అక్టోబర్ 2023

పుస్తక ప్రచురణ ఒక అరుదైన గౌరవం అనుకునే రోజుల నుండీ, నా అల్లిబిల్లి రాతలన్నీ నా సంతోషం కోసం నేనే అచ్చు వేసుకుంటానని ఎవరికి వారే ఓ ముల్లెతో ముందుకు వస్తున్న రోజుల దాకా ప్రచురణ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అవి అక్కడే ఆగితే ఎవరికీ పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ, నా పుస్తకాలు ఎవరూ కొనట్లేదు, తెలుగులో సాహిత్యాభిలాష కనుమరుగయింది, ఉచితంగా ఇచ్చినా ఎవరూ ఒక మంచిమాట చెప్పరు, పత్రికలు గమనించి సమీక్షలు రాయవు, ఆ ప్రచురణకర్తలు ఎన్ని అమ్మారో ఆ డబ్బు ఏమైందో చెప్పరు అంటూ వాపోయే రచయితల రద్దీ గత కొంతకాలంగా ఎక్కువయింది. మార్పు ఎలా అయితే అనివార్యమో, మార్పు తాలూకు ప్రభావాలను అన్ని కోణాలనుంచీ విశ్లేషించుకోవడమూ అంతే అనివార్యం. ప్రచురణ నాణ్యత, రచన నాణ్యత అన్నవి ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు. ప్రచురణలో నాణ్యత సరే, తమ రచనలో నాణ్యతను నిజాయితీగా అంచనా వేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? కొన్ని కవితలనో, కథలనో, తమ అభిప్రాయాలనో కూర్చుకుని ఏ బుక్ ఎక్జిబిషన్‌‌ కోసమో హడావుడిగా ప్రచురించుకునే ముందు, అందులో సాహిత్యపు విలువ ఎంత అన్న ప్రశ్న వినపడే వాతావరణం ఇంచుమించుగా పోగొట్టుకున్నాం. ఇందుకు రచయితల అహాలు, అపోహలు తప్ప వేరే కారణాలు లేవు. తమ వాక్యాన్ని, తమ వస్తువుని నిశితంగా, నిరాపేక్షగా అంచనా వేసుకోలేని వారు, నా రచనను ఇంకెవరూ విమర్శించలేరు అని అహం ఒలకపోస్తారు. పొగడ్త లేకున్నా బతుకుతుంది కాని విమర్శ లేకుంటే సాహిత్యం బతకదని వీరికి తెలియదు. అందుకే వీరు తమ రచనలను పత్రికలకు పంపరు. సంపాదకుల సూచనలు, పరిష్కరణ పట్ల ఏవగింపు, ఆవేశంలో పెల్లుబికిన రచనలో ఉండే నిజాయితీ పరిష్కరణలో పోతుందన్న అజ్ఞానం, ఇంకా సాహిత్యసమాజంలో విస్తృతంగానే ఉన్నాయి. శబ్దవమనం సాహిత్యం కాదని చెప్పడానికి మనకి గురువులంటూ ఎవరున్నారు తాలు సాహిత్య పీఠాధిపతులు, రాయాలి రాయండని ఎగదోసే ముఠాకోర్లూ తప్ప! చాలా మంది రచయితలు బెంగపడుతుంటారు కాని, వాక్యం శ్రద్ధగా రాస్తే నిజాయితీ మాయమవడం, పదును పెడితే రచన విలువ పోవడం ఉండవు. పరిష్కరణ రచన డొల్లతనాన్ని రచయితకు పట్టిస్తుంది, అంతే. వాక్యపుబలిమితో కథలు చెప్పి మెప్పించిన రచయితలు మనకు లేరా? వారెవరూ ఆదర్శం కాదా? అసలు సంగతేంటంటే ఈ తరహా రచయితలది మేకపోతు గాంభీర్యం. విమర్శ అంటే జంకు. వాక్యం మీద శ్రమను వెచ్చించడానికి బద్ధకం. అర్థరాహిత్యాన్ని ప్రశ్నిస్తే వివరణ ఇవ్వడానికి అహం. అనవసరమైన పదాలో వాక్యాలో తీసేయమంటే ఎందుకు ఉంచాలో చెప్పలేని అయోమయం. రాయలేమన్న నిజాన్ని అంగీకరించడం రాసేవాళ్ళకు కష్టం. ఆ నిజం చెప్పినవారిపై తమ గొంతు నొక్కుతున్నారని అఘాయిత్యం చేయడం సులభం. అలా చేస్తూ కూడా, ప్రచురణకర్తలు తమ రచనలు ప్రచురించరేమని ప్రశ్నించే రచయితలు కొందరు. తమ రచనలకు ఇవ్వాల్సిన రాయితీలు, పారితోషకాలు ఇతర దేశాల్లో మాదిరిగానో, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానో లేవని వాపోయే వారు ఇంకొందరు. ఇతర దేశాల్లో ఉన్న పబ్లిషింగ్ హౌస్‌లు ఎన్నెన్ని నియమాలతో పుస్తక ప్రచురణ అంగీకరిస్తాయో, రచన నాణ్యతకు సంబంధించి ఎన్ని కఠినమైన పరిశీలనల్లో నెగ్గాలో వీళ్ళకు తెలుసని అనుకోలేం. తెలుసుకునే ఆసక్తి ఉందనీ ఆశించలేం. ఇక్కడ రచయితలకు ప్రచురణకర్త సమయం పట్ల, అతని వనరుల పట్లా చిన్నచూపు, తమ సాహిత్యస్థాయి పట్ల మాత్రం అమితమైన విశ్వాసం. అందుకేనేమో, నా పుస్తకాన్ని ఒక పాఠకుడు తన సమయమూ ధనమూ వెచ్చించి ఎందుకు చదవాలి? అని వీరెవరూ తమను తాము ప్రశ్నించుకోరు. పుస్తకం అమ్ముడు పోవాలంటే అది అచ్చులోకి రాకముందే మంచి రచయితగా పాఠకులలో గుర్తింపు తెచ్చుకోవడం ఒక పద్ధతని గుర్తించరు. సాహిత్య పరిశ్రమ, సాధనతో కూడిన రచన, పత్రికలకు పంపడం, పరిష్కరణ, ప్రచురణ, తద్వారా సమకాలీనులలో తమ రచనల పట్ల ఏర్పడే ఆసక్తి, గౌరవం, ఆదరణ, దరిమిలా ప్రచురణకర్తల ఆహ్వానం – ఇలా ఎన్నో మెట్లు దాటి ప్రచురించబడిన పుస్తకానికి, ఏ మెట్టు ఎక్కని పుస్తకానికీ ఎంతో తేడా ఉంటుంది. ఆ తేడా తెలుసుకోకుండా తమ పుస్తకాలు అమ్ముడుపోవటం లేదని ప్రచురణకర్తలను, పాఠకులనూ ఆడిపోసుకోవడంలో అర్థం లేదు. పుస్తకం అన్నది రచన, ప్రచురణ కలిసి జీవం పోసుకొనే కళాత్మక వస్తువు. ఆ రెండు విలువలూ పరస్పర పూరకంగా ఉంటేనే అంతిమంగా కళకు విలువ. శ్రీరమణ ఒక రచయితకు ముందుమాట వ్రాస్తూ ఇలా అన్నారు: “మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం, ఒక వెదురుపొదను సమూలంగా నాశనం చేస్తున్నామని. ఒక వెదురుపొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.” పుస్తకాలు అచ్చు వేసుకుంటున్న ఎందరో తెలుగు రచయితలకు ఈ విజ్ఞత అత్యవసరం.