సమాజంలో అభ్యుదయం, ప్రగతి అంటే ఏమిటి? ఒక తరం తన వారసత్వ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పదిలపరచుకొని, దానినుండి నేర్చుకొని, సమకాలీన పరిస్థితులతో అన్వయించుకొని ఆపైన ఆ సంపదకు తమ వంతు జ్ఞానాన్ని జోడించి ముందుతరం వారికి ఇవ్వడం. తన సాహిత్యకళావారసత్వ సంపదను నిరర్థకమని, అప్రస్తుతమని విసర్జించే సమాజం కేవలం ఒక నిలువనీటి మురికిగుంట. ఈ పోలిక ప్రస్తుత తెలుగు సాహిత్య సమాజానికి నప్పినంతగా ఇంకే సమాజానికీ నప్పదు. కళాకారులకు, సృజనశీలులకు కులం, మతం, వాదం వంటి బురదను అంటగట్టే సంప్రదాయాన్ని తెలుగువారు ఇప్పటికీ బలంగా నిలుపుకుంటున్నారు. ఇప్పుడు సాహిత్యకారులు కూడా నిర్లజ్జగా ఆ సమూహాల్లో చేరి ముందు నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు పాఠకులు, సాహితీవేత్తలు ఇంకా గతకాలపు రచయితలనే పట్టుకు వేలాడుతున్నారు, వారి రచనలనే ప్రస్తావిస్తున్నారు తప్ప తమవంటి సమకాలీన రచయితలను గుర్తించటం లేదు, చదవటం లేదు అన్న ఆక్రోశం ఒకటి ఇటీవల కొంత తరచుగా వినిపిస్తున్నది. ఈ రచయితల ఆక్రోశం వెనుక ఉన్నది కేవలం అజ్ఞానం, అసమర్థత. వీరిని బావిలో కప్పలుగా పోల్చటం అసమంజసం. కప్పలకు అవి ఉండే బావి గురించి కొంతయినా అవగాహన ఉంటుంది. నిర్బంధంగా ఎవరూ ఏ రచయితనూ ఎవరి చేతా చదివించలేరు. ముందు తరాల రచయితల పేర్లే ఇంకా వినబడుతుండడానికి కారణం తెలుగు పాఠకులలో ఉత్తమసాహిత్యాభిరుచి ఎంతో కొంత ఇంకా మిగిలే ఉండడం; ఆ రచనల్లోని వస్తుపరమైన సార్వజనీనత, రచనాపరంగా వారు చేసిన ప్రయోగాలు, తెచ్చిన విప్లవాలు, ఆయా రచనల ద్వారా వారు నేర్పిన పాఠాల సార్వకాలీనత… ఇలా, ఈ కాలం రచయితలు తమ రచనల నుండి తీసి చూపించలేని ఎన్నో గొప్ప లక్షణాలు ఆ రచయితల రచనల్లో ఉన్నాయి. సమకాలీన రచయితలలో పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగల రచయితలు బహుకొద్ది మంది. ఒక అజెండాతో మాత్రమే రచనలు చేసే రచయితలు నాసిరకం పాఠకులను, వారు కొట్టే తాలు చప్పట్లను కోరుకుంటారు. మంచి రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ, మంచి పాఠకులను మెప్పించే ప్రయత్నం చేస్తారు. వారిలో ఆలోచననూ రేకెత్తించగలుగుతారు. తమను గుర్తించటం లేదని ఆక్రోశించే రచయితలది ఏ కోవో చెప్పనక్కర్లేదు. తెలుగు సమాజంలో కుహనా వాదరచయితలకు, వాళ్ళకు జేజేలు పాడే భజంత్రీలకు ఏనాడూ లోటు లేదు, ఉండదు. సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు. బ్రాహ్మణులనో, హిందువులనో కేరికేచర్ విలన్లుగా చూపుతూ సైక్లోస్టయిలు కథలు వరుసగా అచ్చోసినంత మాత్రాన అవి అస్తిత్వవాద సాహిత్యపు ఆణిముత్యాలయిపోవు. ఈ ధోరణులు తెలుగు సాహిత్యానికి పట్టిన పుళ్ళు! గాజుముక్కలను చూసి రత్నాలనుకునేంత అవివేకులు కారు తెలుగు పాఠకులు. ఏది మంచి సాహిత్యమో ఏది కాదో, ఏది నిలుపుకోవాలో ఏది పారవేయాలో వారికి బాగా తెలుసు. ఇక, ఇలా ముందు తరాల రచయితల పేర్లే ఇంకా వినపడుతుండడానికి కారణం మైనారిటీ రచయితలను తొక్కివేయడం కోసం అగ్రవర్ణాలు పన్నిన వ్యూహం అని ధ్వనింపచేయబూనడం తెలుగు రచయిత అందుకున్న కొత్త లోతు. తమ రచనాపటిమతో కాక రాజకీయంతో సమాజపు గుర్తింపు కోసం చేస్తున్న యాచన ఇది! తెలుగు సాహిత్యకారులు ఇంతకంటే దిగజారలేరు అనుకున్న వారికి ఇదొక కనువిప్పు. ఇటువంటి వారిని నిగ్గతీసి నిజస్వరూపం చూపి వారిని వెలివేయలేని సాహిత్యసమాజాన్ని సభ్యతతో పరామర్శించవలసిన అవసరం కనపడదు.

నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? ఇది ఆథెన్స్ నగరవీధులలో తిరుగుతూ ప్రజానీకాన్ని జవాబుల కోసం తడుముకునేలా చేసిన గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్ అడిగిన ప్రశ్నల లాంటి ప్రశ్న. ప్రతీవారికీ ఇబ్బంది కలిగించే ప్రశ్న. ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవలసిన చాలా ముఖ్యమైన ప్రశ్న. ఏ విలువలకు లోబడి జీవించాలి? ఏ ఆదర్శాలకు నిలబడుతూ జీవించాలి? ఎలాంటి వ్యక్తిగా జీవించాలి? దేని కోసం పాటుపడాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ప్రతి మనిషికీ భిన్నంగా ఉంటాయి. ఆ జవాబులు ఏ మనిషికైనా వాళ్ళ మనసుల లోతులలోనుండే దొరకాలి, దొరుకుతాయి. ఈ రకమైన ఆత్మపరిశీలన చేసుకోని వ్యక్తి, సమాధానాలకై సంఘర్షణకు లోను కాని వ్యక్తి తనను తాను స్పష్టంగా, సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. తన పట్ల తనకే స్పష్టత లేని వ్యక్తికి తన చుట్టూ ఉన్న సమాజం పట్ల కూడా స్పష్టత ఉండదు. అటువంటి వ్యక్తిత్వంతో తన పట్ల తనకే లేని నిజాయితీ ప్రపంచం పట్ల చూపగల అవకాశమూ లేదు. ఎన్నో కోణాలనుంచి తనను తాను అర్థం చేసుకొని తన బలాలు, బలహీనతలు విచారించుకోలేని వ్యక్తి, ప్రపంచాన్ని కూడా అదే కురచ చూపుతో కొలిచే ప్రయత్నం చేస్తాడు. ఎంతో సంక్లిష్టమైన మానవజీవితాన్ని, సామాజిక చలనాన్ని కేవలం కామెర్ల ఒంటికంటితోటే చూస్తాడు. తన చూపే నిజమని బుకాయించుకుంటాడు. మంచి చెడు అన్న ఒక అత్యంత బలహీనమైన కొలమానం మాత్రమే ఇటువంటి మనిషికి వాడటం తెలిసిన పనిముట్టు అవుతుంది, ఆ మంచి చెడు అన్నవాటి నిర్వచనాల పట్ల ఏమాత్రం స్పష్టత లేకున్నా, అవి స్వార్ధాన్ని, సందర్భాన్ని పట్టి మారుతునే ఉన్నా. వీటిని దాటిన ఆలోచన, ఆ ఆలోచనకు కావలసిన పరిశ్రమ, ఆ పరిశ్రమకు తోడు కావల్సిన సహానుభూతి, జీవితానుభవం ఇవేమీ ఈ తరహా మనుషుల నుండి ఆశించలేము. అందుకే, నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? అన్న ప్రశ్న జోలికి ఈ సమాజంలో అత్యధికులు ఎప్పుడూ పోరు. వాళ్ళు తమ చుట్టూ ఉన్న సమాజం నిర్ణయించిన నడతకు, నిర్దేశించిన విలువలకూ కట్టుబడి ఉండటంలో తృప్తిగా వుంటారు. సమూహంలో ఒకరుగా జీవిస్తారు. తోలుబొమ్మలలాగా సమాజం ఎలా ఆడిస్తే అలా ఆడతారు. వారి వలన మార్పు, అభ్యుదయం ఉండదు. సమాజచైతన్యం ఉండదు. కానీ ఇవి లేనిదే మనిషికి మనుగడ లేదు, ముందడుగు లేదు. తార్కికమైన వివేచన విచక్షణలు ఒక సంపూర్ణజీవితానికి అవసరమని, ఆత్మపరిశీలన చేసుకోని బ్రతుకు బ్రతుకే కాదని ఎన్నో శతాబ్దాల మునుపే ప్రతిపాదించిన ఆ సోక్రటీస్ ప్రశ్నలు ఇప్పటికీ మనమధ్య సజీవంగా, ఒక అవసరంగా ఉండటానికి కారణం ఇదే. ఈ రకమైన పరిశీలన సమాజపు నడతకు లోబడినవారికి అనవసరం అనిపించవచ్చు. కాని, సమాజంలో మార్పు కోరేవారికి, అభ్యుదయాన్ని ఆశించేవారికి, ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టం కావడం అవసరం. సంగీతసాహిత్య చిత్రలేఖనాది కళలను అభ్యసించే కళాకారులకు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అవసరం. తమకు సామాజిక బాధ్యత ఉన్నది అని నమ్మే తెలుగు రచయితలు ఈ రకమైన ప్రశ్నలతో తమను తాము పరిశీలించుకోవడం, తమ సాహిత్యాన్ని ఆ వివేచనతో సమీపించడం అత్యవసరం.

గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన తెలుగు సాహిత్య సమావేశాలన్నింటిదీ ఇంచుమించు ఒకే మూస పద్ధతి. వీటికి సమావేశం ముఖ్యం, సాహిత్యం ఒక సాకు. అప్పుడప్పుడూ కొందరు సాహిత్య ప్రయోజనం కోసం కొంత ప్రయత్నించిన దాఖలాలున్నా, అధికశాతం సమావేశాల లక్ష్యం వేరు: సెల్ఫ్ ప్రమోషన్ కొన్నిటికి, కోటరీలు మరికొన్నిటికి; రచయితల ఎదుగుదల వేటిలోనూ భాగం కాదు. సాహిత్య బాంధవ్యాలు కేవలం సాహిత్యేతర అవసరాలకే అని కనిపిస్తూనే ఉంటుంది. ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని నిర్వహిస్తున్నారన్నది వారికి మాత్రమే తెలిసిన చిదంబర రహస్యం. నిర్వాహకులు సాహిత్యాభివృద్ధి కోసం జరుపుతున్నాం అని చెప్పుకొనే ఈ సభలు సాహిత్యం వాటివల్ల బాగుపడదు అని నిరూపిస్తూ ఉండడం ఒక వింత. ఏడాదికొకసారి ఉత్సవాలుగాను, వారం వారం ఉద్యమం చేసినట్లుగానూ సాహిత్య సమావేశాలు నిర్వహించేవాళ్ళు ఇప్పుడు తెలుగు సాహిత్య సమాజంలో వద్దన్నా కనపడతారు. ‘విభిన్నంగా’, ‘సౌహార్ద్ర వాతావరణంలో’ జరిపే ఈ సభలన్నిటిలోనూ వేదికను అలంకరించడానికి సాహిత్యపెద్దలు, విశిష్ట అతిథులు ఎలానూ ఉంటారు. ఈ కురువృద్ధులలో కొందరికి కనపడదు. కొందరికి వినపడదు. కొందరు చూడలేరు, వినలేరు. కొందరికి చూడాలని, వినాలనీ ఉండదు. మరికొందరు వక్తలు తాము మాట్లాడవలసిన పుస్తకాన్ని మొదటిసారి ఆ సభలోనే తిరగేస్తారు. ప్రధాన వక్తలు సైతం, మాటకీ మాటకీ పొంతన లేకుండా రచనను వదిలేసి రచయిత గురించి మాట్లాడతారు. అసందర్భంగా వాళ్ళ అనుభవాలను వల్లె వేస్తారు. కలిసి తిరిగిన తిరుగుళ్ళు, కలిసి పోయిన హోటళ్ళు, కలిసి తిన్న తిళ్ళు, పంచుకున్న టీ సిగరెట్‌లు – ఈ సోది లేని సాహిత్య సభలు తెలుగునాట అరుదు. స్నేహాల ప్రదర్శన, మాట్లాడవలసిన అంశం మీద స్పష్టత లేకపోవడం, రచన కన్నా రచయిత మీద దృష్టి పెట్టడం, సమయపాలన లేకపోవడం – స్థూలంగా ఇవీ ఈనాటి తెలుగు సాహిత్యసభల పోకడలు. సాహిత్య సభల్లో స్నేహం ఉండకూడదా? అంటే, కేవలం స్నేహం కోసమేనా సభ? అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. ఈ సాహితీస్నేహాలు, ఈ సౌహర్ద్రత రచయితలకు నిజంగా అవసరమా? అందుకే, సమావేశం ముఖ్యం సాహిత్యం ఒక సాకు అనడం. ఇవేవీ లేకుండా రచయితలు ఒకచోట కూర్చొని నిక్కచ్చిగా సాహిత్యం గురించే మాట్లాడుకోలేరా? విమర్శను ఇచ్చిపుచ్చుకోలేరా? ఆమాత్రం చేతకాకపోతే రచయితలమని ఎందుకూ చెప్పుకోవడం? అందుకే, సాహిత్య సభలు ఎందుకు? అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు నిజాయితీగా జవాబులు వెతకడం మొదలైతే, ఆ జవాబుల్లో నుండి – సాహిత్య స్నేహాల పరస్పర పొగడ్తల ప్రహసనాన్ని పక్కన పెడితే – నిజంగా సాహిత్యానికి ఉపకరించేవాటిని గమనించుకోవచ్చు. వాటిని మెరుగు పరుచుకునే ఆలోచన చెయ్యవచ్చు. మాట్లాడదలచిన అంశం మీద వక్తలు ముందుగానే ఒక వ్యాసం సిద్ధం చేసుకుని రావాలని, దానికి పత్రికలలో ప్రచురణార్హత ఉండాలని ఒక నియమం పెడితే, వేదికనెక్కడానికి ఉరికి వచ్చే ఉసియన్ బోల్టులందరూ వీల్‌ఛెయిర్ కోసం లైను కడతారు. తెలుగు నాట రచన అంటే ఏ రకమైన పరిశ్రమా అక్కర్లేని కళ అన్న అపోహ రచయితల్లో బలంగా ఉంది. ఇది వక్తలలోనూ ఉంది. ఇప్పుడు జూమ్, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియా పుణ్యమా అని, సభావేదిక మీద నట్టుతూ నక్కుతూ పదాలకోసం తడబడుతూ ఈ వక్తలు చేసే అప్రస్తుత అప్రసంగాలు ప్రపంచమంతా పాకి తెలుగు సాహిత్యం వ్రాతలోనే కాదు ప్రసంగంలోనూ నేలబారు స్థాయికి పడిపోయిందని చాటి చెప్తున్నాయి. రచయితల రచనాకౌశలం మెరుగు పడటానికి ఉపయోగపడని ఏ సభ, సమావేశం అయినా వారికి హాని చేసేదే అని రూఢి చేస్తున్నాయి.

ఒకప్పుడు తెలుగులో సాహిత్యమంటే అగ్రవర్ణ సమాజపు పేర్లు, వారి కథలే ప్రధానంగా వినపడేవి. కాలక్రమేణా మార్పులు వచ్చాయి. దళిత, మైనారిటీ, శ్రామిక, స్త్రీవాద తదితర గొంతుకలు నేటి సాహిత్యంలో బలోపేతం అయ్యాయి. ఇన్నేళ్ళూ సాహిత్యంలోకి రాని ఎన్నో జీవితాలను, ఎన్నో సంఘర్షణలనూ కొంతకాలంగా తెలుగు సాహిత్యంలో గమనిస్తున్నాం. ఇప్పటిదాకా సమాజం వినని, వినదల్చుకోని గొంతుకలను, గుర్తించడానికి కూడా ఇష్టపడని పాయలను ఇప్పుడు మనం సాహిత్యంలో కలుపుకోగలుగుతున్నాం. ముఖ్యంగా, ఎన్నాళ్ళగానో గొంతుల్లోనే నొక్కివేయబడ్డ కథలకు, నిరసనలకు, ఆశలకు ఇప్పటి సాహిత్యం ఒక స్వరాన్నిస్తోంది. ఇలా నాణానికి ఆవలి వైపుని, తరాలు మారినా చల్లారని లోపలి ఆవేదనలని, ఇప్పటి సాహిత్యం చూపించగలుగుతోంది. ఇవన్నీ నిస్సందేహంగా ఆయా జీవితాల పట్ల మిగతా సమాజానికి కొత్త చూపుని, కొత్త అవగాహననీ ఏర్పరిచేవే. లిపి కూడా లేని బంజారాల జీవితాలను కథలుగా మలిచిన రమేశ్ కార్తీక్ నాయక్ ఇందుకు ఒక ఉదాహరణ. మారుతున్న సమాజపు పోకడలను ఇలా తెలుగు సాహిత్యంలోకి యువరచయితలు తేవడం తప్పకుండా అవసరం, అభిలషణీయం. గత కొంతకాలంగా సాహిత్య అకాడెమీ ఇటువంటి యువరచయితలకు పురస్కారాలిచ్చి ప్రోత్సహించడం కూడా సమర్థనీయం. కాని, ఇది వారి ప్రయత్నానికి మాత్రమే ఇస్తున్న ప్రోత్సాహం అనిపించడం సహజం. తమ తమ కథలని, తమకి నచ్చిన భాషలో, రీతిలో చెప్పుకోవడమే లక్ష్యంగా రాతలోకి అడుగుపెట్టినవాళ్ళకు సంబంధించినంతవరకూ, రాత అన్న దశ ముగిసిపోయింది. రచన ఎప్పుడూ రచయిత పక్షమే. అది వ్యక్తిగతమైన వ్యవహారం. అయితే, ఎప్పుడు దాన్ని సాహిత్యం అన ప్రయత్నిస్తామో, అప్పుడిక సాహిత్యనియమాలు, లక్షణచర్చ అమలులోకొస్తాయి. కథాకథన నైపుణ్యతల విశ్లేషణ, విమర్శ తప్పనిసరి అవుతాయి. ఈ విలువలను యువరచయితలు మార్చుకోవచ్చు. కొత్తవి తెచ్చుకోవచ్చు. కానీ అసలు సాహిత్యనియమాలే అవసరం లేదనుకోవడం అజ్ఞానం. ఆశయాల గొప్పదనంతో రచన విలువ ముడిపడి లేదు. ఇది నిజం. అందువల్ల, ఇప్పుడు కొత్తగా వస్తున్న రచనలు కూడా ఏ ఆదర్శాలతో వచ్చినా, అవి పదికాలాలు నిలబడడానికి వీటిలో సత్యంతోపాటు, ఉద్వేగంతోపాటు, సాహిత్య విలువలు ఉండి తీరాలి. ఇప్పటి సమాజంలో ఏ గొంతుకీ ఏ నిర్బంధమూ లేదు. ఏ రచనా ప్రచురణకైనా మాధ్యమాల కొదవ లేదు. సామాజిక మాధ్యమాల్లో మనం మన చుట్టూ నిలుపుకుంటున్నది, కో అంటే కో అనే ఒక సమూహాన్ని మాత్రమే. ఆ సమూహాలలో స్నేహం ఉంది. అవగాహన ఉంది, సహానుభూతి ఉంది. పైకి చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యే సమీకరణాలు ఉన్నాయి. అక్కడ నాకే పాఠకుడు అక్కర్లేదు, నాకే విమర్శతో పని లేదు అని బింకాలు పోవడం తేలిక. కానీ ఈ సమూహాలకు ఆవల అసలైన ప్రపంచం ఉంది. రచయిత స్వయంగా వెళ్ళి సమర్థించుకోలేని ఆ తావుల్లో కూడా రచన స్వంతంగా మనగలగాలి. అలా జరగాలంటే, యువరచయితలు తమ కథననైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి. వాళ్ళ వాళ్ళ సమూహాలను దాటి వచ్చి, తమ రచనలను నిజాయితీగా పరామర్శించుకోవాలి.

కళాసృజన ఒక ప్రవాహం. అన్ని పాయలనూ కలుపుకుంటూ, కొత్త మార్గాలను అన్వేషిస్తూ సాగే నిరంతర ప్రయాణం. ఏ కళాకారుడూ శూన్యంలోనుంచి కొత్తకళను సృష్టించలేడు. ఈ ప్రపంచాన్ని మన ప్రాచీనులనుంచి, సమకాలీనుల దాకా ఎందరో ఎన్నో రకాలుగా విశ్లేషించారు, విశ్లేషిస్తున్నారు, ఎవరెవరు ఎన్నివిధాలుగా పరిశీలిస్తున్నారో ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుంటున్నారు. కళలయినా, తత్త్వచింతనయినా, శాస్త్రపాఠాలయినా ముందు అప్పటిదాకా ఇతరులు కూడబెట్టిన అనుభవజ్ఞానాన్ని నేర్చుకొని, దానికి తమ వంతు జోడించడమే సిసలయిన అభ్యుదయం. శిల్పులు, చిత్రకారులు, సంగీతకారులు, శాస్త్రజ్ఞులు – ఇలా ఏ కళలో రాణించాలనుకునే వారైనా, ముందు ఆ కళలో ఉన్న మెళకువలను, పద్ధతులను, పరిశోధనలనూ గమనిస్తారు. అప్పటిదాకా వచ్చిన విభిన్న ధృక్పథాలను, విప్లవాలనూ చదువుతారు, విద్యలా అభ్యసిస్తారు. ఇలా విస్తారంగా ఆ చరిత్రను ఆకళింపు చేసుకొని, ఆ విజ్ఞానంతో తమ కళను మరింత మెరుగు పరుచుకుంటారు. సాహిత్యమూ నిజానికి ఇలాగే ఎదగాలి. కానీ దురదృష్టవశాత్తూ తెలుగులో రచయితలకు చదవడం, నేర్చుకోవడం అన్నది ఎందుకో పడదు. వారిలో తమకు తెలిసింది చెప్పాలన్న తపన తప్ప, తమకు తెలియనిది తెలుసుకోవాలన్న తృష్ణ కాని, తాము చెప్పే తీరును ఎలా మెరుగుపరుచుకోవచ్చు అన్న ఆలోచన, పరిశ్రమ కానీ ఒక పట్టాన కనపడవు. ఎక్కువ పుస్తకాలు చదివితే, ఆయా రచయితల ప్రభావం తమ మీద పడిపోతుందని, తమకంటూ సృష్టించుకున్న శైలి ఏదో పాడైపోతుందన్న అపోహల్లో మగ్గిపోతూ ఉంటారు. ఇవి నిజంగా అపోహలో కుంటిసాకులో చెప్పడం కూడా కష్టమే. భిన్నంగా రాయాలన్న తపనను అర్థం చేసుకోవచ్చు కానీ తామే భిన్నమన్న భ్రమలో బ్రతికే తత్వాన్ని – అజ్ఞానమో, అహంకారమో – ఎలా అర్థం చేసుకోగలం! సాహిత్యపు మౌలికప్రయోజనం ఏమిటంటే అది ప్రపంచాన్ని వేరేవాళ్ళ కళ్ళతో చూడనిస్తుంది. ఇది పాఠకులకే కాదు, రచయితలకూ వర్తిస్తుంది. నచ్చిన దృక్పథాన్ని, నచ్చనిదానినీ కూడా సమాపేక్షతో చూడలేనివారు మంచి రచయితలు కాలేరని; ప్రతీ సమస్యకూ తక్షణ, తాత్కాలిక తీర్పులు ఉండవని; తప్పూ ఒప్పులకు ఆవల సందర్భమూ అవసరమూ అనేవి కూడా ఉంటాయని రచయితలు కేవలం విస్తారంగా చదవగలగడం ద్వారానే నేర్చుకోగలరు. మానవజీవితపు సంక్లిష్టతను అర్థం చేసుకోగలరు. ప్రపంచంలో ఏ మూలలోనైనా ఏ మనిషికైనా దొరికేవి అవే కొన్ని సత్యాలు, విలువలు, ఆదర్శాలు అనే మెలకువలోకి రాగలరు. చెప్పదలచుకున్న విషయాన్ని లోతుగా కూలంకషంగా అర్థం చేసుకొని, దానికి సరిపోయిన కథనాన్నివ్వగలరు. రచనను విజయవంతంగా పాఠకులకు చేర్చగలరు. ఈ సాధన, నైపుణ్యత, వివేచన, విజ్ఞానం, విశ్లేషణ ఇవన్నీ రచయితలకు తప్పక ఉండవల్సిన పరికరాలు. ఇవేమీ లేకుండా సహజాతంగానో, అభ్యాసపూర్వకంగానో కేవలం చదివించగల వాక్యం వ్రాయడం అలవడినంత మాత్రాన ఎవరూ మంచి రచయితలు కాలేరు. రకరకాల సాధనాలతో ప్రస్తుతం నిండుగా ఉండాల్సిన తెలుగు రచయితల సంచీలలో శుక్లాలు కమ్మిన ఒంటికంటి కలం ఒక్కటే పనిముట్టుగా కనిపిస్తోంది. తరువాతి తరాలకు సాహిత్యకారులు చివరికి ఏది చేయకూడదో చెప్పే ఉదాహరణలుగా మాత్రమే మిగిలిపోవడం కనిపిస్తోంది.

తెలుగులో ప్రస్తుతం స్థూలంగా రెండు రకాల కవులున్నారు. ఒకరు తమను తాము సామాజిక చైతన్యంతో అభ్యుదయవాదులుగా ఊహించుకుంటూ రచనలు చేసేవారు. రెండవవారు, తమ తమ ఆంతరంగిక, ప్రాకృతిక జగత్తులోనుండి కవిత్వం వ్రాసుకునేవారు. చిత్రంగా, ఈ రెండు కోవలకు చెందినవాళ్ళు ఒకరి కవితలను ఒకరు ప్రశంసించడం కనపడదు. వారికి వీరు కవులుగా వీరికి వారిది కవిత్వంగా అనిపించదేమో. కవులు అని ఎవరిని అనాలి? కవిత్వం వ్రాసిన వాళ్ళని అనాలి. అప్పుడు వాళ్ళ రచనలో మనం ఏం చూడాలి? వస్తువులో, అభివ్యక్తిలో కొత్తదనం, భావం, అనుభూతి సాంద్రత – ఒక్కమాటలో, కవిత్వాన్ని చూడాలి. తమ అనుభవాలను, ఆవేశాలను కవిత్వంగా మార్చదలచినవాళ్ళు ఆ పని నేర్పుగా చెయ్యగలిగితే అది వేరే సంగతి. కానీ ఏదో ఒక భావజాలానికో భావుకతకో చెందాలనే ఆరాటంలో, తమ అభ్యుదయాన్ని లేదా అనుభూతిని ప్రకటించుకోవాలన్న తొందరలో వ్రాసేవి కృతకమైన రాతలు, కవితలు కావవి. అంటే, కవిత ఎత్తుగడతో సంబంధం లేకుండా ప్రయత్నపూర్వకంగా చొప్పించే భావుకత, వెలిబుచ్చే ఆవేశం కవితని బలోపేతం చెయ్యవు. మరొకలా చెప్పాలంటే, నిజాయితీ లేమి కవితలను నిర్జీవం చేస్తుంది. ఒక కవిత/రచన పాఠకులను చదివించలేకపోతే, ఆలోచించనీయకపోతే, వారు దానితో కాసేపైనా మమేకం కాలేకపోతే, ఎవరికోసమైతే వ్రాశారో వారితో సహా ఎవ్వరికీ అందకుండా అది ఒక వ్యర్థప్రయత్నంగా మిగిలిపోతుంది. అసహనం, ఆవేశం, అనురాగం, సున్నితత్వం–ఇవేమీ తప్పులు కాదు, కవులకు రచయితలకూ ఉండకూడనివీ కావు. కాని, ఒక రచనకు ఇవి ముడిసరుకులు మాత్రమే. వీటిని కథగా కవితగా మలచాలంటే పరిశ్రమ కావాలి. రచయిత చూపు పక్కకు చెదరకుండా, రచన ఆసాంతం ఆ బిగి సడలకుండా ఉండాలి. తనకు తెలిసినదల్లా, తాను అనుభవించినదల్లా చెప్పాలనే అత్యుత్సాహం, ఒకే అంశం మీద నిలబడి మాట్లాడలేని అసహనం వదలాలి. అట్లా మాట్లాడేందుకు తగిన సరుకు పోగుచేసుకునేందుకు కృషి చేయాలి. ఎందుకంటే సమస్య ఎంత జటిలమైనదయినా, అనుభూతి ఎంత లోతయినదయినా అది పాఠకుల దగ్గరకు చేరకపోతే ఆ రచనకు విలువ లేదు. కవితలో కేవలం స్పందనే కాదు, అది ప్రకటించడంలో కొంత వివేచన కూడా ఉండాలి. ఆ వివేచన ఊతంగానే పాఠకుడు రచనను, రచన పాఠకుడిని పట్టుకుని ఉండగలిగేది. ప్రస్తుత తెలుగు సమాజంలో కవిత్వానికి విలువ తగ్గిపోయింది, కవులంటే హేళన పెరిగిపోయిందీ కవిత్వాభిమానులు లేకనో, కవిత్వాభిరుచి పోయో కాదు. కవులమని చెప్పుకుంటూ అకవిత్వాన్ని మోస్తున్నవారు, కవులమని చెప్పుకుంటూ అకవిత్వాన్ని ప్రచురిస్తున్నవారు ఇందుకు కారకులు. తాము వ్రాసిందంతా కవిత్వమనుకునే వారి వెర్రి ధోరణి దీనికి కారణం. కవిత్వం వ్రాయాలీ అంటే ముందు కవిత్వం చదవడం నేర్చుకోవాలి. ఒక కవితను కూలంకషంగా చదివి విశ్లేషించగలగాలి. దానిలోని లోతుపాతులు బేరీజు వేయగలగాలి. కవి తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా, భావస్ఫోరకంగా ప్రకటించగలిగాడో లేదో, తన ఆశయంలో కృతకృత్యుడు కాగలిగాడో లేదో గమనించగలగాలి. ఇలాంటి శ్రమతో మాత్రమే ఏది ఏ స్థాయి కవిత్వమో బోధపడుతుంది. కనుక కవులారా, మీరు వ్రాసిన ఏ కవితనయినా అందులో వస్తువు కొత్తదనం ఏమాత్రం, పోలికలలో కొత్తవి ఎన్ని, అభివ్యక్తిలో నవ్యత ఎంత, అన్న మూడు ప్రశ్నలతో సరి చూసుకోండి. కవిత్వానికి కొలమానాలు ఉండవు లాంటి మాటలు ఉట్టి అపోహలు. అవి బలిమి ఉన్న కవిత్వాలకు. మీరు భేషుగ్గా మీ మీ కవిత్వాలను కొలిచి చూసుకోండి. మీ కవిత్వం ఏదో ఒక స్థాయికి తూగే దాకా మిమ్మల్ని మీరు కవులు అని చెప్పుకోవడానికి సంశయించండి. కవిత్వాన్ని కొలవగల తూనికరాళ్ళు లేకపోలేదు, గుర్తుంచుకోండి.

కర్ణాటక సంగీతగాయకుడు టి. ఎం. కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ సంగీతకళానిధి అవార్డ్ ప్రకటించటంతో దుమారం చెలరేగింది. సంగీతసాహిత్యాది కళలలో సాధారణంగా విమర్శలు గ్రహీతల అర్హతను ప్రశ్నించేవిగా ఉంటాయి. ఐతే, కృష్ణ విషయంలో వివాదం అతని ప్రతిభను ప్రశ్నించేది కాక అతనిని వ్యక్తిగా నిందించేది. సంప్రదాయం ఆశించే యథాతథస్థితిని అతను ప్రశ్నించడం, దాని పునాదులు కదిల్చే ప్రయత్నాలు చెయ్యడం సంప్రదాయవాదులకు నచ్చలేదు. ఇది ఒక అభద్రతాభావం నుండి పుట్టిన అసహనమే తప్ప, శతాబ్దాలుగా పరిఢవిల్లిన శాస్త్రీయ సంగీతానికి ఇప్పుడు కొత్తగా రాగల ముప్పేమీ లేదు. ఛందోబంధనాలు తెంపిన కవుల వల్ల తెలుగు కవిత్వం మరింత పరిపుష్ఠమయిందే కాని, కావ్యసంపదకు అవమానమేమీ జరగలేదు. కర్ణాటక సంగీతాన్ని భక్తి అనే ఏకభావప్రాధాన్యతా శృంఖలాల నుండి తప్పించడానికి కృష్ణ చేస్తున్న ప్రయత్నాల వల్ల ఆ సంగీతం మరింత ప్రౌఢము, విస్తారమూ అవుతుంది తప్ప అది ఏ రకంగానూ బలహీనపడదు. కాని, ఆవేశం, అసహనం మాత్రమే హెచ్చరిల్లి తార్కిక విశ్లేషణ, వివేచన కొరవడిన సమాజానికి, తామే నియంత్రించి లోబడి ఉండే సంప్రదాయాన్ని ఏ రకంగా ప్రశ్నించినా ధిక్కరించినా ఓర్వలేనివారికి, మార్పు సహించలేనివారికీ ఇలాంటి సందర్భాల్లో చేయ చేతనైనది వ్యక్తి దూషణ, వ్యక్తిత్వ హననం మాత్రమే. ఇది పక్కన పెట్టినా, మిగతా ప్రతిస్పందనలూ ఆశ్చర్యం గొలిపేవే. కాకతాళీయమే అనుకుందాం, కాని సరిగ్గా ఈ వివాదం నడుస్తున్నప్పుడే – త్యాగరాజు సంగీతం కోసం సాహిత్యాన్ని విస్మరించాడన్న కృష్ణ అభిప్రాయం ఒకటి సందర్భశుద్ధి లేకుండా వెలికి తెచ్చి, మసి పూసి మారేడు చేసి అతనిపై తెలుగు భాషాభిమానులందరూ శాయశక్తులా తమ అక్కసును వెలిగక్కారు. కానీ నిజానికి కృష్ణ చెప్పింది కొత్తదీ కాదు, ఆయన మాటలు త్యాగరాజు పట్ల అవమానమూ కాదు. దశాబ్దాల క్రితమే శ్రీపాద, రాళ్ళపల్లి తదితరులు ఈ సంగతిని తార్కికంగా సోదాహరణంగా చర్చించారు. ఇక, భక్తుడు కానివాడు భక్తిసంగీతంలో తాదాత్మ్యం చెందలేడు కాబట్టి కృష్ణ ఈ కీర్తనలు పాడకూడదన్నది మరొక వాదన. ఇది, ఎవరి కథలు వారే చెప్పుకోగలరు, ఇతరులు చెప్పలేరు, చెప్పకూడదు అని సాహిత్యంలో అస్తిత్వవాదులు చాలాకాలంగా చేస్తున్న ఒక అర్థం లేని వాదనకు భిన్నమేమీ కాదు. కులమతప్రాంతీయ జీవనసరళులను బట్టి వారికే ప్రత్యేకమైన కొన్ని అనుభవాలు, పద్ధతులు ఉంటాయి నిజమే కాని, ఆవేశం, ఆనందం, ఆక్రోశం, అవమానం, అభిమానం, అనురాగం, అణచివేత, ధిక్కరణ వంటి సార్వజనీనమైన అనుభవాల సారాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నవాళ్ళు, కళలో ఆ లోతులు పట్టుకోగలిగిన కళాకారులు ఎవరైనా, ఎవరి కథయినా వ్రాయగలరు, ఎవరి పాటయినా పాడగలరు, ఎవరి బొమ్మయినా గీయగలరు. భక్తిభావం ఇందుకు భిన్నమైనదేదీ కాదు. కృతులలో ఎంత భక్తి ఉన్నా, కర్ణాటక సంగీతం కూడా ఇతర కళలలాగానే ఒక కళ. భక్తిసంగీతమైనా, గాయకుడి భక్తి కేవలం సంగీతం మీద. సాహిత్యశిల్పచిత్రలేఖనాది కళలన్నిటికీ ఇదే వర్తిస్తుంది. ఇది కళాసృజనలో చాలా సూక్ష్మమైన గమనింపు. వివేచనతో తప్ప అవగతం కానిది. ఇలా, సంప్రదాయవాదులు ఈ రకమైన దాడికి దిగితే, అభ్యుదయవాదులు మొత్తంగా వారి మార్కు మౌనాన్ని వారు ఆశ్రయించుకున్నారు. కృష్ణ చేస్తున్న ప్రయత్నం ఎంత విప్లవాత్మకమైనా అతని పోరాటం అగ్రవర్ణ సంప్రదాయం లోలోపలి కుమ్ములాటే కదా అన్న నిరసన వాళ్ళది. ఆ ఆలోచనాధోరణి ప్రమాదకరమైనది. రాజ్యాన్ని ముప్పొద్దులా విమర్శించే వాళ్ళకు కూడా ఇది కేవలం సంగీత వివాదం అనిపించడం; ఇది సాక్షాత్తూ భగవంతుడికే జరిగిన అవమానమన్నట్లు నానా యాగీ చేస్తున్న సంప్రదాయవాదులకు ఇందులోని సామాజిక కోణం పట్టకపోవడం – ఈ రెంటినీ కలిపి చూస్తే, మన సమాజం సమస్యలను ఎంత ఏకపక్షంగా చూస్తుందో అర్థమవుతుంది. ఇప్పటి ఈ వివాదం ఒక గాయకుడిది మాత్రమే కాదు. నిన్నైనా మొన్నైనా ఒక రచయితది, ఒక చిత్రకారుడిది మాత్రమే కాదు. ఇవి కేవలం ఉదాహరణలు. ఈ సమస్య ఒక సమాజంగా మనందరిదీ. భిన్నత్వాన్ని కనీసం మాటమాత్రంగా కూడా సహించలేని మన కురచతనం, సామాజిక వివేచన కోల్పోయిన మన సంకుచితత్వం, తమ బాగే అభ్యుదయం అనుకొనే స్వార్థం. అదనంగా కళ, కళాసృజనల పట్ల అవగాహనాలేమి, అగౌరవం. మరీ ముఖ్యంగా కళలు మత, రాజ్య, సంప్రదాయాల పరిమితులకు, నియమాలకు లోబడి ఉండవని, నిరంతర వినూత్నత, విభిన్నత వాటి ధర్మం, కర్తవ్యం అని కనీసం ఊహకు కూడా రాకపోవడం. సమస్యకు మూలం ఇక్కడే ఉంది. మన చర్చ మొదలవాల్సింది కూడా ఇక్కడే.

తెలుగులో తాము సీనియర్ రచయితలం, కవులం అని చెప్పుకునే మనుషుల కనుసన్నలలో ఇప్పుడు ఎన్నో సమూహాలు ఉన్నాయి. వాళ్ళ అడుగులకు మడుగులొత్తే శిష్యబృందమూ ఉంది. ఎవరైనా ఒకరు ఒక రెండు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లకి వంద లైకులు సాధిస్తే, లేదా ఎక్కడైనా ఒక నాలుగు రచనల ప్రచురణ జరిగితే, ఇక వారికి రచయితలు అన్న టాగ్ వచ్చేస్తుంది. వాళ్ళ రచనలను బట్టి కథకులనో, కవులనో ముద్ర వేసేశాక, ఇక వాళ్ళకి సదరు ‘గురు’కులాలనుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, రాసి ఏం చెయ్యాలి – ఇవన్నీ నేర్పించబడతాయి. అవి మేలు చేస్తున్నాయో చేటు చేస్తున్నాయో చెప్పడం కష్టం కాదు కాని, ఆ గీతలు అంత స్పష్టంగా కొత్తవారికి కనపడవు. కళలు ఉద్యోగాలు కావు అన్న స్పృహను పక్కన పెట్టేసిన సీనియర్ కవులు రచయితలు, కాలేజిలో ఫ్రెషర్స్‌కు చెయ్యాల్సిన పనుల చిట్టా చెప్పినట్టు, వారికి రచనలోకి రాగానే ఎంచుకోవాల్సిన ‘సబ్జెక్ట్స్’ ఇచ్చి, వెన్ను తట్టి పెన్ను పట్టిస్తారు. ‘సీనియర్’ల సంగతి ఒదిలెయ్యండి, తమ రచనను విభిన్న వర్గాల పాఠకులకు చేర్చడానికి తెలుగులో ఇన్ని పత్రికలు, ఇన్ని మాధ్యమాలు అందుబాటులో ఉన్నా, ఇలా ఏదో ఒక వేదికమీద మాత్రమే, ఏదో ఒక కూటమితో జతపడి మాత్రమే, రచనలు ప్రచురించి, తాము పొందగలిగినది ఏమిటో యువరచయితలు ప్రశ్నించుకోవాలి. ఒకే రకం అభిప్రాయాలను సమర్థించే బృందంలో ఉన్నప్పుడు, అవి సహజంగానే అక్కడివారి ఆమోదం పొందుతాయి. కానీ ఆ రచనలను భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవాళ్ళకి చేరవేయగలుగుతున్నామా, వస్తువుతో నిరాకరణ ఉన్నా సరే, వాళ్ళని తమ రచనాబలిమి చేత చదివించగలుగుతున్నామా, ఆలోచింపజేయగులుతున్నామా అన్న ప్రశ్నలు వీరికి రావాలి. అవి రావాలంటే, ఈ ప్రచురణా ప్రపంచంలో ఎందుకు ఉన్నామని వీరు ప్రశ్నించుకోవాలి. తనదైన ఆశయంతో రచనలు చేయడానికా? ఏది రాసినా అనుమోదించి దన్నుగా నిలబడగల నలుగురు స్నేహితులను పోగేసుకోవడానికా? తన రచన మీద ఏ విమర్శ వచ్చినా కాపు రాగల కూటమిని కూడగట్టుకోవడానికా… దేనికి? కుటుంబాలతో ఉద్యోగాలతో తలమునకలుగా ఉండే జీవితంలో నుండి కొంత సమయాన్ని వీరు సాహిత్యం కోసం కేటాయించడానికి కారణాలేమిటి? అది నిజంగా నలుగురు, నిజంగా మెచ్చగల రచనను సృష్టించడమే అయితే, ఆ రచనాబలాన్ని తెలుసుకోవడానికి ఆశ్రయించాల్సింది ఎవరిని? ఎవరి విమర్శ నమ్మదగినది? మహామహా ఉద్యమాలే ఆత్మవిమర్శ కొరవడి నీరుకారిపోవడం చరిత్ర నమోదు చేసిన సత్యం. ఇక శ్రద్ధ లేని రచనలేపాటి? లేదూ, కావలసినది ఎంతోకొంత కాలక్షేపమే అయితే, ఈ రచనాపీఠాలను పట్టుకుని వేలాడుతూ వీరు పొందుతున్నది ఏమిటి? కోల్పోతున్నది ఏమిటి? వీటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అది లోపలి పాఠకుడిని బతికించుకోవడం. సాహిత్యంలో విలువలు, రచనకు ఒక స్థాయి ఆశించడం ఎందుకు మానేశారు? పొగడ్త తప్ప విమర్శ ఎందుకు వినరు? సమాజపు సమస్త ఊహలకూ రెక్కలివ్వాల్సిన రచనాలోకంలో, ఈ విజ్ఞతని నిద్రపుచ్చి కవిరచయితలు చేస్తున్నదేమిటి? ముక్కలుముక్కలుగా రాసే మాటల్లో నాలుగు మెరుపులు కనిపిస్తే వస్తే మెచ్చుకోళ్ళకు పొంగిపోతూ, రచన మొత్తంలో కనపడవలసిన పరిపూర్ణత గురించి మాట్లాడటానికి భయపడుతూ లేదా నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటే సాహిత్యం ఎలా మెరుగవుతుంది? నిజమైన రచన శక్తిని, సమయాన్ని, మరీ ముఖ్యంగా నిజాయితీని కోరుతుంది. వీటికి తూనికరాళ్ళు ఎవరికీ వేరేవాళ్ళు ఇవ్వలేరు. ఏ సాహిత్య స్నేహాలూ సమూహాలూ రచనాబలిమి లేని శుష్కసాహిత్యాన్ని బతికించలేవు. సాహిత్యసృజన ఏకాంత ప్రక్రియ.

సాహిత్యానికి మనుగడ రచయితలు, పాఠకులు. అయితే, వీరిద్దరి మధ్యా వారధిగా నిలబడి, మంచి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ, పాఠకుల అభిరుచిని పెంపొందించేందుకు సాయపడే మాధ్యమాలలో పత్రికలది ముందువరుస. ఒక్కొక్క తరంలో రచయితలు కుదురుకునే వేదికగా కొన్ని మాసపత్రికలు, వారపత్రికలు బలంగా పనిచేశాయి. పత్రికలు రచయితల ద్వారానూ, రచయితలు పత్రిక ద్వారానూ పేరు తెచ్చుకొన్న సందర్భాలవి. దీపావళి, ఉగాది, సంక్రాంతి పండగలు ప్రత్యేక సంచికలుగా సాహిత్య సంబరాలను కూడా మోసుకురావడం అప్పటి ఆనవాయితీ. ఈ సరళి కేవలం వ్యాపారం కోసమే కాదు, మంచి రచయితలను, నాణ్యమైన సాహిత్యాన్ని నిలుపుకోవడానికి కూడా ఉపయోగపడింది. కాలం ఎంతమారినా, రచయితకు పత్రికకూ ఉన్న ఈ సంబంధం మారలేదు. ఎందుకంటే, పత్రికకు ఎన్ని వనరులు ఉన్నా, ప్రధానంగా పత్రిక ఆధారపడేది సమకాలీన రచయితల మీద, నాణ్యమైన రచనల మీదే. తన రచన పదిమందికి చేరడానికి రచయితలకు వేరే దారులు ఉన్నా, అందంగా తీర్చిదిద్దబడి, ఒక స్థాయి ఉన్న రచనలే ప్రచురింపబడతాయి అన్న పేరు వచ్చిన పత్రికలో రచనను చూసుకోవడం, దానికదే ఒక గౌరవం. వేలి చివర ఒక స్థలం ఖాళీగా కనబడి రాయమని పోరుతున్నా నిభాయించుకుని, ఆ ఆలోచనలను ఒక వరుసలో, శ్రద్ధతో రాసుకోవడం, దిద్దుకోవడం పరిశ్రమతో కూడిన పని. కానీ అది ప్రాథమిక సాహిత్య అవసరం. అంతేకాదు, అది ఎంతో తృప్తినిచ్చే వ్యవహారం కూడానని ఎందరో చేయి తిరిగిన రచయితలు అంటారు. ఫేర్‌వెల్ టు ఆమ్స్ ఆఖరు పేజీని సరైన పదాల కోసం వెదుక్కుంటూ ముప్పై తొమ్మిదిసార్లు తిరగరాశాడట హెమింగ్వే. తాను వ్రాసినదానికంటే చెరిపివేసినదే ఎక్కువ అంటాడు నబకోవ్. సరిగ్గా పడవలసిన ఒక్క పదం కోసం రోజుల తరబడి ఎదురు చూసేవారట దేవులపల్లి కృష్ణశాస్త్రి. అజంతా తన స్వప్నలిపిలో ప్రచురించిన ప్రతి కవితా ఆయన మళ్ళీ మళ్ళీ దిద్దుకున్నదే. ఏది తోస్తే అది వ్రాసే ప్రతీవారూ రచయితలు కాలేరు; రచయిత కాదలచుకున్న వారికి తన రాతని బేరీజు వేసుకోని అందులోనుంచి ఎంతభాగాన్నయినా నిర్దాక్షిణ్యంగా తీసివేయగల చూపు ఉండాలి అంటుంది సిదొనీ కొలెట్. అట్లాంటి చూపు సహజంగానే రచయితలకు ఉంటే మంచిదే. లేనప్పుడు ఆ నిష్పాక్షికమైన చూపును ఇవ్వగలిగే పత్రికలు అవసరం. ఎందుకంటే, ఆ చూపు తన రచనలోని ప్రతి అక్షరాన్ని ప్రేమించే రచయితకు అందులోని అక్కర్లేని భాగాన్ని కూడా చూడగల శక్తిని ఇస్తుంది. తద్వారా రాతలో బిగి పెరుగుతుంది. ఆ బిగి ద్వారా రాతలో నాణ్యత. ఆ నాణ్యతే పాఠకులను రచనకు కట్టి పడేస్తుంది, వారి అభిరుచిని మెరుగుపరుస్తుంది. అలా నాణ్యత కోరుకునే రచయితలు పత్రికలకు అవసరం. బ్లాగులు, సోషల్ మీడియాల ఉద్దేశాలు వేరు కనుక, అక్కడ వ్రాసే వారికీ చదివే వారికీ ఈ చూపు అవసరం ఉండచ్చు ఉండకపోవచ్చు. కానీ ఆ చూపునివ్వగల పత్రికలు రచయితలకు అవసరం. రచయితలు కాదలచుకున్న వాళ్ళకి మరింత అవసరం.

కొద్దినెలల క్రితం సాహిత్య అకాడెమి యువపురస్కార ప్రకటన విడుదల కాగానే తెలుగు సాహిత్యలోకంలో ఊహించినంత దుమారమూ చెలరేగింది. ఒక రచనకు పురస్కారం లభిస్తున్నప్పుడు చర్చ జరగడం సహజం. ఆ రచన ఎంత ఉన్నతమైనదీ అన్నది, ఎవరి ప్రమాణాలకు అనుగుణంగా వారు విశ్లేషించుకుంటారు కనుక, భిన్నాభిప్రాయాలు అంతే సహజం. కాని, అసలు ఒక రచన ఎన్నో వడపోతలను దాటుకుని అక్కడి దాకా ఎలా వెళ్ళిందన్నది, అలాగే పురస్కారం ఇవ్వడానికి గల కారణాలను అకాడెమి సభ్యబృందం ఎందుకు ప్రకటించదు అన్నది, జవాబులు దొరకని ప్రశ్నలుగానే ఉండిపోయాయి. అదట్లా ఉంచితే, నిన్న గాక మొన్న ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డుల్లో, తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రికి పురస్కారం ప్రకటించడం, ఈ అవార్డు పట్ల ఏర్పడ్డ నిరసనను కొంత చెరిపివేసేదిగా ఉంది. కథలు చెప్పడంలో శాస్త్రిగారిది చిత్రమైన ఒడుపు. ఏకథకాకథ భిన్నంగా, కొత్తగా మెరుస్తూ కనపడుతుంది ఆయన కలంలో. వడ్ల చిలకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు, రామేశ్వరం కాకులు, జెన్ కథలు మొదలైన కథా సంపుటాలు; హోరు, దేవరకోటేశు, వీర నాయకుడు, గేదె మీద పిట్ట నవలలు; మాధవి అనే నాటకం; గాథాసప్తశతి నుండి ఎంపిక చేసిన వంద కథలతో అడవిపూలు సంపుటినీ ప్రచురించిన పతంజలి శాస్త్రి ప్రతిభకు దక్కిన సముచిత గౌరవం, ఈ పురస్కారం. అవార్డులు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే, సాహిత్యప్రపంచంలో వాళ్ళకయినా, అందులో మనలేక బయట నుండి సాహిత్యాన్ని అమితంగా ప్రేమించే సోషల్ మీడియా ఆవలి ప్రపంచానికయినా – అందుకున్న మనిషి రచనల మీద ఆసక్తిని కలుగజేయడం. పతంజలి శాస్త్రి కథలు కావాలని వాకబు చేస్తున్న వాళ్ళకి అందుతోన్న సమాధానం, అనల్ప, ఛాయా వాళ్ళు ప్రచురిస్తోన్న కథల సంపుటులు మినహా మిగతావేవీ ప్రస్తుతం అందుబాటులో లేవని. ప్రచురణకర్తల కనీస బాధ్యత పుస్తకాలను అందుబాటులో ఉంచడం. ప్రత్యేకించి ఉత్తమ రచనలను, పాపులర్ టాగ్‌కి అతీతంగా ఎప్పటికప్పుడు ప్రచురణలో ఉండేలా చూడటం ప్రచురణకర్తల బాధ్యతే. ఇది పతంజలి శాస్త్రి రచనలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు, తెలుగులో సంప్రదాయంగా నడుస్తున్న బాధ్యతారాహిత్యం. ఒకపక్క పుస్తకాలు అమ్ముడు పోవడం లేదని వింటాం. మరొక పక్క పుస్తకాలు అందుబాటులో లేవనీ వింటాం. అన్నీ కలిపి విశ్లేషించుకుంటే మళ్ళీ పాత మాటకే వస్తాం. ప్రచురణ రంగం పటిష్టంగా, గౌరవనీయంగా, నమ్మకంగా ఉండాలి. రచయితలు రచనల ప్రచురణ నుండి ఎడంగా ఉండగల వాతావరణం ఏర్పడాలి. రెండవ బాధ్యతారాహిత్యం సాహిత్యకారులది. అవార్డులు వస్తే, ఆయా రచనల గురించి ఉబలాటపడుతూ ఆరాలు తీస్తున్నాం, మంచిదే. మరి, మనం అవార్డులు రావాలి అనుకునే రచనల మీద ఎందుకు శ్రద్ధ పెట్టం, ఎందుకు వాటి గురించి చర్చలు నడపం? ఎందుకు తెలుగులో ఇన్ని కవితలు, కథలు, ముచ్చట్లు ఉంటాయి కాని, ఫలానా కథ, కవిత ఈ ఈ కారణాలకు మంచిది, ఈ రకంగా గొప్పదీ అని వివరణలతో, విశ్లేషణలతో కూడిన వ్యాసం అరుదుగా తప్ప కనపడదు? ఎందుకు రచన గురించి మాట్లాడడమంటే, రచన మొత్తంగానో, పేరాలు పేరాలుగానో ఎత్తి ఇలా అన్నారు అలా అన్నారు అని తప్ప, ఒక రచన గురించి లోతుగా ఏమీ చెప్పలేని స్థితిలో తెలుగు సాహిత్య సమాజం ఎప్పుడూ మగ్గిపోతూ ఉంటుంది? ఎందుకు మనం ఒక చక్కని విమర్శ వ్రాయడానికి కనీసం ప్రయత్నించం? అకాడెమి అవార్డు రాకూడని వాళ్ళకు వస్తే ఆ తప్పులో తెలుగు కవి రచయితల బాధ్యత కచ్చితంగా ఉంది. తెలుగు సాహిత్యలోకం మంచి పుస్తకాల వివరాలను, వాటి మంచి చెడ్డలను, అర్హతా అనర్హతలనూ మున్ముందుగా ఎందుకు చదవకూడదు, చర్చించుకోకూడదు? అకాడెమికి దారి ఎందుకు చూపకూడదు?

తెలుగు సాహిత్యాభిమానులందరూ ఎదురు చూసే పుస్తకాల పండుగ మళ్ళీ వస్తోంది. డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగునాట – ముఖ్యంగా హైద్రాబాదు, విజయవాడలలో – జరిగే అతి పెద్ద పండుగల్లో పుస్తక మహోత్సవం కూడా ఒకటి. ఎన్నో ప్రాంతాల, ఎందరో రచయితల కథలను, కవితలనూ మూటగట్టుకుంటూ, మళ్ళీ ఈ నెలాఖరుకి కొత్త కాగితాల రెపరెపలతో సందడి మొదలు కాబోతోంది. పుస్తకాలు కొనడమూ, చదవడమూ కాదు, ఊరికే చూడటం కూడా ఉత్సవమయి, ఉత్సాహాన్నిచ్చే సంబరంగా ఏడాది చివర్లలో సాగడం, గత కొన్నేళ్ళుగా తెలుగునాట స్థిరపడిపోయిన ఆనవాయితీ. ఈ ఏడాది చదివిన పుస్తకాలు, చదవాల్సిన పుస్తకాలు, వెతుక్కోవాల్సిన పుస్తకాలు… ఒక నెలలో పండుగ రానుందంటే ఈపాటికి ఎన్ని జాబితాలు ప్రకటితమవ్వాలి! పుస్తక ప్రేమికులే చొరవ తీసుకుని మొదలెట్టాల్సిన వేడుకలివి. పుస్తకాల పండుగ అంటే ప్రచురణకర్తలదీ రచయితలదీ మాత్రమే కాదు, పాఠకులది కూడా. ఈ బుక్ ఫెస్టివల్స్ జరిగినన్నాళ్ళూ అక్కడ సభలూ జరుగుతాయి. ప్రక్రియల వారీగా చర్చలు జరుగుతాయి. అక్కడైనా, బయట మాధ్యమాల్లో అయినా, పత్రికల్లో అయినా విమర్శ వ్యక్తిగతంగా వ్రాయకుండా రచనాపరిధికి లోబడి వ్రాసే నియంత్రణను రచయితలు; విమర్శను వ్యక్తిగతంగా తీసుకోకుండా సూచనగా గమనించగల విజ్ఞతను పాఠకులూ అలవరచుకుంటే, సాహిత్య సమాజంగా మనకు ఎంతో కొంత ఎదుగుదల ఉంటుంది. రచయితలు కూడా వ్రాయడం అన్న ప్రక్రియకు పదును పెట్టుకోడానికి మొదట పాఠకులవ్వాలి. సాటి రచయితల పుస్తకాలపై సద్విమర్శలు వ్రాయాలి. వాటిని చర్చించాలి. వాటి మీద ఆసక్తి పెంచాలి, వాటికి గుర్తింపు తేవాలి. పాఠకులు వెతుక్కుని వెళ్ళి పుస్తకాలను కొనుక్కునే రీతిలో ఆకర్షణ కలుగజేయాలి. ఒక రచన మంచి చెడ్డలు, బలాబలాలు సాటి రచయితలే చప్పున గుర్తు పట్టగలరు కనుక, ఇదంతా రచయితలే ఒక కర్తవ్యంగా చేయవలసిన పని. వాళ్ళు క్రియాశీలమైతే, ఆ ఉత్సాహం పాఠకులలోకీ పాకుతుంది. అలా పుస్తకం నలుగురి నోళ్ళల్లో నానుతుంది. చదివిన పుస్తకాల గురించి నచ్చినా నచ్చకున్నా నిర్మొహమాటంగా అభిప్రాయాలను పంచుకోవడము, చదువరులు వీలైనంత వివరంగా తమ విమర్శలను, సమీక్షలను రాసి పత్రికలకు పంపించడమూ చేస్తే, అటు మరో నలుగురికి చదివే స్పూర్తిని అందించినవారు అవుతారు. ఇటు సాహిత్యమూ ఇంకాస్త చలనశీలమైనట్టు ఉంటుంది. ఆహ్లాదం, ఆలోచన, హక్కులు, బాధ్యతా, ఉత్తేజం, స్పూర్తి – పుస్తకాలు ఇవ్వలేనిది లేదు, పుస్తకాలు చెప్పనివీ ఏం లేవు. అయితే ఇప్పుడు మొదలయే ఈ పుస్తక మహోత్సవాల ద్వారా ఇవన్నీ అందిపుచ్చుకుని, వచ్చే పండుగ దాకా వీటిని నిలిపి ఉంచుకోవడమే ఇప్పటి మన కర్తవ్యం.

ఇరవై అయిదేళ్ళ క్రితం, ఇంటర్‌నెట్ వాడకం మొదలయిన తొలినాళ్ళలో, ప్రవాసంలో ఉన్న తెలుగు సాహిత్యాభిమానులు, రచయితల కోసం ఒక చిరువేదికగా రూపుదిద్దుకున్న పత్రిక ఈమాట. మొట్టమొదటి ఈమాట సంచిక విడుదలై పాతికేళ్ళు దాటిన సందర్భంలో, ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని సింహావలోకనం చేసుకుంటుంటే, మైలురాళ్ళ లాంటి ఎన్నో సందర్భాలు కనపడుతున్నాయి. వెబ్ పత్రికలంటే ప్రింట్ పత్రికల స్థాయీ కాదు, వాటికి ప్రత్యామ్నాయమూ కాదు అనుకున్న ఆ తొలినాటి నుండి, కథలైనా, కవితలైనా, ఏ వార్షిక సంకలనాలైనా వెబ్‌పత్రికలను జల్లెడ పట్టక తప్పని ఈనాటి దాకా సాగిన సుదీర్ఘ ప్రయాణమిది. లాభాపేక్ష లేకుండా, కుల మత రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణాన్ని అందించే ఉమ్మడి వేదికగా మనగలగడమే మొదటినుంచీ ఈమాట ఏకైక లక్ష్యం. సాహిత్యానికి నిర్వచనాలు, పరిధులు, పరిమితులు ఉండవు, ఉండకూడదు అన్న బలమైన నమ్మకంతో అన్ని రకాల అభిప్రాయాలకు, నూతన సాంప్రదాయ సాహిత్యాలకు, విభిన్న సాహిత్య ప్రయోగాలకూ నెలవు కావాలన్న ఆదర్శానికి, ఆశయానికీ ఈమాట ఈనాటికీ కట్టుబడి ఉంది. రచయితకు ముఖస్తుతి గౌరవం కాదు. వారి రచన పట్ల శ్రద్ధ చూపడం, సమయం వెచ్చించడం, చర్చించడం, సహృదయంతో విమర్శించడం – ఇదీ రచయితకు చూపగల నిజమైన గౌరవం. రచయితల పేరు కాదు, రచన నాణ్యత ముఖ్యం అన్న అకుంఠిత నియమంతో నడపడం వల్ల, కొందరు రచయితలు ఈమాటకు వ్రాయలేదు, కొందరు మా పరిష్కరణ పద్ధతుల పట్ల సుముఖులు కాలేదు. మరి కొందరు ఆగ్రహించారు, దూషించారు. కానీ ఎందరో ఈమాటకు వ్రాశారు, ఇంకొందరు కేవలం ఈమాటకే వ్రాశారు. ఎందరో రచయితలు మా పరిష్కరణలను సాహిత్యస్ఫూర్తితో ఆహ్వానించారు. అవసరమైన చోట వారి రచనలు మెరుగు పరుచుకోగలందుకు మా సూచనలు స్వీకరించారు. ఈమాట నియమాన్ని సాహిత్యవ్యాసంగపు ముఖ్యావసరంగా గుర్తించి సంపాదకులతో కలిసి పనిచేసి తమ రచనలకు మెరుగులు దిద్దుకున్నారు. ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపుకోవడం కాదు, కలిసి తప్పులు దిద్దుకోవడం ఇది అని గుర్తించారు. రచయితలు సంపాదకులూ ఒకరికొకరు తోడుగా ఒకే గమ్యం కోసం కలిసి చేసే సాహితీప్రయాణం ఇది అని అర్థం చేసుకున్నారు. అలానే ఎందరో సాహిత్య ప్రేమికులు ఇక్కడి రచనలను మిత్రులతో పంచుకున్నారు. చదివారు, చదివించారు. విమర్శించారు. తప్పులను నిష్కర్షగా చర్చకు పెట్టారు. మేము మెరుగయ్యే మార్గాలు ప్రతిపాదించారు. ఒక సాహిత్యసమాజంగా మనందరి గమ్యం ఒకటే అన్న స్పృహతో సాగిన ఈ ప్రయాణాన్ని, కాలంతో ఎదుగుతూ, సమకాలీనతకు ఒదుగుతూ, ఇలానే కొనసాగించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాం. మాకు వెన్నుదట్టి, ప్రోత్సహించి ఈ ప్రయాణంలో మాతో కలిసి నడిచిన రచయితలు, పాఠకులకు ఈ సందర్భంగా మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. తొలినాటి నుంచీ తోడు నడిచిన రచయితలతో పాటు ఎందరో కొత్త రచయితలు, ఎంతో ఆసక్తితో ఈమాటకు తమ రచనలు పంపుతున్నారు, మాతో చర్చిస్తున్నారు, ఈమాట నిరంతరాయంగా నడపడానికి మాకు ఎనలేని ప్రోత్సాహం ఇస్తున్నారు. మీ ప్రోత్సాహం ఇకముందూ ఇలానే ఉంటుందని ఆశిస్తూ, మీ అందరికీ మరోసారి కృతజ్ఞతాపూర్వకంగా ఈ సంచికకు సాదర స్వాగతం పలుకుతున్నాం.

పుస్తక ప్రచురణ ఒక అరుదైన గౌరవం అనుకునే రోజుల నుండీ, నా అల్లిబిల్లి రాతలన్నీ నా సంతోషం కోసం నేనే అచ్చు వేసుకుంటానని ఎవరికి వారే ఓ ముల్లెతో ముందుకు వస్తున్న రోజుల దాకా ప్రచురణ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అవి అక్కడే ఆగితే ఎవరికీ పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ, నా పుస్తకాలు ఎవరూ కొనట్లేదు, తెలుగులో సాహిత్యాభిలాష కనుమరుగయింది, ఉచితంగా ఇచ్చినా ఎవరూ ఒక మంచిమాట చెప్పరు, పత్రికలు గమనించి సమీక్షలు రాయవు, ఆ ప్రచురణకర్తలు ఎన్ని అమ్మారో ఆ డబ్బు ఏమైందో చెప్పరు అంటూ వాపోయే రచయితల రద్దీ గత కొంతకాలంగా ఎక్కువయింది. మార్పు ఎలా అయితే అనివార్యమో, మార్పు తాలూకు ప్రభావాలను అన్ని కోణాలనుంచీ విశ్లేషించుకోవడమూ అంతే అనివార్యం. ప్రచురణ నాణ్యత, రచన నాణ్యత అన్నవి ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు. ప్రచురణలో నాణ్యత సరే, తమ రచనలో నాణ్యతను నిజాయితీగా అంచనా వేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? కొన్ని కవితలనో, కథలనో, తమ అభిప్రాయాలనో కూర్చుకుని ఏ బుక్ ఎక్జిబిషన్‌‌ కోసమో హడావుడిగా ప్రచురించుకునే ముందు, అందులో సాహిత్యపు విలువ ఎంత అన్న ప్రశ్న వినపడే వాతావరణం ఇంచుమించుగా పోగొట్టుకున్నాం. ఇందుకు రచయితల అహాలు, అపోహలు తప్ప వేరే కారణాలు లేవు. తమ వాక్యాన్ని, తమ వస్తువుని నిశితంగా, నిరాపేక్షగా అంచనా వేసుకోలేని వారు, నా రచనను ఇంకెవరూ విమర్శించలేరు అని అహం ఒలకపోస్తారు. పొగడ్త లేకున్నా బతుకుతుంది కాని విమర్శ లేకుంటే సాహిత్యం బతకదని వీరికి తెలియదు. అందుకే వీరు తమ రచనలను పత్రికలకు పంపరు. సంపాదకుల సూచనలు, పరిష్కరణ పట్ల ఏవగింపు, ఆవేశంలో పెల్లుబికిన రచనలో ఉండే నిజాయితీ పరిష్కరణలో పోతుందన్న అజ్ఞానం, ఇంకా సాహిత్యసమాజంలో విస్తృతంగానే ఉన్నాయి. శబ్దవమనం సాహిత్యం కాదని చెప్పడానికి మనకి గురువులంటూ ఎవరున్నారు తాలు సాహిత్య పీఠాధిపతులు, రాయాలి రాయండని ఎగదోసే ముఠాకోర్లూ తప్ప! చాలా మంది రచయితలు బెంగపడుతుంటారు కాని, వాక్యం శ్రద్ధగా రాస్తే నిజాయితీ మాయమవడం, పదును పెడితే రచన విలువ పోవడం ఉండవు. పరిష్కరణ రచన డొల్లతనాన్ని రచయితకు పట్టిస్తుంది, అంతే. వాక్యపుబలిమితో కథలు చెప్పి మెప్పించిన రచయితలు మనకు లేరా? వారెవరూ ఆదర్శం కాదా? అసలు సంగతేంటంటే ఈ తరహా రచయితలది మేకపోతు గాంభీర్యం. విమర్శ అంటే జంకు. వాక్యం మీద శ్రమను వెచ్చించడానికి బద్ధకం. అర్థరాహిత్యాన్ని ప్రశ్నిస్తే వివరణ ఇవ్వడానికి అహం. అనవసరమైన పదాలో వాక్యాలో తీసేయమంటే ఎందుకు ఉంచాలో చెప్పలేని అయోమయం. రాయలేమన్న నిజాన్ని అంగీకరించడం రాసేవాళ్ళకు కష్టం. ఆ నిజం చెప్పినవారిపై తమ గొంతు నొక్కుతున్నారని అఘాయిత్యం చేయడం సులభం. అలా చేస్తూ కూడా, ప్రచురణకర్తలు తమ రచనలు ప్రచురించరేమని ప్రశ్నించే రచయితలు కొందరు. తమ రచనలకు ఇవ్వాల్సిన రాయితీలు, పారితోషకాలు ఇతర దేశాల్లో మాదిరిగానో, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానో లేవని వాపోయే వారు ఇంకొందరు. ఇతర దేశాల్లో ఉన్న పబ్లిషింగ్ హౌస్‌లు ఎన్నెన్ని నియమాలతో ఫుస్తక ప్రచురణ అంగీకరిస్తాయో, రచన నాణ్యతకు సంబంధించి ఎన్ని కఠినమైన పరిశీలనల్లో నెగ్గాలో వీళ్ళకు తెలుసని అనుకోలేం. తెలుసుకునే ఆసక్తి ఉందనీ ఆశించలేం. ఇక్కడ రచయితలకు ప్రచురణకర్త సమయం పట్ల, అతని వనరుల పట్లా చిన్నచూపు, తమ సాహిత్యస్థాయి పట్ల మాత్రం అమితమైన విశ్వాసం. అందుకేనేమో, నా పుస్తకాన్ని ఒక పాఠకుడు తన సమయమూ ధనమూ వెచ్చించి ఎందుకు చదవాలి? అని వీరెవరూ తమను తాము ప్రశ్నించుకోరు. పుస్తకం అమ్ముడు పోవాలంటే అది అచ్చులోకి రాకముందే మంచి రచయితగా పాఠకులలో గుర్తింపు తెచ్చుకోవడం ఒక పద్ధతని గుర్తించరు. సాహిత్య పరిశ్రమ, సాధనతో కూడిన రచన, పత్రికలకు పంపడం, పరిష్కరణ, ప్రచురణ, తద్వారా సమకాలీనులలో తమ రచనల పట్ల ఏర్పడే ఆసక్తి, గౌరవం, ఆదరణ, దరిమిలా ప్రచురణకర్తల ఆహ్వానం – ఇలా ఎన్నో మెట్లు దాటి ప్రచురించబడిన పుస్తకానికి, ఏ మెట్టు ఎక్కని పుస్తకానికీ ఎంతో తేడా ఉంటుంది. ఆ తేడా తెలుసుకోకుండా తమ పుస్తకాలు అమ్ముడు పోవటం లేదని ప్రచురణకర్తలను, పాఠకులనూ ఆడిపోసుకోవడంలో అర్థం లేదు. పుస్తకం అన్నది రచన, ప్రచురణ కలిసి జీవం పోసుకొనే కళాత్మక వస్తువు. ఆ రెండు విలువలూ పరస్పర పూరకంగా ఉంటేనే అంతిమంగా కళకు విలువ. శ్రీరమణ ఒక రచయితకు ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు: “మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం, ఒక వెదురు పొదను సమూలంగా నాశనం చేస్తున్నామని. ఒక వెదురు పొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.” పుస్తకాలు అచ్చు వేసుకుంటున్న ఎందరో తెలుగు రచయితలకు ఈ విజ్ఞత అత్యవసరం.

సాహిత్యసమాజాలు బలంగా ఎదగడానికి సాహిత్యాభిలాష, సాహిత్య కృషికి తగిన ప్రోత్సాహం మాత్రమే సరిపోవు. వాటికి వెన్నుదన్నుగా వ్యాపారదృష్టి, దక్షతా ఉండాలి. తెలుగులో చాలాకాలం పాటు చెప్పుకోదగ్గ ప్రచురణ సంస్థలు రెండు మూడింటికి మించి లేవు. కాలక్రమేణా సమాజంలో పుస్తకాల ఆదరణతోపాటు వాటి ప్రాభవమూ తగ్గుముఖం పట్టాక ప్రమాణాలు, నియమాలు లేని తాలు ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. రచయితలు తమ పుస్తకాలు తామే అచ్చువేసుకోవడం మొదలయింది. కాని, పుస్తకప్రచురణ, విక్రయాలు సృజనకు సంబంధించని వ్యాపారరంగపు మెళకువలని, అవి తమకు లేవని రచయితలు గుర్తించలేదు. ఏదో ఒకలా తమ పుస్తకం అచ్చులో చూసుకోవాలన్న రచయితల ఉబలాటానికి, ప్రచురణకర్తల లోభిత్వం, కొరవడిన అభిరుచి, ప్రమాణాల పట్ల అశ్రద్ధ తోడై నాణ్యత లేని నాసిరకపు పుస్తకాలు ప్రచురింపబడుతూ వచ్చాయి. గత కొన్నాళ్ళుగా ఆ ధోరణి మారుతోంది. తెలుగులో పుస్తకప్రచురణ పట్ల అభిలాష, నాణ్యత పట్ల శ్రద్ద ఉన్న ప్రచురణ సంస్థలు ఏర్పడ్డాయి. వారు ప్రచురించే పుస్తకాలు చక్కటి నాణ్యతతో అంతర్జాతీయ స్థాయితో పోల్చదగ్గవిగా ఉంటున్నాయి. కాని, అప్పటికీ ఇప్పటికీ మారని అంశం – పుస్తక ప్రచురణలో కనిపిస్తున్న ఈ వృత్తితత్త్వం రచయితలతో సాగే లావాదేవీలలో కనిపించక పోవడం. తద్వారా రచయితలకు ప్రచురణ సంస్థలపైన ఇప్పటికీ నమ్మకం కుదరకపోవడం. ఇందులో రచయితల పాత్ర గురించి, తమ రచనల పట్ల రచయితలకున్న అపోహల గురించీ తర్వాత, కాని తమ పుస్తకాలు ఎన్ని అచ్చు వేయబడుతున్నాయో, ఎన్ని అమ్ముడు పోతున్నాయో, ఎంత పారితోషకం రానుందో తెలియని అయోమయంలోనే చాలామంది రచయితలుంటున్నారు. ప్రచురణ సంస్థలు వారికి నిర్దిష్టమైన సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు, అపోహలకూ దారి తీస్తుంది. పుస్తకాలు అమ్మి కోటీశ్వరులైన ప్రచురణకర్తలు తెలుగులో ఎవరూ లేరు, నిజమే. అలాగని, తాము అమ్మలేని పుస్తకాలు సొంతడబ్బుతో ప్రచురించి ఈ సంస్థలు ఆ రచయితలనేమీ పోషించటం లేదు. ప్రస్తుత తెలుగు సాహిత్య వ్యాపారంలో డబ్బు తక్కువన్నది నిజం. కాని, తెలుగు సాహిత్యం వర్ధిల్లాలి అంటే రచయితలకు, ప్రచురణ సంస్థలకు మధ్య పరస్పరం నమ్మకం, గౌరవం ఉండాలి. అవి ఏర్పడాలంటే ప్రచురణ సంస్థలు స్పష్టమైన వ్యాపారనియమావళిని పాటించాలి. రచయితల డబ్బుతో ప్రచురణ, వితరణ వంటి సాంకేతికసహాయం మాత్రమే అందించే సంస్థలకూ ఇది వర్తిస్తుంది. నోటిమాటగా కాకుండా, తమ నిబంధనలు, విధానాలను చట్టబద్ధమైన ఒడంబడికలు చేసుకునే విధానం తెలుగునాట మొదలవ్వాలి. ప్రచురణావిక్రయాలు వ్యాపారాలు. వ్యాపారంలో స్నేహాలు, ఆత్మీయతలు, స్వచ్ఛంద సేవలు ఉండవు, ఉండకూడదు. పుస్తక ప్రచురణ క్రమంలో ప్రతీ అడుగుకూ మూల్యం ఉండాలి, అది చెల్లింపబడాలి. సంస్థలు రచయితలతో తాము చేసుకున్న ఒడంబడికలను పాటిస్తూ క్రయవిక్రయాల వివరాలు తెలియజేయాలి. తమ వ్యాపారసరళి నిజాయితీతో కూడినదని రచయితకు నిరూపించగలగాలి. సమస్య డబ్బు గురించి మాత్రమే కాదు, ఉండవలసిన నమ్మకం గురించి కూడా. ఇది ప్రచురణ సంస్థలకు అనవసరపు శ్రమగానో, వారి అహానికి దెబ్బగానో అనిపించవచ్చు. కాని, ఆ పారదర్శకత ప్రస్తుత తెలుగుసాహిత్య ప్రచురణారంగంలో అత్యవసరం. సాహిత్యం అభిలాష, పుస్తకం వ్యాపారం. ఈ రెంటిమధ్యా ఒక స్పష్టమైన విభజనరేఖ ఉంది. ఈ విభజనను గుర్తించి ఆచరించే కొద్దీ ఆ సంస్థల ప్రాభవమూ పెరుగుతుంది.

రాముణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉపక్రమించి ఓ భక్తుడు ‘రామా! నీలమేఘశ్యామా’ అని మొదలెట్టాట్ట. ‘సర్లేవయ్యా! ఓ చాయ తగ్గినంత మాత్రాన దాని ప్రస్తావనే తేవాలా?’ అని చిన్నబుచ్చుకున్నాడట రామయ్య. ‘చెట్టు చాటు నుండి వాలిని చంపిన వీరాధివీరా, శబరి ఎంగిలి మింగిన ఇనకులతిలకా!’ అని భక్తుడు స్తోత్రపాఠం అందుకోగానే ‘అన్ని కాండల రామాయణంలో మేము చేసిన మహత్, చమత్, బృహత్ కార్యములు అనేకములు ఉండగా నీకు ఇవే తట్టాయా?’ అని నోరు చేసుకుని వరాలేవీ ఇవ్వకుండానే మాయమయ్యాట్ట ఆ పురుషోత్తముడు — ఇది రాసింది రమణ అంటే ముళ్ళపూడి రమణ అనుకునే తెలుగువారు ఈ రోజుకీ తెలుగునాట ఉన్నారు. మల్లెపూవులా జీవించి మొల్లపూవులా వెళ్ళిపోయిన ముళ్ళపూడి పేరు మీద తనను గుర్తు చేసుకుంటే శ్రీరమణా నొచ్చుకోకపోవచ్చు. అయినా చాలామంది మిథునం రాసిన రమణ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. శ్రీరమణ అంటే బాపు దస్తూరీలోని తెలుగు కథ. బంగారు మురుగు, షోడానాయుడు, ధనలక్ష్మి, మిథునం, నాలుగో ఎకరం ఇలా ఆయన రాసిన అన్ని కథల్లోనూ మానవ సంబంధాల మీద అనితర సాధ్యమైన ఒక వ్యాఖ్య ఉంటుంది. చాలా కథల్లో మనుషులందరూ అనివార్యంగా పోగొట్టుకున్న ఒకానొక కాలం మీద దృష్టి పెట్టారాయన. ఆ రోజుల సున్నితత్వమూ నమ్మకమూ మరిక ఎన్నటికీ తిరిగి రాలేవని గుర్తు చెయ్యడంలోని విషాదం ఆయన కథల్లో అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. మనిషిలోని పెద్దరికమూ పసితనమూ పంతాలు పడే కథా వస్తువులేవో ఆయన కలానికి లోబడిపోయాయి. అందమైన అలతి మాటలు, వ్యంగ్యంతో మిళితమైన సున్నితమైన హాస్యం రమణ రచనల తాలూకు కొండగుర్తులు. వడిసెల తిప్పినట్టు జడ విసిరితే కుప్పెలు ఛెళ్ళున తగిలి కష్టసుఖాలు ఒకేసారి అనుభవంలోకి వచ్చేవిట వరహాల బావి ఊరి కుర్రాళ్ళకి. ధనలక్ష్మి, మేల్ ఇగో పోరు పడలేని ఎందరెందరో ఆడవాళ్ళకి ఒక ఆశాదీపం. ఎర్ర రాళ్ళ నెక్లెసుతో కంటినిండా కాటుకతో ‘ఇదిగో రామాంజనేయులూ, నాకు పెన్సిలు కావాలి’ అని ఘల్లుఘల్లున గజ్జెల చప్పుడుతో వచ్చి క్లాసు బయట నిలబడి అరిచిన ఎనిమిదేళ్ళ ధనలక్ష్మి, ‘లక్క బంగారం అంటుకుని ఉంటేనే తాళిబొట్టు నిండుగా ఉండేది’ అని ఆరిందాసూత్రాలు పొడుపుకథల్లా చెప్పేంతదవుతుంది. పసితనపు నీలంగోళీ కలని నిక్కరు జేబులో మోసుకొచ్చి, ఇవ్వడానికి మోమాటపడిన సిద్ధుడు – షోడానాయుడు కథలో – కళ్ళ నీళ్ళు పెట్టిస్తాడు. ‘చెంగనాలు వేస్తున్న తువ్వాయి మెడలో పట్టెడ తెగిపోయి మువ్వలు చెదిరిన విధాన, మబ్బు తునకలు తునకలై గడగడా వడగళ్ళు రాలిన చందాన, నేరేడుపళ్ళు దోసిలితో గుమ్మరించిన తీరున షోడాగోళీలు నా గది గచ్చు మీద పడి దొర్లుతున్నాయి’ అని చదువుతుంటే, గుండె గొంతుకలోన కొట్టాడనుందని తెలిసిపోతుంది. ఏళ్ళకేళ్ళ జీవితాలని ఎంతో వైనంగా కుదించి చెప్పగల నేర్పు శ్రీరమణది. అందుకే బోలెడంత మందికి బోలెడు కలలిచ్చి పోయారు. ముగ్గులేసే బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకు పడుకుని కునుకు తీయగల బాల్యం, నాలుక్కాసులు ఒక్క ముద్దుకి చెల్లురా అని మనవడిని ఒప్పించి పిల్లని కుదిర్చే బామ్మ -ఎన్నేళ్ళ కాలమూ కరిగించలేని బంగారు మురుగంత అపురూపం. దాంపత్యంలో ఇంత స్నేహం, ఇంత తత్వం ఉంటే అదే మిథునం. పేరడీలు, ఛలోక్తులు, ఎప్పటెప్పటివో అనుభవాలూ జ్ఞాపకాలే ఆయన రచనలు. నవ్వులో శివుడున్నాడురా అని ఆయన చెప్పిన కబుర్లు హాయిగా మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గవి. అందమైన ఆడపిల్లను చూసి ‘ఎవడో మీగడ తోడెట్టాడురోయ్’ అన్న మల్లాది మాట తనకెంతో ఇష్టమని చెప్పుకునే శ్రీరమణ అంతకంతా అందమైన వాక్యాలతో పాఠకులను అలరించారు. పొగడ్త కూడా ఎలా ఒక కళో, నేమ్ డ్రాపింగ్ ఎలా చేస్తే రక్తి కడుతుందో బోలెడు చమక్కులతో చెప్పి పోయిన నిక్కమైన మంచి నీలంపురాశి శ్రీరమణని, ఆయన సాహితీ సంపదలో నుండి ఏ మాటలతో పొగిడినా అనౌచిత్యం ఉండబోదు.

పెద్దగా ఏమీ ఏదీ అక్కర్లేదు. ఒక వెయ్యి నూట పదహార్లు మొదలుకుని, రెండు మూడు శాలువాలు పూలదండలు ఒక సాయంత్రంలో మూడు నాలుగు గంటలు కలుపుకొని, కొంత మొత్తం తనది కాదనుకుంటే, తెలుగునాట ఎవరైనా పురస్కార ప్రదాత కాగలరిప్పుడు. అమ్మలో నాన్నలో అక్కలో అన్నలో పెంచి పెద్ద చేసినవాళ్ళో దయతో చదువు చెప్పించినవాళ్ళో గురువులో పెంపుడు జంతువులో – ఎవ్వరి పేరు మీదైనా ఇప్పుడు ఒక సాహిత్య పురస్కారం ఆరంభించనూ వచ్చు, ఆ పక్క ఏడాదే ముగించనూ వచ్చు. ఇచ్చుకునేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు తప్ప వీటికి అర్హతలింకేమీ అక్కర్లేదు. ఏ సాహిత్య విలువలు, ప్రమాణాలతో ఎందుకిస్తున్నారో తెలియకుండా దానంలా ఇచ్చే ఈ పురస్కారాలను ఏమనలేం. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల ప్రైవేటు ఇష్టాలు కాబట్టి ఏమీ అనకూడదు కూడానూ. ఇలా వ్యక్తిగత ఇష్టాలు, కారణాలతో వీధికొకటిగా దొరికే పురస్కారాల మధ్యలో ప్రభుత్వం అందించే సాహిత్య అకాడెమీ అవార్డుకు ఒకప్పుడు కొంతయినా విలువ ఉండేది. అది అందుకున్న వారి పట్ల గౌరవం ఉండేది. ఆ రెండూ బహుశా ఇకపై ఉండవు, ఉండబోవు. సంస్థాగత బాధ్యత ఎంత గురుతరమైనదైనా, ఆ సంస్థను నియంత్రించే సాహిత్యకారులు అందరిలా అల్పమానవులే అన్న మేల్కొలుపు, గడియారం గంటలా ఇన్నేళ్ళుగా మోగుతూ వస్తున్నా, తెలుగు సాహిత్య ప్రపంచాన్ని చరిచి నిద్ర లేపింది ఈ ఏటి సాహిత్య అకాడెమీ యువ పురస్కార్ అవార్డు ప్రకటన, అదీనూ సోషల్ మీడియా చలువ వల్లనే. ఒక పుస్తకాన్ని పురస్కారానికి ఎలా ఎన్నుకున్నారన్న సందేహం కలిగించే రచనలు మునుపూ లేకపోలేదు. సాహిత్యవిభాగాల నుండి అందుకున్న పుస్తకాల్లో నుండి కమిటీ ఉత్తమమైనవి ఎన్నుకోవాలన్నది అకాడెమీ పురస్కారం తాలూకు ప్రాథమిక ఎంపికకి సంబంధించిన ఒక నియమం. కానీ ఏ రకంగా చూసినా ఏ సాహిత్యవిలువలూ కనపడని రచనలను పదేపదే ఎన్నుకోడం ద్వారా తెలుగు భాషలో వస్తున్న ఉత్తమసాహిత్యం ఇంతమాత్రమే అని తెలుగు అకాడెమీ దేశానికంతటికీ చాటి చెప్తూ వస్తోంది. ఏ విభాగంలో పురస్కారాలైనా ఆయా విభాగాల్లో చెప్పదగ్గ కృషి చేసిన కవులు, రచయితలు, సాహిత్యకారులకు, నిజమైన సృజనాత్మక శక్తి ఉన్నవాళ్ళకి ఇస్తే, వాళ్ళకి జాతీయంగా గుర్తింపు వస్తుంది, వాళ్ళ సాహిత్య ప్రపంచం విశాలమవుతుంది. సృజన యొక్క నాణ్యత ఎంచడం అనేది ఎంత సాపేక్షికమైనా, పోల్చి చూసినప్పుడు సాధారణ పాఠకులు కూడా అద్భుతమైన విచక్షణ చూపిస్తూ ఏది మంచి కవితో కథో విమర్శో ఏది కాదో వివరించి మరీ చెప్పగలిగినప్పుడు, కేవలం నాసిరకం రచనలనే ఎంచుకుంటున్న అకాడెమీ పెద్దలను తూర్పారపట్టడం ఒక బాధ్యత. మచ్చుకైనా కనపడని వాళ్ళ నిబద్ధతను వేనోళ్ళ ప్రశ్నించక పోవడం నేరం. స్వార్థ రాజకీయ సమూహాలు, అనుయాయులైన కవిరచయిత బృందాల భజనల కోలాహలం తోడుగా, ఏళ్ళకు ఏళ్ళ తరబడి జులుం చేయడం హక్కుగా పీఠాలను ఆవహించుకుని కూర్చున్నారు కొందరు అజ్ఞానవృద్దులు. ఆ పీఠం ఇచ్చే గౌరవం కోసం దాన్నే పట్టుకు వేలాడే ఈ కుకవుల ఆధిపత్యాన్ని గుడ్డిగా ఆమోదించే అకాడెమీ కమిటీల దౌర్భాగ్యం వల్ల తెలుగు సాహిత్యంలో ఈ పురస్కారాల విలువ చెప్పుకంటుకుంటే రాయికి తుడుచుకొని పోయే స్థాయికి చేరిపోతోంది, ఇప్పటికే చేరిపోకుంటే. సాహిత్యకారులకి కావలసినది వారి ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వని సమాజం, సృజనను బ్రతికించే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. సాహిత్యం విలువ తెలిసిన సమాజానికే సాహిత్యకారులను ఎందుకు కాపాడుకోవాలో, ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది. అలాంటి అవకాశం లేని చోట సాహిత్యకారులకు రెండే దారులుంటాయి. ఈ రొచ్చు తమది కాదని ఛీ కొట్టి, అలౌకిక స్థాయిలో రచనను ప్రాణశకలంలా ఏకాంతికంగా సృజించుకోవడం. లేదూ, సామాజిక స్థాయిలో ఈ కుళ్ళిపోయిన సంస్థలను ప్రతిఘటిస్తూ, ఎవరిదైనా సరే ఒక మంచి సాహిత్యానికి గుర్తింపు తేవడమొక బాధ్యత అని నమ్మి నడుములోతుకు ఈ బురదలోకి దిగి పోరాడడం. ఈ రెండూ కాని లోకంలో అకాడెమీ పెద్దల ఉచ్చిష్టాన్ని ప్రసాదంలా చేతులు చాచి స్వీకరించడమే ప్రతీ ఒక్కరి సాహిత్యనియమం అవుతుంది.

డెబ్భై ఎనభై దశకాలలో పెరిగిన తెలుగువారందరికీ మెకాలే విద్యావిధానం నశించాలి అన్న ఉద్యమ నినాదం, గోడ మీది రాతల్లో ఒకటిగా గుర్తుండే ఉంటుంది. ఆ విధానం నశించిందో లేదో కాని, ఆ తర్వాత ప్రభుత్వాలు విద్యావిధానాలను అంతకంతకూ నిర్వీర్యం చేస్తూ వచ్చాయి. అలా ఏర్పరచుకున్న ఈనాటి విద్యావిధానం లోని మంచి ఏమిటో చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరిప్పుడు. గత మూడు దశాబ్దాలుగా హ్యుమానిటీస్ లేదా లిబరల్ ఆర్ట్స్ అని పిలవబడే భాషలు, కళలు, సాహిత్యం, సంస్కృతి వంటివి పాఠ్యాంశాలుగా క్రమేణా కనుమరుగవవుతూ వచ్చాయి. వీటిని ప్రోత్సహించడం అటుంచి ఇవి ఎందుకు ముఖ్యమో, ఎందుకు చదవాలో చెప్పేవారు కూడా ఇప్పుడు ఎవరూ లేరు. ఏదో ఒక రకంగా కనీసార్హతగా డిగ్రీ ఉంటే చాలు అన్న అప్పటి ఆలోచన నుండి రానురానూ విద్య అన్నది కేవలం ఏదో ఒక రకంగా ఉద్యోగం సంపాదించడానికే అన్న ఇప్పటి ధోరణి దాకా తెలుగురాష్ట్రాలలో విద్య ఒక దుస్థితిలోకి నెట్టబడటానికి ప్రజలూ ప్రభుత్వాలూ ఎవరి పాత్ర వాళ్ళు శక్తిమేరకు నిర్వహించారు. చివరికి విశ్వవిద్యాలయాలలో కూడా కళలు, సాహిత్యం వంటి విభాగాలలో బోధన, పరిశోధనల నాణ్యత ప్రశ్నార్థకంగానే ఉంది. విద్య, విద్యార్థుల లక్ష్యం, విస్తీర్ణం ఎంతో సంకుచితమైపోయి ఉన్నాయి. పాఠశాల విద్యార్థులు తెలుగుని మార్కుల భాషగానే తప్ప జీవభాషగా, తమ ఆలోచనలను వ్యక్తపరుచుకునే భాషగా, తమ ఆలోచనలను, అనుభవాలను బలపరుచుకునే, సరిచూసుకునే భాషగా చూస్తున్నారా అన్నది కొన్ని దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని సమస్య. జీవితం మొత్తాన్నీ ఆర్జనతో ముడివేసుకుని తిరిగే తరానికి స్వేచ్చగా ఆలోచించడానికి కూడా పరాయి భాష అవసరం తప్పదు. తెలుగే ఉపాధిగా ఉన్న కొద్ది రంగాలు తప్ప, మిగతా సమాజమంతా మెల్లమెల్లగా తెలుగుకి దూరం జరిగిపోయిందనడం నిర్వివాదాంశం. ఉపాధి చూపించలేనివన్నీ అనవసరమైనవే అన్న వికృత భావనలను మనం వ్యవస్థలో చొప్పించి చాలా కాలమైంది కాబట్టి, యువతలో తెలుగు పట్ల ఆసక్తి లేదేమిటని ఇప్పుడు వాపోవడంలో అర్థం లేదు. ఎందుకు చదవాలి అన్న దానికి జవాబు చూపించకుండా తెలుగు చదవాలని పిల్లలే ముందుకు రావాలనుకోవడంలో ఉద్వేగమే తప్ప తార్కికత లేదు. అందువల్ల, ఇది నిజంగా ఒక సమస్య అని అర్థమైతే, నమ్మితే, సాహిత్యకారులు ప్రజలతో మమేకమై ప్రభుత్వ విద్యాశాఖలపై ఒత్తిడి తేవాలి. హ్యుమానిటీస్ ప్రాముఖ్యతను వారికి తెలియజేయాలి. వాటిని ప్రాథమిక పాఠశాలల స్థాయినుండి కాకున్నా కనీసం ఉన్నత పాఠశాలల పాఠ్యాంశాలలో భాగం చేయడానికి ప్రయత్నించాలి. ఇటీవల, ప్రస్తుత విద్యావ్యవస్థ తొమ్మిదో తరగతిలో దాదాపు పద్నాలుగు మంది కవుల కవితలని, అలాగే పద్నాలుగు మంది రచయితల కథలని తెలుగు పాఠ్యాంశాలుగా చేర్చారని, ఉపాధ్యాయులు వాటిని పిల్లలతో చదివించి అర్థవంతంగా వివరించవలసి ఉంటుందని తెలియవచ్చింది. ఎవరి ప్రయత్న ఫలితమైనా ఇది నిస్సంకోచంగా స్వాగతించవలసిన గొప్ప అడుగు. కనీసం ఉపవాచకాలైనా సమకాలీన కథలతో కవితలతో రావడమంటే, పిల్లలని మళ్ళీ సాహిత్య ప్రపంచంలోకి ఆహ్వానించినట్టు. భాషని బతికించుకునే పద్ధతి ఇదే. మెల్లమెల్లగా దారులు విశాలమయ్యే వీలు ఇదే. ఉద్యమాలు, పుస్తక మహోత్సవాలు, పోటీలు, చర్చలు, వీటన్నిటి కన్నా బలంగా తేలిగ్గా పిల్లలను చేరగలిగింది పాఠ్య పుస్తకాలే. ఈ తొలి అడుగు ఈ తరాన్ని చాలా దూరం తీసుకెళ్తుంది. ఎందుకంటే సాహిత్యం ఒక అలవాటుగానో అభిరుచిగానో కాదు, సంస్కారంగా అందుకోగల వయసులో వాళ్ళని చేరగలుగుతున్నాం కనుక. పెద్దయి వారు పుస్తకాభిమానులు అయినా కాకున్నా సాహిత్యంతో పరిచయమయినా ఏర్పడుతుంది, కొంతయినా చదవడం విశ్లేషించడం అలవాటు అవుతుంది కనుక. ఆపైన మిగిలింది ఇటువంటి ‘పనికిమాలిన’ చదువులు చెప్తారా అని దండెత్తే తల్లిదండ్రులనుండి పిల్లలను, పాఠశాలలను, ఈ రకమైన ప్రయత్నాలనూ కాపాడుకోవడం. ఎందుకంటే ఇలా సాంకేతికత, కళాత్మకత రెండూ కలగలసిన సమగ్రవిద్యావిధానం భావితరాలకు కేవలం ఒక పనిముట్టు వాడడం నేర్పించి ఆగిపోదు. విచక్షణ నేర్పి జీవితాన్ని ఎన్నో రకాలుగా తీర్చుదిద్దుకోటానికి వారికి దారి చూపిస్తుంది. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరత్వానికి తర్ఫీదునిస్తుంది. సాహిత్యం ఒక్కటే కాదు, మన సమాజం మెరుగుపడాలన్నా ఈ సమగ్రవిద్యావిధానం ఒక్కటే మార్గం.

సాంకేతిక విప్లవం సమాజంలోని ఎన్నో రంగాలను చెప్పుకోదగ్గ రీతిలో ప్రభావితం చేసింది. సాహిత్యం దీనికి మినహాయింపేం కాదు. ప్రత్యేకించి కోవిడ్ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇ-రీడింగ్ మునుపెన్నడూ చూడనంత స్థాయిలో పెరిగింది. ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టి, ప్రపంచం యథారీతిన కొనసాగుతున్నట్టు కనిపించినా, అప్పటి ఇ-అలవాట్లు ఇప్పుడు మరింత తీవ్రంగా, మరింత బలంగా కొత్త కొత్త ముఖాలతో కనపడుతూ ఉన్నాయి. కోవిడ్ ఈ ఇ-అవసరాలను మరింత స్పష్టంగా, ఒకింత ముందుగా చెప్పిందన్న మాటే తప్ప, ఇవన్నీ ఈ రోజు కాకపోయినా రేపైనా మనం చూడవలసిన మార్పులే. మార్పు కొత్త అవసరాల నుండి పుడుతుంది. అనివార్యమవుతుంది. పుస్తకం కొనుగోళ్ళు, అందుబాటు,  చదివే అలవాట్లకు సంబంధించి, పాఠకప్రపంచం ఇప్పుడు ఎన్నో కొత్త అవసరాలతో ఉంది. వాటి వైపు దృష్టి సారించకుండా సాహిత్యాన్ని నిలబెట్టుకోగలమనుకోవడం అపోహ. ఆన్‍లైన్‌లో తెలుగు పుస్తకాల కొనుగోలు  ఇప్పటికీ తెలుగునాట చాలా మంది విద్యావంతులకి కూడా అంతగా అలవాటు కాలేదు. అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ కాకుండా, నవోదయ పుస్తకాల ఆన్‍లైన్ షాప్ తప్ప మిగతావి ఎందరికి తెలుసో కూడా అనుమానమే. ఈ సోషల్ మీడియాకు ఆవల కూడా ఒక పాఠక ప్రపంచం ఉందని గుర్తించకపోతే, మన అమ్మకాలు, కొనుగోళ్ళు, ప్రచారాలు అన్నీ ఇక్కడిక్కడికే పరిమితమైతే, మనం కొనుగోళ్ళలో ఆశించే ఊహించే అంకెలు బహుశా మనం చూడలేకపోవచ్చు. పుస్తకాలను ఎటూ ఎక్కడికీ మోసుకుపోవాల్సిన అవసరం లేకుండా, కావలసిన పుస్తకం తీరిక దొరికిన క్షణాల్లో చేతిలో తిప్పుకు పోగల సౌకర్యం నేటికి ఒక అవసరం. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ని  తనకంటూ సృష్టించుకుని, పెద్ద ఎత్తున తెలుగు ఇ-రీడింగ్ రంగంలోకి వచ్చిన కినిగె దురదృష్టవశాత్తూ మూతపడింది. పుస్తకాల కొనుగోలుకు సంబంధించి, ఇ-చదువుకు సంబంధించి, కినిగె ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు పాఠకులకు పుస్తకాలు అద్దెకు ఇవ్వడంతో సహా, ఎన్నో హంగులతో మొదలైన అట్లాంటి అప్లికేషన్ మూతపడటం అంటే, తెలుగు సాహిత్య అవసరాలకు సంబంధించి, తెలుగు పాఠకుల వినియోగానికి సంబంధించి, మన లెక్కల్లోనో అంచనాల్లోనో ప్రచారంలోనో ఏదో తప్పుందన్న అనుమానం రాకపోదు.  పాఠకుడి నుండి కినిగె ఆశించిన ఆ కాస్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా త్రోసిరాజని, ఇంకా సరళంగా, కంటికి హాయిగా ఉండేలా రూపొందించబడిన ఆప్ చదువు. అన్వీక్షికి ప్రచురణల నుండి వచ్చిన ఈ ఆప్, సహజంగానే ఈ కాలపు ఇ-రీడర్స్ అవసరాల మీద మరింత స్పష్టతతో మొదలై,  ఇ-పాఠకులను మరింతగా ఆకర్షించే దిశగా దృష్టి సారించింది. గంటల తరబడి ప్రయాణాల్లోను, తప్పని మిగతా వ్యావహారిక పనులతోనూ నిండి ఉండే మనిషికి, ఇ-బుక్స్, ఆడియో బుక్స్ ఒక వరం లాంటివి. దాసుభాషితం ఆప్ ఆ కొరత తీర్చే ప్రయత్నం చేస్తోంది. ఇంతో కొంతో పేరూ ప్రచారం ఉన్న ఈ సంస్థను కూడా ఆర్థిక కొరత ఇబ్బంది పెడుతోంది. ఇ-పుస్తకాలు, ఆడియో సాహిత్యం నేటి జీవితానికి ఒక అవసరంగా మారుతున్నాయి.  తెలుగు అంతర్జాల సాహిత్య పత్రికలు కూడా ఇప్పుడు ఆడియో వీడియో రచనలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈమాట ఎన్నో ఏళ్ళుగా అపురూపమైన ఆడియో ఫైల్స్‌ని పాఠకులకు అందించడం తెలిసిన విషయమే. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కూడా మరిన్ని రచనలు అందుబాటులోకి తెస్తోంది. ఇన్ని మార్గాల ద్వారా ఎందుకు పాఠకుల దృష్టిని ఆకర్షించాలని ప్రశ్నిస్తే దానికి జవాబు ఒక్కటే. పుస్తకం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఒక వాతావరణాన్ని సృష్టించడం. ఎంత విరివిగా విస్తృతంగా సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేగలిగితే వారి సాహిత్యాభిరుచి పెంచడానికి అంతలా అవకాశం ఉన్నట్టు. అంతదాకా ప్రయాణమూ పరిశ్రమా తప్పవు.

సృష్టిలోని జీవులన్నీ ఇంద్రియ ధర్మాలైన చూపు, స్పర్శ, వినికిడి, రుచి, వాసనల ద్వారా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. జీవించడానికి అవసరమైన ప్రాథమిక, సహజ జ్ఞానం ఈ ఇంద్రియానుభవపు జ్ఞాపకాల వల్ల వాటికి ఏర్పడుతుంది. రాను రానూ మేధ అభివృద్ధి చెందుతూ వచ్చింది. దానితోపాటే సామాజిక జీవనం, సంభాషణ. జీవపరిణామక్రమంలో మనుషుల స్థాయికి వచ్చేసరికి ఆలోచన, వాక్కు అత్యంత బలమైన పరికరాలుగా రూపు దిద్దుకున్నాయి. ఇంద్రియానుభూతి వల్ల ఏర్పడే సహజ జ్ఞాన స్థాయిని దాటి, తర్కము, విచక్షణ, విశ్లేషణలతో తన అనుభవాలకు విలువలు ఆపాదించడం మనిషి క్రమక్రమంగా పెంపొందించుకున్నాడు. ఇది, ద్వితీయ, తార్కిక స్థాయిలో నేర్చుకునే జ్ఞానం. మనిషి సంఘజీవి కావడంతో వాక్కు, వాక్యం ద్వారా జ్ఞానాన్ని, అనుభవాలని ఒకరికొకరు బట్వాడా చేసుకోవడం మొదలైంది. తమకు తెలియని ప్రపంచాలను పరోక్షంగా తెలుసుకోవడం, ప్రశ్నించడం, తమనూ తమ ప్రపంచాన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం క్రమేణా జ్ఞానసముపార్జనకు ప్రధానమార్గాలయ్యాయి. మౌఖికమైనా, లిఖితమైనా, ఒక వాక్యపు బలం ఈ సందర్భంలోనే మనకు అర్థమవుతుంది. తద్వారా సాహిత్యపు అవసరం కూడా. సాహిత్యపు ప్రధాన ఉపయోగం మన ఆలోచనలను, పరిశీలనలను, స్పందనలనూ స్పష్టం చేసుకోడంలో సహాయపడడం. అలా సహాయపడేది తార్కిక స్థాయి సాహిత్యం. అంటే అనుభూతి కలిగించి ఆపైన అది దాటి మేధను కూడా తాకగలిగే సాహిత్యం. ఈ సాహిత్యపు అవసరాన్ని ఎంత లోతుగా గుర్తించగలిగితే ఆ సమాజం అంత దీర్ఘాయుష్షు ఉన్న సాహిత్యాన్ని సృష్టించుకుంటుంది. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న, ఉత్పన్నమవుతున్న సాహిత్యాన్ని పరిశీలించండి. ఇందులో ఎంత శాతం ప్రాథమిక అనుభూతి స్థాయిని దాటగలుగుతున్నదో చూడండి. భావుకత్వం, అన్యాయాన్ని ఎదిరించే ఆవేశం, అసమానతలను ప్రశ్నించే ఆగ్రహం ఇవన్నీ బలమైన అనుభూతులే. అయితే ఇవి తార్కిక చింతన, వివేచనల ఫలితం కావు. ఇవి ప్రాథమిక స్పందనలు. రచయితలు సామాజికస్థాయి రుగ్మతలకు వైయక్తికస్థాయిలో సమాధానాలు చెప్పడానికి వారు అనుభూతి స్థాయి దాటి ఆలోచించకపోవడం మినహా మనకు వేరొక కారణం కనపడదు. సినిమాలలో ఒక విలన్‍ను ఒక హీరో చంపినంత మాత్రాన ఆ విలనీ సమాజం లోనుంచి ఎలా పోదో, ఒక కథలో ఒక వ్యక్తి తిరుగుబాటు చేసినంత మాత్రాన ఆ దురాచారం సంఘంలో సమసిపోదు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు మార్గం ఆ రుగ్మతల స్వరూపస్వభావాలను విశ్లేషించి తెలుసుకోవడంలోను, అవి పాఠకులకు అర్థం చేయించడంలోను ఉంటుంది. ఆ మార్గం తార్కికస్థాయి సాహిత్యం మాత్రమే చూపుతుంది. ఉదా. ఒక రచన మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆవేశాన్ని రగిలిస్తుంది. కాని, అదే సమయంలో ఆ అనుభూతిని దాటి పాఠకులలో, శ్రోతలలో ఏదో ఒక ఆలోచననూ రేకెత్తించగలిగినప్పుడు ఆ రచన పది కాలాలు సజీవంగా ఉంటుంది. అనుభూతి సాంద్రత ఎక్కువయేకొద్దీ అది మేధకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ సాంద్రత లోపించిన సాహిత్యం, సినిమా తదితర ఏ కళారూపమయినా ప్రత్యక్షంగా దానితో గడుపుతున్న సమయంలో మాత్రమే ఆ అనుభూతిని మనలో మేల్కొలిపి, తాత్కాలిక ఉపశమనాన్నిచ్చి ఆ వెంటనే మాయమైపోతుంది. వెంటనే స్పందించేలా చేస్తుంది. అలాకాక బలమైన ప్రాథమిక అనుభూతి, దానిని దాటి అంతే తీక్షణమైన తార్కిక విచక్షణ – ఈ రెండూ కలిగించగలిగినదే సజీవ సాహిత్యం అవుతుంది. మన ఆవేశాలని, అనురాగాలనీ కూడా లోతుగా అర్థం చేసుకోడానికి సహాయపడుతుంది. సాహిత్యపు ప్రయోజనం నెరవేర్చడంలో ఈ మేధ చేస్తున్న పని అన్నిసార్లూ స్పష్టంగా కనపడకపోవచ్చు. కాని, గొప్ప సాహిత్యాన్ని చదివినవారందరికీ తెలుసు: మేధకు దారి మనసు నుండి. మేధోచితమైన అనుభూతి ప్రకటన చిక్కగా లోతుగా ఉంటుంది. అలా దాని సాంద్రత ఎంత ఎక్కువ ఉంటే మేధకు, తార్కికతకూ అది అంత దగ్గరవుతుంది. స్పందన అంత నిదానమవుతుంది. మనిషి భావుకత తార్కికతల కలబోత. అందుకే, మనకు మనసును మాత్రమే తాకే సాహిత్యంతో పాటు మెదడుకు పదును పెట్టే సాహిత్యం కూడా అత్యంత అవసరం. తెలుగు సాహిత్యంలో ఈ తరహా రచనలెన్ని?

ప్రతీ ప్రాంతీయ సమాజమూ తమ భాష, కళలు, సంస్కృతుల మనుగడ, కొనసాగింపుల కోసం తపన పడుతుంది. ప్రత్యేకించి ఒక కళ కనుమరుగవుతోందన్న భయం ఉన్నప్పుడు దానిని కాపాడుకోవడం కోసం కొంత ప్రయత్నమూ కనిపిస్తుంది. ఇతర భారతీయ భాషలతో పోలిస్తే, తెలుగులో సాహిత్యానికి ఆదరణ తక్కువవుతోందన్న ఆందోళన ఒకటి నేటి వాతావరణంలో ఉంది. కానీ గమనిస్తే ఇలా ఆందోళన పడిన ప్రతీ తరం వెనక కొత్త తరం రచయితలు, కవులు పుడుతున్నారు, సాహిత్య సృజనను కొనసాగిస్తున్నారు. ఇన్ని కోట్లమంది మాట్లాడే తెలుగు భాషకి మరికొన్ని తరాల దాకా, కనీసం ఇప్పటికి బతికున్న తరంలో పుట్టిన ఆఖరు మనిషి చనిపోయేదాకా, ముంచుకొచ్చే ముప్పేమీ లేదు. తెలుగులో సాహిత్యానికి కొత్తగా రాబోయే లోటూ లేదు. కాని, సాహిత్యాదరణ, సాహిత్యాభిరుచి ముందుతరాలలో మరింతగా పెరగాలి అనుకుంటే – వారికి వ్రాతలో మనం ఏం మిగుల్చుతున్నాం? ఎటువంటి సాహిత్య లోకంలోకి వారిని ఆహ్వానిస్తున్నాం? బహుముఖీనమైన మన సాహిత్యంలో ఎన్ని ముఖాలను మన తరువాతి తరాలకు కనపడేలా, మరీ ముఖ్యంగా కనపడకుండా ఉండేలా చేస్తున్నాం? అన్నవి ఆలోచించవలసిన ప్రశ్నలు. మనకే ప్రత్యేకమో కాదో తెలియదు కాని, తెలుగులో సీరియస్ సాహిత్యం, సీరియస్ రచయితలు అనే ఒక ప్రత్యేక ప్రథ ఉంది. పాప్యులర్ సాహిత్యంగా పరిగణించబడే ఇతర సాహిత్యప్రక్రియల పట్ల కేవలం – హాస్యరచనలని, క్షుద్ర రచనలని, వంటింటి ఊసులని, కలల కబుర్లని – చిన్నచూపు ఉండటం మనకు చిరపరిచితం. ఈ చూపు, విచిత్రంగా పాఠకులకు ఏనాడూ పట్టలేదు – పుస్తకాదరణను పరిగణనలోకి తీసుకుంటే, వాళ్ళు తమ తమ అభిరుచులకు అనుగుణంగా అన్నిరకాల సాహిత్యాలనూ ఆదరిస్తూనే వస్తున్నారన్నది స్పష్టం. ఈ ధోరణి కేవలం సాహిత్యాన్ని, దాని ప్రయోజనాన్ని నిర్వచించి నియంత్రించబూనిన రచయితల సంఘాలది. పాఠకులు ఏది చదవాలో నిర్దేశించాలన్న దౌర్జన్యం అది. కళాకారులుగా ప్రతి ఒక్కరికీ తమదైన ఆశయం, రాజకీయ దృక్పథం, భావజాలం ఉండవచ్చు. వారు వాటికి అనుగుణంగా రచనలూ చేయవచ్చు. తప్పు లేదు. కాని, అది మాత్రమే అసలైన సాహిత్య ప్రయోజనమని, అలా కాని రచనలను, ఆయా రచయితలను ఉపేక్షించడం లేదా కువిమర్శకు గురి చేయడం సాహిత్యానికి, సదరు ఆశయానికీ కూడా హానికరమే. ఇందువల్లనే నిర్బంధసమాజాల్లో సప్తవర్ణ సమ్మిళితమైన సాహిత్యం అన్ని రంగులూ హంగులూ కోల్పోయి వర్ణవిహీనమైన ప్రాపగాండా సాహిత్యంగా మాత్రమే మిగిలేది. ఎల్లలు లేని సాహిత్యం నిజాలు చూపిస్తుంది, కలలూ కననిస్తుంది; ప్రశ్నిస్తుంది, సమాధానాలూ చూపుతుంది; ఆశయాలకు ఆలోచనలకూ స్పష్టత నిస్తుంది, మేధోమథనానికి దారి తీస్తుంది, కాసేపు ఆదమరిచి నవ్వుకునేలానూ చేస్తుంది. ఏ రకమైన సాహిత్యప్రక్రియ అయినా ఇంకొకదానికంటే గొప్ప కాదు, తక్కువా కాదు. రచయిత ఆశయం వల్ల సాహిత్యానికి విలువ పెరగదు, తరగదు కూడా. సమాజంలో దేని స్థానం దానికుంటుంది. అన్ని రకాల సాహిత్యప్రక్రియలూ సమానమైన ఆదరానికి నోచుకోగల స్వేచ్ఛాపూరిత వాతావరణంలో మాత్రమే ఔత్సాహిక రచయితలు విభిన్నమైన సాహిత్యప్రయోగాలతో ముందుకు వస్తారు. ఆ విభిన్నతతో పాటు పాఠకులూ పెరుగుతారు. భాష మనుగడ మరింత పెరుగుతుంది. రచనా విమర్శలో భావజాలపు చీటీలను తీసేసి, రచనను చర్చించడం ఒక అవసరమని సాహిత్యకారులు గమనించడం, ప్రస్తుత వాతావరణంలో మార్పు తీసుకురావడానికి దోహదపడే ఒకానొక ముఖ్యమైన అంశం. సృజన అన్ని నియమాలనూ త్రోసిరాజని బతుకుతుంది. ఇక్కడ చెల్లుబాటయ్యే నియమం ఏదైనా ఉందీ అంటే, అది ఏ నియమమూ ఉండకూడదన్నదే.