[వ్యక్తిగతం: ఆంధ్రవిశ్వకళాపరిషత్‍లో అప్లయిడ్ మ్యాథమటిక్స్‌లో రెండు సంవత్సరాల ఎమ్.ఎస్‍సి. చదువుకోవటానికి బెజవాడ నుంచి విశాఖపట్నం -1968 జులైలో- వచ్చినప్పుడు హాస్టల్‍లో ఉండకుండా సముద్రపు ఒడ్డున విడిగా గది తీసుకుని ఎక్కువ కాలం సాయంకాలాలూ రాత్రులూ బీచ్ లోనే గడిపాను.]
ఓయి సాగర! నీవునేనొక్కటేను
గుండెలోతుల దాగిన ఘోషనెల్ల
పాడుచుందుము గొంతెత్తి పాటగట్టి
వినుటకొకరున్న లేకున్న వెఱ్ఱి కతన!
ఓసి కెఱటమ! నీవునేనొక్కటేను
ఎగసి పడియెదమిద్దరమెంతొ ఎత్తు
ఆకసమ్మును దాకగ నాస గలదు
శక్తి లే మెరిఁగియుననురక్తి విడదు! (1968)
ఒంటరిగా ఉండనీండి! ఒదిలిపెట్టి పోండి!
తళుకు తళుకుమని మెరిసే తారకలను తిలకిస్తూ
హడావుడిగ పరిగెత్తే మొయిళ్ళను వీక్షిస్తూ
ఉద్వేగపు శిలపై ఉత్సాహపు ఉలితో చెక్కిన
ఊహా మూర్తులకు ఊపిరి పోసుకుంటాను!
ఒంటరిగా ఉండనీండి! ఒదిలి పెట్టి పోండి!
ఉన్మాదోత్తుంగ తరంగ తాళ బద్ధమౌ
సాగర గళోద్భూత సంగీతం వింటూ
మానసోద్యానంలో పరవశాన విహరించే
పచ్చని భావవిహంగానికి పాట నేర్పుకుంటాను!
ఒంటరిగా ఉండనీండి! ఒదిలి పెట్టి పోండి!
అరుణ కిరణ మృదు స్పర్శా పులకిత సరసీరుహాల
శరత్జ్యోత్స్నా చుంబిత పంకజాల పరికిస్తూ
మదీయ హృదయ స్పందనా సరోవరంలో విరిసిన
కవితా కల్హారాలను కనుల కద్దుకుంటాను!
ఒంటరిగా ఉండనీండి! ఒదిలి పెట్టి పోండి! (1969)