డబ్బు సంపాదించకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ రాదంటుంది మాలతీచందూర్ నవల్లోని నాయిక ఒకతె. ఇంటి శుభ్రత గురించీ ఆడపిల్లల చదువు ఆవశ్యకత గురించీ రంగనాయకమ్మ తనదైన సూటిగొంతుకతో చదువుకున్న కమల నవల్లోనూ మిగతావాటిలోనూ మాట్లాడుతుంది. రాబడితో నిమిత్తం లేకుండా ఆహారానికీ అలవాట్లకీ సంబంధించిన మంచి విషయాలను, ఉన్నంతలో ఇంటినీ జీవితాన్నీ ఉత్సాహభరితంగానూ ఆరోగ్యవంతంగానూ నిలుపుకునే మార్గాలను చర్చించారు ఒకతరం స్త్రీవాద రచయిత్రులందరూ. ఒక ఆరోగ్యవంతమైన సమాజానికి ఆరోగ్యవంతమైన మనుషులూ మనసులూ ఆలోచనలూ కుటుంబాలూ కావాలని వాళ్ళు గుర్తుపట్టారు. జీవితానికింకాస్త అదనపు సౌందర్యాన్ని అద్దుతూ బుర్రలని ఖాళీగా ఉండనీయని పనులను బాహాటంగా సమర్ధించారు. స్త్రీల జీవితాల పట్ల అసలైన అక్కర కనపరిచి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఉద్యోగాలకు వెళ్ళేలా ఉత్సాహపరిచి కుటుంబంలో వాళ్ళ పాత్రను గుర్తెరిగి నడుచుకునే వివేచన పంచారు. ఎక్స్ప్లాయిటేషన్ జరిగే సందర్భాలను దాటే మార్గాలను చర్చించారు, తద్వారా ఎందరికో దన్నుగా నిలబడ్డారు. ఆడువారికి ఆత్మగౌరవాన్ని స్వావలంబననూ మించిన అలంకారాలు లేవని పునరుద్ఘాటించారు. ఆ ప్రయత్నంలో సమాజంతో మాటలూ పడ్డారు. ఎవరేమన్నా ఓ తరానికి ఆ సాహిత్యం చేసిన మేలు కొలవలేనిది. నిజానికి ఆ తరాన్ని ముందుకు నడిపించిన సాహిత్యమది. ఇప్పటి సమాజం మారింది. ఆ కనీస చదువు ఉద్యోగాలు చాలామంది సంపాదించుకునే స్థితికి వచ్చారు. ప్రపంచం వేగవంతమయింది. ఎందరో ఆడపిల్లలు పైచదువులు చదువుకుంటున్నారు. మగపిల్లలతో సమానంగా ఇష్టపడ్డ ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఆత్మగౌరవాన్ని, నిర్బరతనూ చాటుకుంటున్నారు. కాని, ఈ కొత్తప్రపంచం కూడా పూలబాట కాదు. జీవితపు పగ్గాలు ఎవరి చేతుల్లో వాళ్ళకి ఉన్నట్టే ఉన్నా వివక్ష అన్నిరకాలుగా ఇంకా వేళ్ళూనుకునే ఉంది. స్త్రీకి భద్రత ఇంకా కరువయ్యే ఉంది. ఒకప్పటికన్నా ఇప్పుడు స్త్రీలు ఎదుర్కుంటున్న సమస్యలు మరింత లోతైనవి వ్యక్తిగతమైనవిగా మారాయి. శారీరక శ్రమలను సామాజిక ఆంక్షలను మించి వాళ్ళ మానసిక ఆవరణలను కుదిపేస్తూ ఎన్నో కొత్త సమస్యలు వచ్చి చేరుతున్నాయి. కొన్ని పాత సమస్యలే కొత్తముఖాలతో ఎదురవుతున్నాయి. కొంత ప్రగతి సాధించినా ఇంకా వివక్షను, పురుషాధిక్యతనూ ఎదుర్కొంటూనే ఉన్నారు. నిస్సహాయత వల్లో, నిర్బంధం వల్లో తమ శారీరక మానసిక అవసరాలను నిర్లక్ష్యం చేసుకుంటూనే ఉన్నారు. కోరి ఎంచుకుని ప్రయాణిస్తున్న మార్గాల్లో ఎదురవుతున్న ఒత్తిడిని ప్రస్తావించడమూ చర్చించడమూ తిరిగి తమను వెనక్కి లాగుతాయన్న భయం వల్లో, ఆ చర్చలను తమ ఓటమికి చిహ్నంగా ముద్ర వేస్తారన్న ఆలోచనలో నుండి కలిగిన నిస్పృహ వల్లో ఎప్పటిలాగే మౌనాన్ని ఆశ్రయిస్తున్నవారే అత్యధికులు. తమ సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా తమజీవితాలలో ఆనందాన్ని నింపుకోగలగాలి అన్నది చాలామంది స్త్రీలకు ఈనాటికీ తెలియదు. అది తమ జన్మహక్కని కనీసం ఊహకూ రాని వారు చుట్టూ కోకొల్లలుగా కనపడుతూనే ఉన్నారు. గ్రామీణ, పట్టణ, నాగరిక సమాజాల స్త్రీల సమస్యలు పైకి వేరువేరుగా కనిపిస్తున్నా వాటి మూలాలు ఒకటే. ఆ సమస్యల అసలు రంగు ఒకటే. సాహిత్యపు ఆలంబన సమాజానికి ఇలాంటి సంధికాలాల్లోనే మరింత అవసరం. అయితే, ఒకప్పటిలా ఇప్పటి స్త్రీవాద రచయిత్రులెవరూ ఈ సమస్యలను తమ సాహిత్యం ద్వారా చర్చిస్తున్న దాఖలాలు ఎక్కువగా లేవు. ఆవేశంతో ఏదో నాటకీయమైన ముగింపో పరిష్కారమో చూపించే కాల్పనికసాహిత్యం పెదవి విరిచి పక్కకు పారేసేది మాత్రమే అవుతుంది. అలా కాక, నిజజీవితానికి దగ్గరగా ఉండి, ఒక ఆలోచనను, ఆచరణయోగ్యమైన పరిష్కారాన్ని సూచించేది, లేదూ కనీసం సమస్యను కూలంకషంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది, అది కూడా కాదంటే హీనపక్షం మీమీ జీవితాల్లో ఇటువంటి సమస్యొకటి ఉందీ అని హెచ్చరించే సాహిత్యం అర్థవంతమవుతుంది. అట్లా ఈకాలపు స్త్రీ అవసరాలను, ఇబ్బందులనూ లోతుగా గమనించి అర్థం చేసుకొని వివేచనాత్మకమైన సాహిత్యాన్ని సృజిస్తోన్న స్త్రీవాద రచయితలు ఇప్పుడు మనకున్నారా? ఈనాడు తెలుగునాట అలాంటి స్త్రీవాద సాహిత్యం అసలు ఉన్నదా?