దివ్వెలు

ఎంత చక్కటి నిదరో
అందులో అంత కమ్మటి కల
హాయిగా నిదరోతున్నట్టు

* *

రవ్వల్లే వెలిగి మలుగుతుంది దివ్వె
రవ్వంతసేపే పెదాల మధ్య
అయినా వెలుగు మిగులుతుంది

* *

తోడుగా కూచున్న పిట్ట ఎగిరిపోయింది
అంత చెట్టూ దుఃఖాన వొణికిపోయింది
నాలుగు కన్నీటి పూలు రాల్చి

* *

రాత్రంతా వసంతోత్సవం ఎవరాడారో
ఎటు చూసినా రోడ్ల పక్కన చెదిరిన రంగులు
పొద్దున్నే విచ్చుకున్న గడ్డిపూలు

* *

విశ్వం చెక్కిట
జారుతున్న వెచ్చటి నెత్తుటి చుక్క
మన భూగోళం


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...