ఫిబ్రవరి 2021

సాహిత్యసృష్టి చాలా చిత్రమైనది, ప్రత్యేకమైనది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపగల శక్తి కలది. శతాబ్దాలుగా సాహిత్యకారులు, ఎన్నో విభిన్నమైన జీవననేపథ్యాల నుండి వచ్చి కూడా, అంతకు ఎన్నోరెట్లు విభిన్నమైన జీవనపార్శ్వాలని గమనిస్తూ కూడా, జీవితానికి ఏ లక్షణాలు ప్రాథమికమనుకుంటామో అవే సాహిత్యంలోనూ ప్రతిఫలింపజేయడం ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. సమాచారప్రసారాలు సంక్లిష్టమైన కాలంలో కూడా యుద్ధం-శోకం, ప్రేమ-పగ ఆకలి-కోరికల చుట్టూ తిరిగిన దేశదేశాల కథల మధ్య, క్లాసిక్స్ అని చెప్పబడ్డ మహోత్కృష్ట సాహిత్యం మధ్య గల సామ్యాలను విమర్శకులు విశ్లేషిస్తూనే ఉన్నారు. జీవనవిధానాలు, దేశకాలసంస్కృతులూ ఎంత విభిన్నమైనవయినా సాహిత్యకారులు స్పందించే తీరులోని ఏకత్వాన్ని ఈ విశ్లేషణలు ఎత్తిచూపుతాయి. ఇప్పుడు, ప్రపంచం లోని ఏ మూల ఉన్న విషయమైనా చూపుడువేలి చివరే దొరికే ఈ రోజుల్లో, కథల్లో సామ్యాలు కనపడం మరింత సహజం. ఇవన్నీ ఒకే ఆలోచనకు చెందినవనుకోవడం మరింత సులువు. అంతమాత్రాన అవన్నీ ఒకే కథలనుకోవడం తగనిపని. కథావస్తువులో ఎంతటి ఏకత్వమున్నా శైలీశిల్పాల విన్యాసమే భిన్నత్వానికి దారులు వేస్తుంది. అదే ఒక మామూలు విషయాన్ని కథగా కళగా మారుస్తుంది. ఒకే కథను వేయి గొంతులలో వినిపిస్తుంది. ఏ కథకు ఆ కథనే ప్రత్యేకంగా నిలుపుతుంది. అందుకే, ఇప్పుడు మనం వెదుక్కోవాల్సింది కథావస్తువుల్లోని సామ్యాలను కాదు. కథనాలలోని భిన్నత్వాన్ని. ఒకే వస్తువును సాహిత్యం ఎన్ని రకాలుగా, ఎన్ని కోణాలలో ప్రతిఫలించగలదో గమనించాలి. వస్తువులోని సామ్యత కాదు, అది ప్రకటించే విధానంలోని వైవిధ్యాన్ని గుర్తుపట్టాలి. ప్రతీ కథ ఒకేలా ముగియదని, ముగియనక్కరలేదని, ఏ కథ ముగింపు ఆ కథే వెతుక్కుంటుందని గుర్తించి, ఆ మలుపులను, ముగింపులను అర్థం చేసుకోవడం, గౌరవించడం ముఖ్యం. రచయితలకైనా, విమర్శకులకైనా ఆ సూక్ష్మదృష్టి, ఆ వివేచన కొరబడినప్పుడు, వస్తుసామ్యమే ప్రాతిపదికగా కథలను పోల్చుకుంటూ, తమ భావజాలానికి, తమ అవసరాలకు సరిపోయినట్టుగా మాత్రమే ఆ కథను వివరించాలని ప్రయత్నించినప్పుడు, అన్ని కథలకూ ఒకే ముగింపు బలవంతపు అవసరం అవుతుంది. ఈ మూస ఇందులో ఇమడని జీవితాలను వెక్కిరిస్తుంది. విస్తరించుకుపోవడమే ప్రధాన లక్షణమైన సాహిత్యాన్ని పరిధి గీసి దాటనివ్వని ప్రమాదకర ధోరణి ఇది. గుంపుగా కాక మనలేని సాహిత్యసమాజంలో ఏకాకుల గొంతులు వినపడవు. వాటిని ఆహ్వానించి వినడం వినిపించడం నేర్చుకోని సాహిత్యసమాజానికి ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉండదు.