మా లిఖ

(వెల్చేరు నారాయణ రావు గారి గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. ఈ నాటి తెలుగు సాహితీ పరిశోధకులలో అగ్రశ్రేణిలో వారు.
ఈ వ్యాసం “అహంభావ కవి”నని చెప్పుకుంటూ ఆనాటి తెలుగు కవిత్వాన్ని తల్లకిందులు చేసిన శ్రీ పఠాభి కవిత్వం గురించి.
అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్‌ వచ్చే వారంలో నెల్లూరులో జరగబోతున్న సభలో శ్రీ పఠాభిని “ప్రతిభామూర్తి”గా గుర్తించి సన్మానించబోతున్న నేపథ్యంలో శ్రీ నారాయణ రావు గారు ఈ వ్యాసం తయారుచెయ్యటం సమయోచితం. కవిత్వం మీద ఆసక్తి ఉన్నవారికి చాలా ఉపయోగించే విశేషాలు కన్పిస్తాయిక్కడ.)

పద్యాలకి అర్థాలే చూసే అలవాటు నించి పద్యాలు చేసిన మాటల్ని పట్టుకునే పనిలో పడుతున్నారు విమర్శకులు. పఠాభిని మరోసారి గుర్తించడం అందుకు గుర్తుగా భావిస్తున్నాను.

ప్రపంచం భాషని తయారుచేస్తుంది. ఆ భాషని జాగ్రత్తగా పట్టుకుని పద్యాలు రాసేవాళ్ళు కవులు. ఆ పని చెయ్యడానికి లోకజ్ఞత అవసరం. నన్నయ్యగారు తనని గురించి చెప్పుకున్న గుణాల్లో ఇదొకటి. లోకాన్ని వొదిలేస్తే కవిత్వం లేదు. సత్యనారాయణ గారన్నారు లోకమ్ము వీడి రసమ్ము లేదు అని.

కాని, భాష లోకంలో వస్తువే. ఎటొచ్చీ, మామూలుగా, కవులు కాని వాళ్ళు లోకం ద్వారా భాష తెలుస్తుందనుకుంటారు. ఆ మాట మనందరికీ నిజమే. కాని, కవికి భాష ద్వారా లోకం తెలిసే ఒక ప్రత్యేక స్థితి వుంది. అంటే, భాషే లోకాన్ని తయారుచేస్తుందని తాత్వికుడికి ఆలోచన వల్ల తెలిస్తే, కవికి ఆచరణ వల్ల తెలుస్తుంది. భాష లేకపోతే లోకజ్ఞానం లేదనీ భాషాతీతంగా లోకాన్ని గ్రహించలేమనీ తాత్వికుడు బోధపరుచుకుంటే, కవికి ఆ సంగతి ఒక ప్రత్యేక రకమైన కవిత్వం చేసేటప్పుడు అనుభవంలోకి వొస్తుంది.

అయితే, కవులందరికీ ఈ అనుభవం వుంటుందని చెప్పలేం. భాషారహితంగా లోకాన్ని గ్రహించే అవకాశం మామూలు మనుషులకు లేనట్టే మామూలు కవులకీ వుండదు. అలాంటి వాళ్ళు రాసే కవిత్వానికి ప్రతిపదార్థం చెప్పుకోవచ్చు. వాళ్ళ మాటలకి పారదర్శకత్వం వుంటుంది. అంటే, పారదర్శకత్వం తప్ప ఇంకే గుణం వుండదు.

ఇంకో మాటల్లో చెప్పాలంటే మాటలు భాష కదా, ఆ మాటలకి అర్థాలు కూడా భాషే. అర్థాల భాషని పద్యాల భాషలోకి ఈ కవులు పరమవిధేయంగా పరివర్తనం
చేస్తారు. ఈ పరివర్తనానికి నిశ్చితమైన నియమాలూ, నిర్ణీతమార్గాలూ వున్నాయి. వాటిని ఈ కవులు అనుసరిస్తారు. కానీ ఈ నియమాలు కూడా భాషే. వాటికి వేరే పేర్లు పెడతారంతే ఛందస్సనీ, అలంకారాలనీ, ఇలా.

లోకంలో వున్న అర్థాల భాషని వొదిలేస్తే భాషచేత స్వతంత్రంగా మరో అర్థప్రపంచాన్ని నిర్మింపచేసుకోవచ్చు. ఇక్కడ స్వతంత్రంగా అంటే సర్వతంత్ర స్వతంత్రంగా అని అర్థం కాదు. భాషాగత స్వతంత్రంగా అని అర్థం.

భాష నిర్మించిన ఈ ప్రత్యేక ప్రపంచం అంతకు ముందు లేని ఒక కొత్త జాగా. ఇది భాష వల్ల అతఃపూర్వం తెలియబడలేదు. కాని ఒకసారి ఈ జాగాకి అస్తిత్వం ఏర్పడిన తరవాత దీనికి భాషని వర్తింపజెయ్యొచ్చు. ఆ పని మళ్ళీ మళ్ళీ చేస్తే ఆ జాగా మాసిపోయే ప్రమాదం ఉంది. కాని చాలా మందికి ఆ జాగా దొరకదు కాబట్టి ఈ ప్రమాదం నిజం అవదు.

బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
సహితమహామహీభరమజస్ర సహస్రఫణాళిదాల్చి దు
స్సహతరమూర్తికిన్‌ జలధిశాయికి పాయక శయ్యయైన య
య్యహిపతి ….

అని నన్నయ్యగారు రాసినప్పుడు ఆయన ఈ భాష వల్ల కల్పించిన జాగాల్లో వున్నది ఆదిశేషుడనీ, అనంతుడనీ మనకు పురాణాల్లో తెలిసిన పాము కాదు. అంతవరకూ మాటల్లో చెప్పబడని ఒక మహాసరీసృపరహస్యం. ఆ రహస్యగ్రహణం ఆ పద్యానికి ఒక మంత్రశక్తిని ఇచ్చింది. అందుకే ఆ పద్యం వల్ల ఆ పాము దొరికింది.

యజమానప్రమదా వికస్వరభగన్యస్తాశ్వదీర్ఘస్మర
ధ్వజదండంబగు నశ్వమేధమఖతంత్రంబున్నిరీక్షించి య
క్కుజనుండొత్తిలి నవ్వె ….

అని శ్రీనాథుడు రాసినప్పుడు కూడా ఆ మాటల మధ్యనా, ఆ మాటల మాటునా వున్న జాగానే పద్యం చెప్పేది. అది అందుకోలేని కుజనుడు ఛీ అని నవ్వుతాడన్నమాట.

అర్థాలతో పద్యాలు చెప్పీ చెప్పీ, లోకానికీ నిజానికీ మధ్య దూరం పెరిగిపోతోందన్న దశలో కొందరు కవులు ఆ భాషని బతికించడానికి ఇలాంటి పద్యాలు రాస్తారు. అంటే లోకంలో  భాషని వాడడం మానేసి భాషలో మరో లోకాన్ని సృష్టిస్తారు.

పింగళి సూరన్న ఈ పని చేసాడు. సరిగ్గా తనకి ఏం అవసరం వొచ్చి ఈ పని చేసాడో తెలియదు కాని భాషకి వాస్తవాన్ని సృష్టించే శక్తి వుందని ఓ కథలో
కళాపూర్ణోదయంలో చెప్పి అంతకన్న బలంగా మనకి తెలిసిన మాటలతోనే ఒకేసారి (ఒకదాని తరవాత మరోటిగా) రెండు కథలు ఒకే మాటల్లో చెప్పాడు
రాఘవపాండవీయంలో.

ఒకరకంగా ఈ పనే చేసారు పఠాభి. కయిత నా దయిత లోనూ, పన్‌చాన్‌గమ్‌ లోనూ ఆయన రాయని జాగాలు మనకి కవిత్వం అంటే ఏమిటో చెప్తాయి. కవిత్వం ఏది కాదో కూడా చెప్తాయి.

ఇప్పుడు పఠాభి రాసిన ఈ పద్యాన్ని ఇక్కడ మళ్ళా రాసి చూపిస్తే చాలుననుకుంటాను. చూపిస్తే అని ఎందుకంటున్నానంటే ఈ పద్యం కంటితోనూ, గొంతుకలో చప్పుళ్ళు జ్ఞాపకం తెచ్చుకుంటున్న మనసుతోనూ చదవాలి. పైకి చదవడం వల్ల పద్యానికి నష్టాలున్నాయి పద్యంలో వున్న జాగాల్ని శబ్దం మింగేస్తుంది.

చయినా యువతి

ఓ సుందరమగు చయినా
దేశంపు మత్స్య నయనా!
నీ యందము వినుతింపగ
సాధ్యంబ బ్రహ్మ కయినా?

జ్యోత్స్నాద్రవంపు టలయా,
లేకున్న వింత కలయా,
నీ నవ్వు? నిత్యనూతన
లావణ్య శోభ నిలయా!

రక్తాధరముల పయినా
నోరార ముద్దు లియనా?
శూన్యాంతర శశిరీతి, మ
దీయాంతరంగ శయనా!

నీ పల్కులు శుక రుతముల్‌
నిన్‌ సోకగ మారుతముల్‌
మూర్ఛిల్లునహా! నీ నయ
నా లర్థనిమీలితముల్‌.

ఓ సుందరమగు చయినా
దేశంపు మత్స్యనయనా!
నా ముంగల నిలుచుంటివి
దివ్యాప్సరస్సఖియనా!

చివరి చరణం పూర్తయ్యేసరికి ఒక అనిదంపూర్వమైన చయినా యువతి ముందు నిలబడుతుంది. ఆవిడ వట్టి మాటలమూట.

ఎప్పుడు రాయడం మానెయ్యాలో తెలిసినవాడు పఠాభి అని ఆయన్ని మెచ్చుకునేవాణ్ణి ఇన్నాళ్ళూ. ఎక్కడ రాయకుండా వొదిలెయ్యాలో తెలిసినవాడు పఠాభి అని ఇప్పుడు బోధపడుతోంది.

(శ్రీ నారాయణ రావు గారు ఇంతవరకు రాసి ఇంతకన్న ఎక్కువ రాయాల్సిన పనిలేదన్నారు. పై పద్యాన్ని ఆయన కొంత వివరించి చెప్పాక అర్థమైంది ఎందుకు అది నిజమో. ఐతే “ఈమాట” పాఠకులకి ఆ అవకాశం లేదు కనక ఇంకొంచెం పొడిగించి ఈ పద్యంలో విశేషాల్ని వివరించమని ఆయన్ను కోరితే సందేహిస్తూనే, బహుశః మొహమాటం కొద్ది కొంత రాసి ఇచ్చారు. ఈ పద్యంలోని విశేషాలన్నీ అర్థమయ్యాయని అనుకున్న వాళ్ళు ఇకముందు చదవక్కర్లేదు. మిగతా వాళ్ళు కింది భాగం కూడా చదివితే ఎన్నో రహస్యాలు తెలుస్తాయి.)

పఠాభి వర్ణక్రమంలో కొత్త పనులు చేస్తాడని ఆయన రాతల్ని కళ్ళతో చూస్తేనే కాని తెలియదు. మనం మామూలుగా రాసే చైనా ఆయన రాతలో చయినా అవుతుంది. ఆ రాత వల్ల ఏమయిందో పైకి చదవడం వల్ల తెలియదు. ఆ చరణంలో క్రమంగా ఉన్న “యినా” మాటలు మధ్యలో ఉన్న మాటను పక్కకి నెట్టి “నయనా”ని కూడా “నయినా”గా మార్చి ఒక మెత్తని పక్కని పరుస్తాయి. అలంకారికులు దీన్ని శయ్య అన్నారని చెప్పడం నా ఆలోచన సమర్థించుకోవడానికి సాకు మాత్రమే. నిజానికి వాళ్ళ శయ్యకి ఇక్కడి పక్కకి ఏమీ పోలిక లేదు. ఈ మాటల్ని ఇంకా ఎక్కువగా వాడితే పక్క మరీ మెత్తనిదైపోతుంది. ఆ పని తెలుగు కవులు చాలా సులువుగా చేస్తారు.

ఆ తరవాత మీ ఊహలు కాస్త వొదులు చేసి నెమ్మదిగా చదవండి. మొదటి చరణానికీ  రెండో చరణానికీ మధ్య ఏం జరుగుతోందో ఊహించుకుని రెండో చరణంలో ద్రవం అనే మాట ఏం చేస్తోందో చూడండి. జ్యోత్స్నని ద్రవంతో పోల్చడం ఒక నవ్యత అని సరిపుచ్చుకోకూడదు. ఇక్కడి ద్రవీకరణ వెన్నెలకి కాదు, మనస్సుకీ, శరీరానికీ. ఇంకొంచెం స్వేచ్ఛగా ముందుకు వెళితే అల, కల, నిలయాలలో మాటలు ఊపే ఉయ్యాల వేపు మనస్సు మళ్ళుతుంది.

ఇక్కడ ఆ అమ్మాయి నవ్వును గురించిన ప్రసక్తి ఉంది. ఈ నవ్వుకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది.

మూడో చరణంలో ఆ అమ్మాయి పక్కమీదే కాదు. మీ అంతరంగంలో పడుకుంటుంది. అంతవరకూ శూన్యమైనది ఆకాశం కాదు అంతరంగం.

పింగళి సూరన్న మణితాన్ని విశేషమైన ధ్వనిగా ఊహించాడు. గురజాడ అప్పారావు బిల్హణీయంలో విలాసరతులతో సంబంధించిన స్త్రీ కంఠస్వరంలో శబ్ద ప్రమాణాన్ని దర్శించాడు. ఈ చరణంలో శుకరుతము అలాంటిది. అందుకే అక్కడ ఆమె నయనాలు అర్థనిమీలితములు.

ఈ నాలుగు చరణాలు అయ్యేసరికి చయినా యువతి దూరంగా ఉన్న అమ్మాయి కాదు. ఈ చరణాల్లో చాలా జరిగింది. అందుకే ఆ అమ్మాయి సఖి అయింది. దివ్యాప్సరసఖి అయింది.

ఈ దివ్యమైన మాటని తరవాత కవులు చవకపరచటం వల్ల దీని అర్థం పలచబారింది నిజమే, కాని అందుకు పఠాభి బాధ్యుడు కాదు. నిఘంటువు మాటలకి అర్థాలు ఇస్తుంది. ఆ అర్థాల్లో ఇరుక్కుపోతే అర్థం కాని పద్యాల్లో ఇది ఒకటి.


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...