ప్రతీ మనిషికీ కొన్ని అభిరుచులుంటాయి. వీటిలో చాలామటుకు ఏ ప్రయత్నాన్ని, పరిశ్రమని కోరనివి. సహజాతమైనవి. వినోదం, కాలక్షేపం వీటి ప్రధాన లక్షణాలు. కొందరు వీటినే శ్రద్ధగా గమనించుకుంటారు. అదనపు సమయాన్ని వెచ్చించి, ఈ అభిరుచులకు పదునుపెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. చాలా కొద్దిమంది మాత్రం మరొక్క అడుగు ముందుకువేస్తారు. సహజాతమైన అభిరుచులతో తృప్తిపడకుండా, తమకు అలవాటు లేని, నేర్చుకునేందుకు తేలిక కాని అభిరుచులను ప్రయత్న పూర్వకంగా అభివృద్ధి చేసుకుంటారు. ఈ స్థాయిలలో హెచ్చుతగ్గులు లేవు. కాని, వినగానే, చూడగానే స్వభావసిద్ధంగా సహజంగా నచ్చే వాటి మీదే శ్రద్ధ చూపేవారు మేధోశ్రమ లేకుండా దొరికే తాత్కాలికమైన, ఉపరితలానుభవంతో తృప్తి పడతారు. అక్కడ ఆలోచనకు తావు లేదు. ప్రయత్నంతో సాధించుకొనే అభిరుచి అలా కాదు. ముందు దానిని పరిశీలించాలి. ఆసక్తి సడలకుండా నిలకడగా అభ్యసించాలి. దానిలోని ఆకర్షణ ఏమిటో, ప్రత్యేకత ఏమిటో వెతికి సాధించుకోవాలి. ఏ అభిరుచి అయినా ఇలాంటి పరిశ్రమతో ఏర్పడినప్పుడు, అందులో నైపుణ్యం సిద్ధించడంతో పాటు, సహజాతమైన అభిరుచులు కూడా పదునెక్కి, వాటితో ముడిపడ్డ ఏ అనుభవమైనా ఉపరితలాన్ని దాటి ఒక లోతైన అనుభవంగా మిగుల్చుకోవడానికి కావలసిన పరిశీలనాజ్ఞానం పెంపొందుతుంది. విశ్లేషణాత్మక సాహిత్యపఠనం ఇలాంటి ప్రయత్నపూర్వక అభిరుచి. అలా చదవడం వల్ల సాహిత్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగల శక్తి వస్తుంది. వాక్యాల సొగసు, పదాల ఆడంబరాన్ని దాటుకొని సంపూర్ణ పఠనానుభవం పాఠకులకు దొరుకుతుంది. సాహిత్యాభిమానులు, రచయితలూ చాలామంది ఈ ప్రయత్నపూర్వక శ్రమను పక్కకు నెట్టుకుంటూ పైపై మెరుగులతోటే తృప్తి పడడం వల్లనే మన సాహిత్యపు స్థాయి నానాటికీ పతనమవుతూ వస్తోంది. కళలో నైపుణ్యం సాధించడానికైనా, కళను ఒక నిండు అనుభవంగా ఆస్వాదించడానికైనా, సాహిత్యకారుడికైనా సాహిత్యాభిమానికైనా ఇలాంటి ఒక మెలకువతో కూడిన పరిశ్రమ తప్పనిసరి. అందుకని రచయితలు, ప్రత్యేకించి తెలుగు రచయితలు, అభ్యుదయమని పొరబడుతూ నెత్తికెత్తుకున్న కొత్తొక వింత పాతొక రోత స్వభావాన్ని, పరిశ్రమ చేయలేని తమ అలక్ష్యాన్ని వదిలి ప్రపంచసాహిత్యాన్ని, అంతకంటే ముఖ్యంగా మనకు సాహిత్య వారసత్వంగా అబ్బిన తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని, అభ్యాసంలా చదవడాన్ని అలవరచుకోవాలి. కూలంకషంగా, విమర్శనాత్మకంగా, కథాకథనవ్యాకరణ పద్ధతులను పరిశీలిస్తూ చదవాలి. అప్పుడు, నిజమైన సాహిత్యమంటే ఏమిటో బేరీజు వేసుకోవడానికి ఒక బలమైన కొలమానం దొరుకుతుంది. అలా, వ్యక్తిగత అభిరుచుల స్థాయి బలపడేకొద్దీ, భాషా సాహిత్యం కూడా బలోపేతమవుతూ ఉంటుంది. అలాకాని చోట ఆముదపు చెట్లనే మహావృక్షాలనుకునే భ్రమలో సాహిత్యలోకం మిగిలిపోతుంది.