మూడిట్లో యేది?

పిల్లవాడు వంట గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. “అమ్మా, అమ్మా! వెదు అరటిపండు తొక్క వలుస్తూ చెయ్యి కోసుకుంది!”

“యేంట్రా యిది? ఒక్క నిమిషం వూరికే వుండరు కదా? ఆ పిల్ల కూరగాయల కత్తిని తీసుకుంటుంటే నువ్వు ఆపాల కదా? యింత పెద్దోడయ్యావే, అది తెలియదా?” అరిచింది అమ్మ.

వెనకనే వెదు గట్టిగా యేడుస్తూ, పరిగెత్తుకుంటూ వచ్చింది. కమలాంబాళ్ బిడ్డను యెత్తుకుంది.

“యేదీ చూపించు, యెక్కడ కోసుకున్నావ్? యింత దానికే యెంత గోలరా బాబూ! కొంచెం గీక్కుంది. అంతే!”

ఆమె కాగితం ముక్కతో వెదు ఎడమ చేతి బొటన వేలి మీద వున్న రక్తాన్ని తుడుస్తూ చెప్పింది. “యేడవకు. యింద చక్కెర.”

కొడుకు వైపు చూసి, “ఒరే సీమా, పాపను జాగ్రత్తగా చూసుకో. నాకు కొంచెం పనుంది.” అంది.

కమలాంబాళ్‌కు దాదాపు యిరవై నాలుగేళ్ళుంటాయి. సీమ, వెదు ఆమె పిల్లలు. సీమకు యేడేళ్ళు. వెదుకు యింకా మూడు నిండలేదు. ఆమె భర్త రైల్వేలో క్లర్కు. నాలుగు నెలల క్రితం కుంభకోణంకు బదిలీ అయ్యాడు. అప్పటి నుంచి వాళ్ళు నలుగురే వుంటున్నారు.

కమలాంబాళ్ వొంటరిగా వుండటం యిదే మొదటిసారి. యెప్పుడూ వాళ్ళ అత్తగారో, పిన్నిగారో కూడా వుండేవారు. అందువల్ల, ఇప్పుడు యింటి పనీ, పిల్లల్ని చూసుకోవడం ఆమెకు కష్టంగా వుంది.

ఆ రాత్రంతా వెదు బాధతో ముక్కుతూ మూలుగుతూ వుంది. కంటి మీద కునుకే లేదు. తెల్లారేసరికి వేలు వాచిపోయి యెర్రగా కందిపోయింది. నొప్పితో యేడుస్తూ వుంది.

ఆఫీసుకు పోతూ సుందరరామయరు చెప్పాడు. “పసుపు, యెండు మిరపకాయను వుడికించి, నూరి వేలికి పట్టించు, అంతా బాగయిపోతుంది.”

కమలాంబాళ్ బిడ్డతో యేం బాధపడుతుందో అని మధ్యాహ్నం రెండు గంటలకు యింటికొచ్చాడు. వెదుకు విపరీతమైన జ్వరం. అరచెయ్యి మొత్తం వాచిపోయింది. బిడ్డ నొప్పితో గుక్క తిప్పుకోకుండా యేడుస్తూ వుంది.

“కొంచెం గీక్కుపోయింది. అంతే! నెత్తురు కూడా యెక్కువ కారలేదు. దానికే యింత వాచిపోవాలా? నాకు భయంగా వుంది. రక్తంలోకి విషం వెళ్ళిపోతుందని యీ మధ్య కొందరు చెబుతున్నారు. డాక్టరు దగ్గరికి తీసుకెళ్దామా? మీరేమంటారు?” అడిగింది కమలాంబాళ్.

“సరే. పక్క వీధిలోకి డాక్టర్ మీనన్ అని కొత్తగా వచ్చాడంట. బయట దేశాల్లో చదువుకున్నాడంట. మంచి పనిమంతుడనుకుంటా. నేనెళ్ళి ఆయన్ను పిలుచుకొస్తా.” సుందరరామయరు వెళ్ళాడు.

డాక్టర్ మీనన్ వచ్చాడు. యిరవైయెనిమిదేళ్ళకంటే ఎక్కువుండవు. యింగ్లండులో ఎఫ్ఆర్‌సిఎస్ చేసి వచ్చాడు. అందువల్ల అతనికి మందుల శక్తి మీద పెద్దగా నమ్మకం లేదు. చెడిపోయిన అంగాల్ని కత్తిరించి పడెయ్యడమే మేలని అతని నమ్మకం.

అతని అభిప్రాయం ప్రకారం వంటింటి కత్తి తుప్పుపట్టి వుంటుంది. విషాన్ని ఆపడానికి వెంటనే యేదీ వేయలేదు కాబట్టి, మొత్తం చేతికి విషమెక్కిపోయింది.

‘మణికట్టు వరకు చేతిని తీసేస్తేనే మంచిది. లేకపోతే పాప ప్రాణానికే ప్రమాదం. కొన్ని మందులు తీసుకొని గంటలో వస్తా’నని అతను వెళ్ళాడు. డాక్టరు రాసిచ్చిన యింకొన్ని మందులు తేవడానికి సుందరరామయరు కూడా షాపుకెళ్ళాడు.

పాపం. కమలాంబాళ్‌కు యేమి చేయాలో తోచడంలేదు. పాప ప్రాణాలకే ప్రమాదమైతే చెయ్యి తీసేయ్యడమే మంచిది కదా అనుకొంది. యేమీ పాలుపోక అలా నిలుచుండిపోయింది.

‘ఆది జంగమా! నీకు మొక్కుతా!’ అని వొక మందులోడు వీధిలో పాడుతున్నాడు. వాడికి బిక్షమేయమని సీమ వాళ్ళమ్మ చెయ్యి పట్టుకుని లాగాడు.

బిడ్డకొచ్చిన కష్టంతో కుంగిపోయి వున్న కమలాంబాళ్ తనేం చేస్తున్నాననే స్పృహ లేకుండా, యింటి ముందుకెళ్ళి, ఆ మందులోడితో తన గోడు వెల్లబోసుకుంది. వాడు ఆమెకు కొంచెం విబూతి, కొన్ని మందు ఆకులు యిస్తూ చెప్పాడు. “విబూతి నుదుటిన రాయి. ఆకుపసురు చేతికి పూయి. కనికట్టు వేసినట్టు అంతా మాయమయిపోతుంది. కలత చెందకు అమ్మన్నీ, పళని స్వామి నిన్ను పరిరక్షిస్తాడు.”

కమలాంబాళ్ యిచ్చిన కాసులు పుచ్చుకొని అతను వెళ్ళిపోయాడు.

విబూతి నుదుటికి రాసింది. ఆకు పసురు చేతికి పూసింది. కలవరపడుతూ పాప పక్కన కూర్చుంది. పాప చేతిని తీసుకొని బుగ్గకు ఆన్చుకుంది. నిట్టూర్పు విడిచింది. “అయ్యో, యెంత ముద్దొస్తుందీ చెయ్యి! చేతికి కడియం చేయిద్దామనుకొన్నా, యిప్పుడు దీన్ని తీసేస్తామంటున్నారే! అయ్యో, మంగళాంబికాదేవీ, నువ్వు తప్ప దిక్కెవరూ లేరు తల్లీ. నీకు బంగారు కడియం చేయిస్తా. నా బిడ్డను కాపాడమ్మా!” ఆమె కళ్ళలోంచి కారిన కన్నీరు బిడ్డ చేతిని తడిపేసింది.

వొక గంటలో సుందరరామయరు, డాక్టరు వచ్చారు. “యిదేంటమ్మా! యేం చేస్తున్నావ్ నువ్వు! కన్నీళ్ళు చెయ్యి మీద పడితే మరింత సెప్టిక్ అయిపోదా?” అన్నాడు డాక్టరు. రాత్రికి మందులు వేయమని, వుదయానికి ఆపరేషన్‌కు యేర్పాట్లు చేసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు తనతో పాటు వొక మత్తు ఇచ్చే డాక్టరును, సహాయకుడినీ తీసుకొచ్చాడు.

“బిడ్డ బాగా నిద్రపోయింది. జ్వరం తగ్గింది.” ఆతురతతో చెప్పింది కమలాంబాళ్. అదేమీ వినిపించుకోకుండా డాక్టరు ఆపరేషన్‌కు రెడీ చేసుకుంటున్నాడు. పాప నాడి చూశాడు. ఆశ్చర్యంగా చూస్తూ థర్మామీటరు పెట్టాడు. కట్టు విప్పాడు. వాపు తగ్గిపోయింది, జ్వరం కూడా. వెదు దాదాపు డెబ్భై అయిదు శాతం కోలుకుంది. “అద్భుతం! నిన్న పాప బతుకుతుందా అని చెప్పడం కష్టంగా వుండింది. ఖచ్చితంగా చెయ్యి తీసేయ్యాలని అనుకున్నా. కానీ, ఈ రోజు అంతా బాగయిపోయింది. యిలాంటి కేసును నేనెప్పుడూ చూళ్ళేదు!” ఆశ్చర్యపోయాడు, డాక్టర్ మీనన్.

“అమ్మా మంగళాంబికా! పైనున్న దేవీ! పూర్తిగా బాగుచెయ్యి. నేను పాలాభిషేకం చేస్తా.” మొక్కింది కమలాంబాళ్.

యిప్పటిదాకా సీమని ఆ గదిలోకి రానివ్వలేదు. వాడు మెల్లగా, యెవరూ చూడకుండా లోపలికొచ్చాడు. బూట్లు, టోపీ పెట్టుకొని, టిప్‌టాప్‌గా వున్న డాక్టరుకు తనకు చదవడం వచ్చని చూపించాలనుకున్నాడు. వొక తమిళ పత్రిక తీసుకొని దాన్ని గట్టిగా, గంభీరమైన గొంతుతో చదివాడు.

‘కన్నీళ్ళు-కంటికి కనిపించని విష క్రిముల వల్ల వచ్చే జబ్బులతో జనం బాధపడుతుంటారని అందరికీ తెలుసు. యీ క్రిముల్ని కన్నీళ్ళు చంపగలవు. వొక కన్నీటి చుక్క లక్షలాది క్రిముల్ని చంపుతుంది. కానీ, ఈ క్రిముల్ని కన్నీటి నుంచి యింకా వేరు చేయలేదు. వొకసారి కనుక అది జరిగితే, యీ విష క్రిముల్ని చంపడంలో కన్నీరు కీలక పాత్ర పోషిస్తుంది.’

“అదీ సంగతి! పిల్లల నోట్లోంచి నిజం బయటకొస్తుంది మిస్టర్ సుందరం!” ఆశ్చర్యపోతూ అన్నాడు డాక్టరు. “నిన్న పాప చేతిని తడిపిన ఆమె కన్నీళ్ళు ఆ విష క్రిముల్ని, బ్యాక్టీరియాల్ని చంపి, చేతిని బాగుచేసుంటాయి. లేకపోతే, యిలాంటి కేసును నేను చూళ్ళేదు. వొక అమెరికన్ డాక్టర్ కన్నీళ్ళు యాంటీ సెప్టిక్ అని రాశాడు. కానీ నేను నమ్మలేదు. ప్రకృతి నిజంగా అద్భుతం. దీన్ని గురించి నేను లాన్సెట్ పత్రికలో రాస్తాను.” అతను తెచ్చిన వస్తువుల్నీ, మనుషుల్నీ తీసుకొని వెళ్ళిపోయాడు.

“ఆ మందులోడు యిచ్చిన ఆకు పసరు వల్లే పాపకు బాగయిందంటావా? యీ డాక్టర్లకు తెలియనిదేదో ఆ మందులోళ్ళకి తెలుసనుకుంటా. అవే బాగు చేసుంటాయి.” అన్నాడు సుందరరామయరు.

“కన్నీళ్ళూ కాదు! ఆ మందులోడి ఆకులూ కాదు! పాపకు బాగయింది నేను మంగళాంబికను మొక్కుకున్నందువల్ల. ఆమెకు కడియం చేయించాలి. అంతా ఆమె దయ. సాయంత్రం వెళ్ళి బంగారు పనోడు చొక్కలింగాన్ని పిలుచుకుని రండి.” ఆనంద భాష్పాల్ని కారుస్తూ చెప్పింది కమలాంబాళ్.

(మూండ్రిల్ ఎదు? 1924.)


వి. పండిత విశాలాక్షి అమ్మాళ్ (1884-1926) తొలి తమిళ కథకుల్లో వొకరు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి వైధవ్యాన్ని మోసిన విశాలాక్షి అమ్మాళ్‌కు తమిళం, ఇంగ్లీషు, సంస్కృతం, కన్నడ భాషల్లో మంచి ప్రావీణ్యం వుంది. సంగీతం కూడా బాగా వచ్చు. 1902లో వి. నటరాజ అయ్యర్ సంపాదకత్వంలో నడుస్తున్న ‘లోకోపకారి’ పత్రికలో సహాయ సంపాదకురాలిగా చేరి, 1906లో సంపాదకురాలు అయింది. వొక తమిళ పత్రికకు మొదటి మహిళా సంపాదకురాలు ఆమే! ‘హితకారిణి’ పత్రికకు కూడా సంపాదకత్వం వహించింది. దాదాపు 30 నవలలు, కొన్ని కథలు రాసింది. ఆమె మొదటి నవల ‘లలితాంగి’ 1902లో ప్రచురించబడి 2000 కాపీలు అమ్ముడుపోయింది.