మౌనవిపంచి

జీవితం ఎందుకో
ఒక్కసారిగా మౌనాన్ని ఆశ్రయించింది
తలపుల తలుపుల వెనక దాగున్న మనసు
జ్ఞాపకాల పూలను కోసుకుంటోంది
ప్రోది చేసుకున్న గురుతుల దొంతరలో
తన రూపం కనబడక నివ్వెరపోయింది
జీవితకాలం గడిచిపోయి
జీవనగమనం ఆగిపోయి
తనవన్న క్షణాలు కనిపించక తల్లడిల్లింది.

బాధ్యతలతో బరువెక్కిన భుజాలు
ఆసరాను వెతుక్కుంటూ అలసిపోతున్నాయి
కన్నవారికోసం కార్చిన కన్నీళ్ళు
ఎదురుచూపుల ఎడారుల్లో ఇంకిపోతున్నాయి
జీవితబాటలో మౌనం ప్రవహిస్తోంది
భేషజాల నడుమ భళ్ళుమన్న బంధాలు
తీపిబాధతో గుండెలో కలుక్కుమంటున్నాయి
రూపాన్ని మార్చుకున్న నిన్నటి జీవితం
ఆలోచనల్ని ఆవేశాలని వదలనంటోంది
నిన్న నువ్వు నవ్వుకున్న స్థాయి ఇదేనంటూ
కుర్చీలు మారిన ఆటగాడిలా
నీ పాత్ర మారిందని గుర్తుచేస్తున్నాయి.

స్వానుభవం పాఠాలు నేర్పుతుంటే
వెలిసిపోతున్న పేదరికం మౌనగీతాలు పాడుతోంది
గాలివాటున సాగే గోదారి పడవలా
జీవితం కాలాల ప్రవాహంలో సాగిపోతోంది
గిరికీలు కొడుతున్న సరంగు పాటలా
మౌనవిపంచి గొంతు సవరించుకుంటోంది