రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మాస్కోలో ఒక అమెరికన్ మాథమటిషియన్

రచన: వాసుదేవరావు ఎరికలపూడి
జులై 2022

[ఈ వ్యాస రచయిత ప్రొఫెసర్ మెల్విన్ బి. నేథన్సన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన లెమాన్ కాలేజ్ అండ్ గ్రాడ్యుయేట్ సెంటర్‍లో గణితాచార్యుడు. ప్రొఫెసర్ నేథన్సన్, సోవియట్ యూనియన్ కొనసాగుతున్న రోజుల్లో కొంతకాలం మాస్కో నగరంలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ మాస్కోలో ప్రసిద్ధ గణితాచార్యుడు ప్రొఫెసర్ గెల్ఫాండ్ దగ్గర విద్యార్థిగా ఉన్నారు. ప్రొఫెసర్ గెల్ఫాండ్ శతజయంతికి రాసిన వ్యాసంగా ఈ రచన ‘నోటీసెస్ ఆఫ్ అమెరికన్ మాథమాటికల్ సొసైటీ’ ఫిబ్రవరి, 2014 సంచికలో వచ్చింది. ఇంటర్నెట్‍లో సోవియట్ నాళ్ళల్లో వివిధ రంగాల్లోని శాస్త్రజ్ఞుల స్థితిగతుల గురించి, వారి పరిశోధనల గురించీ ఎన్నో వ్యాసాలు, ఎంతో సమాచారమూ దొరుకుతాయి. కానీ, ఈ అనువాదకుని చూపుకి ఈ వ్యాసం క్లుప్తంగానూ, సూటిగానూ, సరళంగానూ ఉన్నట్టు అనిపించి తెలుగు పాఠకులకు అనువదించి అందజేయాలనిపింపజేసింది.

సోవియట్ రష్యా గతించి చాలాకాలమయింది. సోవియట్ యూనియన్ బతికున్న రోజుల్లో అక్కడ ఒక నియంతృత్వం స్వైరవిహారం చేసింది. సోవియట్ యూనియన్‍లోనూ తూర్పు ఐరోపాలోని సోవియట్ కబంధ హస్తాల్లో ఇరుక్కున్న కమ్యూనిస్ట్ దేశాల్లోనూ ఆ రోజుల్లో ఏమి జరుగుతున్నది అన్నది బయట ప్రపంచానికి ముఖ్యంగా పాశ్చాత్యదేశాలకు తెలియనిచ్చేవారు కారు. అప్పటి ఆ పరిస్ఠితిని (మొదటగా చర్చిల్) ‘ఇనుపతెర’గా అభివర్ణించేవారు. ఎన్నో విధాలుగా శక్తివంతమైన అమెరికాకు సైతం సోవియట్ యూనియన్‍లో ఏం జరుగుతున్నదో ఇతమిథ్థంగా తెలిసేది కాదు. రష్యాలో అంతరిక్ష పరిశోధన ఏదిశగా నడుస్తోందో తెలుసుకోవటానికి అమెరికన్ ప్రభుత్వం కొట్టుకుపోయేది. అయినా అప్పటి రాజకీయ పరిస్థితులతో మనలో కొంతమందికైనా కొద్దోగొప్పో పరిచయం ఉంది, కానీ ఉన్నతవిద్య, పరిశోధనా ఆనాటి రష్యాలో ఎలా సాగాయో మనలో చాలామందికి ఏమాత్రమూ తెలియదనే చెప్పాలి. ఇతరశాస్త్రాల విషయం ఎట్లా ఉన్నా గణితశాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. గణితశాస్త్ర అధ్యయనం ఒక ఊహాలోక విహరణం. ఈ కారణంగా సాధారణంగా గణిత శాస్త్రజ్ఞులు బాహ్యప్రపంచానికి దూరంగా ఉంటారు. అలాగే బాహ్యప్రపంచం గూడా వీళ్ళను దూరంగా ఉంచుతుంది. అంటే రాజకీయపు ఒత్తిళ్ళు గణితశాస్త్ర పరిశోధనల మీద ఉండే అవకాశం చాలా తక్కువ. అయినప్పటికీ ఆనాటి సోవియట్ గణిత శాస్త్రవేత్తల మీద కూడా రాజకీయం తన భయానక ఆధిపత్యాన్ని చెలాయించింది. వాళ్ళు నియంతృత్వ పిశాచపు కోరల్లోనే తమ ఊపిరులు పీల్చుకున్నారు. ఇతర శాస్త్ర అధ్యయనాలతో పోలిస్తే గణితశాస్త్ర పఠన పాఠనాలు తమ జీవికకు కనీసావసరాలు కూడా సమకూర్చలేనివని అనుభవమైనా, ఆ భయంకరమైన వాతావరణం లోనే కేవలం గణిత శాస్త్రాధ్యయనం ప్రసాదించే అలౌకిక ఆనందం మీది ప్రీతితో మాత్రమే వాళ్ళు అక్షరాలా అహర్నిశలూ శ్రమించి పరమోత్కృష్టమైన మేథోనైశిత్యంతో తమ శాస్త్రాధ్యయనాన్ని కొనసాగించారని, శాస్త్రపరిథుల్ని అబ్బురపరచే రీతిలో విస్తరింప చేశారనీ ఈ వ్యాసం చెబుతుంది. తెలుగునాట నేటి మన వైజ్ఞానికులకు, ఉన్నత విద్యాలయాలలోని ఉపాధ్యాయులకూ ఈ విషయాన్ని ఏమాత్రమైనా ఈ అనువాదం అందజేయగలిగితే అదే పదివేలు. – అనువాదకుడు.]


విశిష్ట సోవియట్ గణిత శాస్త్రవేత్త ఇస్రయిల్ మొయిసీవిచ్ గెల్ఫాండ్ (Israel Moiseevich Gelfand) సెప్టెంబర్ 2, 1913న యుక్రెయిన్ లోని ఒడెసా దగ్గరి ఓక్నీలో (తరువాత కాలంలో క్రాస్ని ఓక్నీ లేదా ఎర్ర ఒక్నీ) జన్మించి న్యూ జెర్సీ లోని న్యూ బ్రన్‍స్విక్‍లో అక్టోబర్ 5, 2009లో దివంగతుడయాడు. రష్యా విప్లవాలు (1917) యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిష్ట్ రిపబ్లిక్‍ని (యు.ఎస్.ఎస్. ఆర్.) డిసెంబర్ 29, 1922న నిర్మించుకొవటానికి జరిగిన ఒప్పందాన్ని కరారు చేశాయి. సోవియట్ యూనియన్ డిసెంబర్ 26, 1991 తన ఉనికిని చాలించింది. గెల్ఫాండ్ సోవియట్ యూనియన్ కన్నా ముందు పుట్టి అది శిథిలమైన తరవాత కూడా బతికాడు.

ఆయనతో నా పరిచయం పరోక్షంగా జరిగింది. 1970 లెంట్, ఈస్టర్ సెమిస్టర్‍లలో నేను కేంబ్రిడ్జ్ యునివర్సిటీ ప్యూర్ మాథమాటిక్స్ అండ్ మాథమాటికల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్‍లో సందర్శక రిసర్చ్ విద్యార్థిగా ఉన్నాను. ఆ రోజుల్లో బెలా బొలోబెస్ (Béla Bollobás) నా స్నేహితులలో ఒకడు. బెలా హంగేరియన్. ఆక్స్‌ఫర్డ్ నుంచి పిహెచ్.డి. తెచ్చుకున్న బెలా ఇంగ్లండ్ లోనే ఉండి పోవాలని నిశ్చయించుకున్నాడు. మరిక హంగరీకి తిరిగి వెళ్ళకూడదని కూడా నిర్ణయించుకున్నాడు. కోల్డ్‌వార్ పరిభాషలో బెలా హంగరీని విడిచి పలాయనం చిత్తగించి ప్రతిపక్షులు పెట్టుబడిదారుల పంచన జేరాడు. పాశ్చాత్య దేశాలలో చదువుకోటానికి వెళ్ళే ముందు ప్రాచ్య దేశం, అంటే యు.ఎస్.ఎస్.ఆర్.లో చదవాలని హంగరీ వాళ్ళు బెలాకి షరతు పెట్టారు. దాంతో బెలా ఒక సంవత్సరం మాస్కో స్టేట్ యునివర్సిటీలో గడిపాడు. అక్కడ బెలా గెల్ఫాండ్ దగ్గర చదువుకున్నాడు. వ్యక్తిగతం గాను, గణిత శాస్త్రవేత్త గానూ ప్రొఫెసర్ గెల్ఫాండ్ బెలాను గాఢంగా ప్రభావితం చేశాడు. గెల్ఫాండ్ ఎంత అసాధారణమైన వాడో – ఆయన వైశిష్ట్యం గురించి – బెలా నాకు తరచూ చెపుతుండేవాడు.

కేంబ్రిడ్జ్‌లో నా చదువు ముగిసిన 1970 వేసవిలో నేను సోవియట్ యూనియన్‍కి చిన్న ట్రిప్‍గా వెళ్ళాను. జీవశాస్త్రంలో డాక్టరేట్ తర్వాతి పరిశోధనకి మసాచుసెట్స్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చి కేంబ్రిడ్జ్‌లో ఒక సంవత్సరం గడిపిన మరొక అమెరికన్, బులెటిన్ బోర్డ్ మీద తను యు.ఎస్.ఎస్.ఆర్‍.లో డ్రైవింగ్ చేస్తూ తిరగాలనుకుంటున్నానని, తోడుగా ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నాననీ ఒక నోట్ పెట్టాడు. హెల్సింకి నుంచి ట్రైన్‍లో ప్రయాణం చేసి లెనిన్ గ్రాడ్‍లో అడుగుపెట్టి, కారు అద్దెకు తీసుకుని దక్షిణంగా మాస్కో మీదుగా కాకేషస్ దాకా డ్రైవ్ చేసుకుంటూ పోవటం అతని ప్రణాళిక. సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి ఈ అమెరికన్ జీవశాస్త్రజ్ఞుడికి అతిథిగా ఉపన్యసించవలసిందని ఆహ్వానం వచ్చింది. అక్కడ ఇతనికి ఆతిధ్యమిచ్చే సాధికార బాధ్యత బయోకెమిస్ట్రీ‌లో ఎన్నదగిన సోవియట్ విజ్ఞానవేత్త డేవిడ్ గోల్డ్‌ఫర్బ్‌ది. నేను కూడా గోల్డ్‌ఫర్బ్‌ని కలుసుకున్నాను. ఆయనతో నాకు గెల్ఫాండ్‍ని కలుసుకోవాలని ఉందని చెప్పాను. గోల్డ్‌ఫర్బ్ గెల్ఫాండ్‍ని కాంటాక్ట్ చేశాడు. గెల్ఫాండ్ బాగా బిజీగా నైనా ఉండి ఉండాలి లేదా పూర్వ పరిచయం లేని ఒక అమెరికన్‍తో సమావేశమవటం విజ్ఞత కాదనైనా అనుకుని ఉండాలి. నాకు నంబర్ థియరీలో ఆసక్తి ఉందని గోల్డ్‌ఫర్బ్ గెల్ఫాండ్‍తో చెప్పినప్పుడు, గెల్ఫాండ్ తను గ్రీవ్, పటెట్‍స్కీ, షపీరోలతో కలిసి జెనరలైజ్డ్‌ ఫంక్షన్‍ల మీద రాసిన పుస్తకాల్లో ఆరో భాగం – రిప్రజెంటేషన్ థియరీ అండ్ ఆటోమార్ఫిక్ ఫంక్షన్స్ అన్న పుస్తకాన్ని – నాకిమ్మని గోల్డ్‌ఫర్బ్‌కి ఇచ్చాడు.

కోల్డ్‌ఫర్బ్‌కి ఒక కాలు లేదు. అతను ఆ కాలిని రెండవ ప్రపంచ యుద్ధభూమిలో పోగొట్టుకొన్నాడు. హిస్టారియన్ అవుదామనుకున్నాడు కానీ నియంతృత్వ పాలనలో వృత్తిగా చరిత్ర చాలా ప్రమాదకరమైనది. స్టాలిన్ రష్యాలో చరిత్ర ప్రత్యేకంగా ప్రాణాంతకమైనది. ఆ కారణంగా గోల్డ్‌ఫార్బ్‌ మెడికల్ స్కూల్‍లో జేరి మలిక్యులార్ జెనెటిక్స్‌లో రిసర్చ్ చేశాడు. ‘పొట్ట ఎప్పుడూ పొట్టే’ అన్నాడతను నాతో.

నా తోటి పర్యాటకుడైన జీవశాస్త్రవేత్త ప్రబల వామపక్షవాది. [అమెరికన్] విద్యాసంస్థలలో ఉన్న చాలామంది లాగానే నేనూ వియత్నాం యుద్ధ వ్యతిరేకినే. ఐనప్పటికీ అతను నాకు ఎంత ఎడమగా ఉంటాడంటే అతని పక్కన నేను రైటిస్ట్ లాగా కనిపించాను. పైకి ప్రజల దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీ విధానాలకు విధేయులుగా కనపడుతూ లోలోపల నియంతృత్వానికి తీవ్ర వ్యతిరేకతతో వియత్నాంలో అమెరికా సైన్యాల ప్రవేశాన్ని – ఎంతోమంది అమెరికన్ సైంటిస్ట్‌లు నిరసిస్తున్నప్పుడు – సమర్ధిస్తున్న సోవియట్ సైంటిస్ట్‌లకు నేను ఇలా రైటిస్ట్‌గా కనపడటం నన్ను వాళ్ళకు తృటిలో దగ్గరివాణ్ణి చేసింది. కమ్యూనిస్టులను అంతం చేయటమన్నదాంట్లో వాళ్ళకు నమ్మకం ఉంది. ఇది మాస్కోలో నేను ఈ (ప్రచ్ఛన్న) వైరుధ్యంలో నేర్చుకున్న మొదటి పాఠం.

కమ్యూనిస్ట్ పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళల్లో చాలామంది వాళ్ళ పిల్లలకు సైన్స్‌కి సంబంధించిన ఉద్యోగాల కోసం పరిచయాలను వాడుకునేవారు. వాళ్ళు, నియంతృత్వంలో తాము సమసిపోకుండా ఉండటానికి చేయవలసినదంతా చేసినవాళ్ళు, రాజకీయాలు ఎంత ప్రమాదకరమైనవో తెలుసుకున్నవాళ్ళు. వాళ్ళపిల్లలు నిర్భయంగా భద్రతతో బతకాలని కోరుకుంటున్నవాళ్ళు. సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‍ లో గాని, యూనివర్సిటీలలో గాని, డిగ్రీ చదువుల్లో ఉన్న పిల్లల్లోను, పరిశోధనల స్థాయిలో ఉన్న విద్యార్థుల్లోనూ చాలామంది పార్టీ కార్యకలాపాల నిర్వహణలో పైస్థాయిలో ఉన్నవాళ్ళతో సంబంధ బాంధవ్యాలున్నవాళ్ళే. సైంటిస్టులకు కమ్యూనిస్ట్ పార్టీ‍తో సంబంధాలుండటమనేది ఎప్పుడూ అది తెచ్చిపెట్టే లాభాలను తెచ్చిపెడుతునే ఉండేది. పార్టీతో సంబంధాలు లేని పెద్ద సైంటిస్టులు వాళ్ళకూ వాళ్ళ విద్యార్థులకూ నిలవ నీడ కోసం పార్టీతో గట్టి సంబంధాలున్న చాలా చిన్న స్థాయి సైంటిస్టులతో కలిసి పని చేసేవారు. ‘కలిసి పని చేయడం’ అంటే పార్టీ సభ్యులు‍గా ఉన్న అంతంతమాత్రం సైంటిస్టుగాళ్ళకు పరిశోధనల ప్రచురణలలో సహ రచయితల హోదా ఇవ్వటం. ఇటువంటి వైజ్ఞానిక రాజకీయం నియంతృత్వ పాలన లేని చోట్ల కూడా కనపడే విషయమే అనుకోండి.

నాకు గెల్ఫాండ్ దగ్గర ఒక సంవత్సరం పాటు గణితశాస్త్ర విషయాలు నేర్చుకుంటూ గడపగలిగే అవకాశం కోసం ప్రయత్నించాలని అనిపించటానికి బెలా బొలోబెసే కారణం. ఇది సాధ్యపడేటట్టు చేయటం అంత తేలికైన విషయం కాదు. కోల్డ్‌వార్ రోజుల్లో ఒక అమెరికన్ మాస్కో‍లో ఏ అధ్యయనమైనా, పరిశోధనైనా చేయటమన్నది దాదాపు అసాధ్యమైన విషయమే. పారిస్ లోనో, కేంబ్రిడ్జ్ లోనో అయితే చిటికినవేలి గోటితో ఏర్పాటు చేసుకోగలం. విమానం ఎక్కటం ఫ్రాన్స్‌కో ఇంగ్లండ్‍కో వెళ్ళటం, అంతే. కానీ ఒక సామాన్య అమెరికన్ సోవియట్ యూనియన్‍ లోకి ప్రవేశించాలంటే కొద్దికాలానికి మాత్రమే అనుమతితో, ఎంతో డబ్బు ఖర్చయ్యే పర్యాటన గానే సాధ్యం. అయినప్పటికీ ప్రభుత్వస్థాయిలో రెండు దేశాల మధ్యా రెండు రకాల ఒప్పందాలున్నాయి. ఇక్కడినుంచి అక్కడకు ఒకళ్ళు వెళ్తే అక్కడనుంచి ఇక్కడకు ఒకళ్ళు వచ్చే ధోరణిలో. వీటిలో ఒకటి వాషింగ్టన్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‍కీ, సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‍కీ మధ్య కుదిరిన ఒప్పందం. కానీ ఇది కుర్ర సైంటిస్టులకు కాదు. సీనియర్లకు, కొద్ది కాలానికే.

రెండవది ఈ రెండు దేశాల మధ్యా కొంత విశాలమైన సాంస్కృతిక సంబంధాల విషయంలో ఉన్న పరస్పర అంగీకారం. మేము ‘న్యూయార్క్ ఫిలార్మనిక్’ను మాస్కోకి పంపుతామనుకుంటే వాళ్ళూ ‘బోల్ష్‌వా బాలే’ని న్యూయార్క్‌కి పంపే పద్ధతిలో. ఈ ఒప్పందంలో ఉన్న మరో చిన్న అంశంగా యూనివర్సిటీ స్థాయిలో డాక్టరేట్ కోసం కృషి చేస్తున్న విద్యార్థులకు, డాక్టరేట్ వచ్చింతర్వాత పరిశోధనలను విస్తృత పరచుకునే పోస్ట్ డాక్టరల్ విద్యార్థులకూ ‘పరస్పర’ రీతిలో సందర్శనకు అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం అమెరికనులు నలభైమంది అమెరికన్ యువ పండితులను ఎంపిక చేస్తే సోవియట్లు నలభై మంది సోవియట్ యువ పండితులను ఎంపిక చేస్తారు. ఒక దేశం ఎంపిక చేసిన పండితులను అతిథులుగా రానివ్వటానికి రెండవ దేశం అంగీకరించాలి. అమెరికన్ వైపునుండి ఈ కార్యకలాపాలు న్యూయార్క్ లోని వివిధ అమెరికన్ విద్యావేత్తల సంఘాల సమాహార సంస్థకు అనుబంధంగా ఉన్న ఐరెక్స్ (ఇంటర్నేషనల్ రిసర్చ్ అండ్ ఎక్స్‌ఛేంజెస్ బోర్డ్) నిర్వహించేది.

ఈ పరస్పర సందర్శనలో పండితుల ఎంపిక ఒక పద్ధతిలో జరిగేది. రష్యనులు నలభై మంది ఇంజనీర్లను, కంప్యూటర్ సైంటిస్టులను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి పంపిస్తే అమెరికన్లు నలభై మంది విద్యార్థులను మాస్కోకి దోస్తొయెవిస్కీని, రాస్పుటిన్‍నీ అధ్యయనం చేయటానికి పంపేవాళ్ళు. ఐరెక్స్ ఎప్పుడూ అతి తక్కువమంది సైంటిస్టులను యు.ఎస్.ఎస్.ఆర్.కి పంపేది. దీనికి కారణం రష్యాలో సైంటిఫిక్ రిసర్చ్‌కి చాలా తక్కువ అవకాశాలుండటంతో. అక్కడతప్ప వేరెక్కడా వీలు కాని రిసర్చ్ విషయం అయితేనే ఆ శాస్త్రవిభాగంలో పరిశోధకులను రష్యాకు ఎంపిక చేయటం జరిగేది. సైన్స్ ప్రతిచోటా ఉంది. సైంటిఫిక్ రిసర్చ్‌లో ఏదైనా సమస్యని యు.ఎస్.ఎస్.ఆర్‍.లో మాత్రమే పరిష్కరించగలమని అనటం అంత తేలిక కాదు. నువ్వు చేసే పరిశోధనాంశ విశేషాలు రష్యన్ భాషలో ఉన్నా, నీ పరిశోధన రష్యన్ సాహిత్యం లోనో, లేదా రష్యన్ చరిత్ర లోనో అయి దానికి సంబంధించిన వెనకటి కథలన్నీ సోవియట్ యూనియన్‍లో మాత్రమే దొరికే పక్షాన నువ్వు నీ పరిశోధన కోసం మాస్కో వెళ్ళాల్సి ఉంటుందని నీ ప్రణాళికలో పేర్కొనటం సమంజసంగా ఉంటుంది.

ఐరెక్స్ ప్రోగ్రామ్‍లో పాలుపంచుకున్న మొట్టమొదటి గణిత శాస్త్ర పరిశోధకుణ్ణి అయ్యాను నేను, 1972-73లో. ఐరెక్స్‌కి నేను పెట్టుకున్న దరఖాస్తులో ప్రపంచంలో ఉన్న అత్యున్నత స్థాయికి చెందిన గణిత శాస్త్రవేత్తలలో పెక్కుమంది సోవియట్ యూనియన్‍లో ఉన్నారని, వాళ్ళందరూ మాస్కోలో కేంద్రీకృతమై వున్నారని, వాళ్ళు దేశం విడిచి బయటకెక్కడికీ ప్రయాణం చేయటానికి వీలులేదని, వాళ్ళతో కలిసి పనిచేయటం ఎంతో విలువైన అనుభవమనీ రాశాను. ఇవి బలమైన కారణాలు. ఐరెక్స్ ఆమోదం లభించింది. ఐరెక్స్‌కి నేను గెల్ఫాండ్‍తో కలిసి పనిచేయటమే నా ప్రణాళికగా దరఖాస్తు చేసుకున్నాను. దీనికి, నా అధ్యయనానికి పర్యవేక్షకునిగా ఉండటానికి గెల్ఫాండ్ అంగీకరించాలి. ఆయన ఒప్పుకున్నాడు. నాకు వీసా వచ్చింది. నేను మాస్కో వెళ్ళాను.

ఒక విడతలో ఐరెక్స్ పథకంలో యు.ఎస్.ఎస్.ఆర్. వెళ్ళే అమెరికన్లందరూ ఆగస్ట్ నెలలో పారిస్‍లో కలుసుకోవాలి. పారిస్‍లో కలుసుకుని అక్కణ్ణుంచి విమానంలో మాస్కో వెళ్ళాలి. నేను కొద్ది రోజులు ముందుగానే పెట్టె నిండా లెక్కల పుస్తకాలు, ఒక ఓలివేత్తి టైప్‍రైటర్‍తో పారిస్ చేరుకుని, బడి వీథిలో ఒక చౌకరకం హోటల్లో ఉన్నాను. ఆ హోటల్లో ఉండి పాల్ ఎర్డొష్‍తో నా మొట్టమొదటి రిసర్చ్ పేపర్‍గా తయారయిన విషయం మీద విపరీతంగా కష్టపడి పనిచేశాను. ఆ పని పూర్తయి పేపర్ రాయటం అయింతర్వాత రాతప్రతిని ఫ్రాన్స్ నుంచి పోస్ట్ చేయటానికి సమయం చాలకపోయింది. కానీ ఐరెక్స్ విద్యార్థులకు మాస్కోలోని అమెరికన్ దౌత్య కార్యాలయం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కలగజేసింది. అన్నిటికన్నా ఎక్కువ ఉపయోగపడే సౌకర్యాలలో ఒకటుంది – అది యు.ఎస్.ఎస్.ఆర్. బయటికి దౌత్య తపాలా సంచిలో ఉత్తరాలు పంపించుకునే వీలు. సైంటిఫిక్ రాతప్రతులను అమెరికాకు పంపించటంలో యు.ఎస్.ఎస్.ఆర్. తపాలా – మృదువుగా చెప్పాలంటే – అంత నమ్మదగింది కాదు. నేను నా పేపర్‍ని వియన్నా‍కు వెళ్తున్న ఒక నావికుడు చేత్తో పట్టుకుపోతున్న తపాలా సంచిలో పడేసి ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది అమెరికన్ మాథమాటికల్ సొసైటీ’కి పంపగలిగాను.

గెల్ఫాండ్‍తో నా మొట్టమొదటి సమావేశం మాస్కో స్టేట్ యూనివర్సిటీలో నలుగురూ కూచుని కబుర్లు చెప్పుకునే చోట జరిగింది. అప్పుడు ఆయన నాకు చెప్పిన రెండు విషయాలు జ్ఞాపకం ఉన్నాయి. మొదటిది ఆయన మంత్రంగా ప్రసిద్ధి చెందినది. ‘ఉన్నది ఒకే గణిత శాస్త్రం.’ తర్వాత ఆయన సోవియట్ యూనియన్‍లో ఉన్న యువ గణితవేత్తల లోకల్లా మరీ ప్రతిభావంతుల పేర్లు – ఒక చిన్న చిట్టా అప్పజెప్పినట్టుగా చెప్పి, “నాకన్నా వాళ్ళకు గణితశాస్త్రం చాలా ఎక్కువ తెలుసు, కానీ నా కున్న ఊహాశక్తి మెరుగైనది,” అన్నాడు. పటెట్‍స్కీ, షపీరో, మనిన్‍లు చెపుతున్న పాఠాలకు హాజరవమని గెల్ఫాండ్ నాకు సూచించాడు కానీ అన్నింటికన్నా నా మాస్కో గణిత శాస్త్రాభ్యాసంలో విలువైనదని నేననుకునేది ఎంతో ప్రఖ్యాతి పొందిన ‘గెల్ఫాండ్ సోమవారం రాత్రుల సెమినార్ల’లో పాలు పంచుకోవటం. ఆ సెమినార్లు ‘ఇన్నింటికి మొదలు పెట్టాలి’ అని అధికారికంగా ఏమన్నా ఉండేదేమో నాకు గుర్తుకు రావటం లేదు. అందరూ చాలా ముందుగానే వచ్చి ఆ హాల్లో చేరుకుని లెక్కలే మాట్లాడుకోవటం మొదలు పెట్టేవారు. అసలు సెమినారు – ముందుగా నిర్ణయించుకున్న శాస్త్ర విషయ చర్చ – మెల్లిగా మొదలయ్యేది. ఒకళ్ళతర్వాత ఒకళ్ళు మాట్లాడుతునే ఉండేవారు. సెమినారు ముగియాలనుకున్న టైమ్ యేదైనా ఉంటే అది దాటి చాలాకాలం అయిపోయేది, చివరికి ఆ హాలు తుడిచి శుభ్రం చేసే ఆవిడ వచ్చి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టేదాకా.

ఎవరైనా మాట్లాడుతుండగా గెల్ఫాండ్ వాళ్ళను ఆపి వింటున్నవాళ్ళలో ఎవరినైనా ఉద్దేశ్యించి అప్పుడు నడుస్తున్న విషయాన్ని వివరించమని అడగటం సర్వసాధారణంగా జరిగేది. నేను మొదటిసారి ఈ సెమినార్లకి హాజరయింది ఒక ఉపన్యాసం కొనసాగుతూ ఉంటే మధ్యలో వెళ్ళినప్పుడు. గెల్ఫాండ్ “మెల్విన్ నీకు అర్థమౌతోందా?” అని అడిగాడు. “కావట్లేదు.” “ఏం, ఎందుకని?” “వాళ్ళు రష్యన్‍లో మాట్లాడుకుంటున్నందువల్ల.” ఆయన వెంటనే డిమా ఫుక్స్‌ని నా పక్కన కూచుని నాకు వాళ్ళ రష్యన్‍ని ఇంగ్లిష్ లోకి అనువదించి చెప్పమని పురమాయించాడు. కొద్దికాలానికే నా రష్యన్ భాష మెరుగై ఇంక భాష మీద నెపం వేసే అవకాశం పోయింది.

ఎవరు ఏం నేర్చుకోవాలో గెల్ఫాండే నిర్ణయించేవాడు, సెమినార్‍లో చెప్పేవాడూ. ఒకసారి గెల్ఫాండ్ ఆర్నల్డ్‌ను ‘పి-యాడిక్ సంఖ్యల’ గురించి కొన్ని వరస ఉపన్యాసాలు ఇమ్మన్నాడు. ఆర్నల్డ్‌కి ఈపని కష్టంగా తోచింది. ఆర్నల్డ్ ‘రియల్ సంఖ్యల’ పరిధి లోను, ‘కాంప్లెక్స్ సంఖ్యల’ పరిధి లోనూ ఉద్దండుడు, కానీ పి-యాడిక్ సంఖ్యలకు సంబంధించిన గణితంలో వచ్చే కొన్ని ముఖ్యమైన విలువలను అవగాహన చేసుకోవటంలో ఇబ్బంది పడ్డాడు. ఈ విలువల గురించి సంఖ్యాశాస్త్రంలో కృషి చేస్తున్న ప్రతి యువ గణిత విద్యార్థికీ తెలుసు. ఆర్నల్డ్ వంటి గొప్ప గణితజ్ఞుడు ఇలా కొంతమందికి చాలా సులువుగా తెలిసిన శాస్త్రవిషయాలను అర్థం చేసుకోవటానికి తన్నుకోవటం ఒక పాఠం నేర్పింది. అంతమందికీ మంచినీళ్ళ ప్రాయంగా అనిపించిన విషయమే అయినా అది నీకు కష్టంగా అనిపిస్తే నిన్ను నువ్వు దద్దమ్మగా పరిగణించుకోనవసరం లేదని.

నడవటం రష్యన్ సంప్రదాయం. చలికాలం నిజంగానే చాలా చల్లగా ఉంటుంది. అయినా గాలి తక్కువగా ఉండటం వల్ల అంత చలిని భరించగలం. సెమినారు ముగిసిన తర్వాత తరచుగా కొంతమంది ఒక జట్టుగా గెల్ఫాండ్‍తో బయలుదేరేవారు. వాళ్ళు నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ రాత్రి బాగా పొద్దుపోయేదాకా దట్టంగా మంచు పడ్డ రోడ్ల పక్కల మీద లెక్కలు చేసుకుంటూ, రాసుకుంటూ ఆయనతో వెళ్ళేవారు. బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. గదుల్లో అయితే గోడలకు చెవులుంటాయి. చాలామంది గణిత శాస్త్రజ్ఞులు నన్ను ‘నడుద్దాం రమ్మ’నే వారు. రోడ్ల మీది వేరెవరి జోక్యమూ లేని ‘ఏకాంత స్వేచ్ఛ’లో నన్ను “అమెరికాలో ఎలా ఉంటుంది?”, “అమెరికాలో యూదులంటే ద్వేషం ఎంత ఎక్కువగా ఉంది?”, “అమెరికన్ యూనివర్సిటీలలో ఉద్యోగం రావటం ఎంత కష్టం?” అని అడిగేవారు. ఆనతి కాలంలో వలస విధానం సులభమవటంతో వాళ్ళందరూ వలస వెళ్ళి పోయారు.

1989లో గెల్ఫాండ్ అమెరికా సంయుక్త రాష్త్రాలకు వలస వెళ్ళాడు. తొలుత హార్వర్డ్ విశ్వవిద్యాలయం లోను, మసాచుసెట్స్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోనూ సందర్శకాచార్యునిగా ఉండి, రట్గర్స్ యూనివర్సిటీలో విశిష్టాచార్యునిగా ఉన్నాడు. జీవశాస్త్రవేత్త గోల్డ్‌ఫర్బ్ కూడా రష్యాను వదిలి న్యూయార్క్ వెళ్ళిపోయాడు.

ఐరెక్స్‌లో మాస్కో వచ్చిన అమెరికన్ విద్యార్థులందరూ శయనాగారాలవంటి గదుల్లో ఉండేవారు. సంవత్సరం తర్వాత సంవత్సరం వచ్చే అమెరికన్ విద్యార్థులు మారొచ్చు గానీ అమెరికన్లకు ఇచ్చే గదులు మాత్రం మారేవి కావని నాకు విశదమైంది. ఆ గదులు అన్నీ ఒకే అంతస్తులో కాక వేరు వేరు అంతస్తులలో, ఒక దాని మీద ఒకటి, సరిగ్గా మీదగా, అమెరికన్లను వాళ్ళ ఆవాసంలో గూఢంగా కనిపెట్టి ఉండటానికి భవనానికి నిలువుగా కేబుళ్ళను అమర్చుకోవటానికి సులువుగా ఉండేటట్లు ఏర్పాటు చేసేవారు. “నీ గదిలో నీకు ఏమైనా ప్రత్యేకంగా కావలసినది అమర్చాలని నువ్వు అధికారులకు చెప్పాలనుకుంటే అదుగో ఆ బల్బుకు చెప్పు’ అన్నది అక్కడ సుపరిచితమైన నవ్వూసు. యూనివర్సిటీలో ఉన్న ‘కమిసోల్’లో చురుకుగా ఉన్న వాళ్ళలో నాకు చాలా మంది మిత్రులు. కమిసోల్ కమ్యూనిస్ట్ పార్టీ యువజన శాఖ. అందులో ఉన్న వాళ్ళకు అమెరికన్లతో స్నేహం వాళ్ళు విధిగా చేయవలసిన పార్టీ కార్యక్రమంగా అప్పజెప్పబడిందని అనుకోవచ్చు. ‘మీ గదుల్లో టేపు చేసిన మాటల్లో ప్రతి గొంతూ వాళ్ళు గుర్తుపట్టలేర’ని నాతో కమిసోల్ వ్యక్తి ఒకరన్నారు.

యూనివర్సిటీ బయటి జీవితానికి కొమిసోల్ అద్దం పట్టేది. బయటి జీవితంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులకు సామన్య జనానీకానికి లేని కొన్ని ప్రత్యేక ప్రతిపత్తులు, సదుపాయాలూ ఉన్నాయి. ఉదాహరణకు, యూనివర్సిటీలో పై తరకల కొమిసోల్ వ్యక్తులకు వాళ్ళల్లో వాళ్ళు మాత్రమే జరుపుకునే పార్టీలు ఉండేవి. అటువంటి పార్టీ కొకదానికి నేను వెళ్ళాను. ఆ పార్టీలో ఎస్టోనియా నుంచి తెప్పించుకున్న బృందపు రాక్ సంగీతం ఉండింది. ఇతర మామూలు విద్యార్థులు ఆ పార్టీలోకి జొరబడటానికి ప్రయత్నించినప్పుడు కొమిసోల్ పోలీసులను పిలిచారు.

మధ్యలో వచ్చిన క్రిస్మస్ సలవులకు నేను అస్వస్థతతో ఉన్న నా తల్లిని చూడటానికి వెనకకు – ఫిలడెల్ఫియాకి – వచ్చాను. శలవల తర్వాత తిరిగి మాస్కో వెళ్ళినప్పుడు గెల్ఫాండ్, “సోవియట్ యూనియన్‍లో కొన్నాళ్ళుండి, అమెరికా వెళ్ళి మళ్ళీ సోవియట్‍కి రావటం నీకెలా అనిపించింది?” అని అడిగాడు. “బాగానే ఉంది గాని, ఇంటిదగ్గర మొదటి వారమంతా ఫోన్ మాట్లాడాలంటే జంకు పుట్టేది” అన్నాను.

రష్యన్ సాహిత్యం, ప్రత్యేకించి పుష్కిన్ రచనలను, చదవమని గెల్ఫాండ్ నన్ను ఉద్బోధించేవాడు. పుష్కిన్ కవితలను, మొజార్ట్ అండ్ సలియేరి రికార్డును, ఇల్యా-పెత్రోఫ్ కలిసి రాసిన నవలలనూ నాకు ఇచ్చాడు. నాకు ఆయన మనిన్, షపిరోలతో కలిసి తను రాసిన ‘రిప్రజంటేషన్ ఆఫ్ ది రొటేషన్ గ్రూప్ అండ్ లారెంజ్ గ్రూప్’ అన్న పుస్తకము, ఇంగ్లిష్‍లో ఉన్న (ఆంద్రే) వెఇల్ రాసిన ‘బేసిక్ నంబర్ థియరీ’ అన్న పుస్తకమూ వాటితో పాటు వివిధ గణితశాస్త్ర విభాగాలలో పుస్తకాలు కూడా ఇచ్చాడు. స్నేహాలు చేసుకోవటంలో గెల్ఫాండ్‍కి ఉన్న ఆసక్తి, నేర్పూ అపారమైనవి. ఆంద్రే వెఇల్ గెల్ఫాండ్‍ను చూడటానికి మాస్కో వచ్చాడు. వాళ్ళిద్దరూ దగ్గరి స్నేహితులయ్యారు. నేను వెనకకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు తనకు సహాయకునిగా ఉండటానికి వెయిల్ నన్ను ప్రిన్స్‌టన్‍లో ఉన్న ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీకి ఆహ్వానించాడు. నాకైతే నిజం తెలీదు గానీ నన్ను గెల్ఫాండ్ వెయిల్‍కి సిఫారసు చేసి ఉంటాడనీ వెయిల్ స్నేహితుని మాటను గౌరవించాడనీ అనే నేననుకుంటూ ఉంటాను.

మాస్కోలో నువ్వు నీ సోవియట్ స్నేహితులను ఒకరికొకరు కలుసుకోలేని చట్రాలలో ఉంచటం నేర్చుకుంటావు. అమెరికన్‍తో పరిచయం ఉండటం ప్రమాదకరమైనది. ఎక్కడ పడితే అక్కడ సమాచారం చేరవేసేవాళ్ళు. నీ పరిచయస్తులే, ఒక అమెరికన్ కలుసుకుంటున్న ప్రతి వ్యక్తి గురించీ తెలుసుకునే పార్టీలో సాధికారిక పైవిభాగాలకి నిస్సందేహంగా ఉప్పు అందిస్తారు. నాకు మాత్రం భయభ్రాంతుణ్ణయి పోవలసిన అవసరం కనిపించలేదు. జాగ్రత్తగా మసలుకోవాలని మాత్రం తెలుసును. నాకు ఏ ప్రమాదమూ లేదని నేనెరుగుదును. ఈ నిర్భీతికి కారణం నాకు అమెరికన్ పాస్‍పోర్ట్ ఉండటమే. రష్యన్లు అంతర్జాతీయ వ్యవహారాలలో గొడవలు కోరుకోరు. నన్ను అరెస్ట్ చేస్తే చేయవచ్చు, దడిపించవచ్చు. నేను ఉద్రేకపడకుండా ప్రశాంతంగా ఉన్న పక్షాన నన్ను ఇంటికి తరలించేస్తారు. అది పెద్ద విషయమేమీ కాదు. సోవియట్ పౌరుల పరిస్థితి మాత్రం ఇలా ఉండదు. వాళ్ళ పరిస్థితి ప్రమాదాలలోకి నెట్టే పరిస్థితే. వాళ్ళను యూనివర్సిటీ నుంచి పంపించేయటం మొదలుకొని, ఉద్యోగాలలోంచి తొలగించటం దాకా, వాళ్ళ జీవితాలను బుగ్గిచేయటం దాకా ఏదైనా సంభవమే. అమెరికా సంయుక్త రాష్ట్రాలు వియత్నాంలో ఘోరయుద్హం చేస్తున్నప్పటికీ, హనోయి మీద బాంబులు వేస్తున్నప్పటికీ – ఒక వంక ఆగ్నేయాసియాలో కర్ర చూపిస్తూ, మరొక వంక అమెరికన్లతో వ్యాపారాన్ని పెంచుతున్నట్టుగా రాయితీలు, రష్యాకు ఎగుమతులూ – ఎరగా యు.ఎస్.ఎస్.ఆర్.కి కారట్లూ చూపిస్తూ, హెన్రీ కిసిన్జర్ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న జోడుగుర్రాల సవారీ సూత్రం కారణంగా రెండు దేశాల మధ్యనా ఏర్పరుచుకున్న విద్యావిషయకమైన పరస్పర ఒడంబడికతో, మాస్కోలో ఎటువంటి గూఢచారి చర్యలతోనూ సంబంధం లేకుండా కేవలం ‘అమెరికన్ లాగా వ్యవహరిస్తున్నాడన్న’ నేరం మాత్రం మోపబడ్డ అమెరికన్ పౌరుడి భద్రతకు ఏమీ ముప్పు లేదు.

సోవియట్ యూనివర్సిటీ లన్నిటిలో లాగే మాస్కో స్టేట్ యూనివర్సిటీలో కూడా ‘మొదటి విభాగం’ – రష్యన్‍లో పెర్వియ్ ఒట్ డెల్ – ఉండేది. ఇది KGB అనే సంక్షిప్త నామంతో ప్రసిద్ధమైన సోవియట్ గూఢచర్య సంస్థ యూనివర్సిటీలలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయం పేరు. గెల్ఫాండ్ అమెరికాకు వచ్చేసి రట్గర్స్‌లో ఆచార్యుడుగా ఉన్న రోజుల్లో నా ఎదుట నెమరు వేసుకున్న కథ. “నేనిది నువ్వు మాస్కోలో ఉన్న రోజుల్లో చెప్పలేకపోయాను. నీవక్కడ ఉన్నప్పుడు నన్ను చూడటానికి పెర్వియ్ ఒట్ డెల్ మనిషి ఒకరొచ్చారు. ‘మీదగ్గర నేథన్సన్ అనే ఒక అమెరికన్ విద్యార్థి ఉన్నాడు. అమెరికన్లు వాళ్ళకిష్టమొచ్చినట్టుగా ఉంటారని నాకు తెలుసు. అయినా నేథన్సన్ అమెరికన్లతో పోల్చినా మరీ విచ్చలవిడిగా ఉన్నాడు. అతన్ని మేము దేశం నుంచి పంపించేయాల్సి ఉంటుంది.’ ఇవి ఆ KGB అధికారి అన్న మాటలు.”

రాజకీయ చతురత పుష్కలంగా ఉన్న గెల్ఫాండ్, “దానికేం, మీరు అతన్ని పంపించేయటం మీకు తప్పని సరి అయితే పంపించేస్తారు. కానీ నాకు తెలిసినంత వరకూ నేథన్సన్‍ కి అమెరికాలో చాలా మంది స్నేహితులున్నారు. అతన్ని మీరు వెనక్కి పంపించేస్తే అంతర్జాతీయంగా పెద్ద రభస అవుతుంది. అతన్ని ఇప్పుడు పంపించేయటం కన్నా అతను తన ఈ సంవత్సరం గడువు పూర్తి చేసుకుని వెళ్ళి పోయింతర్వాత మళ్ళీ రానీయకుండా చేయడం మేలుగా ఉంటుంది” అన్నాడు. అలాగే జరిగింది.

నేను మరొక సంవత్సరం పాటు మాస్కోలో అతనితో గడపటం నా గణితశాస్త్ర విద్యాభివృద్ధికి మేలని గెల్ఫాండ్ భావించాడు. కానీ నేను మాస్కో స్టేట్ యునివర్సిటీకి మళ్ళీ వెళ్ళటమన్నది జరగని పని అని తేటతెల్లంగా తెలుస్తూనే ఉంది. అమెరికాకీ సోవియట్‍కీ మధ్య పరస్పరం సైంటిస్టులను అతిథులుగా పంపే రెండో ఒడంబడిక అటువైపు సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిధిలో ఉంది. గెల్ఫాండ్ నన్ను సోవియట్ అకాడమీకి దరఖాస్తు చేసుకోమన్నాడు. అలా చెబుతూనే ఈ సారి నేను రష్యాలో వేరొక విద్యాసంస్థకే రాగలను కాబట్టి, నేను చేరబోయే చోటు ‘సైఖ్లాఫ్ ఇన్‍స్టిట్యూట్’ మాత్రం కాకుండా చూసుకోమని హెచ్చరించాడు, ఆ గణితశాస్త్రాధ్యయన సంస్థ సోవియట్‍ కెల్లా యూదు ద్వేషానికి పరాకాష్ఠ అన్నాడు. సోవియట్‍లో ఉన్న ప్రథమశ్రేణి గణిత శాస్త్రవేత్తలైన పలువురు యూదు పండితులకు ఆశ్రయమై సమాచారాన్ని చేరవేయటంలో వచ్చే సమస్యలను గణితశాస్త్ర సమస్యలుగా అధ్యయనం చేసే ‘ఇన్‍స్టిట్యూట్ ఫర్ ప్రాబ్లమ్స్ ఇన్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ని నాకు రికమండ్ చేస్తూ నన్ను ఆ సంస్థకు అర్జీ పెట్టుకోమన్నాడు. 1977లో నేను అలాగే దరఖాస్తు చేశాను. వాళ్ళు అంగీకరించారు కూడా. అయితే చివరి క్షణాలలో సోవియట్ విదేశ వ్యవహారాల మంత్రాలయం నాకు వీసా ఇవ్వటానికి నిరాకరించింది. నేను వెళ్ళలేక పోయాను. నాకు సోవియట్ వీసా ఇవ్వకపోవడం – గెల్ఫాండ్ అప్పుడేదో మాటవరసకు అంటే – నిజంగా అంతర్జాతీయ వ్యవహారంగా తయారై, ‘న్యూయార్క్ టైమ్స్’ లో పడి వార్తా మాధ్యమాలు, సోవియట్ చర్యని అంతర్జాతీయంగా సైంటిస్ట్‌లను ఆదరించటంలో హెల్సింకి ఒప్పందాలను సోవియట్ అతిక్రమించినట్లు‍గా చిత్రించాయి.

కమ్యూనిజంలో ఉన్నప్పుడు అది సోవియట్ యూనియన్ కావచ్చు, తూర్పు ఐరోపా కూటమిలో ఉన్న దేశం కావచ్చు, అక్కడి మనుషుల అంతరంగాన్నీ బాహ్య జీవితాన్నీ ఒక వింత ఒత్తిడి విడతీసి వేరు చేసేస్తుంది. రష్యనులు ‘స్లోజ్న’ అని పిలుచుకునే ఈ స్థితి, ఈ విడతీత ‘క్లిష్టమైనది’. మాస్కోలో చదువుతో ముడిబడ్డ ఉద్యోగాలు కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలుండి పార్టీ అంగీకరించిన వారికే దక్కేవి. గణితశాస్త్రం చదువుకునేవాళ్ళకు – ఆమాటకొస్తే గణితశాస్త్రమే జీవితంగా గడిపేవాళ్ళకు – పెద్దగా ఆదాయం గానీ పోషణ గానీ ఉండేవి కావు. వాళ్ళు కేవలం గణితశాస్త్రం మీద ప్రేమతో, గణిత శాస్త్రాధ్యయనం ప్రసాదించే బుద్ధివికాసం కోసం, ఆత్మానందం కోసం, తప్ప పశ్చిమ దేశాలలో లాగా వృత్తిగా తీసుకుని అందులో పైపైకి పోదామని ఈ విద్యాభ్యాసానికి వచ్చినవారు కారు. ఐతే సోవియట్ వ్యవస్థ సమసిపోయిన తర్వాత రష్యన్ గణిత శాస్త్ర అధ్యయనం ఈ అమాయకత్వాన్ని, స్వచ్ఛతనీ కొంత వరకూ కోల్పోయి అమెరికా, ఐరోపాలోల్లాగా వృత్తి లక్షణాలను సంతరించుకుంది. అంతే కాదు, ఇప్పుడు ఇర్కుట్‍స్క్‌లో మాసం కొనుక్కోవచ్చు. ఏనాడూ సోవియట్ అనుభవించిన స్థాయిలో లేమిని మనం అనుభవించలేదు. ఇప్పటి రష్యన్ గణితశాస్త్ర వాతావరణాన్ని మనం నిందించకూడదు. కోల్డ్‌వార్ రోజుల్లో మాస్కోలో ఉన్న (ఒక) అమెరికన్‍కి అప్పటి రష్యన్ గణితశాస్త్ర జీవితంలో కనపడిన బుద్ధి తీక్ష్ణతా నాణ్యత పరమాద్భుతమైనది.

నాతో పరిచయమయేదాకా, భయమన్నది తెలీకుండా, జీవితాన్నొక హాయిగా తీసుకునే ధోరణి గల మనుషులుంటారని తను అనుకోలేదన్నాడు ఖజ్దన్ ఒకసారి నాతో. రష్యాలో ప్రతివాళ్ళూ సర్వకాల సర్వావస్థలలోనూ ఒక ప్రమాదం పొంచి ఉన్నదని, దానినుంచి తమను కాపాడుకోటానికి చేసే ప్రయత్నమే జీవించటంగా బతుకుతూ ఉండేవాళ్ళు. ఏమి మాట్లాడినా, కావాలని కాకపోయినా, లేదూ కావాలని అపకారం చేసే ఉద్దేశ్యంతో అయినా తాము అన్నదానికి వ్యాఖ్యానాలు జోడించి ‘పై వాళ్ళకు’ అందజేసే వాళ్ళున్నారని, పర్యవసానంగా తాము బడినుంచి వెళ్ళగొట్టబడవచ్చు, దేశ బహిష్కారం కాబడవచ్చు, జైల్లో వేయబడవచ్చు, చంపబడవచ్చు అన్న నిత్యభయంతో వేయికళ్ళతో తమను తము చూసుకుంటూ గడిపేవాళ్ళు. బతుకన్న తర్వాత ఎప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఎవర్ని నమ్మాలి? ఈ మనిషిని ఎంతవరకు నమ్మొచ్చు? ఎంత వరకూ మనసు విప్పి చెప్పుకోవచ్చు? ఈ వ్యక్తీ నామీద KGBకి ఫిర్యాదు చేయవచ్చా? నా గురించి తన స్వప్రయోజనాలకోసం అబద్ధాలు చెప్పొచ్చేమో? అమెరికన్లకు ఇటువంటి ఒత్తిడి తెలీదు. ‘పర్సిక్యూషన్’ పుట్టుకను బట్టి, మతవిశ్వాసాలను బట్టి, ఆలోచనా సరళిని బట్టీ శిక్షించటం, హింసించటం, అంతం చేయటం అన్నది ఒకటున్నదని తెలియకుండా, అటువంటి భయాలు లేకుండా పెరిగాం. మనదేశం భాగ్యవంతమైనది, మనం కాకపోయినా. ఇక్కడ వివక్షత లేని న్యాయ చింతన ఉన్నది. పాత రోజుల్లో, బాణామతి వంటి క్షుద్రారాధకుల్ని తరిమి కొట్టినట్టుగా కమ్యూనిస్ట్‌ల వెంటబడి వేటాడటమన్న మెకార్తీఇజం – చెడ్డదే కాని, అది సాగినది చాలా స్వల్పకాలం పాటు. అది చెలరేగినప్పుడు కూడా ఆ పాత తరం వాళ్ళు సోవియట్ ప్రజలు భయపడినంతగా భయపడింది లేదు.

గతించిన యు.ఎస్.ఎస్.ఆర్ గాంభీర్యం యెంత పెళుసుగా ఉండేదంటే ఆ పెళుసుదనాన్ని గురించి ఏమి చెప్పినా అతిశయోక్తి అవదు. ఒక అమెరికన్, మాస్కోకి వెళ్ళి – తన చదువు కోసం ఉన్న కొద్దికాలం లోనే – అక్కడ అమెరికన్ లాగానే సంచరిస్తూ, ఎవరికీ భయపడకుండా, లైబ్రరీల నుంచి శాస్త్రాప్రాచీనతని, పాతరోజుల పరిశోధకుల కృషి ఫలితాలనీ పదిలపరిచి ఉంచి అధ్యయనానికి తోడ్పడే చోట్లు యేవైతే ఉంటాయో వాటన్నిటి నుంచీ బయటికి తోసేస్తామనే బెదిరింపులకు వణికిపోకుండా ఒంటిచేత్తో సోవియట్ రాజకీయవ్యవస్థని ధ్వంసం చేయగలిగేవాడని చెప్పినా కూడా అత్యుక్తి కాదు. సోవియట్లు ఒక స్వతంత్ర దేశంలో స్వేచ్ఛా వాతావరణంలో బతుకుతున్నవాళ్ళ మనస్థితికీ నియంతృత్వ పాలన ఉన్న దేశంలో బతుకుతున్న ప్రజల మానసిక స్థితి గతులకూ మధ్య ఉన్న తేడాని గ్రహించగలిగారు. సోవియట్ అధికారులు తమ సామాన్య ప్రజాజీవనం నుంచి అమెరికన్లని దూరంగా ఉంచాలనుకోవటం సరియైన ఆలోచనే. మనం వాళ్ళ రాజ్య వ్యవస్థకు ముప్పు, సోవియట్లకు మనం ఒక ప్రమాదం.


గ్రంథసూచి:

  1. “On the maximum number of Gel’fand patterns of given weight” T Venkatarayudu1 and M Kondala Rao, Department of Applied Mathematics, Andhraa University, Visakhapatnam, India. Journal of Physics A: Mathematical and General, Volume 8, Number 8 (IOP-Citation T Venkatarayudu and M Kondala Rao 1975 J. Phys. A: Math. Gen. 8 1197).
    
   

4అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Venkateswararao VEMURI January 3, 2023 4:02 am

    వ్యాసం చివరిదాకా ఆసక్తికరంగా చదివించింది. నా విద్యార్థి దశలో Gelfond and Fomin రాసిన ఒక పుస్తకం పాఠ్యపుస్తకంగా ఉపయోగించినట్లు గుర్తు ఉంది. లేక, అది కేవలం వారి పరిశోధన పత్రమయినా అయి ఉండవచ్చు.

  2. 2
    ఎరికలపూడి వాసుదేవరావు January 3, 2023 9:30 am

    వేమూరి వారికి నమస్కారాలు. ఆంధ్ర విశ్వకళపరిషత్లో ‘వాచకాలు’ అంతర్జాతీయ స్థాయిలో ఉండేటట్టుగా చూచుకునేవారు. Gelfond and Fomin పుస్తకం కాల్కులస్ ఆఫ్ వేరియేషన్స్ మీద. ఈవ్యాసం ఈమాటలో రావటం సందర్భంగా అప్పుడే చెప్పవలసిన కృతజ్ఞతలు మాధవ్‍కి (శ్రీ మాధవ్ మాచవరం).

    ఎ వా రా

  3. 3
    Lyla yerneni January 17, 2023 1:37 pm

    I am so glad you write in this magazine, వాసుదేవరావు గారు! I thought I will share the following with you, mathematician. And other music lovers.

    Though I dislike ‘you tube’ (it pulls so much extraneous stuff, one can hardly listen to a piece of music decently and get out) I stuck to Michael Parloff’s lectures on Musical Histories of London, Paris, and St. Petersburg, on my T.V. He takes you on a centuries long journey -April 1509 thru August 1942. It is a big treat to get to hear about the Mighty Five, and subsequent Russian composers, (along with their troubles and tortures from wars, communist leaders,) and their compositions.

    Giving myself a flexible schedule, Later, on Medici TV, I listened to these composers, and others in Europe on and off. A Much better, closer, and private viewing experience. And I watched about 13 recommended operas of world fame, on Medici T.V. Repeated some of my selected choice. A self-imposed intensive study. No disturbances at all. All in all, it was a delightful musical 2022 for me.

    I am thinking ‘Oedipus Rex’ is a drama/opera which no other writer, can even come close, in creating. Sophocles had put ‘Fate’ at the top of any individual’s life history, and I have no argument. Do you?

    This is his Philosophical saying I am embracing for now. Hoping it serves me well in 2023.
    “I have no desire to suffer twice, in reality, and then in retrospect.” ― Sophocles, Oedipus Rex.

    -Lyla

  4. 4
    ఎరికలపూది వాసుదేవ రావు January 20, 2023 9:28 am

    Dr Yerneni

    Russians are culturally a classical society. Their mathematics, literature and music have a distinct rigour, depth and flavour. Thank you for sharing the admirably said philosophical saying .

    best regards
    ఎ వా రా

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • విశ్వనాథ సమాధానం
  • సముద్రమూ నేనూ కృష్ణశాస్త్రీ
  • రామచంద్ర పుత్ర! రామభద్ర!
  • మాస్కోలో ఒక అమెరికన్ మాథమటిషియన్
  • ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం

ఇటువంటివే…

  1. రెండు అమెరికన్ రుతాలు
  2. కొత్త పదకేళి
  3. కొన్ని నూతనచ్ఛందోరీతులు
  4. దేశిచ్ఛందస్సు కూడ గీర్వాణచ్ఛందస్సునుండి పుట్టినదియే!
  5. కొత్త పదకేళి

జులై 2022 సంచికలో ...

  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 9
  • ఉద్ధరేదాత్మనాత్మానం
  • ఊహల ఊట 14
  • ఎందాకని?
  • కలలు రాని నిద్ర
  • కాలరేఖ
  • కొన్ని నూతనచ్ఛందోరీతులు
  • గడినుడి – 69
  • జులై 2022
  • దేశిచ్ఛందస్సు కూడ గీర్వాణచ్ఛందస్సునుండి పుట్టినదియే!
  • నది ఒడ్డున
  • మాస్కోలో ఒక అమెరికన్ మాథమటిషియన్
  • మూడు కవితలు
  • మూడు కవితలు
  • యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో
  • రెండు తీరాలు
  • శిఖరారోహణ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 69
  • సముద్రమూ నేనూ కృష్ణశాస్త్రీ
  • సోల్జర్ చెప్పిన కథలు: మొదటి రోజు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

దేశిచ్ఛందస్సు కూడ గీర్వాణచ్ఛందస్సునుండి పుట్టినదియే!
ఎందాకని?

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.