నువ్వెందుకు రాస్తున్నావు? రాయడం అన్న ప్రక్రియలో ఎంతో కొంత దూరం ప్రయాణించిన అందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయే ప్రశ్నే ఇది. ఒకానొకప్పుడు, ఔత్సాహిక రచయితలకు, ఈ ప్రశ్నకు జవాబుగా తమ అభిమాన రచయిత పేరు ఉండేది. వాళ్ళ సిద్ధాంతాలు, ఆదర్శాలు, వాళ్ళు చూపించిన జీవన విధానం, కలల ప్రపంచం పాఠకులకు, సాటి రచయితలకు ఆదర్శప్రాయంగానూ, అందుకోవాలనిపించేవిగానూ ఉండేవి. ఇంచుమించు అందరు రచయితలూ జీవితానుభవాలను భద్రం చేసుకోవాలనో, రాతని ఒక ఆయుధంగా వాడుకుని దేన్నైనా సాధించాలనుకునో, రాయడమొక అలవాటుగానో వ్యసనంగానో మారడం వల్లో, కేవలం కాలక్షేపపు ప్రక్రియగానో చదువు నుండి రాతలోకి దిగుతారు. రచనకు కావలసిన ముడిసరుకు జీవితంలోనే దొరికినా, దానిలోకి ప్రాణశక్తిని నింపేది రచయితలోని సృజనాత్మకత, ఊహాశక్తి. రచనావ్యాసంగం లోకి దిగడానికి కారణం ఏదైనా, ఒకసారి మొదలంటూ పెట్టాక దానిపట్ల నిబద్ధత తప్పకుండా ఉండవలసిందే. అందుకే ముఖ్యంగా, ఎవరికో జవాబివ్వడానికి కాకున్నా, రచయితలకు నేనెందుకు రాస్తున్నాను? అన్న ప్రశ్నతో ప్రయాణం తప్పదు. ఈ మొదటి ప్రశ్నకు సమాధానం ఏదైనా రచయితకు అటుపైన తమ వ్యాసంగాన్ని కొనసాగించే క్రమంలోనూ, నిజాయితీతో కూడా సృజన వెలువడాలంటే ఆత్మ విమర్శ తప్పదు. అభ్యాసమూ తప్పదు. తన సృజనాత్మకతను, తన సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. కథ చెప్పాలనే తపనకన్నా ఆ కథను ఎలా చెప్పాలి అన్న ఆలోచన ముఖ్యం. ప్రపంచసాహిత్యంలో కథనరీతులు పరిశీలించాలి. ఆ పరిచయంతో తన కథనాన్ని కొత్తదారులు పట్టించడానికి ప్రయత్నించాలి. రాయడం చాలామందే రాస్తారు. కాని ప్రభావవంతంగా రాసే నైపుణ్యత కావాలంటే ముందు చాలా చదవాలి, నేర్చుకోవాలి అని తెలుసుకోవడం ముఖ్యం. కాకిపిల్ల కాకికి ముద్దల్లే, తమ రచనలు తమకు అద్భుతంగా అనిపిస్తాయని, కాని ఆ రచనల అసలు విలువు విమర్శ వల్లే తెలుస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రోత్సాహాన్ని, పొగడ్తను ఆశించి రచనలు చేసిన వారెందరు కాలపరీక్షకు నిలబడ్డారో మనకు తెలీని విషయమేం కాదు. మంచి రచయిత ఒక మంచి విమర్శకుడు, పాఠకుడూ కూడా. అందుకే సమర్ధులైన రచయితలకు ఏది సద్విమర్శో, ఏది అపరిపక్వమైన అభిప్రాయమో తెలిసిపోతుంది. అలా ఒక మంచి రచయిత కావాలంటే తనను తాను అన్నిరకాల విమర్శలకూ ఎదురొడ్డక తప్పదు. అలాకాక, రాసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ సాహిత్య సమాజాలను, అవి ఇచ్చే కుహనా పొగడ్తలను, వాటి తోడ్పాటును దాటుకుని వెళ్ళకపోతే, సృజనాత్మకత ఒక ఇరుకైన చట్రంలోనే కొట్టుకులాడుతుంది. సాహిత్య కూటములు, సాహిత్య కార్యక్రమాలు నిజానికి చెయ్యవలసింది, రచయితను నిరంకుశంగా పదును పెట్టడమే. కానీ తెలుగు నాట ఈ సాహిత్య వికాసం వెర్రి తలలు వేసి సాహిత్య కార్యక్రమాలు వంతులవారీగా ఒక్కొక్కరి అజమాయిషీలో ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలతో ముగిసిపోతోంది. సాహిత్యం, దాని చుట్టూ దట్టంగా అల్లుకుపోతున్న రాజకీయాలను చూసి వెగటు చెంది, ఏ ఆదర్శాలూ బిగ్గరగా వల్లించకపోయినా ఎవ్వరికీ ఏ చేటూ చెయ్యని మిగతా సమాజమే ఈ కుహనా రచయితల కంటే మేలని పాఠకులను తరిమేసేలా ఉంది.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
జులై 2022 సంచికలో ...
- ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 9
- ఉద్ధరేదాత్మనాత్మానం
- ఊహల ఊట 14
- ఎందాకని?
- కలలు రాని నిద్ర
- కాలరేఖ
- కొన్ని నూతనచ్ఛందోరీతులు
- గడినుడి – 69
- జులై 2022
- దేశిచ్ఛందస్సు కూడ గీర్వాణచ్ఛందస్సునుండి పుట్టినదియే!
- నది ఒడ్డున
- మాస్కోలో ఒక అమెరికన్ మాథమటిషియన్
- మూడు కవితలు
- మూడు కవితలు
- యూట్యూబ్లో ఈమాట: గతనెలలో
- రెండు తీరాలు
- శిఖరారోహణ
- శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 69
- సముద్రమూ నేనూ కృష్ణశాస్త్రీ
- సోల్జర్ చెప్పిన కథలు: మొదటి రోజు