బదిలీ

తన స్థానంలో మరొకరు
ఈ రోజున తానొక అపరిచితురాలు
పోషించవలసిన పాత్రలే కాదు
మదిలోని ప్రేమలూ మారుతుంటాయి
మార్పు నిరంతరం అని గుర్తించిందామె.

తమ మధ్య విస్తరించిన నీలిసముద్రం
హఠాత్తుగా ప్రత్యక్షమైనది కాదని
లోలోపలి బడబాగ్ని
అతి పురాతనమని గ్రహించిందామె.

నమ్మకం కోల్పోలేక, నిలుపుకోలేక
తనను తాను మోసగించుకోలేక
అనుభవించిన ఆరాటానికి ఇక
విరామం కావాలనుకుందేమో!

శూన్యం చిటికెనవేలు పట్టుకొని
ధీమాగా నడిచానని
మరొకరి ముందు మోకరిల్లిన నీడను
తనదిగా పొరబడ్డానని
మనసును మళ్ళీ మళ్ళీ
ముక్కలుగా చేసుకున్నదేమో!

శ్రుతి కుదరని గానం
ఇక ఆలపించలేననుకున్నదేమో
వేరైన దారుల్ని కలపగల మలుపు
ఇక తారసపడదని తెలుసుకున్నదేమో
ఏ బదిలీ ఆమెను గాయపరిచిందో
అదే ఆమెను ఆఖరి మజిలీకి చేర్చింది.