గాయకుడు, గేయ రచయిత, సంగీతజ్ఞుడు అయిన వల్లూరి జగన్నాథం లేక జగన్నాథరావు అని పిలవబడే వ్యక్తిని గురించి మనకి దాదాపుగా ఏమీ తెలియదు. ఆ తెలిసిన బహు కొద్ది కూడా ప్రముఖ గాయని అనసూయగారు ఆయన్ను తన గురువుగా కొనియాడుతూ అక్కడా ఇక్కడా చెప్పిన మాటలు, ముఖ్యంగా పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు నా కోరికపై ఆవిడను సుమారు ఒక సంవత్సరం క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పినవి. కానీ వల్లూరిని గురించిన ఆవిడ జ్ఞాపకాలు, ఆవిడ చెప్పిన పాటల వివరాలు 1930-32 తరువాతి కాలం నాటివి. రాత రూపంలో అయితే – ఒక చిన్న వ్యాసాన్ని మినహాయిస్తే – ఆయన్ని గురించిన సమాచారం ఏమీ అందుబాటులో లేదు. ఆ చిన్న వ్యాసం కూడా అనసూయగారు, గతానికి స్వాగతం”(2007) అన్న తన జ్ఞాపకాల సంకలనంలో రాసినదే. ప్రెస్ అకాడమీ, ‘మనసు ఫౌండేషన్’ రాయుడు వారి పుణ్యమా అని మనకి ఈరోజు తేలికగా దొరుకుతున్న తొలినాటి తెలుగు పత్రికల్లో ఎక్కడైనా ఈయన గురించిన వివరాలున్నాయేమో వెదకాలి (1915లో ఆంధ్రపత్రికలో ప్రచురించబడ్డ ఒక ఫోటో మాత్రం కంటబడింది.)
ఈ సంచికలో వినిపిస్తున్న పాటలు 1930కి పూర్వమే, కచ్చితంగా చెప్పాలంటే సుమారు 1915-1924 మధ్య కాలంలో రికార్డు కాబడినవి. అంటే రికార్డయిన తొలి ‘తెలుగు’ పాటలు! ఇక్కడ, తెలుగు పాటంటే త్యాగరాజ కీర్తనల వంటి శాస్త్రీయ సంగీతపు రికార్డులను పరిగణలోకి తీసుకోవడంలేదు. గ్రామఫోను కంపెనీవారు తొలిసారిగా దక్షిణ భారతదేశంలో డిసెంబర్ 1904, మార్చ్ 1905 మధ్య కాలంలోనే రికార్డింగులు (The second ‘Far Eastern’ recording tour) జరిపారు కదా 1915 ప్రాంతం వరకూ, మరి శాస్త్రీయం కాని తెలుగు పాటలు రాలేదా అంటే, నాకు తెలిసినంతలో చాలా కొద్ది (మూడు, నాలుగు) పాటలు మాత్రమే వచ్చాయి. కానీ ఆ పాటలు నాకు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. (తొలి తెలుగు పాటల చరిత్రపైన వివరాలు వేరుగా మరొకసారి రాస్తాను.)
వల్లూరి పాడిన పాటల వివరాలతో 1920 ఆంధ్రపత్రిక, రౌద్రి నామ ఉగాది సంచికలో వచ్చిన ఒక ప్రకటన ఇక్కడ చూడండి. మరిన్ని రికార్డుల వివరాలు హెచ్.ఎం.వి వారి 1927 కాటలాగులో చూడవచ్చు.
- లంజకె సేవ చేశాను
- నవ్వు పాట – ఇది The Laughing Song అన్న చాలా ప్రఖ్యాతి కాంచిన పాటకు అనుకరణ.
- నారదుని భూలోక సంచారం
- పడవ నడిపే
- మందు తింటానులే
- బస్తాల మోత
- గోంగూర పాట
ఇవి 1925 ముందు కాలం నాటి రికార్డులు. అప్పటి రికార్డులలో ‘గాడి’ (groove) లోతు, వెడల్పు వేరు కావటం ఇంకా మరి కొన్ని సాంకేతిక కారణాల వల్ల రికార్డులు బాగున్నా, ఎంత మంచి రికార్డు ప్లేయర్, పిన్నులు వాడినా ఈ పాటల్ని రికార్డు చేయటం కొంచం కష్టమైంది. పాడే వ్యక్తి గొంతు తక్కువ స్థాయిలో వినిపించడం, ముఖ్యంగా hiss noise తగ్గించడం ప్రధానమైన సమస్యలు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఈ పాటల్ని ఎంతో ఓపిగ్గా రికార్డు చేసిన మిత్రులు మధుసూదనశర్మగారికి బోలెడు కృతజ్ఞతలు! వల్లూరి పాడిన మరొక 6-7 పాటలు రాబోయే సంచికల్లో విందాం.