మరి, సరి, లాగా!

1. లాగా

సూర్యునిలాగా
తల ఎగరేస్తూ
నిప్పులు విసిరేది
చంద్రునిలాగా
నవ్వులు పేల్చే
మల్లెలు విరిసేది
మబ్బు తునకలా
తల వంచుకుని
సాగీపోయేది
తూఫానూలో
కొబ్బరి చెట్టులా
ఊగీపోయేది

నేనేగా.

2. మరి

నేనిప్పుడు
రాత్రిళ్ళు
నక్షత్రాలను
పోగు చేస్తున్నాను

ఉదయాలు
తెలి మంచును
గిన్నెల్లోకి
వంచుతున్నాను

సాయంకాలాలు
మలి సంధ్య
వెలుగులను
బీరువాల్లో
దాస్తున్నాను

తగరపు
కాగితాల్లాంటి
మిత్రులంతా
ఎగ్ఘిరిపోయారంటే

పోరూ?

3. సరి

వంద వాగ్దానాలు
నీటి మీద
రాతలవనీ

పోనీ స్నేహాలు,
రానీ ఇక్కట్లు
కానీ-

నిలవని
వెలుగుల
వెనక
పరుగులు
ఆపాక

జీడి పాకపు
ఆశని
విసిరి కొట్టాక

ఇక
నింపాదిగా
ఇంటికి
పోవచ్చు.