కలయిక

నీది అందరికీ నచ్చే ఇంద్రధనుస్సు వన్నె
నాది అంతు దొరకని చిమ్మచీకటి వర్ణం.
నువ్వు చల్లటి అలై పొర్లితే
నేను మసిలి మసిలి ఆవిరై తేలుతా.
నీది ఉత్తి వరిగడ్డి మంట
నాది ఊదుకున్నంత కొలిమిమంట.
నిన్ను పలకరిస్తే పిల్లగాలిపాటై చుట్టుకుంటావు
నన్ను మందలిస్తే కథలుకథలుగా హత్తుకుంటా.
నీది బయటి మెరుపు
నాది లోపలి వెలుగు.
నువ్వొక పులకరింతని పూసి రాలిపోతావు
నేను గాయంతో రగిలి మాని మరకనై ఉండిపోతా.
ప్రేమ దారిలో నువ్వొక పూలతీగవి
నన్ను దాటితేనే ప్రేమ, ప్రేమని దాటితే నేను.
అరుదైన మన కలయిక-
బాహ్యాంతర్లోకాలను ఏకం చేసే
మనోదేహ పునస్సంయోగము.