వన్ నైట్ స్టాండ్

2019, డిసెంబర్ 18. శాన్ ఫ్రాన్సిస్కో, హై డైవ్ బార్

9.30 PM

“నాకేగాని ఎవరితోనైనా వన్ నైట్ స్టాండ్ లాంటిది జరిగితే, మా ఆయనకి మాత్రం చస్తే చెప్పను!” ఖాళీ చేసిన బీరు గ్లాసుతో టేబుల్ మీద గుద్దినట్టు పెడుతూ చెప్పింది స్వప్న.

“అలాంటిది నాకైతే ఈ జన్మలో జరిగే ఛాన్స్ లేదు. అలాంటివి నేను కోరుకోను, చెయ్యను. ఒకవేళ జరిగినా ఐ కాన్ట్ కీప్ సచ్ ఎ సీక్రెట్. ఆ రహస్యాన్ని జీవితాంతం మోస్తూ, మా ఆవిడని మోసం చేస్తూ బ్రతకలేనేమో. మర్నాడు పొద్దున్నే వెళ్ళి జరిగింది చెప్పేసి, తన కాళ్ళు పట్టేసుకుంటాను” అన్నాడు రాఘవ్, తను తాగుతున్న బీరు గ్లాసులోకి చూస్తూ.

“అబే రాగ్స్! నీకు జుట్టుతో బాటు బుర్ర కూడా దొబ్బినట్టుంది. విడాకులు, ఆలిమోనీలూ చాలా క్లియర్‌గా కనపడుతున్నాయి నీ ఫ్యూచర్‌లో. అయినా సెక్స్ ఈజ్ ఓవర్‌రేటెడ్! ఎందుకురా మీరంతా దానికి ఇంత ప్రాధాన్యత ఇస్తారూ? ప్రతిరోజూ ఎంతమంది అపోజిట్ సెక్స్‌వాళ్ళకి హాండ్‌షేక్స్‌, హగ్స్ ఇస్తుంటాం మనం? అవన్నీ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని మరీ మీ పార్ట్‌నర్స్‌కి చెప్తారా? ఇదీ అంతే!” నికొటిన్ వేప్ స్టిక్ స్వప్నకి పాస్ చేసి, గాల్లోకి ఆవిరి వదులుతూ బీరు గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు క్రిష్.

6.30 PM

“స్వప్స్! మేమిద్దరం నీ కోసం అరగంట నుంచీ వెయిటింగ్ ఇక్కడ!”

“సారీ బాయ్స్! నా అసిస్టెంట్‌కి ఎప్పుడూ చెప్తాను, ఇంత లేట్‌గా మీటింగ్స్ స్కెడ్యూల్ చెయ్యద్దని, బట్ షి ఇగ్నోర్స్. మేమూ మా సిలికాన్ వ్యాలీ కష్టాలు! ఎనీవే, మీరు చెప్పండి. మీరిద్దరూ ఎలా ఉన్నారు? మూడేళ్ళయింది కదూ మనం కలిసి?!”

“సేమ్ ఓల్డ్ వాల్ స్ట్రీట్, సేమ్ ఓల్డ్ ఫైనాన్సియల్ ఎనలిస్ట్ జాబ్. రోజూ అయిదింటికల్లా దుకాన్ బంద్. సేమ్ ఓల్డ్ ఈవెనింగ్స్ అండ్ వీకెండ్స్!” అన్నాడు రాఘవ్.

“వెల్, ఫర్ మీ టూ! అదే కన్సల్టింగ్ సర్వీసెస్ బిజినెస్ నడుస్తోంది, హైదరాబాద్‌లో. నాకు బోర్ కొట్టిన రోజు పని చేస్తా. లేదూ లైట్ తీసుకుంటా! అప్పుడప్పుడూ ఏదైనా రాయడానికి ట్రై చేస్తుంటా.” వెయిటర్‌కు కనపడేలా అరచేయి ఎత్తి పెట్టి వేళ్ళు కదలిస్తూ చెప్పాడు క్రిష్. “త్రీ వెస్ట్‌కోస్ట్ ఏల్స్ ప్లీజ్. అండ్ ఎ బాగ్ ఆఫ్ పీనట్స్ టూ.”

“మీకెప్పుడో చెప్పాను, వాట్సాప్ గ్రూప్ పెట్టుకుందాం. డైలీ కాకున్నా అప్పుడప్పుడైనా అప్డేట్స్ ఇచ్చుకోవచ్చు అని.”

“అబ్బ, ఒద్దురా రాగ్స్! ఇట్ బికమ్స్ టూమచ్ ఇన్ నోటైమ్ మాన్! అప్పుడు అందరం చేరాం కదరా మన ఇంజనీరింగ్ బ్యాచ్ వాట్సాప్ గ్రూపులో. ఏమైంది? మూడురోజులు కాలేదు, ముగ్గురికీ తలవాచి బయటకొచ్చేశాం. యూ నో వాట్? మనం ఇంకా ఇలా కలుస్తూ మాట్లాడుకుంటున్నాం ఇన్నేళ్ళుగా అంటే ఈ గ్యాప్ వల్లనే. ఎవరి జీవితాలు వాళ్ళం బతుకుతాం. మీట్ వన్స్ ఇన్ ఎ వైల్ అండ్ టాక్ అబౌట్ లైఫ్ ఓవర్ ఎ ఫ్యూ డ్రింక్స్. మళ్ళీ ఎవడి జీవితం వాడిది. ఐ సే దిస్ ఈజ్ హౌ మన ఫ్రెండ్‌షిప్ ఫ్రెష్‌గా ఉండేది.”

“ఛీర్స్, గయ్స్!”

7.30 PM

“ఎనఫ్ ఆఫ్ వర్క్ స్టఫ్. హౌ ఆర్ యువర్ ఫ్యామిలి లైవ్స్? ఎనీథింగ్ ఎక్సయిటింగ్?” స్వప్న.

“మీకు చెప్పాకదా. మా ఆవిడ విషయంలో నేను చాలా లక్కీ. ఇప్పటికీ ప్రతీరోజూ నాకు కనీసం అయిదారుసార్లు కాల్ చేస్తుంది. పిల్లలిద్దరూ ఎన్ఆర్ఐ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళని స్కూల్‌లో దించేసి, రోజూ ఏదో ఒక సోషల్ వర్క్ కోసం వలంటీరింగ్ చేస్తుంది. వీకెండ్సూ ఈవెనింగ్సూ ఫామిలీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంది. ఓ, బైదవే మొన్ననే బెంజ్ కొన్నాను తనకోసం. కంఫర్టబుల్ రైడ్. తన కమ్యూట్ హాయిగా ఉంది ఇప్పుడు. ఒక ఫార్మ్‌హౌస్ కూడా కట్టాను. యాభై ఎకరాలు, పళ్ళతోటలూ అవీ. సోల్ద్ సమ్ ఆఫ్ ది బిట్‌కాయిన్. ఆ ప్రాఫిట్ తోటే ఇదంతా. మిమ్మల్నీ కొనమన్నాను కదా, కొన్నారా లేదా?”

“నీ అంత అదృష్టం నాకు లేదు కాని, ఉయ్ హావ్ బీన్ వెరీ వెరీ బిజీ. గత రెండేళ్ళుగా ఇద్దరమూ వర్క్ ఫ్రం హోమ్! భయపడకండి. ఇంకా ఒకరి నొకరం చంపుకోలేదు. అంత తీరికుంటే కదూ! అండ్ ఉయ్ బోత్ స్టిల్ లవ్ టు వర్కౌట్ అండ్ స్టే ఫిట్. మా ఇద్దరికీ కామన్ హాబీస్ ఉండడం కూడా ఒక ప్లస్ అనుకుంటా.”

“గుడ్ ఫర్ యూ రాగ్స్! మా పిల్లలిద్దరూ కాలేజ్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఎంప్టీ నెస్టర్స్. తీరిక కొంచెం ఎక్కువే దొరుకుతుంది ఇప్పుడు కానీ నాకూ మా ఆయనకూ మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. ఎవరి స్పేస్ వారికి ఇచ్చుకుంటాం. ఎవరి ఫ్రెండ్ సర్కిల్ వారికుంది. ప్రతి శుక్రవారం మాత్రం డేట్ నైట్‌కి వెళ్తాం. ప్రతి ఏడాదీ కనీసం టూ వెకేషన్స్ వెళ్తాం పిల్లలు వచ్చినా రాకున్నా. ఇద్దరం ఇంటరాక్ట్ విత్ మెన్ అండ్ ఉమెన్. కానీ మా రిలేషన్‌షిప్ మీద ఇద్దరికీ నమ్మకం ఉంది. సో… అనుమానాలూ అసూయలూ నో స్పేస్ ఫర్ దెమ్.

“కానీ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అలా ఒకరికొకరం స్పేస్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే, తిరిగి కలుసుకోలేనంత దూరం జరిగిపోతానేమోనని. డేట్ నైట్స్ కూడా రొటీన్ అయిపోయాయి. ఒకప్పుడు వారం వారం ఎదురుచూసే వాళ్ళం, ఇప్పుడు పోతాం, తింటాం తాగుతాం. వెంటనే ఇంటికి చేరి ఎవరి మొబైల్‌లో వాళ్ళం దూరిపోతున్నాం.

ఒక పక్క ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ, మరో పక్క సోషల్ లైఫ్ మెయిన్‌టెయిన్ చెయ్యాల్సిన ప్రెజర్స్! ఇలా ఎన్నిటిలోనో, ఇద్దరమూ కూడా. మేమిద్దరం ఒక రొమాంటిక్ నైట్ గడపాలంటే క్యాలెండార్‌లో స్కెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడున్న స్పాంటేనిటీ, స్పార్క్, ఇప్పుడు లేదు. ఎమోషనల్‌గానే కాదు, ఫిజికల్ ఇంటిమసీలో కూడా.”

“మే బీ యూ టూ…”

“నో రాఘవ్. నా లైఫ్ డ్రై అని అంటం లేదు. యూ నో ఐ హావ్ టు ట్రావెల్ ఎ లాట్ రైట్? ప్రొఫెషనల్ సర్కిల్స్‌లో చాలా మందే కనిపిస్తారు. అట్రాక్టివ్, కాన్ఫిడెంట్ మెన్. మెన్ హూ నో హౌ టూ అప్రోచ్ ఏ ఉమన్ ఇన్ ది రైట్ వే. పైకి మామూలుగా మాట్లాడుతున్నా ఆ సెక్సువల్ టెన్షన్ తెలుస్తూనే ఉంటుంది. సో, ఐ నో, ఇంకా ఆ స్పార్క్ నాలో ఉంది. వన్స్ ఇన్ ఎ బ్లూమూన్, ఒక అడుగు ముందుకు వేసినా, ఏ పబ్‌లోనో క్లబ్‌లోనో, ఆ ఫ్లర్టింగ్ దాటి ముందుకు వెళ్ళలేదిప్పటిదాకా. మిడిల్ క్లాస్ లోంచి ఆర్థికంగా బయటపడ్డాం కాని, ఆ మోరల్స్ నుంచి ఎప్పటికీ బయటపడలేమేమో!”

రాఘవ్ మౌనంగా ఉండిపోయాడు ఆలోచిస్తూ. వెయిటర్ టేబుల్ మీద కొత్త బీర్ పెట్టి ఖాళీ గ్లాసులు తీసుకుకెళ్ళిపోయింది. నిదానంగా అన్నాడు.

“అలా కాదు స్వప్నా! అన్ని జంటలనీ కట్టిపడేసే బంధాలు కొన్నుంటాయి. పిల్లలో, ఆస్తులో, అలవాటో, అవసరమో, ప్రేమో, మరింకేవో. కానీ సఫరింగ్‌లో ఒకరికొకరు తోడున్న బలం ఇంక దేనికీ ఉండదేమో! పిల్లలు కావాలనుకొనీ పొందలేని జీవితాల గురించి పెద్దగా ఎవ్వరికీ పట్టదు. ఆంటే తాము అనుభవించని విషాదాన్ని, ముఖ్యంగా ఈ విషయంలో… అర్థం చేసుకోలేనితనం. నోటితో ఓదారుస్తూ నొసటితో చేసే వెక్కిరింతలు. లేదూ, ప్రపంచంలో ఇంతమంది అనాథలు ఉన్నారు, తెచ్చి పెంచుకోవచ్చుగా, అని ఈజీగా సాల్వ్ చేసి పారేసే కేర్‌లెస్‌నెస్. ఆ దుఃఖమే, మా ఇద్దరినీ చాలా దగ్గరకు చేర్చింది, కొన్నిసార్లు ఊపిరి కూడా పీల్చుకోలేనంత దగ్గరగా. బయటవారికి మా ఈ దగ్గరితనం అర్థమయ్యే ఛాన్స్ లేదు. మేమూ బయటపడం. ఎప్పుడూ కొట్టుకుంటుంటాం. మేమే ప్రపంచం కోసం కట్టుకున్న ఫసాడ్ అది. మా ఇంటిమసీ కూడా అందులో భాగమేనేమో! కానీ లైఫ్ అంటే ఈ ఓవర్‌వెల్మింగ్ పెయిన్ పంచుకోడం మాత్రమే కాదు, ఇంకా ఎంతో ఉంది అని మాకు తెలియక కాదు. కానీ అవి మాకు సాధ్యపడే విషయం కాదేమో. ఏదేమైనా ఇంకొకరితో ఆ అనుభవాలని పొందాలన్న ఆలోచన గురించి మేమెప్పుడూ మాట్లాడుకోలేదు.”

“ఓ బాయ్! ఆపండ్రా బాబూ మీ ఇద్దరూ! మీరూ మీ ఫస్ట్ వర్ల్‌డ్ ప్రాబ్లమ్స్! ప్రతీ చిన్నదానికీ ఇంత ఆలోచించి, బుర్ర పాడు చేసుకుంటూ, ఏదో హైయర్ లెవల్‌లో జీవితాన్ని చూస్తున్నామన్న సూడో ఇంటెలెక్చువాలిటీ ఇది. నన్నడిగితే మోరల్స్ అంటూ మడికట్టుకోవటం, మళ్ళీ దాని డిలెమాలో పడటం, మీకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ వల్లే! ఇండియాలో ఉయ్ ఆల్ స్క్రూ అరౌండ్. మా మగాళ్ళందరికీ ఒక సైలెంట్ అండర్‌స్టాండింగ్ ఉంది. మాకు చాతనయింది మేము చేస్తాం. వేరేవాళ్ళని జడ్జ్ చెయ్యం. ఆడవాళ్ళకి జడ్జింగ్ నేచర్ చాలా. ఏ కొంచెం తేడా వచ్చినా చాలు, ముందరే జడ్జ్ చేసేస్తారు.

“మా ఆవిడ సంగతే తీసుకో. ఏదైనా పార్టీలో ఆడ వెయిటర్‌తో నవ్వుతూ ఒక మాటంటే చాలు. మొహంలో తేడా వచ్చేస్తుంది, చుట్టూ వందమంది ఉన్నా సరే. నేను ఏదేశం వెళ్ళినా నన్ను జిపియస్ యాప్‌తో ట్రాక్ చేస్తుంటుంది. రోజుకి అయిదారుసార్లన్నా కాల్ చేసి నేనెక్కడున్నానో, ఏం చేస్తున్నానో అడుగుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు పేలే బాంబే ఇది! తను మంచిదే, మొదట్లో ఇలాగుండేది కాదు. కానీ మొన్నామధ్య రెండు మూడు కథలు రాశాను, ఇన్‌స్టంటేనియస్ సెక్సువల్ అఫైర్స్ మీద. అప్పటినుంచీ పట్టుకుంది తనకనుమానం, నేను సొంత అనుభవంతో రాశానేమో అని.”

“మరెందుకురా అవి రాయడం?”

“అరేయ్, రచయితలంటే ఈ అనుమానాలు మామూలే. ఆడరచయితలకైతే మరీ. అలా అని రాయకుండా ఎలా ఉంటాం? కాని, అసలు నాకంత ధైర్యం లేదని తనకి తెలీదు. మాకున్న ఆస్తులన్నీ మా ఆవిడ వైపు నుంచి వచ్చినవే. మా మామ ఇచ్చిన కన్సల్టింగ్ బిజినెసే కదా నేను నడిపేది. కావలసినంత డబ్బు, తీరిక. ఏదో సైడ్ డిష్ కోసం కక్కుర్తిపడి ఇదంతా పోగొట్టుకొనే పిచ్చోడిని కాదు. అందుకే కథల ద్వారా అయినా నే చెయ్యలేనివి చెప్పేద్దాం అని మొదలెట్టా!” పెద్దగా నవ్వాడు క్రిష్.

“సరే, నా సంగతి పక్కన పెట్టండి. ఒకవేళ అలాంటి వన్ నైట్ స్టాండ్ జరిగితే, మీరేం చేస్తారు? మీ పార్ట్‌నర్స్‌తో చెప్తారా?”

10:30PM

“సరే, మళ్ళీ రెండు మూడేళ్ళ తరవాత ఎక్కడో ఇలాగే కలుస్తాం కదా. చూద్దాం ఏమి జరుగుతుందో అప్పటికి!” లేచి నుంచుంది స్వప్న.

“దయచేసి ఈ వన్ నైట్ స్టాండ్ టాపిక్ తేకండి. ఎంబరాసింగ్‌గా ఉంటుంది.” గొణిగాడు రాఘవ్.

“అంత సిగ్గుపడేదేముందిరా…” ఇంతలో వాళ్ళావిడ నుంచి కాల్ రావటంతో క్రిష్, చేతితో ఫోన్ మూసి పట్టుకును, “బిల్ సంగతి నేను చూసుకుంటాలే. మళ్ళీ కలుద్దాం” అంటూ చేయూపాడు.


2022, డిసెంబర్ 29. లాస్ ఏంజిలిస్, శాంటా మోనికా బీచ్ బార్

7:00PM

“ఓ-కే. చేసిన పిచ్చాపాటీ చాలు. ఒక రౌండ్ టెకీలా షాట్స్ కొట్టాక, మీకు మాంచి ట్విస్టున్న కథ చెప్తాను, సరేనా?” క్రిష్ బార్‌టెండర్‌కు సైగ చేశాడు, ఈసారి బీర్‌లతో పాటూ షాట్స్ కూడా పంపమని.

“గో ఎహెడ్! మనందరికీ ఉన్నాయి కదా కథలు, ఇప్పుడు చెప్పుకోడానికి. హాంగోవర్ సంగతి రేపు చూస్కుందాం!” స్వప్న ముఖంలో వెలుగు.

“ఛీర్స్ గయ్స్!” మూడు షాట్‌గ్లాసులూ పిల్లిమొగ్గలేసి టేబుల్ మీదా బోర్లా పడ్డాయి.

“సరే. గోవాలో ఒక రిసార్టులో కాన్ఫరెన్సుకి వెళ్ళాను, స్టే కూడా అక్కడే. సో మా ఆవిడ లొకేషన్ ట్రాకింగ్‌తో ప్రాబ్లమ్ లేదన్నమాట. సాయంత్రం బార్లో కూర్చొని డ్రింక్ చేస్తుంటే, ఒక నలభై ఏళ్ళు ఉండచ్చేమో, ఒకావిడ వచ్చి కూర్చుంది. పక్కన ఎవరో కుర్రాడే, ఆమెకి తోడు. ఆమె పెద్దగా ఏమీ మాట్లాడలేదు. ఆ కుర్రాడేమో తెగ ఉత్సాహపడిపోతూ నాతో మాటలు కలిపాడు. ఏదో ట్రాన్స్‌పోర్టేషన్ బిజినెస్ అట. బిజినెస్ తనది కాదని, తను బ్రోకరేజ్ చేస్తానని, రిస్క్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ అని ఆమెను పరిచయం చేశాడు. హలో అన్నాను, ఆమె కూడా క్లుప్తంగా హలో అంది. మీరేం చేస్తారు? ఈ కాన్ఫరెన్స్‌లో మీ రోల్ ఏంటీ అని అడిగాడు.

నా బాడీ షాపింగ్ ఐ. టి. బిజినెస్ మోడల్ గురించి నేను చెప్పాను. ఇద్దరమూ బ్రోకర్స్‌మే అని నవ్వాడు. నాకు కాస్త ఇరిటేషన్ వచ్చింది. ఆవిడ మటుకు పెద్ద ఇన్వాల్వ్ అవ్వకుండా మా మాటలు వింటూ కూర్చుంది. తన బర్త్‌డే ఆరోజు అని మాటల్లో తెలిసింది. ఇంతలో అతనికి కాల్ రావటంతో ఇప్పుడే వస్తానని బయటకి వెళ్ళిపోయాడు. మేమిద్దరం కాసేపు మౌనంగా కూర్చున్నాం, మా డ్రింక్స్ మేము తాగుతూ. నలభై అనిపించేలా లేదు. స్లిమ్ ఫిగర్. లోనెక్ టాప్, స్కర్ట్. మేకప్ కూడాను చాలా లైట్‌గా ఉంది. లోన్లీనెస్సో మరేమో, లేదూ కలిసిపోయే రకం కాదేమో. సరే నేనే, ఏదో మాటలు కలిపాను.

రెండు రౌండ్ల డ్రింక్స్ తరవాత, తన ఫ్రెండ్ వచ్చేటట్టు లేడు, డాన్స్ చేద్దామా అని తనే అడిగింది. నాకు డాన్స్ రాదన్నాను. స్లో సాంగ్‌కు చేద్దాం అన్నది. తనే నన్ను నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకుని హెల్ప్ చేసింది. ఆపైన ఆమె కొంత రిలాక్స్ అయింది. ఇంకో రెండు డ్రింక్స్ తాగాం. బార్ లాస్ట్ కాల్ అన్నాడు. సరే, మీరు ఇక్కడ ఒంటరిగా ఎందుకూ, నా రూమ్‌లో వెయిట్ చేయండి అన్నాను. ఆర్ యూ షూర్? అని మొహమాటపడుతూనే వచ్చింది. లిఫ్ట్‌లో తన సాయంత్రం అంత అందంగా గడచినందుకు నాకు థాంక్స్ చెప్పింది ఒకటికి రెండు సార్లు. రూమ్‌లోకి వెళ్ళంగానే నేను ఆగలేకపోయాను. తను కూడా అడ్డుచెప్పకుండా నన్ను ఎంకరేజ్ చేసింది.

ఒక గంట తరవాత, తను లేచి, వెళ్ళిపోతానని బట్టలు వేసుకుంది. నాకు ఆమెని చూసి ఎందుకో కన్ఫెస్ చెయ్యాలనిపించింది, ఇదే నా మొట్టమొదటి ‘వన్ నైట్ స్టాండ్’ అని. చెప్పి థాంక్స్ ఫర్ ది ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాను.

ఆమె నాకేసి మాటల్లేకుండా చూస్తూ నిలబడింది. నేనే అడిగాను, ‘మీ ఫ్రెండ్ వెళ్ళిన బిజినెస్ అయిందా? మీకు ఫోన్ చేశాడా?’ అని.

తనేమందో తెలుసా? ‘నేనే వాడి బిజినెస్.’ నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. పదివేలు ఫట్!… స్క్రూ యూ గయ్స్! అంత నవ్వేదేముంది అందులో? అరె, నేను నిజంగానే…”

“మరి?! ఒక అరగంట మాట్లాడంగానే నీతో ఎట్రాక్షన్‌లో పడిపోయే క్యారెక్టరేనారా నీది? నీ లైఫ్‌లో ఇప్పటిదాకా ఒక్క అమ్మాయి ఐనా పడిందారా? అన్నీ రిజెక్షన్‌లో…” రాఘవ్‌కు ఇంకా నవ్వాగటంలేదు.

“అది కాదు జోకిక్కడ. నీ కథలో ఏదో పెద్ద ట్విస్టు ఉన్నదని చెప్పావు చూడు. అదీ పెద్ద జోకు. నువ్వు ఆవిడ గురించి ఇచ్చిన ఇంట్రో లైన్‌తోనే, విషయం అర్థమైపోయింది మాకు. నువ్వు అంత సీరియస్‌గా చెప్తుంటే మేం నవ్వాపుకోలేక చచ్చాం బాబూ!” స్వప్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నవ్వీ నవ్వీ.

“ఇంక నవ్వాపండి. లేకుంటే పీక పిసుకుతాను. ఐ యామ్ హర్ట్. సో యూ గెట్ మి ది నెక్స్ట్ రౌండ్స్!”

8:00PM

“నా డైవోర్స్ ఫైనల్ స్టేజస్‌లో ఉంది.” షాట్ గ్లాస్ నిదానంగా టేబుల్ మీద పెడుతూ అంది స్వప్న.

“ఐ యామ్ సో సారీ!” కొంచెం ఆదుర్దాతో ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు రాఘవ్.

“ఐ యామ్ సారీ టూ! బట్ నీకు కథ మొదలెట్టే ముందే ట్విస్ట్ రివీల్ చేసే ఈ చెడ్డ అలవాటు ఎప్పుడూ! నాకేం జరిగుంటుందో అర్థమయ్యింది. వివరాలు త్వరగా చెప్పెయ్!” అన్నాడు క్రిష్.

“మీకు మధు గురించి చెప్పలేదు కదూ. మన కాలేజ్ అయిపోయిన తరవాత కొంతకాలం టి.సి.యస్. బెంగళూరులో పనిచేశాను కదా. అక్కడ పరిచయం అయ్యాడు. మనకంటే రెండేళ్ళు పెద్దవాడు. చాలా బిందాస్. మల్టీ టాలెంటెడ్. ఫొటోగ్రఫీ, క్రికెట్, మ్యూజిక్, కుకింగ్… చూడ్డానికీ కైండ్ ఆఫ్ బాగుండేవాడు. నేను ఫ్రెషర్ కదా, బెంగళూరుతో పాటూ చాలా లైఫ్ కూడా పరిచయం చేశాడు. ఇద్దరం ఒక సంవత్సరం పాటు బాగానే కలిసి తిరిగాం. అతని బైక్ మీద చాలా లాంగ్ ట్రిప్స్ మీద కూడా వెళ్ళాం. ఎక్సయిటింగ్‌గా ఉండేది నాకు.

“మా ఇంట్లో నాకు అప్పుడే సంబంధాలు చూడటం మొదలెట్టారు. అన్నీ మంచి అమెరికా సంబంధాలే. నేను ఈ వివరాలన్నీ అతనితో చెప్పేదాన్ని. కాని, అతనేమీ రెస్పాండ్ అయేవాడు కాదు. సో, నేనే ఒకరోజు అతనికి ప్రపోజ్ చేశాను. తను నో అన్నాడు. తను ఇప్పుడు మ్యారేజ్ అనే కమిట్మెంట్‌కి రెడీగా లేడనీ, తన కెరియర్ పాత్, లైఫ్ పాత్, ఏదీ సరిగ్గా తెలీదన్నాడు. మరి కొన్నేళ్ళు టైమ్ కావాలని అడిగాడు. ఇంట్లో వాళ్ళ ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక నేను మధుతో బ్రేకప్ చేసుకొని అమెరికా సంబంధం ఒప్పేసుకున్నాను. అలా అని ఇట్ వజ్ నాట్ ఎ బిటర్ బ్రేకప్. నా పెళ్ళికి కూడా వచ్చాడు. ఆ తరవాత నా వరకూ ఆ ఛాప్టర్ ముగిసిపోయింది. నేను అమెరికా వచ్చేశాను. ఇంక ఆ తర్వాత నో కమ్యూనికేషన్ వాట్‌సోఎవర్.

మొన్న ఫెబ్‌లో సింగపూర్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నానని లింక్డ్-ఇన్‌లో అప్డేట్ పెట్టంగానే, నాకు మధు నుంచి మెసేజ్ వచ్చింది, తాను కూడా అటెండ్ అవుతున్నట్టు. నేను కొద్దిగా ఆశ్చర్యపోయాను. మధు నన్ను సోషల్ మీడియాలో ట్రాక్ చేస్తున్నాడని తెలిశాక కొద్దిగా వర్రీ అయ్యాను కూడా. అయినా సింగపూర్‌లో కలుస్తానని రిప్లయ్ ఇచ్చాను.

దెన్, కాన్ఫరెన్స్ కాగానే మధుని లాబీలో కలిశాను. ఐ వజ్ సో టైర్‌డ్ యూ నో. కాని, మాటిచ్చా కదా. అండ్ మనసులో కొంచెం క్యూరియాసిటీ కూడా ఉందేమో.

మధు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నానని చెప్పాడు. మాగజీన్స్‌లో తన వర్క్ పబ్లిష్ అయిందిట. గ్యాలరీ కూడా ఉందట. ఎల్.ఎ.లో ఉంటున్నాను అని చెప్పాడు.”

“ఓ! ఇక్కడే!” రాఘవ్ అడ్డు తగిలాడు.

“రాగ్స్, లెట్ మీ ఫినిష్. చూస్తే బాగా రిచ్ అయినట్టున్నాడు. పెళ్ళి మాత్రం చేసుకోలేదుట. ఎందుకని అడిగితే నవ్వేశాడు గానీ సమాధానం చెప్పలేదు. డిన్నర్‌కు వెళ్దాం పద, కమాన్ ప్లీజ్! అని అడిగాడు. సరే అని ఫ్రెషప్ అయి బైటకు వెళ్ళాం. ఆ ఈవెనింగ్ అంతా ఎన్ని పాత విషయాలు మాట్లాడుకున్నామో! నాకు అలసటంతా పోయింది. తవ్వుతుంటే కబుర్లూ వస్తూనే ఉన్నాయి. ‘నా రూమ్‌కి వెళ్దాం పద, రాత్రంతా కబుర్లు చెప్పుకుందాం. లెట్ అజ్ కాచప్ ఆల్ దీజ్ యియర్స్’ అని నేనే లాక్కెళ్ళాను. నైట్ డ్రెలోకికి మారి వైన్ గ్లాసుల్లో పోసుకొని కౌచ్‌లో కూర్చున్నాం. నిజంగా తెలుసా! టైమ్తెలియలేదు. పగలు అయిదైపోయింది. అతను ఇంక లేచి వెళ్తాను అని డోర్ దాకా వెళ్ళినప్పుడు, నేను అతని దగ్గరికి వెళ్ళి అంత గట్టిగా హగ్ చేసుకునుండాల్సింది కాదు. ఎందుకో అతనిని వదిలిపెట్టబుద్ధి కాలేదు. ఇంకా గట్టిగా పట్టుకొని, ‘వెళ్ళాలా? తప్పదా?’ అని అనటం మాత్రమే గుర్తుంది. ఆ తరవాత… ఇట్ జస్ట్ హాపెన్‌డ్. ఇనెవిటబుల్ ఐ గెస్.”

“ఓకే! జరిగితే, జరిగింది. అప్పుడు బీరుగ్లాసు గుద్ది మరీ చెప్పావుగా మీ ఆయనకి చెప్పనని. మరేమైంది?” క్రిష్ బార్‌స్టూల్ మీద ముందుకు ఒంగాడు, ఖాళీ షాట్‌గ్లాసులను పక్కకు జరుపుతూ.

“చెప్పనన్నాను. అలాగే చెప్పలేదు. కనీసం వెంటనే. ఎటొచ్చీ వన్ నైట్ స్టాండ్ అనేది, ఎమోషనల్ బాండింగ్ లేని వ్యక్తితోనే అవాలని నాకే మాన్యువల్ చెప్పలేదు. రుకీ మిస్టేక్. బహుశా ఏ కాస్ట్‌లీ వన్ టూ. ఆపైన మధూని కలవటమూ ఆపలేదు. ఆ తరవాత ఆర్నెల్లలో కనీసం నెలకోసారన్నా కలిశాం. ఇట్ టర్న్‌డ్ ఇన్ టు ఎ ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ అఫైర్! ఆ తరవాత నేనే డైవోర్స్‌కి అప్లయ్ చేశాను.” స్వప్న గొంతు సన్నగా వణికింది.

“నీకు నచ్చింది నువ్వు చేశావు. నీకేమీ రిగ్రెట్స్ లేవు కదా? ఐ హోప్ యు ఫైండ్ పీస్ విత్ యువర్ డెసిషన్” అన్నాడు రాఘవ్.

“ఏమో… ఐ యామ్ నాట్ సో ష్యూర్. ఇలా నీ కథకి ట్రాజిక్ ఎండింగ్ ఉంటుందనుకోలేదు. మీ ఆయన, పిల్లలూ ఎలా తీసుకున్నారు?” అన్నాడు నిదానంగా క్రిష్.

బీచ్‌వైపు చూస్తూ ఊరకుండిపోయింది స్వప్న.

9:00PM

“వాట్ అబౌట్ యూ రాగ్స్? వాట్ ఈజ్ యువర్ స్టోరీ?”

“నాది మీ అంత పెద్ద కథ కాదులే. గ్రాండ్ కాన్యన్ రిమ్-టు-రిమ్ హైక్ ఒకటి మా గ్రూపుతో ప్లాన్ చేసుకున్నాం. కానీ అది లాస్ట్ మినిట్‌లో కాన్సిల్ అయ్యింది. తను యూరప్ వెళ్ళాల్సివచ్చింది. నేను మాత్రం ఒంటరిగానే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇరవై నాలుగు మైళ్ళ హైక్ అది. వెస్ట్‌ రిమ్ నుంచి ఆరువేల అడుగులు వ్యాలీ లోకి. రాత్రికి అక్కడే క్యాంప్. మర్నాడు పొద్దున్న బయల్దేరి ఒక నాలుగు వేల అయిదు వందల అడుగులు పైకెక్కితే, ఇంకొక రిమ్. అదీ ప్లాన్. ఆ హైక్‌లో పరిచయం అయ్యింది, సోఫీ. జర్మన్‌ట. పాతికేళ్ళు ఉండచ్చేమో. ఇంగ్లిష్ కూడా పెద్దగా రాదు. నాలాగానే ఒంటరిగా హైక్ చేస్తోంది. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ హైక్ చేశాం. ఇద్దరం ఫిట్‍గానే ఉన్నాం. సో, ఒక ఎనిమిది గంటలలోనే వ్యాలీ క్యాంప్‌గ్రౌండ్ చేరాం. అక్కడే కాసిని గ్రోసరీస్ ఉన్నాయి. బాన్‌ఫైర్ దగ్గరే తిని, తాగి, ఎవరి టెంట్‌లో వాళ్ళు పడుకొని, మర్నాడు ఉదయాన్నే బయల్దేరాం. ఒక రెండు మైళ్ళు పైకెక్కిన తరవాత, ఆమె యాంకిల్ ట్విస్ట్ అయ్యింది. అడుగు కూడా వేయలేకపోయింది. నా స్ప్రెయిన్ రాప్‌తో ఆమె మడమ గట్టిగా కట్టి, తన బ్యాక్‌ప్యాక్ కూడా నేనే తీసుకున్నాను. నా భుజం తనకు ఆసరాగా ఇచ్చి, తన నడుము పట్టుకుని, కష్టం మీద ఎలానో పైకి చేరాం, తడిసి ముద్దముద్దయ్యి చెమటలో. పైకి వెళ్ళాక, హాస్పిటల్‌కు వెళ్దామంటే సోఫీ వినలేదు. ఇన్సూరన్స్ లేదని చెప్పింది. నేను కడతానన్నాను బిల్. ఒప్పుకోలేదు. చివరికి అక్కడే చిన్న ఫార్మసీలో కొన్ని పెయిన్ కిల్లర్స్ కొని వేసుకుంది. అక్కడ హోటల్‌లో నాతోనే ఉండమని ఆఫర్ ఇచ్చాను. ఇక బోర్ కొట్టే వివరాలన్నీ స్కిప్ చేస్తే, తనకి నేను చాలా సహాయం చెయ్యవలసి వచ్చింది, అనేక విషయాలలో, స్నానం చేయించటంతో సహా. అలా ఆ ఇంటిమసీ సెక్స్ దాకా వెళ్ళింది. ఉన్న రెండు రోజులూ ఎంజాయ్ చేశాం. తప్పు చేశామని ఇద్దరికీ అనిపించకపోయినా, ఫోన్ నెంబర్లు కూడా తీసుకోకుండా, బై చెప్పుకొని, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం. అంతే.”

“సో, మన ముగ్గురిలో ట్రూ వన్ నైట్ స్టాండ్, నీదేనన్న మాట!” అంది స్వప్న.

“మరి నువ్వూ డైవోర్స్ లాయర్స్ చుట్టూ తిరుగుతున్నావా? నీ మనస్సాక్షిని చంపుకోలేక మీ ఆవిడకి నువ్వీపాటికి చెప్పేసుంటావు కదా?” గ్లాసు పెదవుల దగ్గరే ఆపి మరీ అడిగాడు క్రిష్.

“లేదు. నేను చెప్పలేదు.”

“అయితే నీదీ ఒక ట్రాజిక్ ఎండింగే! నీ మనస్తత్వానికి నువ్వు ఈ రహస్యపు భారాన్ని మోస్తూ ఇలాగే జీవితం మొత్తం గడిపేస్తావన్నమాట, సినిమా హీరోలా! అటు స్వప్నదీ ట్రాజెడీ, ఇటు నీదీ ట్రాజెడీ, మీకు కామెడీ అనిపించినా నాదీ అదే. ఈ మొత్తాన్ని కథగా రాసైనా, హ్యాపీ ఎండింగ్ సాధిస్తాను.”

“ఆ బరువు నేను ఊహించుకున్నంత కష్టంగా ఏమీ అనిపించట్లేదు. నిజానికి ఆ ఇన్సిడెంట్ మా జీవితంలో ఏదో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. బాధ కంటే కూడా బలమైన ఎమోషన్ ఏదో మమ్మల్ని ఇంకా దగ్గరకి లాగి ఉంచుతోందనిపిస్తోంది. మే బీ దేర్ ఈజ్ మోర్ ఇన్ అవర్ రిలేషన్.”

“ఓ! మీ ఆవిడకు కూడా అలాగే అనిపిస్తోందా? యూరప్‌లో తనూ ట్రెక్ చేసిందేమో! హహహ!”

స్వప్నా, రాఘవ్ నవ్వలేదు. క్రిష్ మొహంలోకి చూస్తూ ఉండిపోయారు.

“ఓ! కమాన్! ఇట్స్ జస్ట్ ఎ జోక్!” అన్నాడు క్రిష్ మౌనం భరించలేక.

“ఐ డోంట్ నో! నీ జోక్ ఎందుకో బాగా గుచ్చుకుంది.” రాఘవ్ గొంతు కొద్దిగా మారింది.

“మీ మగాళ్ళు ఎప్పటికీ మారరు…” అంటూ నిరాశగా తల అడ్డం ఊపింది స్వప్న, మరికొన్ని నిమిషాల నిశ్శబ్దం తరువాత రాఘవ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ.

రాఘవ్ ఫోన్ బజ్‌మంది. “వావ్! మా బేబీ అడాప్షన్ ఫైనలైజ్ అయింది. నేను అర్జెంటుగా మా లాయర్‌కి కాల్ చెయ్యాలి!” లేచాడు రాఘవ్.

“అదుగో! మధూ వచ్చేశాడు. నేను వెళ్ళాలి. తరవాత తీరిగ్గా మీకు అతన్ని పరిచయం చేస్తాలే” అంటూ, అప్పుడే కర్బ్ పక్కనే ఆగిన కన్వర్టబుల్ స్పోర్ట్స్ కార్ వైపుకి పరిగెత్తుకు వెళ్ళింది స్వప్న, చేయి ఊపుతున్న డ్రైవర్‌కు తనూ ఊపుతూ.

అక్కడే కూర్చుని ఇదంతా చూస్తున్న క్రిష్ ఫోన్ ఆరోసారి మోగింది.