సాయం ఛాయ

నేనూ ఒకప్పుడు యువకుడినే
అన్నాడు మామయ్య
పడక్కుర్చీలో వెనక్కి వాలుతూ
జంధ్యాన్ని ముందుకు తోస్తూ

నా పద్యాలకు
ఒన్స్‌ మోరులు హోరెత్తేవి
నా పాటలకు
జనం విజిళ్ళు జోరెత్తేవి
నా కొంటె మాటలకు
యంగ్ గరల్స్ హార్ట్స్
అయిస్‌ క్రీముల్లా కరిగిపోయేవి!

మన ఇలాకాలో మొనగాడిని
బంగారు పతకాల వేటగాడిని
ఏమనుకున్నావ్, మామయ్యంటే?
ఆ పురవీథుల్లో యువసింహాన్ని
నా బ్లాక్‌ అండ్ వైట్‌ కాలానికి
నేనే ఈస్టమన్ కలర్ హీరోని!

మామయ్య ఆ రోజుల్లో కథలన్నీ
వెయ్యిన్నొకటోసారి విని
ఎండ, ఎండ ముందు ఎండ
ఎండ, ఎండ వెనకాల ఎండ
మళ్ళొస్తానని మళ్ళిపోతే

కుర్చీ కింది
మూడంకె నల్లపిల్లి
మునివేళ్ళ మీద
సందె చీకట్లలోకి
జారిపోతే

నాలిక పీక్కుపోతోంది
కాఫీ పట్రావే అని
ఇంట్లోకి ఓ కేకేసి

సుదూర ఆకాశంలోకి
సాలోచనగా
చూ–పు సారించి

నేనూ ఒకప్పుడు యువకుడినే
ముక్తాయించాడు మామయ్య
బొజ్జ నిమురుకుంటూను
బొద్దు మీసాలు సవరించుకుంటూను