మారిపోయిన చెన్నపట్నం: 1750-1796

ఇంగ్లీషు వర్తక కంపెనీవారు ఫ్రెంచి వర్తక కంపెనీవారు కర్ణాటక రాజ్యాలలో ఆధిపత్యం కోసం పోరాడుకొంటూ వున్న సందర్భంలో పాండిచేరిలోని ఫ్రెంచివారు 1746 సం. సెప్టెంబరులో చెన్నపట్టణమును పట్టుకొన్నారు. అక్కడి ఇంగ్లీషు కంపెనీ ఉద్యోగులను ఖైదీలుగా తీసుకొనిపోయారు. కంపెనీవారి ఆస్తిని మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఫ్రెంచి సైనికులను కాపలా వుంచారు. చెన్నపట్నములో వివిధ వృత్తులు చేసికొని స్వతంత్రంగా జీవించే ఇంగ్లీషుదొరలనుగానీ దేశీయులనుగానీ బాధించలేదు. వారి ఆస్తితో జోక్యం కలిగించుకోలేదు. అయినప్పటికి దేశీయులు కొందరు భయపడి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. చెన్నపట్టణములో పెద్ద దేశీయ వర్తకులను కొందరిని ఫ్రెంచివారు బుజ్జగించి పాండుచేరి వచ్చి వ్యాపారం చేసుకోవలసినదని ప్రోత్సహించారు.

చెన్నపట్టణం కోటకు ఉత్తరమున పెరిగియున్న నల్లవారి బస్తీలోని ఇళ్ళు పట్టణ రక్షణకు అడ్డుగానున్నవని ఫ్రెంచివారు వాటిని పడగొట్టివేశారు. అక్కడి ఇళ్ళు తెలుగువారివే చాలామటుకు. ఫ్రెంచివారు కోటను బందోబస్తు చేశారు. ఐరోపాలో ఇంగ్లాండుకు ఫ్రాన్సుకు రాజీనామా సంధి జరుగగా ఫ్రెంచివారు చెన్నపట్టణమును తిరిగి 21.8.1749 తేదీన ఇంగ్లీషు కంపెనీకి వప్పగించారు. ఇంగ్లీషు కంపెనీవారు 200మంది సైనికులతో మళ్ళీ చెన్నపట్నంలో ప్రవేశించారుగాని పూర్వము అక్కడనుండిన కార్యాలయములనన్నిటిని మళ్ళీ తీసుకొనివచ్చి రాజధాని బాగుచేసుకోడానికి మూడేళ్ళు పట్టింది.

పూర్వం చెన్నపట్నంలోని వర్తకస్థానముల రక్షణకోసం కట్టిన కోట అంత బలమైనది కాదు. అక్కడ ఇంగ్లీషు కంపెనీవారుంచిన సైనిక దళమున్నూ సమర్థవంతమైనది కాదు. లండన్ నగరములో జీవనంలేక తిరిగే అల్లరిమూకలోను ఆకతాయిజనాలలోను కొందరిని ఏరి పనివారికి జీతబత్తెములిస్తామని ఈ దూరదేశానికి సైనికులుగా తెచ్చేవారు. ఇంగ్లీషు రాజుగారి సైనికదళాలుగాని నౌకాదళాలుగాని చాలాకాలము వరకూ ఇండియాకు పంపేవారుకారు. ఆ కాలంలో సముద్రంలలో ఓడదొంగలు విజృంభించి, దోపిళ్ళు చేస్తూవుండినందువల్ల ప్రతి ఓడపైన ఫిరంగులతో ఆయుధపాణులైన నావికాదళములుండేవి. అవసరమైనప్పుడు రేవులో లంగరువేసిన ఆయోడల నావికాదళాలు కంపెనీవర్తకస్థానానికి కోటలోనివారికి సహాయం చేసేవి.

చెన్నపట్నం తూర్పు కోస్తాలో చాలా ముఖ్యమైన రేవుపట్నంగానుండేది. దేశంలో అన్నిప్రాంతాలలోను తయారైన మేలురకం నూలుబట్టలు రంగు అద్దకాలు ఇంకా తూర్పుదేశాల సరుకులు ఈ రేవునుండి సీమకు ఎగుమతి అయ్యేవి. పాండుచేరిలోని ఫ్రెంచి వర్తకులు తమ ముద్దవెండిని అమ్మడానికి చెన్నపట్నంలోని వెండిబంగారు షరాబు వర్తకుల ద్వారా వ్యాపారం జరిగించేవారు. సెంట్ ఆండ్రూస్ చర్చి ఫాదరీలు ఈ బేరాలు జరిగించేవారు.

చెన్నపట్నంలోని ఇంగ్లీషు కంపెనీ పరిపాలక సంఘానికి మంచి పరపతియుండేది. యుద్ధసమయాలలో కూడా నూటికి 8 చొప్పున వడ్డీకి ఎంత సొమ్మైనా సంపాదింపగలిగేవారు. చెన్నపట్నం జనాభా తెల్లదొరలు నల్లవారు కలిసి 40వేలు వుండేదని అంచనావేశారు. వ్యాపారం వల్ల కంపెనీకి సాలుకు 80వేల వరహాల ఆదాయం వచ్చేది.

చెన్నపట్నము ఫ్రెంచివారు నప్పగించిన తరువాత మరల రాజధాని నగరంగా రూపొందేటప్పటికి ఇంగ్లీషు కంపెనీ స్వభావములోను పట్టణ స్వరూపములోను కూడా గొప్ప మార్పులు వచ్చినవి. పూర్వం వర్తకవ్యాపారాలలో మునిగితేలే కంపెనీవారు భారతదేశ రాజకీయాలలో ప్రవేశించి దేశమునేలే నవాబుల-రాజుల ప్రభుత్వములో పలుకుబడి సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికప్పుడే దక్షిణాపథమునకు సుబేదారుడైన హయిదరాబాదు నవాబు దర్బారులో ఫ్రెంచివారికి మంచి పలుకుబడి కలిగినది. వారిమాట చెలామణి అవుతున్నది. అప్పుడు దక్కను సుబేదారైన సలాబత్ జంగు దర్బారులో మార్కీసు బూసీ దొరగారు గొప్ప పలుకుబడి సంపాదించి 1753 సం.లో ఉత్తర సర్కారు జిల్లాలలో ఫ్రెంచి పరిపాలన స్థాపించారు. ఫ్రెంచివారు 1758 వరకు మచిలీపట్నం కోటను కార్యస్థానంగా చేసుకొన్నారు. శ్రీకాకుళం వరకూ ఉత్తర సర్కారు జిల్లాలలో వారి పరిపాలన ప్రారంభమైనది. ఇంగ్లీషు కంపెనీవారుకూడా ఫ్రెంచివారిని అనుకరించి కర్నాటక నవాబు మహమ్మదాలీ వాలీజాకి సహాయముచేసే నెపముతో ఆయన రాజ్యములో పలుకుబడి సంపాదించడానికి ఎత్తువేశారు. చివరకీతడు ఇంగ్లీషువారి వలలో చిక్కి వారికి దాసానుదాసుడైనాడు.

1761 సం.లో అతడు తన ముఖ్యపట్టణమైన ఆర్కాటు వదలి చెన్నపట్నంలోని తిరువలిక్కేణిని ఆనుకొని చేపాకు సముద్రతీరమున కలశమహల్ నిర్మించుకుని అందులో కాపురం వుంటూ అన్నిటికి ఇంగ్లీషువారిమీద ఆధారపడినాడు. అతడు ఇంగ్లీషు దొరలకు పెద్ద జీతాలిచ్చి వుద్యోగులుగా నియమించేవాడు. కంపెనీదొరలకివ్వడానికి నిశ్చయించుకొన్న లంచాలకు వారిదగ్గర పుచ్చుకొన్న స్వల్ప ఋణాలకు లక్షలకొలది రూపాయలకు ఋణపత్రాలు వ్రాసియిచ్చేవాడు. ఇంగ్లీషు దొరల పేర నవాబు వ్రాసిన ఋణపత్రాలను కొనడము అమ్మడము ఒక పెద్ద వ్యాపారంగా సాగినది. ఋణము కోట్లకొద్ది పెరిగినది. అతడు చెంగల్పట్టును ఇంగ్లీషు కంపెనీవారికి 1763లో జాగీరుగా నిచ్చి మళ్ళీ దానిని వారివద్ద తాను కవులుకు తీసికొన్నాడు. అయితే అక్కడి శిస్తులు వసూలు చేసేటందుకు ఆ దొరలనే అధికారులుగా చేశాడు. వారు వసూలుచేసిన సొమ్మును వారికి రావలసిన బాకీక్రింద జమకట్టుకునే ఏర్పాటు చేశాడు. కంపనీవారికి సైనికవ్యయంక్రింద సాలుకి ఏడులక్షల వరహాలచొప్పున చెల్లించవలసిన సొమ్మును నవాబుచెల్లించలేక బకాయి పెట్టి జాగీరుజిల్లా అని ప్రసిద్దిచెందిన చెంగల్పట్టు జిల్లాను 1765లో కంపెనీకిచ్చాడు. అతని జీవనం నిమిత్తం రివిన్యూలో అయిదవ వంతు ఇచ్చే ఏర్పాటు జరిగినది. ఈ తికమక వ్యవహారాలలో పాల్గొన్న దొరలు లక్షలకొలది లంచాలు పుచ్చుకున్నారు. మద్రాసు కంపెనీ దొరలలో అవినీతి ప్రబలినది. కక్షలు పెరిగినవి. మళ్ళీ పార్లమెంటులో విచారణకు వచ్చినది. కోట్లకొలది ఋణము అబద్ధమని తేలినది.

1746 సం. నాటికి ఇంగ్లీషు వర్తకులు తెల్లజాతి సైనికులు కోటలోపలనే నివసించేవారు. పట్నం మళ్ళీ స్వాధీనమైన తరువాత 1750 నుండి క్రమక్రమంగా పెద్ద ఉద్యోగులందరూ చెన్నపట్టణమునకు పడమర ప్రక్కనున్న ’చౌల్ట్రీ ప్లెయిన్’ అనే చావడిమైదానములో తోటబంగళాలు నిర్మించుకొని నివసించడం ప్రారంభించారు. ఈ మైదానములో నేటి చేపాకు తిరువలికేన్ చింతాద్రిపేట రాయపేట నుంగంబాకం త్యేనంపేట ప్రాంతాలన్నీ చేరియున్నవి.

పూర్వం ఇంగ్లీషుదొరల విహారస్థలముగాయుండిన పరంగి కొండ అనే సెయింట్ తామస్ మౌంట్ ఇంగ్లీషు సైనికుల ఫిరంగి తుపాకి దళాలు రంగప్రవేశం చేశారు. పూర్వం కోటకుత్తరముగా పెరిగిన ‘జెంటూ టవున్’ అనే నల్లవాని బస్తీలో కేవలం దేశీయులు అందు ముఖ్యముగా తెలుగు కులాలవారు వివిధ వృత్తులవారు కాపురముండేవారు. ఇప్పుడు తోట బంగాళాలు నిర్మించడానికి గాని కోటలో గిడ్డంగులు కట్టుకోడానికిగాని శక్తిలేని ఇంగ్లీషుదొరలలో చాలామంది నల్లవారితోపాటు కొత్తగా పెరిగిన నల్లవారి బస్తీలో తమ కార్యాలయాలను పెట్టుకొని తమ వ్యాపారాలు జరిగించడం ప్రారంభించారు. ఈ కొత్త బస్తీ కోటకు కొంచెము దూరముగా ఇటీవల జార్జిటవును అని వ్యవహరింపబడుతూవున్న పేటలో పెరిగినది.

ఇంగ్లీషు దొరలు పూర్వం సంసారపక్షంగా జీవించేవారు. ఇప్పుడు డాబుదర్పాలు వహించి భోగవిలాసములకు దుబారాగా ఖర్చుపెట్టి జీవించటం ప్రారంభించారు. చెన్నపట్నంలోని దొరలు దొరసానులు పల్లకీలను గుఱ్ఱపు బగ్గీలనుపయోగించడము చాలామంది సేవకులను పెట్టుకోవడము సీమ సరుకులను భోగద్రవ్యములను సీమ సారాయమును విచ్చలవిడిగా వాడడము, విందులు నృత్యములు, వినోదములు జరపడము ప్రారంభించారు.

చెన్నపట్నం దొరల జనాభాలో ఉన్నత తరగతులవారు అభివృద్ధి చెందినారు. అందరికన్నా సైనికుల సంఖ్య బాగా పెరిగినది. 1746 సం.లో 12మంది సైనికోద్యోగుల క్రింద నాలుగు కంపెనీల సైనిక దళాలుండేవి. అది ఇప్పుడొక పెద్ద సైన్యముగా మారినది. దానికి 600మంది సైనికోద్యోగులు కావలసివచ్చారు. పూర్వము ఒక పెద్ద పల్లెటూరుగానుండిన చెన్నపట్న బస్తీ ఇప్పుడొక పెద్ద రాజధాని నగరమైనది. 1946 నాటికి అన్నిరకాల ఐరోపావారు కలిసి 400మంది యుండేవారు. ఇందులో 300మంది కోట రక్షణదళము (గ్యారిౙను) 30, 40 మంది ఉద్యోగులు, నౌకరులు 20మంది, (free inhabitants)గా స్వంతజీవనము చేయడానికి అనుమతిపొంది నివసించే దొరలు, వివిధ రకాల వ్యాపారాలు వృత్తులు చేసేవారు. నలభైమంది వరకు వచ్చిపోయే ఓడలకు సంబంధించిన తెల్లజాతి కెప్తానులు, ఓడ సిబ్బందివారు బవేరియా ప్రాంతాలకు కూడా వెళ్ళేవారు. ఈ తెల్లవారిలో సగముమంది అవివాహితులుగానుండేవారే. వివాహం చేసుకున్నవారిలో సగముమందికి మాత్రమే తెల్లదొరసానులు. తక్కినవారి భార్యలు కంతిరీ జాతివారే. కోటలోని తెల్లవారి మతాచారాలకు తోడ్పడడానికి కంపెనీవారు చాప్లెన్ అనే క్రైస్తవ మతాధికారిని నియమించేవారు. కంపెనీవారు నియమించిన సర్జన్ అనే వైద్యుడుండేవాడు.

చెన్నపట్నం వర్తక కంపెనీ ఉద్యోగులలో నలుగురు ఒక కార్యాలోచన సంఘంగానుండి వర్తకవ్యవహారాలు జరిగించేవారు. ఈ కౌన్సిలులో మొదటి సభ్యునికి ఏజెంటు అని పేరు. తరువాత గవర్నరన్నారు. అతనికి సాలుకు 300పౌనులు లేక నవరసుల జీతము. అతడు స్వంత వ్యాపారము కూడా చేసుకోవచ్చును. రెండవ సభ్యుడు బుక్‌కీపరు. సాలుకు 100పౌనులు. మూడవవాడు వేర్‌హవుస్ కీపరు. జీతం సాలుకు 75పౌనులు. నాల్గవవాడు కస్టమరు. జీతము సాలుకు 50పౌనులు. వీరందరూ స్వంత వ్యాపారము చేసుకోవచ్చును. కంపెనీ ఉద్యోగంలో చేరేటప్పుడు తమవల్ల కంపెనీకి కలిగే నష్టము ముజరా ఇస్తామని ఒక పూచీకత్తు పత్రం వ్రాసియివ్వడమేగాక వారు సరిగా పనిచేయకపోతే తాము నష్టపరిహారమిస్తామని ఇద్దరు ‘షూరిటీ’లనే పూటకాపులు పూచీకత్తులు వ్రాసియివ్వాలి. ఈ విధంగా కవనెంటు లేక ఒడంబడిక ఏర్పాటు జరిగినవారిని కవనెంటెడ్ సర్వీసు నౌకరులనేవారు. మొదట వర్తకస్థానములో అపరాధములు చేసినవారిని శిక్షించుటకు కంపెనీవారికి ప్రత్యేక నిబంధనలు లేవు. వారిని పనిలోనుండి తొలగించడానికి ఏజెంటు లేక గవర్నరు సీమలోని కంపెనీ డైరెక్టరులకు వ్రాసేవాడు. అక్కడ ప్రాపకమున్నవారు తప్పించుకునేవారు. ఆ కాలములో రైటరు అనే చిన్నయుద్యోగికి సాలుకు 5పౌనులు లేక 50రూపాయలు జీతము. అయితే జీతంగాక వారు నివసించడానికి వసతి ఉచిత భోజనసౌకర్యము ఉండేవి. ఇంతేకాదు కంపెనీవారి స్టోర్సునుండి చౌకరేటులో సారాయి కూడా యిచ్చేవారు. వారికిచ్చే జీతము చిల్లరఖర్చులకుపయోగించేది. నిజానికి జీతానికాశపడి కాదు వారు కంపెనీ కొలువులో చేరడం. సేవకునికి స్వంత వ్యాపారం చేసుకోడానికి సీమనుండి వచ్చేటపుడే కొంత సరుకు తెచ్చుకునేవారు. చిన్నగ వ్యాపారము చేసి ధనార్జన చెయ్యడానికి అవకాశముండేది. అనేక సరుకులతో వ్యాపారం చేస్తూ లాభం పొందేవారు. ఉద్యోగంలో ప్రమోషను కలిగి పైకి వెళ్ళినకొద్దీ ఈ అవకాశాలు కూడా పైకితేలేవి. అందువల్ల కంపెనీసేవకులుగాక బయటనుండే దొరలు వీరిని చూచి ఓర్వలేకపోయేవారు.

కంపెనీ సైన్యంలో మొదట చేరిన తెల్లవారికి లెఫ్టినెంట్ (Lieutenant) లేక ఎన్‌సైన్ (ensign) అనే చిన్న ఉద్యోగం ఇచ్చేవారు. లెఫ్టినెంట్‌కు నెలకు 6గినీలు జీతం (గినీ అనగా 21 షిల్లింగులు) ఎన్‌సైనరు నెలకు 4పౌనుల 19షిల్లింగులు (20 షిల్లింగులు ఒక పౌను = 10 రూపాయలు). సైనికోద్యోగులు సారా షాపులు పెట్టుకుని చాలా లాభాలార్జించేవారు. వీరు దేశీయ వర్తకులతో లావాదేవీలు జరిగించేవారు. భారీ వ్యాపారం చేసేవారు. దొంగ మస్తరులు అనగా నిజంగా హాజరులేని సైనికుల సంఖ్యకు జీతబత్తెముల క్రింద దొంగ పద్దులు వ్రాసి కంపెనీవారి నుండి సొమ్ము సంపాదించేవారు. నెలకు నూరు వరహాలు లేకుండా జీవనం సాగదని హాలెండు అనే కెప్తాను గవర్నరులైన మోర్సుగారికి చెప్పి 40 మంది దొంగ సైనికుల పేర్లు మస్తరులో వేసి సంపాదించాడని, తన తోటి లెఫ్టినెంటులు పదిమంది పేర్లు వ్రాసుకునేవారని ఒక సైనికోద్యోగి సాక్ష్యమిచ్చాడు. నిజానికి చెన్నపట్నం సైనికదళానికి ఆ కాలంలో పనివుండేదేకాదు. 22 సంవత్సరాల కాలంలో సాక్షాత్తుగా యుద్ధభూమిపైన శత్రువునెదిరించిన సైనికోద్యోగులు ముగ్గురైనా లేరు.

ఆ కాలంలో చాప్లెన్ అనే తెల్ల ఫాదరీలు కూడా వ్యాపారం చేసేవారు. సారాయి త్రాగేవారు. వ్యభిచారములో మునిగితేలేవారు. అప్పుడున్న ఇద్దరు చాప్లెనులలో నొకరికి కంపెనీవారే జీతమిచ్చేవారు. రెండవవానికి తెల్లదొరలు చందాలు వేసుకుని జీతమిచ్చేవారు. 1666, 1680, 1695, 1720 సం.లనాటి చాప్లేనులను గూర్చిన అనేక అవినీతి గాథలను డాడ్వెల్‌గారు తమ గ్రంథంలో వ్రాశారు.(See, The nabobs of Madras, H.H. Dodwell.)

మద్రాసులోని తెల్ల జనాభాలో తక్కినవారు అనేకవిధాలైనవారు. అయితే అందరూ వ్యాపారం చేసేవారే. కొందరు భూమి మీద మరికొందరు సముద్రం మీద వ్యాపారం జరిగించేవారు. 1746 నాటికి చెన్నపట్నంలో కొందరు తెల్లవారు స్థిరనివాసాలేర్పరచుకొని అక్కడనే పెళ్ళిళ్ళు చేసుకొని దేశవ్యాపారంలో పాల్గొంటూ అభివృద్ధిలోనికివచ్చి కంపెనీవారి తెల్లదొరలతో సంబంధబాంధవ్యాలు చేయగలిగారు. కంపెనీదొరల కుటుంబాలవారిని సీమలోనే వుంచి వారి పిల్లలను ఎదిగిన తరువాత ఇండియాకు తీసుకొనివచ్చి కంపెనీ కొలువులో చేర్పించేవారు. హార్టు, పౌనే, బోడాం అనే కుటుంబాలవారు స్వతంత్ర జీవనము చేసి పైకివచ్చిన దొరల సంతతివారే. వీరికి దేశీయులతో రక్తసంబంధాలుండేవి.

కొంత సంపదనార్జించిన తరువాత తమ కుటుంబాలను సీమకు తరలించేవారు. చిరకాలం నుండి శాంతోములో నుండిన పోర్చుగీసు జాతివారు దేశీయ స్త్రీలతో సంబంధాలు కలిగినవారు Carvelhos, Medeiros వగైరా కుటుంబాలవారు కొంచెము చామనచాయ కలిగి దేశీయాచారాలను కలిగినవారు. పైన చెప్పిన ఇంగ్లీషు దొరలకు తమ పిల్లలనిచ్చినవారున్నారు. వీరిని గురించి వాల్‌పోల్ అను ఇంగ్లీషు గ్రంథకర్త తన నవలలో చిత్రించాడు.

వీరుగాక యూదు (Jews) జాతివారు మొదట గోల్కొండ రాజ్యంతో వజ్రాల వ్యాపారం జరిగించేవారు. ఆకాలంలో మనదేశంనుండి అమిత ధనసంపద వజ్రాల రూపంలో తరలించబడేది. ఇది తరువాత అడుగంటినది. ఐరోపాలోని స్పెయిను పోర్చుగీసు దేశాలనుంచి వచ్చిన యూదులు De Paira, Rodrigues, Do Poste, Fori Seca అనే పేర్లు పూర్వపు చెన్నపట్నం రికార్డులలో కనబడతాయి. ఈ దేశానికి వచ్చిన ఆర్మీనియను జాతివారికి 1688 సం.లో ఇంగ్లీషు కంపెనీవారు ప్రత్యేక సౌకర్యములిచ్చారు. వారికొక క్రైస్తవ (చర్చి) దేవాలయముండేది. ఇప్పటికిని చెన్నపట్నములో ఆర్మీనియను వీధియునున్నది. మౌంట్ దారిలో అడయారు వద్ద వంతెన కట్టినది యొక ఆర్మీనియను జాతివాడే.

ఆ కాలంలో దొరలందరూ ఏలాంటి విచక్షణ లేకుండా వ్యాపారం చేసేవారు. ఆడవాళ్ళు కూడా వ్యాపారం చేసేవారు. గవర్నరు యేల్ దొరగారితో చనవుగానుండిన నిక్సు దొరసాని కూడా వ్యాపారం చేసేది. కంపెనీవారి కొలువులో ఇంజినీరుగా పనిచేసి ఆర్కాటు నవాబు చేత అత్యధిక వడ్డీలకు చాలా ఋణపత్రాలు వ్రాయించుకొని కోట్లకొలది రూపాయిలు సంపాదించిన పాల్ బెన్‌ఫీల్డు చేసిన దుర్మార్గముల చరిత్ర పార్లమెంటులో చర్చించబడినది.

చెన్నపట్నంలో స్వంత వ్యాపారం చేసే ఇంగ్లీషువారి సంఖ్య చాలా త్వరగా పెరిగినది. 1800 సంవత్సరపు ఆల్మనాకులో అలాంటి ఐరోపా జాతివారు 213 మంది ఉన్నట్లు లెక్క వ్రాశారు. ఇందులో వ్యాపారం చేసేవారేగాక వివిధ వృత్తులవారు కూడా ఉన్నారు.

మేయరు కోర్టులో న్యాయవాదులుగా పనిచేసే అటార్నీలు ఆర్కాటు నవాబు కొలువులో పనిచేసే దొరలు గాయకులు హెయిర్‌డ్రెస్సర్లు అనగా తలవెండ్రుకలకు గిరజాలకు వంకీలు తీర్చి రకరకాల వెండ్రుకలతో విగ్గులనే జునపాలు తలకట్లు తయారుచేసేవారు. జిడ్డులేని సవాసన నూనెలు సుగంధ లేపనములు సుగంధ పొడులు వగైరా షోకు వస్తువులను అమ్మేవారు ఇంకా ఇతరులునుండేవారు.

క్రమక్రమంగా కంపెనీ దొరలు ప్రయివేటు దొరలు కలిసి వ్యాపారాలు చేసేవారు. పూర్వం ఎక్కువమంది వ్యక్తులే వర్తకవ్యాపారాలు చేసేవారు. కొద్దిమంది మాత్రం భాగస్వామ్యులుగా చేరి వ్యాపారం చేసేవారు. అయితే అవి మణిలా క్యాంటన్ (చీనా) ఓడసఋకులకో ఇతర ప్రత్యేక సాహస వ్యాపారానికో తాత్కాలికంగా ఏర్పడిన భాగస్వామ్యాలే. ఆ కాలంలో వడ్డీ రేటు చాలా హెచ్చుగాయుండేది. సాలుకు నూటికి 25 లేదా 30 వంతులు కూడా వడ్డీ రేటుండేది. ఇంగ్లాండులో ప్రామిసరీ బాండులనే ఋణపత్రాల మతలబుననుసరించి పత్రాలపై అప్పులిచ్చేవారు. బంగాళాదేశం నుంచి నల్లమందు, పోర్టోనోవో రేవు నుండి నీలిరంగు బట్టలు వ్యాపారం కూడా కొంతమంది కలిసిచేసేవారు.

మైసూరు రాజ్యమునేలిన హైదరాలీతో ఇంగ్లీషువారికి యుద్ధాలు ప్రారంభమైన తరువాత చాలామంది దొరలు వ్యాపారంలో దెబ్బతిన్నారు. 1767-9 సం.ల మధ్య హైదరాలీ మద్రాసు చుట్టుపట్ల గల కంపెనీ రాజ్యాన్ని కొల్లగొట్టాడు. ఊళ్ళను తగులబెట్టాడు. ఆ సమయంలో కర్ణాటక నవాబు దొరలకివ్వవలసిన బాకీ కిస్తీలు చెల్లించలేకపోయాడు. గొప్ప వర్తక మాంద్యము యేర్పడినది. రెండవ మైసూరు యుద్ధములో హైదరాలీ కర్ణాటక రాజ్యాన్ని నిర్మానుష్యం చేశాడు. ఫ్రెంచివారికి సముద్రములో ఆధిపత్యము లభించినది. ఆ కాలములో ఇంగ్లీషు కంపెనీయుద్యోగులైన జోర్డన్ యంగ్ అనేవారు ఈ పరిస్థితులను గురించి వ్రాసిన ఉత్తరాలను డాడ్వెల్‌గారు తమ గ్రంథములోనుదహరించారు (పుటలు 135). ఆ సమయంలో కర్ణాటక రాజు వ్యవహారంలో ప్రముఖపాత్ర వహించిన బెన్‌ఫీల్డు కూడా కొంత యిబ్బందిలో పడ్డాడని డాడ్వెల్ వ్రాసినాడు. 1781 సం. సెప్టెంబరులో అన్ని వస్తువులు చాలా ప్రియముగానున్నవని డబ్బు నిక్కచ్చిగా నున్నదని జోర్డను వ్రాసినాడు. 1781 సం. అక్టోబరు నెలలో మద్రాసు కోస్తాలో చాలా తీవ్రమైన తుఫాను వచ్చినదని మద్రాసు కోటయొక్క సముద్రపు గేటునుండి చెపాకు దాకా పగిలిపోయిన ఓడసామానులు తేలుతున్నవని జోర్డను 1781 సం. అక్టోబరు 16వ తేదీన వ్రాసినాడు.

దీని తరువాత చెన్నపట్నం ప్రాంతంలో కఱవు వ్యాపించినది. నల్లవారి బస్తీలోని వీధులన్నీ శవాలతో నిండినవి. అన్నము లేక కృశించిన దురదృష్టవంతులు రాజధాని నగరంలో కాస్త అన్నం దొరుకుతుందనే ఆశతో వచ్చి చచ్చిపోతున్నారని అతడు వ్రాశాడు. ఈ పరిస్థితులలో చెన్నపట్నములో స్వంత వ్యాపారము చేసే దొరలకు వ్యక్తిగత వ్యాపారం చెయ్యడానికి ధైర్యము లేకపోయినది. అంతట వారు భాగస్వాములతో వ్యాపార సంఘములుగా ఏర్పడడం ప్రారంభించారు.

ఈ వర్తక కంపెనీలను ‘హవుసెస్ ఆఫ్ ఏజెన్సీస్’ అని వ్యవహరించేవారు. ఇది ఒక పక్కా భాగస్వామ్యవిధానము. నష్టం వస్తే నలుగురూ భరించే ఏర్పాటు వున్నందువల్ల ఇలాగ భాగస్వామ్యపు ఫరములు బయలుదేరినవి. Chase Sewell, Chinnor or Trillow Connel, Brodie or Roebuck Abbot and MaitLand అనే హవుసెస్ ఆఫ్ యేజెన్సీలతో కంపెనీయుద్యోగులు స్వతంత్ర వర్తకులు కూడా కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయడం ప్రారంభించారు. వారు సొమ్ము పెట్టుబడి పెట్టి సరకులు కొని కమిషను మీద అమ్మేవారు. ఆ కంపెనీ షేర్లలో వ్యాపారం చేసేవారు. ఇందులో ప్రసిద్ధి చెందినవారు లాటర్ అండ్ కో (Loutor & Co.). 1770 సం.లో నౌకా దళాధిపతియైన అడ్మిరల్ హార్లాండ్ దొరతో వచ్చిన ఫ్రాన్సిస్ లాటర్ అనునతడీ కంపెనీ స్థాపించాడు. ఇది త్వరలోనే అభివృద్ధి చెందినది. చాలాకాలం నడిచింది. ఇది 19వ శతాబ్దంలో ఆర్బత్‌నాట్ కంపెనీ అనే పేరుతో భారీగా వ్యాపారం చేస్తూ బ్యాంకింగ్ వ్యాపారం కూడా చేసేది. ఈ కంపెనీ మంచి వడ్డీ యిస్తోందని ఆశపడి ఆంగ్లేయ దొరలేగాక దేశీయులలో ఆడవాళ్ళు మొగవాళ్ళు ఉద్యోగులు సంసారులు చాలామంది తమ ధనమును ఆ కంపెనీలోనే దాచుకునేవారు. ఇది చివరకు 1907వ సం.లో దివాళా తీయడంతో చాలామంది తెలుగువారు నష్టపడ్డారు. దీనికి ‘ఆర్బతునాటు క్షవరం’ అని పేరువచ్చింది. రెంటాల సుబ్బారావుగారు దీనిని వర్ణించారు.

రోబకు ఆబటు అండ్ మెయిట్‍లాండ్ అనే ఇంకొక హవుస్ ఆఫ్ ఏజెన్సీ వ్యవహారాలు మద్రాసు మేయరు కోర్టు రికార్డులలో ప్రఖ్యాతిగాంచినవి. రోబక్కుకు బెన్‌ఫీల్డుతో సన్నిహిత సంబంధం వున్నది. 1792 నుండి పది సంవత్సరాలు కర్ణాటక నవాబు ఋణపత్రాలు వ్యాపారము కంపెనీ పత్రాల వ్యాపారము జరిగినది. కారన్‌వాలీసు టిప్పు సుల్తానును 1792 సం.లో ఓడించడంతో వ్యాపారం మళ్ళీ కోలుకున్నది. తరువాత మళ్ళీ 1796లో ఆర్థిక మాంద్యం వచ్చినది.

(రచనాకాలం: 1940లలొ)