం మీద నిరాదరణకి ముఖ్య కారణం పాఠకులు మారటం, వాళ్ళకు పాండిత్యం లేకపోవటం, కొందరు పెద్దలమనుకున్న వాళ్ళు వాళ్ళని పెడదారి పట్టించటం. బహుశా ఇది కూడ తెలుగు సాహిత్య పరిణామంలో మరో దశ. గత వంద ఏళ్ళుగా మాత్రమే కలిగిందిది.