చల్ మోహనరంగా

పదిహేనేళ్ళ క్రితం భావకవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం అన్న వ్యాసం మొదలుపెట్టి ‘[జానపదుల] పాటల్ని, ఆ పాటలమీద వచ్చిన విమర్శల్ని, ఆ పాటలకు వచ్చిన ప్రచారాన్ని, అవి పాడే సంగీతాన్ని తరువాతి భాగంలో చర్చిస్తాం’ అని ముగించాం. ఆ తరవాతి భాగం అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఆలస్యానికి ముఖ్యకారణం నేను 2005-06ల్లో రికార్డు చేసుకున్న పాలగుమ్మి విశ్వనాథం, బాలాంత్రపు రజనీకాంతరావుగార్ల మాటలు, అంత కంటే ముఖ్యంగా వాళ్ళిద్దరూ నండూరి బాణీల్లో పాడిన ఎంకిపాటలు పోగొట్టుకోవడం. అదృష్టవశాత్తు అప్పట్లో వాడిన డిక్టాఫోన్ మరల కనబడింది. వ్యాసం రెండవ భాగం త్వరలోనే పూర్తి చేయగలమని అనుకుంటున్నాను. ఈ పదిహేనేళ్ళలో సేకరించిన సమాచారం/పాటల-లో ‘చల్ మోహనరంగా’ అన్న నిడివైన పాట ఒకటి ముఖ్యమైనది. ఈ సంచికలో కేవలం ఆ పాట ఆధారంగా తయారయిన ఒక సినిమా (లఘు చిత్రం) గురించిన వివరాలు చూద్దాం. వ్యాసం చివరిలో 12నిమిషాల పాటు సాగే ఆ పాటను వినవచ్చు.

1935 వరకు తెలుగు టాకీ సినిమాలు దూరంగా వున్న కలకత్తా, బొంబాయి, కొల్హాపూరులలో తయారయ్యేవి. (అంతకు ముందే కాకినాడలో సి. పుల్లయ్య చేసిన ప్రయోగాల గురించి, తీసిన మూకీల గురించి నేను ప్రస్తావించడం లేదు. అలాగే మద్రాసులో రఘుపతి వెంకయ్య, ప్రకాష్, చేసిన పనిని కూడా!) 1936 నాటి నుండి విశాఖపట్టణం, రాజమండ్రిలలో సినిమాలు నిర్మించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అలా వచ్చిన సినిమాలు: సంపూర్ణ రామాయణం (1936), ప్రేమ విజయం (1936), దశావతారాలు (1937), భక్త జయదేవ (1938, ఆంధ్ర సినీటోన్).

సంపూర్ణ రామాయణం సినిమా ప్రకటనల్లో ‘రాజమహేంద్రవరమున శ్రీదుర్గాసినీటోన్ కంపెనీవారి స్వంతస్టూడియోలో తయారుకాబడిన తెలుగు మాట్లాడు ఫిల్ము’ అని వుంటుంది. ముఖ్యంగా ‘తెలుగు మాట్లాడు ఫిల్ము’ అన్న పదాలు పెద్ద, లావుపాటి అక్షరాల్లో వుంటాయి! చాలా పరిమితమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారయిన ఈ సినిమాలు ఆడలేదు. దానితో ఆర్ధికంగా దెబ్బతిన్న దుర్గా సినీటోన్ యజమాని నిడమర్తి సూరయ్య నుండి దాన్ని అద్దెకు తీసుకుని ఆంధ్ర టాకీస్ అన్న కొత్త పేరుతో సి. పుల్లయ్య సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. అంత వరకు సి. పుల్లయ్య దర్శకత్వం వహించిన టాకీ సినిమాలన్నీ (ఈస్ట్ ఇండియా వారివి) కలకత్తాలో తీసినవి. ఆంధ్ర టాకీస్ బ్యానర్ పైన తీసిన మొదటి సినిమా, శ్రీ సత్యనారాయణ (1938). సినిమా పేరులో వ్రతం అన్న మాట లేదు! సినిమా నిడివి ఎనిమిది వేల అడుగుల కంటే రాకపోవడంతో దానికి అనుబంధంగా కాసులపేరు అనే రెండు రీళ్ళ సినిమాని తీశారు. అప్పటికే సినిమా అంటే కనీసం మూడు గంటల వినోదం అని అలవాటు పడిపోయిన ప్రేక్షకులకోసం–ఆ మాటకొస్తే ఇప్పటికీ పరిస్థితి మారలేదు–చల్ మోహనరంగా అన్న మరో 2వేల అడుగుల లఘు చిత్రాన్ని కలిపారు. ఈ మూడు చిత్రాలు కలిపి ముక్కోటి ఏకాదశి రోజున విడుదల చేసినట్లు సి. పుల్లయ్య కుమారుడు సి. ఎస్. రావు తన జ్ఞాపకాల్లో రాశారు. ఇలా రెండు లేక మూడు లఘు చిత్రాలు కలిపి విడుదల చేయడం అంతకు రెండేళ్ళ ముందే జరిగింది. 1936లో సి. పుల్లయ్యే ఈస్ట్ ఇండియా వారి కోసం పిల్లలతో, ధ్రువవిజయం, సతీ అనసూయ అన్న రెండు లఘు చిత్రాలు తీశాడు. ఇదే వరసలో 1941లో వచ్చిన ‘భలే పెళ్ళి, తారుమారు’, 1954లో వచ్చిన ‘బూరెల మూకుడు, రాజయోగం, కొంటె కిష్టయ్య’లను (బాలానందం అనే పేరుతో) కూడా చెప్పుకోవచ్చు.

ఇంక అసలు మన పాట విషయానికొస్తే దీన్ని వాలి సుబ్బారావు, పుష్పవల్లి పైన చిత్రీకరించారు. అడవి బాపిరాజు శిష్యుడైన వాలి సుబ్బారావు తర్వాతి కాలంలో కళాదర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. పుష్పవల్లి చాలా సినిమాల్లో నటించింది, కాని సినీ నటి రేఖ తల్లిగానే ఎక్కువమందికి తెలిసిన పేరు. ఈ పాట పాడింది టేకు అనసూయ. నటి, గాయని వేర్వేరు వ్యక్తులు కావడంతో ఇదే తెలుగులో మొదటి ‘ప్లేబాక్’ పాట అని అనేవారున్నారు. ఈ పాట చిత్రీకరణలో ఎలాంటి పెదవుల కదలిక (లిప్ మూవ్‌మెంట్) కనిపించదని, ఒక బ్యాక్‌గ్రౌండ్ పాట అని చెప్తారు. ఈ పాట 12 నిమిషాల పాటు సాగుతుంది. రెండు రికార్డులపై 4 భాగాలుగా పాడింది కూడా టేకు అనసూయయే. ప్రస్తుతం నెట్‌లో (రికార్డు సోర్సు చెప్పకుండా, ఎలాంటి అక్నాలడ్జ్‌మెంట్ లేకుండా) లభ్యమవుతున్నది మొదటి రెండు భాగాలు (ఒక డిస్క్) మాత్రమే.

ఈ పాటకు సంగీతం చేసిన నిమ్మగడ్డ పరదేశి అంతకు మునుపు మరికొన్ని తెలుగు సినిమాలకి పని చేశాడు. కొన్ని పాత నాటకాల పుస్తకాలలో కూడా ఆయన పేరు కనిపిస్తుంది. ఆయన తరవాత హిందీ సినిమాల్లో పని చేయడానికి వెళ్ళినట్లు పెండ్యాల తాను సమర్పించిన జనరంజని రేడియో కార్యక్రమంలో చెప్తాడు. అందరూ ‘జానపద గేయం’ అనుకునే ఈ పాటకు ఒక ‘రచయిత’ కూడా– కాళ్ళకూరి హనుమంతరావు–వున్నాడు. హనుమంతరావు 1910-1940 మధ్య కాలంలో విస్తృతంగా రచనలు చేసిన వ్యక్తి. కాకుంటే నిజంగా ఆయనే ఈ పాటని రాశాడా అన్నది ఒక ప్రశ్న. ఇదే పాటను 1915 నాటికే వల్లూరి జగన్నాథరావు బండిపాట అని రికార్డుగా ఇచ్చాడు. ఆ పాటను కూడా మీరీ సంచికలో వినవచ్చు. ఇలాంటి ‘రంగం’ పాటలు 19వ శతాబ్దం చివరి, 20వ శతాబ్దం తొలి రోజుల్లో పెద్ద సంఖ్యలో వచ్చాయి. చరణాల వరసల్లో మార్పులు, అచ్చులో వున్న పాఠానికి, పాడే పాటలో మాటలకి భేదాలు కనిపిస్తే అవి తప్పులూ కావు, ఆశ్చర్యపోవలసిన అవసరమూ లేదు.

చివరిగా, నా వ్యక్తిగత అభిప్రాయంలో, ఈ 12 నిమిషాల చల్ మోహనరంగా పాట ఒకే మూసలో, విసుగు పుట్టించేట్లు (monotonousగా) సాగుతుంది. ఈ పాటకున్న కథ పెద్దది, అరుదైన రికార్డు అన్న ఉద్దేశంతో మీ ముందుకు…

  1. చల్ మోహనరంగా – టేకు అనసూయ

  2. చల్ మోహనరంగా – వల్లూరి జగన్నాథరావు