“బ్రహ్మాండంగా వుందిరా బావా చుట్ట! ఇంత బాగా చుట్టగలిగినందుకయినా నువ్వు వొకసారి దాన్ని తగలెయ్యాలి.” అన్నారు చౌదరి మిత్రుడు అందించిన చుట్టను పరీక్షిస్తో.
“వొద్దులేరా అబ్బీ! ఉన్న అలవాట్లతోటే చస్తుంటే ఈ తగలాటం కూడా దేనికి?” అన్నారు శర్మ నవ్వి.
“ఉన్న అలవాట్లుట! ఏవిఁట్రా నీకు ఉన్న అలవాట్లు? కాఫీ తాగవు. పేక కాదు గదా చదరంగం కూడా ఆడవు. ఇహ ఏమిటి నీకు ఉన్న అలవాట్లు?”
“పోనీలే! అందువల్ల వొచ్చిన నష్టం ఏం లేదుగా?”
“లాభమూ లేదుగా?”
నవ్వి వూరుకున్నారు శర్మ.
ఊరి మధ్యనున్న రావిచెట్టు దగ్గరున్న రచ్చబండ అది. ప్రతి సాయంత్రమూ ఆ మిత్రులిద్దరూ అక్కడ బైఠాయించి వూసులాడుకుంటూవుంటారు వీలైనప్పుడల్లా, ఆ రోజులాగే. కరణం జగన్నాథం కూడా వొచ్చి ఆ మిత్రుల సంభాషణ వింటూ, తనూ పాల్గొంటూ వుంటాడు.
శర్మగారూ చౌదరిగారూ అరవయ్యో పడిలో వున్నవారు. అయినా దృఢకాయులు. ఆ ఇద్దరియందూ వూరిలో అపరిమితమయిన గౌరవమూ విశ్వాసమూ వున్నాయి. శర్మగారు ఆ వూరువొచ్చి స్థిరపడి అయిదారేళ్ళకన్నా ఎక్కువ కాలేదు. ఆయన గ్రాడ్యుయేటు. ప్రభుత్వం చాలించమన్నదాకా ఉద్యోగం చేసి, పిల్లల తాలూకు శుభకార్యాలన్నీ అయిపోయి, వాళ్ళూ జీవితంలో స్థిరపడిపోగానే ఆయనా భార్యా ఈ వూరు జేరుకున్నారు. అక్కడ వారికి పిత్రార్జితమయిన భూమి వుంది. దాని ఆలనా పాలనా చూసుకుంటో, నలుగురికీ చాతనయిన సాయం చేస్తో అక్కడ వుండిపోయారు. సాయం మాట వొచ్చింది గనక చెబుతున్నాను. వూళ్ళో ఎవరికి ఏ కష్టం వొచ్చినా స్వంత పనిలా బాధ్యత వహించి చేసేవాడు. పైగా ఆయనకున్న నియమాలూ మంచి నడవడీ మూలానా, వూళ్ళో అందరికీ తలలో నాలుకయిపోయాడాయన.
చౌదరిగారి తరహా వేరు. తన పనులేమిటో తనేమిటో తప్ప ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోని తత్వం ఆయనది. అయితే ఎవరయినా సాయం కోరి వస్తే కాదని ఎరుగడు. శర్మగారూ ఆయనా ఆబాల్య స్నేహితులు. ఇంటర్మీడియట్తో చదువు ముగించి వ్యవసాయంలోకి ప్రవేశించాడాయన.
“అయితే బావా, ఆ తిరుపతాయిగాడి ఖర్మ అంతేనంటావా? మంచి రోజులు వొస్తాయంటావా?” అన్నారు చౌదరి.
“వాడి దయ!” అన్నారు శర్మ ఆకాశం వేపు చూపించి.
“అంతేనంటావా?”
“అలాగేననిపిస్తోంది. రోగమా మాయదారిది. దానికి తోడు వీళ్ళకి మూఢనమ్మకాలు జాస్తి. మనం ఎంత చెప్పినా వింటున్నంతవరకే గాని ఆ తరువాత మామూలే. ఎలా బాగుపడతారో వీళ్ళు!”
“అయితే దయ్యాలూ అవీ బూటకాలేనంటావా అన్నయ్యా?” అన్నాడు కరణం జగన్నాథం.
“అంతేరా అబ్బీ! మన మనసే అన్నింటికీ కారణం!”
నవ్వారు చౌదరి.
చౌదరి ఏదో అనబోయి అల్లంత దూరాన ఉరుకులూ పరుగుల్తో వొస్తోన్న వ్యక్తిని చూసి ఆగిపోయారు. అతనే తిరపతాయి. అతన్ని చూడంగానే, “మళ్ళీ నీకు పని తగిలిందిరా బావా!” అన్నారు చౌదరి. శర్మ పైపంచ దులిపి భుజాన వేసుకుని గట్టుదిగి నిలబడ్డారు.
రోజుతో వొచ్చి ఆగిన తిరుపతాయి, “ఇంటిదానికి మల్లా ముంచుకొచ్చింది బాబో! మీరు రావాల…” అన్నాడు.
శర్మ అతడి భుజం తట్టి, “పద” అన్నారు. ఇద్దరూ కదిలారు.
కనుమరుగైందాకా వారివంకే చూస్తూ కూచున్న జగన్నాథం నిట్టూర్చి, చౌదరిగారి వయిపు తిరిగి, “ఏం జీవితాలు!” అన్నాడు.
“ఏం కథ?” అన్నారు చౌదరి.
“వాళ్ళ సంగతే. ఒకరు సర్వ సద్గుణ సంపన్నులూ పరోపకార పారీణుడూను. తిరపతాయి సంగతి చెప్పనక్కర్లేదు కదా? మూఢ నమ్మకాలకీ మూర్ఖత్వానికీ కొండగుర్తు.”
చుట్ట కొన కొరికి ఉమ్మేసి చుట్ట వెలిగించుకుంటూ, “సద్గుణాల పుట్ట అయిన మనిషి ఉంటాడంటావా?” అన్నారు చౌదరి.
“ఎందుకుండరు? ఉదాహరణకి మా అన్నగారి సంగతే తీసుకోండి. ఆయన్లో పగవాడైనా దుర్గుణాన్ని వేలెత్తి చూపగలడా?”
“దుర్గుణం వుంది అని ఎవరికీ తెలియక పోవచ్చును గదా?”
“అంటే? నాకు తెలియని దుర్గుణం ఆయన్లో ఉందంటారా? ఛస్తే వొప్పుకోను.”
“అది తెలివయిన మాట కాదు. అసలు దుర్గుణం అంటే అర్థం ఏమిటి? చెడ్డ పనులు చేసే గుణం అనే కదా? చెడ్డ పని ఒకసారి చేసినా పదిసార్లు చేసినా ఆ వ్యక్తి లోటు మనిషిగానే వ్యవహరింపబడుతాడు!”
“అలాంటి పని చేశాడంటారా ఆయన? నాకు నమ్మకం కుదరడం లేదు!” అన్నాడు జగన్నాథం ఆశ్చర్యంతో.
చుట్టపొగ వదిలి నుసి రాలుస్తో చిన్నగా నవ్వారు చౌదరి. వెలుగు మాసి చీకటి పుడుతోంది. ఇళ్ళకు తిరిగిన శ్రామిక జనం ఆయన్ను చూసి దండాలు పెడుతో సాగిపోతున్నారు. ఒక్క క్షణం పాటు ఆయన మౌనంగా వూరుకుని, “ఒక సంఘటన చెబుతాను విను. దీని మూలాన శర్మలో లోటు వుందని చెబుతున్నాననుకోకు. వాడూ మనిషేగా మరి.
“అప్పట్లో నేనూ శర్మా గుంటూర్లో ఇంటర్ వెలిగిస్తున్నాం. చిన్నప్పటినుంచీ స్నేహితులం కావడం మూలాన కలిసి బ్రాడీపేటలో ఓ గది తీసుకుని వుండేవాళ్ళం. వాడు ఓ సదాచార పరాయణురాలయిన పూటకూళ్ళమ్మ యింట్లో భోజనం చేసేవాడు. నేను మిలిటరీ హోటల్లో భోంచేసేవాణ్ణి.
మేం వుంటున్న యింటి యజమానురాలు శాకాహారి కాదు. అయినా శర్మకు అభ్యంతరం కలిగేలా ఏనాడూ ప్రవర్తించకపోవటాన మేం మరో చోటికి పోవల్సిన అవసరం కలగలేదు. ఆవిడకి బంగారపు బొమ్మలాంటి కూతురు వుండేది. రోహిణి ఆ అమ్మాయి పేరు. అప్పటికే వివాహితుడు కావటం మూలానా, పైగా పరస్త్రీని చూడకూడదనే నియమం కలవాడు కావటం మూలానా శర్మ ఆ అమ్మాయి సంగతే పట్టించుకునేవాడు కాదు. నాకు మాత్రం ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నరాలు జివ్వుమనేవి. ఎలాగయినా సరే ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనిపించేది. రోజుకు నాలుగయిదు సార్లయినా ఆ అమ్మాయి నాకంటపడేది. ఆ సమయాన ఏదో పొడిచేద్దామని కూచున్నవాడిని కాస్తా భయంతో బిగుసుకుపోయి తెల్లమొహం వేసేవాడిని. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు ఇది కాదు పద్ధతి అనుకుని శర్మతో అన్నాను, ‘రోహిణిని చూశావుగదరా బావా?’ అని.
‘ఆ’ అన్నాడు వాడు నవ్వి.
‘బావుంటుంది కదూ?’
‘ఆ’
‘నాకు ఆ అమ్మాయిని చేసుకోవాలని వుందిరా.’
దానికి వాడు చెప్పిన సమాధానం విని తెల్లబోయాను. ‘కొందరు స్త్రీలను చూసి ఆనందించాలేగాని దగ్గిర చేసుకుందామనుకోకూడదురా బావా! ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుని నువ్వు సుఖపడలేవు!’ అన్నాడు వాడు. వొళ్ళు మండిపోయింది నాకు. చూసి ఆనందించటానికని కొందర్నీ, పెళ్ళి చేసుకోవటానికని కొందర్నీ సృష్టించాడా విధాత? వెధవ సిద్ధాంతాలూ వీడూనూ అనిపించింది.
నాలుగయిదు రోజులు గడిచాయి. ఆ రోజు కాలేజీకి పోతుండగా మా నాన్న దగ్గర్నుంచి ఉత్తరం వొచ్చింది, ఓసారి వొచ్చిపొమ్మని. వెళ్ళాను. మామూలు పనే, పెళ్ళికూతురు అంటూ ఓ పిల్లని ఖాయం చేసుకోడానికి. ఎవరూ నచ్చలేదు నాకు. తిరిగి గుంటూరు జేరుకున్నాను.
మా గదిముందు బండి దిగి లోపలకు ప్రవేశించేసరికి ఎదురయిన దృశ్యం నన్ను ఆశ్చర్యపోయేలా చేసింది. లావుగా పొట్టిగా వున్న వో ముసలమ్మ మూట సర్దుకుంటూ, ‘రూపాయివ్వండి!’ అంటోంది. శర్మ వళ్ళంతా చెమటలు దిగజారిపోతున్నాయి. తడబడుతోన్న గొంతుతో, ‘బయటకు పద, ఇస్తాను’ అంటున్నాడు. ముసల్ది లేచి గుమ్మందాకా వెళ్ళింది. వాడు గది తాళం చెవులు తీసుకుని, ‘ఏమిట్రా?’ అంటోన్న నా మాటలు వినిపించుకోకుండా బయటికి నడిచాడు. చేతి సంచి అక్కడ పడేసి నేనూ వాడితోపాటు యివతలికి వొచ్చాను. వాడు ముసలిదానికి రూపాయిచ్చాడు. ముసల్ది ఆ నోటు రొంటిన దోపుకుని, ‘ఈసారొచ్చేతలికి పాత కోకియ్యాల’ అనుకుంటో వెళ్ళిపోయింది. నాకేమీ అర్థంకాలేదు.
వాడు గదికి తాళంవేసి, నా భుజం మీద చేయివేసి భారంగా నిశ్వసించి, ‘అలా ఎక్కడికయినా పోదాం పద’ అన్నాడు వొణుకు తగ్గని గొంతుతో. మనిషి బాగా డీలా పడిపోయాడు. మా గదికి దగ్గర్లోనే చిన్న పార్కులాంటిది వుంది. ఇద్దరం పోయి అక్కడ ఓ మూలగా కూచున్నాం. రోజటం తగ్గాక, ‘ఏం జరిగిందిరా?’ అన్నాను.
‘ఖర్మ. లేచిన వేళావిశేషం!’ అన్నాడు వాడు నెత్తి కొట్టుకుంటూ.
‘చెప్పరా బాబూ! ఎవరా ముసిల్ది?’ అన్నాను.
వాడు బాగా చలించిపోయాడన్నందుకు నిదర్శనంగా నయనాలు కూడా చెమర్చాయి. అద్దుకుని, ‘చెబుతాను’ అన్నాడు. నేను చెవులు రిక్కించుకు కూచున్నాను.
‘పొద్దున మామూలు ప్రకారం చదువుకుంటో కూచున్నాను గదిలో. ఒక అరగంట గడిచిందేమో… ఆ ముసల్ది “బాబూ” అంటో వొచ్చి గుమ్మంలో నిలబడింది. “ఇక్కడేం లేదు ఫో” అన్నాను. అంతటితో వొదలకుండా లోపలకు వొచ్చిందది. నాకు వొళ్ళు మండిపోయి కసురుకున్నా వినకుండా నేలమీద కూచుని, “అలా కసురుకోకండి బాబయ్యా! నా దగ్గిర బ్రెమ్మాండమయిన మందులున్నాయి” అన్నది.
అంత కోపంలోనూ నవ్వొచ్చింది నాకు. ఓ పట్టాన వొదిలేట్టు కనపడలేదు నాకది. కనీసం కాసేపు తమాషా చేద్దామనుకున్నాను. “ఏం మందులున్నాయంటావు?” అన్నాను.
“మారాజు! మీ దొడ్డబుద్ది నాకు తెలవదూ… అన్ని రరకాల మందులూ వుండాయి,” అని రహస్యం చెబుతోన్నట్లు మెల్లిగా, “వసీకరణ వుంది వసీకరణం” అన్నది.
“ఎవర్ని వశం చేస్తుందంటావు?” అన్నాను.
“ఎవర్తెనైనా సరే బాబయ్యా!” అన్నది.
“ఒక అమ్మాయి వుంది. ఆ పిల్ల వశమవుతుందా?” అన్నాను.
“చిటికెలో అవుద్ది!” అని సంచిలోంచి ఓ పొట్లం తీసింది. “మీరు నాకేటీ యియ్యొద్దు. వాడినాక గుణం సూబెడితే యియ్యండి.” అన్నది.
“ఏం చెయ్యాలంటావు?” అన్నాను.
“సెబుతాను… ఆయమ్మ పేరేటి?” అన్నది.
“రోహిణి” అన్నాను చటుక్కున.
“ఎక్కడుంటారు?”
“ఏక్కడోనా? పక్క గదిలో.”
“ఎన్ని సమత్సరాలుంటయి?”
“పద్దెనిమిది లోపు.”
ఆ ముసిల్ది ప్రశ్నలు ఆపేసింది. పొట్లం నా చేతులో పెట్టి కాసేపు ఏదో గొణిగింది. ఆ తరువాత, “ఆయమ్మను వొంటరి ఏల తల్సుకుని ఈ పొట్టంలోంది మూడుసార్లు అగ్గిలో ఎయ్యాల. మూడోపాలి ఏసేతలికి ఆయమ్మ నీ సరసనుంటది.” అన్నది.
ఈ తమాషా ఇక చాలుననిపించింది. పొట్లం బల్లమీద పడేసి, “సరే పోయిరా!” అన్నాను. ఆ ముసిల్ది మూట కట్టేసుకుని, “నీ పేర దురగమ్మ పూజ సేయించాల. ఓ రూపాయియ్యి” అన్నది.
నాకు వొళ్ళుమండి పొట్లం దానిమీద విసిరికొట్టి, “తీసుకపో నీ పొట్లం!” అన్నాను కోపంగా.
“అలాగంటారేటండయ్యా?” అన్నది జాలిగా.
“అంతే. ఫో అవతలికి!” అన్నాను.
“మందు కావాలంటారుగా?”
“అఖ్ఖర్లేదు. ఫో!”
ఆ ముసల్ది వొక్క క్షణం వూరుకుని, “రోహిణమ్మగారు వొశం అవుతారని మందిస్తే డబ్బియ్యనంటారా పూజకి! అంతటోరు వొశం కావాలంటే చులకనా?” అన్నది తారస్థాయిలో.
ముచ్చెమటలు పోశాయి నాకు. ఆ మాటలు పక్క గదిలోకి వినబడితే? పరువు పోవటానికి తోడు వొళ్ళు వాలికలవుతుంది. ఎంత అప్రదిష్ట! సొరుగులో వున్న రూపాయి తీసి, ‘బయటికి పద, ఇస్తాను’ అన్నాను. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే!’ అని ముగించాడు వాడు.
తెల్లబోయాను నేను.
అప్పుడనిపించింది. ఎంత మంచి మనిషి అయినా వాడిలోనూ బలహీనతలున్నాయని. రోహిణి ఎడల వాడిలో అంతర్గతంగా వున్న వాంఛ అలా బయల్పడి అపహాస్యం పాలయింది. అది చెడు కాదంటావా?” అని ముగించారు చౌదరి.
కరణం జగన్నాథం జవాబు చెప్పలేదు. చీకటి పడిపోయింది బాగా. చందమామ పసిపిల్లాడిలా నవ్వుకుంటో పైకి వొస్తున్నాడు. ఇళ్ళల్లో దీపాలు వెలిగాయి. పక్షుల కూజితాలు సద్దుమణిగాయి. ఆ నిశ్శబ్దంలోంచి మధ్య మధ్య పశువుల అంబారవాలు వినవస్తోన్నాయి సౌమ్యంగా, నెమ్మదిగా.
నిట్టూర్చి సన్నగా నవ్వాడు జగన్నాథం. వొంచిన తల ఎత్తి చౌదరిగారి వంక చూసి, “బావుంది.” అన్నాడు. అర్థమైనట్లుగా నవ్వారు చౌదరి.
“నీ భావం కూడా సబబయినదే జగన్నాథం! వాడిమీద మీరు చూపుతోన్న గౌరవమూ అభిమానమూ నాలో అంతర్గతంగా కలిగించిన ఈసు వలన ఈ సంఘటన నీకు చెప్పానేమో? మరి, నేనూ మనిషినేగా?”
జగన్నాథం తెల్లబోయి ఆయనవంక చూశాడు.
(యువ ఉగాది సంచిక – ఏప్రిల్, 1962)