కళకాలమ్: 2. ఉద్యమిద్దామా, నిద్రపోదామా?


లేపాక్షి చిత్రకళ

చెవుల్ని చితకకొట్టే సినీ సంగీతం ఓ పక్కన హోరెత్తుతున్నా ఎందరో చిన్నారులు అపురూపంగా సంప్రదాయ సంగీతం మనం చెవులు అప్పగించి వినేలా పాడటం ఎలా జరుగుతోందీ? కొన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల సాంస్కృతిక విభాగాల అధికారులు, డబ్బూ అభిరుచీ గల ఇతర పెద్దలూ కల్పించుకుని కచేరీలు ఏర్పాటు చేయటం వలన; ఆపై నెట్‌లో అద్భుతంగా యూట్యూబ్ వంటివి అందుబాటులో వుండటంవలనా… ఇలా సుస్వర సంగీతం- అది కర్నాటక సంగీతం కావచ్చు, హిందుస్తానీ కావచ్చు- సంగీతం చూస్తూ వినే అలవాటుకి గొప్ప అవకాశాలు ఏర్పడ్డాయి గదా! నాటకమైనా, నాట్యమైనా, చిత్రకళయినా అన్నిటికీ ఎంతో కొంత ముచ్చట తీర్చే మార్గాలున్నాయి. ఈ మార్గాలు మరింత పెరిగిన కొద్దీ జనాలకు చెవిపెట్టి సంగీతం వినే అలవాటు పెరుగుతుంది కదా… ఇదే స్థితి మన ప్రాంతీయ, ప్రాచీన చిత్ర శిల్ప కళల దగ్గరికొచ్చేసరికి కథ మారింది. సంగీతం, నాట్యం, కొద్దో గొప్పో నాటకం ప్రజలకు పరిచయం అయినంతగా చిత్ర శిల్పకళలు పరిచయం అయినట్టు లేదు. పరిశీలించి చూస్తే అవేవో మనుషులతో సంబంధం లేనట్టు మ్యూజియంలకో, కళా కోవిదుల గృహాంతర్భాగాలకో అంటిపెట్టుకున్నట్టు అనిపించక మానదు.


ఖజురాహో శిల్పకళ

మరి మన మహనీయ చిత్ర శిల్ప కళాఖండాలు రెండవ ఎక్కం అప్పగించినంత సులువుగా ప్రజల కళ్ళకి కట్టడం అసాధ్యమా? కానేకాదు. సుసాధ్యం చేయాలని కొంత గట్టి ప్రయత్నం చేస్తే జనానికి కళ అన్నది అలవాటుగా, వీలయితే వ్యసనం లాగానూ మారవచ్చు. ప్రజాస్వామ్యంతోబాటు సాంస్కృతిక కళా రంగాల విశేషాలూ జనం కళ్ళలో నోళ్ళలో నిత్యం ఉండాలంటే, శ్రోతలు, పాఠకులు, సందర్శకులు, ప్రేక్షకులు, భక్తులూ అయిన మనం, కొంత దురభిమానం, చౌకబారు ఆనందం అనే ‘ఎంటర్‌టైన్‌మెంట్’ను కొంచం త్యాగం చేసే ప్రయత్నం చేసుకోవాల్సిందే. ఇటునుంచి మనవంతు తిప్పలు మనం పడితే అటునుంచి ప్రభుత్వ సహకారం ఆశించవచ్చు. ప్రభుత్వం కదలివస్తే ప్రైవేటు సంస్థలూ వ్యక్తులూ అధికారులూ కలగలిసి వస్తారు. ఇది జరిగే వరకు మన ప్రాంత చిత్రకళ, శిల్పకళ జనాలకు ఆమడ దూరంలోనే ఉంటాయి. నేనంటున్నది పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ఎక్కువమంది సంగతి.


కలంకారీ చిత్రకళ

ప్రజలకు చిత్ర శిల్ప కళాఖండాలు చూడ్డం ఎలా అలవాటవ్వాలి? గోడల మీద, పత్రికల్లో, బ్యానర్ల మీద, వాడే వస్తువుల మీద సినీ పోర్నో బొమ్మల్ని అలవాటు చేస్తున్నట్టే ప్రభుత్వ ప్రకటనలు, హెచ్చరికలు హోర్డింగుల మీద, గోడల మీద, వాహనాల మీద వట్టినే ప్రదర్శించే బదులు వీటన్నిటి పక్కన వీలయినంత చోటు చూసి, ఆ ఎత్తున అందరికీ కనిపించేట్టుగా మన ప్రాచీన, సంప్రదాయ చిత్ర శిల్ప కళాఖండాలను అచ్చు వేయవచ్చు, ప్రదర్శించవచ్చు. పన్నులు కట్టమన్న ప్రకటనో, ప్రభుత్వ ఆసుపత్రి వివరాల సమాచార పత్రమో చిన్న కాయితం మొదలు అతి పేద్ద హోర్డింగు వరకూ ఏదో ఒక కళాఖండాన్ని ఆయా విషయానికి సంబంధించినది వెదికి అచ్చుపోసి ప్రచారానికి ప్రభుత్వమే పూనుకోవాలి. ప్రభుత్వం- అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు- అకాడమీలు, సాంస్కృతిక శాఖ, టూరిజంవారు, విశ్వవిద్యాలయాలు, టెక్నికల్, నాన్‌ టెక్నికల్ విభాగాలవారు, కార్పొరేషన్‌లు అన్నీ పంతానికి పోయినట్టు మన ప్రసిద్ధ శిల్పాల్ని చిత్రాల్ని విధిగా వారి ప్రచార భాగాల్లో ప్రధానంగా చోటివ్వాలి. సకల ప్రభుత్వ విభాగాల డైరీలు, పెద్ద కాలెండర్లు, చిన్న టేబుల్ కాలెండర్లు, కరదీపికలు మన చిత్ర శిల్ప కళాఖండాల్ని ఏర్చి కూర్చి అచ్చువేయాలి. చేతి రుమాలు, తుండుగుడ్డ, లుంగీ, దుప్పటి, బనియన్, కండువా, కర్టెన్- ఏదయితేనేం- ప్రతి వస్త్రం మీదా తగిన పద్ధతిలో మన శిల్పం, చిత్రం అచ్చుపోయాలి. కలంకారీ డిజైన్ నుంచి కొండపల్లి బొమ్మ, నకాషీ కళాఖండం వరకు- ఏదైతే అది అచ్చయి సదా జనం కళ్ళకు అలవాటవ్వాల్సిందే. మొనాలిసా, చేగువేరా ఎవరో తెలీని ఎందరెందరో బనియన్‌ల మీద అచ్చువేసినవి ధరిస్తున్నారు గదా! ఆపాటి పనిగా మన వస్త్రాలమీద మన చిత్ర శిల్పాలు అచ్చుపోస్తే ఫ్యాషన్‌కు లోటవుతుందా? ఇటీవల రవివర్మ చిత్రాలు, కలంకారీ డిజైన్లూ ఖరీదయిన చీరల మీద అచ్చయి రావటంలేదూ?! అలాగే అన్నిటా!


నకాషీ (చేర్యాల్) చిత్రకళ

ప్రభుత్వ వాహనాల మీద, ఆర్టీసీ బస్సుల మీద, భారీ వాహనాలన్నిటి మీదా అనువైన చోట వీలైనంత పెద్ద సైజులో మన కళాఖండాలు అచ్చు వేయవచ్చు. అలాగని ప్రముఖ చిత్రాన్నో శిల్పాన్నో ఎవరిచేతనో కాపీ చేయించి గీయిస్తే చాలదు. భారీ సైజు ప్లాస్టిక్, చెక్క, పార్టిషన్ ఫెన్స్‌లూ అన్నిటా తీరుగా కళాఖండాలు అమరేలాగా చూడాలి. నిజమే, ప్రభుత్వ ప్రైవేటు రంగాలు కళాఖండాలను అచ్చు వేస్తుండకపోలేదు. కానీ ఆ ఘాటు చాలదు. లాభాలతో, ఇతర ప్రయోజనాలతో మునిగితేలే ప్రైవేటు సంస్థలకు లాభమే ముఖ్యం- కళా సంస్కృతికి సంబంధించిన ప్రచారం కాదు. అక్కడికీ వారు మొదలుపెట్టిన సాంస్కృతిక వ్యవహారాలు చాలవు గాక చాలవు. అందుకు ముందు ప్రభుత్వాలు ప్రారంభిస్తే అవతల ప్రైవేటు రంగం పాప్‌ఫ్యాషన్ ప్రచారం చేసేచోట వీలుచూసి ఉత్తమాభిరుచిని ప్రచారం చేసే వీలుంటుంది.


వర్లీ ఆదివాసి గృహం

చూడండి- మన ఇంటాబయటా సకల వినియోగ వస్తువుల మీద ‘సమాజాన్ని పట్టించుకోకండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి, ఆడించండి!’ అనే అర్థం వచ్చే రాతలు, అమెరికన్ మేచో పొగరూ, సంపూర్ణ పోర్నో కండలూ మన కళ్ళల్లోకి దూరిపోయేట్టు ప్రచారం జరుగుతుండగా మన కళాఖండాలని కళ్ళకి అంతగా అలవాటు చేస్తే పోయేదేముంది అజ్ఞానం తప్ప?! వర్లీ కళ, సవర కళ ఆ ప్రాంతాలవారి ఇళ్ళలో, ఇతర చోట్ల, గుడిసెల్లో, ఆరుబయటా కనిపించటం లేదా? ఎంత సౌందర్యం వుట్టి పుణ్యాన మనకి అందిస్తున్నారు! స్పెయిన్ లోని గ్రామాల్లో ఇళ్ళ మీద, బయటి గోడల మీద పికాసో బొమ్మల్ని పెయింట్ చేసి వుంచటం లేదా? ఆఫ్రికన్ కొండలోయల గ్రామాల్లో ముదురు రంగుల విచిత్ర రూపాలు, కోణాలు గీసి, పెయింట్ చేసి వుంచటం లేదూ! ఒరిస్సా లోని గుళ్ళవంటి ఇళ్ళలో ఇదే తీరు… రాజస్తాన్ గ్రామీణ ప్రాంత ఇళ్ళ గోడల మీద తుపాకీ పట్టిన బుర్రమీసం మహారాజులు ఏనుగు సవారీ చేయటం వంటి దృశ్యాల బొమ్మలు చూశారు గదా మీరు?! అచ్చం అలాగే, ఇలాగే ఆధునిక వినియోగ వస్తువులన్నిటి మీదా కిందా లోపలా బయటా మన చిత్ర శిల్ప సౌందర్యం అచ్చయి జనాలకు పరిచయం జరిగి తీరాల్సిందేనని ముందు మనం మనసు చేసుకోవాలి. పూర్వం అగ్గిపెట్టె చెక్కుమీద గీతల గీతల గాంధీ బోసినోటి నవ్వు ముఖం అచ్చువేసినట్టే ఇప్పుడు కళాఖండాన్ని అచ్చు వేయించాలి.

వివిధ కంపెనీల లోగోలు, పత్రికల్లో ఐకన్‌లు వివిధ కళాఖండాల్లోని చిన్న భాగాన్ని (డిటైల్స్) అచ్చు వేయవచ్చు. ప్రయోజన, ప్రచార కళకు మన కళాఖండాలు వాడటంలో తప్పు లేదు సరికదా అది చక్కని ప్రచార సరళి, శైలీ కాకపోదు.


కాంగ్రా చిత్రకళ

పేద్ద సొరచేప లాంటి విమానం మీద శ్రీ రజనీకాంతుని మొహం దర్శనమిచ్చినట్టే దక్షిణాది కాంస్య శిల్పం, కాంగ్రా, బసోలీ, మినియేచర్ బొమ్మలేవో ఒకటి అచ్చువేస్తే ఆ విమానం అందం లక్ష ఇంతలవుతుంది. ఐతే రజనీకాంత్ మహోన్నత మొహానికీ సదరు విమాన సంస్థకీ ఆర్థిక అనుబంధం వుండచ్చుగాక- ఆ స్థాయిలో ఫలానా రాష్ట్ర టూరిజంవారో, సాంస్కృతిక శాఖవారో వారి వారి ప్రతిభాపాటవ నిర్వాకాల ప్రచార నిమిత్తం విమానం పొడవునా ఓ ప్రాచీన కళాఖండాన్ని అచ్చు పోయచ్చుగా! ఇందుకు సంబంధిత పెద్దలు నడుం బిగించో, చేతికి కాశీదారం కంకణం కట్టుకునో ప్రయత్నించడం అసాధ్యం కారాదు గదరా సుమతీ!

ఒకసారి ఊహించండి… ఉదయం నిద్ర లేచేసరికి పాల పేకెట్ మీద ఆవు, గేదె ఆకారపు లోగో కంటే పటచిత్రంలోదో, కలంకారీలోదో ఆవు/గేదె మొహం అచ్చు వేస్తే ఎంత కళగా వుంటుంది! కిటికీ కర్టెన్, డోర్ కర్టెన్, మంచం మీద దుప్పటి మీద కలంకారీ, తోలుబొమ్మల చిత్రాలు ఒకటి రెండు సరయిన మేరకు అచ్చు వేసి వున్నది చూస్తే కంటికి ఎంత బాగుంటుంది! దిండు గలేబులయితేనేం, చేతి రుమాలయితేనేం మినియేచర్ ఏనుగుల వరస బొమ్మని అచ్చు వేయటానికి?! పరదాలకు, గలేబులకు, సోఫా కవర్లకు కిక్కిరిసినట్టుగాక చైనా జపాన్ సిల్క్ వస్త్రాలమీది డిజైన్/బొమ్మలవలే స్పేస్‌కి తగినంత వదలి ఒక కళాఖండాన్ని అచ్చువేస్తే సరి- అందం పదింతలు కాకమానదు.

మనం అంచక్కా పీక తెగేలా టై కట్టుకుని ఆఫీసుకు బయలుదేరే ముందు అల్పాహారపు పళ్ళెం మీదనో, కాఫీ కప్పు మీదనో మంచి ప్రాచీన చిత్రంలోని ఓ డిజైన్ కనిపిస్తే ప్రాణం లేచిరాదూ? బస్సో కారో ఎక్కి శ్రీ ఆఫీసుకు వెళ్ళేటపుడు ఆయా వాహనాల మీద మాంఛి శిల్పం కళకళ్ళాడుతోంటే ‘మూడ్’ ఎంత బావుంటుందో గదా! మనకి ఎదురుపడే బస్సు మీద రామప్ప శిల్పమో, బుద్ధ నిర్వాణ దృశ్యపు శిల్పమో భారీగా కదలి వెడుతోంటే సౌందర్యానికి లోటా? ఇదంతా చూడగా చూడగా… గా… బస్టాండ్, హోటల్ ముఖద్వారం, ఆఫీస్ కేంటిన్ ప్రాంగణం, పార్క్ ప్రముఖ ద్వారం… ఎక్కడంటే అక్కడ కమనీయ శిల్పం ఆహ్వానిస్తోంటే మన అడుగు ఆత్మానందంలోకే!


బసోలీ చిత్రకళ

భారీ సైజు కేలండర్లో నిట్టనిలువునా పన్నెండు పేజీల్లో మహా వైభవంగా మన చిత్ర, శిల్పాలు, గిరిజన హస్త కళాఖండాలు పరుచుకుని మనల్ని పలకరిస్తోంటే పరిచయంగాని కళావిన్యాసం వుంటుందా చెప్పండి?! సకల ఆహ్వానపత్రాల మీద ఆర్టిఫీషియల్ కళ బదులు మన ఘన శిల్పమో, చిత్రమో మనల్ని పలకరిస్తే ఎలా వుంటుందో ఆలోచించండి. ఆఖరికి వొంటి మీద అచ్చు పోసుకునే బొమ్మల స్థానంలో మన కళాఖండం, మనకి నచ్చినదే, పచ్చ పొడిపించుకోవచ్చు కదా!

నిజమే… ఇప్పుడు అనుకున్నదంతా అతి సులువైన సంగతేం కాదు, చెప్పినంత సాధ్యంకాదు గానీ మీలాంటి పెద్దలు అటు ప్రభుత్వ ఉన్నత అధికారులని, ఇటు ప్రైవేటురంగ పెద్దలని, కార్పొరేట్ బడా ఎం.డీ.లని, సి.ఇ.వోలనీ పట్టుకోడానికి పైరవీ చేసో, లాబీయింగ్ చేసో, సిఫార్సు చేయించో సకల ‘ప్రాడక్టు’ల మీద మన చిత్రాలు బహు చక్కగా అచ్చు పోయించవచ్చు, మనసు చేసుకుని ఉద్యమిస్తే.

ఇదంతా ఒక హరిత విప్లవం లాగ, జలసాధన లాగ, అడవుల పెంపకం లాగ, పోనీ జ్ఞాన(?)యజ్ఞాల్లాగ భావించి నూతనోద్యమం ఆరంభించాలి. బడి ముందు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ముందు గతంలో లేకపోతే ఇపుడు అనేక మంచి శిల్పాలు తెచ్చి పెట్టించవచ్చు. పార్కుల్లో జనం విహారం చేసే చోట, వివిధ కళా ప్రాంగణాల్లోనూ చక్కని మ్యూరల్స్, ఫ్రెస్కోలు (Fresco) వేరే ఎందుకు? మన చిత్ర శిల్ప కళాఖండాలనే పెట్టించమనాలి. నిజానికి ప్రతి జిల్లా ప్రధానకేంద్రంలో, ప్రధాన గ్రంథాలయంలో అక్కడి చారిత్రక, సాంస్కృతిక పత్రికలతోపాటు మహనీయ శిల్పాలు పెట్టించడం అత్యవసరం. మన రాష్ట్రంలో వివిధ దేవాలయాలు, అంతెందుకు, ఆర్కియాలజీ కార్యాలయ ప్రాంగణంలోనూ వదిలేసినవి, అంతగా పట్టించుకోనివి ఎన్నో శిల్పాలు పడివుండటం చూసేవుంటాం. వాటినైనా తెచ్చి వివిధ ప్రధాన రహదారుల్లోనో, అధికార ప్రాంగణాల్లోనో పెట్టించవచ్చు. మరి హోటళ్ళకు పాతకాలపు ఉయ్యాల బల్లలు, ఇంటి కొయ్య స్థంభాలు, ఎర్ర చందనం కొయ్య చిలకల రాటలూ, పాత ఇంటి భారీ గుమ్మాలూ అలంకారాలుగా అమర్చినట్టే అన్ని కార్పొరేట్ కార్యాలయాల ముందు దారు శిల్పమో, రాతి శిల్పమో నిలపవచ్చు.

పాతకాలపు ప్రతి గుడి ఒక ఆర్ట్ గేలరీ వంటిదే. వాటి పైకప్పుల మీదనో, పక్క గోడల మీదనో వుండే ఫ్రెస్కోలు, శిల్పాలు, తలుపుల మీద ఇత్తడి, కంచు బాస్ రిలీఫ్ వర్క్ వెరసి మొత్తం చూస్తోంటే కళ్ళు చేటలంతవుతాయి. అలాగే మ్యూజియంలూ… అందుకే పిల్లల్ని వివిధ విహార యాత్రలకు తీసుకెళ్ళే పాఠశాలల యాజమాన్యాలు గొప్ప శిల్ప సంపద, చిత్రకళ వున్న గుడి చూపించాలి.


తోట వైకుంఠం – వర్ణచిత్రం

మ్యూజియమ్‌లు చూపించటం అతిముఖ్యం. దీని అర్థం పిల్లలకు మతం నూరిపొయ్యమని, దైవభక్తి అంటగట్టి తీరాలనీ అనడం కాదు. కళ కళే. జానపద కథలు, గిరిజన పాటలు, వివిధ దేశాల పురాణ గాథలూ అద్భుతమైన కళకు పునాది వేసినవే. నకాషీ పనితనం, పట చిత్రాలు, తాటియాకుల మీద ఒరియా చిత్రకళ, కలంకారీ, తోలుబొమ్మల కళ, ఆలయ గోడల మీద రేఖలతో మెరిసే బొమ్మలు, అజంతా, ఎల్లోరా, అమరావతి, రామప్ప గుడులు- నిజానికి పురాణాలు, జానపద యక్షగానాలు లేకపోతే వుండేవా అసలు?! కులమతాలు, ప్రాంతీయ, అధికార ఆధిక్యతలకు అతీతమైనది కళ గనుక చిన్న పిల్లలకు కళాదృష్టి ముందునుంచే సంగీత సాహిత్యాలవలే అలవాటు చేయటం మన బాధ్యత కదా!

‘వస్తు వినియోగ ప్రకటన’గాని, ‘ఎంటర్‌టైన్‌మెంట్’ పేరిటి అభిరుచి గానీ నేలబారుగా, చౌకబారుగా, నీచంగానే వుండాలన్న నియమం లేదు. కండలు తిరిగిన సినీనటవస్తాదుల బొమ్మల వలే కనిపించే దేవతల సిమెంటు, ప్లాస్టిక్, ఫైబర్ రంగుల శిల్పాలకన్నా, చవకరకం కాలెండర్ చిత్రకళ కన్నా అసలు సిసలు అరుదైన ప్రాచీన శిల్ప చిత్ర కళలు మిన్న. చందమామని పిలుస్తూ బిడ్డలకు అన్నం తినిపించినట్టు కళని పిల్లల కోసం కూడా ఆహ్వానించాలి. చెరువు, పుట్ట, గుట్ట, చెట్టు, పిట్ట, వాగు, నది అందచందాలను పిల్లలకూ పెద్దలకూ చూపించాలిసిందే. అలాగే పిల్లలకు శతక సాహిత్యం వలె శతాధికంగా సౌందర్యం పలికే చిత్ర శిల్పాలను చూసే అలవాటు చేయకపోతే ఎవరో పనిగట్టుకు శపించినట్టు కాలెండర్ సినీ సుందరీమణులు వొళ్ళు విరుచుకునే బొమ్మలే, మన సినీ వీరుల ఆర్టిఫీషియల్ కండల సరుకే మన నూతన తరం కళ్ళలో తిష్టవేసుకు కూర్చోవటం ఖాయం.


మోషే డయాన్ నీటివర్ణచిత్రం

అలాగని ‘నెట్‌లో అన్నీ ఉన్నాయష!’ అనడానికేముంది? నెట్‌లో అందరూ దేశవిదేశీయ కళాఖండాలనే చూస్తున్నారా! అత్యాధునిక సౌకర్యం వంటిదే అతి ప్రాచీన సౌందర్యం. ఈ మొత్తం అభ్యర్థన వెనుక ఆధునిక ఫోటోగ్రఫీ, వర్ణచిత్రాల్లో ప్రకటిత బొమ్మల నిర్మాణంలో కళాకౌశలం లేదని కాదు. ప్రతి ఆధునిక రూపం వెనుక గత చిత్ర శిల్ప కళల సారం పునాదిగా వుండకమానదు. ముందు పునాది సౌందర్యం అవగతం కాకపోతే చరిత్ర ఏమీ తెలియకుండా వట్టినే ఏదో కోట శిథిలాలు చూసి వచ్చినట్టవుతుంది. ఇది ఉద్బోధ కాదు; అభ్యర్థన.

మనందరం చూసిన, చూస్తున్న రెండు దృశ్యాలు మీకు గుర్తు చేస్తున్నాను… చాలా మంది ఏ కళాకాంతీ లేని గుడికో బడికో వెళ్ళివస్తారు- ఆ పక్కనే వున్న మహనీయ శిల్ప సమూహం కేసి పొరపాటున కూడా చూడరు. కంటి జబ్బు వస్తుందేమోనన్న భయం కావచ్చు. అలాగే లాంచీలో విహారయాత్ర చేస్తూ ఆ లాంచిలోని నేలబారు ‘ఎంటర్‌టైన్‌మెంట్’ ఆనందిస్తారే తప్ప, పొరపాట్న కూడా నదీ సౌందర్యం, గుట్టలు, పిట్టలు, నాటు పడవలు, అడవుల ముచ్చట కన్నెత్తి అయినా చూడరు. ఈ రెండు దృశ్యాలూ మనం చాలాసార్లు చూసేవుంటాం గదా- ఇది ఎక్కువమంది సంగతి! పరిచయం పెరిగితే అది అలవాటయి ప్రేమగా మారే వీలుంది గదా అని ఈ మాటల, వాక్యాల సారం.

చిత్ర శిల్ప కళల పరిచయం పెంచడం, పెంచుకోడం వాడుక భాషాఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం, ప్రాంతీయ, విప్లవ ఉద్యమాలవంటిదే. బాహుబలుల సంగతేమోగానీ బుద్ధిబలుల అవసరం అత్యవసరం అనీ, వారి ప్రభావం, ప్రయత్నం మన చిత్ర శిల్ప కళాభిరుచిని విస్తరింపచేయటం ఆశించతగ్గదని ఇందుమూలంగా సమస్త మిత్రులకు తెలియజేయటమైనది.

(ఇంకా ఉంది.)

తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...