జ్ఞాపిక

గుర్తుందా?!
మనం ఒక్కటై ఉండక ముందు
మన ఉంగరాలు దండల్లా మారకముందు
మొసళ్ళ వంటి మనుషులకు
కట్టుకథల చేపలు విసిరి ఇద్దరం
సాయంత్రాలు పూచే పసుపు ఎండలో
తడిసినప్పుడు
నిరీక్షలు చొక్కాల్లా ఆరేసి
చలి నీడల కంబళిలో తలలుంచి దాక్కున్నప్పుడు
దూరలేని ఘుమఘుమ ఏదో
గుండె వెనకే తొణికేది
మన ఇళ్ళ మధ్య చలిగాలులు
రాయబారుల్లా తిరిగేవి

మళ్ళీ ఇన్నేళ్ళకు ఉత్కంఠల గొడుగులెత్తి
పక్షి నీడలు పుల్లల్లా చెదిరే ఈ గులక దారిలో నడిచినప్పుడు
మాజీ ఉదయాల గుంపులు నీటి పువ్వుల్లా చేతులెత్తి
నా మార్మిక సరోవరంలోకి తేలుతూ వచ్చాయి
ఎన్నో వరదానాల రెక్కలతో ఎగురుతున్న ప్రాణిని
నన్నీ ధూళి అలికిన లోకంలో దువ్వెనలా చేశాయి

నీకైనా నాకైనా కాలాన్ని రాట్నంలా తిప్పటం
వెంటాడే తారల్ని ముద్దచుట్టి విసరటం
చెదిరే ఏకాంతాల చెమ్మల మీద మృదుసంతకాలు అద్దటం
ఒక ఆట కనక
విడుపు కోసం
మన ఆత్మకథల మిలమిలలు
వేలికొనల్లో దాచాను
దానికి కొంచెం కల్పన పులిమి ఖండికలా రాశాను

ఇబ్బందులు తలకిందులుగా తిప్పుకుంటూ
బతికిన వాళ్ళం కదా!
మన లోకాలకు పూలద్దిన మృత్తికను
జ్ఞాపికలా దాచాలి…