కలలు ఇచ్చిన బలిమి

అనాయాసంగా పట్టుబడిన అక్షరాన్ని ఆవిడ రెండు తరాల పాఠకులకు దగ్గరగా తీసుకెళ్ళారు. తాను రాసినదానిలో ఎటువంటి పతనాన్నీ ప్రతిపాదించలేదు, సమర్థించలేదు.

ఇవి చాలు గుర్తుంచుకోవటానికి.

కానీ ఇంకా ఉంది. కొందరు అనేట్లుగా ‘చదివే అలవాటును పెంపొందించటం’ మాత్రమే కాదు, తానై నేర్పిన ఆలోచనలున్నాయి. వాటికొక గౌరవపు బరువు ఉంది. అది ‘పారిపోవటం’ కాదు, కుదుటపడటం. విరజాజుల తావీజులు కట్టటం మాత్రమే కాదు, అనుకూల పవనాలను ఆవాహన చేసుకోవటం కూడా.

తనకు తెలిసిన, తాను రాయగలిగిన అంశాలనే ఎంచుకోవటం ఒక లోపం కాదు. కొడవటిగంటి కుటుంబరావు అంతటి రచయిత తను చూసే లాంటి మనుషుల కథలే కదా రాశారు?

ఆ మీదట–ఆడవాళ్ళకి ‘ఆత్మగౌరవం’ అనేది ఒకటి ఉంటుందని విరివిగా చెప్పారు ఆవిడ. అందువల్ల వాళ్ళు ఇళ్ళూ వాకిళ్ళూ వదిలేసి వెళ్ళలేదనేది వేరే సంగతి.

ఆ కాలం వేరు. తగుమాత్రం చదువుకుని ఇంటిపట్టున నివసించే ఆడవాళ్ళు, ఇంకా కళాశాలలకి వెళ్ళి చదువుకునే అమ్మాయిలు, నెమ్మదితనం ఉండిన కొందరు మగవాళ్ళు–వీళ్ళందరికీ సరిపడా పని, మరింకాస్త ఎక్కువ తీరిక ఉంటూండే కాలం. మధ్యతరగతి జీవనంలో పెద్ద కుదుపులు లేని కాలం. రేడియో నింపని వేళల్లో హాయిగా చదువుకునే కాలం.

తెలుగు వచన సాహిత్యం చదువరులను సమీపించి అటూ ఇటూగా అప్పటికి పాతికేళ్ళు. మొదటితరం రచయితలకు ప్రాసంగికత కాస్త తగ్గుముఖం పడుతూ ఉంది. కొత్తగా రాస్తూన్న మగవాళ్ళ రచనలు ఆడవాళ్ళ మనసులకి కొంచెం అవతల ఆగుతూన్నప్పుడు–శూన్యమని కాదు గాని, మధ్యన జాగా వచ్చింది. వెళ్ళి అక్కడ స్త్రీలు కూర్చోవటం మొదలైంది. అందులో ఇద్దరు యువతుల కుర్చీలు ప్రత్యేకమైనవి: ఒకటి నల్ల విరుగుడు చేవది. నగిషీలు చెక్కిన నిగనిగ. కాలం గడిచేకొద్దీ బిగింపు సడలింది–ఊగిసలాట, అస్పష్టతలోకి. అయినా లోటేమీ లేదు, ఆ ఆసనం లతగారిది.

రెండోది మంచి పకడైన టేకు కుర్చీ. అందులోకి మెత్తటి దిళ్ళూ చుట్టూ రంగు రంగుల తోరణాల పూమాలల సొగసు–రాను రాను అది ఒక సింహాసనమైంది, యద్దనపూడి సులోచనారాణిగారికి. ఆ అరవైల నుంచీ ఇరవై అయిదేళ్ళపాటు ఆవిడ రాజ్ఞి.

అగ్రగణ్య అవటం ఆవిడను తోటి రచయిత్రులకు దూరం పెట్టింది. సాటి గానో పోటీ గానో రాసుకు వెళ్ళిన కోడూరి కౌసల్యాదేవిగారు తప్ప ఎవరూ ఆవిడకు కాస్తయినా దరిదాపుల్లోకి రాలేకపోయారు. తన కథలను సరాసరి సినిమాలుగా తీయటం ప్రారంభం కాకమునుపే కొన్ని సినిమాలకు కథా విభాగంలో పనిచేశారు ఆవిడ. ఆ ప్రయత్నంలో విజయాన్ని చూశారు కూడా. అనూహ్యమైన ప్రజాదరణ, దాన్ని పొందేవారిపట్ల చాలా ప్రశ్నలను సృష్టిస్తుంది. ‘మాకు అన్నీతెలుసు’ అనుకునే ఇవతలి వారికి ఇంకానూ. ఏతావతా ఏ రచయిత్రుల సమావేశంలోనూ సులోచనారాణిగారు కనిపించేవారు కారు. అసలావిడ ఎలా ఉంటారో ఏం మాట్లాడతారో ఏదీ బయటికి వచ్చేది కాదు. మొదటి రోజుల్లో ఏమో గాని, పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇచ్చినది బహుశా 1976, 77లలో. ముందు వనిత పత్రికకి, తర్వాత మహిళ పత్రికకి. ఆ రెండు పత్రికలూ ఆవిడ ఫోటోను ముఖచిత్రంగా వేయటం అప్పట్లో పెద్ద సంచలనం.

చిన్న పల్లెటూరులో పుట్టిపెరగటం వెలుపలి జీవనంతో ఆవిడకు ఎక్కువ పరిచయాన్ని ఇవ్వలేదు. పుస్తకాలే ఆవిడ లోకం. ఆ పల్లెపట్టు సౌందర్యాన్ని లోపలికి తీసుకోగలిగే భావుకత స్వతహా వచ్చింది. లోపలేదో స్రవంతి… సరళంగా సహజంగా పొంగుతూ బయటపడింది. కథలు రాయటం మొదలైంది. కొన్నాళ్ళ కిందట ఫేస్‌బుక్‌లో పంచుకున్న చిత్రనళినీయం మొదటి కథ. పూర్తిగా వాళ్ళ ఊరు కాజ లోనే జరుగుతుంది. కలం స్నేహితులై ఆ పైన ప్రేమికులైన ఇద్దరి గురించి. ఆవిడ స్వప్నాల పాదాలు నేల మీదే ఉన్నాయని చెప్పేందుకు ఈ ప్రస్తావన.

వివాహం తర్వాత చేరిన నగరాన్ని అతి సూక్ష్మంగా పరిశీలించి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఆ తర్వాతి కథలు బహుమతి, తొలిమలుపు వంటి అందమైనవి, పల్లెకీ నగరానికీ మధ్య నడుస్తాయి. అపురూపమైన కథ ఒకటి, అప్పటిది ‘ఐ లవ్ యు’ అటువంటి కొలమానాలకు లొంగదు. సులోచనారాణిగారి ఊహాశక్తికీ మార్దవానికీ అది ఉదాహరణ. ఇప్పటి చాలామంది ‘సీరియస్ రీడర్స్’ను ఆ కథతో లాక్కున్నారు–వాళ్ళు ఇంకా ఆవిడని వదల్లేదు.

రెండు మూడేళ్ళ కిందటి టీ.వీ. ఇంటర్‌వ్యూలో ఆవిడ తన హీరో హీరోయిన్‌లు ఎవరో చెప్పారు. వాళ్ళు రుక్మిణీ శ్రీకృష్ణులు. ఇష్టాన్ని చెప్పుకోగలవారూ సాధించుకొని సుఖాంతం చేసుకోగలవారూ–ఆవిడ మూలధార అక్కడి నుంచి. అప్పుడు చెప్పిన ఒక ముఖ్యమైన వాక్యం ‘నీకేం కావాలో నీకు తెలియాలి’.

వ్యాకులత్వానికి తాను ఎంత దూరమో కూడా అప్పుడే చెప్పారు. దేవదాసు గురించి నిర్మొహమాటంగా, ‘ఆ సౌకుమార్యం నచ్చుతుంది, ఆ విషాదాన్ని చెప్పిన తీరు కూడా. అయితే, నిన్నూ నిన్ను ప్రేమించిన అమ్మాయినీ రక్షించుకోలేని నువ్వెందుకు? తాగి చచ్చిపోతే ఎవరికిట?‘ అని.

ఈ లోపు మథనలూ నలగటాలూ ఉండవా? చాలానే ఉంటాయి.


సెక్రటరీ ఆవిడ రచనలు అన్నింటిలోకీ కాల్పనికత ఎక్కువ ఉన్న నవల. మరొకలా చూస్తే ఒకానొక సందిగ్ధత్వానికి ప్రతీక. రాసిన కాలానికి ఆ వాతావరణం మనకి కొత్త, నిజమే. ఇవాళైతే, ఈ కాలపు కమిట్‌మెంట్ ఫోబియా అందులో స్పష్టంగా కనిపిస్తుంది, చూడబుద్ధి అయితేనే.

రాజశేఖరాన్ని సృష్టించిన ఖ్యాతి/అపఖ్యాతిని తట్టుకోవటానికి ఆవిడ ఆ తర్వాత రెండు నవలలు రాశారు. మూగ ఇల్లాలు అన్నపూర్ణ కథ ఆరాధన, గుడ్డివాడైన వయొలిన్ పాటగాడి కథ బందీ. రెండూ బావుంటాయి. కాని సెక్రటరీ ముందు ఆగనే లేదు.

మీనా చాలా పరిణతమైన నవల, అప్పటికీ ఇప్పటికీ కూడా. ఆ మధ్యన ‘అ ఆ’గా దర్శనమిస్తే కుర్రాళ్ళు వెతుక్కుని మరీ చదివి పడిపోయిన నవల.

1990ల తర్వాత చెలరేగిన ధోరణిని 60ల చివరలో రచయిత్రి పసిగట్టటం గొప్ప విషయం. పిల్లలేదో సాధించేయాలనే ఆరాటాలకి జవాబులు ఇచ్చారు ఆవిడ. సంగీతమూ నాట్యమూ ఏవీ మీనాకి అబ్బవు, చదువులోనూ చురుకైనది కాదు. మీనా తండ్రి అంటాడు, ‘మీనా మంచి ఇల్లాలుగా తప్ప ఇంకెందుకూ పనికిరాదు,’ అని. ధైర్యంగల మాట. ఏమీ కానక్కర్లేదు, తనకి తానుగా ఉంటే చాలు అనుకోగలగటం ఎంత అవసరం… ఎంత కష్టం!

ఇంత పెద్ద నవలలోనూ మీనా రూపం గురించి రచయిత్రి ఏమీ చెప్పరు. ఇంకా చాలా నవలలలో కూడా నాయిక సౌందర్యప్రశంస ఉండదు. ‘ఒక సజీవమైన భావం’ (జీవనతరంగాలులో రోజా కళ్ళలో) వంటి వర్ణనలే ఆవిడ ఎక్కువగా చేస్తారు. కృష్ణకి నిశ్చయం అయిన భార్యని చూసి మీనా అనుకుంటుంది, ‘సుందరి అనాకారిగా కాకుండా మా అందరిలానే ఉండటం నాకు ఆశాభంగాన్ని కలిగించింది.’ అని. ఈ మాట ఏ విమర్శకులైనా పట్టించుకున్నారా?

చాలా వివాదాస్పదమైన విషయాలు రెండు. ఒకటి విజేతలో తన మీద అత్యాచారం చేసినవాడికి ఆఖరున భార్య కావటం. రెండోది జీవన తరంగాలులో తనను మత్తుమందు ఇచ్చి పెళ్ళి చేసుకున్న అతనితో నాయిక రాజీపడి కలిసిపోవటం. విజేతలో ఆ సంఘటన జరిగే ముందర అతనికి దారుణమైన ఒత్తిడి, ఆ వెంటనే ఆత్మహత్య చేసుకోబోవటం, ఒక్క క్షణపు బ్రతుకుతీపి అడ్డుపడటం, ఆ లోపు రైలు కదిలి వెళ్ళిపోవటం–ఇదంతా ఉంటుంది. ఆ తర్వాతా ఆమె మనసును గెలవాలని అతని ఉద్దేశం కాదు, అదొక ప్రాయశ్చిత్తంగా మాత్రమే చేస్తాడు. జీవన తరంగాలులో నాయకుడు ఉదాత్తుడు కాదు, పొరబాటు చేసిన మనిషి. క్రమేపీ అది తెలిసివచ్చిన మనిషి. ఆ అఘాయిత్యానికి మించి అతనిలో మరింకేవో విలువలు కనిపించటం ఆమెను ఒప్పిస్తుంది–అంత సులువుగా అయితే కాదు.

కానీ ఫిర్యాదులు, వీటి మీద. ఈ సుఖాంతాల మీద.

రెండు ప్రసిద్ధ తమిళ రచనలను గుర్తుచేసుకోవచ్చు: జయకాంతన్‌ కొన్ని సమయాలలో కొందరు మనుషులు. అనూరాధా రమణన్‌ సిరై (చెర). రెండూ సినిమాలుగా వచ్చాయి. రెండోది తెలుగులో కూడా వచ్చింది. రెంటి ఇతివృత్తమూ దాదాపు ఒకటే. అత్యాచారం చేసిన మనిషితో స్నేహం చేయటం, ప్రేమించటం మొదటిదాంట్లో, అతని పంచన చేరటం రెండోదానిలో. ఆ గంగా భాగీరథీ ఆఖరికి సుఖపడకపోవటం వల్ల రెండు రచనలూ సీరియస్ సాహిత్యం అనిపించుకున్నాయి. వాటికి నేను తక్కువ ఖరీదు కట్టటం లేదు, కాని, సంధ్యకీ రోజాకీ సంతోషం దొరకటం పట్ల మనకెందుకు అభ్యంతరం?

సులోచనారాణిగారిలో, ప్రత్యేకించి గమనించవలసిన ఒక విషయం–ఆవిడ కాలంతోబాటూ అప్‌డేట్ అవుతూ రావటం.

1970లలో వచ్చిన ప్రేమలేఖలు ఇందుకు మంచి ఉదాహరణ. బయటికి వెళ్ళి కాలేజ్‌లో చదువుకునే అమ్మాయి ఒకరిని ప్రేమిస్తుంది. పెళ్ళి అవబోతూండగా అతను సరైనవాడు కాదని తెలిసి వెళ్ళిపోతుంది. మరొకరిని పెళ్ళిచేసుకున్నాక ఆ ప్రేమలేఖల బ్లాక్‌మెయిల్ మొదలౌతుంది. ఆ కాలపు సమాజం అమ్మాయిల పట్ల అంత నిర్దాక్షిణ్యంగానే ఉండేది. అదంతా అప్పటికి యాంటీ సెంటిమెంట్. కాని నవలగానూ సినిమాగానూ కూడా విజయవంతమైంది. ఎందుకని? చెప్పే నేర్పు. ఒప్పించే మెలకువ.

70ల మధ్యలో వచ్చిన కీర్తికిరీటాలు చాలామందికి ఆవిడ మాగ్నమ్ ఓపస్. నిజంగానే గొప్ప నవల. తానెప్పుడూ చెప్పేదే ఇక్కడా: బయటివాళ్ళ చప్పట్లకన్నా తన లోపలి శాంతి గొప్పదని. అప్పటివే ఇంకొక రెండు విభిన్నమైనవి: స్నేహమయి, సంసార రథం. మొదటిదాంట్లో నాయకుడు ముగ్గురు ఆడపిల్లల తండ్రి. రెండవదాంట్లో వివాహితుడైన మధ్యవయస్కుడు.

అప్పట్లోనే రాసిన మరొక నవల పార్థు. తల్లి అక్రమసంబంధం వల్ల కొడుకు పడిన వేదన ఇతివృత్తం. ఆ తల్లినీ చెడ్డదనో మరొకటనో చెప్పరు. మంచి నిర్వహణ. ఆ కాలానిదే, మరొక చక్కని నవల ఈ తరం కథ. ప్రేమించి పెళ్ళిచేసుకున్న భార్యాభర్తలు, జీవితపు ఆధునికీకరణ వాళ్ళ మధ్యన తెరలు దించటం–చాలా నైపుణ్యం ఉంటుంది ఇందులో.

రాధాకృష్ణలో నాయిక, తప్పనిసరై మరొకరిని వివాహమాడి, ఆ పెళ్ళిని విజయవంతం చేసుకోవటానికి శాయశక్తులా శ్రమిస్తుంది. చాలా యాతన తర్వాత వితంతువు అవుతుంది. నవల చివరలో నాయకుడిని కలుసుకోగలుగుతుంది. ఈ కథాంశం కూడా అప్పటికి అధునాతనమైనదే.

70ల చివరలలో, 80ల మొదళ్ళలో వచ్చిన నాలుగు నవలలు గమనించదగినవి.

అభిశాపం: సాదా సీదా మధ్యతరగతి అమ్మాయి గాయత్రిని పెళ్ళాడి ఆమెని అక్షరాలా విమానాలకి ఎత్తుతాడు భర్త ఆనంద్… ఆ ప్రక్రియలో ఆమెకి అలవాటూ, అక్కరా లేని అనుభవాలు–ఆనందమే, కాని… అతని మరణవార్త తర్వాత ఆమెని పెళ్ళిచేసుకున్న అతని పేరు ప్రశాంత్. ఆ జీవితమూ అటువంటిదే! పాత్రల స్వభావాలు ఎంతో కొంత ధ్వనించేలా (అవును, ‘ధ్వని’) పేర్లు పెట్టటం ఆవిడకు అలవాటు. ఆడవాళ్ళకి రెండో పెళ్ళి ఇంకా అందరూ ఒప్పుకోని కాలం, దానికి తోడు వచ్చిపడిన విచిత్రపు సమస్య.

జాహ్నవి: ఈ నవలాకాలానికి పూర్తిగా వికసించిన, సర్వస్వతంత్రురాలైన స్త్రీని ఆవిడ దర్శించగలిగారు. ఇరవై ఐదేళ్ళ జాహ్నవి న్యూరాలజిస్ట్. ఈ నవల ఒకలాంటి థ్రిల్లర్. ఇద్దరు గే అబ్బాయిల వృత్తాంతం ఇందులో ఒక భాగం. లేదు, అస్సలు తీర్పు చెప్పరు వాళ్ళ గురించి. 1980-81లో వచ్చింది ఇది, తెలుసా?

నీరాజనం: ప్రముఖ సినిమానటి వాణిశ్రీ సులోచనారాణిగారికి దగ్గరి మిత్రులు. ఆ స్నేహం చాలా ఏళ్ళ కిందటే ఏర్పడింది. వాణిశ్రీగారు పైకి వస్తున్న కొత్తలో, ‘తీరిక వేళల్లో మీరేం చేస్తుంటారు?’ అని అడిగితే, ‘నా అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణిగారి నవలలు చదువుతుంటాను!’ అని బదులిచ్చారట. రచయిత్రి చాలా సంతోషించారు: ‘నేనూ కొత్తగా రాస్తున్న రోజులు. అటువంటప్పుడు ఎవరైనా, పేరున్న వాళ్ళ పేర్లే చెబుతారు.‘ వాణిశ్రీగారి వివాహం తర్వాత, ఆవిడ జీవితం ఆధారంగా, కష్టపడి నటిగా ఎదిగిన ఒక ఆకర్షణీయమైన అమ్మాయి కథగా రచించినది నీరాజనం. ఆమె చిన్నతనపు కష్టాలూ ఉచ్చదశలో సొంతవాళ్ళ మోసాలూ అన్నీ కథలోకి వచ్చాయి, యథాతథంగా కాకపోయినా.

సహజీవనం: స్వాతంత్ర్యం అనుకునేది భార్యాభర్తల మధ్య ఎలా అడ్డం రాకూడదో, కొలిచినట్లుగా అన్ని విషయాలలోనూ ఇద్దరికీ సమానత్వం ఎలా ఉండదో, స్త్రీ పురుషులు ఒకరినుంచి ఒకరు ఎలా వేరో–అందులో. హితవు. ఆ రోజుల నేపథ్యంలో.

ఈదేశం మాకేమిచ్చింది? గాఢమైన నవల. నిజాయితీ ధీరత్వమూ రెండూ ఉన్న పోలీస్ ఆఫీసర్ గురించి. జైజవాన్, అభిశాపం, మరింకొన్ని కథలు మిలటరీ నేపథ్యంలో నడుస్తాయి. చైనా, పాకిస్థాన్ యుద్ధాల ప్రస్తావన ఉంటుంది. దేశభక్తితో సహా చాలా లక్షణాలలో ఆవిడ సత్యకాలపు మనిషి.

అంతకు ముందే వచ్చిన రాజభవనపు నవల అగ్నిపూలు, ఆ తర్వాతి ప్రియసఖి, జీవనసౌరభం, మరొక రచయితతో కలిసి రాసిన ప్రేమ, బాగా వచ్చిన నవలలు. ఆ తర్వాతి నవలలది వేరే విభాగం. వాటిలో ఆవిడ చాలా తలుపులు తెరిచారు. ఆగమనంతో మొదలై వాటిలో కొన్ని టీవీ సీరియల్స్‌కు ఆసక్తికరంగా ఒదిగాయి.


సులోచనారాణి గడిచిన కొన్ని సంవత్సరాల నుంచీ హైదరాబాద్ సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటూవచ్చారు. తనంటే ఇష్టమైన రచయిత్రులందరితో సంతోషంగా ఫోటోలు దిగారు. రెండుమూడేళ్ళ నుంచీ ఫేస్‌బుక్‌లో కనిపించి అభిమానులకు కథలూ కబుర్లూ చెప్పటం ఒక గొప్ప అనుభవం. జీవించి ఉన్నంతవరకూ ఎక్కడా ఆగలేదు, ప్రవహిస్తూనే ఉన్నారు.

వివాదానికి దూరంగా, సంయమనంతో ఉండటమెలాగో కూడా ఇప్పటి సాహిత్యకారులు ఆవిడ నుంచి నేర్చుకోవలసి ఉంది. తన రచనలని మారుపేరుతో మరొక భాషలోకి బదిలీచేసిన రచయిత గురించి ఎంత హుందాగా స్పందించారో, ఆ మధ్య తన కథను పేరు లేకుండా సినిమా తీసేస్తే ఏమీ అనకుండా ఎలా ఉండగలిగారో తెలుసుకోవాలి. రెండు సందర్భాలలోనూ ఆ తర్వాత (కొంత)న్యాయం జరిగింది. అంతకన్నా ఎక్కువగా ఆవిడ మర్యాద నిలబడింది. అవతలి మనిషి తన నవలల గురించి తనకన్నా ఎక్కువ తెలిసినట్లు తీర్మానించేస్తున్నా నవ్వుతూ ఓర్పుగా కూర్చుండిపోగలరు.

ఒక మేధావి ఆమెను ‘మా వంటివారికోసం రాయవేమమ్మా?’ అని అడిగినప్పుడు (ఆమె చదువూ విజ్ఞతా తెలిసిన మనిషి అయివుండాలి ఆయన. ఎందుకంటే, వాటిని ఆమె ఎన్నడూ ‘ప్రదర్శించిన’వారు కారు. ఆస్కార్ వైల్డ్ ఇష్టమని ఎప్పుడో అనటం గుర్తు.) ‘మీరు మీకు కావలసినవి ఎక్కడైనా వెతుక్కుని చదువుకోగలరు, నేను నా పాఠకుల కోసం రాస్తాను, వాళ్ళు నా వాళ్ళు’ అని చెప్పారట.

అన్నిటినీ పుష్కలంగా పొందాను, ముఖ్యంగా పాఠకుల అభిమానాన్ని. చాలు ఇంక. వెళ్ళవలిస్తే హాయిగా వెళ్ళొస్తాను.

పువ్వు రాలినట్లు నాజూకుగా సునాయాసంగా నిష్క్రమించారు.


‘నీదు మార్గాన నీ అంత నేత లేడు’ అని, కవి సమ్రాట్టును అన్నారు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి. అంతకన్నా ఏమన్నా ఇంకెవరెవరికో కోపమొస్తుంది కనుక. సులోచనారాణిగారి గురించీ అలా అనటం ఉంది, ముఖ్యంగా ఆవిడ స్వర్గస్థులైనాక.

ఎవరి మార్గం వారిదే.

అన్ని మార్గాలూ ఒకటి కావు. కానక్కర్లేదు.

అన్ని మార్గాలనూ ఒక్కరే ఆపోశన పట్టనూ లేరు.