వెనక్కి తిరిగిన ఓ చూపు

నిన్నారేపులను తవ్వుకుంటూ వెళ్ళే దారివెంట
గాలిమడుగులో తప్పిపోయిన ఊపిరులను లెక్కగట్టి
ఒద్దికగా నిలబడిపోయిన వానల్లో
తడిసిన రెప్పల అలికిడికి చెవులు ఒగ్గి
పాతక్షణాలన్నీ ఒకటొకటిగా ఆవిరైపోతుంటే
వెనక్కి తిరిగిన ఓ చూపు చెబుతోంది
నకారాత్మమొకటి మరింతగా చిక్కబడుతుందని.

నాకు నేను ఒక షరతుగా మారిపోయాక
కుంచించుకుపోయిన ఆకాశానికి ప్రయాణం కట్టడానికి
ఈ నా రెక్కల బలిమి ఎంతైతేనేమి
నాకు నేనొక్క బంధనంగా కట్టబడి
ఎక్కడెక్కడి స్వేచ్ఛలన్నీ
కళ్ళ ముందరే నర్తిస్తోంటే
మనసంతా నింగి నలుపు.

యదార్థతత్వాన్ని మోసపుచ్చేస్తూ
నకిలీ నవ్వులని నగిషీలుగా అద్దుకుంటూ
లోపలి ఆర్తిని అణచడం నేర్చుకుంటున్నప్పుడు
ఎప్పటి ఉనికినో పల్లవిగా చేసుకుంటూ
చీకటిలో నుండి సాంద్రంగా ఒక పాట మొదలవుతుంది.

సరిగ్గా అప్పుడే
గుండె నుండి ఆకాశం కురవటం మొదలవుతుంది.