కలలు కోతకొచ్చాయి

ఉచ్చస్థితికి తీసుకు వెళతారని ఊహించుకుంటే
ఉచ్ఛిష్టమే ఉపశమనమయ్యింది

కుక్కతోకతో గోదారి ఈదాలని
నడుము లోతుకు వెళ్ళి, కోరలు చూసాక తెలిసింది
అది గుంటనక్కకు గురువని,

వశీకరణ విద్యలు వట్టివనే
అమాయకులు కూడా,
వ్యాఘ్రం మనిషిలోకి
పరకాయప్రవేశం చేసాక తెలుసుకున్నారు పాపం
మహిమలు ఎప్పుడూ జరుగుతాయని,

అడవిమృగాలు వూళ్ళో కొచ్చాయి,
వలలూ, బోనులూ, కాగడాలూ, డప్పులూ
ఏమీ చెయ్యలేవని,
వాటి పైకి చెయ్యి లేవదని, చేవ చచ్చిందనీ,

నల్లమందు గింజలు
నలుదిక్కులా నాటారు, నెర్రెలు విచ్చుకున్న నేల,
నమ్మలేనంత కాపు కాసింది

గాలి కూడా గబ్బు కొడుతోంది
గంధాన్నేమో దొంగలించారు
నీకు ఇల్లు కడతానన్నారు
స్థలం చదును చేసారు
ఇనుము, ఇటుక తెచ్చారు,
పనంటూ మొదలు పెట్టారు
పాతనంతా పైకి తవ్వారు

నువ్వేమో,
వారసత్వంగా వచ్చిన
అమాయకత్వంతో
నీ ఇంటికి పునాదులేమో అనుకున్నావ్

వర్ఝం దాటాక గ్రహించావ్
నీ పక్కవాళ్ళకు సమాధులని

మందుల్లేకపొతే
మాయరోగాలతో
అర్ధాయుష్కులమవుదాం గానీ
నల్లమందు మాత్రం నీకూ, నాకూ వద్దు

తాటిచెట్టు నీడా, తాళిబొట్టు తాకట్టూ,
తాగుబోతు వాగుడూ, తప్పొప్పుల పట్టీ,
మనకేమీ కొత్త కాదు, మంచినీళ్ళ ప్రాయం

అందరూ అన్నదమ్ములు, అమ్మ కన్న బిడ్డలే
అన్నీ మంచి రోజులే అనే కమ్మని కలలు కోత కొచ్చాయి
కోసి అవతల పారెయ్యండి,
కొట్టుకు పోతాయి కొండగాలికి.


దేవరపల్లి రాజేంద్ర కుమార్‌

రచయిత దేవరపల్లి రాజేంద్ర కుమార్‌ గురించి: పుట్టింది గుంటూరు జిల్లా నిడుబ్రోలు - పొన్నూరు లో , పాఠశాల విద్యాభ్యాసం అక్కడి జిల్లా పరిషత్ హైస్కూలులో , అంధ్రా క్రిష్టియన్ ‌ కాలేజీలో ఇంటర్మీడియట్ , డిగ్రీ , ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం . ఏ., ఫిలాసఫి, మాష్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ ‌ , ఈనాడు జర్నలిజంస్కూలులో డిప్లొమ , ఈనాడు దినపత్రికలో హైదరాబాద్ లో కొంతకాలం రిపోర్టరు ఉద్యొగం , మధ్యలో ఆగిపోయిన పి. హెచ్ . డి.
1992 నుండి రచనలు, ఆంధ్రజ్యోతి , ఆంధ్రభూమి , మిసిమి , తదితర పత్రికల్లో ప్రచురణ , ప్రస్తుతం ఒక ఆంగ్లదినపత్రికలో (విశాఖపట్నం) రిపోర్టరు ఉద్యోగం, పూర్తి కాలపు రచయితగా , పర్యావరణ కార్యకర్తగా మారాలని కోరిక. ప్రస్తుతం మూడు బ్లాగులను నిర్వహిస్తున్నారు. ...