పద్య పదార్థ విజ్ఞానం

“పప్పులు నమలుటలు గాదు పద్యరచనముల్!”[1]ఆత్రేయ. (ఎస్. వి. భుజంగరాయ శర్మ సంపూర్ణ రచనలు-1. ఎమెస్కో బుక్స్, 2012)

1

నేను ప్రతిరోజూ
రెండు పూటలా
ఒక ఆడపిల్లల కాలేజ్‍లో
ఫిజిక్స్ పాఠాలు చెబుతాను.
తీరిక వేళల్లో – అంటే
కాలేజ్‍కి శలవులప్పుడూ
పిల్లలు బందులూ
ఆందోళనలూ చేస్తూ
బడి మానేసినప్పుడూ
లేదూ
వాళ్ళు బుద్ధిగా
పరీక్షలు రాస్తున్నప్పుడూ
నేను కవిత్వం రాస్తాను.

2

నా ఉద్యోగంతో నా పెళ్ళాం, పిల్లల్ని
పోషిస్తాను.
నా పద్యాల్లో నేను
విస్తరిల్లి
సమస్త చరాచరాలతో
కరచాలనం చేస్తాను.[2]A good poem helps to change the shape and significance of the universe, helps to extend everyone’s knowledge of himself and the world around him – Dylan Thomas, Quite Early One Morning: stories, publ: New Directions, New York, 1968.

* పెళ్ళాం పక్కన కామా ఉంది. గమనించండి.[3]“My wife has a baby,
The baby is divine,
People congratulate me,
I hope the child is mine” – Harindranath Chattopadhyay’s Curd Seller.

** ఈ కవితకి పాద సూచికలున్నాయ్. గుర్తించండి.[4]“ఈ వ్యాసానికి గ్రంథసూచి లేదు.” కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు, మాధవ్ మాచవరం. ఈమాట నవంబర్ 2014.

3

ఫిజిక్స్ చెప్పుకునేవాడికి
కవిత్వం రాయటం
ఎలా చొప్పడుతుందని
చప్పున విస్తుపోకండి.[5]Paul Dirac to Robert Oppenheimer: “Robert, I do not understand how a man can work on the frontiers of physics and write poetry at the same time.”
 
Oppenheimer: “Why not?”
 
Dirac: “In physics, you want to tell something that nobody knew before, in words which everyone can understand. In poetry, however, you go on to describe something that everybody knows about, in incomprehensible ways.”

ఈ పాంచభౌతిక ప్రపంచంలో
పదార్థానిదే ప్రముఖస్థానం
తీరని దాహపు ఊహా
వ్యూహా లోకాల్లోనూ
పదార్థానికే పట్టాభిషేకం
ప్రణయాన్నీ పరాక్రమాన్నే కాదు
శాస్త్ర సారాంశాన్ని కూడా
పద్య చషకంలో నింపి
సాటివాళ్ళకు
చవి చూపించవచ్చు.[6] In 1984, a paper “The Detection of Shocked Co/ Emission from G333.6-0.2” by New South Wales physicist J. W. V. Storey was published in The Proceedings of the Astronomical Society of Australia as a 38-stanza poem, much to the irritation of his colleagues (and his sadistic pleasure).
అందువల్లే
పద్య పదార్థాలు
నా పరమార్థాలు.[7]“In this way I hope to explain how physics may throw some light on a problem which is not only important for abstract knowledge but also for the behavior of man.” Max Born in Introduction to his Natural philosophy of cause and chance.

4

ఉప్పుకీ కప్పురానికీ
ఒకే ఒక్క పోలిక[8]అందరికి తెలిసిన వేమన మాట.
పద్యాలకీ పదార్థాలకీ
పెక్కు పోలికలు.
కొన్ని పద్యాలు
పిల్లగాలుల్లా
చెవిలో గుసగుసలాడి
పారిపోతే
కొన్ని
నీళ్ళలాగా చల్లగా జారుకుంటాయి.

పద్యం ఒకటి నిప్పులా
నిన్ను నిరంతరం దహిస్తే
మరొకటి
నేలలా నిన్ను నిలబెట్టి
నీ దారిలో నీ దన్ను కాస్తుంది.
చిన్నప్పుడో ఎప్పుడో
నువు చదువుకున్నదో విన్నదో
ఒకానొక పద్యం
నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో
నిన్ను ఆకాశంలా ఆవరిస్తుంది.

5

చూడండి
ఒకానొక పద్యం
స్ఫటికం లాగా
సహస్రాధిక పార్శ్వాలతో
తళుకు తళుక్కుమని
మెరుస్తుంటే
వేరొకటి
ఆకాశవాణి పొద్దున్నే
అందించే కచ్చిక
సూక్తిముక్తావళిలా
మన పళ్ళు తోమేస్తుంది.

ఒక పద్యం
పరమౌషధంలా మన బాధకు
ఉపశమనం చేకూరిస్తే
మరొకటి
పాత మద్యంలా
మనకు మహదానందాన్ని
ప్రసాదిస్తుంది.[9]అ. “Penicillin cures, but wine makes you happy” – Alexander Fleming.
 
ఆ. “Wine is bottled poetry” – Robert Louis Stevenson.

6

అవును
కొన్ని పద్యాలు
కొత్త మాటల జీను‍ల్తో
దౌడు తీస్తుంటే
కొన్ని పాత మాటల
మూటల్ని మోసుకుంటూ
పత్రికల రేవులముందు
పడిగాపులు కాస్తుంటాయి!

ఇక్కడ
సంపాదకులకు వినపడేటట్టు
చక్కని మాటొకటి చెప్పనా?
పద్యాల్లో
తాబేళ్ళనీ లేళ్ళనీ
గింజల్నీ రాళ్ళనీ
కుమ్మరిపురుగుల్నీ
తేళ్ళనీ
వేరు చేసే విన్నాణం
‘ఈశ్వరుడి కైనా
ఉంటుదో లేదోనని’
బుద్ధిమంతులెవరో
అనేశారు.[10]‘కో వేత్తి కవితా తత్వం ఈశ్వరో వేత్తి వానవా.’ శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి… అన్న తర్వాత – చివరికి చెప్పినది.

7

పద్యాలకు ఛందస్సు
పిల్లలకు పీజ్జా లాంటిది
అమరులకు సురాపానం లాంటిది.
‘య మా తా రా జ భా న స’ల వస
నూరి వాటి గొంతులో పోశావా
అన్ని రకాల ఆకళ్ళను మరపించే
కళా కాహళ కాకలులు వినిపిస్తాయి.
నిన్ను కాకుల్లా పొడిచే వాళ్ళయినా
నీ పీక పిసికేసి
నిన్ను మురికిమూసీ లోకి
విసిరేద్దామనుకునేవాళ్ళే అయినా
వాళ్ళని తేటగీతిలోకి ఆహ్వానించి
ప్రాసయతితో పలకరించావా
సిగ్గుతో చితికి ఎగ్గు మరిచిపోతారు.

8

పరీక్ష రాయటం
అయిపోయినట్టుంది
అరుగో వస్తున్నారు
మంద యానలు
మంజరీ ద్విపదలు
మా విద్యార్థినులు
క్లాసులో పాఠం వింటున్నప్పుడు
ఉత్పలమాలలూ
చంపకమాలలే గానీ
ఒక్క మార్కు తక్కువ వేశానా
గణ గుణాలు మార్చేసుకుని
శార్దూలాలూ మత్తేభాలుగా మారి
మీద పడిపోతారు.

9

పద్దతి ప్రకారం
పరీక్ష అయిపోయిన గంట
కొట్టగానే
పచారుకు వచ్చే మా ప్రాంశుపాలిని
ఇటే వస్తున్నారు
ఆంగ్లభాషలో అనర్గళంగా
ఉపన్యసించగలిగిన ఆమె
సభా వేదిక మీద
అధ్యక్ష పీఠాన
స్రగ్ధరా–శిఖరిణి.

కానీ
‘ఒక్క రోజు శలవు కావాల’ని ఉత్తరంతో
ఆమె ఆఫీస్‍లో కలిశానా
నేరాసిన వాక్యాల్లో
వాక్యాల్లో ఉన్న పదాల్లో
పదాల్లో ఉన్న అక్షర క్రమాల్లో
ఆఖరికి
కామాల్లో, చుక్కల్లో
ఉన్న తప్పుల చుట్టూ
ఎర్ర సిరా చుట్లు చుడుతూ
నా మీదే కాదు
నాకు ఇంగ్లిష్ నేర్పిన
పంతుళ్ళందరి మీదా
నోరు చేసుకుంటూ
మళ్ళీ కలవండంటూ
నన్ను బయటికి తోలేసే
ఆశుగతి రగడ.

10

పద్యమూ
శాస్త్రప్రతిపాదిత సత్యమూ
అన్నిరకాల అగ్ని పరీక్షల్లోనూ
బట్ట కాలకుండా బయటపడ్డాయని
మనమంతా ఒప్పుకున్నదే[11]అ. A poem and a scientific truth are something more than a theory or belief: they have withstood the acid of proof and the fire of criticism. in Modern Poetry and Science by Octavio Paz.
 
ఆ. ఈ ‘మనం’లో నేను లేనని ఎవరైనా అంటే నొచ్చుకోను – తః తః

అయినా
విజ్ఞాన శాస్త్రాల్లో
పదార్థాలకు తొక్క తీసి
పిక్కలు లెక్క పెట్టొచ్చు
పద్యానికి మాత్రం
అన్నివేళలా
ప్రతిపదార్థం అడక్కూడదు
రసపట్టులో తర్కం కూడదు.[12]అ. పింగళి నాగేంద్ర రావు: తెలుగు చలన చిత్రం ‘మాయాబజార్‍’లో.
 
ఆ. In 1929, Dirac and Heisenberg were on board a ship to Japan for attending an annual science conference. Werner Heisenberg who happened to be quite a ladies man, used to dance with the young girls on the ship before dinners, while Dirac used to sit watching. One such evening, Dirac asked, “Heisenberg, why do you dance?” “When there are nice girls, dancing with them is a pleasure,” Heisenberg replied. Dirac pondered this notion for a while, then blurted out: “But, how do you know beforehand that the girls are nice?” Heisenberg burst out with laughter. See Heisenberg and Dirac by Ashutosh Jogalekar.

అగ్నిజల్లినా అమృతం కురిసినా
అందమూ ఆనందమే దాని పరమావధి.[13]దేవరకొండ బాల గంగాధర తిలక్. అమృతం కురిసిన రాత్రి (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్).
రసో వై సః[14]తైత్తరీయోపనిషద్వాక్యం.

మళ్ళీ కలుద్దాం!

అధస్సూచికలు[+]